[బాలబాలికల కోసం ‘భారతీయ ఖగోళశాస్త్రానికి కాల గణన కేంద్రం ఉజ్జయిని నక్షత్ర శాల’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ఖగోళశాస్త్రం గురించి తెలియజేసే విద్యా, వినోదాత్మక శాలలను నక్షత్ర శాలలు అంటారు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలోనే కాదు పూర్వ కాలంలోనూ ఎన్నో నక్షత్ర శాలలు ఏర్పాటు చేశారు. ఇదొక డోమ్, అంటే అర్ధ చంద్రాకారంలో ఉండి లోపలి నుంచి ఆకాశం వైపుకు చూడటానికి ఉపయోగ పడుతుంది. వీటినే జంతర్ మంతర్ అంటారు. భారత దేశంలో ఐదు జంతర్ మంతర్‌లు ప్రధానంగా ఉన్నాయి. నక్షత్రాలు, గ్రహాల కదలికలు, ఆకాశంలో జరిగే వింతల గురించి తెలుసుకోవడానికి నక్షత్ర శాలలను నిర్మించారు. అలాంటి నక్షత్ర శాలలలో ఉజ్జయినిలో ఉన్న వేదశాల ఒకటి. దీనినే జంతర్ మంతర్ అంటారు. దీని గురించి తెలుసుకుందాం.
మేము ఉజ్జయినికి మూడుసార్లు వెళ్ళాము. అందులో రెండుసార్లు ఈ వేదశాలను చూడటానికి వెళ్ళాము. మొదటిసారి వెళ్లినప్పుడు చీకటి పడిపోయింది. అయినా చీకట్లోనే ఫొటోలు తీసుకున్నాం. అక్కడ ఉన్న పునాదిరాళ్ళను, చరిత్ర బోర్డులను ఫోటో తీసుకున్నాను. దీనిని మహారాజా జైసింగ్ III నిర్మించారు. ఇందులో 113 రకాల ఖగోళ పరికరాలు ఉన్నాయి. ఇది అత్యంత పురాతనమైన వేదశాల. దీనిని 18వ శతాబ్దంలో అంటే 1725 నుంచి 1780 మధ్య కాలంలో నిర్మించినట్లుగా అక్కడి బోర్డుల వల్ల తెలుస్తున్నది. మహారాజా జైసింగ్‌కు ఖగోళ శాస్త్రంపై ఇష్టం, ఆసక్తి ఉండటంతో దీనిని నిర్మించారట. ఇది చూడాలంటే టికెట్ తీసుకోవాలి.
మేము మధ్యప్రదేశ్ లలో జరుగుతున్న డాక్టర్ల కాన్ఫరెన్స్ లకు వెళ్ళటంతో అక్కడ చుట్టు పక్కల ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన స్థలాలు, కట్టడాలు, పురాతన ఆలయాలు చూడటం అలవాటు. అందులో భాగంగానే ఉజ్జయిని, ఓంకారేశ్వరం, మాండూ కోట, రాణి అహల్యాబాయి కోట వంటివన్నీ చూశాం. ఉజ్జయిని చాలా పురాతన మరియు చారిత్రాత్మక నగరం సుమారు 5000 సంవత్సరాల కిందటి చరిత్ర కలిగిన నగరం. ఈ నగరానికి అద్భుమైన చరిత్ర ఉన్నది. పురాణాలలో అత్యుత్తమ నగరంగా ఉజ్జయినిని అభివర్ణించారు. పురాణాలలో చెప్పబడిన సప్త పురులలో ఇది ఒకటి. కుంభమేళా జరిగే ప్రధాన ఆలయాలలో ఇది కుడా ఒకటి. ఆవంతీ రాజ్యానికి రాజధాని గాని అశోక చక్రవర్తి పరిపాలనా కేంద్రంగానూ ఉండేదట. మేమిలా ఉజ్జయిని లోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని వచ్చేటపుడు కారు డ్రైవరు ‘సాందీపని ఆశ్రమం చూస్తారా?’, అని అడిగాడు. అక్కడ నుంచి లోపలికి మూడు, నాలుగు కిలోమీటర్లు ఉంటుదని చెప్పాడు. వెళదామా వద్దా అని ఆలోచించుకుంటున్నంతలో రోడ్డు మీదే ఈ వేదశాల బోర్డు కనపడింది. వెంటనే ఇక్కడ ఆగిపోయాం.
ఈ వేదశాలను ‘జీవాజీ రావు వేదశాల’ అంటారు. ఆర్యభట్టు, వంటి పురాతన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్ర శాలలోనే అనేక ఆవిష్కరణలు చేశారు. ఎన్నో వేల సంవత్సరాలుగా గ్రహాలచలనం, నక్షత్రాల స్థితిని లెక్కించడానికి ఈ నక్షత్ర శాలనే ఉపయోగిస్తున్నారు. భారతీయ ఖగోళశాస్త్రానికి ఉజ్జయిని నక్షత్ర శాల కాల గణనకు కేంద్రంగా పని చేస్తుంది.
మేము శ్రీకృష్ణుడు, సుధాముడు చదువుకున్న సాందీపని మహర్షి ఆశ్రమంకు వెళ్ళకుండా ఆ సమయాన్ని ఇక్కడే వెచ్చించాము. ఇక్కడ సూర్యుడు, నక్షతాలు, గ్రహాలు క్షీణతను కొలుస్తారు. గ్రహణ కాలాలను నిర్ణయిస్తారు. దీనిని నెలకొల్పిన రాజా జైసింగ్ III స్వయంగా ఖగోళ శాస్త్రవేత్త కావడంతో దీనిని నిర్మించడానికి పూనుకున్నారు. ఆయన తన పండితులను అధ్యయనం కోసం అనేక దేశాలకు పంపి అక్కడి శాస్త్ర విషయాల మెరుగుదలను తెలుసుకునేవాడు. 18వ శతాబ్దంలోనే ఇంతటి శాస్త్ర విజ్ఞానాన్నీ పరిశీలనను కలిగి ఉన్న రాజు ఉండటం ఆ దేశ పౌరుల అదృష్టం. పండితుల అధ్యయనంలో తెలుసుకున్న విషయాలను అక్షరబద్ధం చేశారు. అంతే కాకుండా రాజా జైసింగ్ ఖగోళశాస్త్రంపై ఉన్న అమితాసక్తితో భారతదేశంలో ఐదు అబ్జర్వేటరీలను నిర్మించాడు. 1724 నుంచి 1737 మధ్య కాలంలోనే ఉజ్జయినితో పాటుగా వారణాసి, మధుర, జైపూర్, ఢిల్లీ లలో ఈ నక్షత్ర శాలలను నిర్మించాడు.
ఉజ్జయినిలోని వేదశాలలో ప్రధానంగా అందరినీ ఆకర్షించేంది సన్ డయల్. గ్రహణాల గురించి పరిశోధించడానికి ఈ నక్షత్ర శాల ప్రధానంగా నిర్ణయించబడింది. దీనిని 18వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ 1982 లో పునరుద్దరించబడింది. ఉజ్జయిని నగరం కర్కాటక రేఖాంశంలో ఉండటం వలన దీనిని భారతదేశ గ్రీన్ విచ్ అంటారు. సూర్య గమనంలో కాలాన్ని, గ్రహాల స్థితి గతుల్ని ఇక్కడ నిర్ణయించేవారు.
ఉజ్జయినిలో ఖగోళ శాస్త్ర పరిశోధనలే కాకుందా గణిత, జ్యోతిష శాస్త్ర పరిశోధనలు విశేషంగా జరిగాయి. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు ఈ నక్షత్ర శాలకు అధిపతిగా ఉన్నారట. ఈ నక్షత్రశాలలో ఎక్కువగా గ్రహణాలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కవగా జరిగాయి. గ్రహణాలు ఏఏ సమయాల్లో ఏర్పడతాయో గ్రహాల చలనాల ఆధారంగా నిర్ణయించటం జరుగు తుండేది. అందువలననే దీనికి గ్రహణ పరిశోధనశాలగా పేరు వచ్చింది. బ్రహ్మగుప్తుని పరిశోధనలు సైతం గ్రహణాలు అంశంగానే సాగాయి.
భాస్కరాచార్యుడు కూడా ఉజ్జయిని ఖగోళ కేంద్రానికి నాయకత్వం వహించారని చెబుతారు. ఆర్యభట్ట కూడా ఈ ఖగోళశాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఈ ఖగోళ అధ్యయన కేంద్రం మొదటు పాటలీపుత్రంలో ఉన్నట్లుగా, ఆ తర్వాత ఉజ్జయినికి మారినట్లుగా చరిత్ర చెబుతున్నది. ఆ సమయంలో ఆర్యభట్ట ఇక్కడ పరిశోధనలు గావించినట్లు తెలుస్తున్నది.
మరో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఉజ్జయినిలో నివసించాడు. ఈయన రాసిన ఖగోళ శాస్త్ర సంబంధ రచనలు ఈ నక్షత్ర శాలలో లభిస్తాయి. ఈయన చంద్రగురు విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడిగా ఉన్నాడు. గణిత జ్యోతిష్య శాస్త్రాలలో అపార మేధావంతుడిగా పేరుగాంచిన వరాహ మిహిరుడు అనేక గ్రంథాలను రచించాడు. అందులో బృహత్సంహిత, బృహజ్ఞాతకము ప్రసిద్ధమైనవి. రాహుకేతువుల వల్ల నూర్య చంద్ర గ్రహాణాలు ఏర్పడవని చెప్పాడు. తోక చుక్కల్లో రకాలు గురించి పరిశోధనలు చేసి వివరాలు గ్రంథాల్లో భద్రపరిచాడు.
ప్రముఖ శాస్త్రవేత్తలతో ఉజ్జయిని నక్షత్ర శాల సంబంధాలు కలిగి ఉన్నది. ఇది పురాతన నక్షత్రశాల.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
