Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 27

కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ

రాజ్‌ఘాటు:

కాశీ క్షేత్రములో వున్న ప్రతి ఘాటులో ఏదో ఒక ప్రత్యేకత వుంది. రాజ్‌ఘాటు కూడా అందులో ఒకటి. ఈ రాజ్‌ఘాటులోనే జిడ్డు కృష్ణమూర్తిగారి స్కూలు వుంది. జిడ్డు కృష్ణమూర్తి గారిని తలవగానే మనకు థియసాఫికల్ సొసైటీ, మదనపల్లి గుర్తుకువస్తాయి కదా. మదనపల్లిలో వున్న రిషి వ్యాలి స్కూలు వంటిదే కాశీ లోనూ వుంది. అదే రాజ్‌ఘాట్‌ బీసెంటు స్కూలు. అక్కడ వున్న ఆ ఇంటిలో కృష్ణమూర్తిగారు కొన్ని రోజులు నివాసమున్నారు కూడా.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధునిక దార్శనికులలో జిడ్డుకృష్ణమూర్తి అగ్రేసరులు. 1895లో మదనపల్లిలో నారాయణమ్మ, సంజీవమ్మలకు కుమారుడిగా జన్మించారు. తండ్రి పిల్లల చదువులకై మద్రాసుకు కుటుంబము మారుస్తారు. 1909లో అడయారులో థియోసాఫికల్‌ సోసైటీ భవనాలకు సమీపాన వుంటారు. ఆటలాడుకునే కృష్ణమూర్తి లెడ్‌బీటరును ఆకర్షిస్తాడు. (లెడ్‌బీటర్ థియోసఫీలో ముఖ్యులు). ఆయన కృష్ణమూర్తిని, ఆయన సోదరుణ్ణి వారి తండ్రి అనుమతితో దివ్యజ్ఞాన సమాజానికి తీసుకువస్తారు. ఆయనకు వీరితో గాఢమైన అనుబంధము ఏర్పడుతుంది. వారి గత జన్మలను వారికి తెలియచేస్తాడు లెడ్‌బీటర్‌. మాస్టరు కుతూమీ అనే గురువు చేత కృష్ణమూర్తికి దీక్షను ఇప్పిస్తారు. అప్పుడే కృష్ణమూర్తి “At the feet of Masters” అన్న పుస్తకము రాస్తాడు. అది ఆ సంవత్సరమే ప్రచురించబడుతుంది. అంత చిన్న వయస్సులో అతి గహనము గంభీరమైన విషయాలను కృష్ణమూర్తి రాయటము మేధావులను అబ్బుర పరుస్తుంది.

1911లో మొదటిసారి కృష్ణమూర్తి అనిబిసెంట్‌తో కలిసి కాశీకి వస్తారు. కాశీలో ఆయన ఉపన్యాసాలు మేధావులకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన చేత ఒక దివ్యశక్తి పలికిస్తోందని అందరూ అనుకునేవారు అప్పట్లో. కాశీలో ఆయన తన 17వ ఏట సర్టిఫికేట్లు పంచుతుంటే పెద్ద పెద్దవారు కూడా ఆయనకు పాదాభివందనములు చేసేవారు. ఆయనను “Most Holy of Holy” అనేవారు. ఆయన నడిచే దారిలో గులాబీలు పరిచేవారు. కొందరు ఆయనను కృష్ణుడంటే కొందరు జీసెస్‌ అనేవారు. 1911 నాటికి ప్రపంచమంతా ఆయనకు బ్రహ్మరథం పట్టింది.

జార్జి బెర్నార్డ్ షా కృష్ణమూర్తిని “the most beautiful person I ever met” అన్నారు.

ఆయనది అసాధారణ, ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వం. లెడ్‌బీటర్‌ ఆయనకు ఎన్నో దీక్షలిచ్చేవారు. ఆయనకు రోజురోజుకూ పాపులారీ పెరిగిపోయింది. హలీవుడ్‌ ఆయనను ఆహ్వానించింది. జనరల్ మోటార్స్ వారు కారును బహుంకరించి ఒక్క పోటో కావాలంటే అన్నింటిని తృణప్రాయంగా తిరస్కరించా రాయన. ప్రలోభాలన్నింటికీ విముఖత్వం ప్రకటించారు. మహా నిగర్వి, అత్యంత నమ్ర స్వభావుడాయన. చాలా బిడియస్తుడు. ఎవ్వరిని కాళ్ళని తాకనిచ్చేవారు కారు.

దివ్యజ్ఞాన సమాజము ఆయనను ‘world teacher’ గా ప్రకటించారు కాని ఆయన ఆ పదవిని నిరాకరించారు.

ఆయనకు చిన్నతనము నుంచి కొన్ని దివ్యమైన అనుభూతులు కలుగుతూ వుండేవి. మనుషులకు సహయపడే శక్తులు కూడా కనపడేవి. ఆయనకు యోగశక్తులే కాక రోగాలు నయం చేసే శక్తి వుండేది.

ఆయన ఆంగ్లము, ఫ్రెంచ్‌, జర్మనీ లాంటి యూరోపీయను భాషలు నేర్చుకున్నారు. భారతీయ భాషలను మర్చిపోయారు. వారి మాతృభాష తెలుగు కూడా దాదాపు మర్చి పోయారు.

ఆయన సిద్దాంతాలన్నీ కొంత వేరేగా వున్నా స్పష్టంగా వుంటాయి.

సత్యానికి నిర్దిష్టమైన మార్గం లేదనీ, సంస్థాపరమైన సత్యశోదన కుదరదని, సత్యాన్ని ఎవరికివారే సాధించు కోవాలని చెప్పారు. సత్యం అపారమైనది. నిర్నిబద్ధమైనది. దాన్ని సంఘుటిత పరచలేము. విశ్వాసము వ్యక్తిగతము అని ప్రకటించారు కృష్ణమూర్తి. తనకు శిష్యులు లేరని, వున్నది మిత్రులేనని చెప్పారు.

ఆయన మీద అచంచల విశ్వాసము మాత్రం బీసెంటు ప్రకటించేవారు. ధియోసఫీకీ, కృష్ణమూర్తికీ నడుమ విభేదాలు వచ్చాయి. ఆయనను చివర వరకూ మిత్రులే చూసుకున్నారు.

సంపూర్ణ స్వేచ్ఛ కలిగించటమే తన లక్ష్యమని ప్రకటించారు కృష్ణమూర్తి. “ఆనంద సామ్రాజ్యపు తాళము చెవి ఎవరిది వారి వద్దే వుంటుంది. మరణం జీవితములో అంతర్భాగము. ధ్యానమంటే ఇది నిజమా, అబద్ధమా అని చివరికంటూ ఆలోచించటము. నిజాన్ని నిజముగా గుర్తించటము. నిత్య జీవితములో ప్రతి బంధాన్ని దాటెయ్యటం” అని ఉద్బోదించారు..

ప్రాచీన భారతీయులు కనుగొన్న జీవిత విధానమే స్వచ్ఛమైనదని చెబుతారాయన.

ఆయన ఆలోచనలకు సాకార రూపమే ఆయన ప్రారంభించిన మదనపల్లి లోని రిషీవ్యాలీ స్కూలు. కాశీ లోని రాజ్‌ఘాట్‌ బీసెంటు స్కూలు.

వారి విద్యా భోదన పిల్లల లోని సృజనాత్మకతను వెలికితెచ్చేదిగా వుంటుంది. అందువలనే వారి విద్యావిధానము ఎంతో పేరు తెచ్చుకున్నది.

ధ్యానమే మార్గమని, సాధనే గమ్యమని ప్రబోధించిన మహామనీషి ఆయన. కాశీలో తప్పక దర్శించ తగ్గవి ఆయన నివసించిన ఇల్లు, రాజ్‌ఘాట్‌ స్కూలు.

(సశేషం)

Exit mobile version