[ఇటీవల స్వర్గస్థురాలైన ప్రముఖ గాయని ఎస్. జానకి స్మృతిలో ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసం. రచన శ్రీమతి భమిడిపాటి శరత్ జ్యోత్స్న.]
“నాదం నీ దీవనే, నీ రాగాలాపనే..
నీ(వు) రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా..” (రాగమాలిక డబ్బింగ్ చిత్రం – 1983)
(శ్రోత మదిన) కోటి పూలే వికసించవా!” అని ముగించ బుద్ధేస్తుంది ఆ పల్లవిని!
కోటి కోయిలలు కొలువు ఆ కంఠం. మరి, ఆ పాటకు ఆర్కెస్ట్రా అవసరమా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది! జానకి గళ సీమను చేరి కొత్తందాలను సంతరించుకుంటాయి, పదాలు, భావాలు! పలుకు తేనెల తల్లి, ఆ రాగవల్లి!! అసామాన్య భావప్రకటన ఆమె ముద్ర!!!
సౌందర్యం (శ్రీమన్మహారజ మార్తాండ తేజ, సిరిమల్లె చెట్టు కింద రాములమ్మో), సౌకుమార్యం (సీతమ్మ నోచింది చిత్రాల నోము), లాలిత్యం (సిగ్గాయెనమ్మా, అలక పానుపు ఎక్కనేల), స్నిగ్ధత్వం (చెలిమిలో వలపు రాగం), చిలిపిదనం (ఏంటబ్బాయా ఇదేంటబ్బాయా), హుషారు (చిలకలూరిపేట కాడ చిలకో, టిప్పు టాపు లుక్కు), ఆవేశం (ఈ దుర్యోధన దుశ్శాసన), మోహం (నీ కౌగిలిలో తలదాచి), తమకం (నరుడా ఓ నరుడా ఏమి కోరిక), కవ్వింపు (నా పరువం నీ కోసం, ప్రియతమా తమా సంగీతమే), కైపు (కన్నుల కైపు వెన్నెల చూపు), విరహం (జాము గడిచెను జాబిలి ఒరిగెను, రాజశేఖరా తాళలేనురా), పచ్చి శృంగారం (ఒద్దంటే వినడే పోకిరి),.. ఇట్లా పలు రకాల భావాలను పరవళ్ళు తొక్కించగల వైశిష్ట్యం, శిష్ట్లా జానకి గారి సొంతం!
ఇక ఆమె ఆలాపనల గురించి రాయడం మొదలుపెడితే ఈ వ్యాస పరిధి సరిపోదు, మాండలికాలని పలికే చందము, సరిగమలలో నవ్వగలిగే నేర్పు గురించి మొదలు పెడితే ఆగలేము!
ఇంతకీ పాటకు పట్టం కట్టిన జానకి గాన ప్రజ్ఞ , ఏ సంగీత పాఠశాలలోనో సాధన చేసి, చిత్రిక పట్టుకున్నదీ కాదు, పట్టాలు పుచ్చుకున్నదీ కాదు!
పువ్వు పుట్టగనే అన్న సామెత అతికినట్టు సరిపోతుంది ఆ సహజ ప్రతిభావనికి!
ముద్దు మాటల మూడేళ్ళ పసి ప్రాయం నుంచే ముచ్చటగొలిపేలా పాడటం ప్రారంభించినా, వేదికనెక్కింది ఏడేళ్లప్పుడు. సుమారు అదే వయసులో ఒక ఏడాది పాటు మాత్రమే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ (అదీ ఒక వాద్య విద్వాంసుని వద్ద) పొందారు. నిశితంగా గమనిస్తే వినడం, పాడటం – ఇవే ఆమె తనను తాను అపురూప గాయనిగా మలుచుకున్న తీరుకు వినియోగించిన సాధనాలు అని స్పష్టమౌతుంది.
జానకి గారి గురించి రాయాలంటే.. అసలెక్కడ మొదలు పెట్టాలి?! దశాబ్దాల పాటు కోట్లాది మంది ఆరాధించి, అభిమానించిన పాటల పట్టమహిషి గురించి కొత్తగా ఏం చెప్పగలం?
ఈ లెజెండ్ పాటల చరిత్రలోని ఏ పుటను తెరిచినా మనసు పులకరిస్తుందనీ, కళ్ళు జిగేల్మంటాయన్నదీ మాత్రమే మన ఎదుట నిలిచే వాస్తవం!
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఫ్రెంచ్, సింహళ, మరాఠీ, ఒడియా సహా దాదాపు ఇరవై భాషల్లో.. సినిమా, సినీయేతర గీతాలు కలుపుకుని నలభై వేల పై చిలుకు పాటలకు తన గళశోభను అద్దారామె! సినీయేతర (భక్తి/లలిత) గీతాలకు కోకొల్లలుగా బాణీలు కూర్చారు – చిత్ర సీమకు సంబంధించి తెలుగు మౌనపోరాటం ఒక్కదానికే సంగీత సారథ్యం వహించారన్నది విదితమే! రెండు సినిమాల్లో పూర్తి నిడివి పాత్రలకు డబ్బింగ్ చెప్పారు, అదీ బాల పాత్రలకు – పాటలో ఒకటి రెండు పదాలకు గొంతు మార్చి పలకడం వేరు, మొత్తం సినిమాలో శ్రుతిని మెయింటెయిన్ చేస్తూ భావోద్వేగాలను పలికించడం వేరు కదా! ఆరు దశాబ్దాలకు పైబడి, అప్రతిభులను చేసే ఇటువంటి ఎన్నో విన్యాసాలు చేశారామె – that is Jaanakamma! ప్రాథమికంగా 4 దక్షిణాది భాషలలో కలిపి 12 వేలకు పైబడి సినిమా పాటలు పాడారు జానకి. కొద్దిలో కొద్దిగా ఇటువంటి గణన సుళువే! కోట్లాది హృదయాలతో ఆమె పాట చేసిన చెలిమి, పంచిన ఆనందం, కూర్చిన సాంత్వన, అయిన ఆలంబనను ఎలా లెక్కించగలం!
ఏ పాట తీసుకున్నా, అందులో ఏ వాక్యాన్ని విన్నా, ఏ పదం విన్నా, పదాల మధ్య పాజ్ విన్నా, ఆమె విలక్షణ భావప్రకటనకు మైమరచిపోవడమే తప్ప, వాటిలోని సౌరునీ, ఆ మాధుర్యాన్ని కొలిచే తూనికరాళ్ళు, వివశులై ఆ మహత్తుకు కట్టుబడే సాధారణ శ్రోతకు లభ్యమా!
ఒకటి మాత్రం నిజం! దేవులపల్లి వారిని భావకవితా చక్రవర్తి అని ఏ విధంగా ఆరాధిస్తామో, జానకమ్మకు భావప్రకటనా సామ్రాజ్ఞి అని అదే విధంగా హారతులెత్తుతాం..
క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటారు కానీ నన్నడిగితే ఎంప్రెస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ అండ్ మాడ్యులేషన్ అంటాను!
భాష ఏదైనా అదే తన మాతృభాష అన్నంత స్వచ్ఛంగా, నేటివిటీతో పలకడం జానకమ్మ మరో ప్రత్యేకత! దక్షిణాది భాషల్లో మలయాళం ఉచ్చారణ మరీ కష్టతరం అంటారు, పైగా అక్కడి సినిమా పాటలు ఎక్కువగా శాస్త్రీయ సంగీతం ఆధారితంగా క్లాసికల్ బాణీలో సాగేవి.. అలాంటి సీమలో “మలయాళ సినిమా దత్తపుత్రిక” అన్న ఆప్యాయమైన పిలుపును అశేషాభిమానుల నుంచీ దక్కించుకున్నారు జానకమ్మ! 1957 నుంచీ మొదలైన జానకి మలయాళ ప్రస్థానం, చిదంబరనాథ్, వీ దక్షిణామూర్తి, దేవరాజన్, బాబురాజ్ వంటి అనేక దిగ్గజ సంగీత దర్శకుల నేతృత్వంలో సుమారు 1300 పాటలుగా పల్లవించి 2016 వరకూ కొనసాగింది. ఆ నాట, ఆమె పాటదే రాజ్యం (బాపూ గారి భాషలో “రాణ్యం” అందాం) అన్నంత విశేషంగా రాణించారు! సుశీల, లీల వంటి అపార ప్రతిభామణులు మలయాళంలో పాడుతున్నప్పటికీ దాదాపు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగింది ఆమె సుతిమెత్తని స్వైరవిహారం!
ఇక 1957లో సినీ ప్రయాణం మొదలైన తమిళ దేశాన టీ చలపతిరావు( తొలి పాటను ఇచ్చినవారు), సుబ్బయ్యనాయుడు, బీ గోపాలం, విశ్వనాథన్-రాంమ్మూర్తి, వేదా, టీ ఆర్ పాప్పా, మహదేవన్ వంటి అద్వితీయుల సంగీత నిర్దేశనంతో మొదలుపెట్టినప్పటికీ, ఇళయ పవనాలతో జోరందుకుని, ఆ బాణీల స్వరమై దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏకంగా ఏలేశారామె! 2016 లోనే ఇక సినిమాలకు పాడేది లేదు, నా గానం కన్నయ్యకే అంకితం అని నిర్ణయించుకున్నా, మరీ మరీ అందిన అభ్యర్థనలను ఆదరించి 2018లో తమిళంలోనే చివరి సినీ గీతాన్ని ఆలపించారు. జానకీ అమ్మ అని ఆపేక్షను కురిపిస్తూ అక్కున చేర్చుకుంది తమిళ ప్రజ!
ఇక హిందీ చిత్ర జగతి విషయానికి వస్తే సుమారు వంద, నూట పది పాటలు పాడినట్లు అంచనా..1960ల్లో మెయిన్ స్ట్రీమ్ హిందీ సంగీత దర్శక ద్వయం శంకర్-జైకిషన్ “దిల్ ఏక్ మందిర్” లో మీనా కుమారి కోసం ఒక గీతాన్ని పాడించుకున్నారు. లక్ష్మీకాంత్ – ప్యారేలాల్, రవీంద్ర జైన్, ఆనంద్ – మిలింద్, అను మలిక్ వంటి వారు అడపాదడపా పాడించుకున్నా, దక్షిణాన ఇళయరాజా ప్రిఫర్డ్ గాయని అయినట్లుగానే, ఉత్తరాన బప్పీలహరి జానకితో ఎన్నో సినిమాలకు పాడించారు. ఈనాటికీ జానకి హిందీ పాట అనగానే మొదట గుర్తొచ్చే “యార్ బినా చైన్ కహా రే..” బప్పీ దా స్వర నిర్దేశనంలో రూపుదిద్దుకున్నదే! హిందీలో విరివిగా అవకాశాలు దక్కినప్పటికీ, దక్షిణానికే నా ఓటు అని నిర్ణయించుకున్నారు జానకి.
జానకి శకం ప్రారంభమయ్యింది రాజా పాటతోనే అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ఆమె అద్వితీయమైన రేంజ్ ను గుర్తించి, సంపూర్ణంగా ఎక్స్‍ప్లోర్ చేసి సినీ సీమకు విలువైన వజ్రాలను బహూకరించింది రాజయ్యే!
రాజా ఆర్కెస్ట్రేషన్ లో ఆమె స్వరం ఒక వేణుగానమయ్యింది, ఒక వాయులీన తంత్రి అయ్యింది, ఒక సాక్సోఫోన్ పిలుపయ్యింది, నిజానికి వాద్య పరికరమే అయ్యి ఝరిలా శ్రోతల వీనులపై శ్రావ్యమైన స్వరవర్షాన్ని కురిపించింది..
ఇక అటుపై దక్షిణాది సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తి, శంకర్ గణేష్, రాజన్-నాగేంద్ర, హంసలేఖ, శ్యామ్, వీ కుమార్ వంటి వారందరికీ జానకే ఆరాధ్య గాత్ర దేవత అయ్యింది.. మారుతున్న ప్రేక్షక శ్రోతల అభిరుచికి తగ్గట్టు తన గాత్రధర్మాన్ని మలచుకోవడంలో ఆమె కృతకృత్యులయ్యారు కాబట్టే రెహమాన్ తరం కూడా కోరి జానకి గాత్ర మధురిమలో ఓలలాడింది. త్రిష – విజయ్ సేతుపతి నటించిన “96” సినిమాలో జానకి గారిని ఒక దృశ్యంలో నటింపజేయాలని అనుకున్నా కారణాంతరాల వల్ల సంభవించలేదు. కాగా జానకి గారు స్వర్గస్థులు అవడంతో భద్రపరిచిన ఆ సీన్ వీడియో వైరల్ అవడం తెలిసిందే! జానకి పట్ల తమిళుల అభిమానం అటువంటిది!
కన్నడ చిత్రసీమ కంఠాభరణంగా మెరిసిన జానకి అత్యధిక సినీగీతాలు పాడింది ఆ భాషలోనే! ఆమె గానం దశాబ్దాల పాటు అశేష కన్నడ అభిమానుల నీరాజనాలందుకుంటే, ఆమె వ్యక్తిత్వం, ఆప్యాయత ఆమెని కన్నడిగుల సొంత మనిషిని చేసేశాయి. రాచ మర్యాదలతో తుది వీడ్కోలు పలికే గౌరవం ఆమె కన్నడ అభిమాన సంద్రానికే దక్కింది మరి!
తెలుగువారైన శిష్ట్లా జానకి గారు తెలుగు సినిమాల్లో సుమారు 2800 పాటలు పాడారు.
ఆమెతో అద్భుతమైన అజరామరమైన పాటలు పాడించిన వారిలో అగ్రగణ్యులు పెండ్యాల, ఎస్ రాజేశ్వరరావు, ఘంటసాల, రమేశ్ నాయుడు, సత్యం, చక్రవర్తి, రాజన్-నాగేంద్ర, జీకే వెంకటేశ్, ఇళయరాజా, కేవీ మహదేవన్, రాజ్-కోటి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేవీ రాఘవులు తదితరులు ఉన్నారు. నిజానికి ఇళయరాజా స్వర సారథ్యంలో కన్నా చక్రవర్తికే ఆమె ఎక్కువ పాటలు పాడారు. చక్రవర్తి అత్యధికంగా సుమారు 470 పాటలు ఆమెతో పాడించి ప్రేక్షక శ్రోతలకు మెలోడియస్ నజరానా సమర్పించారు. 1980/90 ల్లో ఉదృతంగా పాడిన జానకి, తరువాత తరువాత పాటలను బాగా తగ్గించుకున్నారు. 2001 దేవుళ్ళు సినిమా పాట “మహా కనక దుర్గా..” హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
కొండను అద్దంలో చూపే విద్య కొందరికి సాధ్యమేమో కానీ, మేరుశిఖరాయమానమైన ఆ ప్రతిభామూర్తి గాన వైదుష్యాన్ని కొద్ది మాటల్లో చూపడం వ్యాసకర్త వంటి సామాన్యులకు అసాధ్యం కనుక, నవరసాల పరంగా శిష్ట్లా జానకి గారి మేటి పాటలు కొన్నిటిని గుర్తు చేసే ప్రయత్నం. పదండి ఆస్వాదిద్దాం.
జానకి గళంలో నవరసాల పరవశాలు:
1. శృంగారం: మన సినిమాలన్నీ అత్యధిక శాతం ప్రేమ కథలే కాబట్టి శృంగార రసంలో పాటల ఎంపిక కాస్త సులభమే! అందునా, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ను తమకంగా పలకడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్యాయె!
అలివేణి ఆణిముత్యమా: (ముద్దమందారం-1981 – జంధ్యాల దర్శకత్వం – రమేశ్ నాయుడు సంగీతం – వేటూరి రచన – తెరపై పూర్ణిమకు గళం) టీనేజీ దాటని జవ్వని, రెక్కలల్లార్చుకుని గూడు వదిలి సఖుడితో పయనమైనా, సహసిద్ధమైన బెరుకు ఒకవైపు, ప్రియుని పరిష్వంగం కలిగించే వివశత్వం మరోవైపూ.. ఈ సంక్లిష్ట మానసిక స్థితిని జానకి గానం అమోఘంగా, అతి రసవత్తరంగా పలికించింది. వెచ్చవెచ్చని నీ ఒడిలో – (శభాష్ వదిన -1972), నీ కౌగిలిలో తలదాచి – (కార్తీక దీపం-1979), సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి (స్వయంకృషి-1987) ఈ జానర్ లో అత్యద్భుతమనిపించే ముచ్చట మూడు ముత్యాలు.
2.హాస్యం: వినరా సూరమ్మ కూతురి మొగుడా – (ఇల్లు ఇల్లాలు-1972 – అప్పలాచార్య రచన, కేవీ మహదేవన్ స్వర సారథ్యం – రమాప్రభ) తెరపై అభినయించిన రమాప్రభే పాడిందా అన్నంత అద్భుతంగా, నటి గాత్రాన్ని పుణికి పుచ్చుకుని చేసిన గమ్మత్తు ఈ పాట! కిలకిల నవ్వులూ, చిలిపితనాలూ, హాస్యాలు, పద్యానికి పేరడీలు, ఎకసెక్కాలూ, ముద్దూ మురిపాలు అన్నీ అద్వితీయంగా పలికించారు జానకి! రాజా ఓ రాజా, ఓ బాల రాజా – (చిలక జోస్యం-1983 – వీటూరి – కేవీ మహదేవన్ – రమాప్రభ), తోంతాం తెగ తోంతాం – నవ్వుతూ బ్రతకాలి (1980, అప్పలాచార్య – జీకే వెంకటేశ్ – రమాప్రభకే), ఎంత సోగ్గున్నావు, ఎంత భేషుగున్నావు (కొత్త జీవితాలు – చింతామణి నాటకం – కొసరాజు – ఇళయరాజా – చింతామణి పాత్రధారిణి – బహుశః సుజాత అనే నటి) మచ్చుకి, ఈ తరహాలో నవ్వించే ఇతర గీతాలు.
3.కరుణ రసం: గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండుండేవి (బాలమిత్రుల కథ – 1973 – సినారె – సత్యం – మాస్టర్స్ దేవానంద్, సురేంద్ర) ప్రాణ స్నేహితులు ఒకరికొకరు దూరమైన పరిస్థితిలో మిత్రుని కోసం పరితపిస్తూ ఒక పసి గుండె కన్నీరు మున్నీరవుతూ పాడే గీతం.. విని గుండె బరువెక్కకుండా ఉండటం అసాధ్యం! అదీ ఆమె ప్రతిభ! కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు (అంతులేని కథ – 1976 – ఎమ్మెస్ విశ్వనాథన్ – ఆత్రేయ – జయప్రద), డమరుకము మ్రోగ, హిమశిఖరమూగ (మంచి మనసులు – 1986- ఆత్రేయ – ఇళయరాజా – భానుప్రియ) నీ ఆశ అడియాస చేయి జారే మణిపూస (ఎం ఎల్ ఏ- 1957 – ఆరుద్ర – పెండ్యాల – సావిత్రి) (జానకి గారి తొలి పాట – అంతకు ముందు పాడిన తమిళ సినిమా పాట రిలీజ్ కాలేదు), జాబిల్లి వెన్నెల్లు చవి చూడలేదు (అంగడి బొమ్మ – 1978 – ఆత్రేయ – సత్యం – మలయాళ నటి సీమ పై చిత్రీకరణ) కరుణ రసంలో శోకం చిందించిన కొన్ని ప్రముఖ గీతాలు.
4.రౌద్రం: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో (ప్రతిఘటన-1985 – వేటూరి – చక్రవర్తి – విజయశాంతి) భారతీయ సంప్రదాయం తల్లీ తండ్రి తరువాతి స్థానమిచ్చిన గురువును, నీచదృష్టితో చూసే విద్యార్థుల నికృష్ట చేష్టలకు ఉగ్రూరాలైన ఒక ఉపాధ్యాయిని ఆవేశం, వారి హైన్యాన్ని చూసి బిడ్డలకు హితబోధ చేసే తల్లి ఆరాటం – తెరపై విజయశాంతి నటనకు ప్రాణం పోసింది జానకమ్మ గాత్రం! వెయ్యవ సారి విన్నా శ్రోతను ఊపేసే ఉద్వేగాన్ని పలికారు కాబట్టే ఈ పాటకు నంది బహుమతిని అందుకున్నారు జానకమ్మ.. వంద నందులు ఇచ్చినా సరిపోవు ఆ తల్లికి అన్నారు అందుకే అభిమానులు! ఇదే తరహా ఆవేదనతో కూడిన ధర్మాగ్రహం ధన్వంతరి వారసులం (అరుణ కిరణం-1986 – వేటూరి – చక్రవర్తి – విజయశాంతి ) పాటలో కూడా వినిపిస్తుంది.
5. వీరం: ఏ బాపూ నేర్పనిదీ సత్యాగ్రహమూ (మౌనపోరాటం-1989 వేటూరి – ఎస్ జానకి – యమున) నాగరిక సమాజ ప్రతినిధి రాజశేఖరం చేతిలో మోసపోయిన గిరిపుత్రి దుర్గ, ఓటమిని ఒప్పుకోక చేసే వినూత్న పోరాటాన్ని – సంగీత, గానాల పరంగా గొప్పగా ప్రతిబింబించింది ఈ పాట. అందెలు పిలిచిన అలికిడిలో, అణువణువున రస ఝరులూ (మయూరి-1985) అంటూ మొక్కవోని దీక్షతో పాదం కదిపి ప్రపంచానికి తన ఉనికిని మరోమారు పరిచయం చేసే కథానాయిక వెన్ను బలాన్ని, స్థైర్యాన్ని జానకి గళం చాటిన తీరుకు సాహో అని సలాం చేయక ఎలా!
6. భయానకం: (ఆందోళన భావం)
“అమ్మా నాన్నా, ఇక్కడ ఉన్నా.. దాగుడు మూతలు కాదమ్మా, బూచికి భయపడి దాక్కున్నా..” – (జడ్జిమెంట్ -1990 – వేటూరి/సీతారామశాస్త్రి (?) – రాజ్ కోటి – బేబీ సుజిత)
ప్రధాన పాత్రధారిణి బేబీ సుజితకు డబ్బింగ్ చెప్పడమే కాదు, మనసులు ద్రవించే ఈ పాటను పాడి ఏడ్పించేశారు జానకమ్మ.. మరి బెదిరిపోయిన, బెంగటిల్లిన చిన్నారి ఆక్రందనను పలకాలంటే ఇంకెవరివల్ల అయ్యేను!
7. బీభత్సం: (జుగుప్స/విరక్తి భావనలు)
పల్నాటి యుద్ధం -1966 సినిమాలో అలరాజు సతి పేరిందేవి, భర్త మరణానికి రోదిస్తూ యుద్దం పట్ల, విధి తనతో ఆగిన చెలగాటం పట్ల రోతతో పాడే “బుగ్గి అయినది నాదు ముత్తైదుతనము“ పాటను నటి వాసంతి పై చిత్రీకరించారు. భర్తపై అమితమైన ప్రేమతో సహగమనానికి సిద్ధమైన పాత్ర ఆక్రోశాన్ని, జాలిగొలిపేలా జానకి పలికిన తీరు, అసాధారణానికి కొన్ని మెట్లు పైనే ఉంటుంది!
8. అద్భుతం: “పగలే వెన్నెల జగమే ఊయల..” (పూజాఫలం-1964 – సినారె – స్వరాజేశ్వరరావు – జమున)
లోకమంతా అందంగా కనిపించే ముగ్ధ మనోహరి జమున మనసులోని ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని జానకి గొంతు పలికిన తీరుకి డంగైపోయిన తరతరాల అభిమానులు, ఆ పాటను ఏకంగా తమ హృదయసింహాసనాలపై కూర్చుండబెట్టుకున్నారు.. జానకి అనగానే తట్టే అచ్చ తెనుగు అద్భుతం ఇదే ఇదే అంటారు – ఈనాడైనా, ఏనాడైనా! సిరిమల్లె పూవా (పదహారేళ్ళ వయసు-1978 – వేటూరి – ఇళయరాజా/చక్రవర్తి – శ్రీదేవి), అరె ఏమైంది ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. (ఆరాధన – 1987 – ఇళయరాజా – ఆత్రేయ – సుహాసిని), మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (రాక్షసుడు -1986 – వేటూరి – ఇళయరాజా – సుహాసిని) వంటి అద్భుత రసాన్ని సూచించే పాటలు కోకొల్లలు.. అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఆయమ్మకు దణ్ణవెఁట్టుకోడమే ఫ్యాన్స్ ఇవ్వగల సిసలు ట్రిబ్యూట్, కాదంటారా!
9. శాంతం: (ప్రశాంత భావం)
“ఏ దివిలో విరిసిన పారిజాతమో..” (కన్నెవయసు-1973 – దాశరథి – చెళ్ళపిళ్ళ సత్యం – రోజారమణి) మంద్రపవనంలా సాగే ఈ పాటలో ఆ కన్నెవయసు బేల అంతరంగాన్ని, అందలి ఆశలనీ కోరికలనీ జానకి కంఠం అపురూపంగా, పట్టుపోగుల మృదుత్వంతో ఆవిష్కరిస్తుంది. మరుగేలరా ఓ రాఘవా (సప్తపది/శుభలేఖ, 1981/82) పుట్టకాడ ఎవరో (1969 – దేవులపల్లి – ఎస్ రాజేశ్వరరావు – వాణిశ్రీ), డోలాయాంచల (కలియుగ దైవం-1983 – వేటూరి – సత్యం – శారద) వంటి అనేక పాటల్లో జానకమ్మ గానం మంద్రంగా ప్రవహించే మందాకిని మెత్తదనం, ప్రశాంతతలతో మనసులని సేదతీరిస్తుంది.
ఇక, నంద కిశోరా నవనీతచోర నాదవిహార శ్రీధర, నంద గోకులమైనది ఆనంద గోకులమైనది వంటి కృష్ణ భక్తి గీతాలు జానకమ్మ మనసును ఆవిష్కరించే పూజా సుమాలు.. భక్తిగీతాలు ఆలపించేటప్పుడు కృష్ణుని ఆరాధించే బేల గోపెమ్మే అయిపోతుంది ఆ తల్లి.
ఆ అపర సరస్వతి, గాన విశారద పాటలను వినే అదృష్టం ఈ వీనులకు కలిగించిన పైవాడికి కోటి దండాలు, శతకోటి దండాలు!
