[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘భూమాత అప్పు తీర్చేయ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
పచ్చదనం లేకపోతే చచ్చిపోతావ్
కచ్చిగా భూమిని మండిస్తే మాడిపోతావ్
పిచ్చిపట్టునట్లుగా చెట్లను నరుకుతున్నావ్
చిచ్చు పెడుతూ నిన్ను నీవే కాల్చేసుకుంటున్నావ్
భూమికి జబ్బు వస్తే కాపాడేవాడు లేడు
అవనికి అరిష్టం దాపురిస్తే అడ్డుకట్ట లేనే లేదు.
ఇప్పటికైనా మేలుకుని కర్తవ్యం నిర్వహించు
కాలి కింద నేల కదా అని చులకన చేయకు
కాలిపోక ముందే పుడమిని కాపాడుకోవాలి
ఒక్కసారి అటు వైపు చూడు
చెట్టు నరికితే భూమి ఉసురు పోతుంది
పారే నదిలో కాలకూట కాలుష్యం
అది నది దేహాన్ని చేస్తోంది నాశనం
ప్లాస్టిక్ తెచ్చి భూమికి కప్పేస్తున్నావు
పాపం అమాయక భూమి తల్లి
కళ్ళలో కన్నీళ్ళు ఎపుడైనా చూశావా
ప్రకృతి ఎవరి సొంతం కాదని తెలుసుకో
తీసుకున్న దానికి ఇంతకు ఇంతా
భూమికి తిరిగి ఇచ్చి రక్షించుకో
నీ ఊపిరి అయినా ఇచ్చేసి
భూమాత అప్పు తీర్చేసేయ్
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
