Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-10

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-10: భారతీయ సాహిత్యం

సాహిత్య సృష్టికైనా సామాజిక వాతావరణమే ప్రేరణ. ఈనాడు దేశం అన్ని వైపుల నుంచి విదేశీయుల తాకిడిని ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతోంది. ఈ సందర్భంలో అంతఃకలహాలు వాంఛనీయం కాదు. జాతి రక్షణకు జాతీయ సమైక్యత అవసరం. జాతీయ సమైక్యతకు ప్రధానాధారం ఒకే జాతీయ సాహిత్యం అనే భారతీయ సాహిత్యం.

మరొక వంక ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకొని మానవ జాతిని కాపాడాలని విశ్వప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రపంచ భావ సమైక్యత అవసరం. ప్రాంతీయ భాషాభేదాలకు అతీతమైన సాహిత్యమే దానిని సాధించగలదు. ఈనాడు ప్రబలుతున్న ‘ప్రపంచ సాహిత్యం’ సృష్టికి ప్రేరణ ఇదే.

ప్రపంచంలో ఒక భాగమై నియతమయినదై అంతర్గతమైన మార్పులెన్ని వచ్చినా తన మౌలికతను పోగొట్టుకొనని దానిని ‘వ్యవస్థ’ అనవచ్చు. సాహిత్యం ఒక వ్యవస్థ. కానీ ఇది సమాజం లోని వ్యక్తులను నిర్బంధంగా తనతో బంధించే వ్యవస్థ కాదు.

సాహిత్యాన్ని సమాజంతో అనుసంధానించే శక్తులు రెండు. (1) అంతరికం (విమర్శకుల అలంకారిక లక్షణాలు, శిల్పము, శైలి, మొదలగునవి. (2) బాహిరం (పోషకులు మొదలగునవి)

ఆలంకారిక గ్రంథాలు సాహిత్యాన్ని యథాతథంగా ఫాఠకుల ముందు ఉంచుతాయి. ఇంకో రకంగా ఉపయోగించుకొనే అవకాశం ఇయ్యవు. సాహిత్యంలో మార్పు అనివార్యం. మార్పుకు ప్రతిఘటన కూడా అనివార్యమే. జీవమున్నది నిలుస్తున్నది.

పోషకత్వంలో 3 అంశాలు వుంటాయి – 1) ఆదర్శము 2) ఆర్థికం 3) సామాజిక స్థాయి. ఈ వ్యవస్థలో సాహిత్యం వ్యవస్థను సమర్థిస్తుంది. అంటే ఇంకో రకమైన సాహిత్యం రాదని కాదు. అది అధికారికమైన మార్గంలో రాదు. ఆ యా వ్యవస్థలు దీనిని క్రింది తరగతి సాహిత్యం (లేదా) ప్రజాసాహిత్యం అని ముద్రవేస్తాయి.

ఉదాహరణ – వేమన సాహిత్యం, జానపద సాహిత్యం మొదలగునవి. ఇది ఒక్కోసారి బలవంతంగా కూడా జరుగుతుంది. పాకిస్థాన్‍లో ‘ది శాట‌నిక్ వ‌ర్సెస్’ గురించిన అలజడి గొప్ప నిదర్శనం. మూడు ఏకమైతే, వ్యవస్థలో విమర్శ కూడా అలాగే ఉంటుంది. అంటే సంప్రదాయక ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉంటుంది.

రాచరిక వ్యవస్థ లేని చోట రచయిత స్వతంత్రుడు.

ఒక సాహిత్యానికి భాష కానీ నైతిక రాజకీయాంశాలు గాని హద్దులు కావు. సాహిత్యాన్ని నియమించేది సాహిత్య లక్షణాలు. ఇవి రెండు విధాలుగా ఉంటాయి.

  1. పాత్రలు, ప్రతీకలు, సన్నివేశాలు, వస్తువు, శిల్పం మొదలగునవి.
  2. సమాజంలో సాహిత్యం నిర్వహించవలసిన పాత్ర

ప్రపంచ సాహిత్యాలన్నింటిలోను ఆ యా వ్యవస్థల అనుగుణంగా సాహిత్యంలో వస్తున్న మార్పులను గమనించగలం.

మిల్టన్ (Milton) మహకవి ‘పారడైజ్ లాస్ట్’ లోని ‘సాటన్’ గొంతులో అప్రయత్నంగా దైవ ధిక్కారంతో పాటు మానవత్వం కూడా పలికింది.

సామాజిక వాస్తవికతను సాహిత్యం అంగీకరించింది.

మతం నుంచి సమాజం వైపుకు మళ్ళే ప్రయత్నానికి తొలి మెట్టుగా ప్రకృత్యారాధన కాల్పనిక రీతిలో కవితలో పలకడం – సామాజిక వాస్తవికతను సాహిత్యం అంగీకరించడం – ఈ క్రమ పరిణామలన్ని ప్రపంచ సాహిత్యాలన్నింటిలోనూ చూడగలం.

అధ్యాయం-11: నవరస – నవవిధ భక్తులు

భక్తరామదాసు, పోతన, త్యాగరాజులు – ఆంధ్రజాతిలో ఉదయించిన మహాభక్తులు. వీరి ఆరాధ్య దైవము శ్రీ రామచంద్రుడే.

పోతన – గద్య, వైద్య, సంకలిత భాగవత మహా ప్రబంధమును – భక్తి సాహిత్యమున రాగతాళములతో మేళవించి మధురముగా ఆలపించెను.

ఇక గోపన్న రసా విశిష్టుడై రచించెను.

త్యాగరాజు మృదుమధుర భక్తి సాహిత్యమును రాగతాళములతో మేళవించి రామభక్తి సుధా ధారా శోభితము నైతికమనీయ తెలుగు సంకీర్తనా సంప్రదాయమగు సష్టించి మనోహరంగా కీర్తించెను

ఈ ముగ్గురు త్రిమూర్తులు రామతారక మహా మంత్రోపాసకులు, పరమ పవిత్రులు, ముక్తులు, సిద్ధులు. దక్షిణాపథమును వీరు రామభక్తి సాగరమున ముంచెత్తిరి.

~

  1. శ్రవణ భక్తి చే – పరీక్షిత్తు
  2. సంకీర్తన భక్తితో – నారదుడు
  3. స్మరణంతో – ప్రహ్లాదుడు
  4. పాదసేవచే – భార్గవి
  5. పూజతో – పృథువు
  6. వందనంతో – అక్రూరుడు
  7. దాస్యంతో – గరుత్మంతుడు
  8. స్నేహం చే – ధనంజయుడు
  9. ఆత్మసమర్పణ – బలి చక్రవర్తి

ఈ విధంగా నవ విధ భక్తితో ముక్తి పొందిరి.

శ్రీ రామదాసు సకల విధములు భక్తి మార్గముల ఆచరణ రూపమున ఆత్మీయమొనర్చుకొని భక్తియే రామదాస్యం. రామదాసే మూర్తీభవించిన భక్తిగా భావింపబడి శ్రీరామ దేవుని దివ్య సాక్షాత్కారమంది కృతార్థుడయ్యెను.

పోతనవంటి కవితాధార, త్యాగయ్య పాండిత్య ప్రకర్షణ – అత్యంత రమణీయమైన భక్త రామదాసునీ – హృదయపు శతపత్రా విర్భూత నిరర్గళ మహోధృత భక్తిధార మరి ఎవ్వరికి అబ్బును? భక్తి భావానికి రామదాసు రామదాసే. ఇట్టి ఆవేశ భక్తులు ‘న భూతో న భవిష్యతి’. పుట్టులేదు, పుట్టబోరు. వీరి రచనలు మిక్కిలి స్వల్పములే అయినను అవి చుక్కల నడుమ చంద్రుని వంటివి.

రామదాసు చరిత్ర అందలి కీర్తనలన్నియు రామదాసు స్వంత రచనలు గావు. కొన్ని కథా సంకలనకర్తయగు సింగర దాసువి. కొన్ని తూము నృసింహదాసువి. ‘రామదాస నవ విధ కీర్తనల’లో అతని ప్రసిద్ధ భక్తి భావనలు ప్రస్ఫుటములై – నవరస స్ఫూరితో వెలుగొందుచుండును.

  1. శృంగార రసము – ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’
  2. వీర రసము – ‘అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను’.
  3. కరుణ రసము – ‘రామచంద్రులునాపై చలముచేసినారు సీతమ్మ చెప్పవమ్మా’
  4. అద్భుత రసము – ‘ఏమయ్యరామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ దెలియవశమా’
  5. హస్య రసము – ‘రావయ్య భద్రాచలరామ శ్రీరామా’
  6. భయానక రసము – ‘అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా రామప్ప గొబ్బున నన్నేలుకోరా’
  7. భీభబ్సీ రసము – ‘పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కైన’
  8. రౌద్ర రసము – ‘ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను’
  9. శాంత రసము – ‘రామజోగి మందు కొనరే ఓ జనులార’

~

నవ విధ భక్తులు

  1. శ్రవణ భక్తి – ‘తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా’
  2. సంకీర్తన భక్తి – ‘శ్రీరామనామం మరువాం మరువాం’
  3. స్మరణ భక్తి – ‘కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ’
  4. పాదసేవ – ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు’
  5. అర్చన – ‘రామ రామ శ్రీరామ రామరామ యనరాదా మనసా’
  6. వందనం – ‘నాతప్పులన్ని క్షమియించుమీ జగన్నాథ నీవాడ రక్షింపుమీ’
  7. దాస్య భక్తి – ‘గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా’
  8. సఖ్య భక్తి – ‘ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను’
  9. ఆత్మనివేదన – ‘నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా’

~

రామదాసు విరచితములగు దాశరథీ పద్యములు, పోతన్న రచిత భాగవత పద్యములు వోలె ‘అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తు’లను గావించును.

భద్రాచల క్షేత్రము – భద్రుని తపోమహిమచే ఆవిర్భవించి దేవర్షి నారదుని దివ్య మహాతీ విపంచి నాదముచే ముఖరితమై, ఆది శంకరుల ఆశీస్సులంది, పోతనామాత్యుని యోగశక్తికి నెలవై రామదాసుకు ఇలవేలుపై, త్యాగరాజుచే కీర్తింపబడి వెలుగొందెను. ఇది అంధ్ర రాయలసీమ, తెలంగాణములకు సాంస్కతిక ఐక్యతను సాధించిన పుణ్య తపోభూమి. షట్కోటి యాంధ్రుల హృదయ తంత్రులలరారు కథాగీతికలచే సమ్మోహిత మొనర్చు సుక్షేత్రము.

శ్రీ భద్రగిరి రాముడు ప్రాచీన గోల్కండ వైభవమును మరిపించుచు మన పునర్నిర్మిత నవ్య భాగ్యనగర రాజ్య కులదేవతయై ఆంధ్ర ప్రదేశమున శాశ్వత రామరాజ్య ధర్మ సంస్థాపన మొనర్చుచు సర్నోన్నతుడై వెలుగొందుచున్నాడు.

‘శ్రీద, సనందనాది ముని సేవిత పాద, దిగంత కీర్తి సం
పాద, సమస్త భూత పరిపాల వినోద, విషాద వల్లి కా
చ్ఛేద, ధరాధినాధకులసింధు సుధామయ పాద, నృత్తగీ
తాది వినోద, భద్రగిరి దాశరథీ, కరుణాపయోనిధీ!’.

(ఇంకా ఉంది)

Exit mobile version