[శ్రీ రమణ బంధకవి రచించిన ‘బ్లూ టిక్స్’ అనే కథని అందిస్తున్నాము.]
ఉదయం అయిదున్నరకల్లా సరోజకి మెలకువ వచ్చేసింది. ఇంట్లో చీకటి పూర్తిగా చెదరలేదు. మంచం మీద భర్త రామమూర్తి ఇంకా నిద్రలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. కానీ అతను నిజంగా నిద్రపోతున్నాడో, లేక కళ్లు మూసుకుని ఏదో పాత జ్ఞాపకాల్లో తిరుగాడుతున్నాడో సరోజకి చాలాసార్లు అర్థం కాదు.
మెల్లగా లేచి వంటింట్లోకి వెళ్లింది. స్టౌ వెలిగించింది. కాసేపటికి ఫిల్టర్ కాఫీ డికాక్షన్ వాసన క్రమంగా ఇంట్లోకి పాకుతోంది. స్టౌ మీద పాలు పొంగుతుండగా బాల్కనీ తలుపు చప్పుడైంది. ఆయన లేచినట్లున్నారు అనుకుంది.
“చలిగా ఉంది.. షాల్ వేసుకోండి..” కిచెన్‌లో నుండే అంది.
“అంత చలి ఏమీ లేదు..” బయట నుంచి రామమూర్తి గొంతు.
అదే వారి నలభై ఏళ్ల సంసారం. రోజూ చెప్పే మాటలు. రోజూ వచ్చే సమాధానాలు. కానీ ఆ చిన్న చిన్న మాటల మధ్యే ఇల్లు జీవించి ఉంది.
సరోజ రెండు స్టీల్ గ్లాసుల్లో కాఫీ పోసుకుని బాల్కనీలోకి వచ్చింది. కాఫీ స్టీల్ గ్లాసుల్లోనే తాగడం వారిద్దరికీ ఇష్టం. వీధి ఇంకా పూర్తిగా మేలుకోలేదు. ఎదురింటి మామిడి చెట్టు మీద పక్షులు అరుస్తున్నాయి. దూరంగా పేపర్ అబ్బాయి బైక్ శబ్దం వినిపిస్తోంది.
రామమూర్తి అప్పటికే ఫోన్ చేతిలో పట్టుకుని ఏదో చూస్తున్నాడు.
“బాబుకి మెసేజ్ పెట్టారా?” సరోజ అడిగింది.
“పెట్టాను.”
“ఏమని?”
“ఈసారి మామిడి పూత బాగుందని.”
సరోజ చిన్నగా నవ్వింది. రామమూర్తి కూడా నవ్వాడు. కొద్దిసేపటికే ఫోన్లో రెండు నీలిరంగు టిక్కులు మెరిశాయి.
రామమూర్తి వాటివైపు చూసి మెల్లగా అన్నాడు,
“లేచాడు. మెసేజ్ చూశాడు”
సరోజ కూడా స్క్రీన్ వైపు చూసింది. ఇంక ఏ సమాధానం రాలేదు. ఇద్దరూ అలవాటైన నిశ్శబ్దంతో కాఫీ తాగసాగారు.
రామమూర్తి తెలుగు పండితుడు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఐదేళ్లు పనిచేశాడు. ఇప్పటికీ బజార్‌కి వెళ్లినా ఎవరో ఒకరు ఎదురై, “నమస్తే మాస్టారు.. నేను మీ స్టూడెంట్‌ని..” అంటారు.
రామమూర్తి కళ్లద్దాలు సరిచేసుకుని వాళ్ల ముఖాలు జాగ్రత్తగా చూస్తాడు. చాలాసార్లు గుర్తుపట్టలేడు. అయినా గుర్తున్నట్టే మాట్లాడతాడు. ఇంటికి వచ్చాక సరోజ నవ్వుతూ అడుగుతుంది-
“నిజంగా గుర్తున్నారా?”
“అబ్బే లేదు”
“మరి అంత ఆప్యాయంగా ఎలా మాట్లాడతారు?”
రామమూర్తి నవ్వుతాడు.
“మనిషికి గుర్తుపట్టడంకన్నా.. గుర్తున్నట్టనిపించడం ముఖ్యం.”
సరోజ అప్పుడప్పుడూ అనుకుంటుంది – ఈయన తెలుగు మాత్రమే కాదు, మనుషుల్ని కూడా బాగా చదివాడు అని.
వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు అర్జున్, ముంబైలో పెద్ద కంపెనీలో ఉద్యోగం. కోడలు సుప్రియ కూడా ఉద్యోగమే. మనవరాలు కీర్తన మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. మొదట్లో ప్రతి రెండు నెలలకు హైదరాబాద్ వచ్చేవాళ్లు. తర్వాత ఆరు నెలలకు, ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా గొప్పే!
వాళ్లు రాకపోయినా ఇంట్లో వాళ్ల జాడలు మాత్రం అలాగే ఉన్నాయి. కీర్తన చిన్నప్పుడు ఆడుకున్న ప్లాస్టిక్ కిచెన్ సెట్ ఇంకా పై బీరువాలో ఉంది. అర్జున్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాడిన గ్లోబ్ మీద ఇప్పటికీ నీలి ఇంకు మరక కనిపిస్తుంది. సరోజ వాటిని పారేయనివ్వదు.
“చాలా పాతవి అయిపోయాయి” అంటాడు రామమూర్తి.
“పాతవి కాదు.. ఇంట్లో మనుషులు ఉన్నట్టనిపించే వస్తువులు.” అంటుంది ఆమె.
ఆ రోజు సరోజ డైనింగ్ హల్లో ఊరగాయ కోసం మామిడి ముక్కలు తుడుస్తోంది. రామమూర్తి చూసి ఆశ్చర్యపోయాడు.
“ఇంతా ఆవకాయా?” అన్నాడు.
“ఏం.. తక్కువే పెట్టాను.” అంది.
“మనిద్దరికే ఇంతెందుకు?” అన్నాడు ఆశ్చర్యంగా.
సరోజ చేతులు ఒక్క క్షణం ఆగిపోయాయి.
“వాళ్లు వస్తారేమో ఇద్దాం అనిపించింది..”
ఆ మాట ఆమె మాములుగానే అంది. కానీ చివరి మాటలో చిన్న జీర వినిపించింది. రామమూర్తి ఏమీ అనలేదు.
బయట వీధిలో కొరియార్ బాయ్ బెల్ కొట్టి, పాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ల ఇంటి తలుపు ఎక్కువగా తెరుచుకునేది కొరియర్ బాయ్స్కే, అతిథులకు కాదు. ఆదివారం పొద్దున్న వీడియో కాల్ వచ్చింది. కీర్తన స్క్రీన్ ముందు కాసేపు కనిపించింది.
“హాయ్ తాతయ్యా, బామ్మా!”
“ఏం చేస్తున్నావమ్మా?”
“డాన్స్ నేర్చుకుంటున్నాను..”
“తెలుగు నేర్చుకుంటున్నావా?” అడిగింది సరోజ. కీర్తన నవ్వేసింది.
“I can understand.. but reading is difficult బామ్మా..”
సరోజ వెంటనే మధ్యలో అంది – “పర్వాలేదు బంగారం.. ఇబ్బంది పడకు.”
తర్వాత ఆమె అడిగింది. “ఒక పాటైనా పాడమ్మా?”
“Later బామ్మా.. getting late for dance class..”
స్క్రీన్ అటూఇటూ కదిలింది. వెనక నుంచి సుప్రియ గొంతు.
“కీర్తనా షూస్ వేసుకో..”
అర్జున్ స్క్రీన్‌లోకి వచ్చాడు.
“మందులు వేసుకుంటున్నారా?”
“వేసుకుంటున్నాం.”
“వాకింగ్ చేస్తున్నారా?”
“చేస్తున్నాం.”
“Good. Okay Dad.. client call ఉంది. తర్వాత మాట్లాడతాను.”
స్క్రీన్ వెలుగు ఆరిపోయింది. హాల్లో ఒక్కసారిగా ఫ్యాన్ శబ్దమే మిగిలింది. సరోజ మెల్లగా లేచి టీవీ మీద దుమ్ము తుడవడం మొదలుపెట్టింది. రామమూర్తి మాత్రం ఫోన్ వైపే చూస్తున్నాడు.
“పాపకి తెలుగు రాదు..” అన్నాడు కొద్దిసేపటికి.
సరోజ ఒక క్షణం తుడవడం ఆపింది, “ఏం చేస్తాం.. వాళ్ల ప్రపంచం వేరు” అంది.
కానీ అదే రాత్రి బీరువాలోంచి పాత పెద బాలశిక్ష తీసి దుమ్ము తుడిచి మళ్లీ జాగ్రత్తగా పెట్టింది.
రామమూర్తి అది గమనించాడు. ఏమీ అనలేదు.
సంక్రాంతి ముందు రోజు. ఇంట్లో ముగ్గులు, గారెల వాసన, కొత్త బెల్లం – సరోజ ఉదయాన్నే అరిసెలు చేసింది.
“ఇన్ని ఎందుకు?” అన్నాడు రామమూర్తి.
“వాళ్లు వస్తే సరిపోవాలి కదా” అంది సరోజ.
మధ్యాహ్నం అర్జున్ నుంచి మెసేజ్ వచ్చింది.
“డాడ్.. ఫ్రెండ్స్‌తో గోవా వెళ్ళే ప్లాన్ పడింది. ఈసారి పండక్కి రాలేము, సారీ, వచ్చే నెల తప్పక ట్రై చేస్తాం”
రామమూర్తి ఫోన్ సరోజకి ఇచ్చాడు. ఆమె చదివింది. ముఖంలో ఏ మార్పూ కనిపించలేదు.
“పిల్లలు ఎంజాయ్ చేయాలి ఈ వయసులో” అంది సహజంగానే.
సాయంత్రం పక్కింటి పిల్లలకు అరిసెలు పంచింది. రాత్రి మిగిలిపోయినవి డబ్బాలో పెడుతూ కళ్లద్దాలు తీసి చీరకొంగుతో కళ్లుతుడుచుకుంది. రామమూర్తి చూడనట్టు టీవీ వైపు చూశాడు. మధ్యతరగతి దంపతులు చాలాసార్లు ఒకరి బాధని ఇంకొకరు గౌరవంగా చూడనట్టే నటిస్తారు. అది ప్రేమలో చివరి మర్యాద కావొచ్చు.
కొన్ని రోజుల తర్వాత రామమూర్తి తన పాత సహోద్యోగి శేషాద్రి అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు.
రాత్రి నిద్ర పట్టలేదు. ఫోన్ తీసుకుని చాలాసేపు టైప్ చేశాడు.
“ఒరేయ్ అర్జున్.. మిమ్మల్ని చూడాలని ఉందిరా.. ఈసారి వచ్చినప్పుడు కనీసం రెండు రోజులైన ఉంటే బావుండుననిపిస్తోంది”
పక్కనుండి సరోజ మెసేజ్ చూసింది.
“పంపొద్దండి.”
“ఎందుకు?”
“రాలేకపోతే వాడికే బాధ.”
రామమూర్తి చాలాసేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఒక్కొక్క అక్షరం డిలీట్ చేశాడు. చివరికి- “బిజీగా ఉన్నావా?” అని మాత్రమే పంపించాడు.
కొద్దిసేపటికే రెండు బ్లూ టిక్స్ – సమాధానం రాలేదు.
ఆ రెండు నీలి గీతలు రామమూర్తికి ఒక్కసారిగా విచిత్రంగా అనిపించాయి.. తలుపు దగ్గరికి వచ్చి లోపలికి రాకుండా వెళ్లిపోయిన మనిషిలా.
మరుసటి వారం ఉదయం వాకింగ్ నుంచి వచ్చేసరికి ఛాతీలో నొప్పి మొదలైంది.
“గ్యాస్ అయి ఉంటుంది..” అన్నాడు మొదట. కానీ మధ్యాహ్నానికి చెమటలు పట్టాయి.
సరోజ భయపడిపోయింది. పక్కింటి సుబ్బారావు హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు.
“అబ్సర్వేషన్లో ఉంచుతాం” అన్నాడు డాక్టర్.
రాత్రి పన్నెండు దాటింది. వార్డ్‌లో లైట్లు మసకబారాయి. బెడ్ దగ్గర మానిటర్ “బీప్.. బీప్..” అంటూ నిదానంగా మోగుతోంది. సరోజ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఉంది. ఫోన్ ఇంకా ఆమె చేతిలోనే ఉంది. రామమూర్తికి నిద్ర రావడం లేదు. అతను ఫోన్ తీసి అర్జున్‌కి మెసేజ్ పెట్టాడు.
“హాస్పిటల్లో ఉన్నానురా. చిన్నచెక్ అప్”
ఈసారి వెంటనే నీలి టిక్కులు – కొద్దిసేపటికే కాల్.
“డాడ్! ఏమైంది?” ఆ గొంతులో ఆందోళన ఉంది.
“ఏం లేదు రా..”
“డాక్టర్‌తో మాట్లాడించు.” అన్నాడు. తర్వాత సరోజతో కూడా మాట్లాడాడు.
“మామ్.. డోంట్ వర్రీ, పొద్దుటి ఫ్లయిట్‌కి టిక్కెట్స్ చూస్తున్నాను.”
సరోజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
“రావద్దురా.. పని చూసుకో..” అని పైకి అన్నా, లోపల మాత్రం “రా” అనే మాటే తిరుగుతోంది. కాల్ ముగిసాక వార్డ్ మళ్లీ నిశ్శబ్దమైంది.
కొద్దిసేపటి తర్వాత సరోజ చిన్నగా నవ్వింది- “గుర్తుందా.. పదో తరగతి రిసల్ట్స్ రోజు?”
రామమూర్తి ముఖంలో వెలుగు మెరిసింది. వీధి చివర నుంచి సైకిల్ మీద హడావిడిగా వచ్చిన అర్జున్!
“నాన్నా! ఫస్ట్ క్లాస్!” అని అరుస్తూ ఇంట్లోకి దూసుకొచ్చిన ఆ చిన్న కుర్రాడు.
“మీరు వెంటనే చొక్కా మార్చుకుని స్కూల్‌కి వెళ్లిపోయారు..” అంది సరోజ నవ్వుతూ.
“అందరికీ స్వీట్లు పంచాలిగా.” అన్నాడు చిరునవ్వుతో.
“పంచడమేనా.. ‘మా అబ్బాయి ఫస్ట్ క్లాస్’ అని అందరికీ చెప్పి ఉంటారు.”
రామమూర్తి కూడా నవ్వాడు, “అది మా రిసల్ట్ కూడా కదా.”
కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. తర్వాత సరోజ మెల్లగా అంది-
“అప్పుడు ఎంత తొందరగా పెద్దవాడైపోవాలని అనిపించేదో..”
రామమూర్తి ఆమెవైపు చూశాడు.
“ఇప్పుడు అనిపిస్తుంది.. పిల్లలు పెద్దవాళ్లు అవడం అంటే నెమ్మదిగా మన చేతుల్లోంచి జారిపోవడమేమోనని” అని అంది సరోజ.
రామమూర్తి మెల్లగా తల ఊపాడు.
“జారిపోవడం కాదు సరోజా.. ఎగరడం.”
ఆమె చిన్నగా నవ్వింది.
“అవును.. చిన్న పిట్టల్ని గూట్లో ఎంతకాలం ఉంచగలం?”
కొద్దిసేపటి తర్వాత రామమూర్తే అడిగాడు.
“వాడు ముంబై వెళ్ళిన రోజు గుర్తుందా?”
సరోజ కళ్లల్లో వెంటనే ఆ స్టేషన్ వెలుగులు మెరిశాయి. బేగంపేట స్టేషన్. ప్లాట్‌ఫాం మీద జనసందోహం. కొత్తగా కొన్న ట్రాలీ బ్యాగ్. ఆమె చేతిలో స్టీల్ డబ్బా- నిమ్మకాయ పులిహోర, పెరుగు అన్నం. అర్జున్ మాత్రం ఉత్సాహంతో మెరిసిపోతున్నాడు.
“రైలు కదిలేటప్పుడు..” సరోజ గొంతు నెమ్మదించింది, “ఎందుకో నాకు ఏడుపొచ్చింది.”
రామమూర్తి నవ్వుకున్నాడు.
“నువ్వు ఆపుకున్నావు.” అన్నాడు.
“మీరు కూడా.” అంది.
రైలు కదలడం మొదలైంది. అర్జున్ తలుపు దగ్గర నిలబడి చేయి వూపాడు.
“వీలైనప్పుడల్లా వస్తుంటాను!” అన్నాడు నవ్వుతూ. వాళ్లిద్దరూ కూడా చేతులూపారు.
రైలు నెమ్మదిగా దూరమవుతోంది. మొదట ముఖం చిన్నదైంది, తర్వాత ఊపుతున్నచేయి, చివరికి కేవలం కదులుతున్న రైలు మాత్రమే.
“ఆ రోజు ఇంటికి వస్తుంటే.. ఏదో ఖాళీ మొదలైనట్టనిపించింది” సరోజ మెల్లగా అంది.
రామమూర్తి చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అన్నాడు –
“మనమే చదివించాం.. మనమే రెక్కలు రావాలని కోరుకున్నాం..”
సరోజ తల ఊపింది.
“అవును, ఇప్పుడు ఎగిరిపోయాడని బాధపడటం కూడా సరికాదేమో. పిట్టలు గూట్లోనే ఉండిపోతే ఎగరడం నేర్చుకోవు” అంది ఆమె.
రామమూర్తి చిన్నగా నవ్వాడు. “మన తల్లిదండ్రులూ ఇదే అనుకుని ఉంటారు అప్పట్లో.”
ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడే ఫోన్ వెలిగింది. అర్జున్ మెసేజ్.
“How is Dad now?” దాని వెంటనే ఇంకోటి.
“Trying for early morning flight.”
“పరవాలేదు. ఇప్పుడు బానే ఉన్నారు. నువ్వు కంగారు పడకు” అని సరోజ మెస్సేజ్ పెట్టింది.
సరోజ స్క్రీన్ వైపు చూసింది. రెండు బ్లూ టిక్కులు మెరిశాయి.
ఆమె ఫోన్ రామమూర్తికి చూపించింది. అతను చాలాసేపు ఆ స్క్రీన్ వైపే చూస్తూ ఉన్నాడు.
తర్వాత చిన్నగా నవ్వాడు.
“చూస్తున్నాడు..” అన్నాడు మెల్లగా. సరోజ కూడా తలూపింది.
అవును, వాడు చూస్తున్నాడు. వాళ్లను మరిచిపోలేదు.
కానీ జీవితమనే పెద్ద ఆకాశంలో ఇప్పుడు వాడికి తన గూడు, తన ఎగరటం, తన పిల్లలూ, తన దారులూ ఉన్నాయి. ఆ నిజాన్ని అంగీకరించడమే తల్లిదండ్రుల ప్రేమలో చివరి పాఠమేమో.
కిటికీ బయట తొలి సంజె వెలుగులు నెమ్మదిగా పరచుకుంటున్నాయి. దూరంగా ఆకాశంలో పక్షుల గుంపు ఒకదాని వెంట ఒకటి ఎగురుకుంటూ వెళ్తున్నాయి.
రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కధలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు ప్రచురింపబడ్డాయి.

