Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భద్ర-3

[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[మూర్తి కుటుంబంతో ఢిల్లీ చేరిన భద్ర, కాలేజీ తెరిచే వరకూ వాళ్ళింట్లోనే ఉంటుంది. ఇంటి పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ, వాళ్ళ పిల్లలని చదివిస్తుంది. మొదటి రోజు కాలేజికి వెడుతుంది. ఊహించినట్టుగానే సీనియర్లు రాగింగ్ చేస్తారు. భద్ర డ్రెస్ చూసి, ఆమెని బీదింటి పిల్లలా హేళన చేస్తారు. కోటా లో సీటు సంపాదించి ఉంటావ్ అని అంటే, తాను ర్యాంకర్‌ని చెప్పి వెళ్ళిపోతుంది. సుహాగ్ అనే కుర్రాడు తన ల్యాప్‌టాప్‌లో రిజల్ట్స్ చెక్ చేసి భద్ర చెప్పినది కరక్టేనని నిర్ధారిస్తాడు. సుహాగ్ వెనువెంటనే ఉండే రాగ అనే అమ్మాయికి అసూయ కలుగుతుంది. భద్ర రూమ్‌మేట్‌గా తెలంగాణ లోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నీల అనే అమ్మాయిని వేస్తారు. రాగ ఎంత హేళన చేస్తున్నా, నీల, భద్ర పట్టించుకోరు. చదువే కర్తవ్యం అన్నట్టుగా మసలుకుంటారు. వెళ్ళిన మూడు నాలుగు నెలలకే హిందీ ధారాళంగా మాట్లాడడం నేర్చుకుంటుంది భద్ర. లెక్చరర్స్‌ని ఆకట్టుకుని ప్రాక్టికల్‌గా అన్ని విషయలూ నేర్చుకుంటుంది. వారి అభిమానం పొందుతుంది. మొదటి సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయి. భద్రని ఇబ్బంది పెట్టాలని, ఆమె వాష్ రూమ్ లో ఉన్నప్పుడు బయట నుండి గడియ పెట్టి వెళ్ళిపోతుంది రాగ. చాలా సేపు తలుపు బాదిన తర్వాత సాగర్ అనే సీనియర్ అటువచ్చి, తలుపు తీస్తాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి, పావుగంట ఆలస్యంగా పరీక్ష జరిగే హాల్‌కి వెళ్తుంది. ఎగ్జామినర్ లోపలికి ఎలో చేయకపోతే, అక్కడికి వచ్చిన సాగర్ జరిగినది చెప్పి, ఎలో చేయమంటాడు. మొత్తానికి మొదటి సెమిస్టర్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేస్తుంది భద్ర. ఇక చదవండి.]

పరీక్షలు అయిపోగానే యింటికి వెళ్ళకుండా అక్కడే ఉండి పెద్ద పెద్ద టెక్స్‌టైల్ కంపెనీల్లో పని చేసి మెలకువలు తెలుసుకోవాలనీ, తద్వారా కొంత డబ్బు కూడా ఆర్జించాలి అనుకున్న భద్ర తనను ఎంతో ఆప్యాయంగా చూసే జోషీ సార్‌ని ఎక్కడైనా చేర్పించమని అడిగింది.

ఆయన ఆమె ఆలోచనా విధానానికీ, పట్టుదలకూ చాలా సంతోషించి తమకు అందుబాటులో ఉన్న హెచ్.ఎస్.పి.ఎస్ టెక్స్‌టైల్ కంపనీకి ఆమెను సిఫారసు చేయడమే కాక సెలవుల్లో హాస్టల్‌లో ఉండడానికి అనుమతికి కూడా దరఖాస్తు చేయించి అనుమతి యిప్పించారు.

‘తమ హాస్టల్ నుంచి కేవలం యిరవై నిముషాలు, లేదా అరగంట పట్టే దూరం అంటే ఢిల్లీ లాంటి చోట ఎంత దగ్గరో కదా’ అనుకుని జోషీ సార్‌కి పాదాలంటి నమస్కరించి తొలిసారిగా ఉద్యోగంకి వెళ్ళింది భద్ర.

సెలవులకి కూడా కూతురు యింటికి రావడం లేదని బాధపడినా, ఆమె చదువుకుంటూనే ఉద్యోగానికి వెడుతోందనీ, అది కూడా పెద్ద కంపెనీలో అలా పని చేస్తే అది ఆమెకు ఎంతో ఉపయోగకరం అని సంతోషించారు భద్ర తల్లిదండ్రులు.

భద్ర విశ్వేశ్వర్రావు మాష్టారికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది. ఎప్పటికప్పుడు భద్ర చదువు ఎలా ఉందో, అక్కడ తను ఇమడగలిగిందో లేదో తెలుసుకుంటూనే ఉన్న ఆయన యిప్పుడు భద్ర చెప్పిన విషయానికి పొంగిపోయారు.

మొదటి రోజు ఉదయాన్నే చక్కగా తయారై, తమ కులదైవమైన భద్రావతి సమేత భావనా ఋషికి నమస్కరించుకుని కేంపస్ బయటకొచ్చి ఆటోలో కంపెనీకి చేరింది.

ఆ కంపెనీ బయట ఆటో దిగిన భద్ర లిప్తపాటు అలాగే దానినే చూస్తూ ఉండిపోయింది. తను కూడా చదువు పూర్తవుతూనే మెల్లగా ఒక కంపెనీ పెట్టి, తమ వాళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తూ, అందరి సహాయ సహకారాలతో ఎప్పటికైనా దానిని ఇంత పెద్దగా విస్తరింపజేయాలి. దానికోసం ఎంత కష్టమైనా పడతాను.’ మనసులో అనుకుంది.

భద్ర అడుగులు జీవితపోరాటంలో విజయం వైపుగా తొలి అడుగులు పడ్డాయి.

అక్కడ ఆఫీస్ రూంకి వెళ్ళి హెచ్.ఆర్. కి తన ఆఫర్ లెటర్ చూపించింది.

ఢిల్లీ డిజైనింగ్ కాలేజ్ నుంచి అలా ఇంటర్న్‌షిప్‌కి రావడం మామూలే అయినా మరీ మొదటి ఏడాది విద్యార్థిని మొదటి సెమిస్టర్ పరీక్షల తరువాతే రావడం ఇదే తొలిసారి కావడంతో ఆయన భద్రను చాలా కుతూహలంగా చూసాడు.

సాధారణ అందచందాలతో, సామాన్యమైన కలనేత డ్రెస్‌లో ఉన్నా ఆమె కళ్ళు విద్యా తృష్ణతో మెరవడం గమనించిన ఆయన ఆమెను నవ్వుతూ ఆహ్వానించాడు.

“సార్ పంపేరంటే నీలో తప్పకుండా ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది, పద ముందుగా యార్న్ తయారీ యూనిట్ కి వెడుదూ గాని” అంటూ తనే స్వయంగా ఆమెను అక్కడకు తీసికెళ్ళాడు.

అక్కడ ఎన్నో బేళ్ళు కట్టలకట్టలుగా స్టోర్ చేసి ఉన్నాయి.

వివిధ దేశాల మేలు రకాల ప్రత్తి బేళ్ళు అని వాటిని చూడగానే అర్థం అయింది భద్రకు. వాటిని యంత్రాల సాయంతో వడికి, చక్కటి నూలు దారాలు పెద్దపెద్ద రీళ్ళుగా వస్తున్నాయి. తమ ఊళ్ళో ఎంతో శ్రమపడితే కాని ఒక్క చీరకు సరిపడే నూలు తయారవదు, ఆ తరువాత పడుగు, పేకలను నేయడానికి కూడా చాలా సమయమే పడుతుంది. అలాంటిది ఇక్కడ రోజుకు కొన్ని క్వింటాళ్ళు అలవోకగా తయారవడం చూసిన భద్రకు తమవారి శ్రమ, అది కూడా దోపిడీకి గురయ్యే విధానం తలుచుకుని కళ్ళ నీళ్ళు తిరిగాయి.

యంత్రాల సాయంతో ఇక్కడ చేసే పనికి వీళ్ళకు వేలకువేలు జీతాలొస్తే, రెక్కలు ముక్కలు చేసుకుని, కంటి చూపు పణంగా పెట్టి చేస్తే ఒక్కో చీరకు మూడు, నాలుగు వేలు కళ్ళ చూడడం గగనం.

“అమ్మాయ్! ఈ వారమంతా ఇక్కడ పని చేయాలి నువ్వు. సరేనా..” అన్న ఆ హెచ్.ఆర్. మాటలతో తన ఆలోచనల్లోంచి బయటపడింది భద్ర.

“అలాగే సర్” అంటూ చొరవగా పక్కనున్న అతను ఏం చేస్తున్నాడో గమనించి అలాగే చేస్తున్న ఆమెను మెచ్చుకోలుగా చూసాడాయన. ‘మంచి పనిమంతురాలే, అందుకే వాళ్ళ సార్ పంపారు’ అనుకుంటూ..

“సరేనమ్మా! ఏమైనా తెలియకపోతే అతన్ని అడుగు” అంటూ..

“సోహన్! ఈ అమ్మాయి కొత్తగా ఈరోజే ఇంటర్న్‌గా చేరింది. ఢిల్లీ టెక్స్‌టైల్ డిజైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థిని. జాగ్రత్తగా చూసుకో, ఏమైనా సందేహాలుంటే చెప్పు..” అంటూ అతనికి చెప్పాడు.

సంభాషణ అంతా హిందీలోనే జరుగుతోంది. యిప్పుడు భద్రకు హిందీ మాట్లాడడం కూడా బాగా వచ్చేసింది.

భద్ర పనిచేసే తీరు, వేగం చూసిన సోహన్ కళ్ళు తేలేసాడు.

“ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా?” అని అడిగాడు ఉండబట్టలేక.

“చేసాను కానీ యిలా యంత్రాల మీద కాదు. మా యింట్లో అప్పుడప్పుడు చేసేదాన్ని. మాది చేనేత కుటుంబం..” చిరునవ్వుతో చెప్పింది భద్ర.

“అదీ సంగతి. అందుకే ఈ పని నీకు రక్తంలోనే ఉంది.” మెచ్చుకోలుగా అంటూ..

“ఏ ఊరు మీది? ఏదైనా ప్రత్యేకత ఉన్నదా మీ ఊరికీ, మీ పనికీ?” మళ్ళీ తనే అడిగాడు.

“అవును, మా ఊరు ఆంధ్రాలోని ఉప్పాడ. అక్కడ చీరలు దేశవిదేశాల్లో పేరెన్నికగన్నవి. జాందాని మా ప్రత్యేకత” ఆ మాటలు చెబుతున్నప్పుడు భద్ర స్వరంలో అప్రయత్నంగా చిరుగర్వం పలికింది.

“అవునా! సరే దాని గురించి నాకు పని గంటలు అయ్యాకా వివరంగా చెప్పు.” అంటూ తిరిగి పనిలో పడ్డాడతను.

భద్ర కూడా పనిలో పడింది.

ఆ సాయంత్రానికి రోజూ తయారయ్యే బేళ్ళకంటే దాదాపుగా రెట్టింపు బేళ్ళు తయారవడం చూసిన అక్కడి సూపర్‌వైజర్ ఆశ్చర్యపోయాడు.

ఆమె పనితనం చూసిన ఆ సూపర్‌వైజర్ ఆమెను నాలుగు రోజులకే అక్కడ నుంచి స్పిన్నింగ్ సెక్షన్‌కి మార్చాడు.

అలా ఆమె చకచకా అన్నీ నేర్చుకుంటూండగానే రెండు వారాలు గడిచిపోయాయి.

ఓ ఆదివారం సెలవునాడు, హాస్టల్‌లో ముందస్తు అనుమతి తీసుకుని శనివారం కంపెనీలో పని అయిపోయాకా మూర్తిగారింటికి వెళ్ళింది భద్ర.

మూర్తి, భార్యా, పిల్లలు కూడా ఆమెను చూసి చాలా సంతోషించారు.

సెలవులలో యింటికి కూడా వెళ్ళకుండా పని నేర్చుకోవడం ఆమె కెరీర్‌కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ మెచ్చుకున్న మూర్తి, తన పిల్లలకు ఆమె గురించి గొప్పగా చెబుతూ, మీరు కూడా అలా సమయం వృథా చేయకుండా కష్టపడితేనే జీవితంలో మంచి స్థాయికి చేరతారు ‘ అంటూ వాళ్ళను ఇన్‌స్పైర్ చేసాడు.

అక్కడ నుండే తన తల్లితండ్రులతోనూ, విశ్వేశ్వర్రావు మాష్టారితోనూ మాట్లాడింది భద్ర.

కూతురు అంతగా శ్రమపడడం గురించి తల్లి బాధపడుతూ..

“ఓ పక్క రేత్రీ పగలూ సదువుతున్నదే కాక, యిప్పుడన్నా కాస్త కులాసాగుండక ఏందమ్మీ ఇంత కష్టపడేటిది..” అంటూ కంటతడిపెట్టుకుంది.

అది చూసిన భద్ర.. “ఇక్కడన్నీ యంత్రాల మీదనే పనమ్మా, అసలుకి ఏమాత్రం కష్టం లేదు. యివన్నీ బాగా తెలుసుకుంటేనే కదా నేను మనవాళ్ళ కష్టాలు తీర్చగలిగేది. నేను బాగున్నాను, నువ్వేమి బాధపడకు” అంటూ ఓదార్చింది.

చూస్తుండగానే సెలవలు మొత్తం గడచిపోయాయి. అంత తక్కువ వ్యవథిలోనే మొత్తం ఆ కంపెనీలోఉన్న అన్ని విభాగాల్లోని పని సునాయాసంగా నేర్చేసుకున్న ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, మామూలుగా యిరవైవేలు ఇచ్చే స్టైఫండ్ ఆమెకు యాభైవేలు ఇచ్చారు ఆ కంపెనీ వారు.

పైగా ‘నీ చదువు అయిపోయాకా నీకు మా కంపెనీలో అత్యధిక జీతంతో మంచి ఉద్యోగం గ్యారంటీ’ అంటూ మాట ఇచ్చారామెకు.

అది తన తొలి సంపాదన. పట్టరాని ఆనందంతో ఆ విషయం తల్లితండ్రులతోనూ, తనకు దైవ సమానమైన విశ్వేశ్వర్రావు మాష్టారితోనూ చెప్పి మురిసిపోయింది.

ఆ డబ్బు యింటికి పంపిస్తానంటే ‘వద్దు నువ్వే అక్కడ బ్యాంకిలో దాచుకో ఏ అవసరమైనా ఉంటాయి’ అన్న వాళ్ళ మాటల ప్రకారం బ్యాంకు లోనే ఉంచేసింది.

తిరిగి రెండో సెమిస్టర్ మొదలయింది. సెలవుల్లో భద్ర అక్కడే ఉండి ఒక పెద్ద కంపెనీలో పనిచేసిన విషయం తెలిసిన సుహాగ్ ఆమెను మెచ్చుకుంటే, రాగ ఆమె స్నేహితులూ మాత్రం హేళన చేసారు. ‘తినడానికి గతిలేకపోతే అంతే మరి అంటూ’. భద్ర మెచ్చుకోలుకు పొంగిపోలేదు, హేళనలకు నొచ్చుకోలేదు. అవేవీ తనకు పట్టవన్నట్టు ఉండిపోయింది.

నీల మాత్రం చాలా సంతోషించింది. నువ్వు చదువు పూర్తి అవుతూనే చాలా గొప్పదానివవుతావంటూ మురిసిపోయింది.

సెమిస్టర్ ఫలితాలు వచ్చాయి. అనుకున్నట్టే భద్ర మొదటి స్థానంలో వచ్చింది.

రాగ మొదటి ఏడాది మొత్తానికి అత్తెసరు మార్కులతో గట్టెక్కింది.

భద్ర కాలేజ్ టాపర్‌గా రావడం సహించలేని రాగ ఎలాగైనా రెండో సెమిస్టర్ లోపల భద్రను అందరి దృష్టిలోనూ చెడ్డ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది.

అయితే ఆ విషయం తనతో చాలా క్లోజ్‌గా ఉండే ఇద్దరికి తప్ప సుహాగ్ కి కూడా తెలియనీయలేదు.

దానికి తగ్గ అవకాశం రాగను వెతుక్కుంటూ రానే వచ్చింది.

ఢిల్లీ ఐ.ఐ.టీ.లో ఈ విభాగంలో ఇప్పుడున్న లాబ్ కాకుండా వేరే పెద్ద అధునాతనమైన కార్యశాల కట్టడం జరుగుతోంది. అది దాదాపుగా పూర్తి కావచ్చి దాని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి వస్తున్నారు. ఆయనతో బాటు కేంద్ర జౌళి శాఖా మంత్రి కూడా వస్తున్నారనీ, వారిని సత్కరించడానికి అందమైన, అతి చక్కని శాలువాలు నేయాలని నాలుగేళ్ళ విద్యార్ధులకీ చెప్పారు డిపార్ట్మెంట్ హెడ్. వాటిలో ఏది ఎక్కువ బాగుంటాయో వాటిని, అవి నేసినవారి చేతుల మీదుగానే ప్రధానినీ, ఆ వచ్చే మంత్రినీ సత్కరించే అవకాశం ఇస్తామని, ఇంటరెస్ట్ ఉన్న వారు పేర్లు యిమ్మనడంతో, నాలుగు సంవత్సరాల విద్యార్ధులూ పోటీపడి పేర్లిచ్చారు.

దాదాపు ప్రతీ క్లాసులోనూ సగం మంది పైగా పేర్లివ్వడంతో, ఓ వైపు తమ విద్యార్ధుల శ్రద్ధకు సంతోషం కలిగినా మరోపక్క ఎలా సెలెక్ట్ చెయ్యాలి అని తలపట్టుకు కూర్చున్నారు ఆ శాఖ అధ్యాపకులు.

కానీ సమయం చాలా ఉండడంతో దశలవారీగా వాళ్ళు చేసిన పనిని చూసి, జడ్జ్ చేసి ఫిల్టర్ చేయాలని నిర్ణయించుకుని అదే విషయాన్ని అందరినీ ఓ చోట సమావేశపరిచి విషయం చెప్పారు.

అందరూ పోటీపడి మంచి నాణ్యమైన శాలువాలు తయారుచేయాలనీ వాటిలో అత్యుత్తమమైన వాటిని రెండే వాళ్ళకోసం ఎంపిక చేసినా మిగతావన్నీ కూడా కాలేజ్ డే రోజున పెట్టే స్టాల్స్‌లో అమ్మకానికి పెడదామనీ అందరూ కూడా తమ నైపుణ్యాన్ని, సృజనాత్మకతనూ ఉపయోగించి తయారుచేయమని చెప్పారు.

దానికోసం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ముందు ఓ నలుగురేసిని ఒక జట్టుగా చేసి నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించారు.

అంతా ఎవరికి నచ్చిన మెటీరియల్, డిజైన్, రంగులు అలా ఎంచుకుని పని మొదలుపెట్టారు.

ఎవరికి వారికే తమదే ఎంపిక అవ్వాలన్న ఆశ, బాగా తయారుచేయాలన్న ఆత్రుత.

భద్ర బాగా ఆలోచించింది. సాధారణంగా ఎవరైనా తక్కువ బరువు ఉండే వాటినే ఇష్టపడతారు. అందులోనూ దేశాధినేత అంటే ఎలాంటివి ఉండాలి? మువ్వన్నెల జెండాలో ఉండే త్రివర్ణ పతాకంలోని రంగుల్ని ఎంచుకుంది. అలాగే అతి తక్కువ బరువు ఉండే అందరూ ముచ్చట పడే కాశ్మీరీ పష్మినా దారాన్ని ఎంచుకుని దానిలో ఉండే మలినాలని తొలగించి శుభ్రపరచింది.

తరువాత దానిని రాట్నంతో వడికి యార్న్ తీసింది. ఎక్కువ సమయం పట్టినా, కష్టతరమైనా తను చేతితో తయారుచేయడానికే మొగ్గు చూపింది.

తను చాలా చోట్ల పరిశీలించి, పరిశోధించి వసంతకాలంలో చాంగ్తాంగి మేకల నుంచి సేకరించిన ఊలు ఆర్డర్ పెట్టి తెప్పించుకుంది.

అవన్నీ యంత్రాల సాయంతో చేసినా, శుభ్రం చేసిన ఆ ఉన్నిని సన్నని నూలుగా ఒడికి మామూలు మగ్గం మీద నేసింది. ఆ నేత కూడ రెండు వైపులా వాడగలిగేలా భారతదేశపు జెండాలో ఉన్న మువన్నెలూ, అశోక చక్రం మొత్తం శాలువా అంతా వచ్చేలాగా, మళ్ళీ ప్రధాని బొమ్మ అతనికిచ్చేదాని మీద, జౌళి, చేనేత మంత్రికిచ్చే దానిమీద ఆమె బొమ్మ మధ్యలోనూ, చుట్టూరా పలురాష్ట్రాల ప్రత్యేక చేనేత స్వరూపాలు ప్రతిబింబించేలా తెలంగాణా పోచంపల్లి ఇక్కత్, ఆంధ్రా ఉప్పాడ జందానీ, పశ్చిమ బెంగాల్ ప్రసిద్ధి చెందిన తంత, ఒడిశా సంబల్పురి ఇక్కత్, గుజరాత్ పటోలా వచ్చేలా అనేక రంగుల మేళవింపుతో అద్భుతంగా నేసింది భద్ర.

అయితే ఆమె చేసే ప్రతీ పనినీ జాగ్రత్తగా గమనిస్తున్న రాగ అవే రంగులు, సుమారుగా అవే డిజైన్స్ వచ్చేలా బయట తయారు చేయించి, ఆ ఎంపిక ప్రక్రియ ప్రారంభానికి ముందు, భద్ర తయారు చేసిన శాలువాలు తన దానితో మార్చేసి పెట్టేసింది.

అయితే ఎంపిక పారదర్శకంగా విద్యార్ధులందరి సమక్షంలో జరగడంతో భద్ర తను తయారు చేసిన శాలువాలు మారిపోయిన సంగతి పసికట్టి అదే విషయం అక్కడున్న జ్యూరీకి చెప్పడంతో అక్కడంతా గందరగోళం చెలరేగింది.

ఆ విషయాన్నీ చాలా సీరియస్‌గా తీసుకున్న జ్యూరీ సభ్యులు అక్కడున్న అన్నింటిలో తన శాలువాలు గుర్తించడమే కాక, అవి తనవే అని నిరూపించుకోవాలి అని చెప్పడంతో భద్ర అందరి దగ్గరున్న శాలువాలు పరీక్ష చేసి తను నేసినవి రాగ దగ్గర ఉన్నట్టుగా గుర్తించి అదే మాట చెప్పింది.

రాగ అవి తనవే అనీ, కావాలంటే అందుకు తను వాటిని నేసేటప్పుడున్న తన స్నేహితులే సాక్ష్యం అని వాదించింది.

వాళ్ళు కూడా అవి రాగావే అని చెప్పడంతో జ్యూరీ భద్రని ‘అవి నీవే అనడానికి ఏదైనా సాక్ష్యం ఉందా, లేక ఎవరైనా చూసిన వాళ్ళున్నారా’ అంటూ ప్రశ్నించడంతో లేరన్నట్టు తల అడ్డంగా ఊపింది భద్ర. రాగ ముఖం దైదీప్యమానంగా వెలిగిపోయింది.

అంతలో భద్ర చెప్పిన మాటలు అందరినీ విస్మయపరిచాయి.

“అవి ముమ్మాటికీ నేను నేసినవే, అందుకు ప్రత్యక్ష సాక్షులంటూ ఎవరూ లేకపోవచ్చు.. కానీ అవి నావే అనడానికి తిరుగులేని సాక్ష్యం ఒకటుంది. అదేమిటో నేను చెప్పగలను. మరి ఆమెకు అది తనదే అని చెప్పగలిగే అలాంటి సాక్ష్యం ఏమైనా ఉందా? ఎప్పుడూ ఆమెతో తిరిగే ఆమె స్నేహితుల సాక్ష్యం ఎలా చెల్లుతుందీ?” అడిగింది.

“నిజమే, ఏమ్మా రాగా నీకు అవి నువ్వు నేసినవే అని చెప్పడానికి ఏమైనా సాక్ష్యం, నీ స్నేహితులు కాకుండా ఏమైనా ఉందా?” అడిగారు.

రాగ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడింది.

“మరి అవి నీవే అనడానికి నీకున్న సాక్ష్యం ఏమిటి భద్రా?” ఆమెనూ అడిగారు.

“అవి నావి అనడానికి ఆ శాలువాల్లో ఓ చివర ‘భద్ర’ అనే పేరు నేతలో కలిసిపోయి కనబడుతుంది. చూడండి.” అన్న ఆమె మాటలు అర్థమయిన ఆ జ్యూరీ ముఖాలపై నవ్వు పరుచుకుంటే, రాగ ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది.

చుట్టూ ఉన్న వాళ్ళ చప్పట్ట మధ్య జ్యూరీలో ఒకాయన చూడగా శాలువా చివరలకు కుట్టిన పింజీకు దగ్గరగా ముచ్చటగా ఒక ఆకులో వ్రాసినట్టు భద్ర అన్న పేరు నేసి ఉంది.

జ్యూరీ అంతా ఆమెను ప్రశంసలతో ముంచెత్తి రాగాను నెల రోజులపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేసారు.

వాటిని అందంగా ప్యాక్ చేయించి ఆ రోజున భద్ర చేతుల మీదుగా ప్రధానికీ, ఆ మంత్రికీ యిప్పించాలని నిర్ణయించారు.

రాగ చేసిన పని అందరికీ తెలిసి, ముఖం చెల్లక కాలేజీ విడచి వెళ్ళిపోయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version