[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని నిత్య చింతన’ అనే రచనని అందిస్తున్నాము.]
తత్ ప్రాప్య తదేవావలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి అనే వాక్యం నారద భక్తి సూత్రాలలో ప్రధానమైనది. ఈ కలియుగంలో సాధకులందరికీ ఆదర్శప్రాయమైనది, సదా అనుసరణనీయమైనది.
మనసు ఎటు తిప్పబడుతుందో, మన జీవితం కూడా ఆ దిశగానే ప్రయాణిస్తుంది. భౌతిక లోకంలో మనసు ఇంద్రియ సుఖాలవైపు మళ్ళితే దుఃఖాలు, నిరాశలు తప్పవు. కానీ ఆ మనసు భగవంతునిపై నిలిస్తే జీవితం సార్థకమవుతుంది. నారద భక్తి సూత్రాలు ఈ సత్యాన్ని ఒకే వాక్యంతో ప్రతిపాదించాయి: “తత్ ప్రాప్య తదేవావలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి”. అంటే, ఎవరి హృదయం భగవంతుని పాదపద్మ మకరందాన్ని పానం చేస్తుందో, వారికి చూపు ఆయన రూపంపైనే, వినికిడి ఆయన కథలపైనే, మాటలే ఆయన కీర్తనలపైనే, ఆలోచనలే ఆయన ధ్యానంపైనే నిలుస్తాయి.
భక్తి యొక్క పరాకాష్ట ఇదే. ప్రహ్లాదుడి జీవితం ఈ సూత్రానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన అగ్నిలో పడినా, విషంలో ముంచినా, శత్రువుల మధ్య ఉంచినా – నారాయణుని స్మరణే ఆయన్ని రక్షించింది. ఆయన మనసు ‘తదేవ’ అనే స్థితిలో నిలిచింది. ఇది భక్తి యొక్క శక్తి.
శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు:
“మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధింనివేశయ।
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః॥” (గీతా 12.8)
నీ మనసును నాపైనే నిలుపు, నీ బుద్ధిని నాయందే కేంద్రీకరించు. అప్పుడు నీవు నాలోనే నివసిస్తావు. దీనిపై ఎటువంటి సందేహం లేదు అని పై శ్లోకం యొక్క భావం.
ఈ మాటలు నేటికీ ఎంత సమకాలీనమో మనం గమనించాలి. నిత్యం ఆందోళనలు, ఒత్తిడి, పోటీ, భావలాలస, అధికారం కోసం తాపత్రయం వంటి చింతనల మధ్య మానవుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సమయం లేదని భావించే ఈ యుగంలో భగవంతుని స్మరణ కష్టమనే అని అందరూ భావిస్తున్నారు. రోజులో పట్టుమని పది నిముషాలు కూడా భగవంతుని చింతన కోసం కేటాయించడం కష్టమని భావిస్తూ భగవంతునికి అనన్యంగా దూరమవుతున్నారు. కానీ నారద మహర్షి విరచిత భక్తి సూత్రాలలో ఒక ముఖ్యమైన భక్తి మార్గం ఒక సులభ సాధనాన్ని సూచిస్తుంది – భగవన్నామ స్మరణ. పేరును జపించడం ఎక్కడైనా సాధ్యం. రోడ్డుపై నడుస్తూ, పనిలో మునిగిపోతూ, కుటుంబంతో గడుపుతూనే మనసు లోపల నామస్మరణ చేయగలం.
కఠోపనిషత్తు ఇలా చెబుతోంది:
“యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ।
బుద్ధిశ్చ న విచేష్టతే తామ్ ఆహుః పరమాం గతిమ్॥”
అనువాదం: ఇంద్రియాలు, మనసు, బుద్ధి – భగవంతుని స్మరణలో స్థిరపడినప్పుడు, అదే పరమగమ్యం.
ఇది ఆలయంలో లేదా ఏదైనా ఆశ్రమంలో మాత్రమే సాధ్యమని భ్రమ పడకూడదు. విశ్వమే భగవంతుని ఆలయం. గాలిలో ఆయన శ్వాసగా, పువ్వులో ఆయన సుగంధంగా, నదిలో ఆయన ప్రవాహంగా, ప్రతి మనసులో ఆయన చైతన్యంగా, నిత్య నూతనంగా ఉన్నాడు. మన చూపు పవిత్రమైతే ప్రతీ చోట ఆయన దర్శనమే అవుతుంది. మన మాటలు సాత్వికమైతే ప్రతి వాక్యం ఆయన స్తోత్రమే అవుతుంది. మన వినికిడి నిర్మలమైతే ప్రతి శబ్దం ఆయన కీర్తనగానే వినిపిస్తుంది. మన ఆలోచనలు ఆయనపైనే కేంద్రీకృతమైతే మన జీవితం ఆయనలో లీనమైపోతుంది. మనసు ఎల్లప్పుడూ భగవన్నామస్మరణలో లీనమై ఉంటే, జీవితం స్వయంగా ఒక యాగశాలవలె మారుతుంది. నిద్రలోనైనా, పనిలోనైనా, మాటల్లోనైనా, ఆలోచనల్లోనైనా భగవంతుడు మాత్రమే అనుభవమవుతాడు. ఈ నిరంతర స్మరణ మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది, అహంకారాన్ని కరిగిస్తుంది, దుఃఖాలను దూరం చేస్తుంది. ప్రతి పని భగవంతునికి సమర్పణగా అనిపించి, కష్టాలు భక్తికి మెట్లు అవుతాయి. ఇలా చేస్తే సాధారణ జీవితం కూడా ఆధ్యాత్మిక సాధనగా మారి, మనిషి అంతరంగ శాంతి, నిత్యానందాన్ని పొందుతాడు.
అందువల్ల, నారద భక్తి సూత్రం చెప్పిన ‘తదేవ’ భావం ఒక సాధారణ ఆచరణగా మారితే జీవితం పరమానందమయమవుతుంది. మన చూపే ఆయనపై నిలవాలి, మన వినికిడి ఆయన కథలతో నిండి ఉండాలి, మన వాక్కు ఆయన గుణాలను పొగడాలి, మన చింతనే ఆయన రూపాన్ని ధ్యానించాలి. అప్పుడు జీవితం కేవలం భగవద్దర్శనం గానే కాక, నిత్యానందానుభూతిగా మారుతుంది.
