Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భద్ర-7

[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[భద్ర ఓ షో పాల్గొనేందుకు ముంబై వెళ్తుంది. సుహాగ్‌ ఆమెను దక్కించుకోడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన సాగర్, ముంబై వెళ్ళాలనుకుంటాడు. పోస్టర్ డిజైన్స్‌ను త్రీడీ, ఫోర్ డీలలో, వర్చువల్‌గా చూపడానికి తమ కాలేజ్‌లో ప్రత్యేక అనుమతి తీసుకుని భద్ర బృందంతో వెళ్తాడు. ఈ విషయం తెల్సిన సాగర్, తానూ కూడా ముంబై చేరుతాడు. ఇవేవీ తెలియని భద్ర వాళ్ళతో మామూలుగానే ఉంటుంది. ఒకరోజు భద్రకు జ్వరం వస్తుంది. ఫ్రొఫెసర్ గారు కంగారు పడుతుండడంతో, సాగర్ ధైర్యం చెప్పి, తన కజిన్ పనిచేసే ఆసుపత్రికి భద్రని తీసుకువెళ్తాడు. కంగారు పడాల్సిందేమీ లేదని, అలసట వలన వచ్చినదనేననీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కొన్ని మందులు రాసిస్తారు డాక్టర్. ఆ మందులు కొని, కాఫీ, టిఫిన్ లతో మందులు వేసి జాగ్రత్తగా మళ్ళీ ఆమెను హోటల్ గదికి చేరుస్తాడు. ఆన్‌లైన్ వ్యాపారం కోసం కొన్ని సలహాలు చెప్తాడు. అవి భద్రకు నచ్చుతాయి. తాను డిజైన్ చేసిన మగవారి దుస్తులను ధరించి ప్రెజెంట్ చేయమని సాగర్‌ని అడిగితే, ఒప్పుకుని, అలాగే చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరగడం చూసిన సుహాగ్ తట్టుకోలేకపోతాడు. అన్ని స్టాల్స్‌లో ఉన్న ఉత్పత్తులను, వాటి తయారీ వివరాలు అన్నీ తెలుసుకుంటూ తాను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనుకుంటుంది భద్ర. ఫోన్‌లో మాట్లాడుతూ సుహాగ్ తను భద్రని ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటాడో చెప్పడం విని, విస్తుపోతుంది భద్ర. తన ఉద్దేశం ఆమెకి తెలిసిపోయిందని, ఆమెకి దూరంగా ఉండడం మొదలుపెడతాడు సుహాగ్. సుహాగ్ విషయంలో దెబ్బతిన్న భద్ర, సాగర్ విషయంలో తొందరపడకూడదనుకుంటుంది. అతనితోనూ ముభావంగా ఉంటుంది. సాగర్‌కి ఏమీ అర్థం కాదు. మూడో ఏడాది పరీక్షలు కూడా అయిపోవడంతో సెలవుల్లో ఏయే పనులు చేయాలో నిర్ణయించుకుని ఊరికి వెళ్తుంది భద్ర. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా అబ్బురంగా చూస్తారు భద్రని. తాను చెప్పిన ఆలోచన గురించి దేశయ్యకి గుర్తు చేసి మర్నాడు అందరినీ రాములవారికి గుడికి తీసుకురమ్మంటుంది. ఇక చదవండి.]

సెలవులకు యింటికి వెళ్ళిన సాగర్ మనసు మనసులో లేదు. కళ్ళు తెరిచినా మూసినా భద్రే కళ్ళముందు మెదులుతోంది. ‘ఏమైంది తనకు, అంతకు ముందు తనతో క్లోజ్‌గా లేకపోయినా కనీసం స్నేహంగా ఉండేది. ముంబైలో ఉన్న వారం రోజుల్లో బాగా దగ్గరతనం చూపించింది. కానీ ఆఖరులో ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయింది? అసలు ఆ సుహాగ్ గాడెందుకు ఉన్నట్టుండి ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు? వాడు తనతో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అందుకే అలా బిగుసుకుపోయిందా?’ తన చదువు ఈ ఏటితో అయిపోయింది, తనకు కేంపస్‌లో ఉద్యోగం కూడా వచ్చేసింది. యిప్పుడు కనక తను ధైర్యం చెయ్యకపోతే ఇక ఎప్పటికీ తను దూరమైపోతుంది.

తెలియని తెగింపేదో వచ్చేసింది సాగర్‌కి.

‘తను ఉద్యోగంలో చేరడానికి ఇంకా నెలరోజుల గడువుంది. ఈలోగా ఒకసారి భద్ర వాళ్ళ ఊరు వెళ్ళి, ఆమెతోనూ, ఆమె తల్లితండ్రులతోనూ మాట్లాడి వస్తే!’ భద్ర వెళ్ళిన రెండురోజులకే ఆ ఆలోచన వచ్చిందే తడవు ఇంట్లో వాళ్ళకు స్నేహితుడి దగ్గరకు వెడుతున్నానని చెప్పి కాకినాడ వెళ్ళే రైలు జనరల్ భోగీలో ఎక్కేసాడు.

***

భద్ర అడిగినట్టు దేశయ్య ఉప్పాడలో ఇంకా నేతపనినే నమ్ముకున్న వారినందరినీ ఆ మర్నాడు రాములవారి గుడిలో సమావేశపరిచాడు.

అందరికీ తమ కళ్ళ ముందు పెరిగిన భద్ర అంత పెద్ద చదువులు చదువుతూ కూడా, ఇంకా తమ గురించి ఆలోచించడం, తామందరితో అంత ప్రేమగా, అభిమానంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది.

తమ వాళ్ళలోనే కాస్త పెద్ద చదువులు చదివిన కొందరు కుర్రాళ్ళు తమందరినీ చిన్నచూపు చూడడమే కాక తమ తల్లితండ్రులను కూడా గాలికి వదిలేసి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడెక్కడో స్థిరపడడం చూసిన వాళ్లకు భద్ర చాలా అపురూపంగా కనబడింది.

“ఏటి భద్రమ్మా, నువ్వంత పెద్ద సదువులు సదివి కూడా ఇంకా మాసుటోళ్ళని గుర్తెట్టుకోడమే కాక, మా కోసం ఆలోసిత్తన్నావు. నీ మనసు బంగారం.. సెప్పు ఏటి సెయ్యాలో, మేమంతా నీ యెనకమాలే ఉంటం..” అందరిలోకీ పెద్దవాడయిన రాములు తాత అన్నాడు. అతనికి దాదాపుగా ఢభై ఏళ్ళు పైబడ్డా ఇంకా మగ్గం వేస్తాడు.

నామాలు ఉచ్చులోపడి సర్వం పోగొట్టుకున్నవాళ్ళలో అతనొకడు. అయినా ఏ రోజూ అతను తన వృత్తిని తిట్టుకోలేదు, వదులుకోలేదు.

నాలుగేళ్ళ క్రితం శాలిని పుణ్యమాని అతని అప్పులు తీర్చి బయటపడ్డాడు.

యిప్పటికీ అతను నేసిన చీరలు శాలిని వాళ్ళందరి చేతా మొదలుపెట్టించిన సహకార సంఘానికే అమ్ముతారు. ఆ సంఘాన్ని చూసే బాధ్యత దేశయ్యకు అప్పగించి తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది.

అప్పటినుంచీ చాలా మటుక్కు వాళ్ళ జీవితాలు గాడిన పడినా, అలవాట్లు, అనారోగ్యాలు తిరిగి నామాలు దగ్గర అప్పులు చేసేలా చేసిన కొంతమంది పరిస్థితి మాత్రం మళ్ళీ మొదటికే వచ్చింది.

అందుకే అక్కడున్న వాళ్ళలో కొంతమంది ఉదాసీనంగా ఉన్నారు.

“ఏటి రామయ్యా, అన్నీ తెలిసి నువ్వూ మళ్ళీ అదే పాట పాడతావు, భద్ర మాత్రం ఈడ కూసుంటదా, రేపోమాపో పెళ్ళి సేసుకుని తన దారిన తను పోద్ది. ఆ శాలిని ఏటి సేసింది? ఉడుకు రత్తం, ఏదో సేద్దారనుకుంటారు, ఏటీ సెయ్యకుండా పోతారు, ఇసుమంటివి ఎన్ని సూళ్ళా!” నిరాసక్తంగా అన్నాడు వీరయ్య.

“అలా ఏం ఉండదు వీరయ్య తాతా, శాలినీ అక్క ఓ బాట వేసి వెళ్ళింది, దాని వెంట వెళ్ళి, మన పరిస్థితి మెరుగు చేసుకోవడం మన పని. అది మానేసి అక్కను తిట్టుకోవడంలో అర్థం లేదు. ఇక్కడ ఎంతమంది ఆమె చెప్పిన మాట విని, వేసిన బాటలో నడిచారు చెప్పు. తప్పు మన దగ్గర ఉంచుకుని అక్కనెందుకు ఆడిపోసుకోవడం. సరే అయిందేదో అయింది. యిప్పుడు నేను చెప్పేది శాశ్వత ఉపయోగకరం.

నేను ‘భద్ర ట్రెండీ క్లోత్స్’ అని ఆన్‌లైన్ వ్యాపారం మొదలుపెట్టాను. మీరు చేయాల్సినదల్లా ఎప్పుడూ నేసే చీరలు మాత్రమే కాక కుర్తీలు, చుడిదార్లు, చిన్న పిల్లల బట్టలు యిలా పలురకాల బట్టలే కాకుండా, అగ్నిమాపక దళం వారికోసం నిప్పుకు కాలని బట్టలు, సైనికుల కోసం చలికి వెచ్చదనాన్నిచ్చే దుస్తులూ, నీళ్ళలో తడవని బట్టలూ, ఇంకా ఒకే డ్రెస్ వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలం వెచ్చదనాన్ని ఇచ్చే విధంగానూ..”

“ఏటి సోద్దెం కబుర్లు సెపుతుండావ్! నలభై ఏళ్ళగా నేతపని సేత్తండా, అట్టాటి బట్టలేడుండాయ్? ఏటి తెలీదుకదాని కతలు సెపుతున్నావ్” సోడాబుడ్డి కొట్టినట్టు నవ్వాడు అప్పుడే అక్కడకి వచ్చిన నామాలు.

“మీరు చేసింది, చూసింది ఇక్కడే కదా బాబాయ్! మనకి తెలియని ప్రపంచం చాలా ఉంది. యిప్పుడు నేను చదువుకున్న చదువదే, నేను అవన్నీ చదువుకున్నాను, నేర్చుకున్నాను, చేసాను, వాటినే మొన్న పోటీలో పెడితే నాకు బహుమతి రావడమే కాదు, ఆ బట్టలన్నీ హాట్ కేక్స్‌లా అమ్ముడయిపోయాయి. దానికేమంటారు? మనకి తెలిసిందే ప్రపంచం కాదు.” మర్యాదగానే చెప్పినా, ఘాటుగా చెప్పి జనంకేసి తిరిగింది.

“నేను ఇక్కడ నెలరోజులు ఉంటాను. వాటికి ఎలాంటి నూలు తయారు చెయ్యాలి, ఏ ఏ పదార్ధాలు ఏ మోతాదుల్లో కలపి, ఎలా తయారుచెయ్యాలి అవన్నీ మీకు నేను నేర్పుతాను. అలాగే దేనికి ఎలా తయారుచేస్తారు అనేది మీకు అర్థమయ్యేలా చెబుతాను. మీరు అనవసరమైన సందేహాలు పెట్టుకోకండి. నన్ను నమ్మండి. అలా తయారైన వాటిని నేను ఆన్‌లైన్‌లో అమ్ముతాను. ఆ వచ్చిన సొమ్ము ఒక యిరవై శాతం వ్యాపారం నడపడానికి నేను తీసుకుని మిగతావి ఎవరు తయారుచేసినదానికి వచ్చిన సొమ్ము మీ మీ ఖాతాల్లో జమ చేస్తాను.

మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఎవరి దయాధర్మాలకీ అర్రులు చాచక్కరలేదు. ఇన్నేళ్ళు మీరు కష్టపడ్డారు, మేడలూ మిద్దెలూ వేరేవాళ్ళు కట్టుకున్నారు. యిప్పుడు మీ కష్టంతో మీ కడుపునిండా తిండితినండి, హాయిగా ఉండండి.” ఆవేశంగా చెప్పింది భద్ర.

అంతా ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళకు భద్ర చెప్పిన విషయం అంతా అర్థం కాకపోయినా ఆమె చెప్పినట్టు చేస్తే తమ కష్టాలు తీరుతాయని వాళ్ళకు అర్థమైంది. వాళ్ళ ముఖాలు ఆనందంతో పుచ్చపువ్వులా విచ్చుకున్నాయి.

“భద్రమ్మా, నువ్వెలా చెబితే అలా సేత్తాం. నువ్వు సెప్పేటియన్నీ కొత్తగున్నాయ్.. మాకు మంచిగ నేర్పియ్..” వీరయ్య అన్నాడు.

“అలాగే బాబాయ్, మీరంతా రేపటి నుంచి ఉదయం పదికల్లా మా యింటి దగ్గరకొచ్చేయండి. ఎందుకంటే కావలసిన వస్తువులన్నీ మా యింటిదగ్గరే ఉన్నాయి కదా మరి..”

“అట్టానే భద్రమ్మా! మరిక యెడదామా, మీ అమ్మా, అయ్యా సూస్తుంటారు. ఊర్నుంచి రాగానే ఇట్టా మందికోసం వచ్చేస్తే పాపం ఆళ్ళు బాధపడరా.. నడు ఈయాల్టికి ఆళ్ళతో గడుపు, రేపటినుంచెటూ పనిలో పడతావ్” పక్కింటి గంగులు అన్నాడు.

“సరే, వెడదాం పదండి. రేపు తప్పకుండా రండి మరి..” అంటూ లేచింది.

మర్నాడు ఉదయం చాలా రోజుల తరువాత ఎనిమిది గంటల దాకా పడుకుంది భద్ర. మాలచ్చిమి, సోమయ్యా కూడా లేపలేదు.. ‘పిల్ల యిన్నాళ్ళూ సానా కట్టపడింది. పడుకోనీ’ అనుకుని వదిలేసారు.

వాళ్ళిద్దరూ కూడా ఆ రోజుకు ఏ పనీ పెట్టుకోలేదు.

సరిగ్గా పది అవుతూనే అంతా బిలబిల్లాడుతూ వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికే భద్ర లేచి తయారై తన లాప్‌టాప్ సెట్ చేసి రకరకాల డిజైన్స్ అన్నీ చూపించి అవి ఏ పదార్ధాలతో చేసారో, చేయాలో చెప్పి వాళ్ళకు అర్థమయ్యేలా విడమరచి చెప్పింది.

తరువాత నూలును శుభ్రపరిచి ఏ ఏ రసాయనాలు కలిపితే ఏ రకమైన దుస్తులు తయారు చేయచ్చో చెప్పి చూపించింది. కొన్ని వాళ్ల చేత చేయించింది.

మొత్తానికి వాళ్ళకు ఆ పనిలో ఉత్సాహం కలిగి, చేయడానికి పోటీపడ్డారు.

***

హడావుడిగా జనరల్ బోగీలో ఎక్కిన సాగర్ సరిగ్గా ఒక రోజు తరువాత అర్ధరాత్రి పూట కాకినాడ స్టేషన్‌లో దిగాడు.

రావడం అయితే ఆవేశంగా వచ్చేసాడు గానీ, భద్ర ఎలా తీసుకుంటుందో, ఏమంటుందో, వాళ్ళవాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం మొదలైంది.

తెలియనిచోట అర్ధరాత్రి ఎందుకు వెతుక్కుంటూ వెళ్ళడం అని తెల్లారే వరకూ అక్కడే స్టేషన్‌లో గడిపేసాడు.

తెల్లవారుతుండగా ఒక ఆటో మాట్లాడుకుని తూరుపు వెలుగురేకలు విచ్చుకుంటున్న వేళ సాగర్ తన గమ్యాన్ని వెతుక్కుంటూ ఉప్పాడలో నేత కార్యాలయం దగ్గర ఆటో దిగాడు.

అప్పుడప్పుడే జనాలు మెల్లిమెల్లిగా లేచి బయట తమతమ పనులు మొదలుపెట్టుకుంటున్నారు.

సాగర్‌కి భాష రాదు. అయినా భద్రలాంటి అమ్మాయి ఊరందరికీ తెలిసితీరుతుంది అన్న నమ్మకంతో..

“భద్ర, ఢిల్లీ..” రెండు ముక్కలు అడిగాడు వెడుతున్న ఒకతనిని ఆపి..

“అరే, భద్రమ్మ కోసమా!” అంటూ సాగర్‌ని తనతో రమ్మంటూ భద్ర యింటికి నడిచాడతను.

వేసవి కావడంతో త్వరగా తెల్లారి, అప్పటికే భద్ర మగ్గం ముందు కూర్చుంది.

“భద్రమ్మా! చూడు నీకోసం ఎవరో వచ్చారు..” అన్న మాటలతో తల ఎత్తిన ఆమెకు సాగర్ కనిపించి, తన కళ్ళను తనే నమ్మలేకపోయింది.

క్షణకాలం తన భ్రమా అన్నట్టు కళ్ళు మూసి తెరిచింది.. ఎదురుగా సాగర్, ప్రయాణపు అలసటతో కనబడ్డాడు.

మగ్గం ముందునుంచి లేవబోయి మళ్ళీ కూర్చుంది. పని మొదలు పెట్టి వెంటనే ఆపడానికి ఆమె మనసు ఇష్టపడలేదు.

అలా తన పని చేస్తూనే..

“అరే, సాగర్! ఏమిటిలా?” అడిగింది.

“నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే యిలా వెతుక్కుంటూ వచ్చేసాను..” నవ్వుతూ చెప్పాడు.

కంగారుగా అటూఇటూ చూసింది భద్ర. అసలే పల్లెటూరు, పైగా నిన్ననే తను కూడా శాలిని అక్కలా పెళ్ళి చేసుకు వెళ్ళిపోతుందేమో అన్న అనుమానాలు వెలిబుచ్చారు. యిప్పుడు ఓ అబ్బాయి ఇలా వెతుక్కుంటూ వస్తే, వాళ్ళ మాటలకు నమ్మకం కూడినట్టవుతుంది.

మొదలు పెట్టిన పని మొదటే భగ్నం అవుతుంది.

తనను చూస్తూనే ఆలోచనలో పడ్డ భద్రను చూస్తూ..

“నేనిలా వచ్చి ఇబ్బంది పెట్టానా? కంగారుపడకు, మన మాటలు ఇక్కడ ఎవరికీ అర్థం అవవు. ‘కాహీతరీ హవె అసతానా లాజ్ఞే’ అని మా మరాఠీలో ఓ సామెత ఉంది.. అలాగా ఇంతదూరం వచ్చి చెప్పకుండా ఉండలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే మనం పెళ్ళి చేసుకుందాం..”

సాగర్ మాటలు పూర్తి కాకుండానే..

“సాగర్, ప్లీజ్ నే చెప్పేది విను..” అంటూ కంగారుగా ఏదో చెప్పబోయిన ఆమెను ఆపి..

“కాదు, నన్ను చెప్పనీ, నాకు నీ ఆశయం తెలుసు. నేనిప్పుడు పెళ్ళి చేసుకుందాం అనడం లేదు. నీ లక్ష్యసాధనలో నేను తోడుగా ఉంటాను. నువ్వు ‘నన్ను ఇష్టపడుతున్నాను, మనం పెళ్ళి చేసుకుందాం’ అన్న ఒక్క మాట చెబితే చాలు, నా మనసు కుదుటపడుతుంది. నువ్వు నీ చదువు పూర్తి చేసుకుని, నువ్వు చేయాలనుకున్న పనులు చేసాకానే మనం పెళ్ళి చేసుకుందాం. తొందరేమీ లేదు.. ప్లీజ్ నన్ను ప్రేమించాను అన్న ఒక్క చల్లని మాట చెప్పు చాలు..” ఆమె దగ్గరగా వచ్చి నిలబడి అన్నాడు.

అప్పుడే వార్ఫింగ్ కోసం అటుగా వచ్చిన సోమయ్య, బయట కళ్ళాపి జల్లి ముగ్గువేస్తున్న మా లచ్చిమీ తమ కూతురుతో మాట్లాడుతున్న అబ్బాయిని చూసి అలా నిలబడిపోయారు.

వాళ్ళు హిందీలో మాట్లాడడంతో ఏం అర్థం కాకపోయినా, తమ బిడ్డను వెతుక్కుంటూ అంత దూరం నుంచి ఓ అబ్బాయి వచ్చాడంటే అర్థంకానంత అజ్ఞానంలో అయితే వాళ్ళు లేరు.

వాళ్ళను చూస్తూనే ఇక తప్పదని, చేస్తున్న పని ఆపి లేచి వచ్చింది భద్ర..

“అమ్మా! ఇతను సాగర్. నేను చెప్పిన ఆన్‌లైన్ వ్యాపారం ఇతని సాయంతోనే చేస్తున్నా, ఆ విషయాలు మాట్లాడడానికే వచ్చాడు..” మొదట కొంగారుపడినా, సర్దుకుని ప్రశాంతంగా చెప్పింది.

“అవునా!” అంటూ ఓ కుర్చీ తెచ్చి మగ్గం పక్కగా వేసిందావిడ.

“నమస్తే ఆంటీ” అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ కూర్చున్నాడు సాగర్.

“ఏమిటి సాగర్ ఈ పిచ్చిపని? పోనీ కాల్ చేయచ్చు కదా, అంతదూరం నుండి ఇలా ఇంటికి రావడం ఏమిటీ?” నొచ్చుకుంటున్నట్టు అంది భద్ర.

“నాకు నువ్వు దూరం అయిపోతావేమో అన్న భయం నిలవనీయలేదు. అందుకే ఇక ఏం ఆలోచించకుండా ఉన్నపళాన వచ్చేసా. తొందరేమీ లేదు, నువ్వు బాగా ఆలోచించుకునే నా ప్రశ్నకు జవాబియ్యి. అంతవరకూ నేనిక్కడ నీ పనుల్లో సాయపడుతూ, నిన్ను చూసుకుంటూ గడిపేస్తా!” నవ్వుతూ అన్నాడు.

“సాగర్! ఇది చాలా ఇడియాటిక్.. నువ్వెవరు అన్న మా ఊరివాళ్ళకు ఏం చెప్పనూ? అయినా నేనేమీ పూర్తిగా వచ్చేయలేదు కదా! నెల తరువాత కాలేజ్‌కి వస్తా కదా!” చిరుకోపంగా అంది భద్ర.

“ఏమో! నేనదంతా ఏం ఆలోచించలేదు, వెంటనే నిన్ను చూడాలనిపించింది, నీ నోట నన్ను ప్రేమిస్తున్నానూ అన్న మాట వినాలనిపించింది.. అంతే వచ్చేసా! అవునూ నేనిందాకా చెప్పిన మరాఠీ సామెతకు అర్థం..” చెప్పబోతున్న అతనిని చూస్తూ నవ్వి..

“చల్లకొచ్చి ముంత దాచడం, అర్థమైందిలే..” అంటూ నవ్వింది.

తనను చూడగానే లిప్తపాటు ఆమె కళ్ళలో కనిపించిన మెరుపు, ఆమె మనసేమిటో సాగర్‌కి చెప్పకనే చెప్పినట్టనిపించింది.

“నువ్వు చాలా తెలివైనదానివి, నా మాటలిట్టే అర్థం చేసుకున్నావు. అలాగే నా మనసు కూడా అర్థం చేసుకుంటే సంతోషం” సంతోషంగా అన్నాడు.

“బాబూ! బ్రష్ చేసుకుంటావా?” అంటూ వచ్చింది మాలచ్చిమి.

“రైలు.. స్టేషన్..” అంటూ చేసుకున్నా అన్నట్టు యాక్షన్ చేసి చెబుతున్న అతన్ని చూస్తే నవ్వాగలేదు భద్రకు.

“చాల్లే.. ఇంకాపు” అంటూ..

“స్టేషన్లో చేసుకున్నాడటలే అమ్మా! కొంచెం కాఫీ..” అంది తల్లితో.

“ఇదిగో సిటికెలో తెస్తా” అంటూ లోపలకెళ్ళింది.

“నువ్వు బిజినెస్ పని మీద వచ్చావని నేనందరికీ చెబుతాను, ఎటూ వచ్చావుగా, నాలుగు రోజులుండి, ఆ పని చూసుకు వెళ్ళు” హెచ్చరిక వినిపించే స్వరంలో.

“నేను వచ్చిన పని అయ్యేదాకా వెళ్ళేదే లేదు..” తనూ పట్టుదలగా అన్నాడు.

ఒక్కసారి తలెత్తి అతని కళ్ళలోకి చూసి నవ్వేసింది భద్ర.

“సరే, నీ ఇష్టం, కానీ ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే, స్వతహాగా వీళ్ళు మంచివాళ్ళే, ఎవరికీ హాని చెయ్యరు.. కానీ తమవారికి ఎవరైనా హాని తలబెడితే, పక్కనే సముద్రం ఉంది..” భద్ర స్వరం పదునుగా పలికింది.

“నా ముఖం చూసి చెప్పు, నేనలాటివాడిననిపిస్తోందా!” బాధగా అడిగాడు.

అతని కళ్ళలోకి చూసిన భద్ర నాలికరుచుకుంది.

‘ఏమైంది తనకు, అతని కళ్ళలో స్పష్టంగా తనమీద కనబడుతున్న ప్రేమ తనకెందుకు అర్థం కావడం లేదు. ఎందుకతనిని అలా తన మాటలతో బాధపెడుతోంది?’ తనమీద తనకే చికాకు కలిగి అతని కళ్ళలోకి చూడలేక ముఖం తిప్పేసుకుంది.

“చూడు, నీకు నేనంటే ఇష్టం అనే నాకనిపిస్తోంది. ఏ కారణం నిన్ను మనసులో మాట చెప్పనీకుండా అడ్డుకుంటోందో నాకు తెలీదు. కానీ కచ్చితంగా నువ్వు త్వరలోనే ఆ మాట నాతో చెబుతావు అని నా మనసు నాకు చెబుతోంది.

అలాగే, నేను ఏ స్వార్థంతోటీ నిన్ను ఇష్టపడడంలేదు. నీ తెలివితేటలూ, కష్టపడే తత్వం, ఒక రకమైన అమాయకత్వం నన్ను నీవైపు లాగాయి.

మన ఇద్దరి చదువులు వేరు, గమ్యాలు వేరు, భాష వేరు, ప్రాంతాలు వేరు, అయినా నువ్వు నన్ను సూదంటు రాయిలా ఆకర్షిస్తున్నావు, నువ్వు లేకపోతే బ్రతకలేను అనేటటువంటి భావన నాలో అణువణువూ నిండిపోయింది. నీ నుంచి నేనది కోరుకుంటున్నాను. ఎప్పుడు చెబుతావు అనేది నీకే వదిలేస్తున్నా. కానీ ఒక్క మాట చెబుతాను విను, ‘జీవితంలో ఎప్పుడూ నేను వీడిని అనవసరంగా పెళ్ళిచేసుకున్నాను’ అనే భావన నీకు కలలో కూడా రాకుండా చూసుకుంటాను. నీ లక్ష్యసాధనలో అనుక్షణం వెన్నంటి ఉంటాను. నీ సంతోషమే నా సంతోషం అనుకుంటాను.

ఇంక ఈ విషయం పదేపదే ప్రస్తావించి నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు యిప్పుడు తయారు చేయించే దుస్తుల వివరాలు, చిత్రాలు ఇస్తే నేను నీ ఆన్‌లైన్ అమ్మకాలకి ప్రాచుర్యం కల్పిస్తాను.

మీరు చేసే దుస్తులను త్రీడీ లోనూ, వర్చువల్ ఇమేజెస్ గానూ అప్‌లోడ్ చేస్తాను.” తను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పేసాడు.

అంతలో మాలచ్చిమి రెండు గ్లాసుల్లో కాఫీ తెచ్చింది.

భద్ర ఏం మాట్లాడకుండా కాఫీ అందుకుని మెల్లగా తాగసాగింది.

(ఇంకా ఉంది)

Exit mobile version