Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భలే భలే మంచిరోజులులె

[శ్రీమతి గాడేపల్లి పద్మజ గారి ‘భలే భలే మంచిరోజులులె’ అనే రచనని అందిస్తున్నాము.]

సాయంకాలం అలా నడుచుకుంటూ వెళ్ళి పార్కులో కూర్చున్నాను. పిల్లలు పెద్దగా లేరు. అందరూ పెద్దవాళ్ళే. పార్క్‌లో ఆడేంత టైము ఇప్పుడు పిల్లలకు లేదు కదా! అనిపించి నా మనసు ఓ నలభై ఏళ్ళు వెనక్కు, నా బాల్యం వైపు వెళ్ళింది. అప్పటి బాల్యం మది నిండా నిండి పోయి నన్ను గతం లోకి లాక్కెళ్ళింది.

తొలిసంధ్య కిరణాలు భూమిని తాకీతాకముందే మెలుకువ వచ్చేస్తుంది. మళ్ళీ తెల్లవారింది. అల్లరి చెయ్యడానికి, పెద్దలతో మొట్టికాయలు తినడానికి. పెద్ద డబ్బా నిండా తయారు చేసిపెట్టిన తియ్యటి పండ్లు పొడి చేతిలో పోసుకుని గుప్పెడు మూసేసి వేలితో అద్దుకుంటు పండ్లు తోముకోవడంతో దినచర్య మొదలవుతుంది. ఎకరం సైజు ఉన్న ఆ ఇంటి అరుగు మీద కృష్ణ, పాండు, మురారి, రవి చేరి కబుర్లాడుకుంటు దంతధావనం పూర్తి చేస్తారు. బ్రష్‌లు, టంగ్ క్లీనర్లు లేవు ఆ రోజుల్లో. చేతితో బరబర తోమడం, తాటాకు బద్దతో నాలుక గీకేయడం. పిప్పరమెంటు వాసనతో తియ్యగా ఉండే పండ్లపొడితో తోమేదాని కన్నా పారబోసేదే ఎక్కువ. కానీ ఎవరికీ పంటి సమస్యలు లేవు. బావిలో నీళు నాలుగు బక్కెట్లు వీపు మీద కుమ్మరించుకుని స్నానం పూర్తయిందనిపిస్తారు. అప్పట్లో లైఫ్‍బోయ్ సబ్బు తప్ప మరొకటి ఎరుగరు. బ్రేక్‍ఫాస్ట్ అంటే ఏమిటో తెలీదు. చద్దన్నంలో పెరుగు కలిపి దబ్బకాయ ముక్కవేసి అమ్మ నోట్లో పెడితే తిని స్కూలుకు వెళ్ళేవాళ్ళు. స్కూలు బ్యాగులు లేవు. నాలుగే నాలుగు పుస్తకాలు చేతిలో అడ్డంగా పట్టుకుని భుజం మీద చేతులు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ స్కూలుకెళ్ళడం. చాలామందికి చెప్పులైనా ఉండవు. ఇక బూట్ల మాట వాళ్ళకు తెలియదు. “ఒరేయ్, అంజిగా నిన్న బడికి రాలేదేంటిరా?” అడిగాడు గోపి. “రవిగాడితో బిల్లంగోడి ఆడుతుంటే కాలికి రాయి కొట్టుకుని నెత్తురొచ్చింది. ఇదిగో” అంటూ కాలికట్టు చూపించాడు అంజి.

ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే సారథి మాష్టారు కనిపించారు. “తోడుదొంగలిద్దరు బయలుదేరారా? కబుర్లు తర్వాత, పదండి, పదండి ప్రార్ధనకు టైం అవుతోంది” అనడంతో గబగబా నడుస్తారు. ఆ రోజుల్లో స్కూల్లో ప్రొద్దునే ప్రార్ధన జరిగేది, అసెంబ్లీ కాదు. వందేమాతరం, జనగణమణ ప్రతి ఒక్కరు పాడవలసిందే. ఎవరినీ స్కూల్లో చిన్నచూపు చూడరు. అందరు క్రింద కూర్చోవలసిందే. పంతులుగారి ముందు చేతులు కట్టుకోవలసిందే. మాతృభాష లోనే పాఠాలన్నీ. తప్పు చేస్తే గుంజిళ్ళు, మొట్టి కాయలు, తొడపాశం తప్పవు. అప్పుడప్పుడు బెత్తంతో దండన తప్పదు. పుస్తకాల బరువు, హోంవర్క్ భారం ఉండదు. ఔట్ బెల్ (ఇంట్రవల్) టైంలో ప్రతి ఒక్కరి జేబులోంచి ఐదు లేక పదిపైసలు బైటికి రావల్సిందే. వాటితో బఠాణీలు, ఉప్పు శనగలు, రేగుపండ్లు, కలేపండ్లు, జామపండ్లు, ఈతపండ్లు, పుల్లైసు కొనుక్కుని, అందరు పంచుకుని తింటుంటే వచ్చే సరదా ఈ తరానికి లేదు. వేమన శతకం, సుమతీశతకం అందరికీ కంఠోపాఠమే.

“అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. వీధులన్నిటి లోన ఏ వీధి మేలు. మంచివారున్నట్టి మా వీధిమేలు” అనే ఒకటవ తరగతి తెలుగువాచకంలోని పాట పిల్లలకు సానుకూల దృక్పథాన్ని నేర్పించేది. బాక్స్‌లో చల్లారిపోయిన అన్నం తినవలసిన అవసరం లేదు. సాయంత్రం ఇల్లు చేరగానే పుస్తకాలు ఇంట్లో పడేసి రాములవారి గుడిమెట్ల మీద, బొడ్రాయి సెంటర్లో, పుల్లమ్మ గారెలకొట్టు దగ్గర ఆటలు మొదలుపెడతారు. గోళీలు, బెచ్చాలు, బిళ్ళంగోడి, దొంగపోలీసు ఇలా రకరకాల ఆటలతో పిల్లల అరుపులతో వీధంతా దద్దరిల్లి పోతుంది. ఆహారం కోసం వెళ్ళిన పక్షులు పిల్లలను వెతుక్కుంటు గూళ్ళు చేరి, చెట్ల మీద చేసే సవ్వడులు, పిల్లల ఆటల ధ్వనితో కలిసి ఆ టైమ్‌లో ఊరంతా కోలాహలంగా మారిపోతుంది. ప్రకృతితో పిల్లలు చేసే స్నేహం కుటుంబంలోని సభ్యుల మధ్య అనుబంధానికి పునాది. ఆటల మధ్యలో వచ్చే గొడవలు పెద్దలదాకా వెళ్ళి, వాళ్ళ తగువుకు కూడా దారి తీస్తుంది. కుక్కపిల్ల తోకకి తాడు కట్టడం, తూనీగల్ని పట్టుకుని ఎగరేయడం, పురుగు అగ్గిపెట్టెలో పెట్టి గ్రుడ్లు పెట్టించడం, సజ్జకంకి జేబులో పెట్టుకుని కొరుక్కుతినడం అన్నీ శ్రీకృష్ణ లీలలే. ఇంట్లో గొడవలున్నా అవి పిల్లలు పట్టించుకోరు. ఉమ్మడి కుటుంబంలో ఒక్క ఇంట్లో పదిమంది పిల్లలు. అమ్మ, నాన్నతోబాటు తాతయ్య, బామ్మ, పెదనాన్న, బాబాయిలాంటి వరసలెన్నో వాళ్ళకు తోడుంటాయి. వాళ్ళంతా కలిసి చూసుకుంటారనే ధీమా ఉండేది.

గుంపుగా ఆటలాడుతూ లోకమంతా తామే అయినట్లు, పరిసరాలను మర్చిపోయి, పరుగులు పెట్టే పిల్లల మనసు సంతోషమే. టి.విలు లేని రోజుల్లో తోలుబొమ్మలాట, పిట్టల దొర, జంగమదేవరలు, బలాలు, బుర్రకథలు, వీటన్నిటినీ మించి పద్యనాటకాలు ఆ రోజుల్లో పెద్దలకే కాదు పిల్లలకు వినోదాన్ని పంచేవి. శ్రీరామనమినాడు వేసే కోలాటాలు, వర్షం కోసం రావిచెట్టుకి వేపచెట్టుకి పెళ్ళి, బొడ్రాయికి నీళ్ళు పొయ్యడం, గ్రామదేవతకు చేసే జాతరలు పిల్లలకు తమాషాగా ఉండేవి. నశ్యం పీల్చే పంచాక్షరం మాష్టారిని ఏడిపించే అల్లరిపిల్లలు అప్పుడు ఉన్నారు. స్కూలు ఎగ్గొట్టి ఈత కొట్టడం, కరణంగారి తోటతో జామకాయలు దొంగిలించడం, మట్టిరోడ్డుమీద సైకిల్ చక్రాన్ని నెట్టుకుంటు ఊరంతా తిరగడం, బెచ్చాలాటలో కర్రముక్క తగిలి ఎవరన్నా తగువుకు వస్తే అమ్మ కొంగుచాటున దాక్కోవటం ఇవన్నీ ఆ రోజుల్లో పిల్లలకు అద్భుతమైన అనుభవాలు. ఏ పండుగకో, పబ్బానికో అరిసెలు, చక్రాలు చేసి డబ్బాలో పోస్తే ఓ వారం రోజులు వాటితో కాలక్షేపం. అప్పటి పిల్లలకు ఆరిందలా మాట్లాడటం తెలీదు. పెద్దవాళ్ళు ఒకసారి అరిచారంటే కళ్ళనీళ్ళు పెట్టుకుని ప్రక్కకు తప్పుకుంటారు.

ఏ బాధ్యతా లేని ఆనాటి బాల్యం అపురూపం, అమోఘం. ఇప్పుడు బాలలున్నారే గాని బాల్యం లేదు. ఈ తప్పు ఎవరిదీ కాదు. కాలానిది. నాగరికత, మారుతున్న కుటుంబ పరిస్థితులు పిల్లలకు బాల్యాన్ని దూరం చేస్తున్నాయి. పిల్లలకు బంధుత్వాలు తెలియవు. అందరు ఆంటీలు, అంకుల్సే. ప్రపంచమంతా మొబైల్ రూపంలో పిల్లల అరచేతిలో ఉంది. రకరకాల విద్యలు పిల్లలను పిట్టకొంచెం, కూతఘనంలా తయారు చేస్తున్నాయి. ఎన్ని ఉన్నా పిల్లల్లో స్తబ్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మనం తినే తిండి త్రాగే నీళ్ళతో స్వచ్ఛత లేనట్లే పిల్లల బాల్యం లోనూ స్వచ్ఛత కరవైంది. చరిత్ర పునరావృతమై యువత ఉమ్మడి కుటుంబాల కోసం ఆశపడే రోజులు రావాలి. అప్పుడు బాల్యం పిల్లల ముందు వాలి వాళ్ళను అక్కున చేర్చుకుంటుంది.

Exit mobile version