Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భద్ర-4

[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[పరీక్షలు అయిపోయాకా, ఇంటికి వెళ్ళకుండా జోషీ సార్ ద్వారా హెచ్.ఎస్.పి.ఎస్ టెక్స్‌టైల్ కంపనీలో ఇంటర్న్‌గా చేరుతుంది భద్ర. విశ్వేశ్వర్రావు మాష్టారికి కూడా ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఆమె తల్లిదండ్రులు సంతోషిస్తారు.  ఆ కంపెనీకి వెళ్ళి హెచ్.ఆర్.ని కలుస్తుంది. మొదటివారం యార్న్ తయారీ యూనిట్‌లోనూ, తరువాత స్పిన్నింగ్ సెక్షన్ లోనూ పని నేర్చుకుంటుంది. ఓ ఆదివారం కోసం హాస్టల్ లో అనుమతి తీసుకుని, శనివారం కంపెనీలో పని అయిపోయాకా, మూర్తిగారింటికి వెళ్ళి వాళ్ళతో సమయం గడుపుతుంది. మూర్తి ఆమెను అభినందిస్తాడు. సెలవలు ముగుస్తాయి. తక్కువ వ్యవథిలోనే మొత్తం ఆ కంపెనీలోఉన్న అన్ని విభాగాల్లోని పని సునాయాసంగా నేర్చేసుకున్నందుకు అబ్బురపడిన యాజమాన్యం భద్రకు మామూలు స్టైఫండ్ కంటే ఎక్కువగా యాభైవేలిస్తుంది. సెలవల్లో భద్ర ఓ పెద్ద కంపెనీలో పనిచేసిన సంగతి విద్యార్థులకి తెలుస్తుంది. రాగ హేళన చేస్తే, సుహాగ్, నీల మెచ్చుకుంటారు. భద్రకి ఎలాగైనా చెడ్డపేరు తేవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది రాగ. ఒక అవకాశం దక్కుతుందామెకు. ప్రధానమంత్రి, జౌళిశాఖ మంత్రి పాల్గొనే ఓ కార్యక్రమంలో వారిద్దరికి ఇచ్చేందుకు విద్యార్థులని శాలువాలు నేయమని కాలేజీ పోటీ పెడుతుంది. బృందాలుగా ఏర్పడి విద్యార్థులు సన్నాహాలు మొదలుపెడతారు. రాగ మోసం చేసి, భద్ర నేసిన శాలువాలను తనవిగా న్యాయనిర్ణేతల ముందు ప్రదర్శిస్తుంది. అది తనదే నని ఒక తిరుగులేని సాక్ష్యం చూపించి నిరూపించుకుంటుంది భద్ర. రాగని ఒక నెల రోజుల పాటు సస్పెండ్ చేస్తారు. భద్ర నేసిన శాలువాలను జాగ్రత్తగా ప్యాక్ చేయించి, భద్ర చేతుల మీదుగా ప్రధానికీ, జౌళిశాఖా మంత్రికీ యిప్పించాలని జ్యూరీ నిర్ణయిస్తుంది. ఇక చదవండి.]

సుహాగ్ భద్ర చేసినదానికి చాలా చాలా సంతోషించి.. “అసలు నీకు అలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?” అనడిగిన దానికి సుహాగ్ తో నవ్వుతూ…

“ఇదంతా నా తెలివి కాదు, మా శాలినీ అక్క తెలివి.” అని చెప్పింది.

“ఎవరా శాలినీ అక్క, ఏమా కథ?” నవ్వుతూ అడిగాడు సుహాగ్.

“అది చాలా పెద్ద కథ, వింటానంటే చెబుతాను..” నవ్వుతూ చెప్పింది భద్ర.

“ఊ! నీలాంటి తెలివైన అమ్మాయే మెచ్చుకుంది అంటే మరి ఆమె గురించీ తెలుసుకోవాలిగా. అయినా మీ ఊళ్ళో అంతా తెలివైన ఆడపిల్లలతో నిండి ఉందా?” నవ్వుతూ అడిగాడు సుహాగ్.

“అవును! కానీ ఆ తెలివితేటల్ని ఆ ఊళ్ళోనే సమాధి చేసే జనంలో బ్రతుకుతున్నాము.. తల్లిదండ్రుల కళ్ళు, కీళ్ళు పోయేలా శ్రమపడినా, పూట గడవదు. శ్రమ మాది, ఫలితం వేరొకరిదీ అన్నట్టే ఉందింకా. అది మార్చాలనే దానికి శాలిని అక్క పునాది వేసింది. మాలాంటి ముగ్గురు నలుగురు ఆ పునాది మీద గోడ కడుతున్నాం.. ఈ పరిస్థితి ఎప్పటికి మారాలో!” చిన్నబోయిన ముఖంతో అంది.

“మార్చేస్తారులే, ఆమె ఒక్కదాని ధైర్యం నలుగురిలో మార్పు తెచ్చింది కదా, ఇంక ఈ నలుగురే పదిమందికి మార్గదర్శమౌతారు. నువ్వేం బాధపడకు..” చిన్నగా చెప్పాడు.

“మనం కాంటీన్‌కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా! అదే, మీ శాలినీ అక్క గురించి చెబుతానన్నావ్ కదా!” సుహాగ్ అన్నాడు.

“దానికోసం అక్కడికెందుకు కానీ, ఇక్కడే కూర్చుందాం”, అంటూ కింద గడ్డిలో అతనికి కొంచెం దూరంలో కూర్చుంది.

“సరే, నీ ఇష్టం” అంటూ తనూ కింద కూర్చున్నాడు.

“హా! యిప్పుడు చెప్పు, ఎవరా శాలినీ, ఏమా కథ?” నవ్వుతూ అడిగాడు.

“ఏముందీ మామూలే, తనూ మా ఊళ్ళో, ఓ చేనేత కార్మికుడి కూతురు. తండ్రీ, అన్నగారూ ఎలా, ఎందుకు పోయారో కూడా తెలియకుండా సముద్రంలో కలిసిపోయారు.

శాలిని అక్క మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణురాలవగానే, గంతకు తగ్గ బొంత అంటూ మా ఊళ్ళో కుర్రాడినే ఇచ్చి పెళ్ళి చేసాదామనుకుంది వాళ్ళమ్మ. కానీ అక్క ఆవిడ మాట వినకుండా కాకినాడలో ఇంటర్ చదివి, ఆ తరువాత అహమ్మదాబాద్‌లో ఎల్.జే. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదివింది. చదువుతూనే అక్కడ టెక్స్‌టైల్ కంపెనీలో పార్ట్ టైం పని చేస్తూ బోలెడన్ని మెళుకువలు నేర్చుకుంది.

ఓ సారి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు, తన పరీక్ష ఫీజు కట్టడం కోసం తల్లి కళ్ళు కనబడిని స్థితిలో, కాళ్ళు కదపలేని స్థితిలో ఉండి కూడా ఓ పెళ్ళికి పట్టు చీర నేయడానికి ఒప్పుకుని, ఆరోగ్య పరిస్థితి బాగుండక మాష్టర్ వీవర్‌తో మాటలు పడుతున్న సందర్భంలో ఆమెను నిద్రమాత్రతో పడుకోబెట్టి, ఒక రాత్రి పగలు కష్టపడి మొదటిసారి తన నైపుణ్యంతో చాలా అందంగా నేసిందట. ఆ చీరకు మార్కెట్‌లో యాభై, అరవైవేలు వచ్చేదానికి ఆయన మూడు వేలో, నాలుగు వేలో యివ్వజూపాడట.

కనీసం పదివేలైనా ఇమ్మన్న అక్క మాటలకు ఆయన మండిపడి, ‘నా దయా ధర్మంతో బ్రతికే మీరు, నా దగ్గరే తల ఎగరేస్తారా! ఏం చేస్తానో చూడు’ అంటూ రంకెలేస్తే! అక్క ఆ చీరను తనే ఎవరి కోసమై నేసిందో వారికే తీసికెళ్ళి ఇస్తే, వాళ్ళు అరవైవేలు ఇచ్చారట. విషయం తెలిసిన మాష్టర్ వీవర్ మండిపడి, ఆ చీర, అక్క తన షాప్‌లో నుంచి దొంగిలించిందని నేరం మోపాడట.

పోలీస్ ఇనస్పెక్టర్‌ని కూడా పిలిచి, ఆ చీర తను వేరే వాళ్ళతో నేయించాననీ, అక్క దొంగిలించిందనీ చెప్పి ఆ వ్యక్తితో ఆ చీర తనే నేసానని అబద్ధం చెప్పించాడట..” ఏకబిగిని చెప్పడంతో అలుపు తీర్చుకోవడం కోసం ఆగింది భద్ర. అప్పటికే ఆమె కళ్ళలో నీళ్ళు చిప్పిలడంతో కళ్ళు ఒత్తుకుంది.

సుహాగ్ ఆమెనే చూస్తున్నాడు. ఆమెనలా చూడగానే అప్రయత్నంగా ఆమె దగ్గరగా జరిగి చెయ్యి చేతిలోకి తీసుకుని మెత్తగా ఒత్తాడు.

“అప్పుడు, అక్క ‘ఆ చీర నేనే నేసింది అనడానికి తిరుగులేని సాక్ష్యం చూపిస్తాను, మరి మీరలాంటి సాక్ష్యం ఏదైనా చూపగలరా’ అని సవాల్ విసిరిందట.

నోరు వెళ్ళబెట్టిన ఆ సాటి నేతగాడికి దిమ్మతిరిగేలా తను నేసిన ఆ చీర కొంగులో ఒక దగ్గర ‘శాలిని’ అని నేతలో కలిసిపోయేలా నా పేరు ఉంటుంది చూసుకోమంటే అప్పుడు తనను అవమానించాలని చూసిన ఆ ఇద్దరికీ రాయుడు తాతయ్యా, ఆ ఇనస్పెక్టర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అక్కను మెచ్చుకున్నారట.

అప్పుడే అక్క మా వాళ్ళందరినీ పోగేసి, అది మీరే నేసినట్టు ఋజువుండేలా ప్రతి ఒక్కరూ నేసిన చీరల్లో ఎక్కడో అక్కడ మీ పేరు ఉండేలా చూసుకోమని చెప్పింది. ఇదంతా జరిగినప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా.

ఆ అక్క మాటలే నాలో పట్టుదల నింపి, నాకు మార్గం చూపించాయి.

చదువు లేకపోవడం వలనే కదా తరతరాలుగా మా వాళ్ళ కష్టం దోచుకోబడుతోంది, అందుకే మాకు ముందు ఇద్దరమ్మాయిలూ, యిప్పుడు మేము నలుగురమ్మాయిలం, ఇద్దరబ్బాయిలూ ఈ చదువులు చదువుతున్నాం. మా చదువులు పూర్తయ్యాకా మేమంతా కలిసి వస్త్రపరిశ్రమ స్థాపించి మా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందేలా చూడడమే కాదు, మా ఉప్పాడ చీరలకు ఒకప్పటి వైభవాన్ని, అంతర్జాతీయ వ్యాపారంలో ఇంకా మంచి స్థాయినీ తీసుకొస్తాం..” ఉద్వేగంతో చెబుతున్న భద్ర ముఖంలోని పట్టుదల సుహాగ్ ని అబ్బురపరిచింది.

‘ఇలా యువత ప్రతీ రంగంలో ఆలోచించి కృషి చేస్తే మన దేశం ఏ దేశంతోనూ తీసిపోదు కదా!’ అనిపించింది.

“నీకు, మీ వాళ్ళకీ, మీ ఊరికీ ఆల్ ది వెరీ బెస్ట్” మనస్ఫూర్తిగా అంటూ అభిమానంగా ఆమె చేతిని నొక్కాడు.

ఇదంతా కొంచెం దూరంలో నిలబడి చూస్తున్న సాగర్ ముఖం వివర్ణమైంది.

అతను భద్ర కాలేజ్‌లో చేరిన మొదటిలోనే ఆమె తెలివికీ, అమాయకత్వానికీ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. రాగ బృందం నుంచి అనుక్షణం ఆమెకు నీడలా ఉంటూ వాళ్ళ బారినుంచి ఎన్నోమార్లు రక్షించాడు. అయితే అదంతా ఆమెకు తెసేలా చేయలేదు. తన చదువుకీ, సంకల్పానికీ తనూ, తన ప్రేమా అడ్డు కాకూడదు అన్న ఉద్దేశ్యంతో అలా ఉండిపోయాడు.

ఇప్పుడు ఈ సంఘటనతో అతనికి అనుమానం వచ్చింది, ‘సుహాగ్ కూడా ఆమెను ఇష్టపడుతున్నాడా, ఆమె తన నుంచి దూరం అవుతుందా?’ అన్న ఆలోచన రాగానే చలించిపోయాడు.

వాళ్ళిద్దరూ ఒకే చదువులో ఉండి ఎక్కువగా కలిసి ఉండే అవకాశం ఉంది. ‘ఆ అవకాశమే భద్ర, సుహాగ్ లను దగ్గర చేస్తుందా?’ అనుకుంటూ తల్లడిల్లిపోయాడు.

అతనికి తెలుసు సుహాగ్ కనబడేటంత మంచివాడు కాదు. అతనికి కాలేజ్ లోనే ఎందరితోనో హద్దులు దాటిన పరిచయాలున్నాయి. అయితే అవేవీ భద్రకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమెకు చదువుతప్ప మిగతావేవీ పట్టవు.

తను ఎలాగైనా భద్రను కలిసి విషయం చెప్పి, ‘సుహాగ్ కు దూరంగా ఉండమని చెప్పాలి.’ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

భద్ర కూడా తనలో కలిగిన భావోద్వేగాన్ని సుహాగ్ తో పంచుకుని కాసేపటికి మామూలయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

సుహాగ్ మాత్రం అక్కడే కూర్చుని ఆలోచనలో పడ్డాడు.

అతనికి భద్ర అంటే ప్రేమ, ఆకర్షణలాంటివి లేవు. కాకపోతే ఆమె తెలివితేటల మీద, నైపుణ్యం మీదా అతని కన్ను పడింది.

అతను మహారాష్త్ర లోని పైథాన్‌కు చెందిన వస్త్ర వ్యాపారి కొడుకు. పైథాని చీరలు మగ్గంపై చేతితో నేసే అద్భుతమైన కళ, అయితే ఇందులో బంగారం, వెండి దారాలు ఉపయోగించి పట్టుతో నేయడం వలన చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో, కొంతమంది మాత్రమే ఈ వ్యాపారం చేయగలగడంతో సుహాగ్ తండ్రి అక్కడ తిరుగులేని ఆధిపత్యం సంపాదించాడు. కానీ కాలంతో బాటు అన్ని చోట్ల లాగే నేతపనివారు ఆ పని చేయలేక, ఆరోగ్యాలను కుదువపెట్టి చేసినా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోని పరిస్థితుల్లో మెల్లమెల్లగా దానిని విడిచిపెట్టి వేరేవేరే పనులకు వెళ్ళిపోవడంతో యిప్పుడు సుహాగ్ తండ్రి లాంటి వ్యాపారులకు నోట్లో కరక్కాయ పడినట్టుగా అయింది.

క్రమేపీ పనితనం ఉన్న నేతగాళ్ళ కొరత ఎక్కువైంది. తండ్రి ద్వారా ఆ విషయాలు తెలుసుకున్న సుహాగ్ ఆ పరిస్థితికి ప్రత్యామ్నాయం చూస్తానని తండ్రికి మాట ఇచ్చాడు.

యిప్పుడు దానికోసమే భద్రతో మంచిగా ఉండడం మొదలుపెట్టాడు.

కానీ చిన్నతనం నుండీ ఒక స్థిరమైన నిశ్చయంతో ఉన్న భద్ర తన వాళ్ళను, తన ఊరినీ వదిలి తమకు ఉపయోగపడుతుందా! అన్న సందేహం అతనిలో కలిగింది ఆమె చెప్పినది విన్నాకా.

అందుకే ఆలోచనలో పడ్డాడు.

***

ఈ సంఘటన జరిగాకా భద్ర కాలేజీలో మరింత ప్రాచుర్యం పొందింది. ఆమెను ఇష్టపడే వాళ్ళున్నట్టే, అసూయపడి మనసులోనే ద్వేషం పెంచుకునే వాళ్ళ సంఖ్యా ఎక్కువైంది.

ఇక అధ్యాపకులకైతే ఆమె చాలా ప్రియ విద్యార్థిని అయిపోయింది.

వర్క్‌షాప్ ఓపెనింగ్ రోజు రానే వచ్చింది. ఆ రోజు తను స్వయంగా నేసుకున్న ఉప్పాడ పట్టు చూడిదార్లో అందరిలోకీ ప్రత్యేకం అనిపించేలా ఏ మేకప్ లేకుండా సాదాసీదాగా ఉన్న భద్ర చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

ప్రధానినీ, ఇతరులనూ ఆహ్వానించే పనీ, తమ కాలేజ్ గురించీ, అది సాధించిన విజయాల గురించీ మాట్లాడే పనీ కూడా మానేజ్మెంట్ ఆమెకే అప్పగించడంతో, క్షణం తీరిక లేకుండా చక్కగా అన్నిటినీ, అందరినీ సమన్వయపరుస్తూ చలాకీగా తిరుగుతున్న ఆమెను తరువాత ప్రత్యేకంగా అభినందించారు.

ఇంక వాళ్ళు వచ్చే రోజు దగ్గరయ్యే కొలదీ ఆ శాఖ విద్యార్ధులందరికీ క్షణం తీరిక లేకుండా అయిపోయారు.

బ్యానర్స్ దగ్గరనుంచీ, జెండాల వరకూ తామే తయారు చేసి మొత్తం కాలేజ్ ప్రాంగణం అంతా అందంగా తీర్చిదిద్దారు.

భద్ర, నీల అయితే అదేదో తమ యింట్లో పెళ్ళి అన్నంతగా హడావుడి పడిపోయారు.

శాలువా సంఘటన జరిగిన దగ్గర నుంచీ మొత్తం అందరి దృష్టీ భద్ర మీదే.

ముందే కాలేజ్ టాపర్, యిప్పుడింక ఆమె అద్భుతమైన పనితనం, తన అనుకున్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకున్న తీరు అందరినీ ఆకర్షించింది.

నీల పాటలు అద్భుతంగా పాడుతుంది. ముఖ్యంగా జానపదాలు, అదీ పక్కా తెలంగాణా భాష, యాసతో వినడానికి చాలా శ్రావ్యంగా, ఉత్తేజకరంగా ఉండడంతో మరికొంత మంది హిందీ, మరాఠి, బెంగాలీ యిలా అక్కడున్న అన్ని రాష్ట్ర భాషల పాటలూ ఆయా విద్యార్ధులు పాడేలా ఏర్పాటు చేసారు.

సీనియర్ విద్యార్ధులు మొత్తం కార్యక్రమ నిర్వాహణ బాధ్యతలు తీసుకుంటే, జూనియర్స్ వారికి సహాయంగా ఉంటూ ప్రతి ఒక్క పనీ ఎంతో బాగా, బాధ్యతతో నిర్వహించడంతో ఆ కార్యక్రమం చాలా బాగా జరుగుతుందన్న నమ్మకం ఆ కాలేజ్ యాజమాన్యానికి వచ్చేసింది.

అసలైన రోజు రానే వచ్చింది.

సరిగ్గా అనుకున్న సమయానికి ప్రధాని, జౌళి శాఖామాత్యులతో బాటు మరో ఇద్దరు ప్రధాని ఆంతరంగిక మిత్రులు కూడా రావడంతో అప్పటికప్పుడు మరో ఇద్దరు బాగా చేసిన విద్యార్ధుల శాలువాలు కూడా తీసి పెట్టారు వారికివ్వడానికి. అందరూ ఆశీనులయ్యాకా,

ముందుగా ప్రార్థనా గీతంతో మొదలు పెట్టి, కొందరు అధ్యాపకులు తమ కాలేజ్ గురించీ, అక్కడ చదివి వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నదీ, ఎన్ని వస్త్ర పరిశ్రమలు తమ పూర్వ విద్యార్ధులు నెలకొల్పినదీ ప్రస్తావించారు.

ఆ తరువాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ప్రధానికీ, ఇతరులకీ శాలువాలు కప్పి సత్కరించే కార్యక్రమం మొదలైంది. తరువాత నూతన కార్యశాల ప్రారంభోత్సవం ప్రధాని చేతుల మీదుగా జరిగింది.

ఆ తరువాత వారికి భద్ర చేతుల మీదుగా శాలువా కప్పి, సత్కారం జరగడంతో భద్ర ఆనందానికి అవధులు లేవు.

ఆ సందర్భంగా కాలేజ్ ప్రధానోధ్యాపకుడు భద్ర గురించి చెబుతూ, తమ కాలేజ్ కే తలమానికం అంటూ ఆమె నేపధ్యం క్లుప్తంగా వివరించడంతో ప్రధాని కూడా ఆమెను ఆశీర్వదించడం.. ‘యిలాంటి యువతే నేడు దేశానికి కావాలి’ అంటూ ప్రశంసించడం జరిగింది.

ఆ తరువాత మొత్తం విద్యార్ధుల తరుఫున భద్ర మాట్లాడుతూ..

‘ప్రధానికి, జౌళి శాఖామాత్యులకూ తను నేసిన శాలువాలతో స్వయంగా సత్కరించడం, జీవితంలో మరచిపోలేని మధురానుభూతి’ అంటూ మాట్లాడుతూ, అదే అవకాశంగా తీసుకుని దేశంలో చేనేత కార్మికుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదీ, వాళ్ళ అగచాట్లూ, అంత శ్రమపడుతున్నా, అనారోగ్యాలే కానీ ఆకలి తీరే మార్గం లేక, అప్పుల బాధ పడలేక ఆత్మహత్యల పాలబడుతున్న వారెందరో అంటూ ఆవేదన వ్యక్తపరిచింది.

అనర్గళమైన హిందీలో ఆమె మాట్లాడిన భాషణ ఆమె మాటల్లోనే..

“చేనేత రంగం కోసం ప్రభుత్వం చాలా పథకాలనే పొందుపరిచింది. నిజమే కానీ చాలా మటుకు అందవలసిన వారికి అందడం లేదు.

ముఖ్యంగా జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సబ్సిడీ క్రెడిట్, వీవర్ ముద్ర పథకం నామ మాత్రంగానే ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పథకాలు కూడా అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. యిలా సభాముఖంగా చెప్పడం ప్రభుత్వాలను విమర్శించడం కోసం కాదు, మా ఆవేదన అర్థం చేసుకుంటారని.

అన్ని రాష్ట్రాలలోనూ నేతన్నలకు పథకాలున్నాయి అయితే అవి ఆర్థికంగా సహాయపడడానికీ, భరోసాకు మాత్రమే ఉద్దేశించబడ్డాయి, కానీ వారివారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే విధంగా లేక, వారి కష్టానికి తగ్గ ఫలితం అందక దళారీల చేతిలో దారుణంగా వచింపబడుతున్నారు.

అయితే కొన్ని రాష్ట్రాలలో ఉదాహరణకు మహా రాష్ట్రాలోని స్టేట్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లాంటివి ఉంటే ఆ రంగంలో కొత్తకొత్త మిల్లులను స్థాపించడానికీ, ఉన్న వాటిని పునరుద్ధరించడానికీ ఉపయోగపడే విధంగా ఉంటే, తాము నేసుకున్న వాటిని తామే అమ్ముకోగలిగేలా సహకార సంఘాలు, సంస్థలు ఉంటే, అవి సక్రమంగా పని చేస్తే చాలామటుకు వారి పరిస్థితి చక్కబడుతుంది.

ఇంకా తెలంగాణాలో నేతన్న పథకాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా నేతన్న భీమా (రూ. ఐదు లక్షలు), నేతన్నకు చేయూత (పొదుపు), నేతన్నకు భరోసా ఆర్థిక వార్షిక సాయం రూ.18000, అలాగే జియో ట్యాగ్ చేసిన మగ్గాల ఆధారంగా వారికి ఈ ఆర్థిక సాయం అందించడం, అయితే ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎంతమందికి అందుతోంది అన్నది గాలిలో దీపమే. ఆంధ్రాలో కూడా నేతన్న నేస్తం, స్వనిర్భర్ నారీ వంటి పథకాలున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా కోట్లుకోట్లు నిధులు కేటాయించబడుతున్నయి.

కానీ పెద్దలు క్షమించాలి, యివన్నీ కేవలం పేపర్ల వరకూ, ప్రణాళికల వరకే సాధారణంగా పరిమితమౌతున్నాయి అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.

ఈ రకమైన పరిస్థితి ఎందుకు, ఎలా, ఏమిటీ అనేది నేను వారి.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.

లబ్ధిదారుల తెలియనితనము అధికారులు గుర్తించి వారికి తెలియచెప్పే బాధ్యత తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలున్నాయి.

అందరికీ కనీసావసరాలైన వాటిలో ఈ ముఖ్యావసరాన్ని తీర్చే ఏకైక వర్గం అయిన నేతన్నలను అలక్ష్యం చేయవద్దని సభాముఖంగా ప్రార్థిస్తూ, నేను ఏమైనా పరిధి దాటి మాట్లాడితే మన్నించమని కోరుతూ సెలవు.” అంటూ వినమ్రంగా నమస్కరించి వేదిక దిగిన భద్రకు అవిశ్రాంతంగా కరతాళ ధ్వనులు కొన్ని నిముషాల సేపు మ్రోగుతూనే ఉన్నాయి.

తరువాత ప్రధాని ఆమెని పిలిచి స్వయంగా మాట్లాడి, ఆమె గురించి తెలుసుకుని అభినందనలతో బాటు మాట కూడా ఇచ్చారు.

‘అన్ని పథకాలు సక్రమంగా అమలు జరిగేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటా’మని హామీ ఇచ్చారు.

‘ప్రతివారూ, ముఖ్యంగా యువత మాట్లాడడానికీ, యిలా సమస్యలను పైవారి దృష్టికి తీసుకురావడానికీ భయపడకుండా, నాకెందుకులే అన్న ఉదాసీనత చూపకుండా ఉంటే, ప్రశించగలిగితే సాధ్యమైనంత వరకూ ఏ వ్యవస్థా కూడా కుంటువడకుండా, సక్రమంగా నడిచే అవకాశం ఉంటుంది’ అంటూ భద్ర చొరవను ప్రశంసించారు ప్రధాని.

‘భవిష్యత్తులో అలాంటి నిర్లక్ష్య వైఖరి చూపకుండా అధికారులను ఆదేశిస్తామనీ, నేతన్నలకు సరైన న్యాయం జరిగేలా చూస్తామనీ’ సభాముఖంగా మాట ఇచ్చాడాయన.

జౌళి శాఖా మంత్రి పి.ఏ. అప్పటికప్పుడు అన్ని పాయింట్స్ నోట్ చేసుకోవడం గమనించిన భద్ర మనసు ఆనందంతో నిండిపోయింది.

సమస్యకు పరిష్కారం వెంటనే దొరకకపోవచ్చు కానీ కనీసం ఆ దిశగా దిద్దుబాటు చర్యలు కొంతలోకొంత మొదలవచ్చు అన్న ఆశాభావం కలిగించింది అక్కడున్న అందరికీ.

ప్రధాని బృందం వెళ్ళిపోయాకా అటు అధ్యాపకులూ, యిటు విద్యార్ధులూ అంతా భద్రను అభినందనలతో ఉక్కిరిబిక్కిరి చేసేసారు. భద్రకు తను అనుకున్న సంతృప్తి కలిగింది.

మర్నాడు ధిల్లీ లోని అన్ని వార్తాపత్రికలే కాక దేశంలోని అన్ని జాతీయ పత్రికల్లోనూ ఈ వార్త ఫోటోలతో సహా రావడం ఆమెకు చాలా ఆనందాన్నిచ్చింది.

మనం చేసే పని మనకి ఆనందాన్ని, తృప్తినీ ఇచ్చినా అది పదిమందికీ తెలిసి, మన్ననలు పొందితే ఉండే ఆనందం, ప్రయోజనం వేరే స్థాయిలో ఉంటాయన్న విషయం ఆమెకు అనుభవంలోకి వచ్చింది.

అదంతా సుహాగ్ ద్వారా తెలిసి, వార్తాపత్రికల్లో చదివిన రాగకు తన తప్పు తెలియకపోగా భద్ర మీద ఇంకా ద్వేషం పెరిగిపోయి నెలరోజుల తరువాత తను తిరిగి కాలేజ్‌లో అడుగుపెట్టాకా భద్రను ఎలాగైనా పరాభవించి కాలేజ్ నుంచి శాశ్వతంగా పంపేయాలన్న నిర్ణయం బలీయమైపోయింది.

‘కొందరంతే చేసిన తప్పుల్ని ఎప్పటికీ తెలుసుకోలేరు, సరిదిద్దుకోలేరు’ అన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యం రాగ.

ఇది జరిగిన తరువాత సుహాగ్ భద్రతో బాగా క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టాడు.

ఎలాగైనా ఆమెను ప్రేమలో దించి తను అనుకున్నది సాధించాలన్న పంతం హెచ్చింది అతనిలో.

(ఇంకా ఉంది)

Exit mobile version