Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భగవంతుని మీద ప్రేమ

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘భగవంతుని మీద ప్రేమ’. రచన శ్రీ జి.రంగబాబు.]

భగవంతునిపై భక్తి మరియు ప్రేమ కలిగి ఉండి, నిర్మలమైన భక్తితో చేసే పనులు దేవుని అనుగ్రహానికి, ప్రేమకు దారి తీస్తాయి. ఈ విషయాన్ని  ఒక చక్కని  కథ ద్వారా తెలుసుకుందాము.

కంసుని అంతఃపుర దాసిలలో కుబ్జ అనే పేరుతో ఒక ఆమె ఉన్నది. ఆమె కురూపి. పాపం, పుట్టుకతోనే అంద వికారంగా పుట్టిందామె. ఆమె శరీరం మూడు చోట్ల మూడు వంకరలు తిరిగి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది.  అందువల్లనే ఆమెకు త్రివక్ర అని పేరు కూడా వచ్చింది.

కంసుడికి గంధం, సుగంధ లేపనాలు మొదలైనవి తయారు చేసి తీసుకుని పోవడం ఆమె పని. ఆమె వికార రూపం చూసి అందరూ అసహ్యించుకునేవారు. అందువల్ల ఆమె చేసేది లేక తన దురదృష్టాన్ని తలచుకుని లోలోపలే దుఃఖంతో కుమిలిపోతూ ఉండేది. అందరి వలె అందగత్తె కానందున ఆమె పురుష సౌఖ్యానికి కూడా నోచుకోలేదు. ఆమె తన ప్రారబ్ధానికి  ఎప్పుడూ చింత పడుతూ ఉండేది.

“భగవంతుడా నేను ఏం పాపం చేశాను.. నాకు ఇటువంటి అసహ్యమైన రూపం ఎందుకు ఇచ్చావు? నా జన్మ ఇంతేనా” అని వాపోతూ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఉండేది.

బలరామకృష్ణులు సుదాముని ఇంటి నుండి బయలుదేరి వెళుతూ ఉండగా త్రోవలో కుబ్జ కనిపించింది. గంధము మొదలైన రకరకాల పరిమళ భరితమైన మైపూతలు పాత్రలలో నింపుకొని పోతున్నది. ఆమె పరిస్థితి ఏమిటో సర్వాంతర్యామి,విశ్వ వ్యాపి అయిన కృష్ణుడికి తెలుసు. అయినా తెలియనట్లు ఆమెను పిలిచాడు.

“మగువా..! నీవు ఎవరు..? ఏమిటి ఆ పాత్రలో తీసుకొని పోతున్నావు..?” అని అడిగాడు.

దానికి కుబ్జ “అయ్యా నేను కంసుని వద్ద దాసిని. నన్ను త్రివక్ర అంటారు. కంస మహారాజుకు రకరకాల మై పూతలు తయారు చేసి ఇవ్వడం నా పని. నేను తయారుచేసిన గంధాది లేపనాలు అంటే కంసునికి చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఆ మహారాజు కొలువుకే వెళుతున్నాను.” అని చెప్పింది.

“అయితే మా ఇద్దరికీ కూడా మంచి మంచి మై పూతలు ఇవ్వు” అన్నాడు కృష్ణుడు.

కుబ్జ భక్తురాలు కావడం వల్ల మారు మాట్లాడక అందుకు అంగీకరించింది.

“అయ్యలారా..ఈ సుగంధ భరిత లేపనాలు   అనుభవించదగిన  వారు మీకంటే మరెవరున్నారు..!” అంది.

బలరామకృష్ణులు అవతార పురుషులని కుబ్జ కూడా నమ్మింది. భక్తితో వారికి కావలసినంత లేపనం ఇచ్చింది. బలరామకృష్ణులు ఆ లేపనాలను పూసుకుని బంగారానికి తావి అబ్బినట్లు మరింత శోభతో వెలుగొందారు.

కృష్ణుడికి భక్తురాలి మీద దయ కలిగింది. భక్తురాల్ని అనుగ్రహించాలి అనుకున్నాడు. కుబ్జ వంగలేక వికారంగా ఉన్న దేహం వంచి కృష్ణుడి పాదపద్మాలకు నమస్కరించింది. అప్పుడు కృష్ణుడు ఆమె ముంగాళ్లను తన పాదాలతో త్రొక్కాడు. రెండు వేళ్లను గడ్డం కింద ఎత్తుగా  పెట్టి ఆమె శరీరాన్ని లేవనెత్తాడు. వాసుదేవుడా విధంగా ఆమెను స్పృశించి సవరించినంతమాత్రాన తక్షణమే ఆమె విరూపత్వం పోయింది. కటి ప్రదేశము,వక్షస్థలం, కంఠం ఈ మూడు చోట్ల కుబ్జ దేహం వంకరలు తిరిగి ఉండేది. ఇప్పుడా వంకరులు పోయాయి.  కుబ్జ యొక్క వికృత రూపం పోయి ఆమెకు సుందరమైన రూపం లభించింది. యవ్వనంతోనూ, వినూత్న సౌందర్యంతోను దేవకన్యలా వెలిగిపోయిందామె.

వెంటనే బలరామ కృష్ణులకు సాగిలపడి మ్రొక్కింది. తనకు కొత్త జన్మ ప్రసాదించిన జగన్మోహనాకారుడగు కృష్ణుడి పై కుబ్జ కు మోహం అంకురించింది.

“గోవిందా..! అచ్యుతా ..! ఇంతవరకు నేను పరపురుష స్పర్శ ఎరుగను. నాకీ సౌందర్యం ప్రసాదించిన నీవే నాకు ఇక నుండి పతివి. మీరు నాకు ప్రభువు. నా కోరిక తీర్చు. నా ఇంటికి వచ్చి నా జన్మ చరితార్థం చేయి దేవా” అని ఆమె ప్రార్థించింది.

కుబ్జ ప్రార్ధనకు కృష్ణుడు అంగీకరించాడు. అయితే ఇంటికి వచ్చి ఆమె అభిమతం నెరవేర్చడానికి ఇది అదను కాదని చెప్పాడు. వచ్చిన పని చక్కబెట్టుకున్న తర్వాత ఆమె ఇంటికి వస్తానని మాటిచ్చాడు. కుబ్జ సంతోషించి వెళ్ళిపోయింది.

కంసుని సంహరించిన అనంతరం కృష్ణుడు ఉద్ధవుని వెంటపెట్టుకుని కుబ్జ ఇంటికి వెళ్లినట్లు వ్యాసభగవానుడు వ్రాశాడు.

అతణ్ణి ఆహ్వానించి సకల మర్యాదలతో గౌరవించింది భక్తితో అతణ్ణి పూజించింది.ఆమె భక్తికి , ప్రేమకు కృష్ణుడు చాలా సంతోషించాడు. కృష్ణుడు ఆ రాత్రి కుబ్జతో క్రీడించి ఆమెను సంతోష పరిచినట్లు వ్యాసులవారు వర్ణించారు. ఆమెకు ఉపశ్లోకుడు అనే ఒక కుమారుడు కూడా కలిగాడు.

భక్తి గల వారిని ఎవరినైనా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. విరూప, దురదృష్టవంతురాలు అయిన కుబ్జ శ్రీహరిని సేవించి తరించింది. తనకు సౌందర్యం ప్రసాదించిన కృష్ణుని ఆమె పతిగా వరించడంలో తప్పులేదు. ఇందులో అనౌచిత్యం ఏమి కనిపించదు. పైగా అందరి చేత హీనంగా చూడబడిన పరిచారికను, దాసిని ఇట్లా ఉద్ధరించడం, ఆమె మనోరథం ఈడేర్చడం కృష్ణుని ఉదాత్త గుణానికి, అతని సంస్కారానికి చక్కని నిదర్శనం.

Exit mobile version