Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భద్ర-2

[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[భద్ర వీవర్స్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. బీద కుటుంబం. చదువులో రాణించిన భద్ర జెయియి పరీక్షలో పదో స్థానం సాధించి, సంచలనం సృష్టిస్తుంది. తనకు మార్గదర్శకంగా ఉండి అన్ని విధాల సాయం చేసిన కెమిస్ట్రీ లెక్చరర్ విశ్వేశ్వర్రావు గారి అనేక కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. పత్రికా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చాలా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెబుతుంది. ఏ ఐఐటీలో చదవాలనుకుంటున్నావ్ అని అడిగిన ఓ ప్రశ్నకు ఢిల్లీ ఐఐటీలో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్‌లో చేరతానని చెప్పి, అందుకు కారణాన్ని వివరిస్తుంది. విలేఖరులు కొందరు ఆమెతో పాటు ఆమె ఇంటి వరకు వచ్చి ఆమె తల్లిదండ్రులు మాలచ్చిమి, సోమయ్య లతో మాట్లాడుతారు. మాష్టర్ వీవర్ దేశయ్య వచ్చి భద్రని అభినందిస్తాడు. భద్రని పై చదువుల కోసం ఢిల్లీ పంపడానికి అమ్మానాన్నలు సంశయిస్తుంటే, విశ్వేశ్వరరావు వాళ్ళకి నచ్చజెప్పి, ఢిల్లీలోనే ఉండే తన కొడుకు మూర్తి భద్రని కాలేజీ చేర్చి వస్తాడని, జాగ్రత్తగా చూసుకుంటానని ఒప్పిస్తారు. మరో మాష్టర్ వీవర్ నామాలుకి ఇదంతా అసూయ కలిగిస్తుంది. రోజూ వచ్చి భద్ర తల్లికి భయం నూరిపోస్తాడు. భద్ర తల్లికి ధైర్యం చెప్పి, ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. మూర్తి భద్రని జాగ్రత్తగా చూసుకుంటానని తండ్రికి మాట ఇచ్చి ఢిల్లీకి ప్రయాణం కట్టిస్తాడు. వెళ్ళే ముందు తమ ప్రాంతంలోని యువత అందరికీ మంచిమాటలు చెప్పి బయల్దేరుతుంది భద్ర. ఇక చదవండి.]

దాదాపుగా ఒక పగలు, ఒక రాత్రి ప్రయాణం చేసి మూడోనాడు తెల్లవారే సరికి ఢిల్లీ చేరిన ఆమె రైలు దిగి వాళ్ళతో బాటుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మరోసారి మనసులోనే భీషణ ప్రతిజ్ఞ చేసుకుంది.

ఎన్ని కష్టాలెదురైనా సరే తట్టుకుని తన చదువు పూర్తి చేసుకుని, తను అనుకున్న గమ్యానికి చేరాలి అని.

మూర్తి యిల్లు చూసిన ఆమెకు నగరపు బ్రతుకులు ఎలా ఉంటాయో అర్థమైపోయింది.

ఒక గది, చిన్న వంటిల్లు అందులోనే భార్యా భర్తా, ఇద్దరు పిల్లలూ ఉండాలి. తన కాలేజ్ తెరవడానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది అంతవరకూ వాళ్ళతో ఉంటే వాళ్ళకు ఎంత ఇబ్బందో అర్థమైనా తను యిప్పుడు ఏమీ చెయ్యలేదు.

సాధ్యమైనంత వరకూ మూర్తి భార్యకు పనుల్లో సహాయపడుతూ, తను వచ్చేటప్పుడు నేసి తెచ్చిన బట్టతో రకరకాల దుస్తులు కుడుతూ క్షణం వృథా చేయకుండా ఉన్న ఆమెను చూస్తే వాళ్ళకు చాలా ముచ్చటగా అనిపించింది.

సాధారణంగా ఆ వయసు పిల్లలకు ఏదైనా కొత్త చోటుకు వెడితే అన్నీ తిరిగి చూడాలని, సరదాగా గడపాలని ఉంటుంది. కానీ ఆ పిల్లకు ఆ ధ్యాసే లేదు. ఎంత సేపు పని పని పని.

వచ్చేటప్పుడు తనకు అంత మంచి రాంక్ వచ్చినందుకు కాలేజ్‌లో బహుమతిగా వచ్చిన డబ్బులతో ఒక ఫోన్ కొనుక్కున్న ఆమె అందులో కూడా తనకు పనికి వచ్చే అంశాలను మాత్రమే చూస్తూ, చదువుతూ అప్పటివరకూ తనకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి విషయపరిజ్ఞానాన్ని కూడా జోడించుకుంటూ ప్రతి నిముషం అభివృద్ధి దిశగా వెడుతున్న ఆమెను చూసి వాళ్ళు సంతోషపడ్డారు

ఒక రోజు మూర్తే తన కుటుంబంతో బాటు ఆమెనూ బయలుదేరదీసి ధిల్లీ దర్శన్ బస్‌లో సాయంత్రం వరకూ కొన్ని ముఖ్యమైన సందర్శనా స్థలాలు చూపించాడు.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ చూసిన అన్ని స్థలాలనూ విప్పారిన కళ్ళతో చూస్తూ, తను చూసిన వాటిని ఎప్పటికప్పుడు తనతో తెచ్చుకున్న చిన్న స్క్రిబ్లింగ్ పాడ్‌లో వ్రాసుకుంటున్న ఆమెను చూసి మురిసిపోయారు మూర్తి దంపతులు.

తమ పిల్లలిద్దరినీ రోజూ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ చేత హోం వర్క్స్ చేయించడం, చదువు చెప్పడం చేసిన ఆమె అంటే ఆ యింటిల్లిపాదికీ ఎంతో అభిమానం కలిగింది.

ఇంక నాలుగురోజుల్లో కాలేజ్‌లో చేరడం అనగా ఆ పిల్లను తీసికెళ్ళి కాలేజ్, హాస్టల్ అన్నీ చూసి వచ్చి, ఆమెకు హాస్టల్ అడ్మిషన్ కూడా చేయించాడు మూర్తి.

విశ్వేశ్వర్రావు గారు దగ్గరుండి ఆమెకు తన తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి సంబంధించిన సర్టిఫికేట్ తీయడంతో అది లక్ష రూపాయల కంటే తక్కువ కావడంతో ఆమెకు ట్యూషన్ ఫీస్ మొత్తం కట్టక్కరలేకుండా చేర్చుకోవడంతో పెద్ద భారం తీరిపోయింది.

ఇంక హాస్టల్ ఫీస్ కూడా సెమిస్టర్‌కి ఎనిమిదివేలు కావడం, విశ్వేశ్వర్రావ్ గారు అదంతా తను చూసుకుంటానని చెప్పడంతో భద్రకు చదువుకోవడానికి ఏ ఇబ్బందులూ కలగలేదు.

ఇంటికి కూడా ఆరునెలల కోసారి స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే అతి తక్కువ ఖర్చుతో యిల్లు చేరచ్చు. అయినా కూడా భద్ర మొదటి రెండేళ్ళ పాటు వెళ్ళకూడదు అనే నిశ్చయించుకుంది.

ఆ రోజు కాలేజ్ మొదటి రోజు. మనసులో కొంచెం భయంభయంగా ఉన్నా ఎటువంటి టీజింగ్ ఉన్నా కూడా తను ధైర్యంగా ఉండాలి అని మనసుకు పదేపదే చెబుతూ కాలేజ్‌లో అడుగుపెట్టిందామె.

తెలుపు నీలం కలనేత చూడిదార్‌లో, నిడుపాటి పెద్ద జడ, సాదాసీదా చెప్పులతో, చేతిలో రెండు పుస్తకాలతో ఠీవిగా వస్తున్న ఆమెను అక్కడున్న చాలా మంది విచిత్రంగా చూడసాగారు.

అక్కడ చాలామంది మంచి ఖరీదైన బట్టలతో, చాలా ఫ్యాషనబుల్‌గా, ఈ ప్రపంచంలోని ఆనందమంతా తమదే అన్నట్టుగా ఉన్నారు.

అన్ని కాలేజెస్‌లో ఉన్నట్టే రాగింగ్ చెయ్యకూడదు అన్న నియమం ఉన్నా, దేనిదారి దానిదే అన్నట్టు సీనియర్స్ కొత్తగా వస్తున్న జూనియర్స్‌ని రాగ్ చెయ్యసాగారు.

చూడగానే పల్లెటూరి పిల్ల అని తెలిసేలా ఉన్న భద్ర చుట్టూ ఓ పదిమంది సీనియర్స్ ఆడామగా చేరిపోయారు.

సంభాషణ వాళ్ళు హిందీలో అడుగుతుంటే, భద్ర చక్కని ఇంగ్లీష్‌లో జవాబులిస్తోంది.

“ఏయ్ అమ్మాయ్, ఏ ఊరు మీది?” ఒక అబ్బాయి భద్రని నఖశిఖపర్యంతం చూస్తూ అడిగాడు.

“మాది ఆంధ్రాలోని ఉప్పాడ గ్రామం సర్” వినయంగా చెప్పింది.

“ఓ! సీనియర్స్‌ని సర్ అనాలని బాగానే తెలుసుకున్నావే, మదరాసీ పల్లెటూరి పిల్లా” వెక్కిరింపుగా అన్నాడు.

“నేను మదరాసీ కాదు, ఆంధ్రావాలా” ధైర్యంగా చెప్పింది.

ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళను చాలా చిన్నచూపు చూస్తారని విని ఉంది. అందుకే మనసులో భయంగా ఉన్నా ధైర్యం తెచ్చుకుని జవాబులివ్వసాగింది.

“ఏయ్ అమ్మాయ్! నీ డ్రెస్ హండ్‌లూమ్ కదా ఎక్కడ కొన్నావ్?” అడిగిందో అమ్మాయి. ఆ పిల్ల షార్ట్, టీ షర్ట్ తో ఉంది, జుట్టేమో బాబ్ కట్.

“నేనే స్వయంగా నేసి కుట్టుకున్నా!” గర్వంగా చెప్పింది.

“అబ్బా ఛా! నమ్మేసాంలే కానీ ఇంకోమాట చెప్పు..” అంటూ నవ్వారంతా.

“నిజమే, నేను వీవర్స్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని. మా తల్లితండ్రులిద్దరూ నేతపని చేస్తారు, అందుకే నాకూ చిన్నప్పటి నుంచీ వచ్చు..”

ఆ మాటలకు వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఉన్నట్టుండి హేళనగా నవ్వారు. అక్కడ ఏ కొద్దిమందో తప్ప అంతా బడాబాబుల పిల్లలే. పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు. వాళ్ళకు పేదరికం అన్నా పల్లెటూరివాళ్ళన్నా ఎగతాళి, చిన్నచూపు.

“ఓ! కోటాలో వచ్చావా?” అంతా మళ్ళీ గొల్లున నవ్వారు.

వాళ్ళ నవ్వు భద్ర గుండెను భగ్గున మండించింది. యిలాంటి హేళన అక్కడ తమవాళ్ళ మధ్యనా చూసింది. తన క్లాస్మేట్స్ కూడా తనను అడ్రెస్ చెయ్యాలంటే ఆ ‘సాలోళ్ళ పిల్ల’ అనడం తనకు తెలుసు. కానీ ఎప్పుడూ ఇంతలా బాధ అనిపించలేదు. బహుశా వాళ్ళంతా మనవాళ్ళే కదా, అంటే అన్నారులే అనేమో. కానీ ఈరోజు ఇంతటి అభివృద్ధి చెందిన దేశ రాజధానిలో, ప్రతిష్టాత్మకమైన ఇలాంటి విద్యాలయంలో అలాంటి వివక్ష చూపడం సహించలేకపోయింది.

“నేను ప్రవేశపరీక్షలో మొత్తం దేశంలోనే పదో స్థానంలో వచ్చాను. నాకు కోటా అక్కరలేదు..” ఆత్మవిశ్వాసం నిండిన స్వరంతో అంటూ అక్కడ నుంచి హుందాగా కదిలిపోయింది.

నవ్వుతున్న వాళ్ళ నోళ్ళు ఒక్కసారిగా ఠక్కున మూతపడ్డాయి.

అపనమ్మకంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

అక్కడ రాగింగ్ గాంగ్‌కి నాయకత్వం వహిస్తున్న సుహాగ్ ఒకసారి స్టైల్‌గా భుజాలు ఎగరేసి “ఫ్రెండ్స్, అదేమిటో యిప్పుడే తేలుస్తా ఉండండి” అంటూ జె.యి.యి. ఫలితాల వెబ్సైట్ ఓపెన్ చేసాడు తన లాప్‌టాప్‌లో..

“ఆ పిల్ల పేరు ఏం చెప్పిందీ?” అడిగాడు తన ఫ్రెండ్స్‌ని.

“భద్ర” సుహాగ్ పక్కనే ఎప్పుడూ చెంచాలా తిరిగే రాగ చెప్పింది.

సుహాగ్ కళ్ళు ఒక్కసారి అందులో ఉన్న రాంక్స్‌ని వెతికాయి.. “భద్ర పదో రాంక్, నిజమే, చాలా తెలివైన పిల్లలా ఉంది” అంటూ విసురుగా లాప్‌టాప్ మూసేసాడు.

“పల్లెటూరి పేద పిల్ల కదా, పుస్తకాల పురుగులా అన్నీ బట్టీ పట్టేసి, రాంక్ కొట్టేసి ఉంటుంది.. అందులో పెద్ద ఆశ్చర్యపోయేదేముందీ” నిర్లక్ష్యంగా అంది రాగ.

కొంతమంది ఎదుటివాళ్ళలోని గొప్పతనాన్ని, మంచితనాన్ని ఒప్పుకోలేరు. రాగ కూడా అదే జాతికి చెందినది.

ఐ.ఐ.టి.లలో మానేజ్మెంట్ కోటా, మంత్రుల కోటా, సిఫారసులూ లేకపోయినా అనధికారికంగా ఒకటో, రెండో లకాయిలుకాయిలుంటాయి. ఆ రకంగానే అందులో చేరిన రాగకు భద్ర తన మెరిట్‌తో అక్కడిదాకా వచ్చింది అంటే ఓర్చుకోలేకపోయింది. కడుపు భగ్గున మండింది.

మరీ ముఖ్యంగా సుహాగ్ కూడా భద్ర తెలివైనది అనడం అస్సలు సహించలేకపోయింది.

ఆ రోజే మనసులో నిర్ణయించుకుంది, ఎలాగైనా భద్ర తనంతట తనే చదువు వదిలేసి పారిపోయేలా చెయ్యాలని.

ప్రతీచోటా కొంతమంది చెడ్డవాళ్ళున్నట్టే, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండడం సహజం.

అలాగే అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి ఈ స్థాయికి చేరుకున్న భద్ర అంటే యిష్టపడిన వాళ్ళు, గౌరవం కలిగినవాళ్ళూ కూడా అక్కడ ఉండడం నిజంగా భద్ర అదృష్టమనే చెప్పాలి.

మొత్తానికి భద్ర కాలేజీలో చేరిన మొదటి రోజే అందరి దృష్టిలో పడింది.

భద్ర రూమ్‌మేట్‌గా ఆమె కోరిక మేరకు తెలంగాణా మారుమూలల నుంచి వచ్చిన నీలను వేసారు.

నీల ట్రైబల్ కోటాలో వచ్చిన అమ్మాయి. అయినా పరిస్థితులకు ఎదురొడ్డి కష్టపడి చదివి ఇక్కడి దాకా వచ్చింది. ఆమెకు వచ్చిన రాంక్‌కు ఇందులో సీట్ రావడంతో వచ్చిందే కానీ ఆమెకు ప్రత్యేకంగా ఇదే చదవాలి అన్నదేం లేదు. ‘మంచిగా చదవాలి, మంచి ప్యాకేజ్‌తో ఉద్యోగం పొందాలి’ అన్నదే ఆమె లక్ష్యం.

నెమ్మదస్తురాలు, మంచిపిల్ల కావడం, సాటి తెలుగు అమ్మాయి కావడంతో భద్ర తనకు తెలియకుండానే ఆమెకు కేర్‌టేకర్‌గా మారిపోయింది.

క్లాసులో తెలియనివి, ఆమెకు అర్థం కానివి చెప్పడం, అనుక్షణం ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం చూసిన తోటి విద్యార్థులు హేళనగా నవ్వుకున్నా భద్ర పట్టించుకునేది కాదు.

రాగ మాత్రం భద్ర ఎదురైతే చాలు ఆమె మీద చాలా చీప్ జోక్స్ వేయడం, అవమానకరంగా మాట్లాడడం చేస్తూ ఉండేది.

‘బురదలో రాళ్ళు వేస్తే, మీద చిమ్ముతుంది’ అన్నట్టే అలాంటివాళ్ళ జోలికి వెళ్ళడం కూడా అన్నట్టు భద్ర మౌనంగా ఉండిపోయేది.

అక్కడున్న అందరిలోకీ అతి సామాన్యంగా, సాదాసీదాగా ఉండే భద్ర చదువులో మాత్రం ముందుండడంతో అక్కడి ఫేకల్టీ అందరికీ ప్రీతిపాత్రురాలవడం కూడా చాలామందికి కన్నెర్రగా ఉండేది. భద్ర ఉంటే క్లాసులకు హాజరవడం, లేని సమయంలో ఎక్కువగా లైబ్రరీలోనే గడిపేది.

వచ్చిన మూడు నాలుగు నెలలకే హిందీ కూడా ధారాళంగా మాట్లాడడం వచ్చేసిందామెకు.

స్వతహాగా ఏకసంథాగ్రాహి, దానికి తోడు ఏదైనా అనుకుంటే సాధించాలన్న పట్టుదలా. గ్రాడ్యుయేషన్ కాలేజీలో చాలామటుకు స్ట్రిక్ట్‌గా ఉండేవి రూల్స్. అక్కడ పిల్లలు సిగరెట్స్, కులాసాగా జాలీగా గడపడంలాంటివి ఒప్పుకునేవారు కారు. దానితో కొంతమంది ఆడా, మగా కూడా చెట్టాపట్టాలేసుకుని పక్కనే ఉన్న పీజీ కేంపస్‌లకు వెళ్ళి స్నేహితులతో కలిసి సిగరెట్స్, డ్రగ్స్ లాంటివి ఎంజాయ్ చేసేవారు.

కానీ భద్ర, నీల ఏ రోజూ అలాంటివాటి జోలికి వెళ్ళేవారు కారు.

మొదటి సెమిస్టర్ పరీక్షలు వచ్చేసాయి.

భద్ర అహోరాత్రులూ చదివి పరీక్షలకు సిద్ధం అవడం చూసిన రాగకు, ఆమె స్నేహితులకు కడుపు మండిపోయింది.

ఆ సెమిస్టర్‌లో భద్రకు ఎలాగైనా ఒక బేక్‌లాగ్ ఉంచేలా చేయాలనుకున్న వాళ్ళు పరీక్ష ముందు టెన్షన్‌తో ఉన్న భద్ర ముఖం కడుక్కుందుకు వాష్ రూంకి వెళ్ళగానే బయట నుంచి తలుపు లాక్ చేసి ఏం ఎరుగనట్టే పరీక్ష హాలుకు వెళ్ళిపోయారు.

బయటకు వద్దామని తలుపు తీయబోయిన భద్రకు అది లాక్ అయి ఉండడం చూసి అరచి కేకలు వేసింది. పది నిముషాలు గడచిపోయాయి. పరీక్ష మొదలైపోయి ఉంటుందన్న ఆలోచన వచ్చిన భద్రకు పుట్టెడు దుఃఖం వచ్చేసింది.

ఎంతో కష్టపడి చదివిన పరీక్ష వ్రాయడమే లేకపోతే ఎలా అన్న ఆలోచన ఆమెను పిచ్చిదాన్ని చేసేసింది.

అంతే పూనకం వచ్చినట్టు తలుపులు బడబడా బాదేసింది.

ఆ పక్కనే ఉన్న జంట్స్ టాయ్‌లెట్‌కి వెళ్ళిన సీనియర్ సాగర్‌కు లేడీస్ టాయ్‌లెట్ నుంచి ఎవరివో కేకలు వినబడి గబగబా వచ్చి తలుపు తీసాడు.

ఏడుస్తూ ఒక్క పరుగున బయటకు వచ్చిన భద్రను చూస్తూనే ఆశ్చర్యపోయాడు.

అంత టెన్షన్‌లో కూడా భద్ర అతనికి థాంక్స్ చెప్పి పరుగుపరుగున పరీక్ష హాల్‌కి వెళ్ళింది. అప్పటికే పేపర్స్ యివ్వడం అయిపోయి అంతా వ్రాస్తున్నారు.

పావుగంట ఆలస్యంగా వచ్చిన ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, ఏదో అడగబోయిన ఇన్విజిలేటర్‌ని..

“సార్! ప్లీజ్ ఆమెను రానివ్వండి. ఎవరో ఆమెను కావాలని వాష్ రూంలో పెట్టి లాక్ చేయడం వలనే ఆమెకు ఆలస్యం అయింది” అంటూ ఆయనకు చెప్పాడు, ఆమె వెనుకే వచ్చిన సాగర్.

సాగర్ కోపంగా చూసాడు అక్కడే మొదటి బెంచ్‌లో కూర్చుని పరీక్ష వ్రాస్తూ, ఆశ్చర్యంగా భద్రను చూస్తున్న రాగను.

అతని చూపులకు గతుక్కుమన్న రాగకు, తాము గడియ పెట్టడం అతను చూసాడేమో అనిపించి గతుక్కుమంది.

భద్ర మాత్రం ఇన్విజిలేటర్ ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని, జవాబులకోసం ఇచ్చే పత్రాల్ని తీసుకుని తనకు కేటాయించిన సీట్‌లో కూర్చుని పరీక్ష వ్రాయడంలో నిమగ్నురాలైపోయింది.

అసలే పావుగంట సమయం వృథా అయిపోయిందన్న బాధతో వేగంగా వ్రాస్తున్న ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు వరండాలో కిటికీ పక్కగా నిలబడ్డ సాగర్.

‘ఎన్నో కష్టాలకోర్చి ఇక్కడిదాకా వచ్చిన ఆమెకు ఇక్కడ కూడా రాగ రూపంలో కష్టాలు తప్పలేదు’ అనుకున్న సాగర్ ఆలోచనలో పడ్డాడు.

ఎప్పుడు చూసినా స్నేహితులు, సరదాలూ అంటూ తిరిగే రాగకు మొదటి ఏడాది మొదటి సెమిస్టర్లోనూ, రెండో సెమిస్టర్ లోనూ కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయాయి.

ఎలాగో అదృష్టం కలిసి వచ్చి అలాంటి విద్యాలయంలో చేరింది కానీ ఆమెకు అసలు చదువు మీద శ్రద్ధ లేదు, జీవితానికో లక్ష్యమూ లేదు.

తెలివైనదే అయినా ఆ తెలివి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోడానికి వాడుకోవడం తెలియని పొగరుబోతు. తల్లీతండ్రీ ఎక్కడో మహారాష్ట్రలో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి, అడిగినంత డబ్బు పంపిస్తుండడంతో జీవితాన్ని అనుభవించడమే లక్ష్యంగా చేరిందక్కడ.

లెక్చరర్స్ మొదట్లో చెప్పి చూసారు, ఆ తరువాత పట్టించుకోవడం మానేసారు.

సుహాగ్ కూడా మహారాష్ట్రకు చెందినవాడే, అల్లరిచిల్లరిగా కనిపించినా చదువులో బాగానే ఉంటాడు. అతనికి రోజుకో ఆడపిల్లతో తిరగడం అంటే సరదా. రాగకు అలాంటి సుహాగ్‌తో తిరగడం సరదా.

సాగర్ కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ఉన్నాడు.

సుహాగ్, రాగ టెక్స్‌టైల్స్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్ధులు.

వాళ్ళ దృష్టి భద్ర మీద ఉందనీ, ఎలాగైనా ఆమె చదువు పాడుచేసి పంపేసే ఆలోచనలో ఉన్నారనీ అర్థమైన సాగర్, సాధ్యమైనంత వరకూ భద్రకు నీడలా ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ సంఘటన జరిగినప్పటి నుంచీ.

డిపార్ట్మెంట్ లెక్చరెర్స్ అందరికీ భద్ర ఫేవరెట్ శిష్యురాలు అయిపోయింది. ముఖ్యంగా ప్రాక్టికల్స్ లోనూ, లాబ్స్ లోనూ ఆమె చూపించే నైపుణ్యం, నేర్పరితనం, వేగం వాళ్ళను ఆకట్టుకుంది.

మరీ ముఖ్యంగా నూలు వడకడం, నేయడం, అలాగే జనపనారతో వస్త్రాలు, రంగుల కలయిక, వాటిని వస్త్రాలకు అద్దడం, యిలా ప్రతి పనిలోనూ ఎంతో చురుకుగా ఉండే ఆమె అంటే సహజంగానే ప్రతి లెక్చరర్‌కీ అభిమానం ఏర్పడింది. తను కూడా కొత్తకొత్త విషయాలను అడిగి తెలుసుకోవడం, ముఖ్యంగా తను చేసే పనిలో సాంకేతికతనుపయోగించి దాని నాణ్యత, వేగవంతంగా చేయడం మీద శ్రద్ధ పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతోంది.

ఆమె ప్రతిభను చూసిన అధ్యాపకులు ఆమెను డిపార్ట్మెంటల్ స్పెషలైజేషన్ చేయమని ప్రొత్సహించారు. ఏం చేయాలో, ఎలా చేయాలో చెప్పారు.

భద్ర దాన్ని ఒక అవకాశంగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో అది తీసుకుని కాలేజ్ సమయం తరువాత కూడా రోజుకు ఏడెనిమిది గంటలు అదనంగా కష్టపడుతూ అక్కడ కూడా మొదటిస్థానంలో ఉండే ప్రయత్నం చేయసాగింది.

చూస్తూండగా మొదటి సెమిస్టర్ పరీక్షలు అయిపోయాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version