Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భద్ర-9

[మీనాక్షీ శ్రీనివాస్ గారు వ్రాసిన ‘భద్ర’ అనే మినీ నవలని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త తృతీయ బహుమతి గెల్చుకున్న రచన.]

[సాగర్ కాఫీ తాగుతూంటాడు. దూరంగా వార్ఫింగ్ చేసున్న సోమయ్య, తన కూతురూ సాగర్ మాట్లాడుకునే మాటలు వింటుంటాడు. హిందీ అర్థం కాకపోయినా, ఆ అబ్బాయికి భద్ర అంటే ప్రేమ అని గ్రహిస్తాడు. తండ్రి తన దగ్గరకు రాగానే సాగర్‌ని పరిచయం చేస్తుంది. అతను తన వ్యాపారంలో ఎలా సాయపడతాడో చెబుతుంది. సాగర్ గురించి అడిగితే, అతడికి తెలుగు రాదంటుంది. అయినా ఆ ప్రశ్నని గ్రహించిన సాగర్, తన గురించి, తన తల్లిదండ్రుల గురించి హిందీలో చెప్పి, తెలుగులో తర్జుమా చేయమని భద్రని అడుతుతాడు. అతను చెప్పినవన్నీ తండ్రికి చెబుతుంది. టిఫిన్ తినడం పూర్తయ్యేసరికి అందరూ వస్తారు. అప్పటిదాక తయారు చేసిన దుస్తులన్నీ వరుసగా చూపిస్తుంది భద్ర. అవి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు అందరూ కలిసి భద్ర మార్గదర్శకత్వంలో కొత్త రకాల దుస్తులు నేసి, ఆన్‌లైన్‌లో అమ్ముతారు. ఇందుకు సాగర్ సాయం చేస్తాడు. పదిహేను రోజులు గడిచిపోతాయి. సాగర్ ప్రేమ మీద నమ్మకం కలుగుతుంది భద్రకు. తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెబుతుంది. వాళ్ళ అమ్మానాన్నలు ఒప్పుకుంటే, తమకి అభ్యంతరం లేదంటారు. సాగర్ ఊరు వెళ్ళిపోయే ముందు రోజు, ఆదివారం సాయంత్రం, బీచ్‌కి వెళ్తారు. కబుర్లు చెప్పుకుంటారు. చదువులు పూర్తయ్యాకా పెళ్ళి చేసుకుందామనుకుంటారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని కబుర్లు ఊసులాడుకుంటుండగా, రెండు కళ్ళు వాళ్ళని చూస్తూ అసూయతో దహించుకుపోతాయి. వాళ్ళిద్దర్నీ రహస్యంగా ఫోటోలు తీసి మాయమవుతాడా అగంతకుడు. ప్రేమను దక్కించుకున్న సంతోషంలో, ఒకరి చేతులలో ఒకరు చేయి వేసి ఇంటి వైపు నడుస్తారు. ఇక చదవండి.]

అక్కడే ఉన్న నామాలు వంకరగా నవ్వుతూ..

“యిప్పుడు తెలిసిందా దొరబాబు ఎందుకొచ్చాడో! నన్ను కాదని వాళ్ళను నమ్ముతున్నారు, మిమ్మల్ని నట్టేట ముంచేసి జంటగా ఎగిరిపోతారు..” అన్నాడు.

ఆ మాటలు విన్న భద్ర ఆగింది..

అక్కడున్న వాళ్ళను ఉద్దేశిస్తూ..

“చూడండి, అతను వచ్చింది వ్యాపారం చూసుకోవడానికే, కానీ అతని మంచితనం, నిబద్ధతతో నన్ను ఆకట్టుకున్నాడు. నాకింకా ఒక ఏడాది చదువుంది, ఆ తరువాత కూడా నేను అనుకున్నట్టు ఒక వస్త్ర పరిశ్రమ పెట్టి, మీ అందరినీ ఒడ్డున చేర్చేవరకూ మేము పెళ్ళి చేసుకోము. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏళ్ళ తరబడి నమ్మిన ఆ నామాలు బాబాయ్ మీకు ఒరగబెట్టిందేమీ లేదు. ఒక్కసారి మమ్మల్ని నమ్మండి. ఎన్నాళ్ళో అక్కరలేదు మూడు నెలల్లో యిప్పుడు మనం పెట్టిన దుస్తులన్నీ అమ్ముడయి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అలా రాకపోతే అప్పుడడగండి.” స్పష్టంగా చెప్పింది.

సాగర్ తను రేపు వెడుతున్నట్టు వాళ్ళకి చెప్పమనడంతో..

“సరే రేపు ఉదయం ఇతను వెళ్ళిపోతున్నానని మీ అందరికీ చెప్పమంటున్నాడు. అతన్ని మీరు నమ్మితే, నవ్వుతూ సాగనంపండి, లేదంటే మౌనంగా ఉండిపోండి, మేము అర్థం చేసుకుంటాం..”

ఆమె మాట పూర్తి కాక ముందే వాళ్ళంతా వీళ్ళ దగ్గరకు వచ్చేసారు. కొందరు సాగర్‌కి కరచాలనం ఇచ్చారు. “అతనిని మళ్ళీ ఎప్పుడొస్తావ్? మా ఊరి అమ్మాయిని పెళ్ళాడి, మాకు అల్లుడవుతున్నందుకు సంతోషం..” అంటూ తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.

అదంతా చూస్తున్న నామాలు ముఖం మాడిపోయింది. అక్కడ నుంచి చరచరా వెళ్ళిపోయాడు.

అందరూ సాగర్‌ని అలా ఆత్మీయంగా చూడడంతో భద్ర మనసు సంతోషంతో నిండిపోయింది.

అలా వాళ్ళతో మాట్లాడి, వెళ్ళొస్తాం అని చెప్పి యిల్లు చేరారు.

ఆ రోజు కూతురి పెళ్ళి కుదిరిన సంతోషంలో సోమయ్య పులస చేపలూ, రొయ్యలూ తెచ్చాడు. మాలచ్చిమి పులస చేపల యిగురు, రొయ్యల వేపుడు, చికెన్ పలావ్ చేసి పెట్టింది అల్లుడి హోదాలో సాగర్‌కి.

సోమయ్య సాగర్‌కి చెప్పమని కూతురికిలా చెప్పాడు..

“అమ్మాయి చదువు పూర్తవగానే మీ పెళ్ళి చేస్తాం. ఈలోగా మీవాళ్ళకి విషయం చెప్పి, మమ్మల్ని మాటలకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి మీవాళ్ళతో మాట్లాడతాము. కానీ కట్నకానుకలిచ్చుకోలేము”

భద్ర తండ్రి మాటలను యథాతథంగా చెప్పగానే సాగర్..

‘తను వెళ్ళగానే తల్లితండ్రులతో మాట్లాడి, ఎప్పుడు రమ్మనేదీ చెబుతాననీ, కట్నకానుకలక్కరలేదనీ, మీ అమ్మాయిని మాత్రం ఇస్తే చాలనీ’ నవ్వుతూ చెప్పడంతో అందరి ముఖాల్లో ఆనందం తొంగిచూసింది.

ఆ మర్నాడు ఉదయాన్నే సాగర్ ముంబై వెళ్ళే రైలు ఎక్కి తమ ఊరు వెళ్ళిపోయాడు. భద్రకు ఆ రోజంతా ఏదో వెలితిగా అనిపించడం ఆమెకే వింతగా అనిపించింది.

చూస్తుండగానే ఆమె సెలవలు అయిపోయి మళ్ళీ కాలేజ్‌కు వెళ్ళిపోయింది. అయితే ఆమె కోసం అక్కడ ఒక అవమానం, అనుకోని ఒక నీలాపనింద ఎదురుచూస్తూ ఉంటుందని ఆమెకు ఊహామాత్రంగా అయినా తోచలేదు.

ఆమె కాలేజీకి వెళ్ళేసరికి వాతావరణం అంతా సీరియస్‌గా ఉంది.

కేంపస్‌లో ఎక్కడ చూసినా తనదీ, సాగర్‌దీ చేతిలో చెయ్యేసుకున్న ఫోటో పెద్దపెద్ద పోస్టర్స్‌గా ఉండడమే కాదు కొన్ని ఫోటోలు చాలా అభ్యంతరకరంగా కూడా ఉండడం చూసిన భద్ర తల గిర్రున తిరిగిపోయింది. అవన్నీ మార్ఫింగ్ చేసిన ఫోటోస్ అని ఆమెకు తెలుస్తోంది కానీ ఆమెకు తెలిసి ఏం ఉపయోగం?

భద్రకు తన గదికి వెళ్ళీవెళ్ళగానే ప్రిన్సిపాల్ నుంచి కబురొచ్చింది, వెంటనే కలవమని. వెళ్ళిన ఆమెను ప్రిన్సిపాల్ అడిగాడు.. ‘అదంతా ఏమిట’ని? కళ్ళనీళ్ళతో నిలబడడం తప్ప ఆమె ఏమీ చెప్పలేకపోయింది.

అప్పుడు ఆమెను అభిమానించే ప్రొఫెసర్, లాక్మే ఫాషన్ షోకి వారితో బాటు వెళ్ళిన ప్రొఫెసర్ విషయమేమిటని అడగడంతో భద్ర సాగర్ తనను ప్రేమించడం, తన కోసం తమ ఊరు రావడం, అక్కడ తనవారి కోసం శ్రమించడం, తను కూడా అతనిని ఇష్టపడడం, పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం అన్నీ చెప్పింది. ‘జరిగింది ఇది, మేమెక్కడా తప్పు చేయలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. ఎవరో మామీద కక్ష గట్టి మా ఫోటోస్ మార్ఫింగ్ చేసి యిలా బురద జల్లా’రంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న ఆమెను చూస్తే వాళ్ళకు చాలా బాధనిపించింది.

ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక ఉత్తమ విద్యార్ధినికి తమ కాలేజ్‌లో యిలా జరగడం తమ అసమర్థతగా భావించి భద్ర మీద, ఆమె వ్యక్తిత్వం మీదా ఉన్న నమ్మకంతో తనకు తెలుసున్న పోలీస్ ద్వారా విచారణకు ఆదేశించాడు ప్రిన్సిపాల్.

తక్షణం ఆ ఫోటోస్ అన్నీ తీయించేసి, నాలుగు రోజులపాటు భద్రని హాస్టల్ గదిలోనే ఉండమనీ, ఇదంతా సద్దుమణిగే దాకా కాలేజ్‌కి రావద్దనీ చెప్పాడాయన.

విచారణ జరిగి తెలిసిన విషయం ఇదంతా కావాలని, ఎలాగైనా భద్రను అపఖ్యాతిపాలు చేసి కాలేజ్ నుంచి పంపేయాలని సుహాగ్, రాగా కలిసి చేసిన కుట్రగా బయటపడడంతో, ప్రిన్సిపాల్ ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని, ఆ యిద్దరినీ పిలిచి అసలు ఏం జరిగిందో, ఎందుకలా చేసారు అని నిలదీయడంతో సుహాగ్ చెప్పిన విషయం అందరినీ నిర్ఘాంతపరిచింది.

‘సెలవలు ఇచ్చాకా తను తన ఊరు వెళ్ళినా, అక్కడి పరిస్థితులు తనను నిలబడనీయలేదనీ. ఎలాగైనా భద్ర ఊరుకు వెళ్ళి, అవసరం అయితే వాళ్ళ తల్లితండ్రులను కలిసి, వాళ్ళను ఒప్పించో, బెదిరించో భద్రతో తన పెళ్ళికి ఒప్పించాలని వాళ్ళ ఊరు వెళ్ళాననీ, కానీ అక్కడ అప్పటికే సాగర్ ఉండడం, భద్ర అతనితో పెళ్ళికి ఒప్పుకుని సంతోషంగా ఉండడం చూసిన తను తట్టుకోలేక వాళ్ళ ఫోటోస్ తీయడమే కాక, రాగ సలహా మేరకు వాళ్ళ ఫోటోస్ మార్ఫింగ్ చేసి కాలేజ్ అంతటా పోస్టర్లు అంటించామనీ, అదంతా ఎలాగైనా భద్రను చెడ్డ చేసి, కాలేజ్ నుంచి పంపించేయాలన్న ఉద్దేశ్యంతోటే చేసామ’నీ, సుహాగ్ ఒప్పుకోవడంతో ప్రిన్సిపాల్ వాళ్ళిద్దరినీ అసహ్యించుకుని..

“ఈ కాలేజ్ మీకు డిగ్రీ అయితే యివ్వగలిగింది కానీ, ఓ మనిషికి ఉండాల్సిన వ్యక్తిత్వాన్ని, మంచి నడవడిని నేర్పలేకపోయింది. అందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరు మా కాలేజ్ విద్యార్ధులు అని చెప్పుకోడానికే బాధపడుతున్నాను” అంటూ వాళ్ళిద్దరికీ టీసీలిచ్చేసి పంపేసాడు.

‘వారి అదృష్టం అప్పటికి వాళ్ళ చదువు అయిపోవడం, లేదంటే వాళ్ళని రస్టికేట్ చేసి వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేసేవాడినని’ చీదరించుకోవడం చూసిన వాళ్ళ తలలు సిగ్గుతో వాలిపోయాయి.

విషయం తెలిసిన సాగర్ తన తల్లితండ్రులనూ, భద్ర తల్లితండ్రులనూ తమ కాలేజ్‌కే రప్పించి, అందరి సమక్షంలో భద్రను పెళ్ళి చేసుకుని తమపై వచ్చిన నిందను చెరిపేసాడు.

చూస్తుండగానే కాలం కరిగిపోయి, భద్ర చదువు పూర్తిచేసుకుని, తను అనుకున్నట్టే తన ఆన్‌లైన్ వ్యాపారానికి తోడుగా ఉప్పాడలోనే ‘భద్ర ఫంక్షనల్ టెక్స్‌టైల్స్ అండ్ క్లోతింగ్ యూనిట్’ పెట్టి అనుకున్నట్టే తనవారినందరినీ అందులో భాగస్వాములని చేసింది.

సాగర్ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి, భద్రకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉండడమే కాక, ఆమె సలహా మేరకు వ్యవసాయంలో కొత్తకొత్త మెలకువలు తెలుసుకుని తండ్రికి సహాయంగా ఉంటూ మన దేశంలో వ్యవసాయానికీ, చేనేత పరిశ్రమలకూ ఉన్న పూర్వ వైభవాన్ని గుర్తుకు తెచ్చారు భార్యాభర్తలిద్దరూ కలిసి.

భద్ర చేస్తున్న కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ‘పారిస్ ఫ్యాషన్ వీక్’కు వెళ్ళడానికి ఆర్థిక సహాయం అందించింది.

ఎప్పటికైనా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనాలన్న తన కల సాకారం చేసుకుందుకు భద్ర ఇతోధికంగా శ్రమ పడి, రకరకాల దుస్తులను డిజైన్ చేసి, భారతీయ రాష్ట్రాల సాంప్రదాయలను కొన్నింటిని కలబోసి ఒక వినూతన వధూవరుల పెండ్లిబట్టలు రూపొందించి సాగర్‌తో కలిసి పారిస్ వెళ్ళి, అక్కడ కూడా విజయకేతనాన్ని ఎగరేసి తనేమిటో నిరూపించుకుంది.

***

భద్ర గురించి ఎప్పటికప్పుడు తనవారి ద్వారా తెలుసుకుంటున్న శాలినీ, తను అనుకున్నదానిని పూర్తిచేయడమే కాక తమ ఊరి ఖ్యాతిని పారిస్ దాకా తీసికెళ్ళిన భద్రను స్వయంగా అభినందించడానికి ఉప్పాడ రావడంతో ఆనందించిన భద్ర, శాలినీతో కలిసి ఊర్లో ఉన్న నేతగాళ్ళనందరినీ సమావేశపరిచి వాళ్ళకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసి, ఇకపై సంఘం ద్వారా ‘తమ శ్రమకు తగ్గ ఫలితం ఉండేలా మనమే చూసుకుందాం’ అన్న భరోసా ఇచ్చింది.

అప్పటికే ఈ అరకొర బ్రతుకులు బ్రతకలేక కూలీలుగా మారిన అందరికీ నచ్చచెప్పింది.

వారిలో జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టి కొత్త చైతన్యాన్ని రగిలిస్తూ యిలా చెప్పింది

“చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పటినుండో మనకున్న పేరు ప్రఖ్యాతులను అడ్డం పెట్టుకుని ఎక్కడెక్కడి చీరలో మనవిగా చెలామణి అవడం ఘోరం. అందుకే మీరు నేసే ప్రతి చీరమీదా, మీకు మాత్రమే తెలిసేలా ఏదో ఒక గుర్తో, పేరో ఏదో ఒకటి నేతలో కలిసిపోయేలా చూసుకోండి. అప్పుడే మనం నకిలీ సరుకు నుంచి మనవి వేరు చేసి చూపగలం. ఇకనుంచీ మేము మీ ప్రతి కష్టంలోనూ, ప్రతి అవసరంలోనూ తోడుంటాము. పెళ్ళి చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని విడిచిపెట్టిపోతామనీ, మీ కష్టసుఖాలు చూడమనీ ఎలా అనుకుంటారు? మేము ఈ తరం అమ్మాయిలం, అటు అత్తింటివారినీ, ఇటు పుట్టింటివారినీ సమానంగా బాధ్యతగా చూసుకునే సత్తా ఉన్న వాళ్ళం.

మీ బాగు చూసి ఓర్వలేనివారు అనే మాటలు పట్టించుకోకండి. శాలినీ అక్కా, నేనూ మీకోసం ఒక మంచి దారి ఏర్పాటు చేసాం, మీరు దానిలో సాగిపోయే ప్రయత్నం చేయాలి.

మీకే కష్టం వచ్చినా మేము వెంటనే మీ కోసం వస్తాం. మిమ్మల్ని ఆదుకుంటాం. అది మా బాధ్యత. మన కష్టానికి తగిన ప్రతిఫలంతో మనమే అమ్ముకునే ఏర్పాట్లన్నీ చేసాము.

చిన్నప్పటి నుంచీ మనందరి కష్టాలూ చూసాను. అందుకే నేను ఎంతో కష్టపడి మనకు సంబంధించిన ఈ చదువు కోసం అంత దూరం వెళ్ళి ఢిల్లీలో చదివినది.

ఈ కళ మనకు మాత్రమే సాధ్యమైన కళ, దీనిని పదికాలాలపాటు నిలుపుకోవలసిన బాధ్యత మనదే” అంటూ నచ్చచెప్పింది.

తనతో బాటు వేరువేరు చోట్ల ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేసిన తనవారికి ఆ వ్యాపారాన్ని అప్పగించి, ఎప్పటిలాగే ఆన్లైన్ వ్యాపారం తను చూసుకుంటూ తనవారి బ్రతుకుల్లో వెలుగులు నింపింది.

ఆమె మాటలతో ఊరడిల్లిన ఆ జనంలో చైతన్యం వెల్లివిరిసింది.

(సమాప్తం)

Exit mobile version