[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[సెకండ్ సెమిస్టర్ మొదలయ్యాకా, విద్యార్థులకి ఉపకరించే కార్యక్రమాలు చాలానే ఉన్నా, భద్ర వాటన్నిటో ఉత్సాహంగా పాల్గొని, మరిన్ని ప్రయోగాలు చేస్తుంది. కాలేజీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో తమ బృందం రూపొందించిన వస్త్రాలను ప్రదర్శనకి ఉంచుతుంది. ఫంక్షనల్ టెక్స్టైల్స్ అండ్ క్లోతింగ్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించే అవకాశం భద్ర చదువుతున్న కాలేజీకి దక్కుతుంది. కాలేజ్ హెడ్ విద్యార్థులని సమావేశపరచి ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, కాలేజీకి మంచి పేరు తేవాలని సూచిస్తారు. భద్ర, అమిత్, సుహాగ్, వీణ, పటాన్ లను ఒక బృందంగా ఏర్పరచి, వాళ్ళకి కావల్సినవన్నీ సమకూర్చుతారు. ఈ ఐదుగురూ అహోరాత్రాలు శ్రమించి ఏర్పాట్లు చేస్తారు. ఈ పోటీలో భద్ర జట్టుకి రెండవ స్థానం దక్కుతుంది. కాలేజ్ యాజమాన్యం, ఇతర విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తారు. భద్ర రెండేళ్ళ చదువు పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలో అడుగుపెడుతుంది. సుహాగ్ని దూరం పెడుతుంది. ఆమెని తన దారికెలా తెచ్చుకోవాలో అతనికి అర్థం కాదు. భద్ర స్టూడెంట్‌గా ఉండగానే కొంతమందిని జత చేసుకుని తాము రూపొందించే దుస్తులకి ఓ బ్రాండ్ ఏర్పాటు చేసి, తగిన అనుమతులు తీసుకుని, ఆన్లైన్లో విక్రయించడం మొదలుపెడుతుంది. బొంబాయిలో జరిగే ‘లక్మే ఫ్యాషన్ వీక్’లో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యార్థులు వాళ్ళ ఖర్చులు వాళ్ళే భరించాలనీ, కానీ, ఈ పోటీలో పాల్గొనడం మంచి అవకాశమనీ కాలేజ్ హెడ్ చెప్తారు. తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది భద్ర. పోటీనాటికి భద్ర, ఆమె జట్టుతో బాటు ఓ అధ్యాపకుడు వెంట రాగా ముంబయ్ చేరుతారు. సుహాగ్కి ఆ జట్టులో చేరే అవకాశం రాదు. భద్ర తన ప్రేమలో పడకపోవడం అతనికి అసహనం కలిగిస్తోంది. సాగర్ కూడా భద్రని నిజాయితీగా ప్రేమిస్తాడు. భద్రకు తెలియకుండానే, ఆమెను అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. వాళిద్దరినీ తన సీనియర్స్ గానే చూస్తుంది తప్ప ఆమెలో ఇతర భావనలు లేవు. ఇక చదవండి.]
సాగర్‌కు – సుహాగ్ భద్రని ప్రేమిస్తున్నాడనీ, ఆమెను ప్రేమలో దింపే ప్రయత్నం చేస్తున్నాడనీ తెలిసి – ఇంక ఉండబట్టలేక పోయాడు.
ఇక్కడ కాలేజ్‌లో దొరకని సమయాన్ని అక్కడ ముంబయ్‌లో దక్కించుకోవాలన్న ఆశతో అతను కూడా వాళ్ళతో బాటు ముంబయ్ బయలుదేరాడు.
దానికోసం ఒక అవకాశాన్ని సృష్టించుకున్నాడు. పోస్టర్ డిజైన్స్‌ను త్రీడీ, ఫోర్ డీలలో, వర్చువల్‌గా చూపడానికి తమ కాలేజ్‌లో ప్రత్యేక అనుమతి తీసుకుని వారి వెంట వెళ్ళాడు.
ఆ విషయం చివరివరకూ తెలియని సుహాగ్, వాళ్ళు వెళ్ళాకా తెలిసి చాలా కంగారుపడ్డాడు.
అతనికి సాగర్ భద్రను ప్రేమిస్తున్న విషయం, రాగ నుంచీ, ఆమె స్నేహితులనుంచీ ఆమెను కంటికి రెప్పలా కాచుకుంటున్న విషయం తెలుసు. అందుకే యిప్పుడు ఈ అవకాశాన్ని సాగర్ తనకు అనుకూలంగా ఎక్కడ మలచుకుంటాడో అన్న వెరపు కలిగింది.
ఇక ఊరుకోలేకపోయాడు. వాళ్ళ వెనకే తనూ ముంబయ్ చేరాడు. ఇవేవీ తెలియని భద్ర వాళ్ళిద్దరితోనూ మామూలుగానే ఉంది.
సాగర్‌కి మాత్రం సుహాగ్ని చూస్తూనే కలవరం మొదలైంది.
ఒకే చదువు కాబట్టి సుహాగ్కి భద్రతో మాట్లాడే అవకాశం, గడిపే అవకాశం ఎక్కువగా ఉంటోంది.
అది సాగర్‌లో కలవరాన్ని పెంచేస్తుంటే స్థిమితంగా ఉండలేకపోయాడు.
ఈలోగా అనుకోకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న భద్రకు విపరీతంగా అలసిపోవడం వలన ఒళ్ళు నెప్పులు, జ్వరం రావడంతో కంగారుపడి ఆసుపత్రికి తీసికెళ్ళాలి అని కలవరపడుతున్న తమ ప్రొఫెసర్‌తో..
“మీరేం కంగారుపడకండి సార్, ఇక్కడే బాంద్రాలో మా కజిన్ పనిచేస్తున్న ఆసుపత్రి ఉంది. మీరు అనుమతిస్తే నేను తీసికెడతాను” సాధ్యమైనంత మామూలుగా, స్వరంలో ఎటువంటి భావం పలకకుండా అన్నాడు సాగర్.
“అమ్మయ్య! ఎలాగా అనుకుంటున్నా, రక్షించావు. తీసికెళ్ళు” స్థిమితపడ్డ మనసుతో అన్నాడాయన.
సుహాగ్ మాత్రం చేదుతిన్న ముఖంతో తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు.
సాగర్ కేబ్ బుక్ చేసి జ్వరంతో సోలిపోతున్న భద్రను జాగ్రత్తగా పొదవి పట్టుకుని డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళాడు.
ఆమెను పరీక్ష చేసిన డాక్టర్.. “భయపడాల్సినదేమీ లేదు, అలసట వలన వచ్చిందే, బాగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది” అని చెప్పి మందులు రాసిచ్చి పంపేసాడు.
అక్కడ పక్కనే ఉన్న కాఫీ షాప్‌కి తీసికెళ్ళి కాఫీ, టిఫిన్ లతో మందులు వేసి జాగ్రత్తగా మళ్ళీ ఆమెను హోటల్ గదికి చేర్చాడు.
మనసులో మాట చెపాలని ఉన్నా, జ్వరంతో ఉన్న ఆమెకు ఎలా చెప్పాలో తెలియక అప్పటికి ఊరుకున్నాడు.
ఆ తరువాత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తన ఆన్లైన్ వ్యాపారం మొదలుపెట్టడం గురించి ఆమె తనతో చెప్పినప్పుడు..
‘భద్రా! నువ్వు పెట్టదలుచుకున్న డిజైన్స్ నాకు మెయిల్ చెయ్యి, నేను వాటీని త్రీడీలో అమ్మాయిలకు, అబ్బాయిలకూ వేసి డిజైన్ చేసిన ఫోటోలు ఇస్తాను, వట్టి డ్రెసెస్ చూడడం కంటే ఈ రకమైన ప్రచారం వలన అవి త్వరత్వరగా జనంలోకి వెడతాయి’ అన్న అతని సలహా ఆమెకు బాగా నచ్చింది.
అలాగే తను చేసిన పోస్టర్ డిజైన్స్ త్రీడీలను ఆమెకు వర్చువల్‌గా చూపిచడంతో ఆమె బాగా థ్రిల్ అయి అతను తనకు చెప్పిన సలహాకు అంగీకారం తెలిపింది.
తను డిజైన్ చేసిన మగవారి బట్టలు అతనిని వేసుకుని ప్రెజెంట్ చేయమన్న ఆమె మాటలకు సాగర్ వెంటనే అంగీకరించాడు.
వరసగా ఐదురోజులపాటు జరిగే ఆ షోలో అప్పటికే జ్యూరీలో ఎంపిక చేయబడ్డ ఆహ్వానితులు తమతమ డిజైన్స్‌ని అక్కడ ప్రదర్శించారు.
దానికోసం ప్రత్యేకంగా ఎంపిక కాబడ్డ మోడల్స్ వేసుకుని రాంప్ వాక్ చేసారు.
మన దేశం నలుమూలలనుంచీ కూడా ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ డిజైనర్స్, ఫ్యాషన్ కాలేజ్ విద్యార్ధులూ కూడా రావడంతో ఆ కార్యక్రమం శోభాయమానంగా వెలిగిపోయింది.
అన్ని స్టాల్స్ తిరిగి, ఎన్నో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ డిజైన్ చేసిన రకాలు చూసేకొద్దీ భద్ర మతిపోయింది. తను నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉందనుకుంది.
వాటిలో కొన్ని భద్ర మనసుకు హత్తుకుపోయాయి. సాదియా అసద్ నూర్ వింటర్ ప్రింట్ ఖాస్ రకాలు, చరిజ్మా ఎంబ్రాయడరీ ప్రింటెడ్ షిఫాన్లో రకాలు, రంగ్ రసియా షిఫాన్ ఫార్మల్స్, ముష్క్ డార్లింగ్ వెడ్డింగ్స్ యిలా ఒకటా రెండా ఎన్నో రకాలు, కళ్ళు చెదిరే రంగులతో, అందానికీ, మన్నికకూ పోటీపడుతూ ఆ షోకి కళ తెచ్చాయి.
భద్ర, సాగర్‌తో కలిసి ఆ స్టాల్స్ అన్నీ తిరగడం గమనించిన సుహాగ్కి మనసు మండిపోయింది.
భద్ర తన జట్టుతో కలిసి పెట్టిన ఉత్పత్తులన్నీ, అక్కడున్న మిగతావాటితో పోలిస్తే తక్కువ ధరలో, మేలురకంగా ఉండడంతో దాదాపుగా అన్నీ అమ్ముడయిపోవడం ఆమెకో నమ్మకాన్నీ, ధైర్యాన్ని ఇచ్చింది.
తాము నలుగురూ కలిసి పెట్టిన పెట్టుబడిలో, ముడిసరుకు ఖర్చులు తీసేయగా మిగతా సొమ్ము నలుగురూ సమంగా తీసుకున్నా, మిగతా ముగ్గురూ మళ్ళీ తమ సొమ్ములోనుంచి తలా కొంతా తీసి భద్రకి యివ్వడం అభినందనీయం.
‘వద్దు, వద్దం’టూ మొహమాటపడిన భద్రను.. “మా అందరి కంటే ఎక్కువ శ్రమపడ్డావు, న్యాయంగా ఇదంతా నీకే యివ్వాలి కానీ, మా యింట్లో వాళ్ళు పంపిన సొమ్ముకు కాస్తైనా లాభాలు చూపించాలి కదా!” అంటూ నవ్వేసారు.
భద్ర మనసంతా సంతోషంతో నిండిపోయింది.
తను అనుకున్నట్టు చదువు పూర్తవుతూనే చేయబోయే పనికి ఇది ముందస్తు శిక్షణగా భావించి, దేశంలో జరిగే ప్రతీ ఫ్యాషన్ షోకీ తప్పక హాజరు కావాలన్న ధృఢ నిశ్చయం చేసుకుంది.
అలా హాజరు కావడం వలన ఆర్ధికంగా మాట ఎలా ఉన్నా, దేశం నలుమూలలనుంచీ వచ్చే రకరకాల వస్త్రాలనూ, డిజైన్స్‌నూ చూసి తెలియని కొత్త విషయాలెన్నో తెలుసుకోవడమే మొదటి ప్రాధాన్యతగా భావించింది.
యిక్కడ కూడా భద్ర చేసిన డిజైన్స్‌కు కొత్తవారికిచ్చే ప్రోత్సాహక బహుమతి రావడం అభినందనీయం.
ఆ ట్రిప్‌లో భద్ర, సాగర్‌కి తనకు తెలియకుండానే దగ్గరవడం ఆమెకు భవిష్యత్తులో మంచే చేస్తుందో, చెడే చేస్తుందో కాలమే నిర్ణయించాలి అనుకుంది భద్ర.
ఎందుకంటే ఆమెకు సుహాగ్ తనను ప్రేమ పేరుతో తన వ్యాపారానికి పనికివచ్చే సాధనంగా కట్టిపడేయాలనుకోవడం అనుకోకుండా సుహాగ్ తన వారితో ఫోన్లో మాట్లాడడం వినడంతో తెలిసిపోయింది.
కాల్ మాట్లాడి వెనుదిరిగిన సుహాగ్ కు తనకు అత్యంత సమీపంలో నిశ్చేష్టురాలై ప్రతిమలా నిలబడడంతో ‘ఆమె విషయం విన్నదనీ, అందుకే అలా నిలబడిపోయిందనీ’ అర్థమై ఇంక ఆమెకు ముఖం చూపించలేక వెంటనే వెళ్ళిపోయాడు.
కానీ మొదట నుంచీ సాగర్ తన పట్ల చూపించే శ్రద్ధా, సంరక్షణా ఆమెకు నమ్మదగినవిగానే కనబడ్డాయి. ఆమెకు అతని మీద ప్రేమ కలుగుతున్నప్పుడే సుహాగ్ గురించి తెలియడంతో ఆమె మనసు కలవరానికి గురి అయింది.
సాగర్ కూడా తనను అదే ఉద్దేశంతో ఇష్టపడుతున్నట్టు నటిస్తున్నాడా, లేక నిజంగా ప్రేమిస్తున్నాడా! అన్న సందేహానికి బీజం పడింది.
ఉన్నట్టుండి తనతో ముభావంగా ఉంటున్న భద్ర ప్రవర్తన అర్థం కాక సాగర్ కలవరపడిపోయాడు.
అప్పటివరకూ తనతో ఎంతో ఆత్మీయంగా, దగ్గరతనం చూపిన ఆమె అంతలోనే అలా ఎందుకు ప్రవర్తిస్తోందీ అన్నది అర్థం కాక అల్లాడిపోయాడు.
ముంబై వచ్చిన ఈ వారం రోజుల్లో, భద్ర తనపట్ల చూపిన దగ్గరతనంతో సాగర్ మదిలో మొలకెత్తిన చిరు ఆశ మొగ్గగానే వాడినంత బాధ కలిగింది.
‘ఏమైందీ పిల్లకు, నిజంగా తన మీద ప్రత్యేక అభిమానం చూపించిందా లేక ఆమె జ్వరంతో ఉన్నప్పుడు తను చూపిన ఆదరానికి ప్రతిగా తనతో అలా మెలిగిందా?’ అతని మనసులో అనేక సందేహాలు.
వచ్చినప్పుడు ఆశతో వచ్చాడు. ఇక్కడున్నన్నాళ్ళు ఆనందంగా ఉన్నాడు. యిప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు అంతులేని వేదన. ‘ఇక అంతేనా! ఆమె తన ప్రేమను గుర్తించదా, అంగీకరించదా!’ మనసులో వేదన సుళ్ళు తిరుగుతుండగా చిన్నబోయిన ముఖంతో ఉన్న సాగర్ని గమనించినా గమనించనట్టే ఉంది భద్ర.
ఆమెకు అసలు ఈ ప్రేమలూ, పెళ్ళిళ్ళ మీద పెద్దగా ఆసక్తి మొదటే లేదు, దానికి తగ్గట్టే తనకు ఒక స్థిరమైన లక్ష్యం ఉంది. దాని మీదే దృష్టి పెట్టుకున్న ఆమెకు అనుకోకుండా సాగర్ చేరువయ్యాడు.
ఇంకా ఒక నిర్ణయానికి రాక ముందే సుహాగ్ మాటలు ఆమెను గందరగోళంలో పడేసాయి.
ఇంకా చదువు పూర్తి కాకుండానే ఆమె సాధించిన విజయం తక్కువదేం కాదు. ఎందరో హేమాహేమీలున్న ఆ పోటీలో ప్రోత్సాహక బహుమతి కూడా చిన్న విషయమేమీ కాదు.
అయితే అంతా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వేళ, భద్ర, సాగర్ మాత్రం ఉదాశీనంగా ఉండడం గమనించిన మాష్టారికి అనుమానం వచ్చింది.
ప్రత్యక్షంగా తన విద్యార్ధి కాకపోయినా ఆయనకు సాగర్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. అందుకే అతడు అడగగానే తమ వెంట రావడానికి అనుమతినిచ్చాడు.
అలాగే భద్రని అతనితో డాక్టర్ దగ్గరకు పంపాడు. కానీ యిప్పుడు వీళ్ళ తీరు చూసాకా సందేహం వచ్చింది.
అయితే భద్ర విషయం తెలిసిన ఆయన ఎక్కువగా ఆలోచించలేదు.
జ్వరం వచ్చి తగ్గడం వలన వచ్చిన నీరసం, గత కొన్ని నెలలుగా ఆమె పడుతున్న శ్రమ వలన వచ్చిన అలసటగా భావించాడు.
కానీ సాగర్, అప్పటివరకూ ఉత్సాహంగా భద్రకు చేదోడువాదోడుగా ఉన్న అతను అకస్మాత్తుగా ఎందుకలా చిన్నబోయాడు?
అప్పుటికప్పుడు ఏ నిర్ణయానికీ రాకుండా, ఆయన ఆ యిద్దరి మీదా ఓ కన్నేసుంచాడు.
భద్ర బృందానికి ఘన స్వాగతం పలికారు మిగతా విద్యార్ధులూ, అధ్యాపకులూ కూడా. అన్యమనస్కంగా ఉన్న భద్రకు అవేవీ సంతోషాన్ని కలిగించలేదు.
సుహాగ్ మళ్ళీ రాగతో చనువుగా ఉండడం మొదలుపెట్టాడు.
సాగర్నీ, భద్రనీ గమనిస్తున్న అతనికి వాళ్ళిద్దరూ కొంత ఎడముఖం పెడముఖంగా ఉండడం ఆనందం కలిగించింది.
భద్రకు పెద్ద పుష్ప గుచ్ఛాన్నిచ్చి అభినందనలు తెలుపుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేయబోయిన అతనిని చూపులతోటే అంత దూరాన్ని పెట్టింది.
కేవలం తన తెలివితేటలను, నైపుణ్యాన్ని వాళ్ళ వ్యాపారానికి వాడుకోవడానికే అతను తనతో ప్రేమ నాటకం మొదలుపెట్టాడు అన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది.
నయమే తనింకా ఆ ఉచ్చులో పడక ముందే ఆ విషయం తెలియడం మంచిదయింది. లేకపోతే తను అతనిని ఒప్పుకోలేక, మరచిపోలేకా జీవితం నరకం అయ్యేది.
ఇది జరిగినప్పటి నుంచీ అసలే కొంచెం రిజర్వ్డ్గా ఉండే భద్ర మరింత మౌనంగా మారిపోయింది.
ఎవరితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే అన్నట్టుగా తన చదువూ, పనీ తన లోకం, అంతే.
మూడో ఏడాది పరీక్షలు కూడా అయిపోయాయి. భద్ర యిల్లు విడిచి, తల్లినీ తండ్రినీ చూసి మూడేళ్ళయిపోయింది.
ఆ ఏడాది సెమిస్టర్ పరీక్షలు అయిపోగానే ఆమెకు యింటి మీద ధ్యాస మళ్ళింది.
సెలవుల్లో చేయాల్సిన పని అంతా ప్లాన్ చేసి పెట్టుకుని కాకినాడ రైలు ఎక్కింది.
కాకినాడ స్టేషన్లో రైలు దిగిన భద్రను చూస్తూనే తల్లీతండ్రీ వచ్చి కెరటంలా చుట్టేసారు. తల్లి మా లచ్చిమయితే భద్రను హత్తుకుని ఒకటే ఏడుపు, “ఇన్నాళ్ళు మమ్మల్ని సూడకుండా ఎట్టున్నావే” అంటూ.
తండ్రి కూడా మరో పక్క భద్రను గట్టిగా హత్తుకున్నాడు.
తమ కళ్ళముందు ఆడుతూ పాడుతూ తిరిగిన బిడ్డ యిప్పుడు పెద్ద చదువులు చదువుతోంది అంటే ఓ పక్క ఆనందం, మరోపక్క ఏదో తెలియని బెదురు.
వాళ్ళిద్దరితో బాటు తమ ఇంటిపక్క సీతాలు అత్త, గంగులు మామయ్యా కూడా వచ్చారు.
“నన్ను ఇటినుంచే ఇటే పంపేస్తారా, మనం ఇంటికి వెళ్ళద్దా!” నవ్వుతూ అడిగుతున్న కూతురిని చూసి అప్పుడు స్పృహలోకొచ్చింది మాలచ్చిమి.
“అయ్యో! ఈడనే ఉండిపోనామేటి, పదండి పదండి ఇంటికి” అంటూ స్టేషన్ బయటకొచ్చారంతా.
చిక్కి సగమయినా, విజ్ఞానం ఇచ్చిన కళతో కళకళ్ళాడుతూ కనిపించిన కూతురికి ఇంటికి వస్తూనే దిష్టి తీసి, హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళింది మాలచ్చిమి.
భద్ర వచ్చిందని తెలిసి ఆ ఊళ్ళోవాళ్ళంతా ఒక్కొక్కరుగా వచ్చి పలకరించి వెడుతున్నారు.
“నీకేయో పెద్ద పెద్ద బగుమతులొచ్చినయ్యంట కదా! మీ అమ్మా బాబూ ఒకటే మురుస్తున్నారు. ఏదో నూలు వడుక్కుంటా, దారాలు పేనుకుంటా బ్రతికేటోళ్ళం, మన యింటి బిడ్డ అంత పెద్ద సదువులంటే చానా ఆచ్చెర్రంగా ఉంది. పెట్టిపుట్టారు మాలచ్చి, సోములూ సదువుల తల్లిని కడుపున కన్నారు” అన్నాడు దేశయ్య.
“బాబాయ్! నే చెప్పిన సంగతేం చేసారు? నేను ఊళ్ళో నెల్లాళ్ళుంటాను, ఆ లోగా మనం అనుకున్న పని అయిపోవాలి. రేపు అందరినీ రాములవారి గుడికి రమ్మను, అక్కడ నేను అందరికీ అర్థం అయ్యేలా చెప్పి ఒప్పిస్తాను.” అంది భద్ర.
“ఏటే, ఇంటికొచ్చి ఇంకా గంట కూడా కాలా, మళ్ళీ అప్పుడే పనా! నా తల్లి రొన్నాళ్ళు కూతంత గమ్మునుండమ్మా, ఎంత సిక్కిపోనావో తెలుత్తుందా, కల్ళలో ఉన్నయి పానాలు..” మాలచ్చిమి లబోదిబోమంది.
“అమ్మా! నేను బాగానే ఉన్నాను. యిప్పుడు కూడా ఊరికే మన వాళ్ళతో మాట్లాడడమే, కష్టపడిపోయేదేమీ లేదు..” చిన్నగా నవ్వుతూ తల్లికి నచ్చచెప్పింది భద్ర.
(ఇంకా ఉంది)
మీనాక్షీ శ్రీనివాస్ గారి స్వస్థలం కాకినాడ. జననీ, జనకులు – కీ.శే శ్రీమతి మహీధర వేంకట దుర్గాంబ, కీ.శే శ్రీ మహీధర వేంకటరామ దీక్షితులు.
జీవితభాగస్వామి శ్రీయుతులు శ్రీనివాస్. ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనుమరాలు, మనుమడు.
ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) విశ్రాంత అధికారిణి. విశాఖ రేడియో కేంద్రంలో, డ్రామా ఆర్టిస్ట్‌గా ఎంపికయి, కొన్నేళ్ళపాటు కొనసాగి, బదిలీల కారణంగా విరమించుకున్నారు. ఏడు రేడియో నాటికలు, 330 పైగా కథలు, అన్ని పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్నింటికి బహుమతులు వచ్చాయి. 22 కథల సంపుటి ‘నిశీథిలో నక్షత్రం’ అక్టోబర్ 2016లో వెలువడింది. 19 నవలలు చతుర, ఆంధ్రభూమి, స్వాతి మొదలగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీటిలో ఐదు అపరాధ పరిశోధక నవలలు. బహుమతి పొందిన ‘భద్ర’ వీరి తొలి మినీ నవల (20).
రెండవ సంపుటి తపస్వీ మనోహరం కథల పోటీలో విజేతగా, బహుమతి కథలు ఏడింటితో బాటు వీరి కథలు మరో పద్దెనిమిది కలిపి ‘బహుమతి’ 2024 నవంబర్ లో ప్రచురించడం జరిగింది.
తపస్వీ మనోహరం సంస్థ వీరి అపరాధ పరిశోధక నవల ‘రామాపురం బంగ్లా’ డిసెంబర్ 2025 లో ప్రచురించింది.
పద్యరచనలో ఓనమాలు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు, శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారి వద్ద దిద్దారు.
03 ఏప్రిల్ 2024 న లేఖినీ సంస్థవారు, డాక్టర్ వాసా ప్రభావతి గారి పేరిట, వారి అమ్మాయి జఠావల్లభుల మీనాక్షిగారిచే పొందిన మాతృవందన పురస్కారం అందుకోవడం మరచిపోలేని అనుభూతి.
