Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బెంగాల్ – ఒరిస్సా పర్యటన

[బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]

దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాలను పర్యటించడం ఓ అందమైన అభిరుచే కాక అపురూపమైన అనుభవమని, ఆరోగ్య ప్రదాయకరమైన వ్యసనమని జ్ఞానార్జనకు సేతువని చెప్పడం అతిశ యోక్తి కాదు. పర్యటన వ్యక్తిత్వ వికాసానికి, సంఘీభావానికి దోహద పడుతుంది.

మా పర్యటనా అనుభవాలను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని కల్పించిన ‘సంచిక’కు ధన్యవాదాలు అర్పిస్తూ మా తాజా పర్యటన గురించి వివరిస్తున్నాను.

ఈసారి మా 13 రోజుల పర్యటనా ప్రణాళికను ‘శాతవాహన ట్రావెల్స్’ అనే సంస్థ చాలా చక్కగా రూపొందించింది. ఆ సంస్థ డెస్టినేషన్ మేనేజర్ శ్రీ భరత్ సూద్, టూర్ కోఆర్డినేటర్ శ్రీ రామ్ కుమార్ మాకు వివిధ ప్రాంతాల్లో మంచి వసతి సౌకర్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని కలిగించారు.

మా పర్యటనలో మొదటి మజిలీ కోల్‌కతా మహానగరం. బెంగళూరు నుండి రెండున్నర గంట సేపు ప్రయాణించి ఉదయం 07.30 గంటలకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో దిగాము.

కోల్‌కతాలో అడుగుపెట్టగానే ఉద్వేగభరితమైన భావానికి లోనయ్యాను. ఒకప్పటి ఆంగ్లేయ పాలకుల కంచుకోట ఈ నేల, భారత స్వతంత్ర సమరానికి ఊపిరి పోసిన నేల, బోసు శౌర్యం శక్తిగా మారిన నేల ,రవీంద్రుని కవిత్వం రవళించిన నేల, మదర్ తెరెసా ‘మానవసేవ’ను నిర్వచించిన నేల, కాళికాదేవి కటాక్షించిన నేల. ఇలా చెప్పుకుపోతే ఈ మహానగరాన్ని వర్ణించడానికి భాష చాలదు.

అరైవల్ లాంజిలో శాతవాహన ప్రతినిధి మమ్మల్ని ఆహ్వానించారు. తదుపరి హోటల్‌కు బయలుదేరాము. దారిలోనే ‘జగదీశ్వరి భవతారిణి కాళీమాత’ వెలసిన ‘దక్షిణేశ్వర కాళీ’ ఆలయాన్ని చూసాము.

హుగ్లీ (గంగా) నది ఒడ్డున 1855లో రాణి రెస్ మోనీ కట్టించిన ఈ ఆలయంలోనే రామకృష్ణ పరమహంస మాత శారదా దేవి కాళీమాతను పూజించేవారు. నవరత్న వాస్తు కళతో కట్టించిన అందమైన ఆలయ సముదాయం ఇది. కాళీమాత దర్శనానంతరము ప్రపంచ ప్రఖ్యాతమైన హౌరా బ్రిడ్జి మీదుగా ప్రయాణించి హోటలు చేరాము. ప్రత్యేక సాంకేతిక నైపుణ్యంతో దృఢమైన ఇనుము ఉపయోగించి కట్టిన ఊగే వంతెన ఇది. ప్రతిరోజు ఈ వంతెన మీదుగా రెండు లక్షల మంది పాదాచారులు రెండున్నర లక్ష వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. హౌరా కలకత్తా నగరాలను కలుపుతుంది ఈ వంతెన.

కాలకృత్యాల అనంతరము ‘విక్టోరియా మెమోరియల్’కు వెళ్ళాము. ఇది చూడదగ్గ చారిత్రాత్మక భవనము. ప్రపంచంలోనే అతి పెద్దదైన చక్రవర్తి నివాసం ఇది. 64 ఎకరాల పూల తోట మధ్య పాలరాతితో కట్టిన రాజమహలు. ‘లార్డ్ కురజన్’ నేతృత్వంలో ఇండో సరాసనిక్ వాస్తు కళతో 1906 నుంచి 1921 వరకు కలకత్తా నడిబొడ్డున కట్టబడిన ఈ శిల్ప సౌధము అప్పటి విక్టోరియా మహారాణికి అంకితం చేయబడినది. ఇప్పుడు ఇది భారత ప్రభుత్వంచే నడుపబడుతున్న ఓ ప్రదర్శనశాల.

తదుపరి మదర్ హౌస్ చూసాము. ఇది మదర్ తెరెసా నివసించిన చిన్న భవనము. ఆమె సమాధి కూడా ఇక్కడే ఉంది. ఆమె వాడిన వస్తువులు ఆమెకు వచ్చిన బహుమతులు నోబెల్ ప్రైస్ మెడల్, ఆమె జీవిత చరిత్ర, చేసిన సేవల గురించి ప్రచురించిన పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. మానవ సేవలో చరితార్థమైన ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల సేపు ప్రార్థించి అక్కడి నుంచి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భవంతి చూడటానికి బయలుదేరాము. బెంగాలిలో ఈ భవంతిని ‘జొరా సాంకో ఠాకూర్ బరి’ అని పిలుస్తారు. ఠాకూర్ వంశస్థులు నివసించిన రాజమహలు లాంటి ఈ భవనం ప్రస్తుతం ఓ ప్రదర్శనశాల. ఠాకూర్ భవంతి చూడటానికి దాదాపు రెండు గంటలు పట్టింది.

తర్వాత సాయంత్రం షాపింగ్‌కి బయలుదేరాము. కలకత్తాలో దాదాపు ఓ కిలోమీటర్ వరకు ప్లాట్‌ఫారం పైనే రకరకాల వస్తువులు అమ్ముతూ అంగళ్లు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చీరలు రెడీమేడ్ దుస్తులు ఇతర డ్రెస్ మెటీరియల్ చాలా అనువైన ధరల కే దొరుకుతాయి. మాకు నచ్చిన వస్తువులు కొన్న తర్వాత భోజనానికి బయలుదేరాము. ‘బెంగాలీ థాలీ’, ‘బంగ్లాదేశీ థాలీ’ అనే రెండు రకాల భోజనాలు దొరుకుతాయి. అన్నింటిలోనూ చేప కూర సామాన్యము. ఇక తీపి పదార్థాల్లో ‘రసగుల్లా’, ‘సందేశ్’ అనేవి విశిష్టమైనవి, చాలా రుచిగా ఉంటాయి.

మరుసటి రోజు ముందుగా కాళీమాత దర్శనానికి కాళీఘాట్ చేరుకున్నాము. ఇక్కడ పర్యాటకులు, భక్తులు పూజారులతో దూరముగా ఉండటం మంచిది. ఆలయంలో పద్ధతి అనేది లేదు, పూజారులు ఏం చేస్తే, చెబితే అదే పద్ధతి. బొట్టు పెట్టుకోవాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. వాళ్లను కాదని ముందుకు వెళ్లి మాతను దర్శించుకోలేము. అలా అని వాళ్ల మాటలకు లొంగితే మన దగ్గర ఉన్న పైకం మొత్తం లాగేస్తారు. చాలా జాగ్రత్తగా వీళ్లను డీల్ చేయాలి. మేము కూడా కాస్త సమర్పించుకొని దేవి దర్శనం చేసుకున్నాము.

అనంతరం భారతదేశంలో పెద్దదైన ప్రదర్శనశాల ‘ఇండియన్ మ్యూజియం’ చేరుకున్నాము. ఇక్కడ ఆరుదయిన పురావస్తు సంపద నిక్షిప్తమై ఉంది. ప్రపంచంలో దొరికే అన్ని రకాల ఖనిజాలను అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలను, అరుదైన శిలాజాలను క్రింది అంతస్తులో ప్రదర్శనకు ఉంచారు. పై అంతస్తులో చారిత్రాత్మక వస్తువులు అరుదైన శిల్పకళాఖండాలు చూడవచ్చు. తప్పకుండా చూడవలసిన ప్రదర్శనశాల ఇది.

ఇండియన్ మ్యూజియం ప్రక్కనే చాలా పెద్దదైన షాపింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఏదీ ఉండదు. 19 వ శతాబ్దపు గ్రామ ఫోన్ ఒకటి, కొన్ని హెచ్ఎంవి రికార్డులు కొన్నాము. తరువాత కోల్‌కతాలో మరో చారిత్రాత్మిక భవనాన్ని చూడటానికి బయలుదేరాము. భారత స్వాతంత్ర పోరాటంలో సాయుధ విప్లవానికి నాయకుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థాపకుడు సుభాష్ చంద్ర బోస్ భవంతి. ‘లాలా లజపతిరాయ్ సారాని’ లో ఉన్న ఈ భవనం వెస్ట్ బెంగాల్ వారసత్వ భవనంగా ప్రకటించ బడింది. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ వాడిన వస్తువులు, ఓ పెద్ద లైబ్రరీ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ‘నేతాజీ రీసెర్చ్ బ్యూరో’ ప్రధాన కార్యాలయము. ఈ భవంతి చూడడానికి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

సాయంత్రం దీపాల వేళకు ప్రిన్సెప్ ఘాట్ చేరుకున్నాము. ఇది కోల్‌కతాలోనే చాలా అందమైన ప్రదేశము. హుగ్లీ నది ఒడ్డున గ్రీకు వాస్తు కళ నైపుణ్యంతో కట్టిన కట్టడం ఇది. ప్రఖ్యాత పురాతత్వవేత్త ఆంగ్లో ఇండియన్ పండితుడైన జేమ్స్ ప్రిన్సెప్ట్ జ్ఞాపకార్థం బ్రిటిష్ వాళ్లు 1841 లో ఈ భవంతిని కట్టారు. దీపాల వెలుతురులో అతి సుందరంగా కనిపించే ఈ ప్రదేశాన్ని చూడటానికి ప్రతిరోజు వందల మంది పర్యాటకులు నగరవాసులు వస్తారు. ఈ ఘాట్ వద్ద రుచికరమైన కోల్‌కతా గోల్ గుప్పె (పానీ పూరి) దుకాణాలు ఉన్నాయి. మేము కూడా పానీపూరి రుచి చూసి అక్కడి నుంచి బిర్లా మందిర్ కు వెళ్ళాము. అనంతరం రాత్రి హోటల్లో గడిపి మరుసటి రోజు ఉదయాన్నే సుందరవనాలకు బయలుదేరాము.

కోల్‌కతా నుంచి మూడున్నర గంట ఏసీ బస్సులో ప్రయాణం చేసి ‘గుడ్ఖాలీ’ అనే ఊరు చేరుకున్నాము. అక్కడ నుంచి అరగంట పడవ ప్రయాణం చేసి సుందరవనాలకు చేరుకున్నాము. ఓ విశాలమైన కాటేజీలో మా బస ఏర్పాటు చేశారు. ఓ గంట విశ్రాంతి అనంతరం లాంచీలో ప్రయాణించి సుందరవనాల అరణ్య ప్రాంతంలో నివసించే రకరకాల పక్షులను చూడటం జరిగింది. తరువాత అందమైన సూర్యాస్తమయాన్ని చూసి తిరుగు ముఖం పట్టాము. ఇక్కడ ముఖ్యంగా ఓ విషయం చెప్పాలి. ఈ అరణ్య ప్రాంతాల్లో తిరిగేందుకు రోడ్లు ఉండవు కేవలం నీళ్ల మీదే ప్రయాణించాలి. సుందరవనాలు చాలా పెద్ద అడవులు. ఇందులో 40 శాతం మాత్రమే మన దేశంలో వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. మిగిలిన 60 శాతం బంగ్లాదేశ్‌లో కలిశాయి. రాత్రి కాటేజీ ఆవరణలో ఏర్పాటుచేసిన జానపద సాంస్కృతిక నృత్య గానాలు చూస్తూ చలికాచుకొంటూ భోజనం చేయడం ఓ ప్రత్యేకమైన, అందమైన అనుభవం.

మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి అరణ్యంలో టైగర్ సఫారీకి వెళ్ళాము. నది ఒడ్డున నీళ్లు తాగి చెట్ల మధ్య తిరుగాడే అరుదైన రాయల్ బెంగాల్ టైగర్లను ఇతర వన్యప్రాణులను చూడటం మరో విశిష్టమైన అనుభవం. ఇక్కడ నీటి ముసళ్ళు, జైంట్ తాబేలు, అరుదైన నీటి బల్లులు చాలా పెద్దవిగా ఉంటాయి. గంగా నదితో పాటు దాని 5 ఉపనదులు ఇక్కడే బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని ‘పంచముఖిని’ అని పిలుస్తారు. వివిధ నీటి మార్గాల ద్వారా ప్రయాణం చేసి సుందర బన్స్ జాతీయ అడవులను చూసాము. మూడవ రోజు ఉదయం సుందర్బన్స్ దీవులలో ఉన్న రెండు గ్రామాలకు తీసుకెళ్లారు. అక్కడి పల్లె ప్రజల జీవనశైలి, సంస్కృతి, ఆచార వ్యవహారాలు చూసాము. గోసాబా అనే దీవిలో హామిల్టన్ బంగ్లా చూసాము. సర్ డానియల్ మెకానోన్ హామిల్టన్ అనే స్కాట్లాండ్ వ్యాపారస్థుడు ఇండియాకొచ్చి సుందర్బన్స్‌లో ప్రజలు నివసించేందుకు ఎన్నో వసతులు కల్పించాడట. తన నివాసం కోసం 1903వ సంవత్సరంలో అడవి చెక్కలతో కట్టిన భవనం నిర్మించుకున్నాడు. గోసాబా దీవికి ఓ వైపు గంగా నది మరోవైపు బంగాళాఖాతము ఉన్నవి. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో హేమిల్టన్ పుట్టినరోజు పండుగను వారం రోజులపాటు ఘనంగా జరుపుతారట. ఆ ప్రాంతంలో మాత్రం దొరికే అడవి పండ్లను కొని అక్కడి నుంచి కోల్‌కతాకు తిరుగు ప్రయాణం పట్టాము.

ఆరవ రోజు సాయంత్రం కోల్‌కతా నుంచి రైలులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఒడిస్సా లోని పూరి చేరుకున్నాము. స్నానాదుల అనంతరం పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళాము. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రము. ప్రతిరోజు వేల మంది భక్తులు జగన్నాధుని దర్శనానికి వస్తూ ఉంటారు. ఓ ప్రత్యేక శిల్పకళతో కట్టిన చాలా పెద్ద ఆలయం ఇది. గర్భగుడిలో కొలువై ఉన్న జగన్నాధుని, బలరామదేవుని, సుభద్రమ్మను దర్శించుకున్నాము. ఇక్కడ పూజారులతో చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. లేదంటే నిలువు దోపిడీ జరిగినంత పని అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథోత్సవం జరిగేది ఇక్కడే.

సాయంత్రం వరకు పూరీలోని వివిధ ఆలయాలకు వెళ్ళాము. అందులో ముఖ్యమైనవి శ్రీ విమల శక్తి పీఠం, అష్ట శంభు దేవాలయం, లోకనాథ స్వామి దేవాలయం, సోనార్ గౌరoగా దేవాలయం, బెడీ హనుమంత మందిరము.

సాయంత్రము మాకు బస ఏర్పాటు చేసిన హోటల్ వెనుకనే ఉన్న పూరి బీచ్‌కు వెళ్లి పొద్దు పోయేంతవరకు గడిపాము. బీచ్ చాలా శుభ్రంగా ఉంది. పూరి నగరం కూడా చాలా శుభ్రంగా ఉంది.

మనుసటి రోజు ఉదయం చిలకా సరస్సును చూడటానికి వెళ్లాము. ఇది ఆసియాలోనే అతి పెద్ద సరస్సు. ఒడిస్సా రాష్ట్రంలో 1100 చదరపు కిలోమీటర్ల వరకు 3 జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ సరస్సుకు దగ్గర లోనే ‘దయా’నది బంగాళాఖాతంలో కలుస్తుంది. వివిధ రకాల పక్షులకు జలచరాలకు ప్రఖ్యాతి గాంచింది చిలకా సరస్సు. మాకు ఏర్పాటుచేసిన పడవలో దాదాపు 5 గంటలసేపు ఈ సరస్సులో తిరిగాము. వివిధరకాల అందమైన నీటి పక్షులు మా పడవ చుట్టూ ఎగురుతూ నీళ్లలో మునుగుతూ కనువిందు చేశాయి. సరస్సు మధ్యలో ఓ ద్వీపం ఉంది. చాలా అరుదైన విషపూరితమైన ఎరుపు రంగు పీతలను ఇక్కడ చూసాము. ఈ ద్వీపం ఒడ్డున చాలా రకముల గవ్వలు దొరుకుతాయి.

సరస్సులో మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత మరింత ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసాము. డాల్ఫిన్స్ చేపలు నీళ్లల్లో ఈదుతూ పైకి ఎగిరి మరలా మునుగుతూ ఆడుకుంటున్నాయి. ఇలాంటి దృశ్యాలను కేవలం సినిమాలలో లేదా జియోగ్రఫీ చానల్లో చూసామే కానీ ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. మా ఆనందానికి అంతేలేదు. అవకాశం వస్తే మరో మారు ఇక్కడికి రావాలని అనుకుంటూ తిరుగు ముఖం పట్టాము.

మరుసటి రోజు ఉదయాన్నే కోణార్క్ మీదుగా భువనేశ్వర్‌కు కారులో బయలుదేరాము. దారిలో రఘు రాజ్ పూర్ అనే కళాకారుల గ్రామంలో ఆగాము. ఇది తప్పకుండా చూడవలసిన గ్రామం. ఇక్కడ ప్రతి ఇల్లు హస్తకళల కేంద్రం. అతి పురాతన పద్ధతిలో వాసులు తయారుచేసి వాటిపై రాళ్లతో సముద్రపు గవ్వలతో తయారుచేసిన రంగులు ఉపయోగించి అత్యంత మనోహరమైన బొమ్మలు వేస్తారు. ఇటువంటి ప్రత్యేక కళ ఒడిశా రాష్ట్రానికి వన్నె తెచ్చింది. కాళికాదేవి వివిధ అవతారాలను ప్రతిబింబించే ఓ సుందరమైన చిత్రాన్ని కొన్నాము. ఇక్కడ నుంచి గంటసేపు ప్రయాణించి ప్రఖ్యాత సూర్య దేవాలయం ఉన్న కోణార్క్ చేరుకున్నాము.

ఈ దేవాలయాన్ని కట్టిన తీరు, శిల్ప సంపదను వర్ణించడానికి మాటలు చాలవు. కాలము యొక్క స్థితి గతులను క్షుణ్ణంగా తెలిపే ఆలయ శిల్పాలు మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడ్డ ఈ ఆలయం చాలా వరకు శిధిలమైనది. అయినా దాని అందం ఇంకా జీవించే ఉంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ చేరుకునే ముందు దారిలో ‘పిప్లీ’ గ్రామాన్ని చూసాము. ఇక్కడ వివిధ రంగులలో అలంకార వస్త్రాలు తయారు చేస్తారు.

ఇక భువనేశ్వర్ విషయానికొస్తే ఇది చాలా అందమైన అత్యంత శుభ్రమైన నగరము. ఈ నగర పరిపాలన విభాగంలో మరో విశేషం ఉంది. ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాల్లో ప్రవేశ రుసుము చాలా తక్కువగాను అందరికీ అందుబాటులో ఉండే విధముగా ఉంటుంది. అంతేకాక పర్యాటక ప్రదేశాల్లో శుభ్రతకు మొదటి స్థానం ఇచ్చారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. ఇక భువనేశ్వర్‌లో తప్పకుండా చూసి తీరవలసిన ప్రదేశాల గురించి ప్రస్తావిస్తాను.

కందగిరి ఉదయగిరి గుహలు

ముందుగా మేము భువనేశ్వర్‌కు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందగిరి ఉదయగిరి గుహలకు వెళ్ళాము. కుమారి పర్వత శ్రేణి పైన క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దిలో చెక్కబడిన గుహలివి. మొత్తము 33 గుహలు ఉన్నాయి. ఉదయగిరి మాత్రము రెండంతస్తుల గుహలు. అప్పటిలో ఇవి జైన సన్యాసుల ఆరామలుగా ఉండేవని చరిత్ర చెబుతుంది. ఇవి భారతదేశపు వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించబడ్డాయి.

ధౌలీ శాంతి స్తూపం

తరువాత స్తూపాన్ని చూసాము. ఇది కూడా తప్పకుండా చూడాల్సిన గొప్ప తెల్ల రాయి స్తూపము. దయానది ఒడ్డున ఉన్న దౌలగిరి అనే కొండపై కట్టబడింది. క్రీస్తుపూర్వం 261లో ప్రదేశంలోనే కళింగ యుద్ధం జరిగింది. అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించిన అనంతరము ప్రదేశంలో శాంతి స్తూపం కట్టాలని పునాదిరాయి వేశారట, తదుపరి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాను బౌద్ధ సంఘం వారు ఇక్కడ స్తూపాన్ని నిర్మించారు.

బాబా లింగరాజు దేవాలయం

అనంతరం భువనేశ్వర్‌లో ఉన్న ముఖ్యమైన దేవాలయాలను దర్శించాము. ముందుగా బాబా లింగరాజు దేవాలయానికి వెళ్ళాము. ఇది చాలా పురాతనమైన, కళాత్మకమైన ఆలయ సముదాయము. గుడిలో ప్రధానమైన శివలింగంతో పాటు 108 లింగాలు సృష్టించి ఉన్నారు. ఈ ఆలయపు వాస్తు కళ చాలా అపురూపంగా ఉంది.

రెండవది ‘చౌసాట్ యోగిని’ ఆలయము. ఇది కూడా చాలా పురాతనమైనది. 64 రూపాలలో కాళికాదేవి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సాయంత్రం రామచండి బీచ్‌కు చేరుకున్నాం. ఈ బీచ్ పరిసరాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. రెండు గంటలు ఇక్కడే గడిపి హోటల్ చేరుకున్నాము.

మరుసటి రోజు రెండు ముఖ్యమైన మరియు ఆసక్తిరమైన ప్రదేశాలు చూడటంలోనే రోజంతా గడిచిపోయింది. అందులో మొదటిది నందన్ కన్నన్ జంతు ప్రదర్శనశాల. ఉదయం 10 గంటలకల్లా జంతు ప్రదర్శనశాలకు చేరుకున్నాం. సందర్శకుల కోసం అధికారులు మంచి సౌకర్యములు కలిగించారు. 1500 ఎకరాలు విస్తీర్ణం కలిగిన ఈ జంతు ప్రదర్శనశాలను చూడటానికి నడిచి వెళ్ళవచ్చు, బ్యాటరీ కారులో లేదా రోప్ వే ద్వారా వెళ్లవచ్చు.

ఈ జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు జంతువులను ఆరోగ్యంగానూ పరిసరాలను శుభ్రముగాను నిర్వహిస్తున్నారు. వివిధ రకములైన వన్యప్రాణులు జలచరాలు పక్షులతో పాటు చాలా అరుదైన నల్ల పెద్దపులులను, తెల్ల పెద్దపులులను, నల్ల చిరుతలను చూసాము. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, కేవలం 100 రూపాయల ప్రవేశ రుసుముతో ఏసీ బస్సులో నాలుగు రకాల సఫారీలు సందర్శించవచ్చు. లయన్ సఫారీ, టైగర్ సఫారీ, బీర్ సఫారీ, హెర్బి ఓర్ సఫారీ లలో స్వేచ్ఛగా తిరుగుడుతున్న సింహాలను, బెంగాల్ పులులను, ఎలుగుబంట్లను, మచ్చల జింకలను చూసాము. జంతు ప్రదర్శనశాల పక్కనే ఉన్న బొటానికల్ గార్డెన్స్‌లో అరుదైన పూల చెట్లను, ఔషధ మొక్కలను, చూసాము.

మధ్యాహ్నం ఒడిశా భోజనం చేయాలని రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఒడిశాలో ముఖ్యమైన ఆహారము బియ్యంతో చేసిన అన్నము. ఒడియా థాలీ, పాకాల భాత్, కిచ్చిడి ప్రత్యేకమైనవి. ఒడియా థాలీ లో తెల్లటి అన్నంతో పాటు 14 రకాల కూరలు ఇస్తారు. ఇందులో ప్రత్యేకమైన చేపల కూర, రొయ్యల వేపుడు ఉన్నాయి. పాకాల భాత్ కూడా తెప్పించాము. ఇందులో 11 రకాల కూరలతోపాటు చద్ది అన్నము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వేయించిన ఉప్పు మిరపకాయలు ఉన్నాయి. వేసవికాలంలో ఈ అన్నాన్ని ఎక్కువమంది తింటారట. రసబాలి, రసగుల్లా ఇక్కడ విశిష్టమైన తీపి పదార్థములు.

భోజనానంతరము స్టేట్ ట్రైబల్ మ్యూజియంకు వెళ్ళాము. ఇది తప్పకుండా చూడాల్సిన గిరిజన ప్రదర్శనశాల. అందమైన పూల తోట మధ్యలో మ్యూజియం కట్టారు. ఒడిశాలో దాదాపు పదమూడు గిరిజన జాతులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి డోన్గారియా, కొండా, కాందా ముఖ్యమైనవి. గిరిజన జాతుల జీవన శైలిని, ఆచార వ్యవహారాలను, కళలను ప్రతిబిoబించే నమూనాలను, వారు వాడే వస్తువులను ఆయుధాలను ఇక్కడ సందర్శకుల కోసం ప్రదర్శించారు. అంతేగాక గిరిజనుల జీవితాలపై ఓ డాక్యుమెంటరీ సినిమా కూడా ప్రదర్శించారు. మధ్యప్రదేశ్, భోపాల్‌లో ఉన్న ట్రైబల్ మ్యూజియం తరువాత చెప్పుకోతగిన విశిష్టమైన మ్యూజియం ఇది.

ఇక్కడ కొన్ని గిరిజన ఉత్పత్తులను, కళాకృతులను కొని అందమైన జ్ఞాపకాలతో ఇంటి ముఖం పట్టాము.

శాతవాహన ట్రావెల్ ప్రతినిధి మాకు బీజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. తమ పర్యటనలకు ఏదైనా సలహా లేదా సహాయం కోసం పాఠకులు వీరిని 62300 59002 నెంబర్ ఫోనులో సంప్రదించవచ్చు.

Exit mobile version