Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినిమా పట్ల ఆసక్తి కలవారి పరిజ్ఞానం పెంచే ‘భాగ్యరాజా Decoded’

[జోశ్యుల పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ‘భాగ్యరాజా Decoded’ అనే పుస్తకం సమీక్షని అందిస్తున్నాము.]

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు ‘భాగ్యరాజా’. నటీనటుల కన్నా ఎక్కువగా ప్రజాదరణను పొందే  దర్శకుల జాబితాలో భాగ్యరాజా పేరు తప్పకుండా ఉంటుంది. 1980-90ల ప్రాంతంలో సినీ ప్రపంచంలో, పెద్ద పేరు భాగ్యరాజా. ఆయన సినిమాలలో ‘స్క్రిప్టు’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నటీనటుల గ్లామర్ పైన, సినిమా పాటల ఆకర్షణ ఆధారంగా సినిమా ఎంతగా ప్రజాదరణ పొందినా, అది చిరకాలం ప్రేక్షకుల మనస్సులలో స్థిరంగా నిలబడి ఉండాలంటే పటిష్టమైన ‘స్క్రీన్‍ప్లే’ తప్పనిసరి. ఇతర సినిమాలకు, పటిష్టమైన స్క్రీన్‍ప్లే ఆధారంగా రూపొందిన సినిమాలకు తేడా ఏమిటంటే, స్క్రీన్‍ప్లే సరిగ్గా లేని సినిమాల చర్చలలో నటీనటుల గురించో, పాటల గురించో, సినిమా గమనంతో సంబంధం లేని ఒకటో రెండో సంభాషణల గురించో అధికంగా వస్తుంది. స్క్రీన్‍ప్లే పకడ్బందీగా ఉన్న సినిమాల చర్చలలో పాత్రలు, పాత్రల వ్యక్తిత్వాలు, వాటి ఆధారంగా రూపొందిన దృశ్యాలు అధికంగా ప్రస్తావనకు వస్తాయి. ‘షోలే’ సినిమా అనగానే గబ్బర్ సింగ్, జయ్, వీరూ, బసంతి, ఠాకూర్, కాలియా, సాంబా, ఒకటేమిటి పలు పాత్రలు, సంభాషణలు; ఒక దృశ్యం నుంచి మరో దృశ్యానికి దూకుతూ  చర్చ సాగుతూనే ఉంటుంది. చివరికి కథతో సంబంధం లేక తీసేసినా నష్టం లేని ‘అంగ్రేజీ జమానే కా జైలర్’ పాత్ర కూడా మరువలేము. పకడ్బందీ స్క్రిప్టు సినిమాకు చక్కని ఉదాహరణ ‘షోలే’, ‘మాయాబజార్’. విషయం ప్రస్తావిస్తే చాలు, ఒకటా, రెండా, పాత్రలు, సంభాషణలు, దృశ్యాలు, ఇలా ఎంత చర్చించినా తనివి తీరదు. చివరికి ఒకసారి కాసేపు కనిపించే ‘అటు నేనే ఇటు నేనే’ పాత్రను కూడా మరువలేము. చక్కటి స్క్రిప్టుకు, అతి చక్కని దర్శకత్వ ప్రతిభ, మంచి నటీనటులు తోడయితే ఇక ఆ చిత్ర దర్శనానుభవం ఆజన్మాంతం మరచిపోలేనిది అవుతుంది. ఉత్తమ దర్శకులంతా అత్యుత్తమ స్క్రీన్‍ప్లేకు ప్రాధాన్యం ఇస్తారు. భాగ్యరాజా కూడా  స్క్రిప్టుకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దర్శకుల కోవలోకి వస్తాడు.

భాగ్యరాజా తమిళంలో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం ఇది. పలు సందర్భాలలో భాగ్యరాజా సినిమా స్క్రిప్టు గురించి వ్రాసిన వ్యాసాల సంపుటి ‘వాంగ సినిమావై పట్రి పేశలాం’ పుస్తకం. ఆ పుస్తకంలోని వ్యాసాలు అనువదించి అందిస్తోందీ పుస్తకం. “సినిమావాళ్ళకి ముఖ్యంగా రచయితలకి, దర్శకులకి ఈ పుస్తకం (స్క్రీన్‍ప్లే రచనలో) గొప్ప గ్రామర్ గైడ్” అని దర్శకుడు కృష్ణవంశీ ముందుమాటలో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఈ పుస్తకంలోని చిన్న చిన్న వ్యాసాలు, స్క్రీన్‍ప్లే గురించి, పాత్రల పరిచయం గురించి, వ్యక్తిత్వ రూపకల్పన, దృశ్య సృష్టీకరణ వంటి విషయాల గురించి అవగాహన కలిగిస్తాయి. నిజ జీవితంలోని సంఘటనలకు కాల్పనిక మెరుగులద్ది ఏ రకంగా తెరకెక్కించి, ప్రేక్షకులను మెప్పించవచ్చో వివరణ ఉంది. ఈ పుస్తకంలో ఉన్న అనేకమైన స్క్రీన్‍ప్లే రచనా సూత్రాలలో మచ్చుకు కొన్ని:

“సినిమా కథ విషయంలో, ఎప్పటికీ మారని ఎవర్‍గ్రీన్ ఫార్ములా ఒకటే. ప్రేక్షకులను బాధించని, లేదా వారికి సంబంధం లేని విషయాలు తెరపై చూపిస్తే ఎవరూ పట్టించుకోరు.” (పేజీ 25)

“స్టోరీ ఐడియానే ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని సబ్ ప్లాట్స్, అనేక పాత్రలు రూపొందించటమన్నది వారి వారి దృక్కోణమే తప్ప, మొక్కుబడిగా, ప్రత్యేకంగా ఇరికించవలసిన అవసరం లేదు.” (పేజీ 32)

“కథల కోసం కలల ప్రపంచంలోనూ, కాల్పనిక ప్రపంచంలోనూ విహరించటం కంటే,  వాళ్ళ వాళ్ళ ఫ్లాష్‍బ్యాక్‍ లను నెమరువేసుకోవటమే కథ చెప్పేందుకు మొదటి మార్గం.” (పేజీ 51)

“ఒక సినిమా స్క్రీన్‍ప్లే చివరి ఘట్టం ప్రజలు ఏ మాత్రం ఎదురుచూడని ఒక మలుపుతో రూపొందించటం చాలా ముఖ్యమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.” (పేజీ 78)

“బాగా గమనిస్తే పైన చెప్పిన అన్ని ఫార్ములా సినిమాల్లోనూ ఒక పర్టిక్యులర్ పోలిక ఉంది. అది మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం.” (పేజీ 88)

ఇలా ప్రతి వ్యాసంలోనూ సినిమా నిర్మాణం, స్క్రీన్‍ప్లే రచనకు సంబంధించి చక్కని సూచనలు లభిస్తాయి.

పుస్తకం రెండవ భాగంలో భాగ్యరాజా సినిమాల్లో ఉత్తమ సినిమాలకు గురించిన విశేషాలు, విశ్లేషణలున్నాయి. మూడవ భాగంలో భాగ్యరాజా ఇంటర్వ్యూ ఉంది.

ఇది అనువాద పుస్తకంలా అనిపించదు. చాలా హాయిగా సాఫీగా సాగిపోతుంది. అయితే, ఈ పుస్తకంలో, కారణం ఏదయినా , ఆంగ్లం వాడకం అతిగా అనిపిస్తుంది. సులభమైన తెలుగు పదాలు అందుబాటులో వున్నా ఆంగ్లపదాల వాడకం అంతగా నప్పదు.

ఈ రకంగా పుస్తకంలో ప్రతి అక్షరం పాఠకులకు సినిమా పట్ల అవగాహన కలిగించాలని, సినిమా పట్ల ఆసక్తి కలవారి పరిజ్ఞానం పెంచాలన్న లక్ష్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పక కొని చదివి నేర్చుకునే రిఫరెన్స్ పుస్తకంలా దాచుకోవల్సిన పుస్తకం ఇది.

***

భాగ్యరాజా Decoded
మూలం: భాగ్యరాజా, అనువాదం: తెప్పల శ్రీనివాస్
ప్రచురణ: జోశ్యుల పబ్లికేషన్స్,
పేజీలు: 180
వెల: ₹ 200 (షిప్పింగ్ ఛార్జీలు అదనం)
ప్రతులకు:
జోశ్యుల సూర్య ప్రకాశ్ 9704683520, 6281288424
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Bhagya-Decoded-Vaanga-Cinemavai-Pesalam/dp/B0DP2CC658

 

 

~

శ్రీ జోశ్యుల సూర్య ప్రకాశ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-josyula-surya-prakash-2/

Exit mobile version