[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]
[సెలవలకి ఇంటికి వెళ్ళిన సాగర్, భద్రని మర్చిపోలేకపోతాడు. ముంబైలో మొదట క్లోజ్‌గా ఉండి, హఠాత్తుగా ఎందుకు దూరం పెట్టిందో అతనికి అర్థం కాదు. సుహాగ్ ఏదో చేసుంటాడని భావిస్తాడు. ఈ ఏడాదితో సాగర్ చదువు అయిపోయింది, క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. అందుకని ఇప్పుడు ధైర్యం చెయ్యకపోతే భద్ర తనకి శాశ్వతంగా దూరమైపోతుందని భయపడ్తాడు. ఓ స్నేహితుడి ఊరికి వెళ్ళొస్తానని ఇంట్లో చెప్పి, అప్పటికప్పుడు బయల్దేరి రైల్లో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కి, కాకినాడకి ప్రయాణం కడతాడు. భద్ర చెప్పినట్టు ఉప్పాడలో నేతపని కార్మికులందర్నీ రాములవారి గుడిలో సమవేశపరుస్తాడు. పెద్ద చదువులు చదివినా కూడా భద్ర తమపై ఆదరణ చూపడం వారికి ఆనందం కలిగిస్తుంది. తాను ఇక్కడ నెల రోజులు ఉంటాననీ, ఈ లోపు కొత్త రకం దుస్తులు ఎలా రూపొందించాలో అందరికీ నేర్పిస్తాననీ, వాటిని ఆన్‌లైన్‌లో అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకుందామని చెబుతుంది. మర్నాడు ఉదయం పది గంటల కల్లా అందరినీ తన ఇంటికి రమ్మంటుంది. చెప్పినట్టుగానే మర్నాడు పదింటికి అందరూ వస్తారు. తన ల్యాప్‌టాప్ తెరిచి, రకరకాల డిజైన్స్ అన్నీ చూపించి అవి ఏ పదార్ధాలతో చేసారో, చేయాలో చెప్పి వాళ్ళకు అర్థమయ్యేలా విడమరచి చెప్తుంది భద్ర. నూలును శుభ్రపరిచి ఏ ఏ రసాయనాలు కలిపితే ఏ రకమైన దుస్తులు తయారు చేయచ్చో చెప్పి చూపిస్తుంది, కొన్ని వాళ్ల చేత చేయిస్తుంది. వాళ్ళకి అవి నచ్చుతాయి. రైలు ఎక్కిన మరుసటి రోజు అర్ధరాత్రి పూట కాకినాడ చేరుతాడు సాగర్. తెల్లవారే అక్కడే ఉండి, ఆ తర్వాత ఆటో మాట్లాడుకుని ఉప్పాడ చేరి, భద్ర ఇల్లు కనుక్కుని ఇంటికి వెళ్తాడు. హఠాత్తుగా ప్రత్యక్షం అయిన అతన్ని చూసి, లేవబోయి, మళ్ళీ తమాయించుకుని, చేస్తున్న పనిని ఆపకుండా, అతన్ని పలకరించి, హఠాత్తుగా రావడానికి కారణం అడుగుతుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చేశానని చెప్తాడు. భద్ర కంగారు పడుతుంది. సాగర్ ఆమెకి ధైర్యం చెప్తాడు. తనకి ఆమె ఆశయం తెలుసనీ, ఇప్పుడే పెళ్ళి చేసుకుందామని అనడం లేదని, ఆమె చదువు పూర్తయి, వ్యాపారంలో రాణించిన తర్వాతే పెళ్ళి చేసుకుందామని అంటాడు. అతడిని తనకి ఆన్‌లైన్ వ్యాపారంలో సాయం చేసే మిత్రుడిగా అమ్మానాన్నలకి పరిచయం చేస్తుంది. తను ఆమెకి ఎలా తోడ్పడగలడో సాగర్ భద్రకి వివరిస్తాడు. ఇక చదవండి.]
సాగర్ కూడా మౌనంగా కాఫీ తాగుతూ కూర్చున్నాడు.
దూరంగా వార్ఫింగ్ చేస్తున్న సోమయ్య వాళ్ళ మాటలు వింటున్నాడు, అవి హిందీలో ఉండడంతో ఏం అర్థం కాకపోయినా, అంత దూరం నుంచి ఆ అబ్బాయి తన కూతురు వచ్చిన రెండు రోజులకే వెన్నంటి ఎందుకు వచ్చాడో అర్థం కానంత అమాయకుడయితే కాదు కదా!
కుర్రాడు బాగున్నాడు, అమ్మాయంటే ఎంత ప్రేమ లేకపోతే యిలా వెదుక్కుంటూ వస్తాడు?
ఏ రోజైనా పిల్ల పెళ్ళి చేయాలి కదా, తను ముమ్మాటికీ దానికి తగిన సంబంధం తేలేడు. నిజంగా వాళ్ళిద్దరూ ఇష్టపడితే తాము ఇంకేమీ ఆలోచించకుండా, అడ్డు చెప్పకుండా ఒప్పుకోవాలి. కానీకానీ మరి ఆ పిల్లగాడి వాళ్ళు ఒప్పుకుంటారా! అసలే ఉత్తరాది వాళ్ళు, ఈ పేదింటి వాడి పిల్లను, ఈ సాలోళ్ళ పిల్లను ఒప్పుతారా?’ ఏదో తెలియని భయం వెన్నులో సర్రున పాకింది.
అంతలోనే.. ‘ఏం! నా పిల్లకేం తక్కువ, వాళ్ళ పిల్లాడితో సమంగా పెద్ద సదువులే సదివింది.. ఆ సదువుకు తగ్గ ఉద్యోగమే వస్తాది పెద్ద జీతంతో.. ఏం చేదుమేస్తారు?’ మనసుకు సర్ది చెప్పుకుని, చేస్తున్న పని అయిపోవడంతో చేతులు శుభ్రంగా కడుక్కుని పై కండువాతో తుడుచుకుంటూ వచ్చాడు.
తండ్రి దగ్గరకు రాగానే చేస్తున్న పనాపి.. “నాన్నా! ఇతను మా సీనియర్, అంటే కాలేజ్ లో నా పై తరగతి. నేను చేస్తున్న ఆన్‌లైన్ వ్యాపారంలో సాయం చేస్తూంటాడు.
యిప్పుడు సెలవులు కదా, ఇక్కడ మనం చేసే ఈ నేతపని వీడియో తీసి యూట్యూబ్‌లో పెడతారు. అది మన అమ్మకాలకు పనికి వస్తుంది.” గబగబా నోటికొచ్చింది చెప్పేసింది.
భద్ర ఎంత మామూలుగా ఉందామనుకున్నా, ఆమె స్వరంలో చిన్న కంపన, మాటలో తడబాటు ఆ తండ్రికి బాగానే అర్థం అయ్యాయి. కానీ పైకి మాత్రం, “అట్టనా! మంచిది బాబూ, మందే ఊరు? అమ్మా నాన్నా ఏం చేస్తుంటారు?” యథాలాపంగా అడిగినట్టు అడిగాడు.
సాగర్ అర్థం కాక చూస్తుంటే..
“నాన్నా! అతనికి తెలుగు రాదు. అయినా పని మీద వచ్చిన వాడి వివరాలు మనకెందుకూ!” అంది.
కానీ మాట అర్థం కాకపోయినా, సాధారణంగా అడిగే ప్రశ్నలు ఏ భాషలో అయినా ఒకటే కదా! అందుకే సాగర్ నవ్వుతూ చెప్పాడు..
“మహారాష్ట్రాలోని సాంగ్లీ, అమ్మా నాన్నా వ్యవసాయదారులు” హిందీలో చెబుతూ భద్రకేసి చూసాడు, తెలుగులో చెప్పమన్నట్టు.
భద్ర తల ఊపి చెప్పింది.
“అట్టనా! సరే” అంటూ లోపలికెళ్ళాడు సోమయ్య.
ఆ తరువాత అతను ఫ్రెష్ అయి రాగానే మాలచ్చిమి వేడివేడి ఇడ్లీ పెట్టింది ముగ్గురికీ. తినేసి వాళ్ళు ముంబైలో జరిగిన షో గురించి మాట్లాడుకుంటూ, పదింటికి అందరూ వచ్చాకా భద్ర తను చేసిన దుస్తుల డిజైన్స్ చూపించడం కోసం ఇంట్లో ఉన్న టీవీ ని బయటకు జరిపి కనెక్షన్స్ అన్నీ సెట్ చేసుకుని, లాప్ టాప్ కి కనెక్ట్ అయ్యేలా చేసి పెట్టుకున్నారు.
ఓ గంట గడిచేసరికి బిలబిల్లాడుతూ అంతా వచ్చేసారు.
వాళ్ళందరికీ ‘ఆ అబ్బాయి మనం చేసే బట్టలను ఆన్‌లైన్‌లో అమ్మి పెడతాడు’ అని చెప్పడంతో అంతా అతనిని ఆదరంగా, ఆనందంగా చూసారు.
ఒకరిద్దరు ‘ఏ ఊరబ్బాయ్ మనదీ’ అంటూ పలకరించబోతే భద్ర ‘అతనికి తెలుగు రాదు’ అని చెప్పడంతో ఇంక ఎవరూ అతనిని మాట్లాడించలేదు.
సాగర్ మాత్రం అందరినీ చిరునవ్వుతో చూసాడు.
అందరూ కబుర్లయి సర్దుకు కూర్చున్నాకా భద్ర అప్పటిదాకా తయారు చేసిన దుస్తులన్నీ వరుసగా టీవీలో వచ్చేలా చూపెట్టాడు సాగర్.
వాటన్నింటినీ చూసి నోళ్ళు వెళ్ళబెట్టారు ‘ఏటి, నువ్వే చేసావా!’ అంటూ.
అవన్నీ చూడడానికీ, వాళ్ళ సందేహాలు తీర్చడానికీ ఓ పూటంతా పట్టింది.
ఆ తరువాత భోజనాలకంటూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతుంటే చెప్పింది భద్ర.. “ఇక రేపటినుంచీ మీరు కారేజీలు తెచ్చేసుకోండి. ఎందుకంటే ఇక సీరియస్‌గా పని మొదలుపెడదాం. రెండు రోజులు ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో నేను చేసి చూపిస్తూ ఉంటే, మీరు నేర్చుకోవాలి, ఆ తరువాత నుంచీ ఇక మీరే స్వయంగా చేయాలి” అంటూ.
అందరూ సంతోషంగా సరేనంటూ వెళ్ళిపోయారు.
ఆ తరువాత భోజనాలయ్యాకా సాగర్ కూడా బయలుదేరాడు.. ‘నేను కాకినాడలో హోటల్‌లో ఉంటాను’ అంటూ కానీ భద్ర ఒప్పుకోలేదు.
“మా పని మీద వచ్చి నువ్వు డబ్బు ఖర్చు చేసుకుని హోటల్‌లో ఎందుకు ఉండడం, మా దేశయ్య బాబాయ్ ఇంట్లో ఉందూ గాని నేను చెబుతాను” అంటూ ఆపేసింది.
అన్నట్టే తను దగ్గరుండి అతనిని దేశయ్య ఇంటికి తీసికెళ్ళింది.
అప్పటికే అతను వచ్చిన పని తెలిసిఉండడంతో దేశయ్య అతనిని తన ఇంట్లో సంతోషంగా ఉంచుకున్నాడు.
అప్పటి నుంచీ ప్రతి రోజూ వారితో కలిసి వాళ్ళు చేసే పనిని వీడియో తీస్తూ అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు సాగర్.
కొన్ని చేతితో, మగ్గం మీద చేయగలిగిన పనులన్నీ వారికి యిప్పటి పరిస్థితులకూ, ఫ్యాషన్స్‌కి తగినట్టు ఉండేవి వాళ్ళకు నేర్పించి వాళ్ళు తయారుచేసిన అన్ని దుస్తులనీ ఫోటోస్ తీసి ‘భద్రాస్ ట్రెండీ వేర్’ అన్న ఆన్‌న్ వ్యాపార సంస్థ ద్వారా అమ్మేలా ఏర్పాటు చేసారు భద్ర, సాగర్ కలిసి.
వాటిని ఆన్‌లైన్‌లో పెట్టేముందే ప్రతీ డ్రెస్‌కీ ఇంత అని ధర ఫిక్స్ చేసి ఆ ధరలు ఆయా బట్టలు నేసిన వారికి చెప్పడంతో వారిలో ఉత్సాహాన్నీ, నమ్మకాన్నీ కలిగించగలిగారు.
చూస్తుండగా పదిహేను రోజులు గడిచిపోయాయి. అతను అంత చిత్తశుద్ధితో తమ వాళ్ళ పనుల్లో నిమగ్నమవడం, అతను అన్నట్టే మళ్ళీ తనతో ప్రేమా, పెళ్ళీ మాట ఎత్తకపోవడం చూసిన భద్రకు అతని మీదా, అతని ప్రేమ మీదా నమ్మకం కలిగి అతని మీద ప్రేమ ఏర్పడింది.
ఆ రోజు ఆదివారం కావడంతో పనిలేదు, పైగా ఆ మర్నాడే సాగర్ వెళ్ళిపోతున్నాడు. ‘తన తల్లితండ్రుల దగ్గర కూడా పదిరోజులు గడిపి వెళ్ళి ముంబైలో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాలి’ అన్న అతని మాటలు భద్రని ఆలోచనలో పడేసాయి.
అన్ని రోజులు అతనితో అంత సామీప్యత ఆమెకు అతని మీదా, అతని ప్రేమ మీదా నమ్మకం కలిగించడంతో ముందు రోజు రాత్రి అతని వ్యవహారం అంతా తల్లితండ్రులకు తెలియజేసింది.
సోమయ్య ఆ విషయాన్ని ముందుగానే ఊహించడంతో పెద్దగా ఆశ్చర్యపడలేదు. అతని తల్లితండ్రులు ఒప్పుకుంటే తమకే అభ్యంతరం లేదని కూతురికి వెంటనే చెప్పేసాడు.
అందుకే ఆదివారంనాడు ఉదయం పలహారం తిన్నాకా, తమ ఊరి సముద్రాన్ని చూపిస్తా అంటూ అతనిని బయలుదేరదీసింది భద్ర.
అతనితో కలిసి నడుచుకుంటూ ముందుగా రాములవారి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించింది.
‘తన ఈ నిర్ణయానికి జీవితంలో ఎన్నడూ పశ్చాత్తాప పడేలా చేయకు తండ్రీ ‘ అంటూ వేడుకుంది.
ఆ తరువాత అతనితో కలిసి ఉప్పాడ బీచ్ కి వెళ్ళింది.
బీచ్ కి వెడుతుంటే నామాలు ఎదురయ్యాడు.
“ఏంటీ, జనాలందరికీ మంచి చెయ్యడం అయిపోయిందా, యిప్పుడు నీ మంచీచెడ్డా చూడడానికి తీసికెడుతున్నాడా.. హి.. హి.. హీ” అంటూ వెకిలిగా నవ్వాడు.
“నిన్ను నోరారా బాబాయ్ అని పిలిచి తప్పు చేసాను..” సీరియస్‌గా అంటూ, సాగర్ చెయ్యి పట్టుకుని మరీ అతని ముందు నుంచే వెళ్ళిపోయింది.
ఆమె ఈ చిన్నచిన్న చర్యలు సాగర్ కి ఆమె మనసు ఏమిటో చెప్పకనే చెప్పాయి.
ఇద్దరూ అలా కొంత దూరం నడిచి ఒక దగ్గర కూర్చున్నారు. అప్పటికింకా ఉదయం తొమ్మిది కూడా కాకపోయినా సూర్యుడు తన ప్రతాపం చూపడానికి ఉత్సాహంగా ఉరికివస్తున్నాడు.
ఇద్దరూ కొంచెం ఎడమెడంగా కూర్చున్నాకా, రెండు నిముషాల మౌనం తర్వాత ముందుగా భధ్ర అంది..
“నువ్వు చేసిన ఈ సాయానికి నా మనఃపూర్వక ధన్యవాదాలు సాగర్. నిన్ను, నీ ప్రేమనీ నేను నమ్ముతున్నాను. ఎప్పటికీ నీ సహాయసహకారాలు, ఈ ప్రేమా యిలానే ఉంటాయని మాట ఇస్తావా!” అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది.
“అలా ఎలా ఇస్తాను? అలా ఉండవు కదా!” సీరియస్‌గా అన్న అతని మాటలకు అయోమయంగా చూసింది.
“ఏమిటీ? మళ్ళీ చెప్పు?”
“అవును, నేను సరిగానే చెప్పాను, నువ్వు సరిగానే విన్నావు. ఏళ్ళు గడిచేకొద్దీ మన సాహచర్యంలోని మాధుర్యం చిక్కబడుతుంది కదా, అప్పుడు రోజురోజుకీ మనకు ఒకరిమీద ఒకరికున్న ప్రేమ ఎక్కువవుతుంది కదా!” చిన్నగా నవ్వుతూ అన్నాడు.
అతని మాటలు అర్థమవడానికి రెండు సెకన్ల సమయం పట్టింది భద్రకు, ఆ తరువాత మనసారా ఫక్కున నవ్వింది.
“నిన్నూ!” అంటూ మొదటిసారి తనకుతానుగా అతని చేతి మీద చెయ్యి వేసింది.
“అహా! ఈ దీనుడి మీద కలిగిన అనుగ్రహానికి ధన్యుడిని” అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కాడు.
“కానీ!” అంటూ సందేహంగా ఆగింది.
“మళ్ళీ కానీ ఏమిటి భద్రమ్మా! వాటికి కాలం చెల్లి చాలా కాలం అయింది కదా!” అన్నాడు గాబరాగా.
“కానీ, మీ తల్లితండ్రులు అంగీకరిస్తేనే మన పెళ్ళి జరుగుతుంది. వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా, వారిని బాధపెట్టి మాత్రం కాదు..” చిన్నగా చెప్పినా స్పష్టంగా చెప్పింది.
నవ్వేడు సాగర్.
“నీలాంటి బంగారుతల్లిని వద్దనేవాళ్ళెవరూ! వాళ్ళు తప్పక ఒప్పుకుంటారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళగానే వాళ్ళకు చెప్పేస్తాను. మన పెళ్ళి మాత్రం నీ చదువు పూర్తయి, నీ లక్ష్యం నెరవేరాకానే చేసుకుందాం. నీకు మరోమారు స్పష్టం చేస్తున్నా, నీ ప్రతి అడుగులోనూ అడుగు కలుపుతాను. నువ్వు చేసే ప్రతీ పనికీ నా సంపూర్ణ సహకారం ఉంటుంది.” ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా చెంపలకు తాకించుకున్నాడు.
ఒక్కసారిగా భద్ర ఒళ్ళు ఝల్లుమంది. అప్పటివరకూ తన చదువు, తను ఎదుగుతూ తనవారిని ఉద్ధరించాలన్న తలపూ తప్ప, మరో విషయం లేని ఆమె మనసులో ప్రేమ పరిమళం గుభాళించింది.
తనూ అలాగే అతని చేతిని పట్టుకుని చెంపలకు తాకించుకుంది.
ఇద్దరూ అదోరకమైన పరవశంలో మునిగిపోయారు.
వాళ్ళిద్దరినీ అలా దగ్గరగా చూస్తున్న రెండు కళ్ళు అసూయతో దహించుకుపోయి, ద్వేషంతో రగిలిపోయాయి.
చేతిలోని సెల్ వాళ్ళని ఫోటోలు తీస్తుండగా పళ్ళు కోపంతో పటపటలాడాయి.
అన్నాళ్ళ తన కలలని కూల్చేసిన కిరాతకుడిలా కనబడ్డాడు సాగర్. అవిచ్చన్నంగా సాగిన తన ఏకఛత్రాధిపత్యం కూకటివేళ్ళతో కూలిపోయినట్టే భావిస్తూ చరచరా అక్కడినుండి వెళ్ళిపోయాడు.
“ఏమిటీ ఏం మాట్లాడవు? యిలా మౌనంగా కూర్చుందుకేనా ఇక్కడకు తీసుకొచ్చావ్?” అడిగాడు సాగర్.
“మాటలు చెప్పలేని ఎన్నో సంగతులు మౌనం చెబుతుంది తెలుసా!” అతని చేతివేళ్ళతో ఆడుకుంటూ అంది.
“ఆహా! నీ దగ్గర చాలా నేర్చుకోవాలి మేమ్ సాబ్” అల్లరిగా నవ్వాడు.
ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి ఎన్నో కబుర్లు చెప్పుకుని, ఇంక ఎండ చుర్రుమంటూంటే కదిలారు.
మూడేళ్ళు కలిసి చదివినప్పుడు కలగని దగ్గరతనం, కలిసి పనిచేసిన ఈ పదిహేనురోజుల్లో కలగడం గమనించిన సాగర్ అనుకున్నాడు
‘నేనిలా వచ్చి మంచి పని చేసాను. జీవితంలో దక్కదు అనుకున్న అపురూప వజ్రం స్వంతమవబోతోంది
సాగర్ చేతిలో ఉన్న తన చెయ్యి తీసుకోలేదు. చేతిలో చేయిగా కలసి ఇంటివైపు నడవసాగారు.
ఇంటికెళ్ళే దారిలో ఉన్న మర్రి చెట్టుకింద ఉన్న జనాలు జంటగా వస్తున్న ఇద్దరినీ ఆశ్చర్యంగా చూసారు.
(ముగింపు వచ్చే వారం)
మీనాక్షీ శ్రీనివాస్ గారి స్వస్థలం కాకినాడ. జననీ, జనకులు – కీ.శే శ్రీమతి మహీధర వేంకట దుర్గాంబ, కీ.శే శ్రీ మహీధర వేంకటరామ దీక్షితులు.
జీవితభాగస్వామి శ్రీయుతులు శ్రీనివాస్. ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనుమరాలు, మనుమడు.
ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) విశ్రాంత అధికారిణి. విశాఖ రేడియో కేంద్రంలో, డ్రామా ఆర్టిస్ట్‌గా ఎంపికయి, కొన్నేళ్ళపాటు కొనసాగి, బదిలీల కారణంగా విరమించుకున్నారు. ఏడు రేడియో నాటికలు, 330 పైగా కథలు, అన్ని పత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్నింటికి బహుమతులు వచ్చాయి. 22 కథల సంపుటి ‘నిశీథిలో నక్షత్రం’ అక్టోబర్ 2016లో వెలువడింది. 19 నవలలు చతుర, ఆంధ్రభూమి, స్వాతి మొదలగు పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీటిలో ఐదు అపరాధ పరిశోధక నవలలు. బహుమతి పొందిన ‘భద్ర’ వీరి తొలి మినీ నవల (20).
రెండవ సంపుటి తపస్వీ మనోహరం కథల పోటీలో విజేతగా, బహుమతి కథలు ఏడింటితో బాటు వీరి కథలు మరో పద్దెనిమిది కలిపి ‘బహుమతి’ 2024 నవంబర్ లో ప్రచురించడం జరిగింది.
తపస్వీ మనోహరం సంస్థ వీరి అపరాధ పరిశోధక నవల ‘రామాపురం బంగ్లా’ డిసెంబర్ 2025 లో ప్రచురించింది.
పద్యరచనలో ఓనమాలు శ్రీమతి నండూరి సుందరీ నాగమణి గారు, శ్రీ గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారి వద్ద దిద్దారు.
03 ఏప్రిల్ 2024 న లేఖినీ సంస్థవారు, డాక్టర్ వాసా ప్రభావతి గారి పేరిట, వారి అమ్మాయి జఠావల్లభుల మీనాక్షిగారిచే పొందిన మాతృవందన పురస్కారం అందుకోవడం మరచిపోలేని అనుభూతి.
