Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతీయ స్త్రీలు.. రాహుల్ ఉవాచ

[కోవెల సంతోష్‍కుమార్ గారి ‘భారతీయ స్త్రీలు.. రాహుల్ ఉవాచ’ అనే రచనని అందిస్తున్నాము.]

అరుంధత్యనసూయాచ సావిత్రి జానకీ సతీ
ద్రౌపదీ కణ్ణగీ గార్గీ మీరా దుర్గావతీ తథా
లక్ష్మీరహల్యాచంన్నమ్మా రుద్రమాంబా సువిక్రమా
నివేదితా శారదాచ ప్రణమ్యాః మాతృదేవతా

దేశంలో ప్రతి భారతీయుడూ ఉదయం లేవగానే ప్రార్థించుకునే ఏకాత్మతా స్తోత్రంలోని మాతృమూర్తులకు సంబంధించిన రెండు శ్లోకాలు ఇవి. భారతదేశంలో మహిళకు, స్త్రీకి ఇచ్చే గౌరవం ఇది. కానీ, ఈ భూ ప్రపంచంలో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ప్రచారం చేయడం కేవలం మనదేశంలోనే సాధ్యం. ప్రాపగాండిస్టులు, రాజకీయ నాయకులు, భారతీయ శాస్త్రాలను మధించామని చెప్పుకొనే పండితమ్మన్యులకు అంతా తల్లకిందులుగానే కనిపిస్తుంది. ఒక కాలం చెల్లిన, అసలు ఏ కాలంలోనైనా చెల్లిందో లేదో కూడా తెలియని ఒక సూత్రాన్ని (తమకు అనువైన అర్థం చెప్పుకొనేందుకు వీలుగా ఉన్నదానిని) దొరకబుచ్చుకొని.. అందులోనూ.. ముందువి.. వెనుకవి తీసేసి.. బిట్వీన్ ది లైన్స్ పట్టుకొని అటూ ఇటూ లాగుతూ వచ్చారు.

నిజానికి భారతీయ ధర్మాన్ని ద్వేషించే ప్రతి మానసిక రోగీ మనుస్మృతి, మనువాదం అంటూ ఊళపెట్టడం ఊగిపోవడం కొత్త ఏమీ కాదు. ఎందుకంటే వారి వారి రాజకీయ అస్తిత్వాల కోసం, మనుగడ కోసం ఈ నినాదాలు హోరెత్తించడం మామూలే. కమ్యూనిస్టులు, హేతువాదులు, అరస, విరస, కురస, నీరస, నోరస  వర్గం, జేఎన్యూ, డీయూ, ఏయూలో దశాబ్దాల తరబడి అక్కడే ఏదో ఒక కోర్సుతో హాస్టళ్లలో పడి ఫ్రీ గా తిండి తిని తిరిగే విద్యార్థుల పేరుతో మనుగడ సాగించే బొద్దింకల వర్గం, ఇలాంటి బొద్దింకలను చూస్తేనే చాలు జన్మ ధన్యత్వాన్ని పొందించుకొనే మేధో వర్గం ఇంతకాలం ఆ శ్లోకానికి వేలాడి వేలాడి బూజు పట్టేసరికి ఈ మధ్యే కొంత పట్టు సడలించింది.

ఇప్పుడు దేశంలోనే ఏకైక సెక్యులరిస్టు మేధావి రాహుల్ గాంధీ ఈ అంశాన్ని పట్టుకొని కొత్తగా వేలాడటం మొదలు పెట్టారు. ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టారంటే.. ఆయనకు ఈ మధ్య రాజకీయంగా పెద్ద చిక్కే వచ్చి పడింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్ట సవరణ చేసింది. జాతీయ గీతంతో సమానహోదా ఉన్న వందేమాతర గేయాన్ని రెండు చరణాలే కాకుండా మొత్తం చదవాలంటూ ఈ సవరణ తాత్పర్యం. అక్కడి నుంచి ఆయనకు, ఆయన అమ్మగారికి చిరాకెత్తింది. పంద్రాగస్టునాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు పొరపాటున జాతీయ గీతంతో పాటు, ఈ వందేమాతర గీతాన్ని కూడా పూర్తిగా పాడేశారు. ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. కానీ రాహుల్ అమ్మగారికి మాత్రం ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఆపాలని అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. కోపంతో ఆమె ఊగిపోయారు. వెంటనే కాంగ్రెస్ సీడబ్ల్యూసీని అర్జెంటుగా పిలిచేసి రెండు చరణాలకు మించి పాడేదే లేదు పొమ్మని ఓ తీర్మానం చేయించేశారు. ఆ తరువాత అసలు కథ మొదలైంది.

అధికార పార్టీ నుంచి ఎదురుదాడి ఎదురయ్యేసరికి కవరప్ చేయడానికి రాహుల్ గారికి ఏమీ కనిపించలేదు. వందేమాతరం మూడో చరణం నుంచి చివరి చరణం వరకు ఉన్న పాదాల్లో భారతదేశాన్ని అమ్మగా, దేవతగా, గొప్ప స్త్రీమూర్తిగా కొలవడం ఉన్నది. అంతే.. రాహుల్ గారికి ఫ్లాష్‌లైట్ వెలిగింది. భారతదేశంలో స్త్రీల అణచివేత, పితృస్వామ్యం నాశనం చేయాలి అన్న నినాదం దొరికింది. దీనికి ఏదో ఒక బేస్ కావాలి కదా.. ఎక్కువగా కష్టపడకుండానే కమ్యూనిస్టులు, ఫెమినిస్టులు, ఐసా బొద్దింకల దగ్గర ఒక లైన్ దొరికేసింది. ఇంకేం శివసత్తులు ఊగడానికి మాంఛి కొరడా దొరికింది. పూణెలో కష్టపడి మహిళలను కూడగట్టుకొని వీడియో ప్రజెంటేషన్లు, బొమ్మలు.. అటూ ఇటూ తిరుగుతూ అద్భుతమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో స్త్రీ పరిస్థితి దారుణంగా ఉన్నదంటూ రెచ్చిపోయారు. గమ్మత్తేమిటంటే.. భారతదేశంలోని మహిళలందరూ అంటూనే కేవలం భారతీయ ధర్మంపై మాత్రమే దాడి చేశారు. విచిత్రమేమిటంటే వేదిక పైన హిజాబ్ వేసుకున్న మహిళతో మాట్లాడించారు. మరికొందరు మహిళలతో ఆలింగనాలు, చుంబనాలు జరుగుతాయి. ఇవి రాహుల్ గాంధీ చెప్పే సోకాల్డ్ మనుస్మృతిలో లేకపోవడం వల్ల పాటించవచ్చు కావచ్చేమో. కొందరు హిజాబ్ వేసుకున్న మహిళలు రాహుల్ గాంధీని హిజాబ్ వేసుకోవడం పై అమాయకంగా ప్రశ్నించారు. ఆయన వెంటనే నేను ‘అలో’ చేసేస్తాను అని అనేశారు. సూపర్..

సరే.. రాహుల్ గాంధీ కొత్తగా తీసిన ఈ రాగానికి రకరకాల సమర్థింపులు వస్తున్నాయి కాబట్టి.. ముందుగా దీనితోనే మొదలు పెడదాం. తరువాత భారతదేశంలో స్త్రీలకు గౌరవం ఉందా లేదా అన్న విషయాన్ని చర్చించుకోవచ్చు. ఇది ఎవ్వరికీ సంజాయిషీ ఇచ్చుకోవడం కాదు. ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ ప్రాపగాండాను పొరపాటున నమ్మే వారికి మాత్రం వాస్తవం ఏమిటన్నది తెలపాలి కాబట్టి ఈ వ్యాసం.

మనుస్మృతిలో వీళ్లు చెప్పే నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్న శ్లోకాన్ని ఈ మనువు అనే ఆయన చెప్పిన సందర్భం ఏమిటి? ఈ సందర్భం 9వ అధ్యాయంలో ఉన్నది. ఇందులో మొదటి శ్లోకం ఇలా ఉంటుంది

पुरुषस्य स्त्रियाश्चैव धर्मे वर्त्मनि तिष्ठतोः।
संयोगे विप्रयोगे च धर्मान् वक्ष्यामि शाश्वतान्॥ ९.१ ॥

పురుషస్య స్త్రియశ్చైవ ధర్మే వర్త్మని తిష్ఠతోః ।
సంయోగే విప్రయోగే చ ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్ ॥ ౯.౧ ॥

అంటే పురుషుడు, స్త్రీ ధర్మమార్గంలో జీవించేటప్పుడు, వారు కలిసి ఉన్నా, విడిగా ఉన్నా పాటించవలసిన ధర్మాలను ఇప్పుడు వివరిస్తాను అని మనువు చెప్తాడు. ఇది 9వ అధ్యాయం ప్రారంభ శ్లోకం.. ఇది మామూలుగా చెప్పినదే. ఇక తొమ్మిదో అధ్యాయంలోనే రెండో శ్లోకం చదవండి

अस्वतन्त्राः स्त्रियः कार्याः पुरुषैः स्वैर्दिवानिशम्।
विषयेषु च सज्जन्त्यः संस्थाप्याः आत्मनो वशे॥

అస్వతంత్రాః స్త్రియః కార్యాః పురుషైః స్వైర్దివానిశమ్।
విషయేషు చ సజ్జంత్యః సంస్థాప్యాః ఆత్మనో వశే॥

స్త్రీలను వారికి సంబంధించిన పురుషులు (అంటే అన్న, తమ్ముడు, తండ్రి, భర్త) పగలు, రాత్రి రక్షించుకోవాలి. ఇంద్రియ పరమైన విషయాల కారణంగా ఇతరుల చేత ఆకర్షితులయితే వారి మాన ప్రాణాలకు ఇబ్బంది కాబట్టి వారిని రక్షించుకోవాలి. వారిని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలి అని అర్థం. ఇక తొమ్మిదో అధ్యాయంలో నాలుగో శ్లోకం ఏమంటున్నదో చూడండి.

कालेऽदाता पिता वाच्यो..
मृते भर्तरि पुत्रस्तु वाच्यो मातुररक्षिता॥ ९.४ ॥

కాలే దేయం తు కన్యాభ్యో భ్రాతృభిర్యథావిధి।
అన్యథా న భవేద్దోషో న దత్తం భ్రాతృభిః స్త్రియై॥

ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే.. సరైన సమయంలో కుమార్తెకు పెండ్లి చేయని తండ్రిని తప్పు పట్టాలి. భార్యను సరిగా చూసుకోని భర్తను తప్పు పట్టాలి. భర్త మరణించిన తరువాత తల్లిని రక్షించని కుమారుడిని తప్పు పట్టాలి. ఇక అయిదో శ్లోకం చూద్దాం..

सूक्ष्मेभ्योऽपि प्रसङ्गेभ्यः स्त्रियो रक्ष्या विशेषतः।
द्वयोर्हि कुलयोः शोकमावहेयुररक्षिताः॥

సూక్ష్మేభ్యోఽపి ప్రసంగేభ్యః స్త్రియో రక్ష్యా విశేషతః।
ద్వయోర్హి కులయోః శోకమావహేయురరక్షితాః॥

మహిళలను చిన్న చిన్న ప్రమాదాల నుంచైనా ప్రత్యేకంగా రక్షించాలి. రక్షణ లేకపోతే రెండు కుటుంబాలకు దు:ఖం కలుగుతుంది.

ఇప్పుడు ఈ సెక్యులరిస్టులు కేవలం చివరి వాక్యాన్ని ప్రచారంలోకి తెచ్చిన అసలు శ్లోకం ఏమిటో చూద్దాం. తొమ్మిదో అధ్యాయంలోని మూడో శ్లోకం ఇది.

पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने।
रक्षन्ति स्थविरे पुत्रा न स्त्री स्वातन्त्र्यमर्हति॥

పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే।
రక్షంతి స్థవిరే పుత్రా న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి॥

ఇందులో చివరి పాదాన్ని సాధారణ అనువాదం చేస్తే..

అంటే స్త్రీ స్వతంత్రంగా ఉండటానికి అర్హురాలు కాదు అనే అర్థం వస్తుంది. ఇది అత్యంత వివాదాస్పదమైన భాగం. కానీ దీనిపైన ఉన్న భాగాల్లో ఉన్న రక్షతి అన్న మాటకు అర్థం ఏమిటి? మొత్తం శ్లోకానికి అర్థం వివరించాలా? లేక మనకు కావాల్సిన ఒక నాలుగు పదాలతోనే చెడుగుడు ఆడుకోవాలా? ఈ మొత్తం అధ్యాయంలోని ప్రధాన లక్ష్యం ఏమిటి? స్త్రీని వివిధ సందర్భాల్లో రక్షించడం ఎంత ప్రధానమైంది.. ఎంత ముఖ్యమైంది? ఆ బాధ్యత ఎవరిది అన్నదే. ఈ శ్లోకం కూడా అదే చెప్తుంది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే చిన్నప్పుడు తండ్రి రక్షించాలి. పెండ్లయ్యాక భర్త రక్షించాలి. వృద్ధాప్యంలో కొడుకు రక్షించాలి. లేకపోతే బంధువులు రక్షించాలి. అంతే తప్ప ఆమెను అలా వదిలేయకూడదు. ఎందుకంటే భారతీయ సమాజంలో స్త్రీకి ఉండే ప్రాధాన్యం అలాంటిది. వివిధ సందర్భాల్లో స్త్రీ తనను తాను రక్షించుకోవడం కష్టం కాబట్టి ఆమెకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పురుషులదేనని స్పష్టంగా చెప్పారు. రక్షతి అంటే సంరక్షణ, బాధ్యత, ప్రమాద నివారణ అనే అర్థం తప్ప ఇంట్లో బంధించి ఉంచడం అని కానే కాదు. మనుస్మృతి పై ప్రపంచం అంతా కొలిచే వ్యాఖ్యానం మేఘాతిథి వ్యాఖ్యానం. ఆయన కూడా ఈ శ్లోకాలను స్పష్టంగా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. మూడు దశల్లో స్త్రీ రక్షణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలో స్పష్టంగా చెప్పాడు. ఈ శ్లోకాలు అయిదింటినీ ఒకటిగా చేసి చూడాల్సిందే తప్ప ఒకటిగా చేసి చూడటానికి వీలు లేనే లేదు. ఈ మూడో శ్లోకాన్ని అందులోనూ చివరి పాదాన్ని మాత్రమే విడిగా తీసుకొని సాధారణీకరణ అనువాదాలు చేసి చూడటం ద్వారా భారతీయ ధర్మంపై దాడికోసం వీరు దారులు వెతుక్కున్నారు. ఏండ్ల తరబడి ఈ ఒక్క మాటనే పట్టుకొని వేళాడుతున్నారు. ఈ అయిదు శ్లోకాలు కలిపి అర్థంగా తీసుకొంటే.. స్త్రీని కాపాడుకోవడం పురుషుడి తప్పనిసరి బాధ్యత, కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత అన్నదే మనువు చెప్పిన సూత్రం తప్ప మరొకటి కానే కాదు.

ఇటీవల రాహుల్ గాంధీ ఒకచోట మాట్లాడుతూ స్వరాజ్, ఫ్రీడమ్ అన్న పదాలకు తమదైన నిర్వచనాలు చెప్పారు. స్వరాజ్ అంటే స్వ.. పే రాజ్.. అంటే స్వయంగా తనను తాను పాలించుకోవడం లేదా నియంత్రించుకోవడం అనీ.. ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అంటూ తమదైన వ్యాఖ్యానం చేశారు. గాంధీకి స్వరాజ్యం ఉన్నదని, స్వేచ్ఛ లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు స్వేచ్ఛ ఉన్నదని, స్వరాజ్ లేదన్నారు. ఇట్లా చిత్రవిచిత్రమైన నిర్వచనాలు ఇస్తూ పోయారు. పాపం నాటి బాలగంగాధర్ తిలక్‌కు తెలియక స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించారేమో. అదే పద్ధతిలో ఇప్పుడు కాలం చెల్లిన నినాదాన్ని అందుకున్నారు. మనుస్మృతిలోని శ్లోకాలకు కూడా వికృతార్థం ఇన్నాళ్లుగా చర్చి బోధించిందే. కమ్యూనిస్లులూ నినదించిందే. దీన్నే రాహుల్ గాంధీ కొత్త రాగంలో స్వరపరిచారు.

మనుస్మృతి 5.148లో:

बाल्ये पितुर्वशे तिष्ठेत् पाणिग्राहस्य यौवने।
पुत्राणां भर्तरि प्रेते न भजेत् स्त्री स्वतन्त्रताम्॥ ५.१४८ ॥

ఇక్కడ 9.3 కంటే భిన్నమైన పదం వశే ఇక్కడ ఉంది. Patrick Olivelle అనే పరిశోధకుడు 5.148లోని vaśa (వశ) ను ప్రత్యేకంగా “control” భావంలో అనువదించాడు. అనువాదంలో ట్రూ ట్రాన్స్‌లేషన్, ఫ్రీ ట్రాన్స్‌లేషన్ అని పలు రకాలుగా ఉంటాయి. ట్రూ ట్రాన్స్‌లేషన్ లో ఒక్కో పదాన్ని అర్థం చెప్పుకుంటూ వెళ్లడం. అది పూర్తయ్యాక దాని కాంటెక్స్ట్ వస్తుందా రాదా అని చెప్పటం కష్టం. గూగుల్‌లో ఏదైనా వాక్యం పెడితే ఎలా అనువదిస్తుందో అలా అన్నమాట. అది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫ్రీ ట్రాన్స్‌లేషన్‌లో భావార్థం తీసుకుంటారు అనువాదకులు. మన మార్క్సిస్టు మేధావులంతా కూడా మొదటి లక్షణాన్ని ఆపాదించుకొని వాటిని పట్టుకొని వితండ వాదం చేస్తుంటారు. ఉదాహరణకు రాజవశే అంటే రాజు ఆధీనంలో లేదా రాజు రక్షణలో అని సాధారణంగా చెప్పుకుంటాం అదే విధంగా ఈ శ్లోకం దగ్గరకు వస్తే వశ శబ్దానికి ఆధీనత లేదా సంరక్షణ అనే అర్థం. ఎందుకంటే మొత్తం అధ్యాయమే స్త్రీల రక్షణ గురించిన చర్చ చేస్తున్నది కాబట్టి భావార్థం అదే.

पितुर्वशे – తండ్రి తండ్రి సంరక్షణలో
पाणिग्राहस्य यौवने – భర్త సంరక్షణలో
पुत्राणां.. – భర్త మరణించిన తరువాత కుమారుల రక్షణలో

అందువల్ల 5.148 మరియు 9.3 ఒకదానితో మరొకటి పోల్చి చదవాలి. 9.3లో ఉపయోగించిన ప్రధాన క్రియ रक्षति రక్షిస్తాడు/కాపాడుతాడు అన్నదే ముఖ్యమైన textual distinction. ఇది కేవలం మనుస్మృతిలో మాత్రమే లేదు. అనేక గ్రంథాలలో ఇదే మనకు కనిపిస్తుంది. ముందుగా బౌధాయన ధర్మ సూత్రాన్ని చూద్దాం. బౌధాయన ధర్మసూత్రం 2.3.45 లో

अथाप्युदाहरन्ति।
पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने।
पुत्रस्तु स्थविरीभावे न स्त्री स्वातन्त्र्यमर्हति॥ इति ॥

అథాప్యుదాహరంతి।
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే।
పుత్రస్తు స్థవిరీభావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి॥ ఇతి ॥

ఇదే యథాతథంగా మనుస్మృతిలోకి వచ్చి చేరింది. మనువుకంటే ముందు కల్పసూత్ర సంప్రదాయానికి చెందిన వాడు ఈ బౌధాయనుడు. బౌధాయనుడు కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ శాఖతో సంబంధం ఉన్న ఆచార్యుడు. బౌధాయన కల్పసూత్రాలు రచించాడు. ఇది ఒక ధర్మ గ్రంథమే అంటే ఇదీ ఒక రూల్ బుక్ అన్నమాట.

వసిష్ఠ ధర్మసూత్రంలోని 5.3 లో కూడా ఇలాంటి ఒకటి రెండు పదాలు మినహా దాదాపుగా ఇదే శ్లోకం కనిపిస్తుంది.

पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने।
पुत्राः स्थाविरे भावे न स्त्री स्वातन्त्र्यमर्हति॥ ५.३ ॥

పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే।
పుత్రాః స్థావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి॥ ౫.౩ ॥

విష్ణుస్మృతిలో కొంత భిన్నమైన శ్లోకం మనకు కనిపిస్తుంది.

पितृभिर्भर्तृभिः पुत्रैश्च स्त्रीभिर्न स्वातन्त्र्यमर्हति॥ २५.१३ ॥

పితృభిర్భర్తృభిః పుత్రైశ్చ స్త్రీభిర్న స్వాతంత్ర్యమర్హతి॥ ౨౫.౧౩ ॥

యాజ్ఞవల్క్యస్మృతి 1.86

अशक्तो दद्यात् कन्यायै भ्राता पित्रा नियुक्तः।
भ्रातृमातृपितृभ्यश्च यथाशक्ति प्रदापयेत्॥ १.८६ ॥

అశక్తో దద్యాత్ కన్యాయై భ్రాతా పిత్రా నియుక్తః।
భ్రాతృమాతృపితృభ్యశ్చ యథాశక్తి ప్రదాపయేత్॥ ౧.౮౬ ॥

పైన మనుస్మృతిలో స్త్రీలకు రక్షణ ఎందుకు అన్నదానికి కాస్త వివరంగా ఈ శ్లోకం మనకు విప్పి చెప్తుంది. ముందుగా చెప్పుకున్నట్టు స్త్రీ తనను తాను రక్షించుకోవడంలో అశక్తురాలు అంటే సున్నితురాలు కావడం వల్ల ఆమెను రక్షించాల్సిన బాధ్యత తండ్రి, భర్త, కుమారుడు, బంధువులదని చెప్తున్నాడు.

మనుస్మృతిలో ఒకే ఒక్క శ్లోకంలోని ఒకే ఒక్క పాదం గురించి నెత్తీనోరూ బాదుకొనేవారు అదే మనుస్మృతిలో చెప్పిన ఇతర అంశాల గురించి ఎందుకు పోరు? అంటే.. అది వాళ్ల అజెండాకు, ప్రాపగాండాకు వ్యతిరేకం కాబట్టి. మీకు కొన్ని మాత్రం ఉదహరిస్తాను.

మనుస్మృతి 3.55లో:

पितृभिर्भ्रातृभिश्चैताः पतिभिर्देवरैस्तथा।
पूज्या भूषयितव्याश्च बहुकल्याणमीप्सुभिः॥

పితృభిర్భ్రాతృభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా।
పూజ్యా భూషయితవ్యాశ్చ బహుకల్యాణమీప్సుభిః॥

దీని అర్థం ఏమిటంటే తండ్రులు, సోదరులు, భర్తలు మొదలైన వారంతా స్త్రీలను గౌరవించి, అలంకరించి సంతోషపెట్టాలి, ఎందుకంటే తమ కుటుంబ శ్రేయస్సు కోరేవారు స్త్రీలే కాబట్టి వారిని గౌరవించాల్సిందేనని ఈ శ్లోకం చెప్తుంది. దాని తరువాత శ్లోకాన్ని చదవండి. చాలా ఫేమస్ ఈ శ్లోకం అవసరాన్ని బట్టి వాడేస్తుంటారు. ఈ అజెండా ధారులు, ప్రాపగాండిస్టులు కూడా ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని అలవోకగా చెప్పేస్తుంటారు. గమ్మత్తేమింటే.. ఇది కూడా మనుస్మృతిలోనే ఉన్నదని వాళ్లకు కూడా తెలియదు.

మనుస్మృతి 3.56:

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః।
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః॥

“ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు; ఎక్కడ స్త్రీలు గౌరవింపబడరో అక్కడ అన్ని ధార్మిక క్రియలు ఫలించవు.”

మీరు స్త్రీలను అవమానిస్తే.. మీకు ఏ పనీ జరుగదురా బాబూ అని ఇదే మనువు చెప్తున్నాడు. అంతే కాదు.. ఆ తరువాత శ్లోకం 3.57లో కూడా ఏం చెప్తున్నాడో చదవండి

शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् ।
न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा ॥ ३.५७ ॥

శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులమ్।
న శోచంతి తు యత్రైతా వర్ధతే తద్ధి సర్వదా॥ ౩.౫౭ ॥

ఏ కుటుంబంలో స్త్రీ బాధపడుతూ ఉంటుందో ఆ కుటుంబం చాలా త్వరగా నశిస్తుంది. స్త్రీ బాధపడకుండా, సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుంది. వీటన్నింటినీ ఏమంటారు? వీటికి అర్థాలు ఏం చెప్తారు. ఒక ప్రాపంగాండా ప్రకారం భారతీయ ధర్మంపైన, స్త్రీలపైన, వారి గౌరవంపైన ప్రణాళికాబద్ధమైన దాడి కాదా ఇది.

1957 అక్టోబర్ 2న “Women of India” అనే అంశంపై చేసిన ప్రసంగంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ **“They are essentially feminine, and that is as it should be. But, then, I have always felt that India, for all her manly qualities, is especially noted for the feminine virtues – gentleness, tenderness, a certain patient resignation, and a quiet and, sometimes, amazing courage of a somewhat passive kind. I say this realizing that I am generalizing when I should not do so, because there are all kinds of men as well as all kinds of women in this country. But, I suppose it is true that the idea of women in India is chiefly connected with these feminine virtues as well as, perhaps, with some feminine failings. Long ago, our ancient law-giver, Manu, descending from the high level of the law, advised as to what the names of women should be. He said: ‘Let the names of women be good to pronounce – sweet, simple, pleasant and appropriate; let them terminate in long vowels and resemble words of benediction’.”

భారతీయ స్త్రీలు సహజంగా స్త్రీలుగా ఉండటం మంచిదే అయినప్పటికీ.. భారత్ తన పురుషోచిత లక్షణాలన్నింటితో పాటు స్త్రీల సౌమ్యత, సున్నితత్వం, సహనపూర్వకమైన నిబ్బరమే కాకుండా పలు సందర్భాల్లో అద్భుతమైన ధైర్యం కూడా స్త్రీల లక్షణాలని నేను భావించాను. ..చాలా క్రితం మన ప్రాచీన ధర్మశాసన కర్త మనువు ధర్మశాస్త్రంలో ఉన్నతస్థాయి నుంచి స్త్రీలకు ఎలాంటి పేర్లు పెట్టాలో కూడా సూచించాడు’ అని వివరించాడు. అంతే కానీ మనువును విమర్శించలేదు. నెహ్రూ సెలెక్టెడ్ వర్క్స్‌లో 189 నుంచి 191 పేజీల వరకు మనువు గురించి, భారతీయ స్త్రీలకు ఈ దేశంలో ఉన్న ఉన్నత స్థానం గురించిన ప్రస్తావన ఉన్నది. “They have played this part in every branch of national activity, from high learning to valour in the battlefield.” అని కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఇప్పుడు తాత నిజం చెప్పాడని భావించాలా? ముని మనవడు నిజం చెప్పాడని భావించాలా?

డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 క్రిస్టమస్ పర్వదినాన మనుస్మృతిని బహిరంగంగా దహనం చేయించాడు. అప్పటి నుంచీ భారతీయ ధర్మంపై దాడి చేయడానికి మనుస్మృతి, మనువాదం అన్నది అందరికీ ఒక బ్రహ్మాస్త్రంగా మారిందన్నది జగద్విదితం. మనువాదులు మనుస్మృతిని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారంటూ కనిపించిన ప్రతి గొట్టపుమైకు ముందు ఊదరగొడుతుంటారు. కానీ ఇదే అంబేద్కర్ భారతదేశంలో స్త్రీకి ఇచ్చిన స్థాయి గురించి ఏమన్నాడో తెలుసా?

One cannot say much about the part they played in ancient time in state-craft. But there is no doubt that they did occupy a very high position in the intellectual and social life of the country. That at one time a woman was entitled to upanayan is clear from the Atharva Veda where a girl is spoken of as being eligible for marriage having finished her Brahmacharya. From the Shrauta Sutras it is clear that women could repeat the Mantras of the Vedas and the women were taught to read the Vedas. Panini’s Ashtadhyay bears testimony to the fact that women attended Gurukul (College) and studied the various Shakhas (Sections) of the Veda and became expert in Mimansa. Patanjali’s Maha Bhashya shows that women were teachers and taught Vedas to girl students. The stories of women entering into public discussions with men on most abstruse subjects of religion, philosophy and metaphysics are by no means few. The story of public disputation between Janaka and Sulabha, between Yajnavalkya and Gargi, between Yajnavalkya and Maitrei and between Sankaracharya and Vidyadhari shows that Indian women in pre-Manu’s time could rise to the highest pinnacle of learning and education.” (The Rise and Fall of the Hindu Woman: Who Was Responsible for It? Section IV, Dr. Babasaheb Ambedkar: Writings and Speeches, Vol. 17, Part II, p. 122)

స్త్రీలకు ఉపనయనము, బ్రహ్మచర్య దీక్ష, వివాహ అర్హత, వేద అధ్యయనం, స్త్రీ ఉపాధ్యాయులు, స్త్రీ విద్యార్థులు బహిరంగ చర్చల్లో స్త్రీలు ఎలా పాల్గొనే వారో ఆయన చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. అదే పేజీలో రాణికి ఉన్న స్థానం, రాజు రాణికి అందించిన గౌరవం గురించి కూడా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. మరి స్త్రీకి స్వాతంత్ర్యం లేదంటున్న మూర్ఖులును ఏం చేయాలి?

మన సాంస్కృతిక నాగరికతలో స్త్రీలు వేద మంత్ర ద్రష్టలుగా, కవయిత్రులుగా, తాత్వికులుగా, యోగినులుగా, భిక్షిణిగా, రాజనీతివేత్తలుగా, యోధులుగా, భక్తి కవయిత్రులుగా కొన్ని వేల మంది కనిపిస్తారు. ఇందుకు మొదటి ప్రాచీన మైన సాక్ష్యం ఋగ్వేదం. సంప్రదాయంగా బృహద్దేవత 2.82–84, ఆర్షానుక్రమణి 10.100–102 వంటి అనుక్రమణి సంప్రదాయాల్లో ఋగ్వేదానికి సంబంధించిన 27 మంది స్త్రీ ఋషుల పేర్లు మనకు లభిస్తాయి. ఘోషా, గోధా, విశ్వవారా, అపాలా, ఉపనిషత్, నిషత్, బ్రహ్మజాయా జుహూ, అగస్త్యస్వసా (అగస్త్యుని సోదరి), అదితి, ఇంద్రాణీ, ఇంద్రమాతా, సరమా, రోమశా, ఊర్వశీ, లోపాముద్రా, నద్యః, యమీ, శాశ్వతీ, శ్రీ, లాక్షా, సర్పరాజ్ఞీ, వాక్, శ్రద్ధా, మేధా, దక్షిణా, రాత్రీ, సూర్యా సావిత్రీ.

వారిలో లోపాముద్ర అత్యంత ముఖ్యమైన పేరు. ఋగ్వేదం 1.179లో అగస్త్యుడు, లోపాముద్ర మధ్య తాత్త్వికమైన సంభాషణ వివరంగా కనిపిస్తుంది. ఈ సంభాషణలో ఆమె పాండిత్యం అద్భుతంగా కనిపిస్తుంది. 1.179లోని మంత్రాలు లోపాముద్రకు సంబంధించినవే. ఘోషాకు సంబంధించి ఋగ్వేదం 10.39, 10.40 అనే రెండు పూర్తి సూక్తాలు ఉన్నాయి. ఆమె అశ్వినీ దేవతలను స్తుతిస్తూ మానవజీవితం గురించిన చర్చ చేస్తుంది. ఋగ్వేదం 8.91తో సంబంధం కలిగిన ఋషికగా అపాలా ఆత్రేయీ ప్రసిద్ధి చెందింది. విశ్వవారా కూడా ఋగ్వేదం 5.28 సూక్తంలో మనకు కనిపిస్తుంది. ఋగ్వేదం 10.10 లో యముడితో యమి సంభాషిస్తుంది. ఋగ్వేదం 10.125లో ప్రసిద్ధమైన దేవీ సూక్తాన్ని వాక్ అంభృణీ ఋషిక ప్రకటిస్తుంది. అక్కడ వాక్కు స్వయంగా విశ్వశక్తిగా మాట్లాడుతుంది. సూర్యా, ఇంద్రాణీ, రోమశా, జుహూ, శశ్వతీ, అదితి, సరమా, రాత్రి, శ్రద్ధా, దక్షిణా, సరస్వతి వంటి పేర్లు కూడా ఋగ్వేద స్త్రీ ఋషి సంప్రదాయంలో కనిపిస్తాయి. అయితే వీటిలో చాలామంది దైవిక లేదా సంకేతాత్మక వ్యక్తీకరణలు కూడా ఉన్నాయి. కానీ ఈ సూక్తాల ద్వారా స్త్రీ శక్తికి, స్థాయికి ఇచ్చిన ప్రాధాన్యం ఏమిటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఋగ్వేదంలో విద్య, మేధోచర్చ, సంగీతం, నృత్యం, యుద్ధ సందర్భాల్లో స్త్రీల భూమిక చాలా కీలకమైంది. విష్ఫలకు సంబంధించి ఋగ్వేదం 1.116లో ప్రసిద్ధమైన యుద్ధ కథనమే ఉన్నది. శశీయసి, వధ్రిమతి వంటివి స్త్రీ యోధుల ప్రస్తావనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చర్చకు వచ్చే పేర్లు.

వేద సాహిత్యం తరువాత ప్రధానమైనవి ఉపనిషత్తులు ఇవి కూడా మన దేశంలో స్త్రీ మేధస్సుకు, వారి స్థాయికి సంబంధించి మరింత స్పష్టమైన ఉదాహరణలను ఇస్తాయి. అందులో మొదటి పేరు గార్గి. మిథిల రాజు జనకుడు నిర్వహించిన బ్రహ్మవిద్యపై జరిగిన చర్చలో గార్గి యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నిస్తుంది (బృహదారణ్యక ఉపనిషత్ 3.6, 3.8.) ఆమె ప్రశ్నలన్నీ కూడా సాధారణమైనవి కావు. ఈ విశ్వం దేనిపై ఆధారపడి ఉంది, ఆకాశానికి ఆధారం ఏమిటి, సర్వానికి ఆధారం ఏమిటి అనే స్థాయిలో చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఒక రాజసభలో జరిగిన తాత్విక సంభాషణలో ఒక స్త్రీ బహిరంగంగా ప్రసిద్ధ పురుష ఋషిని ప్రశ్నించడం భారతీయ మేధోచరిత్రలో అసాధారణమైన సాక్ష్యం. క్షరము లేని అక్షరానికి సంబంధించిన పరమ తత్త్వం ఏమిటని ప్రశ్నిస్తుంది. అక్షర బ్రహ్మం గురించి ఆమె చేసిన చర్చ కాలానికి అతీతమైన గంభీరమైన భారతీయ ఫిలాసఫీలోని మూలతత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది.

మైత్రేయి మెటాఫిజిక్స్‌లో స్కాలర్. యాజ్ఞవల్క్యుడి మధ్యన సంవాదం గురించి బృహదారణ్యకోపనిషత్తులో ప్రస్తావన ఉంటుంది. యాజ్ఞవల్క్యుడు కూడా సైంటిస్టే. ఆయన పునర్జన్మ.. చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు అన్న అంశాలపైన పరిశోధన చేసినవాడు. గార్గి, మైత్రేయి కూడా పీహెచ్‌డీ స్థాయి స్కాలర్లు.

మన దేశంలో మహిళలు ఎప్పటికప్పుడు.. ఏ కాలానికి ఆ కాలానికన్నట్టుగా ఆధునిక పోకడలు పోయినవారే తప్ప ముక్కుమూసుకొని ఇంట్లో ఓ మూలకు పడిఉన్నవారు ఎంతమాత్రం కానేకాదు. ఆమెకు బ్రహ్మవిద్యపై స్వతంత్ర ఆసక్తి కలిగి ఉన్న గొప్ప ఫిలాసఫర్. భారతదేశంలో స్త్రీలు వేదం, తత్త్వశాస్త్రం, ఇతర శాస్త్రాలు నేర్చుకోలేదు.. వాళ్లను నేర్చుకోనివ్వలేదు అనే సాధారణీకరణ అజెండాత్మక ప్రాపగాండా నిలబడదు. ఇంతెందుకు భారత ప్రభుత్వం ఇవాళ్టికీ ఆన్‌లైన్‌లో నడుపుతున్న వేదిక్ హెరిటేజ్ పోర్టల్ కూడా ఈ స్త్రీ ఋషుల సంప్రదాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది. ఎవ్వరైనా చక్కగా చూసుకోవచ్చు. ఇక మండనమిశ్రుడు–ఆదిశంకరాచార్యుల శాస్త్రార్థంలో మండనమిశ్రుడి భార్య ఉభయభారతి న్యాయనిర్ణేతగా ఉండటం అంటే జడ్జిగా వ్యవహరించడమే కాదు.. ఆ తరువాత శంకరునితో కూడా తాత్వికంగా చర్చించింది. స్త్రీ ఉన్నతత్వానికి, మేధస్సుకు, విద్యకు, అన్నింటికీ పరమమైన శక్తికి ఉదాహరణ ఇంకేం కావాలి.

ఇతిహాసాల దగ్గరకు వస్తే, రామాయణాన్ని నడిపించిందే సీతాదేవి. అన్నీ తానే అయి ముందుండి నడిపించింది. అలాంటి తనను అగ్ని ప్రవేశం చేయమంటే పరిస్థితి ఏమవుతుందని రాముడిని నిలదీసిన స్త్రీ ఆమె.

ఆడది యింతసేయుననుటన్నది యున్నదెయంచు నన్ను నూ
టాడితి, కైక కోరక మహాప్రభు నీవని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసుర సంహరణంబులేద యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్

అన్నదిట సీతాదేవి. అంతా నేనే చేశాను పొమ్మన్నది. అంతేకాదు.. నీ దారిన నువ్వు.. నా దారిన నేను వుంటే ఈ సృష్టి, ఈ ప్రపంచం మునిగిపోదా.. మనం కొంతకాలం విడిపోతేనే ఇంత నాశనమైంది. నీకు సృష్టిమీద దయలేదన్నమాట. నేనగ్ని ప్రవేశం చేస్తే ఏమవుతుంది. నీవు భార్యారహితుడవవుతావు. లోకమేమవుతుంది.. ఎవరికి కావాలి ఈ రాజ్యం? అన్నది. ఈ సమస్త విశ్వ శ్రేయస్సుకు పరస్పర పూరకాలైన ప్రకృతి పురుషులు వేరు కావడం ఎంత వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చాలవా? మహా భారతంలో ద్రౌపది రాజసభలో రాజధర్మంపై చర్చించింది. “కిం ను పూర్వం పరం జిత్వా ఆత్మానం పణమేక్షత?” అని ప్రశ్నించింది. సభలో ఒక్కరూ జవాబు చెప్పలేకపోయారు. కురుక్షేత్రం తరువాత ధర్మరాజును రాజ్యం చేయాలని ప్రోత్సహించింది కూడా ద్రౌపదియే. రాజు తన వ్యక్తిగత వైరాగ్యం పేరుతో రాజ్యాన్ని, ప్రజలను వదిలేయకూడదు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తికి తన వ్యక్తిగత అభిప్రాయాలకంటే కూడా ప్రజల రక్షణ, రాజ్య నిర్వహణ, క్షత్రియ ధర్మమే ముఖ్యమని స్పష్టంగా చెప్తుంది. అరణ్యవాసంలోనూ కృష్ణుడితో ద్రౌపది ధర్మాధర్మాలపై చర్చిస్తుంది. ఇక సావిత్రి యమధర్మరాజును అనుసరించి తన వాక్పటిమ, తర్కంతో యముడిని గెలుస్తుంది. శాంతి పర్వంలో సులభ మోక్ష ధర్మంపై తాత్త్విక సంభాషణ చేస్తుంది.

బౌద్ధ సంప్రదాయంలో కూడా ఇదే విషయానికి బలమైన ఆధారాలు కనిపిస్తాయి. మహాపజాపతి గోతమీ స్త్రీల కోసం భిక్షుణీ సంఘం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది. ఖేమా బుద్ధుని ప్రముఖ శిష్యురాళ్లలో ఒకరు. ఉప్పలవణ్ణా ఆధ్యాత్మిక సాధనలో ప్రసిద్ధురాలు. అన్నింటికంటే ముఖ్యంగా ధమ్మదిన్నా. మధ్యమ నికాయ 44, Cuḷavedalla Sutta లో విశాఖ అనే పురుష గృహస్థుడు ఆమెను ప్రశ్నిస్తాడు; ఆమె సూక్ష్మమైన ధర్మతాత్త్విక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఆ సంభాషణలో ఒక స్త్రీ పురుషునికి తాత్విక గురువుగా కనిపిస్తుంది.

భారతీయ సాహిత్య చరిత్రలో కూడా స్త్రీ మేధో సంప్రదాయం కనిపించకుండా పోయింది ఎక్కడ? తమిళ భక్తి సాహిత్యంలో గోదాదేవి(ఆండాళ్) 30 పాశురాలతో రచించిన తిరుప్పావై చిరస్థాయిగా నిలిచింది. కారైక్కాల్ అమ్మయ్యార్ శైవ భక్తి సాహిత్యంలో ప్రముఖ కవయిత్రి. అక్క మహాదేవి 12వ శతాబ్దపు కన్నడ వచన సంప్రదాయంలో గొప్ప ఆధ్యాత్మిక కవయిత్రి. లల్లాదేవి కాశ్మీర్ శైవ సంప్రదాయంలో గొప్ప యోగిని, కవయిత్రి. మీరాబాయి, జనాబాయి, బహినాబాయి వంటి వారు భక్తి సాహిత్యంలో స్వతంత్ర స్త్రీ స్వరాలను వెలుగులోకి తెచ్చారు. తెలుగులో ఆతుకూరి మొల్ల.. మొల్ల రామాయణం రచించి, తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తరిగొండ వెంగమాంబ అనేక గ్రంథాలు, నాటకాలు, భక్తి రచనలు చేసి 18వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించింది.

ఈ దేశంలో అసాధారణమైన రీతిలో రాజ్యాలను ఏలిన.. యుద్ధాలు చేసిన రాణులు ఎందరో ఉన్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎవరైనా చెప్తే దేశంలో ఓ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తారు. తెలుగువారి దగ్గరకు వచ్చేసరికి ఓ రుద్రమదేవి గురించి మాట్లాడతారు. కొండొకచో ఒక పద్మావతి పేరు వినపడుతుంది. అది కూడా ఆ మధ్య ఓ సినిమా వచ్చి వివాదాస్పదం కావడంతో ఎక్కువమందికి తెలిసింది తప్ప ఏ ఒక్కరికీ తెలియదు. విష్ఫల, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, పద్మావతి, చెన్నమ్మ, అహల్యాబాయి హోల్కర్, మీరాబాయి, సంయుక్త, దుర్గావతి, తారాబాయి, అబ్బక్కాదేవి, అక్కాదేవి, వేలు నాచ్చియార్, సుగంధాదేవి, దిడ్డాదేవి, ఇష్టాదేవి, వక్పుస్థ, యశోవతి ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాలించిన మహారాణులు ఎందరో ఉన్నారు. పెండ్లిళ్లలో మొగుణ్ణి స్వేచ్ఛగా.. కండిషన్లు పెట్టి మరీ ఎంపిక చేసుకునే పద్ధతి మన దేశంలో తప్ప ఇంకెక్కడ ఉన్నది? రాముడు శివధనుస్సు విరిస్తేనే సీత పెండ్లి చేసుకున్నది. అర్జునుడు మత్స్య యంత్రాన్ని పడగొడితేనే ద్రౌపది వరించింది. స్వయంవరం ఆనాడు మహిళలకే ఉన్నది తప్ప మగవాళ్లకు లేనేలేదు. వేదాలు ఆడవాళ్లు చదువకూడదని అన్నారంటూ పిచ్చిమాటలు ప్రచారం చేశారు. కానీ ఈ ప్రాపగాండిస్టులు ఈ దేశం మహిళలను దారుణంగా అణచివేసిందని.. పురుషాధిక్య సమాజమన్నారు. ఆడవాళ్లను వంటింటి కుందేళ్లని ఎద్దేవా చేశారు. అసలు సమాన హక్కులే లేవని ఊదరగొట్టారు. భారతదేశ చరిత్రలోనే మహిళలకు ఎలాంటి హక్కులు లేవంటూ నోటికి ఏది వస్తే అదే రాశారు. గమ్మత్తేమిటంటే కొన్నింటిని మహిళామణులే రాశారు. రష్యా, చైనా, యూరప్‌నుంచి అక్కడి చరిత్ర పుస్తకాలనుంచి కార్బన్ పేపర్లు తెచ్చుకొని అచ్చొత్తించారు. ఆయా దేశాల్లో అణచివేత ధోరణులన్నీ ఈ దేశంలో ఉన్నట్టుగా భ్రమింపజేశారు. కానీ ఏ ఒక్కరికైనా తెలుసా.. ఈ దేశంలో మహిళ పరిస్థితి ఏమిటన్నది? ఎక్కడినుంచో ఫెమినిజంను ఇంపోర్ట్ చేసుకున్నారు. స్వేచ్ఛ పేరుతో విశృంఖలత్వాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. దానికి అనుకూలంగా ఉండటం కోసం కథలు, కాకరకాయల అజెండాను సెట్ చేసుకున్నారు. మహిళలను ఈ దేశం మొదట్నుంచీ అణచివేసిందన్న థియరీకే మనం ఫిక్స్ అయిపోయాం.

ఈ దేశంలో ఏనాడూ కూడా స్త్రీ పురుషుల మధ్య భేదాభిప్రాయాలు లేనేలేవు. పని విభజన కూడా లేదు. అన్ని పనులు అందరూ చేశారు. సమాజంలో స్వేచ్ఛగా వ్యవహరించారు. హోయసల, కంచి, ఎల్లోరా.. తమిళనాడు, కాకతీయులు, కళింగ, గయ, భారత, రామాయణం.. ఒక్కటేమిటి.. కాందహార్ నుంచి ఖజురహో మీదుగా కన్యాకుమారిదాకా ఎక్కడికైనా వెళ్లండి.. ఎన్నైనా చూడండి. మన దేశంలో మహిళలు శతాబ్దాల నాడే జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశారు. యుద్ధ విద్యలు నేర్చారు. యుద్ధాలు చేశారు. వ్యవసాయ పనులు చేశారు. పంటలు పండించారు. మార్కెటింగ్‌ చేశారు. గుర్రపుస్వారీ చేశారు. అసలు వాళ్లు చెయ్యనిదేమున్నది కనుక.. మాతృదేవోభవ అని వేదమే చెప్పింది.. ఇంతకంటే ఏం కావాలి? అయినా వీళ్లు అదే రాస్తుంటారు. వాగుతుంటారు. మనవాళ్లు సంజాయిషీలు ఇచ్చుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ల దగ్గర విషయం లేదు విషం తప్ప చిమ్మడానికి. అయినా నిరంతరం ముసుగు ధరించి లోపలే ఉండేవారికి వాస్తవ దృశ్యం ఎలా కనిపిస్తుంది?

భారతీయ ధర్మానికి నాయిక స్త్రీయే. ఈ స్త్రీయే భారతదేశ ధర్మాలన్నింటికీ అత్యున్నతమైన పరదేవతాస్థానంలో కొలువై ఉన్నది. ఈ స్త్రీయే బ్రహ్మ సృష్టికి కావాల్సిన విజ్ఞానమై సరస్వతిగా విరాజిల్లింది. ఈ స్త్రీయే సృష్టి నిర్వాహకుడు నారాయణుడి చెంతన సిరియై నడిపించింది ఈ స్త్రీయే.. లయకారకుడికి శక్తిగా మారి నడిపించింది. ఈ దేశంలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యమిది. అనసూయ, అరుంధతి, లోపాముద్ర, ద్రౌపది, సీత.. ఇలా అందరూ సాక్షాత్ ప్రకృతి స్వరూపాలు. ఆమె సృష్టిస్తేనే ఈ సృష్టికి స్థితి కలిగింది. ఆమె నడిపిస్తేనే.. సృష్టి కొనసాగుతున్నది. ఆమె సంకల్పమాత్రం చేతనే సృష్టి లయమైపోతున్నది. ఈ సమస్త సృష్టికి ఆమే మూలాధారం. పురుషుడు ఒక ఉపకరణం మాత్రమే. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వాళ్లు మాట్లాడే మాటలుగా అనిపించవచ్చు. కానీ.. సాధారణ పరిభాషలో మాట్లాడినా కూడా ఇదొక్కటే నిజం. ఎందుకంటే ‘ఆమె’ అత్యంత శక్తిమంతమైన ఆకాంక్షకు, సంకల్పానికి ప్రతిరూపం. అది నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అది అగ్ని లాంటిది.

‘అగ్నిమీళే పురోహితం’ అని వేదం తొలి మంత్రం ఘోషిస్తున్నది. మహాదేవుడు ఆజ్ఞాచక్రంలో మూడో కన్ను తెరిచి ప్రళయాన్ని సృష్టించాడు. నారాయణుడి చేతిలోని అగ్ని సుదర్శనం. సీత అగ్ని పునీత, ద్రౌపది అగ్ని సంభవ. ఈ భూమి అంతరాంతరాళలో అగ్ని పొరలు తెరలు తెరలుగా ఉన్నాయి.. వాటిపైనే భూమి తిరుగుతున్నది. భూభ్రమణానికి, పరిభ్రమణానికి కూడా ఈ అగ్ని పొరలే మూలాధారాలు. ఈ సమస్తమైన శక్తికి అగ్నియే ప్రాణాధారం. అగ్రం నయతి అగ్ని.. అంటే ముందుండి నడిపించేవాడు అగ్ని అని అర్థం. అంటే లీడర్. ఈ అగ్ని పొరల్లోనుంచి ద్రౌపది జనించింది. తపస్సు అనేది అగ్నే. అసాధారణ ఆకాంక్షతో.. సాధించాలనే తపన ఏదైనా సరే ఈ అగ్నికి ప్రతిరూపం ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ముందుండి నడిపించేది అన్నది. ఈ అగ్ని పొరలపైనున్న పృథ్విలో సీత లభించింది. వీరిద్దరి శోకం భూమిపై మహా విలయకారణమైంది. ఇదీ భారతీయ సంప్రదాయం. భారతీయ ధర్మం. అందుకే భారత దేశాన్ని తల్లిగా ఆరాధిస్తాం. గౌరవించుకుంటాం.

వందేమాతరం.

Exit mobile version