[శ్రీ యం.వి.రామారావుగారు రచించిన ‘భారతీయ ఆధ్యాత్మిక పూరకాలు భారతభాగవతాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
మహాభారతానికి, శ్రీమద్భాగవతానికి రచనా పరంగా, కథా పరంగా అవినాభావ సంబంధం ఉంది.
ఈ రెండు ఇతిహాసాస, పురాణరూపంలో సంస్కృతంలో రాసింది వ్యాసుడే కావడం, రెండింటి కాలం దాదాపు ఒకటే కావడం కూడా మరో కారణం.
మహాభారతం ఇతిహాసకావ్యంగా ధర్మయుద్ధ కథలతోపాటు భారతంలోని పాత్రలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. ఇప్పటికీ అదే సందేశాన్ని సూచించడం గమనార్హం.
భాగవతంలో భక్తి పూర్వక, శ్రీకృష్ణ లీలలతో పాటు శ్రీమహావిష్ణువు దశావతారాలు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వంటి భక్తుల కథలు కూడా ఉంటాయి. అందుకే అది ‘పురాణం’గా ప్రసిద్ధి చెందింది.
వ్యాసుడి భాగవతం రచనకు ముందు ఒక కథ ప్రచారంలో ఉంది. వ్యాస మహర్షి అప్పటికే పంచమవేదమైన మహాభారతం,
17 పురాణాలు రాసినా ఆయనలో తెలియని నైరాశ్యం ఆవరించింది. నారద మహర్షి వ్యాసుడిని సందర్శించి ఆయనలోని నిర్వేదం గూర్చి ప్రశ్నించాడు.
“మహావిష్ణువు అంశతో జన్మించిన వాడవు, భాగవతోత్తముడివి, వాజ్మయ సృష్టి కర్తవు, వేదాలను విభజించిన వాడవు ఎందుకు అలా ఉన్నావు?” అని అడిగాడు.
దానికి వ్యాసుడు “మీరే పరిష్కారం చెప్పాలి” అన్నాడు.
“లక్ష శ్లోకాలతో మహాభారతం రాసావు. అందులో పరమాత్మ పాత్ర చక్కగా వివరించావు. కాని శ్రీమన్నారాయణుడి భక్తి తత్వం ప్రత్యేకంగా చెప్పలేదు. కలియుగంలో భక్తితోనే ముక్తి వస్తుంది. కృష్ణభగవానుని లీలా విభూతి మానవులకు అవగాహన కలిగేలా చెప్పాలి. అందుకు భక్తితత్త్వంతో విష్ణు కథ రచిస్తే నీ నిర్వేదం పోతుంది” అని నారదుడు వ్యాసుడికి సలహా ఇచ్చాడు.
అలాంటి భాగవత రచన లోకకళ్యాణదాయకమవుతుందని, అష్టాదశ పురాణంగా ప్రసిద్ది చెందుతుందని పేర్కొన్నారు.
మహాభారతానికి, శ్రీమద్భాగవతానికి విడదీయరాని మరో సంబంధం ఉంది.
మహా భారతం ఎక్కడ పూర్తవుతుందో శ్రీమద్భాగవతం అక్కడ ప్రారంభమవుతుంది. పాండవుల వారసుడు పరిక్షిత్తు మహారాజుని సర్పం కరవడంతో మరణించాడనే కోపంతో, ఆయన కుమారుడు జనమేజయుడు సర్పయాగం ప్రారంభించాడు. సర్పాలన్నీ యజ్జ గుండంలో పడి భస్మమవుతున్నాయి. సర్పరాజు వాసుకి చెల్లి జరత్కారి కుమారుడు ఆస్తికమహర్షి వచ్చి, జనమేజయుని మెప్పించి యాగాన్ని ఆపించాడు.
ఈ సందర్భంగా వైశంపాయన మహర్షి మహాభారత కథను జనమేజయుడికి చెబుతాడు. ముని బాలుడు శృంగి శాపంతో పరిక్షిత్తు వారంలో పాము కాటుతో మరణిస్తాడని తెలిసి మునులు మహారాజును చూడడానికి వస్తారు. వారిలో వ్యాసుడికుమారుడు శుకమహర్షి భాగవతసప్తాహాన్ని పరిక్షిత్తుకు వివరిస్తాడు.
అలా మహాభారతం, శ్రీమద్భాగవతం ప్రవచనాల్లా కుమారుడు జనమేజయుడికి, తండ్రి పరిక్షిత్తుకు వ్యాసుని శిష్యులు వైశంపాయనుడు, శుకుడు బోధిస్తారు.
అందుకే ఒకటి ఎక్కడ పూర్తవుతుందో మరోకటి అక్కడ ప్రారంభమవుతుంది.
ఈ రెండు కావ్యాలు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందాయి. భాగవతం ప్రధానంగా భక్తి మార్గమే మోక్షానికి మార్గమని తేటతెల్లం చేస్తున్నది. అలాగే వైరాగ్యం, దైవ లీలలు ద్వారా వేదాంత సారం ప్రభోదిస్తున్నది. ‘సర్వవేదాంతసారం శ్రీమద్భాగవతం’అని ప్రశస్తి.
దుర్వాసుడి శాపంతో సంపదలు కోల్పోయిన ఇంద్రుడికి శ్రీహరి క్షీరసాగరమథనం చేస్తే మళ్లీ అన్ని వస్తాయని చెబుతాడు. మందరపర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసి రాక్షసులు, దేవతలు పాల సముద్రాన్ని మథనం చేస్తారు. శ్రీహరి కూర్మావతారంలో పర్వతం అడుగున చేరి దాన్ని నిలకడగా ఉంచాడు. పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు తెట్టులాగా మొదట హాలాహలం వచ్చింది. అగ్నిజ్వాలలు రేగి లోకాలను దహిస్తుండగా దాన్ని శివుడు మింగి గరళకంఠుడిగా మారారు. తరువాత కామధేనువు, చింతామణి, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీ, వారుణి వచ్చాయి. చివరకు అమృతం వచ్చింది. దాన్ని రాక్షసులు లాక్కున్నారు.
అంతలో మోహిని ప్రత్యక్షమై అమృతభాండాన్నితీసుకుని అందరికీ పంచుతానంది.
ఆ తరువాత రాహుకేతువులు మారువేషాల్లో అమృతం సేవించడం తెలిసిందే.
క్షీరసాగరమథనం ఈ విధంగా వేదాంతరూపంలో చెప్పవచ్చు. “జీవుడనే మనస్సుతో హృదయమనే క్షీర సాగరాన్ని మధిస్తే అమృతంతో సహా అన్ని పుట్టుకొస్తాయి” అని శ్రీహరి సందేశంగా పేర్కొన్న వ్యాసుడి భక్తిమార్గ సూచనగా భావించ వచ్చు.
మహా భారతంలో వ్యాసుడు భగవద్గీత రూపంలో భక్తి, వైరాగ్య, మోక్ష, ధర్మ, కర్మ, జ్ఞానమార్గాలు బోధించాడు.
మహా భారతం ధర్మం, అధర్మం మధ్య వచ్చే ఫలితాలను తేటతెల్లం చేస్తుంది. అలాగే అప్పటివరకూ వేదాధ్యానానికి దూరంగా ఉన్న స్త్రీలు, పామరులకు ఆ సారాన్ని మహాభారతం రూపంలో అందించారు. కృష్ణ భగవానుడి లీలా మహత్యం భారతంలో కూడా వ్యాసుడు స్పృశించాడు.
ద్రౌపతీ వస్త్రాపహరణ ఘట్టంలో శ్రీకృష్ణుని శరణువేడగానే, అక్షయమైన చీరెలు ప్రసాదించాడు. జూదం సమయంలో ధర్మరాజు అహంతో కృష్ణుడిని స్మరించకపోవడంతో ఆయనకు వనవాసం తప్పలేదు. అలాగే అర్జునుడికి భగవద్గీత బోధించిన పరమాత్మ తనను కరుణించలేదని ధర్మరాజు బాధపడుతున్నాడు. ‘నీలో రాజ్యం కాంక్ష బలంగాఉంది. అది తీరిన తరువాత నేను నీ దృష్టికి వచ్చాన’న్నాడు కృష్ణుడు. భీష్ముని వద్దకు తీసుకువెళ్లి ధర్మరాజుకు జ్ఞాన బోధ చేయించాడు.
ఈ రెండు గ్రంథాలనూ వ్యాసుడే రాసినా, పరిమాణంలో పూర్తి భిన్నంగా ఉండడం విశేషం. భాగవతం 18,000 శ్లోకాలతో 12 స్కంధాలుగా రచించారు. అదే భారతం లక్ష శ్లోకాలతో 18 పర్వాలతో రచించాడు.
భాగవత సప్తాహం వింటే కలియుగంలో భగవత్ భక్తితో పాటు ముక్తి మార్గం కూడా చూపాడు.
మహాభారతంలో దాయాదుల మధ్య కురుక్షేత్ర సంగ్రామంతో పాటు భగవద్గీత ఉపదేశం, భీష్మ ప్రతిజ్ఞ, విరాటపర్వం వంటి ఇతిహాసకథలు ద్వారా ధర్మం, అధర్మం మధ్య వ్యత్యాసాన్ని, ఆయా మార్గాల్లో వెళ్లేవారికి కలిగే ఫలితాలు తేటతెల్లం చేసారు. ఈ రెండు మహాకావ్యాల్లో కథ, రచన, ఆధ్యాత్మిక, ఉద్దేశపరంగా చూపిన ఘట్టాలు పరస్పర పూరకాలుగా భారతీయ ఆధ్యాత్మికత బలపర్చేవిగా ఉంటాయి.
మహా భారతం కావ్యం కాగా, భాగవతం పురాణంగా భావించాలి.
భాగవతంలో భక్తి పాళ్లు ఎక్కువ. భారతం వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారంతో కూడినది. పురుషార్థాలైన ధర్మార్ధకామమోక్షాలను సాధించడానికి వ్యాసుడు రకరకాలైన పాత్రలను సృష్టించాడు.
ఒక్కో పాత్ర ఒక్కో స్వభావంతో, ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. రకరకాలైన ధర్మాలు ధార్మిక-అధార్మిక, సాత్విక-రాజసిక, తామసిక, దైవిక-ఆసురీ శక్తుల కలయికగా ఉంటాయి.
మానవుడు ధర్మమార్గంలో వెళ్లాలంటూ, వెళ్లినవారికి లభించే గొప్ప ఫలితాలు భారతం చెబుతుంది. అలాగే అధర్మమార్గంలో వెళ్లిన వారికి కలిగే దుర్గతులు ఏవిధంగా ఉంటాయనేది విపులీకరించాడు వ్యాసుడు. ఈ లక్షణాలన్నీ కలబోతగా చూస్తే మానవుని జీవిత గమనాన్ని నిర్దేశించేదిగా మహాభారతాన్ని భావించాల్సి ఉంటుంది.
భారత భాగవత గ్రంథాలు రెండూ సంస్కృతంలో వ్యాసుడు రాసినా అంతేవాసి ప్రాముఖ్యత తెలుగులో కవిత్రయం, పోతనామాత్యుడు కల్పించారు.
మహా భారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రన రాసినా ఒకే వ్యక్తి రాసారన్నట్లు కావ్య దర్శనం చేసారు. మూలకథకు ఎలాంటి భంగం రాకుండా స్వేచ్ఛానువాదం చేయడం విశేషం.
ఇక భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో పోతన భక్తిరసానికి రమ్యత అద్ది అలౌకికంగా, ఆచంద్రార్కంగా నిలిపాడు.
ఏది ఏమైనా భారతీయ ఇతిహాసాలైన వాల్మీకీ రామాయణం మానవుడు ఏవిధంగా ఉండాలో చెబితే, వ్యాసుడి భారతం ఏ విధంగా ఉండకూడదో చెబుతుంది.
అదే భారతీయత గొప్పదనం.
యం.వి.రామారావు గారు ఎ.పి. వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ ట్రెజరర్.
