Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భద్ర-5

[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[రాగని తెలివిగా బోల్తా కొట్టించినందుకు సుహాగ్ భద్రని అభినందిస్తాడు. ఆ ఐడియా ఎలా వచ్చిందని అడిగితే, అది తనది కాదని తమ ఊళ్ళో శాలినీ అనే అమ్మాయిదని, ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఆ ఉపాయం అందరికీ చెప్పి, పాటించమని చెప్పిందని చెప్తుంది భద్ర. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు సుహాగ్. వీళ్ళని దూరం నుంచి చూస్తున్న సాగర్ ముఖం వివర్ణమవుతుంది. అతను భద్రని ప్రేమిస్తుంటాడు, కానీ ఆమె చదువుకీ లక్ష్యాలకి అడ్డు కాకూడదని వెల్లడించడు. అయితే సుహాగ్ ఆమెను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం చేసి, అతని నిజ స్వరూపం తెల్సిన సాగర్, భద్రని హెచ్చరించాలనుకుంటాడు. తన గదికి వెళ్ళిన సుహాగ్, ఎలాగైనా భద్రని దక్కించుకోవాలని ఆలోచనలు వేస్తాడు. అనుకున్న విధంగా వర్క్‌షాప్ ఓపెనింగ్ ఘనంగా జరుగుతుంది. ప్రధానికి, జౌళిశాఖ మంత్రికి భద్ర తయారు చేసిన ప్రత్యేక శాలువాలు అందజేస్తారు. ప్రధాని, జౌళిశాఖా మంత్రుల ఉపన్యాసాలయ్యాకా, భద్ర ప్రసంగించి, చేనేత రంగంలోని వారికి నిజంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతుంది. తప్పక పరిశీలిస్తామని అంటారు ప్రధాని. ధాని బృందం వెళ్ళిపోయాకా అటు అధ్యాపకులూ, యిటు విద్యార్ధులూ అంతా భద్రను అభినందిస్తారు. సుహాగ్ ద్వారా విన్న, పేపర్లలో చదివిన రాగకు భద్ర మీద ద్వేషం మరింత పెరుగుతుంది. సుహాగ్ ఆమెను ఎలాగైనా ప్రేమలో దించాలని పంతం పడతాడు. ఇక చదవండి.]

సెకండ్ సెమిస్టర్ మొదలవగానే ప్రాక్టికల్ ఎక్ష్పీరియన్స్, లాబ్ వర్క్, హండ్ టు హండ్, ఇండస్ట్రియల్ టూర్స్ ఎక్కువగా విద్యార్ధులకు ఫీల్డ్ వర్క్ ఉండడంతో భద్ర చాలా ఉత్సాహంగా వాటన్నింటిలో ఉండడమే కాక వాటితో కొత్తకొత్త ప్రయోగాలకు కూడా శ్రీకారం చుట్టింది.

కాలేజ్ డే సందర్భంగా విద్యార్థులంతా కలిసి వివిధ రకాల దుస్తులతో స్టాల్స్ నడపడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

అన్ని సంవత్సరాల విద్యార్థులూ కలిసి జట్లుజట్లుగా ఏర్పడి రకరకాల యార్న్, ఫైబర్ లతో కృతిమ నూలుతో యిలా ఎన్నో రకాల వస్త్రాలను ప్రయోగాత్మకంగా తయారుచేయడం, వాటిని స్టాల్స్‌లో అమ్మకానికి పెట్టడం ప్రతీ ఏటా జరిగేదే.

ఈ యేడాది కూడా అలా స్టాల్స్ పెట్టారు. ఫంక్షనల్ టెక్స్‌టైల్స్ మరియు అత్యాధునిక వస్త్రాల తయారీ, పనితనం వీటికి సంబంధించిన విభాగం యిప్పుడు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న వేళ ఐ.ఐ.టీ. ఢిల్లీ ప్రతీ రెండేళ్ళకోసారి ఇంచుమించు ఎనభై ప్రపంచ దేశాల టెక్స్‌టైల్ యూనివర్సిటీస్‌తో సమావేశాలు ఏర్పాటు చేయడం రెండువేల పద్దెనిమిదిలో మొదలై చాలా వేగంగా విద్యార్ధుల, పరిశోధకుల దృష్టిని ఆకర్షించడం గమనించిన భద్ర దీని మీద దృష్టి సారించింది.

ఒకరోజు ఆడిటోరియంలో నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యార్ధులనీ, పీ జీ, డాక్టరేట్ విద్యార్ధులందరినీ సమావేశపరిచి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు ఆ కాలేజ్ హెడ్, డైరెక్టర్.

“ప్రియమైన విద్యార్ధులారా! మీ అందరికీ ఓ ముఖ్యమైన, సంతోషకరమైన వార్త చెప్పడం కోసమే మిమ్మల్నిక్కడ సమావేశపరిచాను.

ఫంక్షనల్ టెక్స్‌టైల్స్ అండ్ క్లోతింగ్ అంతర్జాతీయ సదస్సు జరిపే అవకాశం ఈసారి మనకు లభించింది అని చెప్పడానికి చాలా సంతోషంగానూ గర్వంగానూ ఉంది. జనవరి 31, ఫిబ్రవరీ 1, 2 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు దేశవిదేశాల నుండీ సుమారు ఎనబై ప్రపంచ దేశాల వస్త్ర ప్రపంచానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, డిజైనర్లు, వస్త్ర ప్రపంచ పరిశ్రమల వారూ వస్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలురైన వక్తలుంటారు.

ఇది మీకొక అపూర్వ అవకాశం. ఎన్నో విషయాలు తెలుసుకోవడానికీ, నేర్చుకోవడానికీ. అలాగే దీనికి సంబంధించిన విస్తృత శ్రేణీ అంశాలపై పత్ర సమర్పణలు చేస్తారు. వాటినన్నిటినీ పుస్తకాల క్రింద ప్రచురిస్తారు.

దీని నాలుగో సమావేశం మన కాలేజ్ లో ఏర్పాటవడం మన విద్యార్ధుల అదృష్టం.

మొన్న శాలువాలు తయారుచేసిన వారిలో వరసగా మొదటి ఐదు స్థానాలు పొందిన భద్ర, అమిత్, సుహాగ్, వీణ, పటాన్ ఈ ఐదుగురూ ఆ సదస్సుకు చెందిన పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి.” ఆయన మాటలు పూర్తికాకుండానే విద్యార్థులు.. ‘ఓ..’ అంటూ కేకలూ, యీలలూ, చప్పట్లతో తమ హర్షాన్ని ప్రదర్శించారు.

మొదటి ఏడాదిలోనే తన సత్తా నిరూపించుకున్న భద్రకు ప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సులో ముఖ్య పాత్ర పోషించే అవకాశం కల్పించారు కాలేజ్ యాజమాన్యం.

వివిధ దేశాల నుంచీ వచ్చిన వస్త్ర ప్రపంచ విద్యార్ధులనూ, పరిశోధకులనూ కలిసి స్మార్ట్ దుస్తుల తయారీ, రక్షణ వస్త్రాలు, మెడికల్ టెక్స్‌టైల్స్, సస్టైనబుల్ డైయింగ్, యిలా ఎన్నో కొత్తకొత్త విషయాలలో నిష్ణాతులైన వారిని చూడడం, వారి నుంచి విషయాలను తెలుసుకోవడం భద్రలో ఉత్సాహాన్ని పెంచి ప్రోత్సాహంగా మారింది.

వస్త్రాలంటే కేవలం ఒళ్ళు కప్పుకునేందుకు మాత్రమే కాదు ఇందులో ఎంతో సాంకేతికనూ, సౌకర్యాలనూ జతపరిచి నూతన ఆవిష్కరణలుగా మార్చడం అనే విషయం ఆమెకు బాగా అర్థమవడంతో బాటు, మారుతున్న కాలంతో బాటు ఎలా మారాలి, ఎలా కొత్తకొత్త అవకాశాలను చేజిక్కించుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవడానికి ఆ సమావేశాలు వేదికయ్యాయి.

‘మార్పు అనేది అనివార్యం, అది ఏ రంగంలో అయినా సరే. మారుతున్న కాలంతో బాటు మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనమూ మారితేనే అభివృద్ధి’ అన్నది గ్రహించిన భద్ర చాలా వేగంగా ఆ విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం చేస్తూ అందరి మన్ననలూ అందుకుంది.

ఈ అంతర్జాతీయ సమావేశానికి విద్యార్ధుల నుండి పత్ర సమర్పణ, మోడల్ వస్త్రాల తయారీ, వాటి ప్రదర్శన యిలా ఎన్నో అవకాశాలను కలిగిస్తూ తమ విద్యార్ధుల్లో ఉత్సాహాన్నీ, పోటీ తత్వాన్ని పెంపొందించే దిశగా సమావేశాలు జరిగాయి.

ఆ రంగంలో విశేష కృషికి గ్లోబల్ ఎక్స్లెన్సీ అవార్డ్ ప్రకటించడం కూడా ఆ రంగాన్ని గుర్తించి ప్రోత్సహించడం

చాలా మంచి పరిణామంగా రూపొందింది.

సదస్సు కోసం నెలరోజుల ముందు నుంచీ విద్యార్ధులందరూ ఉత్సాహంగా పనిచేసినా, మరీ ముఖ్యంగా ఈ ఐదుగురూ అహోరాత్రాలు శ్రమించి ఏర్పాట్లు చేసారు.

భద్ర ఈ సందర్భంగా పెట్టే పోటీల కోసం ఉప్పాడ నుంచి పట్టుదారాలు తెప్పించి, వాటిని నీరు పడితే తడవకుండా జారిపోయేలా (వాటర్ ప్రూఫ్) ఫంక్షనల్ దుస్తులుగా మార్చడం కోసం పర్యావరణ హితమైన పద్ధతిలో కొన్ని ప్రమాదరహిత రసాయనాలతో తడిపి, ఆరబెట్టి మగ్గం పైనే అనేక రంగుల దారాలతో, అద్భుతమైన డిజైన్స్ వచ్చేలా లాంగ్ ఫ్రాక్, మళ్ళీ దానిపై చేతి కుట్టు, కుందన్స్‌తో డిజైన్స్ కుట్టి అందమైన పార్టీ గౌన్ (పార్టీ వేర్) తయారు చేసింది.

దీనికోసం రాత్రిళ్ళు నిద్ర మేల్కొని మరీ పని చేసింది.

సదస్సు ఆఖరి రోజున వేదికపైన ఈ పోటీకోసం, పాల్గొనే వారంతా తాము తయారు చేసిన దుసులు వేసుకుని రాంప్ వాక్ ప్రదర్శన యివ్వాలి.

వాటిలో మొదటి మూడు స్థానాల్ని పొందిన వాటికి నగదు బహుమతులు, వాటితో బాటుగా ధృవపత్రాలను జారీ చేసారు.

మొదటి బహుమతి డిజైనింగ్‌లో ప్రపంచ విశ్వవిద్యాలపు (వర్ల్ద్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్) విద్యార్ధులు నలుగురున్న జట్టు తమ వినూతన ఆవిష్కరణకుగానూ గెలుచుకుంది.

రెండో బహుమతి ఐ.ఐ.టీ టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, ఢిల్లీ విద్యార్ధిని కుమారి భద్ర, సుహాగ్, వీణ గెలుచుకోవడం విశేషం.

మూడవ బహుమతి పాట్నా మహిళా కళాశాల ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు అశుతోష్, యామిని మరియు కల్పన గెలుచుకున్నారు.

మొట్టమొదటిసారిగా వర్ల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్‌తో కలిసి ఈ సదస్సు నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో తమ కాలేజీ విధ్యార్ధులు గెలవడం చాలా సంతోషకరం అంటూ హర్షం వెలిబుచ్చారు కాలేజ్ యాజమాన్యం.

అలాగే పోస్టర్ ఫ్యాషన్ డిజైన్ షోలో కూడా మన దేశంలోని కొన్ని ఫ్యాషన్ డిజైన్ కళాశాలల విద్యార్ధులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.

యిరవై వరకూ పత్ర సమర్పణలు వస్త్ర ప్రపంచానికి చెందిన వివిధ అంశాల మీద రావడం కూడా ఆశాజనకంగా అనిపించింది.

మొత్తానికి సదస్సు మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరగడం దానిలో తమ విద్యార్ధులు ఎంతో శ్రమించి, మనసుపెట్టి పాల్గోవడం యాజమాన్యానికి ఆనందాన్నిచ్చింది.

చివరగా గ్లోబల్ టెక్ష్టైల్ ఎక్స్‌లెన్సీ అవార్డ్‌లు పొందిన వారిని అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం జరిగింది.

డాక్టర్ అనిల్ కాషి మురార్కా గారికి, ప్రత్యేక రసాయనిక వస్త్రాలకు, అష్మీత్ సింగ్ హోరా కు వస్త్ర వ్యాపార నాయకత్వానికి, విజయ్ ఫ్యాషన్స్, దుబాయ్ వారికి బెస్ట్ బీస్పొక్ మెన్స్ టైలరింగ్ కి గానూ వచ్చింది.

గత ఎన్నో ఏళ్ళుగా ప్రత్యేక ఆర్డర్స్ మీద వ్యక్తిగత ఇష్టాలకు తగినట్టు మగవారి బట్టలు, తయారు చేస్తున్నందుకు గానూ ఆ అవార్డ్ వీరికి యివ్వడం జరిగింది.

ఇంకా విస్తారంగా ఎన్నో కోణాల్లో విజేతలుగా నిలిచిన ఎంతోమంది వస్త్ర పరిశ్రమకు చెందిన వారిని అలా ఒకే చోట వేదిక మీద చూడడం, కలుసుకోవడం ఆ రంగాన్ని ఎంచుకున్న విద్యార్ధులకు మహదవకాశం అయ్యింది.

ప్రతి ఒక్కరిలోనూ ఏదో సాధించాలన్న తపన మొదలయింది.

దీనికి విపరీతమైన ప్రాచుర్యాన్ని కల్పిస్తూ మీడియా కవరేజ్ విస్తృతంగా జరిగింది.

చూస్తుండగానే భద్ర రెండేళ్ళ చదువు పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలో అడుగుపెట్టింది.

సుహాగ్ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందమౌతున్నాయి.

దగ్గరగా ఉన్నట్టే ఉంటూ ఎవరినైనా ఆమడ దూరంలో పెట్టడం అనేది భద్రకు బాగా అలవడింది. ఆమె లోకం చదువు, ఆమె లోకం వస్త్ర పరిశ్రమ, అందులో వినూతన అంశాలు, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన అంశాలు ఆమెను కుదురుగా ఉండనివ్వడంలేదు.

అంతులేని తృష్ణతో రగిలిపోతూ, అహర్నిశలూ కార్యశాల, ప్రోజెక్ట్స్, పోటీలు అంటూ వాటిలో నిమగ్నమైపోయిన ఆమెను ఎలా ఆకట్టుకోవాలో, తన దారికి తెచ్చుకోవాలో అర్థంకావడం లేదు సుహాగ్‌కి.

***

భద్ర విద్యార్ధిగా ఉంటూనే కొంతమందిని జత చేసుకుని ఆన్లైన్ వస్త్ర వ్యాపారం మొదలు పెట్ట్టాలని దానికి సంబంధించిన వివరాలు సేకరించి, ఆ విధంగా తను ఆన్లైన్ లో పెట్టాలనుకునే దుస్తులకో బ్రాండ్ ఏర్పరచి, దానికి సంబంధించిన జీ ఎస్ టీ, అనుమతులూ, లైసెన్స్‌లూ అన్నింటికీ దరఖాస్తు చేసుకుని, ఆ విధంగా కొంత తయారీ తను సూచించిన విధంగా చేయమని ఊళ్ళో ఉన్న తన వారికీ, అప్పటికే వేరువేరు చోట్ల చదువుతున్న తన స్నేహితులకూ చెప్పింది.

ఆ సదస్సు ఆ రంగంలో యిప్పటికే కృషి చేస్తున్నవారికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్నీ ఇస్తే, యిప్పుడిప్పుడే ఆ రంగంలో అడుగులేస్తున్నవారికీ, ముఖ్యంగా ఆ రంగాన్ని తమ భవిష్యత్తుగా ఎంచుకున్న విద్యార్ధులకూ స్పూర్తిదాయకం.

మూడురోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం భద్రకూ, భద్రలాంటి మరెందరో ఉత్సాహవంతులైన విద్యార్ధులకూ ఆ రంగంలో ముందుకు సాగాలనే కోరికనూ బలోపేతం చేసింది.

స్మార్ట్ టెక్స్‌టైల్స్, సస్టైనబిలిటీ, వస్త్ర ప్రపంచంలో సాంకేతికతా, ముఖ్యంగా అవసరాలకు తగినట్టు వస్త్రాల రూప కల్పన, ఆధునికీకరణ, సౌకర్యం, సౌందర్యాల కలబోత ఇత్యాది ఎన్నో విషయాలలో ప్రపంచ దిగ్గజాల అనుభవాలనూ, క్రియాశీలతనూ దగ్గరుండి చూసి నేర్చుకునే అవకాశం కలిగించాయి ఆ అంతర్జాతీయ సమావేశాలు.

రోజులు గడుస్తున్నా ఆ మత్తులోనుంచి బయటపడని భద్ర అప్పటికే ఉన్న వివిధ అంశాలను తనదైన శైలిలో సమీకరించి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.

సరిగా అప్పుడే బాంబేలో జరిగే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ ‘లక్మే ఫ్యాషన్ వీక్’ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వర్ల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగబోతోందనీ, ఆసక్తి ఉన్న వారు జట్లుగా ఫార్మ్ అయి పాల్గొనచ్చుననీ సర్క్యులర్ వచ్చింది.

తరువాత మళ్ళీ అందరినీ సమావేశ పరిచి దాని గురించిన వివరాలిలా చెప్పారు.

“వచ్చే ఆగస్ట్ నెలాఖరుకు ‘లక్మే ఫ్యాషన్ వీక్’ మన దేశంలోనే ముంబైలో జరగపోతోంది. అయితే దానికోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తాము చేసిన డిజైన్స్ నమూనాలు, ప్రయోగాత్మక రకాలు అన్నీ ముందుగా ఆన్లైన్‌లో పంపించాలి. వాటి ఎంపిక తరువాత రెండో దఫా ఎంపికకోసం మీరు తయారుచేసిన డిజైన్స్ వాళ్ళుకు భౌతికంగా పంపాలి. అప్పుడు కూడా వాళ్ళు ఎంపిక చేసినవారికి మాత్రమే అక్కడకు వెళ్ళడానికి అవకాశం. మరో మాట, అక్కడకు వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చులూ అవీ మీరే భరించాలి.

ఖర్చుతో కూడిన పనే, కాకపోతే మన దేశంలో జరిగే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్స్ లో ముఖ్యమైనదది.

అక్కడ పోటీలో పాల్గోవడమే కాక అక్కడ జరిగే షోలో మీమీ డిజైన్స్ ప్రదర్శించి, వాటిని అమ్ముకునే అవకాశం కూడా ఉంది. అది శీతాకాలపు షో ఆగస్ట్‌లో ఉంటుంది. ఇంకా సుమారుగా ఏడునెలల కాలం ఉంది కనుక మీకెవరికైనా ఇంటరెస్ట్ ఉంటే దరఖాస్తు చేసుకోండి” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక భద్ర ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

తను ఫంక్షనల్ టెక్స్టైల్ క్లోతింగ్ జరిగినప్పటి నుంచీ ఫంక్షనల్ వేర్ తయారీ మీద దృష్టి పెట్టడంతో, ఈసారి ఆ పోటీకి, ఇంకో ముగ్గురితో కలిసి ఒక జట్టుగా ఏర్పడి చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండే, మహిళలకు సౌకర్యంగా ఉండేటట్టు ఉప్పాడ పట్టుదారాలతో కుర్తీ, తక్కువ బరువుతో, చాలా చక్కటి ఎంబ్రాయడరీతో చూడగానే ఆకట్టుకునే విధంగా తయారుచేసింది. అలాగే మగవారికి జీన్స్ బట్టతో, పైన మృదువైన కృత్రిమ సింథటిక్ బట్టతో టీ షర్ట్స్ సెట్ తయారుచేసింది.

అలాగే కుటుంబానికి, అంటే భార్యా, భర్త, పాపా, బాబులకు పార్టీ వేర్ గా సెట్స్, పిలల్లకు రకరకాల డిజైన్స్‌తో బట్టలు, ఆడపిల్లలకు నాలుగైదు రకాల డిజైన్స్‌లో బట్టలు, వధూవరులకు కొన్ని రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం అత్యంత ఆధునికతతో, అందమైన పెళ్ళి బట్టలు యిలా నాలుగు నెలలపాటు తన సారధ్యంలో తన జట్టుతోనూ, కొన్ని పెళ్ళి చీరలు, జాందానీచీరలూ వంటివి తన ఊళ్ళో తన వారితోనూ తయారు చేయించసాగింది.

సరిగ్గా దరఖాస్తు చేసుకునే సమయానికి కొరియర్ ద్వారా అవన్నీ తెప్పించుకుని వాటి ఇమేజస్ ఆన్లైన్‌లో అప్లోడ్ చేసి అప్పుడు ఊపిరిపీల్చుకుంది భద్ర.

‘భద్రతో జతకడితే గెలుపు తధ్యం’ అన్న నమ్మకం ఆపాటికే అక్కడందరికీ ఏర్పడడంతో ఆమెతో జట్టు కట్టడానికి నేనంటే నేనని పోటీ పెరిగింది.

కాలేజ్ అధ్యాపకులందరికీ కూడా ఆమె ప్రీతిపాత్రమైన శిష్యురాలు కావడంతో ఆమెకు లాబ్ లోనూ, కార్యశాలల్లోనూ, లైబ్రరీలో కూడా ఎప్పుడంటే అప్పుడు, ఎంత సేపంటే అంతసేపు అనుమతి ఉండడంతో భద్ర రకరకాల ప్రయోగాలు చేసే అవకాశం ఏర్పడింది.

చూస్తుండగా ఏడు నెలలూ ఇట్టే గడచిపోయాయి.

ఢిల్లీ నుంచి పోటీనాటికి భద్ర, ఆమె జట్టుతో బాటు ఓ అధ్యాపకుడు వెంట రాగా ముంబాయ్ బయలుదేరారు.

ప్రయత్నించినా సుహాగ్‌కు ఆ జట్టులో చేరే అవకాశం రాలేదు. పైగా అతను ఆఖరి ఏడాది కావడంతో అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్‌తో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.

మరో పక్క తను ఇంక ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోయే సమయం వస్తున్నా భద్ర తన ప్రేమలో పడకపోవడం అతనిలో అసహనాన్ని కలిగిస్తోంది.

సాగర్ కూడా ఆఖరి ఏడాది. అతను భద్రను నిజాయితీగా ప్రేమిస్తున్నాడు.

ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. అదేమీ తెలియని భద్ర మాత్రం వాళ్ళిద్దరినీ తన సీనియర్స్ గానే చూస్తోంది తప్ప ఆమెలో ఏ ఇతర భావాలూ లేవు.

(ఇంకా ఉంది)

Exit mobile version