Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు -10

కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ

“రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజవిశ్వనాథమ్!”

కాశీలోని విశ్వనాథ ఆలయము నేడు మనము చూస్తున్నది, పూజిస్తున్నది 1780లో మరాఠా రాణి మాత అహల్యబాయి కట్టించినది. దైవభక్తి పరాయణులైన ఆమె కట్టించినదే మనము నేడు అర్చన చేసుకుంటున్న విశ్వనాథాలయము. మరి యుగయుగాలుగా విడవక అర్చనలందుకుంటున్న విశ్వనాథుడేడని అనుమానము కలగక మానదు. మన దేశములోని దేవాలయాలు చాలా మటుకు మహ్మదీయుల దండయాత్రలలో నాశనము చెయ్యబడినాయి. కాశీలోని దేవాలయం కూడా చాలా సార్లు అలా నాశనము చెయ్యబడింది. 12 వ శతాబ్దము నుంచి 17 వ శతాబ్ధము వరకూ ఎన్నో మార్లు ఆ దేవాలయము పగలగొట్టబడింది. హిందూ రాజులు, పూజారులు మళ్ళీ అక్కడే పునః పునః దేవాలయాన్ని కట్టి శివుణ్ణి పూజించేవారు. అక్బరు సహాయములో రాజా తొండరుమల్లు ఆ దేవాలయాన్ని పెద్దది చేసి కట్టించాడు. తరువాత వచ్చిన ఔరంగజేబు దానిని పడగొట్టి అక్కడ మసీదు కట్టాడు. ఆ మసీదు నేటికీ మనకు శివాలయం ప్రక్కనే కనపడుతుంది. ఆ మసీదు పశ్చిమ గోడలో దేవాలయ శిల్పాలు, స్తంభాలు ప్రస్పుటముగా కనబడుతూ వుంటాయి. ఇప్పుడు ఆ మసీదును కాని, శివాలయాన్నీ కానీ ఫోటో తీయ్యటము నేరం. కాని మనకు ఇంటరునెట్‌ లో అవి లభ్యమే!

ఈ జ్ఞానవాపి మసీదును పడగొట్టాలని కరసేవకులు పిలుపునిచ్చారని, వాజుపైయి గారు ఆపారని గైడు చెప్పాడు. ఈ మసీదును పడగొట్టి మరల దేవాలయం కట్టాలని పూర్వపు హిందూ రాజులు ప్రయత్నాలు చేశారు కానీ, అవధ్ నవాబు యొక్క ఆధీనములో ఆ మసీదు వుండటము వలన కుదరలేదు.

మరాఠా రాజు మలహారు రావు హోల్కరు ఎంతో ప్రయత్నించినా దేవాలయాన్ని పునర్నించము కుదరలేదు. 1780లో ఆయన కోడలు అహల్యబాయి హోల్కరు కలలో స్వామి కనిపించి ఆ మసీదుకు పశ్చిమముగా గుడి కట్టమని, నర్మదా బాణ లింగముతో పునః ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడని చెబుతారు. ఆమె ఆ విధంగానే చేసినందున మనకు నేటి ఈ దేవాలయము దక్కింది. దేవాలయానికి వెళ్ళే క్యూ మనలను ఒక వరండాల ప్రక్కగా తీసుకు పోతుంది. ఆ వరండాలో ఒక పెద్ద నంది మసీదు వైపు ముఖము చేసి వుంటుంది. అది పూర్వ శివాలయములో శివునకు ఎదురుగా వున్న నంది. ఆ నంది ప్రక్కన మనకు ఒక చిన్న బావి కనపడుతుంది.

ఆ బావి లోని జలము పరమ పవిత్రమైనవని భావిస్తారు హైందవులు నేటికి. ఆ బావిని జ్ఞానవాపి బావి అంటారు.

జ్ఞాని వాపి బావి గురించి కాశీఖండము చెబుతుంది. దిక్పాలకులలో ఈశానుడు శివుని గురించి తపస్సు చేసి, ఒక బావిని త్రవ్వి, ఆ బావి నుంచి జలముతో శివునకు అభిషేకము చేసేవాడుట. ఈ జలము త్రాగిన వారికి జ్ఞానము వచ్చేదిట. అంతేకాదు పూర్వజన్మ స్పృహ కూడా కలుగుతుందని కాశీఖండము చెబుతుంది.

ఈ మహ్మదీయుల దండయాత్రలో జ్యోతిర్లింగమైవ విశ్వనాథుని వారి నుంచి కాపాడుతోవటానికి ప్రథాన అర్చకులు స్వామితో కలసి ఆ బావిలోకి దుమికేసి ప్రాణత్యాగము చేశారట. తరువాత ఆ లింగము కోసము బావిలో ఎంత వెతికినా దొరకలేదు. చాలా కాలము ఆ బావికే పూజ చేసేవారు భక్తులు. తరువాత మనము చూస్తున్న నేటి దేవాలయము అహల్యాబాయి రాణి చేత నిర్మితమైనది. కానీ భక్తులు నేటికి ఆ బావికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటారు. ఆ బావిలోని జలము గంగ కంటే ఎంతో పవిత్రమైనవని చెబుతారు కాశీవాసులు.

   

ఇక్కడకు మనము ఫోను కాని కెమరా కానీ తీసుకుపోలేము. కాబట్టి మనము ఈ ఫోటోలు తీయ్యలేము. ఇవి కూడా ఇంటర్‌నెట్‌లో లభ్యం.

విశ్వనాథుని గుడి చాలా చిన్నది. గర్భగుడిలో లింగము ఒక ప్రక్కగా వుంటుంది. నర్మదా బాణము తెచ్చినప్పుడు ప్రతిష్ఠకు ముందు అక్కడ పెట్టగానే ఆ లింగము నేలకు అత్తుకు పోయ్యిందిట. అందుకని అక్కడ అలా వుంచేసి అక్కడే మిగిలినవి నిర్మించారు. మూల విరాటుగా వెలిగే విశ్వనాథుడు కాకుండా గణపతి, ముక్తేశ్వరుడు, పార్వతితో పాటు ఎన్నో శివలింగాలు ఆ చిన్న ప్రాంగణములో వున్నారు.

అర్చన కాని, అభిషేకము కాని చేసుకోవాలంటే, కాశీ గుడి ట్రస్టు వారు ఒక క్రమపద్ధతిలో పూజారులను టికెటు కొన్న భక్తులతో పంపుతారు. వారు ప్రాంగణములో వున్న హాలులో సంకల్పము చెప్పించుకు, వెళ్ళి మూల విరాటుకు అభిషేకము చేస్తారు.ఈ పద్దతిలో మనకు అక్కడి పండాలలో బేరసారాల గొడవ వుండదు. అక్కడి బ్రాహ్మలందరికి వంతులుగా అవకాశము వస్తుంది.

ఈ పద్దతి ఈ మధ్యనే మొదలెట్టారు. కాశీ విశ్వనాథునికి ఉదయము దాదాపు 3 గంటలకు మంగళహారతి మొదలెట్టి రాత్రికి 11గంటలకు శృంగార హారతితో పూర్తిచేస్తారు. కాశీకి వెళ్ళిన వారు ఒక్క హారతైనా చూడగలిగితే స్వామిని చూసిన ఆనందముతో మనసు పరవళ్ళు తొక్కటము ఖాయం.

కాశీలో మరో బావి కూడా ఎంతో ప్రముఖమైనది. ధర్మకూప్ అనబడే ఈ బావిలో జలముతో స్నానమాడితే పాపాలన్నీ పోయి స్వర్గము ప్రాప్తిస్తుందట. ఆ బావి విశాలక్ష్మి అమ్మవారి గుడి నుంచి కుడివైపుగా వెడితే కనపడుతుంది. ఆ బావి స్వయంగా మహాదేవుడే ధర్మరాజు కోసము ఏర్పాటు చేశాడని కాశీఖండము చెబుతుంది. ఆ నీటితో స్నానము చేసి, ఆ బావి జలముతో చుట్టూ వున్న దేవాలయాలలో అభిషేకము చేస్తారు. అక్కడే వున్న ధర్మమేశ్వరుడన్న శివుడి వద్ద చేసే గాయత్రికి ఫలమెంతో ఎక్కువ అని కాశీ పండితులు చెబుతారు. అందుకే అక్కడ ప్రతినిత్యము బ్రాహ్మలు ఎంతో మంది జపము చేస్తూ కనపడుతారు.

సమయము వుండే సాధకులు ఆ ప్రాంగణములో జపం చేసుకు తరించవచ్చు!

(సశేషం)

Exit mobile version