Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతావనిలో అవతరించిన భగవంతుడు శ్రీ సత్యసాయి బాబా!

[23 నవంబరు శ్రీ సత్యసాయి బాబావారి జయంతి సందర్భంగా ‘భారతావనిలో అవతరించిన భగవంతుడు శ్రీ సత్యసాయి బాబా!’ అనే రచనని అందిస్తున్నారు విడదల సాంబశివరావు.]

భగవాన్ సత్యసాయి బాబా వారు తమ అవతార తత్వమును గురించి ఒక సందర్భంలో ఈ విధంగా వెల్లడించారు:

“నేను నిత్య నూతనుడను మరియు సనాతనుడను. ధర్మోద్ధరణకు, ధర్మమార్గముతో చరించే వారి మార్గము సుగమము చేసి వారి ప్రగతికి దోహదం చేసేందుకు మరియు ధర్మము తప్పి చరించే అంధులకు జ్ఞాన బోధ చేసి వారిని తిరిగి ధర్మము వైపు నడిపించేందుకు నేను మరల మరల అవతరిస్తాను!

ఈ ప్రస్తుత అవతారము విశ్వశక్తినంతటినీ సంతరించుకొని వచ్చివది. మీ అందరి నిజతత్వమైన దివ్యత్వమును నేనే! మీరు చూస్తున్న ఈ మానవరూపములో ప్రతి ఒక్క దివ్యరూపము, దివ్యత్వము.. అనగా మానవుడు భగవంతునికి ఆపాదించే సమస్త రూప, నామములు ఇమిడియున్నాయి. నేను విశ్వమంతటను నిండియున్నాను. నేను సర్వాంతర్యామిని, సర్వవ్యాపకుడను! నేను సర్వశక్తిమంతుడను మరియు సర్వజ్ఞడను!!”

అలనాడు త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణ భరత శతృఘ్నుల దివ్యరూపాలను ధరించి దశరథమహారాజు ఇంట ఆడుకున్న నాలుగు వేదములు ఒకటై ఈ కలియుగంలో అఖిల మానవులను ఆదుకునేందుకు 1926 నవంబరు 23న శ్రీ సత్యసాయి దివ్య నామరూపాలతో, మాతృశ్రీ ఈశ్వరమ్మ గర్భశుక్తిముక్తా ఫలమై ‘పుట్టపర్తి’ కుగ్రామంలో ప్రభవించడంతో మానవాళి చరిత్రలో స్వర్ణయుగం ప్రారంభమైనది.

‘సత్యసాయి’ అనే పదం యొక్క అంతరార్థం ఏమిటి?

‘సత్య’ అనగా ఋగ్వేదమని అర్థము. ‘సా’ అనగా సామ వేదము. ‘అ’ అనగా అథర్వణ వేదము. ‘య’ అనగా యజుర్వేదము. కనుక సర్వవేదముల సారమే ఈ ‘సత్యసాయి’ అని భగవాన్ బాబా వారు ఓ దివ్య ప్రకటనలో తెలియజేశారు. స్వామి, “నేను ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో ఆ రీతిగా మీరు కూడా మీ ప్రేమును అందరికీ పంచండి. అందరూ ఒక్కటే, అందరిపట్ల సమభావంతో మెలగండి, అప్పుడు మీరు స్వామితత్వంతో ఏకత్వాన్ని అనుభవిస్తారు.” అని మానవాళికి ఓ సందేశమిచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా.

భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి అనీ, భక్తసులభుడనీ, సర్వజీవులలో ఆత్మరూపుడై వున్నాడనీ – సకలవేద శాస్త్ర పురాణేతిహాలు ఘోషిస్తున్న సంగతి ఆస్తిక జనులందరికీ విదితమే. “దేవుడన్నమాట తెలియునందరికీ – మాట తెలిసినంత ‘మూట’ ఏమి!?’’ అని ప్రశ్నించారు భగవాన్.

తెలిసిన సత్యాన్ని ఆచరణలో పెట్టి అనుభవం లోనికి తెచ్చుకోవాలి కదా! ఆచరణ లోపించడం చేతనే జనులు ఈనాడు భగవద్విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి భిన్నత్వాన్ని, భేదాలను పెంచుకుంటున్నారు. తత్ఫలితంగా.. వేదనకు, అశాంతికి లోనవుతున్నారు. కనుకనే, భగవత్ తత్వము గురించి, భగవల్లీలా విభూతుల గురించి ప్రాచీన గ్రంథాలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు దృష్టాంతాలు చూపి – జనులలో దైవవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, ఆ దేవదేవుడే ‘దేహి’గా – సర్వజీవులలో వెలుగొందుతున్నాడనే ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పిందుకు.. ఆచరణాత్మక అద్వైతంలో ధర్మకర్మలనే వంతెనలను పునరుద్ధరించి, మానవాళిని ఏకత్వం వైపు నడిపించేందుుకు.. వేదపురుషుడే ‘సాయిరాముడై’ అవతరించారు. “భారతవర్ష హృదయంలో వేదశాస్త్రాలను పునః ప్రతిష్ఠ చేసి, ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించడమే నా ప్రధాన లక్ష్యం’ అని ప్రకటించారు భగవాన్.

తదనుగుణంగా, వేదసారాన్ని తమ రచనామృత, వచనామృత రూపంలో ప్రసాదించడమే గాక.. సాయి విద్యాలయాలలో, సేవా సంస్థలతో వేదాధ్యయనానికి విశేష ప్రాధాన్యమిచ్చారు భగవాన్. నేడు వేదాధ్యయనం ప్రపంచవ్యాప్తంగా గల భక్తకోటి నిత్య సాధనలో అంతర్భాగమైనదంటే.. అది భగవాన్ దిత్య సంకల్పమే! చక్కెర మరియు బెల్లం తీయగా వుంటాయని అందరికీ తెలుసు. కానీ, తింటే కదా తీయదనమంటే ఏమిటో తెలిసేది. అటులనే, ప్రేమే దైవమని అన్ని మతాలు, అన్ని శాస్త్రాలు, ప్రబోధిస్తున్నాయి. కానీ, ఆ ప్రేమ రూపు దాల్చి వచ్చినప్పుడే కదా నిజంగా ప్రేమంటే ఏమిటో మనకు అర్థమయ్యేది!? “ప్రేమతో పోల్చితే అమృతం కూడా చప్పగా అనిపిస్తుంది” అంటారు భగవాన్. అటువంటి ప్రేమతత్వం ప్రబోధించి, ప్రేమ మాధుర్యాన్ని చవిచూపారు ప్రేమయే తామైన భగవాన్ బాబావారు.

శ్రీ సత్యసాయి భగవాన్ ప్రవచించిన ప్రేమతత్వం ఏకాత్మ భావనకు ప్రతిరూపం. అంటే, నీ వలె ఎదుటి వక్తిని చూడడం.

“‘ప్రేమ’ అంటే దేహ సంబంధమైనది కాదు. అద్దంలో కనిపించే నీ ప్రతిబింబాన్ని నీవు ప్రేమించినట్లుగా అందరినీ ప్రేమించు. ఆ ప్రేమ నిష్కామ సేవగా అభివ్యక్తమై.. కుల మత జాతి భేదాలనే అడ్డుగోడలను కూల్చివేస్తుంది. ఏకత్వాన్ని పెంపొదిస్తుంది. దివ్యత్వాన్ని ఆవిర్భవింపజేస్తుంది. ‘వసుదైవ కుటుంబకమ్’ అన్న స్పూర్తిని ఆవిష్కరిస్తుంది.” అని భగవాన్ పలుమార్లు మానవజాతికి తమ దివ్య సందేశాన్ని అందించారు. ఆ మహత్తరమైన ఆధ్యాత్మిక తత్వబోధ లోనూ, విశిష్టమైన, విలక్షణమైన బృహత్సేవా పథకాల నిర్వహణలోనూ.. తల్లి తండ్రి గురువు దైవంగా భక్తకోటిపై అపారమైన ప్రేమవాత్సల్యాలను కురిపిస్తూ తమ జీవితాన్నే జగతికి సందేశంగా అందించిన శ్రీ సత్యసాయి, భగవానుల వంటి పరిపూర్ణ ప్రేమావతారి ‘న భూతో న భవిష్యతి’.

పూర్ణావతారమంటే భగవంతుని అవతారమే! పూర్ణావతారాలు ‘మాయ’ను వశపరచుకొని, మాయకు అతీతమైన దివత్వంతోనే తాము జీవిస్తూ వుంటారని స్వామి వివరించారు. మాయకు బద్ధులైనట్లు నటిస్తూ, మాయకు ఏ మాత్రమూ సంబంధం లేని ‘దివ్యత్వం’తో జగత్తును పాలిస్తూ వుంటారని అద్భుతంగా నిర్వచించారు,

ఇక, పూర్ణావతారమెప్పుడు సంభవిస్తుంది?

ధర్మ గ్లాని కలిగినప్పుడు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన కొరకు – భగవత్సంకల్పానుసారంగా జరుగుతుందని శ్రీ కృష్ణ పరమాత్మ ‘గీత’లో ప్రవచించారు. మానవునకు దేహాభిమానం వున్నంత వరకు దేహాతీతమైన దైవత్వాన్ని దర్శించడమనేది అసాధ్యం. అందువల్లనే.. భగవంతుడు, ‘దైవం మానుష రూపేణ’ అన్నట్లుగా త్రేతాయుగంలో దశరథరామునిగా, ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మగా, కలియుగంలో శ్రీ సత్యసాయిగా మానవ రూపంలో అవతరించారు.

అయితే, ఈ యుగంలో మంచి, చెడుల మిశ్రమం ప్రతి ఒక్కరిలోనూ మనకు కనిపిస్తున్నది. కనుక ‘స్వామి’ దుష్టశిక్షణ కొరకు రాలేదు. ‘సంస్కరణే’ తన ఈ అవతార లక్ష్యమని భగవాన్ సత్యసాయి బాబా వారు పలుమార్లు తన దివ్య సందేశంలో తెలియజేశారు.. “చెదలు పట్టిన చోటే బాగు చేస్తాను, మానును రక్షించుకుంటాను.” అని ఒకానొక సందర్భంలో సెలవిచ్చారు భగవాన్.

స్వామి, ‘ప్రేమ’ అనే ఔషధాన్ని అందించారు. చేదు మందిస్తే అవతల పారిస్తామని, తీయని హోమియో ఫిల్స్ ఇచ్చినట్లుగా మన కష్టాలు, కోరికలు తీర్చి.. మనలను చేరదీసి, మనలోని దురలవాట్లను తొలగించి సంస్కరించారు. ఈ కారణం చేతనే అన్ని మతాల వారు, అన్ని దేశాలవారు స్వామి పట్ల ఆకర్షితులవుతున్నారు. శ్రీరామ శ్రీకృష్ణ అవతారాల కాలంలో ఏ కొద్ది మందికి మాత్రమే వారితో సన్నిహితంగా మెలిగే అవకాశం ఉండేది. కానీ, నేడు అలా ఏ కొద్దిమందికి మాత్రమే సన్నిహితంగా వుంటే సరిపోదు కదా! కనుకనే, భగవాన్ బాబా వారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో వుంటూ మానవాళిని ఉద్ధరించడానికి ‘ప్రేమ – సేవ’ అనే ఒక నూతన మార్గాన్ని ఎన్నుకున్నారు. తత్ఫలితంగా, సామాన్య జనావళికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచితంగా తాగునీరు సరఫరా అందించే ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలుపరచి మానవజాతి హృదయాలకు చేరువయ్యారు భగవాన్.

స్వామి ప్రేమ అపారం.. అనంతం.. సముద్రపు లోతును, ఆకాశపు అంచుల్ని ఊహించవచ్చుకానీ.. స్వామి ప్రేమకు, దయకు అవధులు లేవు. వారి ప్రేమతత్వంతో మన జీవితాలలో ఎంత మార్పు వచ్చిందో, మనం ఎన్ని ప్రయోజనాలు పొందామో మాటలతో వర్ణింపనలవి కాదు. ఈనాడు, బాబావారిని సాక్షాత్ భగవంతునిగా విశ్వసించేవారు అన్ని దేశాలలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. స్వామిని సకల దేవతాతీత స్వరూపునిగా, పూర్ణావతారిగా గుర్తించిన ఈ యుగం నిజంగా మానవజాతి చరిత్రలో స్వర్ణయుగం.

“ఏ దేశమేగినా ఈ నామమే సుమీ, సత్యసాయి యనుచు నిత్య భజన”. వివిధ మతాలవారు, పండితులు, పామరులు.. అందరూ సాయిని భగవంతునిగా విశ్వసించి, ఆరాధించి అనుసరించడం విశ్వమానవ జాతి చరిత్రలో వినూత్నమైన విషయం.

ఈ కలియుగంలో మానవులు దివ్యత్వాన్ని అనుభవించే మార్గమేది? 24 గంటలు ప్రార్థన చేయడమా? లేక, ధ్యానము చేయడమా? ఈ ప్రశ్నలకు భగవాన్ ఒకే ఒక మార్గాన్ని తెలియజేశారు. అదే, సేవామార్గము. స్వామి మనకు ‘ప్రేమ’ అనే మతాన్ని, ‘సేవ’ అనే మార్గాన్ని ప్రబోధించారు. స్వామి అవతారము యొక్క ముఖ్య లక్షణములు ఈ రెండే.

ప్రతి అవతారమునకు ఆయా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. రామావతారమును పరిశీలించినట్లయితే.. ‘సత్యము, ధర్మము.’ – ఈ రెండింటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు గమనిస్తాము. సత్యధర్మములను స్థాపించుటే శ్రీరాముని అవతార లక్షణం. శ్రీకృష్ణావతారంలో శాంతి, ప్రేమలు ప్రాముఖ్యం వహించాయి. కానీ, ప్రస్తుతం ఈ కలియుగంలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.. ఐదింటినీ పెంపొందించడానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించారు.

భగవాన్ శ్రీ సత్వసాయి బాబావారిని ఆరాధించే భక్తజనావళి ఎంతో ధన్యులు. నాడు మహర్షులు అడవులలో కందమూలాదులు భుజిస్తూ, శరీరాన్ని కృశింపజేసుకుంటూ కఠోర తపస్సు ఆచరించేవారు. ఈనాడు, మనం భగవత్సాక్షాత్కార నిమిత్తమై అటువంటి కఠిన సాధన లేవీ చేయలేమని.. చక్కని నామ స్మరణ సహితమైన, ప్రేమ పూర్వకమైన సేవామార్గాన్ని స్వామి అందించారు. ఈ కలియుగంలో దీనికి మించిన సాధన లేదని స్వామి వివరించి చెప్పారు.

“స్వామి, మేము నీ వారము” అనే భావంతో స్వామి చూపిన ప్రేమ మార్గంలో ఒక్క అడుగు వేస్తే చాలు.. మనం వేసే ఒక్క అడుగుకు ఆ అనంత ప్రేమసాగరులు వంద అడుగులు వేసి మనలను అక్కున చేర్చుకుంటారన్నది సత్యస్యసత్యం.. కోట్లాది భక్తులకు ప్రత్యక్షానుభవం.

“విశ్వమెల్లడ వ్యాపియై వెలయు వాడు.. భక్త జనుల ప్రాపుడై పరగువాడు.. భక్తి నొసగి రక్షించెడి శక్తిమయుడు..” మన పర్తి వాసుడు, మనలను తప్పక అనుగ్రహిస్తారు.

విశ్వమానవాళి శ్రీవారి ‘శత జన్మదినోత్సవ’ వేడుకలను ఆనందోత్సాహంతో జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో, వారి అవతార దివ్యోద్యమ సేవకు పునరంకితమయ్యేందుకు తగిన భక్తిని, శక్తిని ప్రసాదించమని నిస్వార్థ హృదయంతో ‘స్వామి’ని ప్రార్థిద్దాం.

Exit mobile version