బిర్లా టెంపుల్:
ఇది కాశీలో ప్రముఖ శివాలయాలలో ఒకటి. దేవాలయ గోడల మీద భగవద్గీతలోని శ్లోకాలతో నిండి వుంటుంది.
1930లో హిందూ విశ్వవిద్యాలయము నిర్మించిన మదన్ మోహన్ మాలవ్యా విద్యాలయ ప్రాంగణములో ఒక దేవాలయము నిర్మించాలని తలచారు. అంతకు పూర్వము ఎన్నో సార్లు కాశీవిశ్వనాథుని దేవాలయము ముట్టడికి గురైనది. అలాంటి ముంపుకు తావులేకుండా విశ్వవిద్యాలయము మధ్యలో విశాలముగా దేవాలయము నిర్మించాలని మాలవ్యా తలచారు. బిర్లా కుటుంబము పాలరాయితో నిర్మించటానికి ముందుకు వచ్చారు. బిర్లా వారు ఒక కమిటీగా ఏర్పడి పూర్తి పాలరాయితో, కాశి విశ్వనాథుని దేవాలయ మోడల్లో నిర్మించారు. ఇది నిర్మించటానికి 30 సంవత్సరములు పట్టింది.
నేను ఈ మహావిద్యాలయానికి రెండు సార్లు వెళ్ళాను. మొదటి సారి దేవాలయానికి చూడటానికి వెళ్ళాను. తరువాత యూనివర్సిటీలో గ్రంథాలయము చూడటానికే వెళ్ళాను. మొదటి సారి వెళ్ళినప్పుడు మూసి వుంది. రామ్‌నగర్ వెడుతూ ఇక్కడ ఆగి స్వామిని దర్శించి, గ్రంథాలయములో కొంత సేపు కూర్చొని వెళ్ళాను. దేవాలయములో మనసు శుద్ధి, గ్రంథాలయములో అజ్ఞానము శుద్ధితో హిందూ మహావిద్యాలయము సందర్శకులకు తప్పక నచ్చుతుంది. అక్కడ మనకు గంగ వడ్డున వున్న ఇరుకు సందులు, మురికి వుండవు. విశాలమైన రోడ్డు, ప్రశాంతమైన విద్యాలయ వాతావరణము, రాజసముగా నిలచి, చరిత్రను చెబుతూ, నిలబడ్డ ఆ భవనాలు మనలను ప్రశాంతచిత్తులుగా చేస్తాయి. దేవాలయము గేటు దాటగానే మనకు మదన్ మోహన్ మాలవ్యా విగ్రహము కనపడుతుంది. ఆయన విగ్రహము క్రింద వారు ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు చేసిన కృషి గురించి వుంటుంది. భారతీయులలో ఆత్మవిశ్వాసానికి ఆయన ముందుచూపుగా విద్య మీద దృష్టి నిలిపి మనలకు మొదటి సోపానముగా కట్టిన ఆ విద్యాలయానికీ, ఆయనకు వున్న ముందుచూపుకు నేను నమస్కారాలు సమర్పించాను.
(సశేషం)
హైద్రాబాదులో పుట్టి పెరిగారు. వివాహనంతరం అమెరికాలోని అట్లాంటా లో స్థిరపడ్డారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ. డిగ్రీ పొందారు.
సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా పనిచేశారు. అట్లాంటా తెలుగు సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్ ఇత్యాది సంస్థలకు స్వచ్ఛంద సేవ చేసి ప్రస్తుతం వీటి సేవ ద్వారా గిరిజన, అంధ విద్యార్దులకై సేవలందింస్తున్నారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసం సేవలందించే రక్షా సంస్థవారి “Ramesh-Bakshi Leadership” అవార్డు అందుకున్నారు.

