[ఇటీవల బిక్కవోలు లోని లక్ష్మీగణపతి ఆలయం, గొల్లల మామిడాడ లోని కోదండ రామస్వామి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]
బిక్కవోలులో స్వయంభువు విఘ్నేశ్వర ఆలయముంది. ఇది పొలాల మధ్య ఉంటుంది. స్వామి విగ్రహం ఏడడుగులుంటుంది, భూమి లోపలికి ఎంతుందో తెలియదు. స్వామివారు నాగాభరణం, నాగ యజ్ఞోపవీతం, నాగ మొలతాడుతో సుఖాసీనులై ఉన్నట్టుంటారు. ప్రత్యేకత ఏమిటంటే గణేశుని విగ్రహం సైజు పెరుగుతూ ఉందని ప్రతీతి. అలాగే ఇక్కడ గణేశుని తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. అలాగే గణేశుని ఎడమ పాదం క్రింద నీరు ఊరుతూ ఉంటుంది.
స్వామి చెవిలో కోరికలు చెబితే అవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆ కోరికలు వినడానికా అన్నట్టు గణేశుడు కన్నులు మూసుకునే ఉన్నట్టనిపిస్తుంది. కోరికలు తీరిన వారు మరల పునర్దర్శనం చేసుకుంటారిక్కడ. దర్శన వేళలు ఉదయం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు (మధ్యాహ్నం 12: 30 నుండి 1: 30 మధ్య మూసి ఉంటుంది). గర్భగుడి చుట్టూ గ్రిల్స్ తో చిన్న మందిరంలా ఉంటుంది. మిగిలిన ఆలయాలకున్నట్టు గర్భగుడికి గోపురముండదు. ప్రధానద్వారం దగ్గర మాత్రం గోపురం కట్టారు. అది దాటి పైకప్పున్న కారిడార్ దాటి వెళ్తే, మందిరానికి చేరుకుంటాం.
వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయిక్కడ. ప్రతిరోజూ యజ్ఞం చేస్తారిక్కడ. కాకినాడ నుండి 30 కిమీ, రాజమండ్రి నుండి 35 కిమీ దూరముంటుంది. రెండు పట్టణాల నుండి బస్సులున్నాయి.
ఇక్కడకు అర కిలోమీటరు దూరంలో, గోలింగేశ్వర స్వామి ఆలయం, అందులో రాజరాజేశ్వర స్వామి ఆలయం చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం ఉంటాయి. ఇవి తొమ్మిదవ శతాబ్దంలో, చాళుక్యుల కాలం నాటివి. శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరూ కొలువైన ఆలయమిది. ఇక్కడ గోడలపై శాసనాలు కనిపిస్తాయి.
బ్రహ్మ సూత్రం (ఇది లింగంపై చారగా కనిపిస్తుంది) కలిగిన, గోలింగేశ్వర స్వామిని ఒక్కసారి చూస్తే వెయ్యిసార్లు శివదర్శనం చేసినంత ఫలితం కలుగుతుందని, గోలింగేశ్వరుడు బృహస్పతికి అధిపతి కనుక, స్వామికిక్కడ లక్ష్మివారం ప్రత్యేకపూజలు చేస్తారని అక్కడున్న పూజారిగారు చెప్పారు.
ఆ ప్రక్కన పార్వతీదేవి మందిరం, ఆ ప్రక్కన కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మందిరం ఉన్నాయి. కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మూర్తి ఉన్న ఆలయం, పళని తర్వాత ఇక్కడేనని చెప్పారక్కడ. ఆ పక్కనే పుట్ట కూడా ఉంది. ఈ పుట్ట అమావాస్యకు తగ్గిపోయి పౌర్ణమికి పెరుగుతూ ఉంటుందట.
బాల త్రిపురసుందరి సమేత చంద్రశేఖర ఆలయం
సుబ్రహ్మణ్యేశ్వరుడు దక్షిణదిశగా ఉంటారు. కాబట్టి, కుజుడు, రాహువు, కేతువుల పూజలిక్కడ చేస్తారట. గ్రహదోష నివారణలకు, కాలసర్ప దోషాలకు మంగళవారాలు, షష్టి తిధిన, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున పూజలు చేస్తారు. ఈ గోపురం చుట్టూ ఆలయ ప్రాంగణంలో శివలింగాలు, నంది విగ్రహాలున్నాయి. తలుపులు, స్తంభాలపై శాసనాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో నక్షత్ర తాబేల్లున్నాయి. ఆలయ ప్రాంగణంలో భద్రకాళి, వీరభద్రుడు, గణేశుని ఆలయాలున్నాయి. అలా శివ కుటుంబం మొత్తమిక్కడ కొలువుతీరి ఉన్నది.
గోలింగేశ్వర ఆలయం మధ్యలో ఉంటే, కుడిచేతి వైపు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజరాజేశ్వర ఆలయముంటే, ఎడమచేతి వైపు శ్రీ బాలా త్రిపురసుందరి సమేత శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయముంది. ఇక్కడున్న మూడు లింగాలకు బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ ఆలయాల కుడ్యాలు, స్తంభాలు, రాతి కట్టడాలు. చతురస్రాకారపు రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టినవి. మూడు ఆలయాల గోపురాలూ శిల్పకళాచాతుర్యంతో అలరారుతున్నవే. మూడు శివాలయాలు ఒక్క చోటే ఉండబట్టి దీనిని త్రిలింగక్షేత్రమని కూడా అంటారట.
***
బిక్కవోలుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గొల్లలమామిడాడ గ్రామం ఉంది. ఇది కాకినాడకు 25 కిమీ, రాజమండ్రికి 45 కిమీ దూరంలో ఉంటుంది.
గొల్లలమామిడాడలో కోదండరామస్వామి ఆలయముంది. 1889లో నిర్మించిన చిన్న రామాలయం, 1939లో ఇప్పుడున్నట్లుగా నిర్మించారు. దీనిని చిన్న భద్రాద్రి అని కూడా అంటారు. శ్రీరామనవమి ఘనంగా జరుపుతారిక్కడ.
గర్భగుడి గోపురం, పశ్చిమ గోపురం
గర్భగుడిలో, సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి మూర్తులు, జీవకళతో ఉట్టిపడుతూ భక్తుల కోర్కెలు తీర్చడానికి కొలువై ఉన్నారిక్కడ. ఎదురుగా అంతే జీవకళతో ఉట్టిపడుతున్న ఆంజనేయస్వామి మందిరముంది.
1939 తర్వాత తూర్పు, పశ్చిమ గోపురాలను నిర్మించారు. తూర్పుగోపురం తొమ్మిది అంతస్తులతో, ప్రతి అంతస్తులో బాల్కనీలతో ఉంటుంది. పశ్చిమగోపురం పదకొండు అంతస్తులతో, బాల్కనీలతో ఉంటుంది. ఈ గోపురశిఖరం వరకు ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. దానికి 50 రూపాయల టికెట్ ఉంటుంది. మొదటి అంతస్తులో అద్దాల మందిరముంది.
తూర్పు, గర్భగుడి గోపురాలు
ఈ అద్దాల మందిరంలో వింతలన్నీ ఇన్నీ కావు. ఇక్కడ ఉన్న శ్రీరామ పట్టాభిషేకంలో సీతారామ లక్ష్మణ తదితరులంతా జీవకళతో ఉట్టి పడుతున్నారు. ముందున్న అద్దాలలో చూస్తే, ఆ అద్దాలను ఎలా అమర్చారంటే, ఒక స్థలంలో నుంచుంటే ఒక్క రాముడే, ఇంకొక ప్రక్కకు జరిగితే సీత, ఆ ప్రక్కకు జరిగితే లక్ష్మణుడు.. ఇలా మనం నుంచునే స్థలాలను బట్టి కనిపించే మనుషులు మారుతున్నారు.
అద్దాల మందిరం
ఒక దగ్గర నిలబడితే మనకి మనమే మరుగుజ్జులుగా కనిపిస్తే, ప్రక్కకు జరిగితే పొడవుగా కనిపిస్తాం. ఒక్క మనిషి ఎన్నో ప్రతిబింబాలు, ఒక దగ్గర నుంచుంటే తలొక దగ్గర, కాళ్లొక దగ్గర కనిపిస్తూ, ఇంకొక దగ్గర నుంచుంటే ఎదురుగా మన ముఖం కనిపించి, తల పైకెత్తి చూస్తే మనం వెనక్కి తిరిగున్నట్టు కనిపిస్తూ.. ఇలా అద్దాల అమరికతో, అద్భుతాలు చేశారు.
రెండవ అంతస్తెక్కి మెట్లు దిగితే, విశాలమైన డాబా, ఆ మధ్యలో గర్భగుడి గోపురముంటే, దాని ముందున్న తూర్పుగోపురం కూడా కనిపిస్తుంది. గర్భగుడి గోపురం చుట్టూ ఉన్న డాబామీద మూడు ప్రదక్షిణాలు చేస్తారు భక్తులు.
అద్దాల మందిరం
ఈ మూడు గోపురాలూ అద్భుతమైన శిల్పకళాచాతుర్యంతో మనల్ని సమ్మోహితులను చేస్తాయంటే కాదది అతిశయోక్తి. గోపురాల మీద రామాయణ, భారత, భాగవతాల ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరుకు, ఆ మహాశిల్పుల కళా నైపుణ్యానికి జోహార్లు అర్పించవలసిందే. శిల్పాలు సజీవంగా కనిపిస్తాయక్కడ.
గర్భగుడి గోపురం, పైన కలశాలతో ఆపైన చక్రంతో కూడి ఉంటుంది. ముందువైపు పైనుండి క్రిందకు వరుసగా, శివపార్వతులు, ఏడు గుర్రాలు పూన్చిన రథంపై సూర్యనారాయణుడు, సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు, వివాహ వేదికపై నూతన దంపతులు, ఆ వేదికకు ఇటూ, అటూ అమర్చిన అరటి చెట్లు, అరటి ఆకులు, గెలలు, గెలల క్రింద అరటిపువ్వు, ఎంత సహజంగా ఉన్నాయంటే, చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు. గోపురం చుట్టూ పురాణ గాథలనే కాకుండా, పక్షులను, జంతువులను, వృక్షాలను, లతలను కూడా ఎంతద్భుతంగా చెక్కారంటే చూసి తీరాల్సిందే! చెప్పినా అర్థం కాదు.
తూర్పు, గర్భగుడి గోపురాల మధ్య ధ్వజస్తంభం మహోన్నతంగా కనిపిస్తుంది. ధ్వజస్తంభం పైన, గర్భగుడి గోపురంపైన ఉన్న సీతారామ లక్ష్మణులకు అంజలి ఘటిస్తున్న ఆంజనేయుని విగ్రహం, ఆ పైన విష్ణుచక్రం ఉన్నాయి.
తూర్పు గోపురంపై, శ్రీకృష్ణ లీలలు ఒక అంతస్తుపై ఉంటే, మునులు చేస్తున్న యజ్ఞాలపై అసురులు రక్తాన్ని కుండలతో కుమ్మరిస్తుంటే, వాళ్లపై బాణాలేస్తున్న రామలక్ష్మణులు యింకొక అంతస్తుపై, ఇలా ప్రతి అంతస్తుపై రకరకాల గాథలను కొలువు తీరించారు శిల్పులు. ప్రతి గోపురంపై అచ్చెరువొందించే శిల్ప కళాచాతుర్యం ఈ ఆలయం ప్రత్యేకత.
ఈ వూరులోనే వందేళ్ల నాటి సూర్యనారాయణ స్వామి ఆలయముంది. ఉష, పద్మిని, ఛాయ, సంధ్యలతో కూడిన స్వామి వారున్నారక్కడ. ఆలయం చాలా అందంగా ఉంది. ఆలయాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచారు.
మేము సెప్టెంబర్ నెలలో వెళ్ళాం. అప్పటికి వర్షాలు పడుతున్నాయి. ఆకాశం నల్లని మబ్బులతో మేఘావృతమై ఉంది. మేము వెళ్ళింది సాయంకాలం ఐదు గంటలకు. ఆ నల్లనిమబ్బుల మధ్య ఈ గోపురాలను చూస్తుంటే తనువు పులకించిపోయింది. ఆ గోపురాలను ఎంతసేపు చూస్తున్నా తనివి తీరడం లేదు. గాని ఆకాశంలో ఉన్న మబ్బుల్ని చూస్తే కుండపోత వర్షం పడుతుందేమో, తిరిగి రావడం కష్టమేమోనన్న భయంతో, తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది. లేకుంటే ఇంకా చాలా సేపే ఉండేవాళ్ళం. ఐదుగంటల ముందు వెళ్తే, గోపుర శిఖరం వరకు వెళ్లవచ్చు. కోదండ రామస్వామి ఆలయాన్ని దర్శించు కోవాలనుకునేవారు మూడు గంటలకక్కడకు చేరుకుంటే మీ ఇష్టం వచ్చినంత సేపక్కడ గడపవచ్చు. శిల్పకళ అందాలను వీక్షించవచ్చు. శిఖరాన్ని చేరుకొని, చుట్టుపక్కల ఊళ్లను కూడా చూడవచ్చు.

