[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]
ఉదయం పదిగంటల వేళ. కాకినాడలోని పిఠాపురం రాజావారి కాలేజ్ చాలా సందడిగా ఉంది. కారణం ‘జె ఈ ఈ మెయిన్’ పరీక్షా ఫలితాలు రావడం.
సాధారణంగా కార్పొరేట్ కళాశాలల్లోని విద్యార్థులే ఇలాంటి ప్రెస్టీజియస్ పరీక్షల్లో మంచి రాంకులు సాధించడం జరుగుతూ ఉంటుంది. అందులో విశేషం ఏమీ లేదు.
కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ కళాశాలలో కోలాహలానికి కారణం, అందులో చదువుతున్న భద్ర ఈ ప్రతిష్ఠాత్మక పరీక్షలో పదో స్థానం సాధించడం. అది అలాంటి, ఇలాంటి విజయం కాదు.
భద్ర సామాన్యమైన అందంతో, పీలగా ఉన్న అమ్మాయి. అసలు ఆమెను చూసిన ఎవరూ ఆమె ఆ రాంక్ సాధించిందంటే నమ్మరు.
కానీ అది నిజం. చుట్టూ మీడియావారు. ఆ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల పెద్ద ఊళ్ళైన విశాఖపట్నం, విజయవాడలలో ఉన్న ప్రత్యేక శిక్షణా కేంద్రాలు..
‘ఆ అమ్మాయి తమ వద్ద కోచింగ్ తీసుకున్నట్టు చెప్పమనీ, దానికి తగిన మూల్యం కూడా ఇస్తామ’నీ ఒత్తిడి చేస్తున్నారు.
భద్ర చూడడానికి మామూలుగా ఉన్నా, ఆమె కళ్ళు మాత్రం అత్యంత శక్తివంతంగా, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా వెలిగిపోతున్నాయి.
ఆమెను అలా తీర్చిదిద్దిన రసాయనిక శాస్త్ర అధ్యాపకుడైన విశ్వేశ్వర్రావు గారి ముఖం అంతకంటే వెలిగిపోతోంది.
అది పుత్రోత్సాహము తండ్రికి అన్నట్టు, గురువును మించిన శిష్యుని చూసినప్పుడు పొందే ఆనందం.
తన చుట్టూ ఉన్న హడావుడిని చూస్తూ ఏ మాత్రం బెదరక నిబ్బరంగా నవ్వుతూ చూస్తున్న భద్రను చూస్తే ఆయనకు చాలా గర్వంగా అనిపించింది.
ఆమె కళ్ళలో ఏం చదివారో, మెల్లిగా ఆమె పక్కకు వచ్చి నిలబడ్డారు. మరుక్షణంలో భద్ర, అంతమందిలో నిస్సంకోచంగా ఆయనకు పాదాభివందనం చేసింది. ఆమె తల మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించిన ఆ గురువు కంటనీరు తిరిగింది. ఆమె తల నిమిరాడు, చెప్పదలుచుకున్నది ధైర్యంగా చెప్పమన్నట్టు చూసాడు.
భద్ర చిరునవ్వుతో గొంతు సవరించుకుని.. “అందరికీ నమస్కారం. నేనీరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మా కాలేజ్ లోని మా గురువులే. ముఖ్యంగా ఈ సార్, కెమిస్ట్రీ లెక్చరర్ నాలో ధైర్యాన్ని నింపి, అనుకున్నది సాధించగలిగేలా అనుక్షణం నాకు తర్ఫీదిచ్చి, తీర్చిదిద్దారు.
చాలామంది అనుకునేట్టు కేవలం కార్పొరేట్ కాలేజీల్లో చదివితేనే, రాంకులు సాధించగలం అనుకోవడం తప్పు. మనకు సాధించాలి అనేటువంటి ధృఢ సంకల్పం ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో కూడా సాధ్యమే. ఇక్కడ అధిక అర్హతలున్న విద్యాధికులైన గురువులుంటారు.”
“నిజమే! కానీ వాళ్ళు అసలు పాఠాలు చెప్పాలి కదా!” ఓ విలేఖరి అన్నాడు.
“ఎందుకు చెప్పరూ, నేర్చుకోవాలి అన్న తపన ఉంటే, బాగా చదివితే తప్పకుండా చెబుతారు. అయితే వారి విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. అది చెయ్యకుండా విద్యార్ధులుంటే, కొంతమంది అధ్యాపకులు, ప్రభుత్వ కాలేజీయే కదా చెప్పినా, మానినా అడిగేవాళ్ళెవరు అన్నట్టు ఉదాసీనంగా ఉండడమే, ప్రభుత్వ కాలేజీల మీద అలసత్వం రావడానికి కారణం.”
“మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పమ్మాయ్” ఇంకో అతను ముందుకు వస్తూ అడిగాడు.
“నేను కాకినాడ దగ్గరలో ఉన్న ఉప్పాడలోని నిరుపేద నేత కుటుంబపు అమ్మాయిని. చిన్నప్పటి నుండీ కష్టాలు, కన్నీళ్ళ మధ్య పెరిగినదాన్ని. ఆ పరిస్థితులు మారాలి అంటే చదువు ఒక్కటే మార్గం అని బలంగా నమ్మిన దాన్ని” స్పష్టంగా చెప్పింది.
“ఇప్పుడు నీకు వచ్చిన రాంక్‌కు ఏ ఐ.ఐ.టీ.లో అయినా, ఏ కోర్స్‌లో అంటే దానిలో సీట్ వచ్చేస్తుంది. నువ్వు కంప్యూటర్స్ చదివి, అమెరికా వెళ్ళిపోవడమేనా నీ లక్ష్యం.” చాలా మామూలుగా, జరిగేది అదే కదా అన్నట్టు అడిగాడు అతనే మళ్ళీ.
అతని ఉద్దేశం అర్థమైనట్టు నవ్వింది భద్ర.
“కంటి ముందే నేత కార్మికులు పడే అగచాట్లు, పూట గడవని పేదరికం చూస్తూ పెరిగిన నేను, ఆ పరిస్థితులను మార్చాలి అంటే ‘ఆ చదువులు చదవడం, అందులో వస్తున్న మార్పులనీ, కొత్తకొత్త సాంకేతికతలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని మన వృత్తిలో అమలు చేస్తే, మనం బ్రతికి, చేనేత వృత్తిని, దానిని నమ్ముకున్న వారినీ బ్రతికించవచ్చు’ అనే ఉద్దేశంతోనే నేను ఈ చదువుని ఎంచుకున్నది.
ఆ దిశగా పడిన నా తొలి అడిగే ఇప్పటి నా విజయం. ఎక్కడ చదివాం అన్నది కాదు ప్రశ్న. ఎంత పట్టుదలగా, శ్రద్దగా చదివాం అన్నదే విషయం. నేను స్వంతంగా చదువుకోవడం, తెలియనివి మా గురువులనడిగి తెలుసుకోవడమే నా ఈ విజయానికి కారణం.”
ఎటువంటి జంకు, గొంకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న కళ్ళతో ధృఢంగా చెప్పిన ఆ అమ్మాయి మాటలకు అక్కడున్నవారంతా పెద్దగా హర్షధ్వానాలు చేసారు.
కార్పొరేట్ కాలేజీల వాళ్ళు మాత్రం తమ మాట కాదన్నదన్న అక్కసుతో చురచురా చూస్తున్నారు.
అంతలో ఓ విలేఖరి అడిగాడు..
“మీకు వచ్చిన రాంక్‌కు అన్ని ఐ.ఐ.టీ. ల్లోనూ సీట్ గ్యారంటీ. మరి మీరు ఎక్కడ, ఏ గ్రూప్ చదవాలనుకుంటున్నారు?”
“నేను ఐ.ఐ.టి. డిల్లీలో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో చేరతాను.” స్థిరంగా చెప్పింది భద్ర.
“అదేం, కంప్యూటర్ ఇంజనీరింగ్ మంచిది కదా, దానికైతే చాలా పెద్ద పేకేజ్‌తో ఉద్యోగాలు వెంటనే వస్తాయి కదా! అసలు అది కూడా కాదు ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ యుగం కదా! అవయితే ఇంక కోట్లలోనే సంపాదన. మీకొచ్చిన రాంక్‌కి ఎందులోనైనా సీట్ వస్తుంది కదా!” కారణం చెప్పమన్నట్టు అడిగాడు మళ్ళీ అతనే.
“నిజమే! సంపాదనే నా ధ్యేయమైతే మీరన్నది నిజమే. కానీ, నాకు ఆ వృత్తిలో ఉన్న మెలకువలు బాగానే తెలుసు, అందుకే నేను అక్కడ చేరి, సెలవల్లో ప్రత్యేక అనుమతి తీసుకుని, అక్కడి దగ్గరలో ఉన్న వస్త్ర పరిశ్రమలో పనిచేస్తూ ఇటు నా చదువుకు అవసరం అయిన సొమ్ము సంపాదించుకునేందుకు, నాకున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకుందుకూ బాగుంటుంది అన్నదే నా ఆలోచన.
అలాగే ఇందులో కూడా సంపాదనకు బాగా అవకాశమున్న రంగమే. ఏ మనిషికైనా ముఖ్యంగా కావలసినవి మూడు అవసరాలు. కూడూ, గుడ్డా, నీడా.. అందులో రెండోదే యిప్పుడు నేను ఎంచుకున్నది.
ఈ రోజూ రేపూ, ఉందా, లేదా అన్నది పక్కన పెట్టి, దాని ఉద్దేశం దేహం కప్పుకోవడమే అయినా దానికోసం శక్తికి మించి ఖర్చుపెడుతున్నారు.
పక్కవాళ్ళో, ఎదురింటివాళ్ళో, తోటివాళ్ళో, సాటివాళ్ళో అలాంటి బట్టలు వేసుకున్నారు, యిలాంటి చీరలు కట్టుకున్నారంటూ పోటీపడి మరీ ఖర్చుపెడుతున్నారు. అందుకే అందులో అద్భుతాలు సృష్టిస్తే ఈ రంగంలో కూడా బాగా సంపాదించచ్చు. మీరు సంపాదన గురించి మాట్లాడారు కాబట్టి ఇదంతా చెప్పాను. కానీ నా ధ్యేయం అది మాత్రమే కాదు, ఎంత కష్టపడినా పూట గడవడం కష్టం అయిన నా వాళ్ళ కోసం, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నేను ఇది ఎంచుకున్నాను” స్పష్టంగా చెప్పిన భద్రను చూస్తూ మళ్ళీ హర్షధ్వానాలు మిన్నంటాయి.
“ఇప్పుడన్నీ ఇలాంటి కబుర్లే చెబుతారు. రేపటి రోజు యివన్నీ గాలికి కొట్టుకుపోతాయి” తేలిగ్గా తీసిపారేసాడో విలేఖరి.
“నావి గాలి మాటలు కావనీ, నిజాలేననీ మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. చూద్దాం రేపటి రోజు ఏం జరుగుతుందో, మీరూ, నేనూ కూడా వేచి చూద్దాం. నాలుగేళ్ళంటే ఎంతలో గడవాలి!” చిరునవ్వుతో సమాధానమిచ్చింది భద్ర.
భద్ర కన్నవారిని కలవడానికి ఆమెతో ఉప్పాడ వెళ్ళిన మీడియా వారికి, ప్రత్యక్షంగా అక్కడ వారి పరిస్థితి చూసి బాధ కలిగించింది.
ఒక పూరి గుడిశ. అందులోనే పాతకాలపు మగ్గం, తల్లి మగ్గం ముందు కూర్చుంటే, తండ్రి చీరలు నేయడానికి అవసరమైన వార్ఫ్‌ను నీళ్ళలో నానబెట్టి ఆరబెడుతున్నాడు.
పరీక్షా ఫలితాలు వచ్చేయని పొద్దుననగా ఇంట్లోంచి వెళ్ళిన కూతురు ఇంకా రాలేదని మాటిమాటికీ తమ గుడిశలోంచి కనబడే వీధి మొగలోకి చూస్తూ, మెల్లిగా అని తొక్కుతోంది భద్ర తల్లి మాలచ్చిమి.
“ఏటా తొక్కడం, అంత సుతారంగా తొక్కితే అయినట్టే. ఏటా సూపులు, పిల్లదాని కోసమా? వస్తాది ఏడకి పోతాది, పని కానీ, సురుగ్గా తొక్కు. ఇట్టా తొక్కితే నెలకు రెండు సీరలు కూడా అవ్వు” కసురుకున్నాడు సోమయ్య, దారాలను రంగు నీళ్ళలో ముంచి చేతులు దులుపుకుంటూ వస్తూ.
“ఏటో! నీరసంగా ఉందోరయ్యా, గుండెల్లో ఒకటే గాబరాగుంది. అవునూ పిల్లది ఇంకా రానేదు. ఓ తూరి సెంటర్ దాకా యెల్లి సూసిరామాదూ!” మెల్లిగా అంది.
“ఏం సెంటర్ దాకా వచ్చింది, ఇంటికి రాకుండా ఏడకి పోతదీ, సర్లే కాసేపు నే తొక్కుతా, లే.. లేచి వణ్ణం వొండు.” దగ్గరకు వస్తూ అన్నాడు సోమయ్య.
మాలచ్చిమి లేచింది. ఆ వెనుకగా ఉన్న ఒంటిరాట పాకలోకి వెళ్ళింది.
అంతలో వీధిలో కారు చప్పుడు. సోమయ్య అప్పటికే లేచి గుడిశలోనుంచి బయటకు వెడుతున్నాడు.
“అరే! ఏదో కారొచ్చింది ఏటిది? ఎవరైనా సీరలు మన కాడ నేయించుకుందుకు వచ్చుంటారా” నెమ్మదిగా అంటూ గబగబా తనూ బయటకొచ్చిన మాలచ్చిమి, కళ్ళు విశాలంగా అయ్యాయి.
కూతురు భద్ర కారులోనుంచి దిగుతోంది.
చిన్న సందులాంటి ఆ వీధిలో పెద్ద ఓడలా ఉందా కారు.
అసలు తమ వీధిలోకి ఎప్పుడూ కారులే రావు. ఎవరైనా వ్యాపారం కోసం వచ్చినా, వీధి చివరే దిగి నడుసుకుంటూ వస్తారు.
అలాంటిది, ఇప్పుడు కారు రాడమే కాదు, అందులోనుంచి కూతురు దిగడం చూసిన మాలచ్చిమికి మతి పోయింది.
పుచ్చపువ్వులా వెలిగిపోతున్న కూతురు ముఖం చూస్తూనే అర్థం అయిపోయింది, అది పరీక్ష పాస్ అయిపోయిందని. కానీ, ఆ కారులో రాడం ఏమిటో, కూడా ఎవరో మైక్ పట్టుకునీ, పుటోలు తీసేది పట్టుకుని దిగడం ఏటో అర్థం కాక గాబరా పడిపోయింది.
సోమయ్య, మాలచ్చిమి కారు దగ్గరకు వచ్చేసారు.
“అమ్మా! నేను, నేను.. నాకు నాకు పదో రాంక్ వచ్చిందమ్మా” అప్పటివరకూ ఎంతో పెద్దమనిషి తరహాగా ఉన్న భద్ర తల్లి, తండ్రుల్ని చూస్తూనే చిన్నపిల్ల అయిపోయింది.
తల్లిని గట్టిగా గావలించుకుని, బుగ్గన ముద్దు పెడుతూ అంది. మీడియా వాళ్ళకి ఆ దృశ్యం అపురూపంగా తోచింది, వెంటనే కేమరా క్లిక్ మంది.
“చత్! ఏటా సంబరం” వాళ్ళ ఎవరి ఎదటో కూతురు అలా ముద్దు పెట్టడంతో సిగ్గుపడిపోయి, బుగ్గ తుడుచుకుంటూ అంది.
“అమ్మా! మీ అమ్మాయికి దేశంలోనే పదో స్థానం వచ్చింది. మరి ఆ మాత్రం సంబరం ఉండద్దా! ఇదింకా తక్కువే” నవ్వుతూ తల్లీ, తండ్రి మధ్య ఉన్న భద్రను వాళ్ళతో కలిపి ఇంకో ఫోటో తీసాడు.
అప్పటికే విషయం తెలిసిపోయింది గామాలు, ఆ చిన్న ఊరులో ఉన్న అందరూ గబగబా అక్కడకి వచ్చేసారు.
ఆ వీధి మొగలో ఉండే మాష్టర్ వీవర్ దేశయ్య గబగబా వచ్చేసాడు చేటంత ముఖం చేసుకుని.
అతనే ఆ ఊళ్ళో చాలా మందికి సరుకు కొనిపెట్టి, పని ఇస్తూ ఉంటాడు.
“ఏటి భద్రమ్మా! ఫస్టున పాసైనావా, పత్రికలోల్లు ఎంబడే వచ్చేసారు?” నవ్వుతూ అడిగాడు ఆ పిల్లని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ.
“అవును బాబాయ్, చాలా మంచి రాంక్ వచ్చింది” అతని కాళ్ళకు దండం పెడుతూ అంది.
మీడియా అంతా ఆమె గురించీ, ఆమె స్థిర నిర్ణయం గురించీ, ఘన విజయం గురించీ ఎంతో గొప్పగా రాయడమే గాక, ప్రతి కులవృత్తి గురించి వ్రాసి, ‘యువత యిలా ఆలోచిస్తే దేశం అన్ని విధాలా ఎంతో అభివృద్ధిని సాధించడమే కాక నిరుద్యోగ సమస్య అనేదే ఉండదు’ అంటూ హోరెత్తించేసాయి.
***
పుట్టి బుద్దెరిగాకా ఇల్లు, కాలేజ్ తప్ప మరోటి తెలియని భద్రను అంత దూరం ఏకంగా ఢిల్లీ పంపడం ఏ మాత్రం ఇష్టం లేని మాలచ్చిమి, సోమయ్యలు కంటనీరు పెట్టుకున్నారు. వాళ్ళని ఓదారుస్తూ..
“దేశంలో ఏటేటా ఏ కొద్దిమందికో మాత్రమే దక్కే అదృష్టం మీ అమ్మాయి శ్రమా, పట్టుదలా, తెలివితేటలవలన దక్కాయి. ఇలా ఏడుస్తూ, బాధపడుతూ కాక సంతోషంగా ఆ అమ్మాయిని పంపండి. మీకేం భయం లేదు. అక్కడ మా అబ్బాయి మూర్తి బ్యాంకులో పని చేస్తున్నాడు. వాడే దగ్గరుండి మీ అమ్మాయిని కాలేజ్ లోనూ, హాస్టల్ లోనూ చేరుస్తాడు. అసలు నేనే తీసికెళ్ళి చేరుద్దును కానీ నా భార్యకు వచ్చే నెలలో గుండె ఆపరేషన్ ఉంది. వదిలేసి వెళ్లలేను. వాళ్ళ అమ్మను చూడడానికి నా కొడుకూ, కోడలూ పిల్లలతో వస్తారు. భద్రని వాళ్ళతో పంపుదాం.
నిజానికి కాలేజీలో చేరడానికి ఇంకా కొంచెం సమయం ఉన్నా, మళ్ళీ ఒక్కదాన్నీ అంతదూరం పంపడం దేనికీ, పైగా తనూ అక్కడ అన్నీ చూసి ఎలా మెలగాలో, ఎలా బ్రతకాలో నేర్చుకుంటుంది. మీరేమీ బెంగపడకండి, భద్ర బాగోగులు నావి. నా కన్నకూతురిలాంటి ఆ పిల్ల జీవితం బాగుపడుతుంది అంటే అంతకన్న కావలసినదేముందీ!” భద్రతో బాటు వచ్చిన కెమిస్ట్రీ లెక్చరర్ విశ్వేశ్వర్రావు గారు ముందుకొచ్చి భద్ర తల్లిదండ్రులిద్దరికీ నచ్చచెప్పాడు.
గత రెండేళ్ళుగా ఆయన గురించి అనునిత్యం తమ కూతురు ద్వారా వినే ఉన్న వాళ్ళు ఇంక ఏం మాట్లాడలేకపోయారు.
భద్ర ఆనందానికి అవధులు లేవు. మాష్టారు దగ్గరుండి ఆమె చేత కాలేజ్‌కి దరఖాస్తు చేయించారు.
తల్లీ, తండ్రీ డబ్బు లేక ‘చదువూ వద్దు, ఏం వద్దంటే’ అతనే వాళ్ళని ఒప్పించి భద్రను కాలేజ్‌లో చేర్చాడు.
ఆ రోజు నుంచీ భద్ర జీవితమే మారిపోయింది. చుట్టుపక్కల అందరూ ఆమెనెంతో అపురూపంగా చూసుకోవడమే కాదు తమ తమ పిల్లలకు ఆమెనే ఆదర్శంగా చూపించసాగారు, ఒక్క నామాలు తప్ప.
నామాలు కూడా దేశయ్యలానే మాష్టర్ వీవర్. కాకపోతే దేశయ్య పదిమందికీ అండగా ఉంటే, నామాలు జలగలాగా మంది రక్తం పీల్చుకుని తను ఎదిగే రకం.
అలాగే దేశయ్య మంచితనం నచ్చని కొంతమంది నామాలు వెనకచేరి అతనిని భట్రాజుల్లా పొగుడుతూ, నయానాభయానా అతని చేతికింద పనిచేయడానికి అక్కడున్న వాళ్ళకి చిన్నచిన్న మొత్తాలు వాళ్ళకి అవసరమైన సమయాల్లో ఎరవేసి, వాళ్ళని అతని చెప్పుచేతల్లో ఉండేలా చూసుకుంటాడు.
భద్ర తల్లీతండ్రీ కూడా దేశయ్య ఊళ్ళోలేని సమయంలో ప్రాణం మీదకొచ్చి అతని దగ్గర అప్పు చేసిన పాపానికి రాత్రనకా, పగలనకా పడ్డ తమ కష్టాన్ని అతనికి ధారబోసి అతను దయాధర్మంగా ఇచ్చే సొమ్ముతో కాలం నెట్టుకొస్తున్నారు.
ఆ సంగతి తెలిసిన దేశయ్య వాళ్ళకు డబ్బు సర్దుబాటు చేసి నామాలు అప్పు తీర్చమంటే, నామాలు పెద్ద యెత్తున కొట్లాటకు వచ్చాడు.
“ఏం! ఊళ్ళో వాళ్ళందరూ నీకిందే పని చేయాల్నా, నేనూ నీ అసుంటి మాష్టర్ వీవర్నే కదా! నా కింద మనుష్యులుండకూడదా!” అంటూ పెద్ద రాద్దాంతం చేయడంతో దేశయ్య ఏం చెయ్యలేక ఊరుకున్నాడు.
సాదా చీరలయితే ఏ వెయ్యో చేతిలో బెడతాడు. పట్టు చీరలయితే చీరకు మూడువేలు, నాలుగువేలు ఇస్తాడు. మళ్ళీ అందులో సగం బాకీ చెల్లుబాటుగా జమేసుకుంటాడు.
అలా అతని ఉచ్చులో చిక్కుకుని ఊపిరాడక గిలగిల్లాడే వాళ్ళలో భద్ర కుటుంబం కూడా ఒకటి అవ్వడం దురదృష్టకరం.
తన కాలి లింద చెప్పులా ఉండేటోళ్ళ బిడ్డ, అదీ ఆడబిడ్డ అంత పెద్ద చదువులు చదవడానికి పోతుంటే అతని కడుపుమంట అంతా ఇంతాగా లేదు.
రోజూ ఏదో సమయంలో వచ్చి భద్రకి వినబడేలాగా ఆమె తల్లితో..
“ఏంది మాలచ్చిమీ, ఒక్కగానొక్క ఆడబిడ్డని సదువుల పేరిట అంత దూరం, ఒంటరిగా అంపుతుండావ్, అసలికే రోజులు బాగాలేవ్. రోజూ పేపర్ల ఎన్ని సూడంలేదు, ఆడపిల్లలని కాలేజీలనే సెరిసి సంపేస్తున్నారు కదా, హాయిగా ఉన్న ఊళ్ళో చేతిలో ఉన్న విద్దెనొదిలి దూరపుకొండలు నునుపన్నట్టు పోడం సబబా! అదంటే సిన్నపిల్ల పెపంచం తెలక ఎగిరెరిపడతాంది, మీకైనా బుద్ధీ గానం ఉండొద్దూ!” అంటూ అసలే భయపడుతున్న వాళ్ళను ఇంకా భయపెట్టసాగాడు.
ఆ మాటలు పట్టుకుని మాలచ్చిమి.. “అమ్మా! నా మాటిను తల్లీ, సదువుకోవాలనుంటే సదూకో కానీ అంత దూరం వద్దు. ఇక్కడిక్కడే ఏదో కాలేజీల సదువుకో. కనీసం వారానికో, పదిరోజులకో మా కాడకి రానీకి ఉంటది. అక్కడెక్కడో దిల్లీ అంటే దూరాభారం, రైలు పయానమే రెండురోజులంట కదా! మా మాటినుకో!” అంటూ భద్రని బ్రతిమాలడం మొదలుపెట్టింది.
“అమ్మా! మన బ్రతుకులు బాగుపడడం ఇష్టంలేక ఆయనేదో అట్టా సెప్పి, మీ బుర్ర చెడగొడుతున్నాడు. అక్కడ ఉండేటివాళ్ళంతా బ్రతకడం లేదా! అయినా మంచీ, చెడూ అన్ని చోట్లా ఉంటాయి. ఇక్కడ మాత్రం అలాంటివి జరగడం లేదా? ఇది మన జీవితాలను మలుపు తిప్పే మహత్తర అవకాశం. ఎంత, కళ్ళు మూసుకుంటే నాలుగేళ్ళు, ఎంతలో తిరగాలి? కానీ అందులో చదివితే ఇక తిరుగేలేదు. చదువు పూర్తవుతూనే లక్షల్లో జీతమిచ్చే ఉద్యోగాలొస్తాయి. అదీకాకుంటే మనమే ఓ వ్యాపారం పెట్టుకోవచ్చు. దానికి బ్యాంకు బోలెడు ఋణాలిస్తున్నాయి. వాళ్ళూ వీళ్ళూ చెప్పిన మాట విని బుర్ర పాడుచేసుకోకు. అసలు ఆ నామాలు చెప్పే మాటలు అస్సలు వినకు. వానికి మనం బాగుపడిపోతామని అసూయ అంతే.” అంటూ తల్లికి ఎంతో ఓపికగా నచ్చచెప్పింది.
దేశయ్య దగ్గర కొంత తక్కువ ధరకి రంగు దారాలు తెచ్చుకుని తనకు డ్రెస్సులకు నేసుకుంది.
వాటిని తనే తన స్నేహితురాలింటికెళ్ళి కుట్టుకుంది. చక్కటి పనితనంతో మెరిసిపోతున్న అవి ఏ బ్రాండెడ్ దుస్తులకూ తీసిపోనట్టుగా ఉన్నాయి.
ఆ క్షణంలోనే భద్ర మనసులో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది. తను అలా కనుక చేయగలిగితే తన చదువుకీ సార్థకత, తన వారి బ్రతుకులకూ భద్రత.
ఆ మర్నాడే మళ్ళీ దేశయ్య నుంచి ఇంకా కొంత సరుకు అరువు మీద తీసుకుని ఉన్న నెల్లాళ్ళలో నిముషం వృథా కాకుండా శ్రమించి సుమారు పది వరకూ డ్రెసెస్‌కి బట్ట నేసి, రకరకాల మోడల్స్‌లో కుట్టింది. వాటి విలువ బయట మార్కెట్‌లో ఎంతా అన్నది తిరిగి తెలుసుకుని, ఆ ధరకే అవన్నీ తన స్నేహితుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంది.
దేశయ్య బాబాయ్‌కి అరువు తీర్చగా ఇంకా తన దగ్గర తను ఢిల్లీ ప్రయాణానికి సరిపడా ఉంది.
ఆ రకంగా తనలో ఉన్న ప్రతిభకు మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవడం మొదలయింది.
చూస్తుండగా రోజులు ఇట్టే గడచిపోయి ఆమెకు ఢిల్లీలో అడ్మిషన్ రావడం, మాష్టారి కొడుకు కుటుంబంతో ఢిల్లీ బయలుదేరడం జరిగిపోయింది.
మొట్టమొదటి సారి కన్నవారికి దూరంగా వెడుతున్న భద్ర మనసులో ఎంతటి కలవరం, కల్లోలం ఉన్నా ప్రయత్నపూర్వకంగా అణుచుకుని, తనే తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వారితో బయలుదేరింది.
వాళ్ళు తమతో బాటు ఏసీ టికెట్ తీస్తామన్నా, వద్దని తనదగ్గర ఉన్న డబ్బుతో మామూలు టికెట్ తీసుకున్న ఆమె ఆత్మాభిమానానికి వాళ్ళు ఎంతో ముచ్చటపడ్డారు.
మాష్టారి కొడుకు మూర్తి తండ్రికి మాట ఇచ్చాడు, ఆమెను స్వంత చెల్లెలుగా భావించి దగ్గరుండి ఆమె మంచిచెడ్డలు చూస్తాననీ, మీకేమాటా రానివ్వననీ.
ఆ రోజు ఆమెను రైలు ఎక్కించడానికి అర్ధరాత్రి అనైనా చూడకుండా సామర్లకోట స్టేషన్‌కి దాదాపుగా ఊళ్ళో ఉన్న కుర్రకారంతా వచ్చారు.
ఆమె వాళ్ళతో ఒకటే మాట చెప్పింది. ‘మన బ్రతుకులు మారాలంటే, బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం. కనుక అల్లరిచిల్లరిగా తిరగకుండా మీరంతా బాగా చదువుకోండి, అలాగే మీ కన్నవాళ్ళకు సహాయంగా ఉంటూ పని నేర్చుకోండి. విద్య చేతిలో ఉంటే ఆ విలువే వేరు’ అంటూ తను నమ్మే మాట, ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్పింది.
భద్ర జీవితంలో కీలకమైన మలుపు తిరిగే ప్రయాణం అప్పుడే మొదలైంది.
(ఇంకా ఉంది)
మీనాక్షీ శ్రీనివాస్ గారి స్వస్థలం కాకినాడ. జననీ, జనకులు – కీ.శే శ్రీమతి మహీధర వేంకట దుర్గాంబ, కీ.శే శ్రీ మహీధర వేంకటరామ దీక్షితులు.
జీవితభాగస్వామి శ్రీయుతులు శ్రీనివాస్. ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనుమరాలు, మనుమడు.
ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) విశ్రాంత అధికారిణి. విశాఖ రేడియో కేంద్రంలో, డ్రామా ఆర్టిస్ట్‌గా ఎంపికయి, కొన్నేళ్ళపాటు కొనసాగి, బదిలీల కారణంగా విరమించుకున్నారు. ఏడు రేడియో నాటికలు, 330 పైగా కథలు, అన్ని పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్నింటికి బహుమతులు వచ్చాయి. 22 కథల సంపుటి ‘నిశీథిలో నక్షత్రం’ అక్టోబర్ 2016లో వెలువడింది. 19 నవలలు చతుర, ఆంధ్రభూమి, స్వాతి మొదలగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీటిలో ఐదు అపరాధ పరిశోధక నవలలు. బహుమతి పొందిన ‘భద్ర’ వీరి తొలి మినీ నవల (20).
రెండవ సంపుటి తపస్వీ మనోహరం కథల పోటీలో విజేతగా, బహుమతి కథలు ఏడింటితో బాటు వీరి కథలు మరో పద్దెనిమిది కలిపి ‘బహుమతి’ 2024 నవంబర్ లో ప్రచురించడం జరిగింది.
తపస్వీ మనోహరం సంస్థ వీరి అపరాధ పరిశోధక నవల ‘రామాపురం బంగ్లా’ డిసెంబర్ 2025 లో ప్రచురించింది.
పద్యరచనలో ఓనమాలు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు, శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారి వద్ద దిద్దారు.
03 ఏప్రిల్ 2024 న లేఖినీ సంస్థవారు, డాక్టర్ వాసా ప్రభావతి గారి పేరిట, వారి అమ్మాయి జఠావల్లభుల మీనాక్షిగారిచే పొందిన మాతృవందన పురస్కారం అందుకోవడం మరచిపోలేని అనుభూతి.
