[బాలబాలికల కోసం ‘బీర్బల్ చాతుర్యం’ అనే కథని అందిస్తున్నారు డా. కొప్పరపు నారాయణ మూర్తి.]
భారతదేశాన్ని పాలించిన చక్రవర్తుల్లో అక్బర్ మహారాజు ఒకరు. ఢిల్లీ రాజధానిగా ఆయన పాలించే రోజుల్లో ఆయన మంత్రుల్లో బీర్బల్ ఒకరు. బీర్బల్ మంత్రే కాదు, మంచి సహచరుడు కూడా. రాజుకు వచ్చే దైనందిన రాచరిక సమస్యలే గాక, అనేక ఇతర సందేహాలను ఆయన బీర్బల్‌ను అడిగేవాడు. బీర్బల్ వాటికి సంతృప్తికరమైన జవాబులు ఇచ్చేవాడు. అలా సందేహాలను నివృత్తి చేసినప్పుడల్లా రాజు బీర్బల్‌కు అనేక బహుమతులిచ్చే వాడు. అలా ఏళ్ల తరబడి సాగటంతో బీర్బల్ ఇంటినిండా దాచుకొందుకు వీలు లేనన్ని విలువైన బహుమతులు నిండి పోయాయి. ఇలా అయినదానికి కానిదానికీ తనకు అంతంత విలువైన బహుమతులు అక్బర్ పాదుషా ఇవ్వటం బీర్బల్‌కు చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది. ఎంత కాదన్నా అదంతా ప్రజా ధనం. ప్రజలు పన్నుల రూపంలో కట్టింది.
అలాని, బీర్బల్ రాజుకు ఇకమీద బహుమతులు వద్దని చెప్పలేడు. రాజు ఏమనుకొంటారోనని భయం. ఒకవేళ రాజుకు కోపం వస్తే ఆ బహుమతులేగాక, తన తాతల తండ్రుల కష్టార్జితం కూడా స్వాధీనం చేసుకోగలడు. అలాని రాజు ఇచ్చే బహుమతులను తీసుకొచ్చి భద్రంగా ఉంచే పరిస్థితి లేదు. ఈ సంకటం నుంచి ఎలా బయట పడాలో తెలియక బీర్బల్ గిలగిలలాడతున్నాడు.
ఆ సమయంలో రాజ సభకు ఒక దొంగని తెచ్చారు రాజభటులు.
“మహారాజా, ఇతనొక దొంగ. ఇతనింటి వద్ద ఈయన దొంగిలించిన విలువైన వస్తువులు దొరికాయి. అవి అక్కడికి ఎలా వచ్చాయో విచారిస్తే ఇతను దొంగతనం చేస్తుంటాడని తెలిసింది. అలా సంపాదించిన సొత్తు ఇంట్లో దాచితే, అవి ఎలా బయట పడ్డాయో తేలాల్సి ఉంది. ఇతను మటుకు దొంగని అని ఒప్పుకున్నాడు”, చెప్పారు భటులు.
రాజు “ఏమయ్యా! నీ పేరేమిటి?” అని అడిగాడు.
“వృషభుడు” అని చెప్పాడు దొంగ.
“నీ వృత్తే ఇదా?” అడిగాడు మహారాజు మళ్ళీ అతనిని.
“అవును మహారాజా”.
“మా రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉన్నా, నీకు దొంగిలించవలసిన కష్టం ఏమి వచ్చింది?”
“నిజమే మహారాజా! మీ రాజ్యం సుభిక్షంగా ఉంది. మాకు ఏ లోటూ లేదు.”
“మరి దొంగతనానికి ఎందుకు ఒడిగట్టావు?”
“మహారాజా! ఇప్పుడు యుద్ధాలు లేవు. ఏ రాజు మీతో యుద్ధం చేయను సాహసించలేడు కూడ. అయినా, మీరు రోజూ అనేకమంది వీరులతో కత్తి యుద్ధం, గదా యుద్ధం, మల్ల యుద్ధం సాధన చేయటంలేదా? అలాగే మా కులవృత్తి దొంగతనం. ఇది కొంతకాలం మానేస్తే తిరిగి చేయటం కష్టం మహారాజా!”
“అలాని?” అక్బర్ మహారాజు కోపంతో రెట్టించిన స్వరంతో మళ్లీ అడిగాడు.
“అందుకే మా నాన్న ‘కులవృత్తి మానేయకూడదురా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవ్వాళ అక్బర్ మహారాజు పాలన బాగుందని మానేస్తే, రేపు వేరే రాజు పాలన కొస్తే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి దొంగతనం కళను కొనసాగించటమే మన వృత్తి ధర్మం’ అని చెప్పాడు మహారాజా. అందువలన నేను, ఇంకా నాలాంటి వారు, దొంగతనం కళను ఆచరిస్తూనే ఉన్నాము”, చెప్పాడు వృషభుడు చేతులు కట్టుకొని మరీ వినయంగా, భయంభయంగా.
“ఏవీ? ఆ వస్తువులు ఇలా తెండి” ఆజ్ఞాపించాడు మహారాజు. ఆ సరికే ఆ వస్తువులు తనకు అక్బర్ మహారాజు ఇచ్చిన విలువైన కానుకలుగా గుర్తించాడు బీర్బల్.
రాజు వాటిని పరికించి, “ఇవి మన మహా మంత్రికి నేనెప్పుడో ఇచ్చిన నా విలువైన కానుకలే! అవి దొంగ చేతికెలా వచ్చాయి. చెప్మా! అంటూ సాలోచనగా దొంగవైపు చూసి, “ఏమోయ్! ఇవి నువ్వెట్లా దొంగిలించావు మంత్రి గారి భవంతి నుంచి?” అని అడిగాడు అక్బర్.
“అయ్యా! అది మంత్రిగారి భవంతని నాకు తెలియదు. ఒక రాత్రి అలవాటుగా అటువైపు వెళ్లాను. మంత్రిగారి వీధి కామోలు, చీకట్లో గుర్తుపట్టలేదు. ఒక ఇంటి బయట ఈ విలువైన కానుకలు ఇంటి వసారాలో ఉన్నాయి. రాత్రి పన్నెండు కావస్తుంది. మనిషి అలికిడి ఎక్కడా లేదు. అటూ ఇటూ చూసి, గబుక్కున వాటిని మాయచేసి నా తలపాగాలో దాచేశాను. రాత్రి ఇంటికి తీసుకువెళ్లి వాటిని దాచాను. ఇవి రాజభటులు కంటికి ఎలా కనిపించాయా వారే చెప్పాలి”, అన్నాడు వృషభుడు.
రాజు భటుల వైపు చూశాడు. “ప్రభూ, ఈ వస్తువులు దొంగ ఇంటి బయట ఉండటం చూసి మాకు అనుమానం వచ్చి, ఆ ఇంట్లో వృషభుడి భార్యను అడిగాము. ఆమె ‘మా ఇల్లంతా సామానుతో నిండి ఉండటం వలన, రాత్రే మావారు వాటిని తేవటం వలన, స్థలం చూసిన తరువాత వాటిని పెట్ట వచ్చేమోలే అనుకోని బయట పెట్టాను’ అంది ఈ వృషభుడి భార్య. అప్పుడు తెలిసింది వృషభుడు దొంగని, వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా దొంగ సొత్తని. ఆ విధంగా వృషభుడిని బంధించి దొరికిన సొత్తుతో సహా పట్టుకొచ్చాము మహారాజా!” అన్నారు భటులు.
“మరయితే ఈ దొంగకి ఏ శిక్ష విధిద్దాం?” అడిగాడు మహారాజు బీర్బల్‌ను.
“మహారాజా! అతను నేరం చేయలేదు. తండ్రి ఆజ్ఞ ప్రకారం కులవృత్తి అలవాటు పోకూడదని చేతికి పనిచెబుతున్నాడని చెప్పాడు కాబట్టి, అతని నిజాయతీకి మెచ్చి అతనిని విడిచిపెట్టవలసిందిగా ప్రభువును కోరుతున్నాను” అన్నాడు బీర్బల్.
వృషభుడు ఆదుర్దాగా రాజు వైపు చూశాడు. “రాజు చిరునవ్వు నవ్వి, భేష్! తండ్రిమాట పాలించి నీవు ఈ దొంగతనం ఒక అభ్యాసంగా చేస్తున్నావు కానీ, దీని మీద బ్రతకడానికి కాదు. కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను. అయితే, ఒక షరతు. ఇకపై ఎప్పటికప్పుడు దొంగిలించిన సొమ్మును, ఎవరి సొమ్ము దొంగిలించావో తెలుపుతూ సేనాని రక్షక భటులకు మర్నాడు ఉదయమే అప్పచెప్పాలి. నీ దొంగతనం వలన రాజ్యంలో ఎవ్వరికీ కష్టం కలుగకూడదు. రాజ్యంలో కలకలం చెలరేగకూడదు. సరేనా!” అని శాసించాడు అక్బర్ మహారాజు.
‘సరే’నని, అంగీకార సూచకంగా తలూపాడు వృషభుడు.
బీర్బల్ లోలోపల తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆ దొంగ ‘దొంగే’ కాడు. బీర్బల్ దూరపు బంధువు. తన దగ్గర నిల్వలుగా పేరుకుపోయిన విలువైన కానుకలెన్నో ప్రజల పన్నులనుండి చేయించి మహారాజు తనకు బహుమతిగా ఇచ్చినవి. ఇవి తిరస్కరిస్తే రాజుగారికి కోపం వస్తుంది. ఇవి ఎలాగైనా తిరిగి ప్రజలకే చేరాలంటే ఎదో ఒక ఉపాయం చేయాలి. అందులో భాగంగానే దూరపు బంధువైన వృషభుడిని రప్పించి, తన ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలన్నీ అతనింటికి చేర్చి, దొంగతనం జరిగి అతను భటులకు దొరికినట్టు నాటకం ఆడించింది బీర్బలే.
ఆ విధంగా ఆ సొమ్ము రాజు ఖజానాకు చేరింది. తన బంధువుకు ఏ కష్టం కలగలేదు. ఉభయతారకంగా సమస్యను పరిష్కరించినందుకు లోలోన ఎంతో సంతోషించాడు బీర్బల్.
