Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భయం

[కనకదుర్గా లక్ష్మీరత్న గారు రచించిన ‘భయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ఏదైనా అవాంఛనీయ సంఘటన సంభవించినప్పుడు కలిగే బలమైన భావోద్వేగమే భయం. నవరసాలలో ఒక రసం భయం. ప్రతి మనిషిలోను నవరసాలు ఉంటాయి. ఆ యా సందర్భానికి తగ్గట్టు మనిషి స్పందించినప్పుడు నవరసాలలో ఎదో ఒక రసాన్ని ఆశ్రయిస్తాడు. కాబట్టి భయపడటం ప్రకృతి సహజమైన స్పందనే! కాకపొతే ప్రతీ చిన్న విషయానికి భయపడితే అది అసహజం. కొందరికి భయం స్వాభావికం. కొందరికి ఆ యా పరిస్థితులు, సంఘటనల స్వభావమును బట్టి తాత్కాలికంగా భయపడతారు.

అందరికీ ఏవో భయాలు వున్నట్లే కామాక్షి వాళ్ళ ఇంట్లో కూడా తలా ఒక్కరికీ వాళ్ళ వాళ్ళ పరిధిల్లో ఏవో భయాలు వున్నాయి. తమాషా ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు అవతలి వాళ్ళవి అర్థం లేని భయాలని కొట్టిపడేస్తుంటారు లేదా బుద్ధి పుడితే తీర్చడానికైనా ప్రయత్నిస్తుంటారు.

కామాక్షి వాళ్ళ ఆయన విశ్వానికి, పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్త టెక్నాలజీలు తన ఉద్యోగానికి ఎక్కడ ఎసరు పెడతాయోనని బిక్కుబిక్కుమంటూ ఉంటుంటాడు. ఆ భయంతోనే అరవై మీద పడుతున్న, ప్రాచుర్యంలోకి వచ్చిన ప్రతి టెక్నాలజీని నేర్చుకోవాలని ఒక యజ్ఞ దీక్ష చేపట్టేడు. ఇంక తనకంటూ వేరే జీవితమే లేనట్లు ఆఫీస్ పని అయిపోయేక కూడా లాప్టాప్ ఫెవిక్విక్ లాగా అతని ఒళ్ళో అతుక్కుపోయి ఉంటుంది.

ఇంట్లో అంతా “మూడు, నాలుగేళ్లలో రిటైర్ అయిపోయేదానికి ఉద్యోగం పోతుందేమోనని ఆ భయమేమిటి? అప్డేట్ చేసుకోవాలి అంటూ వచ్చిన ప్రతి టెక్నాలజీ వెంట పడకపోతే, హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయచ్చుగా? ఇప్పుడంత జరగుబాటు కాని పరిస్థితుల్లో మనమేమి లేము కదా” అని దెప్పుతారు.

“పిల్లల పెళ్లిళ్లు అయ్యి స్థిరపడేంతవరకు నేనేమి రిటైర్ అవను. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటే వాటి తగ్గ ఉద్యోగాలు ఉండనే ఉంటాయి. మీరనుకుంటున్నట్లు నాదేమీ భయం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తాపత్రయం” అని సమర్థించుకుంటాడు.

కామాక్షి మామగారు భుజంగరావు గారికి, ఏ పని చేపట్టిన అవతలవాడి మోసానికి తాను గురై పోతానని భయం. ఒక పట్టాన ఎదుటవాడిని నమ్మరు. వాడిలో మొదట కీడెంచి, పిదప మేలెంచుతారు. ఒక పనికి పది మందిని సంప్రదిస్తారు. అయినా భయంతోనే ముందుకు సాగుతారు. అదేమీ పాపమో గాని అయన భయానికి తగ్గట్టు ఏదో తిరకాసు వ్యవహారం జరిగి ఆ పని ఈసురోమంటూ పూర్తవుతుంది. దాని ఫలితం ఆయనకి ఏమాత్రం సంతృప్తినివ్వదు. అది ఆయన ఇంటి ప్లాన్ వేసిన ఇంజనీర్ గాని, ఆయన చేసే బ్యాంకు డిపాజిట్ కానీ, పెన్షన్ వ్యవహారం గాని, అరచేతిలో వైకుంఠం చూపించి తన చేత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయించిన వ్యవహారంగానీ, తనకి వైద్యం చేసిన డాక్టర్ గానీ..

“నేను భయపడినంతా అయ్యిందేవ్” అని ఆవేశంతో మోసానికి గురైన వాళ్ళల్లాగ భార్య మహాలక్ష్మితో అంటారు.

ఆవిడకు చిర్రెత్రి “ఆ.. నా బొంద! ఎదుట వాళ్ళని నమ్మకపోవడమనే రోగం మీకు మొదటనుండీ వుంది. ఎవరు మోసం చేస్తారోనని భయంతో పని మొదలెడతారు. మనసంతా భయమే ఆవహించివుంటే బుద్ధి పనిచేయక, చేయవలసిన పని సరిగ్గా చేయరు. అందుకే ఆ పనులు ముక్కుతూ, మూలుగుతూ అవుతుంటాయి. మీ ఫ్రెండ్ మూర్తిగారు మీలా భయపడడు. అందుకే ఆయన పనులన్నీ చిటుక్కుమని అయిపోతుంటాయి” విసుక్కుంది.

“అవును మావయ్య! మనం ఏదైనా చేసినప్పుడు అంతలా నెగటివ్‌గా ఆలోచిస్తే, అది నెగటివ్ రిసల్ట్‌నే ఇస్తుంది. మీరు ప్రవచనాల్లో వింటుంటారుగా” అంది కామాక్షి.

“ఎవరో తాతయ్యని స్థలం విషయంలో మోసం చేశారని, నిన్ను కూడా అలా మోసం చేస్తారని భయపడితే అసలు నువ్వు ఏ పనీ చెయ్యలేవు నాన్నా!” మనం జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలించుకుంటే ఎవరూ ఏమీ మోసం చేయరు” అన్నాడు విశ్వం.

“ఏమోరా! ఒక పని చేద్దామంటే పది రకాల ఆలోచనలు వస్తాయి. అవన్నీ కొట్టి పడేయలేను కదా!” అని పేపర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయేరు భుజంగరావు గారు.

మామగారికి అనవసర విషయాల్లో భయం విడనాడాలని చెప్పే అత్తగారు మహాలక్ష్మికి రోగాలంటే చచ్చేంత భయం. చిన్న చిన్న అనారోగ్యం చేసినా అది ఏ మహమ్మారికి దారి తీస్తుందోనని భయం. లేని పోని జబ్బుని ఊహించుకుని, అది వచ్చినట్లే భావించి ఇంక మంచాన పడినట్లే ఊహించుకుంటారు. అరగక కడుపునెప్పి వస్తే అపెండిసైటీసని, ఏ కొరివికారమో తిని గుండెలో మంటగా ఉంటే “అమ్మో! హార్ట్ అటాకే!”, నడుము బెణికి నెప్పి చేస్తే “ఇది ఖచ్చితంగా ఫ్రాక్చరే సుమీ!”, జ్వరం కొంచెం ఎక్కువగా వస్తే “వెలుతురులో పేపర్ చదువుదామని బాల్కనీలో కూర్చున్నానా! దోమ కుట్టేసింది. ఇది డెంగ్యూనే అయ్యి ఉంటుంది” అంటుంటారు. విచిత్రం ఏమిటంటే ఈ భయాలన్నీ తన విషయంలోనే ఉంటాయి ఆవిడకు. కరోనా రోజుల్లో ఎవరు తుమ్మినా, దగ్గినా “అమ్మో! కరోనానే అంటావా? ఎందుకైనా మంచిది. మీరు మీ గదుల్లో వుండండి. అసలే మేము పెద్ద వాళ్ళమాయే! వస్తే తిప్పుకోలేము కూడానూ” అనేవారు.

కామాక్షి “భయాన్ని మించిన జాడ్యం లేదత్తయ్య! రోగం వస్తే వైద్యం చేయించుకుని నయం చేసుకోవచ్చు. అసలు లేని రోగం వచ్చిందేమోనని భయపడుతుంటే అది మానసిక రోగానికి దారి తీస్తుంది. అది మందులతో నయం చేసేది కాదు. మీ మనసులోంచి ఆ భయాన్ని తీసి పారేస్తే ఏ రోగం దరి చేరదు” అని చెబుతుంది.

“అవును లేవే! ఇతరులకు వస్తే మనం ఎంత ధైర్యాన్నైనా నూరిపోస్తాం. మన దాకా వస్తే అప్పుడు ఈ ధైర్యాలూ వుండవూ, ఈ ఉపదేశాలూ పనికిరావు” అని పుల్లవిరుపుగా అంటారు. చేసేది లేక కామాక్షి వూరుకుంటుంది.

కామాక్షి కూతురు వైదేహి చదువుల సరస్వతి. కానీ పరీక్షలంటే మాత్రం భయం. పరీక్షకి వెళ్లే ముంది పది సార్లు బాత్రూమ్‌కి వెళుతుంది. రెండు, మూడు సార్లు కక్కుతుంది. విశ్వం కానీ, కామాక్షి కానీ కాలేజీకి దిగబెట్టి వస్తారు. పరీక్ష పేపర్ చూడగానే భయంతో మెదడు మొద్దు బారిపోయి చదివిందంతా మర్చిపోతుంది. ఇంక పరీక్ష హాలులోనే ఏడవడం మొదలెట్టేస్తుంది. వైదేహి సంగతి తెలిసి ఉండడంతో ఇన్విజిలేటర్స్ కొంచెం సేపు సముదాయించి, మంచి నీళ్లు ఇచ్చి, డీప్ బ్రెత్ తీసుకోమని చెబుతారు. కొంచెం సేపటికి మామూలు అయ్యి పరీక్ష రాస్తుంది. మార్కులు కూడా బాగానే వస్తాయి. కానీ ఈ ఎగ్జామినేషన్ ఫియర్ మాత్రం అధిగమించలేకపోతోంది. ఇంట్లో వాళ్ళు చెప్పి తీర్చడానికి చూసేరు. సరేనని బుర్ర ఊపుతుంది. కానీ పరీక్ష పేపర్ చూసేసరికి కొయ్య బారిపోతుంది.

ఇంట్లో అందరి భయాలు ఓపిగ్గా తీర్చే కామాక్షికి కూడా అహేతుకమైన భయాలు అనేకం. ఎప్పటికప్పుడు వాటిని అధిగమించడానికి పాపం సాయశక్తులా ప్రయత్నస్తూనే ఉంటుంది. పరిణితి చెందని వయసులో కలిగిన భయాలను, వయసు వచ్చి మనసు పరిణితి చెందేక విడనాడింది. కామాక్షి తనకున్న భయాలను పక్క వూర్లో వుద్యోగం చేస్తున్న కొడుకు పట్టాభితో మాత్రమే చెబుతుంది. ఎందుకంటే విశ్వం ఎప్పుడూ తన విశ్వం లోంచి బైటకి రాడు. అత్తమామలకు చెప్పితే “ఏమిటే ఈ అర్థం లేని భయాలు? విడ్డూరం కాకపోతే!” అంటారు. కూతురు, తన భయాలు తీర్చే పరిణితి ఇంకా చెందలేదని అనుకుంటుంది. పట్టాభి ఒక్కడే ఓపిగ్గా భయాలను ఎలా విడనాడాలో చెబుతుంటాడు.

ఈ మధ్య కామాక్షికి ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు గురించి విని ఉండటంతో ఎదో తెలియని భయం పట్టుకుంది. తెలియని నంబరు నుండి ఫోన్ వస్తే తీయడం మానేసింది. ఏవో స్పాం మెయిల్స్ రావడం, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదనో, KYC చేయమనో ఏవో లింకులు పంపిస్తూ మెసేజ్లు వస్తుంటే భయపడి పట్టూకి చెబితే, వాడు భయపడవద్దని, ఏ లింకులు క్లిక్ చేయవద్దని చెప్పేడు.

ఒకరోజు ఉదయాన్నే కామాక్షికి ఒక వెబ్సైటు నుండి తన పాస్వర్డ్ ఉపయోగించి ఎవరో తన అకౌంట్ లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించేరని మెసేజ్ వచ్చింది. ఇంక మీనాక్షికి కాళ్ళు చేతులు ఆడలేదు. విశ్వాన్ని నిద్ర లేపి చెప్పింది. “అది స్కాంలే. పట్టించుకోనక్కర్లేదు” అని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కామాక్షికి ఆ జవాబు తృప్తినివ్వలేదు సరికదా అంత నిమ్మళంగా ఎలా వుంటారో అని ఉడుక్కుంటూ పట్టూకి ఫోన్ చేసింది. వాడు కూడా ఎప్పుడూ చెప్పే జవాబే చెప్పేడు.

“అమ్మ ఒక పక్క భయంతో బెంబేలెత్తి పోతుంటే మీరిద్దరూ అసలు పట్టించుకోరే?” కంగారుగా వాడి మీద అరిచింది.

“ఇదేమీ మొదటి సారి కాదు నువ్వు భయపడి నాకు ఫోన్ చేయడం. ఎవరో ఫోన్ చేసి ఏదో చెబితే భయపడతావు. నేను ఫోన్ చేయడం ఆలస్యం అయినా భయపడతావు. భయం మనసును స్తంభింపజేసి ఆలోచన లేకుండా చేస్తుంది. కానీ మనం విచక్షణ కలిగి ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు అది భయపడాల్సిన విషయమా కాదా తేటతెల్లమవుతుంది. సమస్యకి పరిష్కారమూ లభిస్తుంది. సమస్య వచ్చినప్పుడు నీ వైపు నుండి ఏ ప్రయత్నం చేయకుండ భయపడిపోయి ఇతరుల మీద ఆధారపడిపోయి, వారు నీ సమస్య పరిష్కరించి, నీ భయం తీర్చాలని చూస్తావు. లేదా దేవుడు దగ్గరకి పరిగెత్తి ఏవో స్తోత్రాలు చదువుతావు. నీ ప్రతీ అర్థం లేని భయానికి దేవుడు పరిగెత్తుకు వచ్చి తీర్చాలనుకోవడం నీ అవివేకత. అయిన దానికి, కానిదానికి అలా భయపడిపోతుంటే నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతావు? ఇలాంటి మెస్సేజులు చాలా మందికి వస్తాయి. కొందరు భయపడి వాళ్ళ మాయలో పడతారు. నిదానంగా అలోచించి ఫ్రాడ్ అని తెలిసినవాళ్ళు జాగ్రత్త పడతారు. నాకు కూడా చాలా వస్తాయి. నేను నీకు చెప్పలేదు అంతే! ఈ బలహీనత నుండి బైట పడటం నీ చేతిలోనే వుంది. నేను చెప్పవలసింది చెప్పేను. ఆ తరువాత నీ ఇష్టం” అన్నాడు

 “సరే! ఇంకనుండి భయపడనులే” అని వాడికి చెప్పిందే కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆలోచనలు పరిపరి విధాల పోవడం మాత్రం ఆగలేదు.

***

వైదేహికి క్యాంపస్ ప్లేసెమెంట్స్ మొదలయ్యేయి.

తన ఎగ్జామినేషన్ ఫియర్ తెలిసిన ప్రొఫెసర్ “చూడు వైదేహి! నువ్వు మంచి మెరిట్ స్టూడెంట్‌వి. కానీ అనవసరమైన భయాలతో ఇంటర్వూస్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే మంచి అవకాశాలు పోతాయి. మన కాలేజీకి స్టూడెంట్ కౌన్సిలర్స్ వస్తారు. వాళ్ళు ఎగ్జామినేషన్ స్ట్రాటజీస్ చెబుతారు. తప్పకుండా వాళ్ళను మీట్ అవ్వు” అని చెప్పేడు. కెరీర్‌కి సంబంధించినది కదా అని వెళ్లి కలిసింది. వాళ్ళు “స్టూడెంట్స్‌లో ఇలాంటివి సహజమే! కానీ ఇవి నీ కెరీర్‌కి, ఫ్యూచర్‌కి ప్రతిబంధకం కాకుండా వాటిని అధిగమిస్తే నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. మొదట నువ్వు మైండ్‌ని కామ్‌గా ఉంచుకోవాలి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో కావాలి. నువ్వు పరీక్షకి కానీ, ఇంటర్వ్యూకి కానీ వెళ్ళేటప్పుడు నేను ఉత్సాహంతో వెళుతున్నాను. ఏ ఒత్తిడికీ లోను కావడం లేదు. కృషి చేసేను కాబట్టి తప్పక విజయం సాధిస్తాను అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఇంటర్వ్యూకి వెళుతున్నట్లు కాకుండా నీ స్నేహితులతో సబ్జెక్టు డిస్కస్ చేస్తున్నట్లుగా భావించు. నీకింక భయానికి, అలజడికి ఆస్కారముండదు” అని చెప్పేరు. వింటుంటే మనసు తేలికగా అనిపించి ఈ సారి తప్పక మీరు చెప్పింది ఫాలో అవుతానంది వైదేహి.

***

ఊర్లో కొద్ది రోజులు పాటు ప్రవచనాలు జరుగుతుంటుంటే కామాక్షి అత్తమలతో వెళ్ళింది. ఒక రోజు గురువుగారు “అజ్ఞానికి అడుగడుగునా భయమే. మనిషి అజ్ఞాన తిమిరంలోంచి బైటపడి వెలుగులోకి రావాలంటే అవిద్య అంతరించాలి. అంటే విచక్షణ కలగాలి. అప్పుడు వివేకి అవుతాడు, జ్ఞానిలా మారుతాడు. భయరహితుడు అవుతాడు. అవిద్య అంతరించాలన్నా, విచక్షణ కలగాలన్నా సాధనా బలం అవసరం. ఎవరు ఎంచుకున్న మార్గంలో వారు సాధన చేసి దానిని పొందవచ్చు. కొందరికి సాధనా బలం పెద్ద అవసరం లేకుండానే విచక్షణ కలిగి వుంటారు. వారు పరిస్థుతలకు తల్లడిల్లి పోకుండా ప్రశాంత చిత్తులై సానుకూలంగా పరిష్కరించుకుంటారు” అన్నారు.

ముగ్గురికీ ఒక సారి చెంప చెళ్లు మన్నట్లైంది. ఇంటికి తిరిగి వస్తూ ఆ విషయంపై చర్చించుకోవడం మొదలెట్టేరు. భుజంగరావు గారు “మనమేదో ఆధ్యాత్మికతలో వున్నామనుకుంటున్నాము కానీ ఇంకా అజ్ఞానమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్నామన్నమాట. నేను గునుపుతో పనులు మొదలెట్టినప్పుడు మీరందరూ ఎన్ని సార్లు చెప్పినా అజ్ఞానం అనే చీకటి కమ్మేయడంతో మీ మాటలు నా చెవికెక్కేవి కావు.

ఏమిటో! ఎప్పుడో ఎవరో మా నాన్నని నమ్మించి మోసం చేసేరని, అదే మనసులో ముద్ర పడిపోయి, కొత్తవారిని నమ్మాలంటే ఎదో జంకు. రాముడంతటి వాడు శత్రువు అయిన రావణాసురిడి తమ్ముడు విభీషణుడినే నమ్మి శరణు ఇచ్చేడు కదా! నా లాంటి తోటి మనిషిని నమ్మడానికి నాకు ఈ జంకేమిటి? రామాయణం నిత్యపారాయణ చేస్తూ కూడా గ్రహించుకోలేకపోయేను. ఈ రోజు గురువు గారు నా కళ్లకున్న చీకటి తెరలను తొలగించి వెలుగు చూపించేరు” భావోద్వేగంతో అన్నారు.

“నేను మాత్రం? కాటికి కాలు జాపుకు కూర్చున్న నాకు ఈ ప్రాణాల మీద అంత మమకారం ఏమిటో? భూమి మీద పడేసిన ఆ దేవుడే, నూకలు చెల్లిపోయేక తీసుకెళ్ళిపోతాడన్న ఇంగితం లేకపోయే! ఎంత సేపు ఈ డొల్ల శరీరానికి ఏ రోగాలు పట్టుకుంటాయోననే భయంతోనే గడిపేను” బాధ పడ్డారు మహాలక్ష్మి గారు.

“అత్తయ్య! మీరందరూ భయపడుతుంటే అవి తీర్చడానికి ప్రయత్నించేదాన్ని కానీ నాకు కూడా అర్థం లేని భయాలు ఎన్నో! మీరంతా ఆక్షేపిస్తారని పట్టూతో చెబుతుండేదాన్ని. పాపం వాడు చిన్నవాడైన, నావన్నీ అహేతుకమైన భయాలని, అవి పోగట్టడానికి ఎంతో ప్రయత్నించేవాడు. తాత్కాలికంగా భయం పోయేది కానీ, అజ్ఞానం ఆవహించడంతో వాడి మాటలు పూర్తిగా వంట పట్టించుకోలేకపోయేను. కానీ ఈ రోజు గురువాక్యం నా మీద బలంగా పనిచేసి ఆ దిశగా అలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగా ఆ చీకటి విడివడింది. ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నీ అవగతమవుతాయి. మన భయానికి హేతువు తెలుస్తుంది. విచక్షణతో దానిని అధిగమిస్తే అర్థం లేని, అనవసరపు భయాలకు తావు ఉండదు” అంది. ముగ్గురి మనసులు తేలిక పడ్డాయి.

***

ఒక రోజు విశ్వం ఆఫీస్ నుండి వస్తూ స్వీట్లు పట్టుకొచ్చి అందరికిస్తూ “మీరంతా నన్ను నేను అప్డేట్ చేసుకుంటుంటే రిటైర్ అయిపోయేవాడి కెందుకంత తాపత్రయం అని ఎద్దేవా చేసేరా! ఇవాళ మీటింగ్లో మా బాస్ ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీస్‌తో పదును పెట్టుకుంటున్న నిన్ను కంపెనీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నిన్ను కొనసాగమంటోంది” అని చెప్పేరని ఆనందంగా చెప్పేడు.

“పోనీలే నాయనా! నీ కష్టానికి ఫలితం దక్కింది” అన్నారు పెద్దవాళ్ళు.

భుజంగరావు గారు నిశ్శంకతో, నిస్సంకోచంగా పనులు చేసుకుంటున్నారు.

మహాలక్ష్మి గారు చిన్నా, చితకా అనారోగ్యాలకు బెంబేలెత్తిపోవండంలేదు.

వైదేహికి క్యాంపస్ ప్లేసెమెంట్స్‌లో పెద్ద బహుళ జాతీయ సంస్థలో ఉద్యోగం వచ్చింది.

ఇప్పుడు స్పామ్ మెయిల్స్, ఫ్రాడ్ కాల్స్ వచ్చినా కామాక్షి గాభరా పడిపోవడంలేదు. పట్టూ నుండి ఫోన్ రావడం ఆలస్యం అయినా తల్లడిల్లిపోవడం లేదు.

***

మనం ఏదైనా విషయం గురించి అతిగా అలోచించి, కీడెంచి మేలెంచమన్న రీతిలో, ప్రతికూలంగా ఏవేవో ఊహించుకుని, వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా వుంటాయో ద్రష్ట చేసుకుని, మనసులో ఒక భయానికి అంకురార్పణ చేస్తాం. అది ఒకొక్క సంఘటనకి, సందర్భానికి, మనం చేసే ప్రతికూల ఆలోచనలను బట్టి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంటుంది. అలా మనలో నాటుకున్న భయాన్ని కూకటి వ్రేళ్ళతో సహా పీకి పారేస్తామా? లేదా మహావృక్షంలా పెంచుకు పోతామా అనేది మన చేతుల్లోనే వుంది.

Exit mobile version