భారతదేశ చరిత్రగతిని మార్చటానికి, అణగారిపోతున్న నిమ్న జాతివర్గాల జీవితాల్లో వెలుగులు నింపటానికి 1891 ఏప్రిల్ 14వ తేదిన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ‘మావ్’ గ్రామములో భీమాబాయి, రామ్‌జీ సక్పాల్ దంపతులకు పద్నాల్గవ సంతానంగా ‘భీమ్ రావ్’ జన్మించాడు.
మహర్ జాతిలో పుట్టిన భీమ్ రావ్ చరిత్రకు ఎదురొడ్డి నిలుస్తాడని, ఆనాడు ఎవరూ ఊహించి ఉండరు. బానిసత్వంలో మగ్గిపోతున్న దళితజాతికి విముక్తిని ప్రసాదిస్తాడని, మానవ విలువలన్నింటిని పాతరేస్తున్న కర్కశజాతినుండి కాపాడతాడనే ఆలోచన ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చును. అతిశూద్రులుగా పిలువబడుతున్న జాతిలో పుట్టిన బహిష్కృతుల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించి, హిందూసమాజంలో అడుగంటిపోతున్న మానవత్వాన్ని తట్టి లేపేందుకు ఉద్భవించిన బడుగుల ఆశాకిరణం, భరతజాతి ముద్దుబిడ్డ డా॥బి.ఆర్.అంబేడ్కర్.
“బహుజన హితాయ – బహుజన సుఖాయ” అన్న గౌతమ బుద్ధుని సిద్ధాంతాలకు కట్టుబడి, “బ్రాహ్మిణిజం – కేపిటలిజం బహుజనుల శత్రువులు” అని భావించి సంఘసంస్కర్త జ్యోతిబా పూలే వారసుడిగా, సాత్విక భావాలు కలిగి, అన్యాయాన్ని ఎదిరించి, కబీర్ అనుచరుడిగా ఎదిగిన తండ్రి అడుగుజాడల్లో నడిచిన సామాజిక విప్లవమూర్తి నిత్యచైతన్య స్ఫూర్తి అంబేడ్కర్.
సామాజిక పరివర్తన కలగాలంటే అణచబడ్డ కులాల సమస్యలను పరిష్కరించాలని, జాతి వెనుకబాటుతనానికి ప్రధాన కారణం రాజ్యాధికారం కనుక ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకున్నాడు. రాజ్యాధికారం రానంతకాలం మన బాధల్ని, సమస్యలను పరిష్కరించుకోలేమని, సత్వరమేలు జరగదని గ్రహించాడు. ఆర్థిక అసమానతలు తొలగాలన్నా, సాంఘిక సమస్యలు నెరవేరాలన్నా, బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మారాలన్నా మన ప్రధాన కర్తవ్యం రాజ్యాధికారం కావాలని బలంగా ఆశించాడు. సామాజిక మార్పు రానంతకాలం బానిసత్వం నుండి విముక్తి సాధ్యపడదని, మన జీవన భద్రతకు సమానత్వంతో కూడిన రాజ్యాధికారం రావటమే ప్రధాన అంశంగా పేర్కొన్నారు. ఒకానొక సందర్భంలో “డా॥అంబేడ్కరు, హిందూ సమాజపు అణచివేసే ప్రవృత్తులకు వ్యతిరేకంగా లేవనెత్తిన తిరుగుబాటుకు ప్రతీక” అని అన్న పండిత నెహ్రూ మాటలు వాస్తవాలు. డా॥ అంబేడ్కరు వ్యక్తిత్వం తుఫాను లాంటిది. హిందూ సమాజాన్ని సంస్కరించడానికి గాను తన భావాలతో భూకంపాన్ని సృష్టించారు.
మన దేశంలో జన్మించి మానవత్వాన్ని గురించి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రబోధించిన మహోన్నతమూర్తి గౌతమ బుద్ధుడు. ఆయన బోధనలు, జీవితం అంబేడ్కర్‌ని ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ఆధునిక తరంలో తాత్త్విక గ్రంథాలను, సాహిత్యాన్ని, చరిత్రను అధ్యయనం చేసినవారిలో అంబేడ్కర్ గొప్ప మేధావి. బౌద్ధ ఉద్యమాన్ని కాలానుగుణంగా ముందుకు నడిపించి ఆచరించి చూపారు. అంబేడ్కరే స్వయంగా బౌద్ధ ఉద్యమాన్ని విప్లవంగా భావించి అది ఫ్రెంచి విప్లవం అంత గొప్ప విప్లవమని అభివర్ణించారు. బౌద్ధ విప్లవం వైదిక మత పునాదుల్ని కదిలించింది. మానవత్వాన్ని విద్వేషించే బ్రాహ్మణ మతం మీద తిరుగుబాటు పతాకను ఎగురవేసింది. తిరిగి మానవత్వాన్ని పునర్వవ్యవస్థీకృతం చేసింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి అయిన డా॥బి. ఆర్. అంబేడ్కర్ భారత జాతీయోద్యమంలో నిజాయితీగా, నిష్కర్షగా పనిచేసిన ప్రజానాయకుడు. దేశ నాగరికతకు, సంస్కృతిని, చరిత్రను తాత్త్విక దృష్టితో పరిశీలించిన అద్వితీయ ప్రతిభాసంపన్నుడు. అంటరాని సమాజంలోనుండి, అసమానతల కొలిమిలో నుండి మండుతూ పైకి వచ్చిన అగ్నిగోళంలాంటివాడు. చిన్నతనం నుండే కుల ఘర్షణలను, వర్ణద్వేషపూరిత భావజాలాలను, ఎదుర్కొన్నవాడు. ప్రపంచ రాజ్య విధానాలన్నింటిని అవగతం చేసుకోవటానికి ప్రధాన కారణం ఆయన విద్యాభ్యాసం భారతదేశంలోనే కాక బ్రిటన్, అమెరికాల లాంటి దేశాలలో సాగడం. అక్కడ అధ్యయనమే ఆయన్న సామాజిక విప్లవకారునిగా మార్చింది. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో అనేక శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా చెప్పబడుతున్న భారతదేశ రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్స్‌లో, 8 షెడ్యూల్స్‌తో ఆయన రూపొందించారు. దేశము యొక్క వివిధ శాఖలు క్రమబద్దముగా పనిచేయుటకు కావలసిన యంత్రాంగమే రాజ్యాంగం” అని అంబేడ్కరు ప్రకటించారు.
“ప్రభుత్వ అవసరాల కంటే వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కడ గౌరవం యివ్వబడుతుందో అక్కడ ప్రజాస్వామ్యం బ్రతికి వుంటుంది” అని అంబేడ్కర్ అన్న మాటలు అక్షర సత్యాలు. “నేను ఏ అంటరాని జాతిలో పుట్టి పెరిగి జీవిస్తున్నానో, ఆ జాతి సేవలోనే నా జీవితం అంతమొందిస్తాను. ఈ సత్యమైన నా కర్తవ్యం నుంచి నేను ఒక్క అడుగైనా వెనుదీయను. నన్ను వ్యతిరేకించే దుష్ట శక్తుల బెదిరింపులకు నేను లొంగను” అని నిక్కచ్చిగా పేర్కొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ఆయన అధ్యయనమే ఆయన్ని భారత రాజ్యాంగ శిల్పిని చేసింది. తరతరాలుగా పోగొట్టుకున్న విద్యను, విజ్ఞానాన్ని సంపదను అధ్యయనం ద్వారా, దీక్ష ద్వారా, పోరాటాల ద్వారా మాత్రమే సాధించుకోగలమని ఉద్ఘాటించారు. అంబేడ్కర్ సామాజిక విప్లవంలో ప్రధానాంశం కుల నిర్మూలన. భారతదేశంలో కుల సంస్కరణోద్యమాలను భక్తి ఉద్యమాలు నిర్వహించాయి. ఆనాటి కాలంలో బౌద్ధ విప్లవం ముందు కుల నిర్మూలనోద్యమం నిలువలేదు. అలాంటి సమయంలో ఆ కృషి చేయటానికి అంబేడ్కర్ కంకణం కట్టుకున్నాడు. హిందూ సంస్కరణవాదులు హిందూ మతాన్ని, వర్ణధర్మాన్ని విమర్శించకుండా అస్పృశ్యత మీద సానుభూతి చూపారు. జాతీయ నాయకులైన తిలక్, గాంధీ, పటేల్, నెహ్రూ అందరూ బ్రాహ్మణ సంస్కృతిలో నుండి వచ్చినవారే. అయినా వెరవక కుల నిర్మూలన పోరాటాన్ని ముందుకు నడిపించారు అంబేడ్కర్.
డా॥ బి.ఆర్.అంబేడ్కర్ రాజనీతి శాస్త్రజ్ఞులు, గొప్ప వక్త, లోతైన అధ్యయన పరుడు. ప్రఖ్యాత సంపాదకుడు. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా ఉంటాయి. ఊహాత్మక సిద్ధాంతాలను ఆయన ప్రబోధించలేదు. ఆయన మాటలకు, చేతలకు ఉన్న వైరుధ్యాలను గమనించి నూతన మార్గాలను అన్వేషిస్తూ సమతుల్యత
కోసం ఆరాటపడ్డారు. ఆయన మాటల్లో సంక్లిష్టత, అభివ్యక్తీకరణలు సాంద్రత ద్యోతకమవుతాయి. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, న్యాయ, రాజకీయ పరమైన అంశాలను వ్యక్తీకరించేటప్పుడు భిన్నమైన శైలి విన్యాసాలకు ఆయన ప్రదర్శిస్తారు. దళితజనుల విముక్తి ధ్యేయంగా సాగిన ఆయన రచనల్లో నిబద్దత అత్యంత ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది.
ఎవరి సిద్ధాంతాలు సమాజానికి అన్వయించడానికి, మార్చడానికి హేతుభూతమవుతాయో, అవి తాత్త్విక అంశాలుగా గుర్తించబడతాయన్నది నిజం. అలాంటి భావజాలం, దార్శనికత అంబేద్కర్ జీవితంలో, రచనల్లో మనకు ప్రస్ఫుటంగా దృగ్గోచరమవుతాయి. అలాంటి పోరాటం అంబేడ్కర్లో దాగివుంది. ఆ విధమైన సంయమనం, సమన్వయం అందరికీ సాధ్యపడదు. అంబేద్కర్‌లో పోరాటము, మేధోమథనమూ పుష్కలంగా కనిపిస్తాయి. హిందూ కుల సమాజానికి భిన్నంగా కుల నిర్మూలనా సమాజాన్ని ఆయన ప్రబోధించాడు. బలంగా కాంక్షించాడు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి కలగాలంటే ప్రత్యామ్నాయంగా వ్యవస్థను రూపొందించుకోవాలన్నా రాజ్యాధికారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
సమాజములో అంబేడ్కరను విస్మరించినవారు, అంబేడ్కరను అధ్యయనము చేయనివారు తమ లక్ష్యాల్లో, గమ్యాల్లో నిరంతరం వైఫల్యం చెందుతుంటారని అర్థం చేసుకోవచ్చు. అంబేడ్కర్ తత్త్వశాస్త్రం ఆదర్శభావవాద సంబంధమైన ఆషామాషి వ్యవహారం మాత్రం కాదు. అది రాజకీయ, సాంఘిక, ఆర్థిక మూలాలకు సంబంధించి, మానవపరమైన సమస్యలకు సంబంధించినదై ఉండాలన్నది ఆయన అభిప్రాయం. విశాలమైన మానవ విషయాలకు ఆయన రాజనీతి తత్వ్వశాస్త్రం. ఒక వ్యక్తీకరణ మాత్రమే, అంతేగాక సిద్ధాంతానికి మధ్య తేడాను తొలగించే నిజమైన ప్రయత్నం తత్త్వశాస్త్రం. సమస్యలను, ఘర్షణలను నివారించే దిశగా సాగిన ఆయన తత్వశాస్త్రం మానవుడు, సమాజం సమ్మిళతంగా సాగుతుంది. అందుకే అంబేడ్కర్ లో సోక్రటీస్, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు రాజనీతిజ్ఞత కనిపిస్తుంది.
సమాజాన్ని గూర్చి అంబేడ్కర్ భావన ఇతరులకంటే భిన్నమైనది. అంబేడ్కర్ తన తాత్విక దర్శనంలో సమాజ రూపాన్ని ఎలా పునర్నిర్మించాలనేది పరిశోధించాడు. సామాజిక భావానికి, సంఘవాదానికి విచ్ఛిన్నశక్తిగా ఉన్న కులం యొక్క నిర్మూలనకు సిద్ధాంతాలను ప్రతిపాదించగలిగాడు. అందుకై ఆయన బౌద్ధదర్శనాన్ని అధ్యయనం చేశాడు. బుద్ధుణ్ణి తత్త్వవేత్తగా ఆయన గుర్తించాడు. బుద్ధుని తాత్త్విక దర్శనాన్ని అంబేడ్కర్ గుర్తించడమే కాక సమాజ పునర్నిర్మాణానికి ఆయన సూత్రాలు ఎలా ఉపయుక్తం అయ్యాయో వివరించగలిగాడు.
సాంఘిక సమానతకోసం పోరాడిన గొప్ప వ్యక్తిగా, మను ధర్మ భావజాలంపై ధ్వజమెత్తిన వీరాధి వీరునిగా పోరాడిన అంబేడ్కర్, మతం ఖడ్గమృగం కన్నా భయంకరమైనదని, నాగుపాముకన్నా విషపూరితమైందని వ్యాఖ్యానించారు. “వ్యక్తిగత ఆస్తిని రద్దుచేయాలని” బలంగా వాదించారు. “భూమి సమస్యతో అస్పృశ్యత
సమస్య ముడిపడివుందని తెలిపారు. భారతీయ సమాజాన్ని కులవ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని, దానికాధారమైన హిందూ భావజాలాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించాలని వాంఛించారు. ఈ దేశంలో చార్వాకులు, శంకరాచార్యులు, బౌద్ధులు, వైదికులు ఎంతో మంది ఉన్నారు. అయినా ఎవరి వాదనలు వారివి, ఎవరి వర్గప్రయోజనాలు వారివి. సాంఘిక ప్రయోజనాలు వారివి. వీరంతా ఎన్నో విషయాలను బోధించారు. అవన్నీ ఈ దృష్ట సమాజాన్ని మార్చలేకపోయినవి.
అంబేడ్కర్ దళితుడు కావడం చేత అతనిది కులపోరాటమని ముద్రవేశారు. భారతదేశంలో ఉన్న కులవ్యవస్థను మార్క్స్ గుర్తించలేదనడంలో ఎంత నిజంలేదో, రాజకీయ, ఆర్థికపరమైన సమస్యలను అంబేడ్కర్ గుర్తించలేదనడం కూడా అంతే తప్పు. 1990వ సంవత్సరాన్ని ప్రభుత్వం వారు అంబేడ్కర్ సంవత్సరంగా ప్రకటించి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ, ఆయన చేపట్టిన కుల నిర్మూలన రణనినాదాన్ని మరుగున పడేస్తున్నారు. అంబేడ్కర్ పై వల్లమాలిన ప్రేమలను ఒలకపోస్తూ అన్ని రాజకీయ పార్టీలు కపట ప్రేమను చూపిస్తూ ఒక చేత్తో మారణాయుధాలను ధరించి మరోచేత్తో పూలమాలను పట్టుకొని ఆయన విగ్రహాలకు వేస్తున్నారు. మరోవైపు దళితులపై కర్కశంగా దాడి చేస్తున్నారు.
అంబేడ్కర్ జాతి జనులకిచ్చిన సందేశాన్ని ఆయన రాసిన రచనలను అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకోవటం సాధ్యపడుతుందని గ్రహించాలి. ఆయన జీవితానుభవాలను, వైరుధ్యాలను, సంఘర్షణలనూ, పోరాటాలనూ సమకాలీన చారిత్రక దృష్టితో పరిశీలించవలసిన సమయం ఆసన్నమైనది. ఒకవేళ అలా చేయకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని బాధ్యతగా గుర్తెరిగి హక్కుల కోసం ఉద్యమించాలి.
బుద్ధుడు భోగభాగ్యాలను లక్ష్యం చెయ్యకుండా సమాజానికి ఎలా తన జీవితాన్ని త్యాగం చేశాడో, అలాగే అంబేడ్కర్ కూడా అదే మార్గాన్ని అనుసరించాడు. కులాంతర వివాహాల ద్వారా, సహపంక్తి భోజనాలద్వారా ‘కులం’ మమమ్మారిని నిర్మూలించలేము. కులం అడ్డుగోడలను తొలగించి, మత రక్కసిని పాతరేసి మానవత్వంతో అందరూ నడచుకున్నప్పుడు మాత్రమే ఆయన ఆశయాలను, ఆలోచనలను చేరుకోగలుగుతాం. దీనికోసం వెనకబాటుతనంతో కునారిల్లుతున్న జాతులన్నీ ఏకమై క్రొత్త రాజ్యాంగాన్ని, క్రొత్త దేశాన్ని, క్రొత్త భూమిని సృష్టించుకొని దేశ చరిత్రను తిరగరాసేందుకు అంబేడ్కర్ రణనినాదాన్ని భుజానకెత్తుకొని, క్రొత్త రక్తాన్ని ఇంజెక్టు చేసుకొని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగినప్పుడు సాధించుకొన్నప్పుడు, మాత్రమే రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ముద్దుబిడ్డ, బడుగులు ఆశాకిరణం అంబేడ్కరకు మనమిచ్చే నిజమైన ఘనమైన నివాళి.
డా॥ నూనె అంకమ్మరావు, ఆంథ్రోపన్యాసకులు, శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజి, ఒంగోలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™