Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భానుమతి రామకృష్ణ – అత్తగారి కథలు

[బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి పి. భానుమతి శతజయంతి 2025 సందర్భంగా శ్రీమతి సుందరి వేణుగోపాల్ అందిస్తున్న ప్రత్యేక రచన.]

భానుమతి అంటే ప్రజ్ఞ, ఉపజ్ఞ, ధీషణ ముప్పేటలా అల్లుకున్న ఒక తేజస్విని. శక్తి యుక్తి భక్తి రక్తుల చతుర్భుజి.

బొమ్మరాజు వారి బొమ్మ పాలువాయి వారి రెమ్మల కలబోత భానుమతీ రామకృష్ణ. ఆవిడ ఖాతాలో చేరని బిరుదు, ప్రశంసాపత్రాల పద్దులు బహు కొద్ది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి: దక్షిణ చలనచిత్రరంగంలో తొలి పద్మశ్రీ గ్రహీత, తొలి మహిళా దర్శకురాలు, తొలి త్రిభాషా చిత్ర దర్శకురాలు మరియు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీల అవార్డులను అందుకున్న ఏకైక తెలుగు రచయిత్రి (తన ఆత్మకథ అయిన నాలో నేనుకు కేంద్ర ప్రభుత్వము నుంచి, అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి). సుమారు తన 60 సంవత్సరాల (1939-1998) చలనచిత్ర ప్రస్థానములో నటన, సంగీతం, సాహిత్యం, చలనచిత్ర దర్శకత్వం మరియు సంగీత సారథ్యం, స్టూడియో నిర్మాణం, నిర్వాహణ, ఎడిటింగ్ వంటి అష్టావధానాలనే కాకుండా జ్యోతిష్కం, చిత్రలేఖనం, సాంఘికసేవ వంటి ఇతర రంగాలకు చెందిన ప్రక్రియలలోను మేటి ఈ నటీమణి. ఆమె చలనచిత్ర జీవితాన్ని గురించి, ఆమె సంగీత ప్రతిభను గురించి ఎందరో మహానుభావులు వివరంగా వ్రాయడం, విపులంగా చర్చించడం జరిగింది. సంగీత సాహిత్య సమలంకృతే అయిన భానుమతిని, ఆమె రచనాపాటవంతో పరిచయం అయిన దగ్గరనుంచి నటిగా, సంగీతకళాకారిణిగా కన్నాకూడా, ఒక విశిస్టమైన సాహిత్యకారిణిగా అబిమానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ముఖ్యముగా ఆవిడ కలము నుంచి ప్రాణం పోసుకున్న అత్తగారి పాత్ర అంటే నాకు విపరీతమైన ఇష్టము. అందుకే ఆవిడకు నివాళిగా ఈ వ్యాస సమర్పణ.

నిజమైన మనుషుల్ని చూసి, వారి ఆకారాలూ, అంతరాంతరాలూ, మాటల్లో పొదగగల అపురూపమైన ప్రతిభ గల బహుకొద్దిమంది రచయితల్లో భానుమతీ రామకృష్ణగారు ఒకరు శ్రీ పాలగుమ్మి పద్మరాజు

ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన అత్తగారి కథలు వ్రాసి తెలుగు సాహిత్యంలో హాస్య రచనలు చేసిన రచయిత్రులు లేని కొరతను తీర్చారు భానుమతి. ఆరోగ్యకరమైన హాస్యం అంటే బూతులు కాదని రుజువు చేసే చక్కటి తెలుగు నుడికారాలతో నిండిన ఈ కథలు నల్లేరు మీద బండిలా సాగిపోతూ మనకు చక్కిలిగిలి పెట్టి మనసారా నవ్వుకునేలా చేసే హాస్యసంజీవని గుళికలు. అత్తగారితో పాటు ఆవకాయకి కూడా సాహిత్య గౌరవాన్ని, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన కథలు.

తన చూట్టూ ఉన్నవారి జీవితాలను అతిదగ్గర నుంచి కాచివడబోసి, అంతఃకరణలు, అనురాగాలు, ఆపేక్షలు, అభిమానాలు, అనుబంధాలే అంతస్సూత్రంగా పెనవేసుకుపోయిన మానవ సంబంధాలను గురించి తన అత్తగారి కథల ద్వారా మనకు అందించిన సునిశిత పరిశీలకురాలు భానుమతి. ఆమె కథలలో ఎత్తుగడలు, సన్నివేశ కల్పనలు, సందర్భాన్నిబట్టి వచ్చే చిట్టిపొట్టి తగవులాటలు, సంజాయిషీలు, సమర్ధింపులు, సముదాయింపులు, చక్కటి ముక్తాయింపులు ఎంతో వొద్దికగా గువ్వపిట్టల్లా అమిరి పోయి మనలను నిరంతరం అలరిస్తూనే ఉంటాయి. స్వతహాగా హాస్యరసం అంటే ఎంతో ఇష్టపడే భానుమతి సందర్భాన్నిబట్టి సహజమైన హాస్యాన్ని అలవోకగా సృష్టించగల ఇంద్రజాలికురాలు. రావూరి వారి హాస్యము, మునిమాణిక్యం గారి కాంతం పాత్ర తనకు చాలా ఇష్టము అని చెప్పేభానుమతి హాస్యం,వ్యంగ్యం తనకు ప్రాణమైనందున సీరియస్సుగా రచనలను చేయలేనని ఒప్పుకున్నారు.

పాత్ర సృష్టి, అనుభవైక వేద్యమైన వాస్తవికత, సున్నితమైన హాస్యరసము అత్తగారి కథలలో ప్రశంసార్హమైన విషయాలు. కమ్మని కల్పనలు, సజీవమైన సంభాషణలు సాఫీగా సునాయాసంగా ఏకధాటిని చదివింపచేసే సుగుణము ఈవిడకే హక్కుభుక్తమైన చొక్కపు సొమ్ము (యం . శేషాచలం & కంపెనీ)

తెలుగు సాహిత్యంలో చిరంజీవత్వం పొందిన గణపతి, బుడుగు, గిరీశం, బుచ్చమ్మ, పార్వతీశం, కాంతం వంటి అతికొద్ది పాత్రలలో భానుమతి అత్తగారి పాత్ర కూడా ఒకటి. అత్తగారి పాత్ర తన ఛాదస్తం, అమయాకత్వం, అప్పుడప్పుడు ఆ అమాయకత వెనకనుంచి తళుక్కుమనే జాణతనం, అభిమానము, ప్రేమ, ఉదాసీనత, పెద్దరికం పట్ల వ్యామోహము, వంట ఇంటి అజమాయిషీ, మడి ఆచారాల పట్ల తగని మక్కువ వంటి గుణాలతో ఒక ప్రత్యేక వ్యక్తిగా, సజీవ మూర్తిగా మన మనస్సులలో నిలిచిపోయేలా సృష్టించి, ఆ పాత్రకు అంత ప్రత్యేక వ్యక్తిత్వాన్ని,ఆపాదించి చదువరులను అలరించడం తనికెళ్ళభరణి గారన్నట్టు అంత వీజీ కాదు (శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్). తనదైన శైలిలో, కథనంలో, కథ నడపడంలో, పాత్ర చిత్రణలో గొప్ప నేర్పరి అయిన భానుమతి సృష్టించిన అత్తగారి పాత్ర నభూతో నభవిష్యతిః.

తెలుగింటి ఉమ్మడి కుటుంబాలలో వెనుకటి తరపు గృహిణుల మనస్తత్త్వాన్ని, అమాయకత్త్వాన్ని అలవాట్లను కాచివడబోసి తన కథలలో అత్తగారి పాత్ర ద్వారా వాటికి ఒక ఆత్మ రూపాన్ని కలిగించిన స్రష్ట భానుమతి. తన కథలలో అత్తగారి పాత్రకు ప్రేరణ నిజజీవితంలోని తన అత్తగారే అని, ఆవిడతో తనకున్న సాన్నిహిత్యం, ఆమె పట్ల ఉన్న గౌరవంతో తాను ఈ అత్తగారి పాత్రను సృష్టించినా, తన కథలలో కనిపించే ఆమె గుణాలు కల్పనలని, సంఘటనలు, సన్నివేశాలు కేవలం కల్పితాలని ఆవిడ చెపుతూ ఉండేవారని ఎక్కడో చదివిన గుర్తు. ఆమెకు తన అత్తగారిపట్ల కల ప్రేమాభిమానాలకు నిదర్శనం ఆమె మాటలలోనే-మనలను కన్న అమ్మ పదహారు సంవత్సరాలు మాత్రమే పెంచుతుంది గాని అత్తగారు అర్ధ శతాబ్దం మనలను ప్రేమిస్తుంది.

కోడళ్లను రాచి రంపాన పెట్టే గయ్యాళి అత్తలను గురించి, వాళ్ళు ఆరళ్ళను గురించిన ఒక వ్యంగ్య రచన తెలుగునాట ప్రసిద్ధికెక్కిన దంపుళ్ళపాట “అత్త లేని కోడలుత్తమురాలోయమ్మా, కోడలు లేని అత్త గుణవంతురాలోయమ్మా”. కాని కాపీరైట్ పాత్ర అయిన భానుమతి అత్తగారి పాత్ర అటువంటి గంపగయ్యాళి, తరచుగా తారసపడే మామూలు అత్తగారు వంటిది కాదు. సన్నివేశ కల్పనలో సహజత్వం, సమాకాలీన సామాజిక అంశాల పట్ల అవగాహన, భిన్న భిన్న మానవ నైజాలను అర్థం చేసుకునే శక్తి మెండుగా, నిండుగా(అంటే రచయిత్రి విగ్రహం లాగా, ఇలా వ్రాస్తే బాగా అర్థం అవుతుందనే కాని ఆవిడ మీద విమర్శ కాదు సుమండి) ఉన్న ఈ కథలు కలకాలం మన నట్టింట పీఠం వేసుకుని కూచుంటాయి. పాత్రలు చర్వితచర్వణం అయినా అదేమీ మాయో కాని విసుగు కలగదు కదా అవి ఇహ ముందు ఏమి చేస్తాయో అనే ఉత్కంఠ రేకెత్తుతుంది.

గయ్యాళితనం ఏ కోశానా కనిపించని అమాయకురాలయిన అత్తగారు, ఆవిడ తెచ్చేపెట్టే చిక్కులను, తంటాలను విసుగు, విరామము లేకుండా తప్పించే తెలివైన కోడలు చుట్టూ తిరుగుతూ ఉండే ఈ కథలలో అత్తగారికి కోపం రాదు, కోడలికి చిరాకు లేదు. ఇంటి పెత్తనమంతా అత్తగారిదే అయినా కోడలు అంటే ఎంతో ఆపేక్ష. కోడలు కూడా అణుకువతో అత్తగారికి తల్లో నాలికలా మెలుగుతూ ఉంటుంది. ఇద్దరి మధ్యన ఎటువంటి దాపరికం, దాష్టీకాలు లేక ఎంతో అన్యోన్యంగా, సామరస్యంగా ఉంటారు. అత్తగారిని ఎగతాళి చెయ్యడం, ఎక్కసెక్కాలాడడం, చిన్నబుచ్చడం వంటివి ఎక్కడా మనకు కనపడవు. పైపెచ్చు అత్తగారి చాదస్తాల వల్ల వాటిల్లే అనర్థాలను ఆవిడకు బాధ కలగకుండా, తెలియకుండా చాకచక్యంగా సద్దుకుంటూ వస్తుంది కోడలు. సూర్యుడిని వెన్నంటి ఉండే ఛాయలా సదా అత్తగారి కనుసన్నలలో నడిచే కోడలు ఆమెకు రక్షణ కవచము. తాను చేసిన పనులు బెడిసికొట్టినప్పుడు అంత ఘనురాలూ భయపడి కోడలి చెంగు చాటున దాక్కునే బేల. ఆమె ఘనకార్యాలవల్ల వచ్చే తలనొప్పులు తట్టుకుంటూ ఆవిడను పల్లెత్తు మాట కూడా అనకుండా, ఆవిడ పెద్దరికానికి భంగం కలగకుండా నేర్పుగా, ఓర్పుగా కమ్ముకొచ్చే తల్లిలాటి కోడలు మనలను విస్మితులను చేయక మానరు.

తమిళ భాషలో భానుమదిగా పిలవబడే భానుమతి గారు తన పేరులో ఉన్న సూర్యుడి తీక్ష్ణతను అత్తగారికి (భాను), చంద్రుడిలోని చల్లదనాన్ని(తమిళ భాషలో మది అంటే చంద్రుడు అనే అర్థం) కోడలికి ఈ విధంగా ఆపాదించి తన పేరును సార్థకం చేసుకున్నారు.

పెద్దగా ఏమీ తెలియకపోయినా అన్ని తెలుసుననే అత్తగారు గొప్ప తత్త్వవేత్త. అన్నితెలిసినా, ఏమి తెలియనితనము ఆవిడకు పెట్టని ఆభరణం. ఆద్యంతరహితమైన తన(అ)జ్ఞానముతో అతి సులువుగా వేలవేల మామిడికాయల ఆవకాయను నిమ్మకాయ ఊరగాయలా ఠక్కున పెట్టేయగల పాకశాస్త్ర ప్రవీణ. మామిడిపళ్ళను కూడా ఆవకాయకి నిక్షేపంగా వాడుకోవచ్చని, కారం మన వీలునిబట్టి ఎప్పుడుపడితే అప్పుడు కలుపుకోవచ్చును అని, ఊరగాయలను తినడమే తప్ప పెట్టడంరాని మన బోంట్లకు ఊరట నిచ్చే ఉదారహృదయ. తన దీక్షాదక్షతల మీద ఆమెకున్న మొక్కవోని నమ్మకము తిరుగులేనిది. ఈ నమ్మకము దెబ్బతిన్నసందర్భాలలో, వెనక ముందులాడకుండా నెపం ఎదుట వారి మీద నెట్టేయడం ఆవిడకు వెన్నతో పెట్టిన విద్య. ఒక పట్టాన తన తప్పులను వొప్పుకోని ఆవిడ, అవి ఋజువైతే మాత్రము తలవంచుకునే సద్గుణం కలది.

అత్తగారి ఆహార్యం ఎంత భారీగా ఉన్నా, పాతకాలపు సంప్రదాయపు పరదాల మాటున ఉన్న ఆవిడ ప్రపంచం మాత్రం అతి చిన్నది. ఆవిడ తత్వానికి, బయట ప్రపంచానికి హమేషా చుక్కెదరు. అందుకే ఆవిడ తలపెట్టే పనులు, చేసే చేష్టలు మనకు నవ్వు పుట్టించి, మన పెదవుల దొంతరలలో చిరునవ్వుల మొలకలను మొలిపిస్తాయి. ఈవిడ మనస్తత్వము, మాటలధోరణి, ప్రవర్తించేతీరు, పాటించేపద్ధతులు మన మదిలో ఎంత లోతుగా పాతుకుపోయాయంటే, ఆవిడ మనకు ఎక్కడ ఎదురైనా వెంటనే గుర్తుపట్టేంతగా.

మానవ జీవితము అద్దపు సామాను వంటిది. ఆ సామాను విచ్ఛిన్నం కాకుండా ఉంచే ఉక్కుపెట్టె హాస్యరసం – శ్రీ అడవి బాపిరాజు

ఉన్నతమైన హాస్య రచనలో ఒకరినొకరు అవహేళన చేసుకోవడం ఉండదు. అటువంటి రచన ఆసాంతము చదివేవారికి వినోదాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. శబ్దాశ్రయమైన హాస్యం కన్నా, వ్యంగ్యస్ఫూర్తితో కూడిన అర్థాశ్రయమైన హాస్యం ఉత్తమము. ఇటువంటి హాస్యానికి ప్రతిరూపము భానుమతి సృష్టించిన అత్తగారి పాత్ర. రచయిత్రి ఆవిడలో లోపాలను తేలికగా చూపి, హాస్యంతో ఆవిడ పట్ల ఇతరులకు సానుభూతిని కలిగించడంలో కృతకృత్యురాలు అయ్యారు. ఈ కథారచన ద్వారా అత్తాకోడళ్లున్న ప్రతి తెలుగింటిలోను అత్తగారి స్థానాన్ని శాశ్వతము చేసి కోడలిగా తన మనసు తీర్చుకున్నారామె.

తరానికి తరానికి మధ్య జరిగే సున్నితమైన సంఘర్షణ నుంచి పుట్టిన ఈ కథలలో ఇప్పటికీ అత్తగారి మూఢనమ్మకాలు, వాటిని ఆసరాగా చేసుకుని పుట్టిన నియంతపు పోకడల ఛాయలు సకృత్తుగా మనకు కనిపించడం వాటిలోని సమకాలీనతకు అద్దము పడుతున్నాయి. అత్తగారి కథలు, అత్తగారి మీద వ్రాసిన పురాణము.

అత్తలేని కోడలు ఉత్తమురాలు, అత్తా ఒకింటి కోడలే, కోడంటికము వంటి నానుడులను త్రోసిరాజని, అబ్బా ఇటువంటి అత్తగారుంటే ఎంత అదృష్టమో కదా అని కోడళ్ళు, అబ్బో నాకిలాటి కోడలు వస్తే ఎంత బావుంటుందో కదా అని అత్తగారు ఉవ్విళులూరేట్టుగా అత్తాకోడళ్ళను మంచి స్నేహితురాళ్ళగా చిత్రీకరించిన పాత్రలు ఇవి.

మన తెలుగువారికే దక్కిన గొప్ప అదృష్టం హేమాహేమీల్లాంటి ఇద్దరు అత్తగార్లు (మన స్వంత అత్తగార్ల మాట అటుంచి) చలనచిత్రరంగంలో సూర్యకాంతమ్మగారు, సాహిత్యచరిత్రలో భానుమతి అత్తగారు దొరకడం. ఒకావిడ అత్తగారిలోని దాష్టీకానికి, మరొకామె అత్తగారిలోని ఆరిందాతనానికి వన్నెలు అద్దిన కుంచెకారిణులు. రచయిత్రి ప్రతిభ కథాకల్పనలో కన్న పాత్ర చిత్రణలో పరాకాష్టనందుకున్నఈ కథలు, కేవలం వినోద కాలక్షేపానికే పరిమితం కాకుండా, తెలుగుసాహిత్యములో ఉన్నతస్థాయి రచనల కోవలోకి చేరి, ఎందరో ప్రఖ్యాత సాహితీవేత్తల ఆదరాన్ని చూరగొన్నాయి.

భానుమతి గారు సృష్టించిన అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర. అంతే కాకుండా తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించిపోతున్న ఒక గొప్ప వ్యవస్థకు ఏకైక ప్రతినిధి.

Exit mobile version