Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భయం గుప్పెటలో

[ఎన్. వెంకటరత్న శర్మ గారు రచించిన ‘భయం గుప్పెటలో’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రాజశేఖర్ బస్సుదిగేసరికి రాత్రి పది గంటలయ్యింది. సాధారణంగా ఈ సమయానికి ఎప్ప్పుడూ వాళ్ళ ఊరికి రాడతను. సాయంత్రం ఏడు గంటలు దాటితే ఇంటికి వెళ్ళటానికి అతనికి భయం.

రాజశేఖర్‌కి పాతిక సంవత్సరాలుంటాయి. ఇంకా పెళ్ళి కాలేదు.

బాగా చదువుకుని పట్నంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అప్పటి నుండి ఊరికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నాడు. అదీ అవసరం పడితేనే.

బస్సు దిగిన తర్వాత రెండుమైళ్ళు నడవాల్సి ఉంటుంది వాళ్ళ ఊరు చేరటానికి. రోడ్డు కచ్చా రోడ్డు. ఎలాంటి వాహన సౌకర్యం ఉండదు. అందుకే రాజశేఖర్ ఎప్ప్పుడు ఇంటికి వచ్చినా సాయంకాలంలోపు ఇంటికి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఈ సారి అతనికి కుదరలేదు. వేరేవేరే పనులుండి ఆలస్యంగా బయలుదేరాల్సివచ్చింది. దాంతో ఇంత రాత్రయ్యింది.

రాజశేఖర్ తండ్రి వ్యవసాయం చేసుకుంటూ ఆ వూర్లో ఉంటున్నాడు. చెల్లెలికి పెళ్ళయి అత్తగారింట్లో ఉంటోంది. తల్లిదండ్రులు పల్ళెటూళ్ళో ఉండటంతో ఏ చిన్న అవసరం వచ్చినా రాజశేఖర్‌కి ఫోన్ చేసి రమ్మంటున్నారు. హఠాత్తుగా ఉదయం ఫోన్ చేని రమ్మనటంతో రాజశేఖర్ ఆఫీసు నుండి తిన్నగా బయల్దేరాడు ఇంటికి.

అది చాలా చిన్న ఊరు కావటంతో రాజశేఖర్‌కి పెద్దగా స్నేహితులు కూడా లేరు.

రాజశేఖర్ బిక్కు బిక్కు మంటూ రోడ్డు వెంట నడుస్తున్నాడు. బస్సుదిగిన ఊరు దాటి ఒకటి రెండు ఫర్లాంగులు నడిచేసరికి రోడ్డు నిర్మానుష్యమైంది. చీకటిగా కూడా ఉంది. ఆ రెండు మైళ్ళ దోవలో వీధి లైట్లు కూడా ఉండవు. చేతిలో టార్చ్‌లైట్ కూడా లేదు. రోడ్డు కిరువైపుల పెద్దపెద్ద చెట్లున్నాయి. అవి గాలికి ఊగుతూ మరింత భయం కలిగిస్తున్నాయి. రాజశేఖర్ భయం భయంగానే అడుగులు వేస్తున్నాడు.

ఇంతలో “ఎవరు బాబు నువ్వు?” అని అడుగుతున్న గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు రాజశేఖర్.

చీకటిలో సరిగ్గా కనిపించట్లేదు కాని ఏదో మనిషి ఆకారం కదుల్తూ తనవైపే వస్తోంది. దగ్గరగా వస్తే ఎవరో తెలుస్తుందిలే అనుకున్నాడు రాజశేఖర్. దగ్గరగా వచ్చిన తర్వాత రాజశేఖర్ కాస్త పరిశీలనగా చూశాడు. అయినా అర్థం కాలేదు, తలపై ముసుగో, టోపీనో ఉంది. మనిషిని ఆ చీకట్లో ఆనవాలు పట్టటం కష్టమైంది రాజశేఖర్‌కి.

“ఎవరంటే చెప్పవే! ఇంత చీకట్లో ఏ వూరెళ్తున్నావు?” అడిగాడతను మళ్ళీ!

ఊరు పేరు చెప్పాడు రాజశేఖర్.

“ఆ వూళ్ళో నీకేం పని?” అన్నాడు అతను మళ్ళీ

“మా ఊరు అదే!” అన్నాడు రాజశేఖర్.

“ఎవరబ్బాయివి?” అడిగాడతను

“రామయ్యగారబ్బాయిని” చెప్పాడు రాజశేఖర్.

కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత అతను మళ్ళీ అడిగాడు.

“ఇంత చీకట్లో వస్తున్నావు తొందరగా ఇంటికి చేరుకోలేకపోయావా!”

“ఎప్పుడూ సాయంత్రానికే ఇంటికి చేరతాను. ఇవ్వాళ ఆలస్యమయ్యింది” అన్నాడు రాజశేఖర్. రాజశేఖర్ సమాధానాలు చెబుతున్నాడు కాని అగంతకుడి ముఖం మాత్రం చీకట్లో సరిగా కనపడ్డంలేదు రాజశేఖర్‌కి.

ఎవరైతే ఏమయ్యిందిలే ! తోడు దొరికాడు భయం లేకుండా అనుకున్నాడు లోపల్లోపల రాజశేఖర్.

“నువ్వు చూస్తే చదువుకునే చిన్నపిల్లాడిలా ఉన్నావు. ఈ చీకటి రాత్రిలో రావటానికి భయం అనిపించటల్లేదా!” అడిగాడు అతను.

పోనీలే! చదువుకుంటున్నాననుకుంటున్నాడు. అదే ఉద్యోగం చేస్తున్నానని తెలిస్తే తన జేబులు ఖాళీ చేసేవాడేమో! అనుకున్నాడు రాజశేఖర్ మనస్సులో.

రాజశేఖర్‌కి లోపల నిజంగానే భయంగా ఉంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ “నాకేం భయం” అన్నాడు.

“ఫరవాలేదు గట్టి పిండానివే” అన్నాడు అతను.

“అయినా రోజులు బాగాలేవు ఈ మధ్య ఈ రోడ్డు మీద దొంగతనాలు జరుగుతున్నాయ్. డబ్బులు, బంగారం దొరికితే సరేసరి ! లేకపోతే కొట్టి వదిలేస్తున్నారు దొంగలు జాగ్రత్త. ఇకనైనా తొందరగా ఇంటికి చేరుకో” అన్నాడతను.

రాజశేఖర్ గుండెలు గతుక్కుమన్నాయ్. అతని భయం మరింత పెరగసాగింది. అయినా తనదగ్గర ఏముందిలే దోచుకోటానికి అనుకున్నాడు ధైర్యంగా. డబ్బులేదు సరే! చివర్లో ఏమి దొరక్కపోతే కొడతారన్నాడు కదా! ఆ మాటకి రాజశేఖర్‌కి భయం రెట్టింపైంది.

“మీరున్నారు కదా! తోడుగా ఇంకేం భయం!” అన్నాడు రాజశేఖర్ పైకి ధీమాగా. ఇలా మాటల్లో పడి చాలాదూరం నడిచారిద్దరూ. వాళ్ళ మధ్య ఏవో పిచ్చాపాటి చాలా మాటలే నడిచినయ్.

ఇంతలో రోడ్డు ప్రక్కన ఒక పెద్ద ఊడల మర్రిచెట్టు వచ్చింది. ఆ చెట్టు దగ్గర మరింత భయం కలిగింది రాజశేఖర్‌కి. అక్కడ దయ్యాలుంటాయనుకుంటారు అందరూ. దయ్యాల సంగతి గుర్తుకు రాగానే భయం కలిగింది. ఆ భయంపోవటానికి జేబులో నుండి సిగరెట్టు తీసి వెలిగించాడు. రెండు దమ్ములు పీల్చి అమ్మయ్య! అనుకున్నాడు. ఇలా పదడుగులు ముందుకు నడిచేసరికి తనతోపాటు వస్తున్న అడుగుల చప్పుడు ఆగిపోయిందని గమనించాడు రాజశేఖర్.

భయం భయంగా ఒక్కసారి తలత్రిప్పి వెనుకకు చూశాడు. అక్కడెవరు కనిపించలేదు. ఇప్పటిదాకా తనతో వచ్చిన అతను ఏమయ్యినట్లు? కాళ్ళు గడగడ వణికినయ్, గుండె దబదబ కొట్టుకోసాగింది. తనతోపాటు వచ్చింది దయ్యం కాదు కదా! తను సిగరెట్టు కాల్చగానే నిప్పు చూసి పారిపోలేదు కదా!

ఈ ఆలోచన రాగానే రాజశేఖర్‌కి ముచ్చెమటలు పట్టినయ్ అంతే! వేగంగా పరుగెట్టాడు. దయ్యాల మర్రి చెట్టు దగ్గరే ఈ సంఘటన జరగటంతో అది దయ్యమే అని నిర్ధారించుకున్నాడు రాజశేఖర్. బ్రతుకు జీవుడా అనుకుంటూ పరిగెట్టుతూ ఊరికి చేరుకున్నాడు. ఊళ్ళో వీధిలైట్లు చూసిన తర్వాత కాని అతను కుదుటపడలేదు.

ఇంటికి చేరిన అతనిని తల్లిదండ్రులు పలకరించిన తర్వాత కాని అతని భయం పోలేదు. భోజనాలయి పడుకున్న తర్వాత రాజశేఖర్ మనస్సులో ఏవేవో భయాలు ఆలోచనలు ఊపిరి పీల్చుకో నియ్యలేదు.

ఆ దయ్యం అదృశ్యంగా తనతోపాటు ఊళ్ళోకి రాలేదు కదా! ఇంటికి వచ్చి నన్ను పట్టుకోదు కదా! గొంతు నలమదు కదా! ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనల మధ్య నిద్రకుపక్రమించాడు రాజశేఖర్.

దయ్యం ఆలోచనలతో పడుకున్న రాజశేఖర్‌కి ఆరోజు రాత్రి పిచ్చిపిచ్చి కలలు నిద్ర లేకుండా చేసినయ్. ఒక రాత్రివేళ ఒక దయ్యం అతని మీద కూర్చున్నట్లు గుండెలు బరువెక్కినట్లు అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. లేచిచూస్తే ఏముంది చుట్టు ఏమీలేదు. తల్లిదండ్రి ఆదమరచి నిద్రపోతున్నారు.

రాజశేఖర్ లేచి బాత్‌రూమ్‌కి పోయివచ్చి కాసిని మంచినీళ్ళు త్రాగి మళ్ళీ నిద్రకుపక్రమించాడు. అటు తన్నుకుని ఇటు తన్నుకుని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు మళ్ళీ.

నిద్రపోయాడన్న మాటేకాని, ఏవో కలలు కలత నిద్రలో అతనిని భయపెట్తూనే ఉన్నాయి. పొద్దున నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కింది.

రాజశేఖర్ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉన్నాయి.

“ఏరా రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా! కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి.” అడిగింది తల్లి. అంతలోనే ఒంటిమీద చెయ్యివేసి “అరె! ఒళ్ళు బాగా కాలుతోంది. జ్వరం వచ్చినట్లుందిరా” అంది తనే మళ్ళీ.

“జ్వరమా!” అడిగాడు తండ్రి

“రాత్రి కూడ ఉందా” అడిగింది తల్లి.

“లేదు! నిన్న బయల్దేరేటప్ప్పుడు కూడా లేదు!” అన్నాడు రాజశేఖర్.

“మరి! ఇంతలో ఏమయ్యింది” అడిగాడు తండ్రి.

దాంతో రాత్రి జరిగిన సంగతి పూసగుచ్చినట్లు చెప్పాడు వాళ్ళకి రాజశేఖర్.

“భలేవాడివిరా! రాత్రి చెప్పొద్దు మాకాసంగతి. ఇప్పుడా చెప్పేది!” అంది తల్లి.

తండ్రి మాత్రం “చిన్న పిల్లాడిలా భయాలేంట్రా” అన్నాడు.

“వీడికేదో దడుపు జ్వరం పట్టుకున్నట్లుంది. గుళ్ళో పూజారిగారి నడికి తాయెత్తు పట్టుకొస్తాను” అంటూ వెళ్ళింది.

“దీనికిదొక చాదస్తం. తాయెత్తులు, విభూతులు అంటూ పరిగెత్తుతుంది” అన్నాడు తండ్రి. ఆయనకి నిజానికి ఇలాంటివి ఇష్టముండవు. కాకపోతే వద్దనడు చూస్తూ ఊరుకుంటాడు.

తాయెత్తు తెచ్చి రాజశేఖర్‌కి కట్టింది తల్లి. అది కొండంత బలాన్నిస్తుంది ఆమెకి.

రెండ్రోజులు జ్వరం ఇబ్బంది పెట్టి తర్వాత తగ్గటంతో రాజశేఖర్ మళ్ళీ ఉద్యోగానికి బయలుదేరాడు.

“మర్రి చెట్టుదాకా మీ నాన్నని రమ్మంటావా!” అంది తల్లి. “వద్దులే!” అన్నాడు రాజశేఖర్.

“అరె నాన్న! భయపడకూడదు. దయ్యాలున్నాయో లేవో నాకు తెలియదు. భయమే దయ్యం. నువ్వు భయపడుతున్నావని తెలిస్తే మరింత భయపెడాతాయి. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే నీ జోలికి అవి రావు. అందుకని ధైర్యంగా ఉండు”.

“ధైర్యే సాహసే లక్క్ష్మి అని అంటారు కదా! అది అలవాటు చేసుకో, అయినా మొన్న నీతో వచ్చింది పక్క ఊరివాడయ్యుండచ్చు. ఆ చెట్టు వెనకగా ఒక ఊరుంది. ఆ ఊరి వాడయ్యుండచ్చు కదా!” అన్నాడు మళ్ళీ తండ్రి.

“ఏమో! కావచ్చు!” అన్నాడు రాజశేఖర్ బయలుదేరుతూ!

అయినా వెళ్ళేవాడు చెప్పివెళ్తే తను భయపడేవాడు కాదు. చెప్పకుండా వెళ్ళడంతోనే దయ్యం అనుకుని భయపడ్డాడు. దయ్యమో, మనిషో! అసలు సంగతి దేవుడికెరుక, మరోసారి ఇలా భయపడకూడదు అనుకున్నాడు రాజశేఖర్ దృఢంగా.

Exit mobile version