
సంచిక – బెహరా వేంకట సుబ్బారావు కథల పోటీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన రచయితలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథల పోటీకి అనూహ్యమైన రీతిలో విశేషమైన స్పందన లభించింది. పోటీకి మొత్తం 374 కథలు అందాయి. నిజానికి అందుతున్న కథల జోరు చూసి పోటీలో పాల్గొనే చివరి తేదీని ఒక వారం పొడిగించాము. ఆ ఒక్క వారంలో 67 కథలు అందాయి.
ఇంతవరకూ సంచిక నిర్వహించిన పోటీలన్నిటిలోకీ సంఖ్యపరంగానే కాదు, నాణ్యతాపరంగా కూడా అత్యంత సంతృప్తినిచ్చిన కథల పోటీ ఇది. ఒక కథను మించి మరొక కథ. ఎంచుకున్న వస్తువు పరంగా, ప్రదర్శించిన అంశాల పరంగా తెలుగు కథకుల పరిథి ఎంత విస్తృతమో, ఎంత విశాలమో పోటీకి అందిన కథలు నిరూపించాయి. తెలుగు కథకులు తమ చుట్టూ సంభవిస్తున్న పరిణామాలను ఎంత నిశితంగా పరిశీలిస్తున్నారో వారు ప్రదర్శించిన విభిన్నమైన కథాంశాలు నిరూపిస్తున్నాయి. కేవలం ప్రేమ కథలు, తాళి తెంపే కథలు, అక్రమ సంబంధాలే అభివృద్ధి, సంసార విచ్ఛిత్తే అభ్యుదయము, అణచివేతలు, ఆక్రందన కథలే సామాజిక స్పృహ అనే పరిమిత పరిధుల సంకెళ్ళు విదిలించుకుని తెలుగు కథకులు పరిధులు, పరిమితులు ఒప్పుకోని స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రదర్శిస్తున్నారని ఈ కథలు ఆనందం కలిగిస్తున్నాయి. అందిన కథలలో మామూలు ప్రేమ కథలున్నాయి. మోసం కథలున్నాయి. తల్లితండ్రులను చూడని కొడుకుల కథలున్నాయి. మానవత్వానికి దూరమవుతున్న మనిషిని చూపే కథలున్నాయి. వీటితో పాటూ సైన్స్ ఫిక్షన్ కథలున్నాయి. డిటెక్టివ్ కథలున్నాయి. హారర్ కథలున్నాయి. మానసిక శాస్త్ర ఆధారిత కథలున్నాయి. ఆధునిక సమాజంలో ప్రతి మనిషినీ వేధిస్తున్న చిన్న చిన్న సమస్యలనుండి అనూహ్యమైన సమస్యలవరకూ ఎన్నిటినో కథకులు ప్రదర్శించారు. మూసకథల మాయా సంకెళ్ళని విదిలించుకుని మొదటి వాక్యం చదవగానే కథమొత్తం ఊహకందే కథలను వదలి తెలుగు కథకులు నూతన పోకడలు పోవటం అత్యంత ఆనందం కలిగించటంతో పాటూ కథల ట్రెండు మారుతున్నదన్న విశ్వాసాన్ని, భవిష్యత్తులో తెలుగు కథ, సమకాలీన సమస్యల నుండి, అంతరిక్షంలో సమస్యల వరకూ, సూక్ష్మ జీవుల స్థాయి నుండి, మానవుని అంతరంగంలోని సూక్ష్మాతి సూక్ష్మ అంశాల వరకూ సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, నిర్ణయాత్మకంగా ప్రదర్శిస్తూ సమాజానికి దిశానిర్దేశనం చేసే స్థాయిలో తిరిగి తెలుగు సాహిత్యాన్ని నిలుపుతారన్న నమ్మకం కలిగిందీ కథలు పరిశీలిస్తుంటే అని కథలను పరిశీలించన న్యాయనిర్ణేతలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరచారు.
కథకులకు ఒక మనవి ఏమిటంటే, ఎట్టిపరిస్థితులలో సంచిక ఆత్మహత్యల కథలు, మతపరమైన విమర్శలున్న కథలు, సంస్కృతి, సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని, దైవాన్ని దూషించే కథలను ఆమోదించదన్న విషయాన్ని గ్రహించాలి. అలాంటి కథలు సంచికకు పంపకపోవటం మంచిది. నిరాశ తప్పుతుంది.
ఇన్ని వినూత్నమైన, విభిన్నమైన కథలు అందటం, అనూహ్యమైన సమస్యకు దారితీసింది.
కొత్త కొత్త అంశాల ఆధారంగా సృజించిన కథలు, విభిన్నమైన కథలు, సార్వజనీన భావాలను ప్రదర్శించిన కథలు వీటిల్లోంచి నగదు బహుమతికి అర్హమైన కథలను ఎన్నుకోవటం చాలా చాలా కష్టమైన పని అయింది.
సంచిక పాఠకులకు తెలుసు సంచికలో బహుమతి అర్హమైన కథలను ఎంపిక చేసే పద్ధతి. ఎంపిక చేసిన సామాన్య పాఠకులు చదివి తమకు నచ్చిన ఇరవై కథల జాబితా ఇస్తారు. ఎంపిక చేసిన రచయితలు చదివి వారికి నచ్చిన ఇరవై కథల జాబితా ఇస్తారు. ఎంచుకున్న విమర్శకులు చదివి వారికి నచ్చిన ఇరవై కథల జాబితా ఇస్తారు. ఈ జాబితాలన్నిటిలో కామన్‌గా ఉన్న కథలతో ఒక జాబితా తయారవుతుంది. ఒకవేళ ఆ జాబితా బహుమతి సొమ్ముకు తగ్గట్టుంటే సమస్య లేదు. అలాకాక అన్నిటిలో కామన్‌గా ఉన్న కథలు బహుమతి సొమ్ము కన్నా ఎక్కువగా ఉంటే, ఎంపిక చేసిన ముగ్గురికి ఈ జాబితాలో కథలను చదివి వారికి నచ్చిన కథల సంఖ్య బహుమతి సొమ్ము నిష్పత్తిలో వుండేట్టు అడుగుతాము. ఆ జాబితాలో కామన్‌గా ఉన్న వాటికి బహుమతి సొమ్ము పంచుతాము. సంచికలో మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి అన్న ఆలోచనకు తావు లేదు. ఒక కథ ఎక్కువ, మరో కథ తక్కువ కాదు. అందుకని, న్యాయనిర్ణేతలు బాగున్నవని ఎంపిక చేసిన కథలకు బహుమతి సొమ్ము సమానంగా పంచుతాము. ఇంతవరకూ ఎక్కడా సమస్య రాలేదు. చివరికి టై బ్రేకర్ కోసం సంచిక సంపాదకవర్గం జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ, ఈసారి సంపాదక వర్గం జోక్యం చేసుకోవాల్సి రావటమే కాదు, న్యాయ నిర్ణేతలతో తర్జన భర్జనల తరువాత నగదు బహుమతి అర్హమైన కథల జాబితా తయారయింది. ఈ ప్రక్రియ అనుకున్నదానికన్నా ఎక్కువ సమయం తీసుకోవటంతో, 31వ తారీఖు ప్రకటించాల్సిన ఫలితాలు 7వ తారీఖు సంచికలో ప్రకటిస్తున్నాము. ఆలస్యానికి రచయితలందరికీ క్షమార్పణలు తెలుపుతున్నది సంచిక. కానీ, రచయితలు రాబోయే పోటీల్లో మమ్మల్ని ఇంకా కష్టపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నది సంచిక. ఎందుకంటే, ఇది ఇష్టమయిన ఆనందకరమయిన కష్టం!! ఇంకా ఇంకా భిన్నాతిభిన్నమయిన, చిత్ర విచిత్రమయిన కథలను సృజించాలని రచయితలను అభ్యర్థిస్తున్నది సంచిక.
ఫలితాలు వెల్లడి చేసేముందు ఒక సూచన. నగదు బహుమతికి అర్హం కాని కథలలో ఎలాంటి లోపం లేదు. నగదు బహుమతి పొందిన కథలకన్నా అవి తక్కువ కాదు. వాటికి ఏమాత్రం తీసిపోలేదీ కథలు. కేవలం, ఆయా కథలు చదివిన సమయంలో న్యాయ నిర్ణేతల మనసు, మెదడులు బహుమతి పొందిన కథలను స్వీకరించే స్థితిలో ఉన్నాయి. కాబట్టి వారికి ఇవి ఎక్కువ నచ్చాయి. అంతే తేడా!! ఇది రచయితలంతా గమనించాలి. నిరాశ చెందాల్సిన పని లేదు. బాధ పడాల్సిన అవసరం లేదు. సంచిక దృష్టిలో అందరు రచయితలూ సమానమే! పోటీలో పాల్గొన్న రచయితలందరూ విజేతలే!! సాహిత్యంలో విజేతలు తప్ప పరాజితులుండరు.
న్యాయనిర్ణేతల జాబితాల్లో కామన్‌గా ఉన్న కథలు తొమ్మిది, బహుమతులివ్వాలనుకున్న కథలు అయిదు కానీ, నాలుగు కానీ, నిజానికి ఈ తొమ్మిది కథలు కాక, ఏకాభిప్రాయం కుదరని ఇతర కథలు కూడా అతి చక్కగా ఉన్నాయి. ఎంపికయిన కథలకేమాత్రం తక్కువ కాని స్థాయిలో ఉన్నాయి. ఒక దృష్టిలో చూస్తే, అవి కూడా బహుమతికి అర్హంగా ఉన్నాయి. కానీ, అన్ని బహుమతులివ్వలేము కాబట్టి, న్యాయనిర్ణేతల జాబితాలోని తొమ్మిది కథలను అయిదు కానీ, నాలుగుకి కానీ తగ్గించమని మళ్ళీ న్యాయనిర్ణేతలను అభ్యర్ధించాము. న్యాయనిర్ణేతలు సహృదయంతో అందుకు ఒప్పుకున్నారు. కానీ, ఒక్క కథను కూడా తగ్గించలేక పోయారు. వాద ప్రతివాదాలు నడిచాయి. కథల్లో లోపాలు ఎంచే ప్రక్రియ ప్రారంభమయింది. ఒక లోపం ఎంచితే పది మంచి గుణాలు కనిపిస్తున్నాయి. అలా ఒక రెండు రోజులు సాగింది. చివరికి ఆరు కథలకు రాజీ పడ్డారు. ఇంకా ఒకటయినా కథ తగ్గించాలి. ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి ఒకటో, రెండో కథలు తగ్గించాల్సిన బాధ్యత సంచిక సంపాదకవర్గంపై పడింది. ఇది మొదటిసారి ఏ పోటీలోనయినా సంపాదకవర్గం జోక్యం చేసుకోవాల్సిరావటం. ఇందుకు కథకులకు, కథల పరిశీలకులకు ధన్యవాదాలు!!
కొన్ని గంటల తర్జనభర్జనల తరువాత నాలుగు కథలను నిర్ణయించింది సంపాదక వర్గం. కానీ, అందరి మనసూ ఆ వదలిన అయిదో కథ మీదే ఉంది. పోనీ ఇంకేదయినా తీసేద్దామంటే, అదీ కుదరటంలేదు. దాంతో, ఈ సారి బహుమతి సొమ్ము రూ.10,000/-లను అయిదు కథలకు, చెరో రూ. 2000/- చొప్పున పంచాలని సంపాదక వర్గం నిర్ణయించింది. అయితే, ఈ అయిదు కథలను ఎన్నుకున్న తరువాత కూడా ఎందుకో సంతృప్తిగా అనిపించలేదు. అందుకని, బహుమతి సొమ్ము అయిదు కథలకు ఇచ్చినా, మొత్తం తొమ్మిది కథల జాబితాను తెలపాలని సంచిక సంపాదకవర్గం నిశ్చయించింది. ఈ క్రింద ఇస్తున్న జాబితాలో మొదటి అయిదు కథలకు బహుమతిని విశాఖపట్నంలో జూన్ నెల 28వ తారీఖున జరిగే సభలో బి.ఎస్.ఎన్ మూర్తిగారు, కలిగొట్ల సన్యాసిరాాజు గారు మొమెంటోతో పాటూ అందచేస్తారు. విశాఖ వెళ్ళలేనివారికి ఆ రోజే సొమ్ము అందుతుంది. కానీ, తాము సభకు రాలేని విషయం ముందే చెప్పాల్సి ఉంటుంది.
మరోసారి రచయితలందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ బహుమతి పొందిన అయిదు కథలతో పాటూ న్యాయనిర్ణేతలు ఎంచుకున్న తొమ్మిది కథలు, కథకుల జాబితా ఇస్తున్నాము. సాధారణ ప్రచురణకు ఎంపికయిన కథల జాబితా వచ్చే ఆదివారం సంచికలో ఇస్తాము. ఎవరికయినా తమ కథ సాధారణ కథగా ప్రచురించటం పట్ల అభ్యంతరం ఉంటే ముందే తెలియచేస్తే, ప్రచురణ జాబితానుంచి వారి కథను తొలగిస్తాము.
~
తొమ్మిది కథల జాబితా..
- ఫ్యూచర్ – ఎనుగంటి వేణుగోపాల్
- తాత GPT – ఘాలి లలితా ప్రవల్లిక
- తొలివలపు – కుంతి
- తులసీ తీర్థం – చిట్టత్తూరు మునిగోపాల్.
- వాడిపేరు మనిషి – కళా గోపాల్
- జ్ఞాన సంపన్నుడు -బుద్ధా మురళి
- రాయని భాస్కరుడు— పాణ్యం దత్తశర్మ
- క్లౌడ్ బర్స్ట్ – దేశరాజు
- కోనసీమ కోయిల – మిరియాల భ్రమరాంబికా సాయిశ్రీ.
~
త్వరలో ‘లవ్ – జిహాద్’ కవితల పోటీ ఫలితాలు వెలువడతాయి. మరో కథల పోటీ ప్రకటన వస్తుంది.
ధన్యవాదాలు.
