“పని గట్టుకుని మరీ వచ్చారేమిటయ్యా? పైగా మందీ మార్బలంతో సహా వచ్చారు. అందరూ కూర్చోండి.”
“నన్ను మీరనవద్దు సార్! అన్ని విధాలా మీకన్నా చాలా చిన్నవాడిని” అంటూ స్థానిక ఎమ్మెల్యే కిందకు వంగి సాంబశివరావుగారి పాదాలు తాకి నమస్కరించాడు.
“ఆయుష్మాన్ భవ” అని ఆశీర్వదిస్తూ, “మీరు అనకపోతే ఎట్లా? రాజకీయంగా బాగా ఎదిగిపోయారు. ప్రస్తుతం మన నియోజకవర్గ ఎమ్మెల్యేవి. మీ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా?”
“ఆరోగ్యాలు ఎలా వుంటున్నాయి? అమ్మగారు, మీరు ఇద్దరూ బాగున్నారు కదా?” అని అడుగుతూనే “వీరు కంటి డాక్టరుగారు. వీరేమో ధన్వంతరీ నేత్రాలయం వారి మేనేజరుగారు. వీళ్లిద్దరూ మీకు తెలిసిన వాళ్లే. ఆమె మన యమ్.పీ.టీ.సీ, వీరేమో మున్సిపల్ ఛైర్మన్‌గారు” అంటూ వివరించారు.
“డాక్టరుగారూ వీరు సాంబశివరావుగారని పెద్ద వ్యాపారవేత్త. అనేక రకాల వ్యాపారాలు చేసి అన్నింట్లో శభాష్ అనిపించుకున్నారు. మొదటి నుండీ నన్ను బిడ్డలా అభిమానిస్తారు. నాకు వారంటే ఎంతో గౌరవం. నేను ఎమ్మెల్యే కాగానే టౌనుకొచ్చి ముందుగా వీరి ఆశీర్వాదమే తీసుకున్నాను.”
“సర్ ధన్వంతరీ నేత్రాలయం వారు జనం మధ్యలో తిరుగుతున్నారు. నేత్రదానం గురించి ప్రచారము చేస్తున్నారు. కళ్లను దానం చేసిన వ్యక్తి చనిపోయిన తర్వాత వారొచ్చి ఆ కళ్లను సేకరించుకు పోతారు. ఆ విషయాలన్నీ వివరంగా చెప్పటానికే కళ్ల డాక్టరుగారు కూడా వచ్చారు.
“మనం చనిపోయిన తర్వాత మరొకరికి చూపు ఇవ్వగలగటమన్నది చాలా మంచి విషయం. నాకిప్పటికే కొన్ని ఆలోచనలున్నాయి. కొద్ది రోజుల్లోనే మీకు కబురు పంపుతాను. వచ్చి మాట్లాడి వెళ్దురు గాని.”
“అలాగే సార్ మీరెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడే వచ్చేస్తాను. నాకు ఏ టైములోనైనా మీరు ఫోన్ చేయొచ్చు. మీ పిల్లలు ఎవరైనా వచ్చి వెళుతున్నారా?”
“ప్రస్తుతానికి మా అబ్బాయి కోడలూ ఇండియాలో లేరు. వాళ్ల పిల్లల దగ్గరకు కెనడా వెళ్లారు. మనవడి భార్య పసి బిడ్డ తల్లి. ఆ అమ్మయి చదువు పూర్తి కాలేదట. చదువుకుంటూ పసి బిడ్డను చూసుకోలేదు. దాంతో అత్త మామల్ని సహాయంగా రమ్మంటే వెళ్లారు. మా అమ్మాయి తన చిన్న కూతుర్ని ఒక కలెక్టర్ కిచ్చి చేసింది. ఆ మనవరాలి పిల్లలూ చిన్న చిన్న వాళ్లు. కలెక్టరు బంగళా చాలా పెద్దగా వున్నది. పని వాళ్లంతా ఒరియా వాళ్లు. ఒక్కదాన్ని పిల్లలతో ఇబ్బంది పడుతున్నానంటే మా అమ్మాయి అక్కడకెళ్లింది. మా అల్లుడెమో, దేముడూ, యోగా ప్రశాంతత అంటూ ఆశ్రమాల్లో వుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. మేమిద్దరం ఇక్కడ కాలం గడుపుతున్నాం” అంటూ వివరాలు చెప్పారు సాంబశివరావుగారు.
వెళ్లి వస్తామంటూ వచ్చిన వాళ్లు వెళ్లి పోయారు. సాంబశివరావుగారు అక్కడే వరండాలో కూర్చుని చదివిన పేపర్లనే మళ్లీ పేజీలు తిరగేస్తున్నారు.
***
“నరసమ్మా ఈ వెల్లుల్లి రేకలు పొట్టు వొలిచి ఇలా ఇవ్వు. తోటకూర ఇగురులో వెల్లుల్లి రెబ్బలు వేస్తే మీ అయ్యగారికి బాగా ఇష్టం, తెలుసుగా” అంటూ ఎత్తుపీట మీద కూర్చుని పొయ్యి మీద వేగే తోటకూరని అట్ల కాడతో కదపసాగింది రాజేశ్వరమ్మగారు.
“నాకెందుకు తెలీదమ్మా నిన్నా ఇవ్వాళా? నలపై సంవత్సరాల నుండి మీరు చెప్తూనే వుంటిరి – అయ్యగారికేమిష్టమో?, మీ పిల్లల కేమిస్టమో? అయిన్న చేసి పెట్టాలని ఏం తాపత్రయ పడిపోయ్యేవాళ్లో? ఇప్పుడు ఓపిక లేకుండా పోయిందిగాని అందరికీ అన్నీ అమర్చి పెట్టాలన్న రంది మాత్రం పోలేదు.”
“ఏమిటోనే? అట్లా అలవాటయిపోయింది. ఇప్పుడు మనింటికి వచ్చే వాళ్లెవరున్నారు? పిల్లలుగాని, మనవళ్లు, మనవరాళ్లు వచ్చి ఎన్నాళ్లయిపోయింది? ఎవరి దారిన వాళ్లుంటున్నారు. నా పిల్లల్ని కొడుకుని కాని కుతుర్నిగాని అనుకోవటానికే లేదు. వాళ్ల మీద ఆశ పెట్టుకోవడానికీ లేదు. వాళ్ల కడుపున పుట్టిన పిల్లల బాధ్యతలు వీళ్ల మీద పడ్డాయి. వాళ్ల దగ్గరికెళ్లిపోయారు.”
“అమ్మాయిగారింకా ఆ ఒరిస్సా నుండి తిరిగి వచ్చేటట్లులేరు. అక్కడే ఉండిపోతారేమోనమ్మా?”
“అమ్మాయికి ఇద్దరూ కూతుళ్లాయే. ఏ కూతురు రమ్మంటే ఆ కూతురి దగ్గరకు పరుగెత్తాల్సివస్తుంది. పసిపిల్లల్ని ఒడిలోకి తీసుకోవాలనీ, వాళ్ల బోసినవ్వులు చూడాలనీ, వాళ్లకు గుజ్జనగుడు తినిపించాలనీ ఎంతో ఆశగా వుంటుంది. కనీసం నా కొడుకూ, కూతురూ అయినా అప్పుడప్పుడు వచ్చి చూసిపోతున్నా మాకు సంతోషంగా వుంటుంది. మమ్మల్ని కనిపెట్టుకుని ఇంకేం చూస్తారు? వాళ్లకు రావటానికే కుదరటం లేదంటారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వున్నది. నువ్వొక్కదానివే నలభై ఏళ్ల నుంచి నాకు పని చేసి పెడుతూ, నాలుగు మాటలు మాట్లాడి వెళ్తున్నావు.”
“నేనూ అప్పుడప్పుడూ పని మానేద్దామనే అనుకుంటాను. ఇంటికాడ పిల్లలూ మానెయ్యిమనే అంటున్నారు. నేనే మీ ఇద్దరి మొకాలు చూసి మానలేకపోతున్నాను. నాకు అరవై ఏళ్లువచ్చే. దాంతో పాటు మోకాళ్ల నెప్పులూ వచ్చాయి. ఏ పనీ ఉసారుగా చెయ్యిలేకపోతుంటిని. ”
“అందుకునేగా నరసమ్మ, వాషింగ్ మెషన్ తెప్పించి దాంట్లో బట్టలు వేస్తున్నాం. ఇనుపబాండీలూ, ఇనుప అట్ల పెనం, ఇడ్లీ పాత్ర అటకెక్కించేస్తిమి. నీకు తోమటానికి తెలిగ్గా వుండే నాన్‌స్టిక్ బాండీలూ, పెనం, కుక్కరూ అన్నీ తెప్పిస్తిని. కష్టమో, సుఖమో మా ఇద్దరి ఘటాలూ వున్నంత వరకూ వస్తూ వుండు. మాకు నువ్వు, నీకు మేమూ స్వంత మనుషులమైపోయాం.”
“ఆ ముక్క ఇంట్లో చెప్పే రోజూ పనికి వత్తన్నాను. వీలున్నప్పుడల్లా నా కొడుకు ఆటో ఏసుకెడుతూ నన్నీడ దింపిపోతున్నాడు. మామయ్యకేమో టీలూ, టిపిన్లూ మేము అందిచాలా? నువ్వు పోయి సాంబశివరావుగారింట్లో పని చేసొత్తావా? అని పెద్ద కోడలి సణుగుడెక్కువయ్యింది.”
“ఈ వయసులో నీ కొడుకులిద్దరూ కోడళ్లూ మనవలూ అంతా ఒక దగ్గిరే వున్నారు. వేరు కాపరాలయినా తెల్లారి లేస్తే మీ వాళ్లు అందరూ మమ్మల్ని చుట్టుకునే వుంటారుగా. అంత కంటే కావలిసిందేముంది. ఎందుకొచ్చిన చదువులూ? ఉద్యోగాలూ? ఆస్తులు లేకపోతే ఏం పోయింది? నోరారా పలకరించి, కంటారా చూసే బిడ్డలు దగ్గర లేకపోయిన తర్వాత? ఇప్పుడు మా సంగతే చూడు. బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. మా సంగతులు పట్టించుకోవటానికి ఎవరికీ తీరిక లేకపోయ్యె. రేపు మమ్మల్ని కడతేర్చేది ఎవరు? నాకేమో వయసు మీద పడి అన్నీ అనారోగ్యాలాయే. ఓపిక పూర్తిగా తగ్గిపోతున్నది. మీ అయ్యగారికి సరిగ్గా చేసి పెట్టలేకపోతున్నాను. ఆ మనిషికేమో ఏ పనీ చేసుకోనటం తెలియదు. గుక్కెడు కాఫీ నీళ్లు కూడా కలుపుకుని తాగడం చేతకాదు. ఒక వేళ నేను ముందు చనిపోతే ఆయన గతేంటా అని భయపడతానే నరసమ్మ” అంటుంటే రాజేశ్వరమ్మగారి గొంతు బరువైంది.
“అట్టాంటి పాపిస్టి మాటలు అనొద్దులే అమ్మా.”
“లేదే నరసమ్మా. అనుకోక తప్పటం లేదు. పసుపు కుంకుమల్తో, పువ్వులు, పచ్చగా వెళ్లిపోవాలని ఏ ఆడదానికుండదు చెప్పు. కాని మీ అయ్యగారి పరిస్థితి తలుచుకుని అట్లాంటి కోరికలేం వద్దులే. ఓపికున్నంత వరకూ ఆయనకన్నీ చేసి పెట్టి. ఆయన్ను సాగనంపిన తర్వాతే నన్ను తీసుకపొమ్మని దేవుణ్ణి అడుగుతున్నాను. ఇలా అడగటం పాపమేనే. కాని తప్పటంలేదు” అని మరలా కళ్లమ్మట నీళ్లు పెట్టుకున్నది రాజేశ్వరమ్మగారు.
“ఏందమ్మా! ఇవాళ ఇట్టాంటి మాటలు మాట్లాడుతున్నారు? పార్వతీ పరమేశ్వరుల్లాంటి మీకు ఏ లోటూ వుండదు. అబ్బాయిగారెప్పుడూ ఆ దేశంలోనే వుండిపోతారా ఏంటి? అమ్మాయిగారు మాత్రం తిరిగి రారా? ఊరుకోండమ్మా. ఇక” అంటూ అవతలికి వెళ్లిపోయింది.
కాని రాజేశ్వరమ్మే పిలిచి గిన్నెలోకి అన్నం కూరలు సర్ది ఇస్తే అవి తీసుకుని బయటకు నడిచింది నరసమ్మ.
***
“గుడ్డు కూరన్నా ఎయ్యకపొయ్యవా? బొత్తిగా రాజేశ్వరమ్మగారిచ్చిన కూరలతోటో సరిపెడుతున్నావు.”
“ఏందోనయ్యా. ఇయ్యాల మోకాళ్లు మరీ లాగేస్తున్నాయి. ఏ కోడలి నన్నా అడిగి కాస్త కూరను తెచ్చేదా?”
“వద్దులే ఆళ్లూ, పిల్లా, జెల్లా తినాలిగా. ఈ పూటకి పచ్చడితో, మజ్జిగతో తింటాను. తిని కాసేపు తొంగుని చల్ల బడ్డాక బండేసుకుని పోతాను.”
రాజేశ్వరమ్మగారి మాటలే మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చి నరసమ్మ ఆ పూట అన్నం కూడా సరిగా తినలేక పోయింది. ఆ సాయం కాలం నడక కెళ్ళి తరిగి వస్తున్న సాంబశివరావుగారి పక్కనే నరసయ్య తన లాగుడు బండిని ఆపాడు.
“బండెక్కడయ్యా. ఇంటి దగ్గర దింపేత్తాను.”
“వద్దొద్దు. నడవాలనే వచ్చాను. ఇంకెంత ఇంటి దగ్గర కొచ్చాను గదా? నువ్వింకా లాగుడు బండి లాగుతూనే వున్నావా?”
“పెద్దగా లేదయ్యా. చిన్న చిన్న బాడుగలుంటే తోల్తున్నాను. కొడుకులు వద్దనే అంటున్నారు. నేనే ఓపికున్నంతవరకూ చిన్న చితకా పనులు జేద్దమని చూత్తన్నాను. నా కొడుకులకు సదువబ్బలేదు గదయ్యా. ఒకడు ఆటో తోలుకుంటున్నాడు. రెండోవాడు బాంక్‌లో కాపలాపనికి పోతానే వున్నాడు. అన్నిట్లో తమ దయ వుండబట్టే మేమంతా ఒకే సోట కుదురుకున్నాం. తమరింకా యాపారం చేత్తున్నారయ్యా?”
“ఇప్పుడేమీ చేయటం లేదు నరసయ్యా. ఓపిక లేదు ఉత్సాహమూ లేదు.”
“నా కొడుకులిద్దరూ తమ పేరు తలుసుకోని రోజు వుండదయ్యా. ఆయాల మీరు నూటయాపై గజాల సోటు మాకు కొనిపెట్టారు. అదిప్పుడు మా ముగ్గురికి ఆదారముయ్యింది. అందులోనే ముగ్గురమూ కాపురముంటున్నాము.”
“నరసమ్మ మా ఇంట్లో అప్పటికీ ఇప్పటికీ పని చేస్తూనే వున్నాది. నువ్వేమో నన్నే నమ్ముకుని నా గోడవునకు సరుకులు తోలేవాడివి.”
“అవునయ్యా తమరు లారీలు కొనుక్కున్నా నా లాగుడు బండిని నెట్టెయ్యలేదు. ఏవో పనులంటూ చెప్పి కూలి ఇచ్చే వాళ్లు.”
“మమ్మల్నే నమ్ముకుని వున్నారనే ఆ స్థలం కొనిపెట్టాను. మీరిద్దరూ మా ఇద్దరికీ తోడుగా వుంటున్నారు. పెద్దవయస్సులో నీ బిడ్డలు నిన్ను కనిపెట్టుకుని నీ దగ్గరే వుంటున్నారు. అది గొప్ప అదృష్టం. అట్లాంటి అదృష్టం మాలాంటి వాళ్లకుండటం లేదు” అంటూ ఇల్లు దగ్గరకు రాగానే “వుంటాను నరసయ్యా. ఏదైనా అవసరమైతే వచ్చి తీసుకెళ్లు” అని చెప్పిలోపలికెళ్లారు.
***
“ఏమ్మా యశోదా పిల్లలెలావున్నారు?”
“బావున్నారమ్మా. పసివాడు బాగా ముద్దొస్తున్నాడు. వాడికిప్పుడే పాకటం వచ్చింది. పట్టుకోలేకపోతున్నాం. నీ మనవరాలు నన్నిక్కడి నుంచి కదలనివ్వటం లేదు. ‘మాకు తోడుగా ఇక్కడే వుండు. అక్కకు ఏమైనా అవసరమొస్తే వెళ్లి వద్దువుగాని. నాన్నగారు ఎలాగు ఆశ్రమాలు వదిలిరారు. ఈ పసివాడు కాస్త పెద్దవగానే నేను జాబ్ చెయ్యాలనుకుంటున్నాను’ అంటుంది. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా మా ఇంటి కెళ్లి నేనూ ఒంటరిగా వుండలేను. వుండగలిగినన్నాళ్లు ఇక్కడే వుందామనుకుంటున్నాను. నాన్నకు, నీకూ ఆరోగ్యం ఎలా వున్నది. అన్నయ్య కెనడా నుంటి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడా. అన్నయ్యా, వదినా కెనడా నుంచి తిరిగి వచ్చేదాకా నాకు నమ్మకం లేదు. వాళ్ల కోడలు ఇప్పుడు చదువంటున్నది. రేపు ఉద్యోగమంటుంది. వాళ్లిద్దరూ అక్కడ పిల్లల్ని కనిపెట్టుకుని వుండాలి తప్పదు.”
“మీ పనులూ మీ పిల్లల ఇబ్బందుల్ని గురించి చెప్తున్నావు. మరి మా సంగతేంటి. నువ్వు ఒరిస్సాలో, మీ అన్నయ్యేమో కెనడాలో వుండిపోతే మమ్మల్ని చూసేదెవరు. ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్లం. మా దగ్గరకు వచ్చే అలోచనే చెయ్యటం లేదు. మీ ఇద్దరిలో ఒకరూ.”
“చూస్తున్నావు గదమ్మా. పిల్లల్ని వదిలి ఎలా వచ్చేది? నరసమ్మ నాగా పెట్టకుండా వస్తున్నదా. తను చెయ్యలేని పూట నరసమ్మ కోడలికెవరికైనా వచ్చి నీకు పని చేసి పెట్టమని చెప్పు. అక్కడంతా మీకు బాగా తెలిసిన వాళ్లు. పనివాళ్లూ బాగానే దొరకుతారు. నీకసలే కాళ్ల నొప్పులు. ఆ నొప్పుల్తో అటూ ఇటూ నాన్నగారి చుట్టూ మాటి మాటికీ తిరక్కుండా నరసమ్మ చేత అన్నీ టేబిల్ మీద పెట్టించు. నాన్నగారినే వచ్చి తీసుకోమని చెప్పు. మీ ఇద్దరికీ ఆరోగ్యాలు జాగ్రత్త. బాబిగాడు నిద్ర లేచినట్లున్నాడు. ఏడుపు వినడుతున్నది. వుంటా” అంటూ ఫోన్ పెట్టేసింది యశోద.
‘అంతేలే తల్లీ. పిల్లల బాధ్యతలు మీదేసుకున్నప్పుడు మరేవీ గుర్తుకురావు. మేం పండుటాకులమయ్యాం. ఏ పెద్ద గాలి వీస్తే రాలిపోతామో తెలియదు. మా సంగతి మీ ఇద్దరిలో ఒక్కరికీ పట్టేటట్లు లేదు. మా తిప్పులు మేమే పడాలి’ అనుకుంటుంటే రాజేశ్వరమ్మగారి మనస్సు మరింత బరువయ్యింది.
***
“నియోజికవర్గమంతా బాగా తిరుగుతున్నారయ్యా. ఎక్కువగా కష్టపడుతున్నారు. ఏ రోజు పేపరు చూచినా మిమ్మల్ని గురించిన వార్తలే పేపర్లో. మీలాంటి వాళ్లు ప్రజా ప్రతినిధులయితే ప్రజల ఇబ్బందులు తొందరగా తొలగిపోతాయి.”
“ఏదో మీ అభిమానం సార్. మమ్మల్ని నమ్మకుని ఓటేసి ప్రజలకు న్యాయం చేయ్యాలిగా. అటు అధిష్ఠానానికీ చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఇటు ప్రజలకూ సౌకర్యవంతంగా వుండాలి. రాబోయే ఎన్నికల్లోనూ మరలా మేమే గెలవాలిగా. మా శాయశక్తులా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇంతకీ మీ ఇద్దరికీ ఆరోగ్యాలు ఎలా వున్నాయి? పోయిన సారి నేను చూసినప్పుటి కంటే బలహీనంగా కనపడుతున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా వున్నది. ఇంట్లో ఎవరూ లేరా?”
“ఈవిడగారు సామాన్యంగా ఇల్లు కదిలి బయటకు వెళ్లదు. వెళ్లలేని పరిస్థితి కూడా. చుట్టాలను పరామర్శించి రావాలని మా ఇంట్లో వుండే నరసమ్మను తోడు తీసుకుని వెళ్లంది. డ్రైవర్ నిచ్చి పంపించాను. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మీతో మాట్లాడాలనిపించింది. ముఖ్యంగా మీ ఆంటీ నా మాటలు వింటే ఇప్పట్నుంచే బాధపడటం మొదలు పెడుతుంది. నిదానంగా నచ్చ చెప్పకుంటాను. ఫోన్ చెయ్యిగానే పనులు మానుకుని వచ్చినందుకు చాలా సంతోషం. నేనే మీ దగ్గరకు రావటానకి ఇంట్లో ఎప్పుడు వుంటారో తెలియదు.”
“మీరు రానక్కర్లేదు సార్. ఇప్పడు అసెంబ్లీ సమవావేశాలు కూడా లేవు. నాకే ఇబ్బందీ లేదు. చెప్పండి సార్. నేను చేయగలిగిన పనేమైనా వున్నదా?”
“పోయిన సారి మీరు వచ్చినప్పుడు నేత్రదానం గురించి అడిగారు. చాలా మంచి ఉద్దేశం. మీరు చేసే పని బాగున్నది.”
“మీరు నేత్రదానం చేస్తారా సార్?”
“చేస్తాను. కాని మరొక రకమైన దానం. నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. మీ ఆంటీ అమాయకురాలు. తన ఇల్లే తన ప్రపంచం అనుకుంటుంది. ఈనాటి లోకం పోకడ ఆట్టే తెలియదు. బ్యాంక్‌క్కానీ, పోస్టాఫీసుక్కానీ, చివరకు ఏటిఎమ్‌కు దగ్గరకు కూడా వెళ్లి పనులు చక్కబెట్టుకోలేదు. మొదట్నుండీ తనక్కావలిసినవన్నీ మేమే తెప్పించి ఇచ్చేవాళ్లం. మరో మనిషి తోడు లేకుండా తను గడపలేదు. ఏ పనీ చేసుకోలేదు. ముందు నేనే చనిపోతే తన పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తుంటే భయమేస్తున్నది. పిల్లలా ఇక్కడికి రారు. వాళ్ల దగ్గరకు ఈమెను తీసుకెళ్లే పరిస్థితీ లేదు. ఇక్కడే వుండి పని వాళ్లను పెట్టుకుని కేవలం వాళ్ల సహాయంతోనే కాలం గడపాలి. ఆస్తిపాస్తులన్నీ జాగ్రత్త చేశాను. వీలునామా రాసే వుంచాను. ఎంత డబ్బుందీ ఏం ప్రయోజనం. తన అనే మనిషి దగ్గర లేకపోయిన తర్వాత. అదృష్టం బాగుండి తను ముందు చనిపోతే తనను బాగానే సాగనంపగలను. టీ.వీ ముందు కూర్చుని పెద్ద పెద్ద వారి దహనసంస్కారాలను ఆసక్తిగా చూస్తుంటుంది. అన్నీ శాస్త్రప్రకారంగా ఎంత బాగా జరుగుతున్నాయి. అందరికీ అట్లాగే జరగాలి అంటుంది. నాకళ్ల ముందు ఆవిడ చనిపోతే నా శాయశక్తులా ఆవిడ కోరిక ప్రకారం జరిపించగలను. ఆ తర్వాత నా తిప్పలేవో నేను పడతాను. పని వాళ్ల సహాయంతోనో, లేకపోతే మంచి వృద్ధాశ్రమంలోనో వుండగలను. కాని అనుకోని వింధంగా నేనే ముందు పోతే తన సంగతేంటి. కొడుకు ఎప్పటికొచ్చేను. అన్నీ పద్ధతి ప్రకారం జరుపుతాడా. ఈలోగా ఆ అమాయకురాలు ఏం చేయగలదు. అయన వారు దగ్గర లేక ఒక్కత్తీ బెంబేలెత్తి పోవటం తప్ప. ఆ తర్వాత కూడా తను సంతోషంగా ప్రశాంతంగా బతకనూ లేదు. ఏది ఏమైనా ఎవరికైనా సుఖంగా మరణించటం కంటే మరో గొప్ప అదృష్టం లేదు. అలాంటి వాళ్లు ఎంతో పుణ్యం చేసుకున్నట్లు. మీరు వేరేగా అనుకోవద్దు. ఆవిడ కంటే నాక్కాస్త ఓపిక వున్నది. నేనున్నంత వరకు ఆవిడకే లోటు జరగనివ్వను. అంతా ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. సిద్ధార్థ మెడికల్ కాలేజీకు నా శరీరాన్ని దానం చేస్తున్నట్లుగా అంగీకార పత్రం వ్రాసిచ్చాను. వాళ్లకుపయోగపడుతుంది. మీరు నేత్రదానం అన్నారు. నేను శవదానం అంటున్నాను. ఇలా చేస్తే కాలేజీ వాళ్లకుపయోగం. మీ ఆంటీకి లేనిపోని హైరానా తప్పుతుందని అలోచించాను.”
“సార్. ఎందుకిలా మాట్లాడుతున్నారు?” అంటూ సాంబశివరావుగారి చేతులు పట్టుకున్నారు ఎమ్మెల్యేగారు.
“నన్నింకా కొంచెం మాట్లాడనివ్వండి. నేను ముందు పోతే గనుక ఆ తర్వాత మీ ఆంటీకి కాస్త సపోర్ట్‌గా వుండండి. మీ సంగతి ఆమెకు నేను చెప్తాను. కాస్త మోరల్ సపోర్ట్ అంతే. దేముడు నా మొర ఆలకించి ఆవిడకు నాకంటే ముందే తీసుకపోతే తనకూ నాకూ ప్రశాంతంగా వుంటుంది” అంటుంటే సాంబశివరావుగారి గొంతు జీరబోయింది.
ఎమ్మెల్యేగారు సాంబశివరావుగారికింకా దగ్గరగా జరిగాడు. “ఏం జరిగింది సార్. పెద్ద పెద్ద అనారోగ్యాలేం లేవు కదా మీకు. ఏం అధైర్యపడకండి. అంతా బాగానే జరుగుతుంది. మీలాంటి మంచి వారికి దేముడు అంతా మంచే చేస్తాడు సార్.”
“అనారోగ్యం అనేది ఎంత సేపు రావాలి చెప్పు. వాన రాకడా, ప్రాణం పోకడ ఎవరికీ తెలీదంటారు కదా. ఎందుకొచ్చిన బాదరబందీ అని నా విషయంలో ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నెమ్మదిగా మిగతా వాళ్లకూ చెప్తాను. మీరెంత రాజకీయాలలో తిరుగుతున్నా మీ అమ్మనూ, నాన్ననూ దగ్గరే పట్టుకున్నారు. ఎంతో శ్రద్ధగా చుసుకుంటున్న సంగతీ నాకు తెలుసు. మానవత్వమున్న మనిషివనే మొదటి నుండీ మీరంటే నాకు చాలా అభిమానం. ఆలాంటి అభిమానాన్ని, కొంచెం శ్రద్ధను మీ ఆంటీ మీద కూడా చూపించాలి. ఆస్తిపాస్తుల విషయంలో ఏ లోటు లేదు. భవిష్యత్‌లో మీరేదైనా ట్రస్టు పెట్టినా పార్టీ ఫండ్ కావాలన్నా మీరడిగినంత ఇస్తాను. అన్నట్లు పార్టీ ఆఫీసు కట్టాలనుకుంటున్నట్లు విన్నాను. నా స్థలాలు చాలా వున్నాయి. మీక్కావలసిన దానిని ఎంపిక చేసుకోండి. మీ ఆంటీ పేరుతో ఆఫీసు నిర్మాణానికి కావాలిసిన డొనేషనూ అందుతుంది. అడగటానికి ఏం మొహమాటపడ వద్దు. కొన్ని సంక్షేమ వసతి గృహాలకూ, వికలాంగుల సంస్థలకూ, పాఠశాలలక్కూడా నా వంతు ఆర్థిక సాయం చేస్తూనే వున్నాను.”
“అబ్బే అలా ఏం అనుకోను సార్. మీ సంగతి నాకు తెలియదా. పైకి ఎంతో సరదాగా కనుపించే మీలోపల ఇంత బాధున్నదని, ఇంతగా మథనపడుతున్నారని నేనస్సలు ఊహించలేదు. ఏ జన్మబంధమో మీరంటే నాకు మొదటి నుండీ గౌరవం. నేనంటే మీకు అభిమానం. నా తల్లిదండ్రులంటే నాకు చాలా ఇష్టం. ప్రేమ వున్నాయి. ఈ వయస్సులో వాళ్లకు మా అవసరం చాలా వున్నది. ఏ తల్లిదండ్రులకైనా పెద్ద వయసులో పిల్లల తోడు చాలా అవసరం సార్. రోజూ వాళ్లు మందులు వేసుకున్నారా, భోజనం వేళకు చేశారా అని కనుక్కుంటాను. నేను రావటం రాత్రి పూట ఎంత ఆలస్యమైనా వాళ్లు నాకోసం కాచుకొని కూర్చుంటారు. వాళ్లనొక్కసారి నేను పలకరించిన తర్వాతే నిద్రపోతాను.”
“అది నీ తల్లిదండ్రులకు దక్కిన వరమనే చెప్పుకోవాలి. ఈ రోజుల్లో అలాంటి వరాలు ఎంత మంది తల్లిదండ్రులు పొందగలుగుతున్నారు?”
“వాళ్లు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే ఇక నుండీ మీరు దేముడిచ్చిన తల్లిదండ్రులనుకుంటాను. ఇప్పుడు మీరే నాకు వరమిచ్చినట్లు అయింది.”
“అంత మాటన్నారు అదే చాలు. నా పిల్లలు దగ్గర లేరు అన్న బాధ నిజంగా మర్చిపోతాను.”
“ఇకనైనా మీరు అని పలవటం మానేయండి. నేను మనస్పూర్తిగా చెప్తున్నాను్, మీరిక నిశ్చింతగా వుండండి. అప్పడప్పుడు మీ ఇంటికి వస్తూ వుంటాను. తరచూ ఫోన్ చేస్తాను. మీ పిల్లల్తోనూ టచ్‌లో వుండటానికి ప్రయత్నం చేస్తాను” అంటూ సాంబశివరావుగారి చేతుల్ని తన రెండు చేతుల్తోనూ గట్టిగా పట్టుకున్నాడు.
ఆ చేతుల్లోని ఆప్యాయతా, భరోసా సాంబశివరావుగారి గుండెల్ని తాకాయి.
శ్రీమతి దాసరి శివకుమారి గారు విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని. వీరు 125 సామాజిక కథలను, 5 నవలలను, 28 వ్యాసములను రచించారు. ఇవి కాక మరో 40 కథలను హిందీ నుండి తెలుగుకు అనువదించారు. వీరు బాల సాహిత్యములో కూడా కృషి చేస్తున్నారు. పిల్లల కోసం 90 కథల్ని రచించారు. మొత్తం కలిపి 255 కథల్ని వెలువరించారు. వీరి రచనలు వివిధ వార, మాస పత్రికలతో పాటు వెబ్ పత్రికలలో కూడా వెలువడుతున్నాయి.
వీటితో పాటు అక్బర్-బీర్బల్ కథలు, బాలల సంపూర్ణ రామాయణం కథలు, బాలల సంపూర్ణ భాగవత కథలు రెండు వందల నలభై రెండుగా సేకరించి ప్రచురణ సంస్థకు అందించారు. మరికొన్ని ప్రచురణ సంస్థల కొరకు హిందీ నాటికలను కథలను అనువదించి ఇచ్చారు. వీరి రచనలు 24 పుస్తకాలుగా వెలుగు చూశాయి.