అధ్యాయం 41: చీకట్లో సుదూర ప్రయాణం
చల్లగా ఉంది. బాగా చల్లగా ఉన్నట్టు అనిపించింది. తర్వాత నన్ను గాలిలో రవాణా చేస్తున్నటు అనిపించింది. నేను అంతరిక్షంలో తేలుతున్నట్టు తోచింది. చాలా సేపటి నుంచి తల తిరుగుతున్నట్టు, తలనొప్పిగా ఉన్నట్టు అనిపిస్తోంది. మెల్లిగా కళ్ళు తెరిచాను. చూస్తే నేనొక గాజు పేటికలో ఉన్నాను. కొన్ని క్షణాల తర్వాత పేటిక తెరుచుకుంది, రెండు తెల్లని ఆకారాలు వచ్చి నా ముందు నిలబడ్డాయి. ఆసుపత్రులలో సిబ్బంది వేసుకునే ఆకుపచ్చ దుస్తుల్లాంటి దుస్తులతో తమ శరీరాలని పూర్తిగా కప్పుకున్నాయా ఆకారాలు.
నా ముంజేతికి రెండుసార్లు ఏదో సూదిమందు ఇచ్చారు. చల్లని గాలి ప్రవేశించినట్లయింది.
అప్పుడే పేటిక తలుపు మూతపడింది.
నేను మరొక ప్రపంచానికి ఎగిరిపోతున్నాను. నేను నిద్రపోతున్నాను. నాకు ఆమ్రపాలి కనబడుతోంది, మర్రి చెట్టు, కొండపై ఉన్న ఆలయం, సిగలో మందార పువ్వులతో ప్రకృతి, ఉన్నట్టుండి నల్లటి దుస్తులు ధరించిన పొడవైన అస్థిపంజరాలు ఎదురై వింతైన భాషలో మంత్రాలు ఉచ్చరించడం…
సుమారు కొన్ని గంటలపాటు కలత నమేము ఇదంతా నేను మునుపెన్నడు అనుభవించనిది. నేను పూర్తిగా నిద్రలోకి జారిపోయాను.
***
గాఢనిద్రలో ఉన్నప్పుడు కథ చెప్పడం చాలా కష్టం.
గ్రహాంతర తాంత్రికుల వింత మంత్రోచ్చారణ వినిపిస్తుండగా నాకు స్పృహ వచ్చింది.
వారు మంత్రాలను పఠిస్తున్నారు, గట్టిగా ఉచ్చరిస్తున్నారు. మంత్రోచ్చారణ మొదట నెమ్మదిగా, గొణుగుడులా వినబడింది… కానీ క్రమక్రమంగా తీవ్రత పెరిగింది. భీకరమైన భరించలేని ధ్వనితో నా చెవులు బద్దలయ్యాయి!
నేను కళ్ళు తెరవాల్సి వచ్చింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ తెరిచాను. ఆపై పూర్తిగా స్పృహలోకి వచ్చాను.
అందరూ ఎక్కడ ఉన్నారు? ప్రియాతి ప్రియమైన నా జీవిత భాగస్వామి ప్రకృతి, ఇంకా నా లోహ మిత్రుడు యురేకస్ ఎక్కడ?
నా ముందు, వెనుక, పక్కల… అంతా గాజే. నా చుట్టూ తెల్లని మంచు బిందువులు ఉన్నాయి. విపరీతమైన చలిని అనుభవిస్తున్నాను.
నా శరీరాన్ని చూస్తే – బిగుతుగా ఉన్న బూడిద రంగు సింథటిక్ సూట్లు నా శరీరాన్ని అతుక్కుని ఉన్నాయి. నా ఛాతిపై వైర్లు ఉన్నాయి, చేతికి ఐవి సూదులు ఉన్నాయి, ఆహారం కోసం నోట్లో ఒక గొట్టం, మూత్రం కోసం ఇంకో ట్యూబ్ ఉన్నాయి. నేను అద్దాల గుండా చూచినప్పుడు – నీలం గోడలు మరియు తెల్లటి పైకప్పు ఉన్న ఓ కారిడార్లో మరికొన్ని వరుసగా కనబడ్డాయి.
ఏడు అడుగుల పొడవైన ఎత్తైన గాజుపేటికలు.
నాకిప్పుడు ఇదంతా అర్థమైంది. తెల్లరంగు కోట్లు, మాస్క్‌లు ధరించిన ఇద్దరు పురుషులు, తెల్లటి యూనిఫాం వేసుకున్న ఒక నర్సు మందుల ట్రాలీతో గదిలోకి ప్రవేశించి నా దగ్గరకు వచ్చారు.
గాజు పేటిక తలుపు తెరిచారు. తెల్లని మంచు బిందువులతో కూడిన చల్లని ఆవిరి గాజుపేటిక నుంచి బయటకు పోయింది.
“హాయ్! హనీ! స్వాగతం! ఎలా ఉన్నారు? నిజానికి మీరు బావున్నారు. మీ ఆయువుపట్లన్నీ అంటే నాడి రక్తపోటు లాంటి వైటల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు, దయచేసి నెమ్మదిగా బయటకు అడుగు పెట్టండి!!!.”
ఒక నర్సు నా శరీరం నుండి గొట్టాలను వేగంగా తొలగిస్తోంది.
గడ్డ కట్టిన టర్కీ కోడి ని రిఫ్రిజిరేటర్ నుండి బయటకు తీస్తున్నట్లుగా అనిపించింది.
నెమ్మదిగా బయటకి వచ్చాను. మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పుడు నా గొంతు మెటల్ రోడ్డు మీద తుప్పు పట్టిన ఇనుము చక్రం వెళ్తే ఎలాంటి ధ్వని వస్తుందో… అలా ముతకగా పలికింది.
“నేను ఎక్కడ ఉన్నాను! ఏం జరిగింది? నేను స్తంభింపబడ్డానా? “
“నువ్వు సరిగ్గా ఊహిస్తున్నావు! సూదూర ప్రయాణం కాబట్టి మిమ్మల్ని ఘనీభవింపజేశాం! తద్వారా నీ జీవక్రియలు మందగించడంతో పాటు ఆహారం, ఆక్సిజన్ అవసరాలు చాలా తక్కువగా ఉంటాయి… అసలు ఉండవు కూడా. క్యాసిని స్పేస్ ప్లాట్‌ఫామ్ నుంచి సుదీర్ఘంగా ప్రయాణించాం. దాదాపు 10 సంవత్సరాలు. ఆల్ఫా సెంటారి వ్యవస్థలోని మా కెప్లర్ గ్రహానికి చేరడానికి చాలాకాలం ప్రయాణించాలి.”
వాస్తవం గ్రహించి విస్తుపోయాను.
సుదూరాలలోని డీప్ స్పేస్ ట్రావెల్ కోసం ఐస్ చాంబర్‌లో నిద్రాణస్థితికి చేర్చి తీసుకువెళ్ళడం ఇప్పుడు ఆమోదనీయమైన విధానమే.
“ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం?”
“హా! హా! హనీ!” అంటూ గట్టిగా నవ్వారు అప్పుడే లోపలికి ప్రవేశించిన అస్థిపంజరాల్లాంటి ముగ్గురు మాంత్రికులు.
వాళ్ళు కూడా ఇప్పటికీ తెల్ల మంచు ఆవిరిని వెలువరిస్తున్నారు.
“మానవా! తప్పుగా అర్థం చేసుకోకు! మేము మా ప్రాంతానికి తిరిగి వెడుతున్నాం. ఆల్ఫా సెంటారీలోని కెప్లర్‌కి 5 కాంతి సంవత్సరాల దూరం, అంతే. కాబట్టి మేం సమూరాకి ఏదో చిన్న సాయం చేస్తున్నాం” అన్నారు.
“నేను ఎక్కడ…. ఎక్కడ… నేను?” అరిచాను. “నా జట్టులోని మిగతావాళ్ళంతా ఎక్కడ ఉన్నారు?”
అస్థిపంజర మాంత్రికుల నాయకుడు (నాకు అతని పేరు తెలియదు) ఇలా అన్నాడు:
“హనీ! మీరు ఆల్ఫా వ్యవస్థలో లేరు. మీరు అక్కడికి రాలేరు. ఇది సౌర వ్యవస్థ యొక్క వెలుపలి అంచులో ఉన్న క్యూపర్ బెల్టు. మనం సమూరా యొక్క చివరి అధికారం కేంద్రానికి సమీపిస్తున్నాం… నెప్ట్యూన్ – ప్లూటో ప్రాంతం! ఇక్కడ ఓ చిన్న స్పేస్ ప్లాట్‌ఫామ్ ఉంది. మేము నీ నుంచి ఓ చిన్న సాయం కోరుతున్నాం. హా! హా! ఎంపికైన వ్యక్తివి కదా! ఆ చివరి అద్భుత వస్తువు ఎక్కడు ఉందో గుర్తించు!”
నేను ఆశ్చర్యంతో మూగపోయాను.
క్యూపర్ బెల్ట్! ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్… వంటి అనేక మరుగుజ్జు గ్రహాలతో… సౌర వ్యవస్థ యొక్క వెలుపలి అంచు.
“వాస్తవానికి మనం నెప్ట్యూన్ – ప్లూటో ప్లాట్‌ఫామ్‌పై ఆగిపోతాం. చివరిది, అత్యంత శక్తివంతమైన ఆ అద్భుత వస్తువు కోసం ఉపగ్రహాలను వెతుకుతాం. సమూరా కోసం ఏడవ అద్భుత వస్తువు.. “
దేవుడా. నేను ఆశ్చర్యపోయాను. “ట్రైటాన్” అని అరిచాను.
“ట్రైటాన్?”
అధ్యాయం 42: క్యూపర్ బెల్ట్, ట్రైటాన్
నెప్ట్యూన్ నుంచి చూస్తే బాహ్య సౌర వ్యవస్థ సూర్యుడి నుండి 50 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో మొదలవుతుంది. యురేనస్, నెప్ట్యూన్ మరియు మరుగుజ్జు గ్రహం ప్లూటో… ఇంకా చిన్న తేలియాడే ఖగోళ వస్తువులు చాలా ఉన్నాయి. నెప్ట్యూన్‌కే చాలా, దాదాపు 27 ఉపగ్రహాలున్నాయి. సూర్యుని నుండి ఇవి ఎంత దూరంలో ఉన్నాయంటే… సూర్యుడి చుట్టూ తిరగడానికి వీటికి 60-75 సంవత్సరాల సుదీర్ఘ కాలం పడుతుంది. ఒకసారి క్యూపర్ బెల్ట్‌ను దాటితే… మరొక నక్షత్ర వ్యవస్థలో… బహుశా ఆల్ఫా సెంటారీలోకో, 5 లేక 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బైనరీ నక్షత్రాల వద్దకో వెళతాం.
నెప్ట్యూన్-ప్లూటో స్పేస్ ప్లాట్‌ఫాం చిన్నది. మేము అంతరిక్ష నౌకలో మా నిద్రాణస్థితి నుండి బయటపడ్డాకా, నెమ్మదిగా స్పేస్ ప్లాట్‌ఫాంపై దిగాం. ఆల్ఫా సెంటారీ యొక్క అస్థిపంజర తాంత్రికులు క్రూరులు కానప్పటికీ… స్థిరంగా ఉన్నారు.
“మేము కెప్లర్‍లోని మా ఇళ్ళకి చేరాలి. ఓ టేకియన్ షిప్‌ని పట్టుకోవాలి – తద్వారా మేము హైపర్ స్పేస్‌లో ప్రయాణం చేయవచ్చు. మీ వెర్రి అద్భుత వస్తువుని నువ్వు గుర్తించేవరకూ మేము వేచి ఉండలేం. కానీ నువ్వా పని చేసి తీరాలి, భూమికి తిరిగి వెళ్ళి దాన్ని సమూరాకి లేదా అతని కుమార్తెకి ఇవ్వాలి! అర్థమైందా! ఇక వీళ్ళిద్దరూ…” అంటూ ఆఫ్రికన్ల మాదిరిగా కనబడుతున్న ఇద్దరు నల్లటి, పొడవైన తాంత్రికులను చూపించారు.
“ముగుంబ, బెనోత్‌మనే… వీళ్ళు మిమ్మల్ని కాపాడతారు, మీరు పారిపోకుండా అడ్డుకుంటారు. మీరు స్పేస్ షటిల్‌లో వెళ్ళి ట్రైటాన్ మీద దిగండి. ఆ అద్భుత వస్తువుని గుర్తించడానికి ప్రయత్నించండి. సమురా కోరుకునేది దొరికే సంభావ్యత ఉన్న నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహం ఇది!”
“భూమికా?” అరిచాను. “సమూరా భూమి మీద ఏం చేస్తున్నాడు?”
వారు కొన్ని నిమిషాల పాటు నవ్వారు.
“అంతా అయిపోయింది హనీ! నెప్ట్యూన్‍కి మీ 15 సంవత్సరాల ప్రయాణంలో – సౌర వ్యవస్థని సమూరా పూర్తిగా జయించాడు. ఇప్పుడు సౌర వ్యవస్థ యొక్క గ్రహ కాలనీలన్నింటికి సమూరా చక్రవర్తి. అతను కుజుడిని జయించాడు. సౌరవ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన గ్రహాలైన భూమి, కుజుడు మధ్య తిరుగుతూ, అతనీ వ్యవస్థలను నియంత్రిస్తున్నాడు. వాస్తవానికి భూమిపైనా, కుజుడి మీద ఇంకా మానవులచే తరచుగా గెరిల్లా దాడులు కొనసాగుతున్నాయి, ఇప్పటికీ వ్యతిరేకత ఉంది, కానీ వాళ్ళని త్వరలో లోబరుచుకుంటాడు. ఇటువంటివన్నీ వెంటనే పూర్తిగా నియంత్రించబడతాయి. చివరి అద్భుత వస్తువుతో వాటిని పూర్తిగా అధిగమించడానికి నువ్వు సహాయం చేస్తావు” అన్నారు.
“అయ్యో. కుదరదు!” అని అరిచాను. నాతో పాటే స్పేస్ ప్లాట్‌ఫామ్‌పై దిగిన ప్రకృతి, డిమిట్రీ, ఏనిమోయిడ్ కూడా అరిచారు.
“వేరే మార్గం లేదు! హనీ! ఇది విధి! నువ్వు… నీలాంటి చాలా మంది ఎంపికైన వ్యక్తులతో వారికి సహాయం చేసి వాళ్ళిలా చేయడానికి మీరే దోహదపడ్డారు.
ఇక మేము బయలుదేరుతాం. ముగుంబ, బెనోత్‌మనే మీ వెంట ఉంటారు. సూర్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు! మేము వెళ్తున్నాం. ఆ వస్తువుని గుర్తించడాని గట్టిగా ప్రయత్నించండి! నీకు సమూరా నుండి పతకం, స్వేచ్ఛ లభిస్తాయి!”
అత్యంత శీతలంగా ఉన్న ఆ భయంకరమైననిశీధిలో స్పేస్ ప్లాట్‌ఫాంపై ఉన్న మరికొందరు అస్థిపంజర ఆకృతులతో కలిసిపోయారు వాళ్ళు.
గోడపై గడియారం నెప్ట్యూన్ సమయం ప్రకారం 6.30 గంటలు సూచిస్తోంది. బయటి ఉష్ణోగ్రత -220 డిగ్రీల సెల్సియస్, స్పేస్ ప్లాట్‌ఫాం లోప్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు చూపిస్తోంది.
నేను ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, నల్లటి తాంత్రికులు ఇద్దరూ నన్ను ముందుకు తోశారు. “ఓ మానవా నడు! త్వరగా… మనం బయల్దేరాల్సిన సమయం వచ్చింది! మూడవ నెంబర్ గేట్ వైపు పద!” అన్నారు.
ఆ విధంగా మేము… భూమి నుంచి నమ్మశక్యం కాని దూరంలో ఉన్న ట్రైటాన్‌పై శీతల నిశీధిలో ముందుకు నడిచాం.
అధ్యాయం 43: నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రైటాన్
ఇది నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం, కానీ భూమి ఉపగ్రహం చంద్రుని కంటే చిన్నది. -270 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో చాలా చల్లగా ఉంటుంది. ఇది దాని మాతృ గ్రహం నెప్ట్యూన్ కక్ష్యకి వక్రగతిలో పరిభ్రమిస్తుంది. ఇది సుమారుగా 2700 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. క్యూపర్ బెల్ట్ యొక్క అనావాస ప్రాంతంలో ఎవరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు.
క్యూపర్ బెల్ట్‌కి ఈ పేరెందుకొచ్చిందంటే, క్యూపర్ అనే వ్యోమగామి 20వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో అనేక గ్రహాలను, గ్రహాల వంటి అనేక ఖగోళ వస్తువులను కనుగొన్నారు. ఇది తోకచుక్కల జన్మస్థలం. ఇది నెమ్మదిగా కదిలే చల్లని గ్రహాలుండే ప్రాంతం. కానీ వీటిలో భారీగా ఖనిజ సంపద ఉంది. సౌరవ్యవస్థకి చివరి పాయింట్‌గానూ, ఆల్ఫా సెంటారీ వ్యవస్థ ప్రవేశద్వారంగానూ ఉంటుందీ బెల్ట్.
భయంకరమైన నల్లటి ఆఫ్రికన్ తాంత్రికులు మమ్మల్నే గమనిస్తున్నందువల్ల మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు.
ముగంబ మధ్యమ స్వరంలో అన్నాడు “హనీ! నీ బాధ్యతలలో ఇదే చివరిది. ఎటువంటి పన్నాగాలు వద్దు! మేమిద్దరం 10,000 నక్షత్ర స్థాయి ఉన్న తాంత్రికులుం అని తెలుసుకోండి. మేము మీ అందరిని ఒక చూపులో చంపుతాము. కాబట్టి మీకేం చెప్పారో దాన్ని అనుసరించండి…!”
మేము ఒకరినొకరం చూసుకున్నాము. అదొక బుకాయింపని నాకు తెలుసు. కానీ వాళ్ళేం కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. ప్రకృతితో టెలిపతీ ద్వారా మాట్లాడవచ్చునని నాకు తెలుసు. కానీ టెలిపతీని కూడా ట్యాపింగ్ చేయవచ్చేమో నాకు తెలియదు. డిమిట్రీ, ఏనిమోయిడ్ పోరాడగలరని; యురేకస్ దాని విద్యుత్ చార్జ్ అయిపోయినట్లయితే ఒక గంట సేపు సాయుధ పోరాటం చేయగల సామర్ధ్యం కలిగి ఉందని నాకు తెలుసు.
కానీ నేను ఓ నిర్ణయం తీసేసుకున్నాను.
ఈ అద్భుత వస్తువును నేను వాళ్ళకి అప్పగించను.
మేము తప్పించుకోవాలి. పారిపోవాలి. భూమి గురించి, దాని పోరాటం గురించి తెలుసుకోవాలి.
మూడవ గేట్ వద్ద స్పేస్ షటిల్ కోసం మేము వేచి ఉన్నాం. “కొద్దిసేపు టివి చూసో, లేదా వార్త పత్రికలు చదివో… గడచిన 10 ఏళ్లలో ఏమి జరిగిందో తెలుసుకోవచ్చా?” అని ముగంబను అడిగాను.
ఆ స్పేస్ ప్లాట్‌ఫామ్ నిర్జనంగా, చీకటిగా ఉంది. ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా కొన్ని దీపాలు వెలుగుతున్నాయి.
“మీరు ఆ వార్తలను తట్టుకోలేరని నా భయం. అదంతా యుద్ధం, ఆక్రమణల పెద్ద కథ. భూమి ఓడిపోయింది. రెడ్ ప్లెయిన్స్ మాత్రమే ఇంకా ఓడిపోలేదు. ఇంకా కుజుడి మీదున్న మానవ కాలనీని మాత్రమే సమూరా ఆక్రమించుకోవలసి ఉంది. మీ గ్రహం, మీ జోన్‌లోని సంభవించిన మార్పులు తెలుసుకుంటే నివ్వెరపోతారు… వాటి గురించి తర్వాత! ప్రస్తుతం పని చూడు!”
ఈ మాటలు వినగానే మనసు మొద్దుబారిపోయింది. “ఓ ముగంబ! మా టైటాన్ ఎలా ఉంది? నా తండ్రి, నా సోదరుడు ఎలా ఉన్నారు?” వేదనకు గురైన డిమిట్రీ అడిగింది.
బెనోత్‌మన్ నవ్వాడు. “డిమిట్రీ, టైటాన్ మాంత్రికుల పాలనలో సురక్షితంగా ఉంది. పొసయిడన్, జూలియస్ సజీవంగా ఉన్నారు. మిమ్మల్ని, వైద్య బృందాన్ని పర్యవేక్షించాలి కాబట్టి మేము ప్రయాణ సమయంలో సుప్తావస్థలో లేము. మేము ఎప్పటికప్పుడు వార్తలను చూస్తున్నాము. పొసయిడన్ తిరుగుబాటు చేశాడు, జూలియస్ వారి కోసం పనిచేయడానికి సహకరించలేదు. కాబట్టి… “
“అయ్యో! శని దేవుడా!” అంటూ విలపించింది డిమిట్రీ. “అవును… వాళ్ళెపుడూ దుష్టుల కోసం పని చేయరని నాకు తెలుసు” అంది.
“డిమిట్రీ! ఈ ప్రపంచం తాంత్రికులచే పాలించబడుతోంది. మీ తండ్రి మరియు సోదరుడు మాంత్రికులే కదా! వాళ్ళెందుకు చక్రవర్తి కోసం పని చేయరు? సహకరించకపోవడంలో అర్థం లేదు. అందుకే వారు జైలులో ఉన్నారు. కానీ సజీవంగా, సురక్షితంగా ఉన్నారు!”
ఏనిమాయిడ్ గుర్రుమన్నాడు… “గనీమీడ్‌లో కూడా మాంత్రిక చక్రవర్తి గొప్ప పాలన సాగుతోంది. జంతు-మానవ తాంత్రికులందరూ ఉన్నత స్థానాలలో ఉన్నారు. పాలక వర్గంలో ఉన్నారు. ఇకపై హింసించబడడం లేదా అణగదొక్కబడడం జరగదు!”
ఇప్పుడు ప్రకృతి మొదలుపెట్టింది, “మాస్టర్! దయచేసి చెప్పండి! నా తండ్రి గురించి, మా గ్రామం గురించి చెప్పండి! దయచేసి!”
“క్షమించు, నాకు తెలియదు. ముఖ్యంగా భూమి యొక్క సదరన్ జోన్‌లోని గ్రామీణ ప్రాంతాల గురించి ఏ వార్తలు లేవు.”
“నాన్న క్షేమంగా ఉన్నారా? ఆమ్రపాలి సురక్షితమేనా…? “
ట్రైటాన్‌కి వెళ్ళే స్పేస్ షటిల్ బోర్డింగ్ గురించి… ఒక వింత భాషలోనూ, యూనివర్సల్ డిజిటల్ లాంగ్వేజ్‌లోనూ ప్రకటన వెలువడింది.
“కదలండి! నడవండి” అంటూ అరిచాడు ముగంబ. అతని చల్లని చూపు నా చర్మాన్ని కాల్చినంత పని చేసింది. ఇతరులకి కూడా ఇదే అనుభవమై ఉంటుంది.
బెనోత్‌మన్ వార్తాలు ఆసక్తిగా చదువుతాడని తెలుస్తోంది. పైగా అతను తన పాత్ర పట్ల సంతోషంగా ఉన్నట్టు తోస్తోంది.
ఒకప్పుడు మధ్య ఆసియా, దక్షిణాసియా, భారతదేశం అయిన దక్షిణార్థ గోళం – సమూరాకు విధేయత చూపించిన మాంత్రిక శాఖకు చెందిన “అఘోరి మాంత్రిక్ మండల్” పాలనలో ఉన్నాయి.
వాళ్ళకి సమూరా అవన్నీ ఇచ్చేశాడు. ఉత్తరార్థ గోళంలోని న్యూ హోప్ సిటీ, ఇంకా ఒకనాటి అమెరికా మరియు కెనడా భాగాలు; ఉత్తర ఐరోపాలోని కొన్ని భాగాలు; ఒకనాటి యునైటెడ్ కింగ్‌డమ్ మాత్రం కుజగ్రహ మాంత్రిక చక్రవర్తి సమూరా యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నాయి. ఇప్పుడు అతను న్యూ హోప్ సిటీలోనూ చంద్రుడిపై అమృతా కాలనీలోనూ మూడేసి నెలలు; ఆరు నెలలు కుజుడిపైనా నివసిస్తున్నాడు. ఇదంతా కుజుడి కాలమానం ప్రకారం! ఎందుకంటే అతను ప్రధానంగా మార్షియన్ కాబట్టి!
ఆక్సీజన్, ఆహారం ఉన్న బ్యాక్‌ప్యాక్ వీపుకి తగిలించుకుని, తలకి భారీ మాస్క్ ధరించి నడుస్తూ, అడిగాను – “సయోనీ… ఎలా ఉంది? బాగుందా?”
వెనక్కి తిరిగి ఉన్న తలలో ఎవరైనా 10 సంవత్సరాలు ఎలా జీవిస్తారనేది నా అనుమానం.
ముగంబ గర్జించాడు
“నడు!”
ఈ విషయంలో ఇక సమాచారం రాదని అర్థమైంది.
“ఓయ్ మానవ పంది! నడు! మా యువరాణి గురించి నీకెందుకు? నువ్వు ఆమె సేవకుడివి అంతే. నడు! చేయవలసిన పని చాలా ఉంది!”
మేమంతా అంతరిక్షంలో ప్రయాణించాం. ఎనిమిది గంటల తర్వాత ఇమ్మిగ్రేషన్ భద్రతా సిబ్బంది కాకుండా అతికొద్ది మంది ఇతర సిబ్బందితో, దట్టమైన చీకటి, శీతలమైన ట్రైటాన్ స్పేస్ ప్లాట్‌ఫాంపై దిగాం. ట్రైటాన్ కూడా దట్టమైన మంచుతో నిండి అంటార్కిటికాని పోలి ఉంది. బాగా శిథిలమైన, చాలా బలహీనంగా వేలాడుతున్న సైన్ బోర్డు ఒకటి దర్శనమిచ్చింది.
“ట్రైటాన్ యొక్క భూగర్భ మిలటరీ కేంద్రానికి స్వాగతం – మహాప్రభువు, అంగారక గ్రహానికి చెందిన సమూరా చక్రవర్తి సామ్రాజ్యంలోని రక్షణ మంత్రిత్వశాఖ” అని రాసుంది దాని మీద.
అధ్యాయం 44: మంచు అడుగున
“అప్పుడే ట్రైటాన్ కూడా సమూరా పాలనలోకొచ్చేసిందా?” నేను ఆశ్చర్యపోయాను.
“నువ్వో మూర్ఖుడివి!” అన్నాడు ముగంబ నా భుజం మీద చెయ్యేసి ముందుకు తోస్తూ.
“సౌర వ్యవస్థ యొక్క గ్రహలన్నీ, ఇంకా రక్షణ వ్యవస్థలు, గ్రహాల స్పేస్‌డ్రోమ్స్, నిఘా వ్యవస్థలు ఇప్పుడు మహాప్రభువు సమూరా అధికారంలో ఉన్నాయి. కానీ ఇంకా ఆఖరి వస్తువు ఇప్పటివరకు కనుగొనబడలేదు. చాలామంది ఎంపికైన వ్యక్తులు దానిని వెతకటానికి నియమించబడ్డారు. ఇప్పుడిది తాంత్రికుల ప్రాంతం! సర్వవ్యాపకమైన విశ్వశక్తిని ప్రయోగించగల శక్తి నీకున్నందుకు ఆనందంగా లేదా?”
అతని కేసి సూటిగా చూశాను. నన్ను నేను నియంత్రించుకుని ఉండకపోతే నా చూపు అతనిని కాల్చేసేదే!
అలా చేయడానికింకా సమయం ఉంది. “చాలామంది ఎంపికైన వ్యక్తులా? అంటే…?” అని అడిగాను.
డిమిట్రీ కిసుక్కుమని నవ్వింది. “అంటే… నువ్వు ఒక్కడివే కాదు అని! అదొక పెద్ద బుకాయింపు అని అర్థం” అంది.
“మానవులనూ, మాంత్రికులను నువ్వు మాత్రమే రక్షించగలననుకోడం నీ మూర్ఖత్వం. 50 లేదా అంతకంటే ఎక్కువ క్రోమోజోములు మరియు జన్యు ఉత్పరివర్తనలు కలిగి ఉన్న డజన్ల కొద్దీ మానవులు హ్యుమనాయిడ్లు ఈ సౌరవ్యవస్థ అంతటా జన్మించారు. ఈ ఉత్పరివర్తనల వల్ల వాళ్ళు – వస్తువులను చూస్తారు, శబ్దాలు వింటారు, గాల్లో ఎగురుతారు… ఒకటేంటి.. ఏవైనా చేయగలరు. ఒక పక్షిలా, ఏనుగులా, ఇంకా డైనోసార్‌లా కూడా మారగలరు. నువ్వు కూడా జన్యుపరివర్తన చేయబడినవాడివి అంతే! ఉత్పరివర్తులకు జన్మించిన ఉత్పరివర్తివి నువ్వు. కొద్దిగా దూరదృష్టి మరియు కొన్ని అద్భుత శక్తులున్నాయి. కీలక సూచనలు చేసే మెదడు…!”
“ఇక అద్భుత వస్తువులు! అవి పుష్కలంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్, అద్భుత వస్తువులు గుర్తించేందుకు, సమూరాకి ఇచ్చేందుకు అందరూ ప్రయత్నించారు. ఆ వస్తువులతో అతను గెలిచాడు. ఆయన పాలిస్తాడు. చివరి… వస్తువు… అది నిజంగా చివరి అద్భుత వస్తువు అయితే.. దాన్ని నువ్వు సాధించి అతనికిచ్చేస్తే, నిన్ను మీ ఊరికి పంపించేస్తాడు. నీకు ఉద్యోగం… సైన్యంలో లేదా మీ సొంత విశ్వవిద్యాలయంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.”
బెనోత్‍మన్, ముగంబ ఇద్దరూ కిసుక్కున నవ్వారు.
“నీ గురించి మాకు తగినంతగా వివరించారు. నీ బలాలు మరియు బలహీనతలు అన్నీ మాకు తెలుసు. అవును, మీ ఇండికా సెంట్రల్ ఇంకా ఉంది. నువ్వు మీ శాన్ స్థానంలో డిపార్ట్‌మెంట్ హెడ్ అవుతావు. పాపం శాన్, అతను యుద్ధంలో చనిపోయాడు!”
నేను నివ్వెరపోయాను. నోట మాట రాలేదు. “మా హెచ్.ఓ.డి. శాన్‌కి… ఏమైంది?”
“ఓరి మూర్ఖుడా! భూమి ఆక్రమించబడింది, విశ్వవిద్యాలయాలను శాంతియుతంగా స్వాధీనం చేసుకోబడ్డాయి. కానీ కొంతమంది ప్రతిఘటించారు, మరణించారు. అవును, యూనివర్సిటీల్లో వాళ్ళిప్పుడు 50 క్రోమోజోమ్‌లతో ఉత్పరివర్తులను తయారు చేస్తున్నారు. నీలా శక్తులుండే చాలామందిని తయారుచేస్తున్నారు. వాళ్ళంతా చక్రవర్తికి విధేయతతో ఉంటారు! హా! హా! హ!”
ప్రపంచం, కాదు, ప్రపంచాలు మారాయి. వాళ్ళు ఇప్పుడు మాంత్రికుల పాలనలో ఉన్నారు.
ప్రకృతి నా భుజంపై చేయి వేసింది.
“హనీ! నడు! ఇప్పుడు చేయాల్సిన పని గురించి ఆలోచించు. శాన్ గారి గురించి నేనూ విచారంగా ఉన్నాను!” అంది.
మాకు బరువైన థర్మల్ స్యూట్స్ ఇచ్చారు. ఆక్సీజన్ మాస్క్‌లు ధరించి, వీపున ఆహారం, ఆక్సీజన్ ఉన్న బ్యాక్‌ప్యాక్‍లు వేసుకుని మేం సిద్ధమయ్యాము. ఈ థర్మల్ స్యూట్లు ట్రైటన్ యొక్క -270 డిగ్రీల సెల్సియస్ యొక్క తీవ్రమైన చలి నుండి మమ్మల్ని కాపాడుతాయి.
“ప్రవేశ ద్వారం, ఆర్చ్ వైపు పదండి!” ముగంబ ఆదేశించాడు.
భూగర్భంలో కిందకి, బాగా కిందకి దారితీసే మెట్లున్నాయి, వాటిపై మంచు పేరుకొని ఉంది. మేము దాదాపు వెయ్యి మెట్లు దిగాం. “ఇది ట్రైటన్‌లో రాత్రి సమయం. పైగా ఇక్కడ రాత్రి చాలా సుదీర్ఘం. సూర్యుడికి చాలా దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్కలేటర్లకు ఎటువంటి విద్యుచ్ఛక్తి సరఫారా లేదు. అలాగే మిలటరీ కేంద్రాలలో కూడా సిబ్బంది కాస్త విధులను తక్కువగా నిర్వహిస్తున్నారు, సౌరశక్తి లభించక కొద్దిగా పనిచేయదు” చెప్పాడు ముగంబ. అతనికి ఇక్కడంతా బాగా తెలిసినట్లుంది.
ఉన్నట్లుండి మెట్లు ఓ విశాలమైన వసారాలోకి దారితీశాయి, తర్వాత అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మేము పెద్ద హాల్లోకి వెళ్ళాము.
ఈ ప్రాంతం నీలంరంగు దీపాలతో ప్రకాశవంతంగా, వెచ్చని ఉంది. మానిటర్లు, స్విచ్‌లు, వెలిగే లైట్లు, వివిధ గ్రహాల సమయాలు సూచించే గడియారాలు ఉన్నాయి. యూనిఫాంలు ధరించిన కొందరు నిశ్శబ్దంగా మానిటర్లను గమనిస్తారు. అక్కడ అనేక ప్యానెల్లు ఉన్నాయి. గోడపై ఒక పెద్ద తెర వాతావరణ పరిస్థితుల నివేదికతో ట్రైటాన్ యొక్క నీలిరంగు వెలుపలి దృశ్యాలను చూపించింది. ఉష్ణోగ్రత -370 డిగ్రీల సెల్సియస్, మంచుతో నిండిన మేఘాలు; గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు.
నేను ఆ మొత్తం రక్షణ వ్యవస్థను పరిశీలించాను. ఎక్కడా నాకు ఏ అద్భుత వస్తువు కనిపించలేదు. గుప్తంగా ఉంచిన అద్భుత వస్తువులను కనుగొనడం అంత సులభం కాదని నేను గుర్తు చేసుకున్నాను.
ముగంబ, బెనోత్‌మన్ మాకు రక్షణ కేంద్రానికి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కి పరిచయం చేశారు, తొంభై ఏళ్ల వయస్సులో ఉన్న పొడవైన వ్యక్తి అతను. వేలాడుతున్న తెల్లటి గడ్డంతో ఆలీవ్ ఆకుపచ్చ సైనిక దుస్తులతో ఉన్నాడతను.
“నా పేరు డేవిడ్, మిలిటరీ జనరల్‌ని, మీలానే ఓ మాంత్రికుడిని. సమూరాకి వందనం! మనమంతా ఇప్పుడు సమూరా సేవలో ఉన్నాము. రండి! నేను మీ గదులను చూపిస్తాను!” అన్నాడు.
ఈ విధంగా సైనికులు చూపించిన సౌకర్యవంతమైన గదులలో ట్రైటాన్‌పై మా తాత్కాలిక నివాసము ప్రారంభమైంది.
“మీకు కావల్సినంత సమయం తీసుకోండి హనీ! మీ భార్య దాన్ని గుర్తించవచ్చు లేదా డిమిట్రీ కనుగొనవచ్చు, కానీ మీరు దానిని గుర్తించాలి” అన్నారు మా రక్షకులు మగుంబ, బెనోత్‌మన్. “మేము వేచి ఉంటాము, కాని సుదీర్ఘకాలం మాత్రం కాదు. మేము కూడా మా స్వంత వ్యవస్థకు వెళ్ళవలసి వుంటుంది!”
మా గదుల్లోకి వెళ్ళగానే మేం చేసిన మొదటిపని వెచ్చని నీటితో హాయిగా స్నానం చేయడం! నిలవ చేసిన సౌర శక్తి ఈ కేంద్రానికి విద్యుచ్ఛక్తిని, కాంతిని అందజేయడానికి ఉపయోగించబడుతుంది. బ్రౌన్ బ్రెడ్, మాంసం, ఘనీభవించిన పండ్లు మరియు రసాల వంటి భూమికి చెందని, కొన్ని మంచి ఆహార పదార్థాలని వడ్డించారు.
మేము నిద్రపోయే ముందు ప్రకృతిని హత్తుకుని, పెదవులపై ముద్దాడాను.
“ఇది చాలా సుదీర్ఘమైన, బాధాకరమైన ప్రయాణం. ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది ప్రకృతి! నన్ను క్షమించు. నా కంటూ నా సొంతవాళ్ళెవరూ లేరు కాని నీకు మీ నాన్న ఉన్నారు, మీ గ్రామం ఉంది” అన్నాను.
“నువ్వు శాన్‌ని కోల్పోయావు! ఇంకా నీ విద్యార్థులను పోగొట్టుకున్నావు. వారు ఏమైపోయారో దేవుడికే తెలుసు. వారు మాంత్రిక ఆచార్యుల దగ్గర విద్యార్థులై, వస్తువులను సృష్టించడం, విశ్వశక్తిని నేర్చుకుంటున్నారేమో! ఇది చాలా చెడ్డది!” అంది.
“ఓ గొప్ప ప్రారంభానికి నిరుత్సాహవంతమైన ముగింపు!” అన్నాను. “నేను శాంతియుత జీవితం కోరుకున్నాను. బోధనని కోరుకున్నాను. కలలు నన్ను వెంటాడాయి. ఘటనల ద్వారా నన్ను లోబర్చుకున్నారు. ఇప్పుడు చూడు, మనం సౌర వ్యవస్థ యొక్క అంచు వద్ద ఉన్నాం!” అన్నాను.
“అయినా ఇప్పటికీ బ్లాక్‍మెయిల్ చేయబడుతున్నాం! ఇలా ఇంకెంత కాలం?” అంది ప్రకృతి.
ఆమె శరీరపు వెచ్చదనం, ఆమె కేశాల పరిమళాన్ని ఆస్వాదిస్తున్న నేను జవాబిచ్చే స్థితిలో లేను.
దాంపత్య సుఖంలో మమ్మల్ని మేం మరచిపోగా, కాలం కరిగిపోయింది.
రెస్ట్ రూమ్‌వైపు వెళుతూ, “వాళ్ళేమైనా కెమెరాలు పెట్టారేమో చూడు!” అని అంది ప్రకృతి నవ్వుతూ.
మా గదిలో ఒక టీవీ ఉంది. ఆన్ చేశాను. రికార్డు చేసిన వార్తలను చూపిస్తోంది.
భూమి యొక్క న్యూ హోప్ సిటీనీ, కుజుడిపై ఉన్న అరుణ భూములను, చంద్రుడిపై ఉన్న అమృతా కాలనీలను మాంత్రిక రాజులు పాలిస్తున్నారు. భూమిలోని దక్షిణ ప్రాంతం నా దేశం ఇప్పుడు అత్యంత పురాతనమైన క్రూరమైన అఘోరాల పాలనలో ఉంది. వారి నాయకుడు జడలుకట్టిన జుట్టుతో, ఒంటినిండా పవిత్ర బూడిదతో వికారంగా ఉన్న ఓ స్వామీజీ. అతను పౌరులనుద్దేశించి ప్రసంగాలు చేశాడు. భూమిని పునర్నిర్మించడం అనే మిషతో వాళ్ళని కొల్లగొట్టుతున్నాడు.
అప్పుడు నేను నిద్రపోయాను. ఇది కలలు లేని ఒక దీర్ఘ నిద్ర.
(సశేషం)
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.