[డా. మానస్ కృష్ణకాంత్ రచించిన ‘బ్లూ వైల్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ముఖం మీద ముఖం పెట్టి, తోడేలు చూస్తుంది. ఇంకొక క్షణంలో అది ఆమె గొంతును కొరికేయబోతుంది. దాని నోటి నుంచి వచ్చే సెలైవా తన ముఖం మీద పడింది.
సడన్‌గా లేచింది.
3:30 అని డిజిటల్ క్లాక్ చూపిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కలలు తరుచూ వస్తూనే ఉన్నాయి.
రోజూలాగే లేచాక పక్క రూమ్‌లోకి వెళ్లింది.
నిస్తేజంగా, నిస్సత్తువగా.. కళ్ళు లోపలికి వెళ్లిపోయి, ఎముకల గూడులా ఉన్న ఒక శరీరం. అన్ని రకాల మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టి ఉన్నాయి ఆ చేతులకి కాళ్ళకి. ఆక్సిజన్ సిలిండర్ – 50% ఫుల్ అని చూపిస్తుంది. పక్కనున్న వైటల్స్ అన్నీ కూడా నార్మల్‌గా చూపిస్తున్నాయి. సలైన్ బాటిల్ నుంచి ఒక్కొక్క డ్రాప్ ఎక్కుతోంది. యూరిన్ బ్యాగ్‌లో మాత్రం యూరిన్ 20 mlమార్క్ కూడా దాటలేదు. చర్మం అంతా డ్రైగా ఉంది. తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. బెడ్ అంచు పైన కూర్చుని, చల్లదనానికి వెచ్చదనానికి మధ్య ఉన్న ఆ పాప చెయ్యిపై చేయి వేసి చూసింది. చేతి కింద పల్స్ తగులుతుంది. చాలా నెమ్మదిగా.
మళ్లీ గదిలోకి వెళ్లి మొబైల్ చూసుకుంది.
ఒక్క టిక్కే ఉంది.
మిగతా వారందరికీ పంపిన మెసేజెస్ అన్నీ కూడా రెండు టిక్కులు ఉన్నాయి. నెల రోజుల నుంచి ఇది మాత్రం సింగిల్ టిక్గానే ఉంది.
అలా మొబైల్‌ని తన ఛాతి మీద పెట్టుకుని, గట్టిగా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుంది.
***
వరుస మెసేజ్‌లతో మొబైల్ రింగ్ అయింది.
లేచి చూసేసరికి 7:30 అయింది. ఉదయం.
ఆ మెసేజ్‌లన్నీ ఒక వ్యక్తి నుంచే.
“హాయ్. నేను సదర్న్ ఆల్ప్స్లో మౌంటెన్ ట్రెక్కి వెళ్లాను. అక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల మళ్లీ బేస్ క్యాంప్‌కి వచ్చి చెక్ చేసుకునేసరికి నీ మెసేజ్ కనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మెసేజ్ వచ్చేసరికి ఏదో ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది అనుకున్నా. ఎనీథింగ్ అర్జెంట్? కాల్ చేయాలా?”
ఆ మెసేజెస్ చూసిన వెంటనే కాల్ చేసింది.
అవతల వైపు నుంచి ఒక మగ గొంతు. ఎంతో పరిచయం ఉన్నట్టు.. ప్రేమ, మార్థ్యం కలిసిన స్వరం.
“ఎవ్రీథింగ్ ఆల్ రైట్?”
“యా.. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కాకపోతే.. ఇది చివరి స్టేజ్.” అంటూ నిట్టూర్చింది.
“డాక్టర్లు ఏమన్నారు?”
“ఏదో ఎక్స్పెరిమెంటల్ డ్రగ్ అవైలబుల్ ఉందన్నారు. కానీ అది ఎలా పనిచేస్తుందో తెలీదు. అండ్ దానికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇక హోప్స్ లేనట్టే.. అని చెప్పారు.”
ఆమె గొంతు మెల్లగా జారిపోయింది.
కొద్దిసేపు నిశ్శబ్దం.
“ఓకే. రెండు రోజుల్లో నేను వస్తున్నాను. వచ్చాక కలిసి మాట్లాడదాం. విల్ టేక్ ఏ డెసిషన్.” అన్నాడు అతను.
***
పాప రూమ్ నుంచి దగ్గు వినిపించింది.
వెళ్ళి చూసేసరికి తలగడ మొత్తం రక్తం వుంది. కొంత కింద కూడా పడివుంది. ఆ దగ్గిన ఫోర్స్‌కి చేతికి వున్న సూది వూడిపోయి సెలైన్ వాటర్‌తో కలిసిపోయి అక్కడ ప్రవహిస్తుంది. ఆ ప్రవాహంతోపాటు ఆమె ఆలోచనలు కూడా గతంలోకి వెళ్ళాయి.
“నువ్వు అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నా. ఇది చాలా సెన్సిటివ్ రీసెర్చ్ ప్రోగ్రాం. అది కూడా.. ఇది వాళ్లతో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్. ఇంకా ప్రజలకి దీని గురించి తెలియదు. ప్రజలకి ఏలియన్స్ ఉన్నారంటే, ఉత్సాహం కొద్దీ లేదా భయం కొద్దీ, శాంతిభద్రతలకు అవరోధం కలగొచ్చు. అందుకే దీన్ని క్లాసిఫైడ్గానే ఉంచాం. కానీ ఈ రీసెర్చ్ ఒకవేళ సక్సెస్ అయితే గనుక.. మానవాళికి చాలా ఉపయోగం అవుతుంది.” అని ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెల్లగా చెప్పాడు.
“కానీ నన్నెందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నారు? ఐ హావ్ బీన్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ క్వైట్ సమ్ టైం. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి చాలా వరకు తెలుసు.” ఆమె ఆతృతగా అంది.
“అవును. నీకు ఈ ప్రాజెక్ట్ గురించి చాలా విషయాలు తెలుసు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏమవుతుందో కూడా తెలుసు. కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో.. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ కాంప్రమైజ్.”
డైరెక్టర్ స్వరంలో కన్సర్న్ స్పష్టంగా ఉంది.
“కానీ నా పాపకి క్యాన్సర్ ఉందన్న విషయం మీకెలా తెలుసు? అయినా నేను ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని ఎప్పుడూ విడివిడిగానే ఉంచాను. ఐ నెవర్ బ్రీచ్ ద ట్రస్ట్.” ఆమె గంభీరంగా అంది.
“ఆ విషయం నాకు తెలుసు. కానీ ఈ ప్రాజెక్ట్ కేవలం మనం మాత్రమే చేయట్లేదు. మనతో పాటు ఆ రెండు మూడు గ్రహాలకు చెందిన సైంటిస్టులు కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్లకి మనుషుల మీద సరైన అవగాహన లేదు. వాళ్లు చూసిన స్పెసిమెన్స్ హిస్టారికల్‌గా అన్ని ఎమోషన్స్ వల్ల కాంప్రమైజ్ చేశాయని నమ్ముతున్నారు. అందుకే వాళ్ల నుంచి వచ్చిన రిక్వెస్ట్ ప్రకారం నిన్ను ఈ రీసెర్చ్ నుంచి దూరంగా ఉంచుదాం అనుకుంటున్నాం. అండ్ యు విల్ బి ఆన్ ద పేరోల్స్. బట్ యు విల్ బి షిఫ్టెడ్ టు ఏ డిఫరెంట్ వింగ్. అది ఇక్కడ రీసెర్చ్ స్టేషన్లో కాదు. మనకి టాంజానియాలో ఉన్న వేరే రీసెర్చ్ స్టేషన్‌కి ట్రాన్స్ఫర్ చేయమంటూ ఆర్డర్స్ వచ్చాయి పై నుంచి.” అని చాలా క్యాజువల్‌గా చెప్పాడు.
***
“నువ్వు చెప్పిన పని చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ..” అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు అతను.
“కానీ ఏం? భయపడుతున్నావా? నువ్వే చెప్పావు కదా.. డేంజరస్‌గా బతకడమే ఈ లైఫ్‌కి ఉన్న పర్పస్ అని. మరి ఇప్పుడు ఏమైంది నీ ఫిలాసఫీ?”
ఆమె నవ్వుతూ అడిగింది. ఆ నవ్వులో పెదవులు కొంచెం వంకరగా అయ్యాయి.
“భయం కాదు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వెళ్తే మనం అనుకున్న పని కాకపోవచ్చు. దానికి మనకి చాలా రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. అలానే అక్కడికి చేరుకోవడానికి చాలా మందిని కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది.”
“ఆ రూట్ మ్యాప్ అయితే నేను ఇవ్వగలను.” అంది ఆమె.
“అంతేకాకుండా ఆ రీసెర్చ్ స్టేషన్ బ్లూప్రింట్ కూడా నా దగ్గర ఉంది.” అంటూ మొబైల్ ఓపెన్ చేసి ఒక ఫోటోని జూమ్ చేస్తూ చూపించింది.
అతని కళ్ళు ఆశ్చర్యంగా చూసాయి ‘నీకెక్కడిది?’ అన్నట్టుగా.
ఆమె తల నిలువుగా ఊపింది. అతను ఊహించింది కరెక్టేనన్నట్టు.
ఆమె సుమారు నాలుగు సంవత్సరాలు ఆ రీసెర్చ్ స్టేషన్లోనే కోర్ రీసెర్చ్ టీమ్‌లో పనిచేసింది.
“మరి అక్కడికి వెళ్లే మార్గం ఎలా?” అని అడిగాడు.
“అందుకేగా నిన్ను కాంటాక్ట్ చేసింది. నీకున్న మిలిటరీ కాంటాక్ట్స్‌ని ఉపయోగించు. నీతో టిబెట్‌లో పనిచేసిన అతను ఇప్పుడు సెక్యూరిటీ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు అన్నావు కదా. అలానే ఆఫ్ఘనిస్తాన్‌లో నీ బంకర్ మేట్.. ఇప్పుడు హై ప్రొఫైల్ వాళ్లందరికీ పర్సనల్ సెక్యూరిటీ అందిస్తున్నాడు అని విన్నాను.” అని చెప్పింది.
అతను చాలా యాంత్రికంగా నవ్వాడు.
ఆ నవ్వు ఆమెకు తెలుసు. వాళ్లు విడిపోక ముందు చాలాసార్లు చూసిన నవ్వే అది.
“ఓకే.”
అన్నట్టు తల ఊపి, “మిగతాది ఈరోజు సాయంత్రం అందరిని కాంటాక్ట్ చేసిన తర్వాత మనం రెగ్యులర్‌గా వెళ్లే చైనీస్ రెస్టారెంట్లో చెప్తా.” అన్నాడు.
“మనము అక్కడికి వెళ్లి.. ఎనిమిది సంవత్సరాలు అయింది.” వెనక్కి చూడకుండా అంది వెళ్లిపోతూ.
***
ఆ రోజు సాయంత్రం.. వాళ్లు మొదట డేట్‌కి వెళ్లింది కూడా అదే చైనీస్ రెస్టారెంట్‌కే.
అప్పుడు ఎలా క్లమ్జీగా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అతను మొత్తం ప్లాన్ చెప్పాడు.
అక్కడి నుంచి నార్త్ వెస్టర్న్ హిమాలయాస్కి హెలికాప్టర్ ద్వారా వెళ్తాడు. అక్కడ బేస్ క్యాంప్‌లో అతని బంకర్ మేట్ ఏర్పాటు చేసిన చిన్న మేక్‌షిఫ్ట్ టెంట్‌ని ఉపయోగించుకుని తన పని ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి మూడు రోజులు మౌంటెన్ ట్రెక్ చేశాక ఆ రీసెర్చ్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటాడు.
“అక్కడి నుంచి పని పూర్తి చేయడానికి మే బీ వన్ ఆర్ టూ డేస్. మళ్లీ రిటర్న్ కి త్రీ డేస్..” అని కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లా స్ట్రాటజిక్‌గా వివరిస్తున్నాడు.
అంతా విన్న తర్వాత ఆమె అంది: “అయితే ఇంకొక పదిహేను రోజులు మన పాపకి మార్ఫిన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట.”
అతని కళ్ళల్లో తెలియని బాధ మెలిగింది.
ఆమె చేతి పైన చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు.
చిన్నగా తల ఊపాడు.
భోజనం పూర్తిగా ముగియలేదు. ఇద్దరూ ఆర్డర్ చేసినవి అలాగే వదిలేశారు.
చైనీస్ రెస్టారెంట్ కావడం వల్ల ఆ చుట్టూ ఎర్రని వెలుతురు అలముకుంది.
***
మళ్లీ అదే తోడేలు ముఖం.
ఈసారి వెనక నుంచి ఎవరో కొట్టిన శబ్దం.
అప్పటికి ఆమె మూడు నెలల గర్భవతి.
అతనికి ఎంత చెప్పి చూసింది. తనకి అలాంటి అడ్వెంచర్స్ ఇష్టం ఉండవని. కానీ అతను ఎంతో ఒప్పించాడు.
“డేంజరస్‌గా జీవించడమే లైఫ్ యొక్క పర్పస్.” అన్నాడు.
అప్పుడే బలపడుతున్న బంధానికి ఆ మాటలు కరెక్ట్ అనిపించాయి.
అతనితో పాటు వెళ్లింది తను.
కానీ ఆ మౌంటెన్ ట్రైల్ చాలా ప్రమాదకరమైందని అప్పుడే తెలిసింది.
ఒక తోడేలు గుంపు వాళ్లని అటాక్ చేసింది.
ఆ తోడేలు తన మెడను కొరికేసే సమయంలో అతను రాకపోయి ఉంటే.. ఏమై ఉండేదో.
ఆ సంఘటన తర్వాత వాళ్ల మధ్య మాటలు తగ్గిపోయాయి. ఆమె కొంచెం ప్రశాంతమైన స్పేస్ కావాలనుకుంది.
అందుకే 42వ అంతస్తులో సముద్రం కనిపించేలా ఒక చిన్న డ్యూప్లెక్స్ ఫ్లాట్ తీసుకుంది.
కానీ ఏడో నెలకే పాప పుట్టింది.
కానీ ఆ విషయాన్ని అతనితో పంచుకోలేదు.
పంచుకోకూడదనుకుంది. ఇన్ని నెలల్లో ఎప్పుడు తనకు అవసరమైనా దగ్గరలో లేడు. కొన్ని సార్లు పని మీద కొన్ని సార్లు ప్రమాదాలను వెతుక్కుంటూ వెళ్ళి.
తన లైఫ్‌ని ప్రమాదంలో పెట్టి ఆనందాన్ని పొందుదాం అనుకునే మనిషితో జీవించలేనని ఫిక్స్ అయిపోయింది.
అందుకే పాప పుట్టక ముందే అతనితో బ్రేకప్ అయింది. తాను అనుకున్న జీవితానికి మొదటిసారిగా వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.
మానసికంగా. శారీరకంగా.
కోర్టుకైతే వెళ్ళలేదు.
***
“ఇది మనం ముందు చేసిన అడ్వెంచర్స్‌తో కంపేర్ చేస్తే చాలా పర్సనల్. మిగతావన్నీ మనం దేశం కోసం చేశాం. కనీసం దేశం కోసం చేశాం అనుకున్నాం. కానీ ఇది మాత్రం పూర్తిగా నా పర్సనల్.
అందుకే నేను మిమ్మల్ని ఈ మిషన్‌లోకి లాగుదాం అనుకోవట్లేదు. మీరు నాకు ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. యు జస్ట్ గైడ్ మీ త్రూ సాటిలైట్ నావిగేషన్ అండ్ జస్ట్ బి అవైలబుల్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ నీడెడ్. ఎస్ ఓ ఎస్.”
అని ఆ టిబెట్ బ్యాచ్మేట్తోను ఆఫ్ఘన్ బంకర్మేట్ తోను చెప్పి బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాడు.
అలా రెండు మూడు రోజుల నిటారుగా ఉన్న ట్రెక్ తర్వాత ఒక భాగానికి చేరుకున్నాడు. అక్కడ ఏదో కొద్దిగా తవ్వినట్టు ఉంది. ఒక పెద్ద ఖాళీ కనిపించింది రాయిలో. అక్కడ కొన్ని అక్షరాలు కనిపించాయి.
అప్పుడు గుర్తొచ్చింది – ఆమె చెప్పిన కోడ్ లాంగ్వేజ్ గురించి. మనుషులకి, ఏలియన్స్‌కి అర్థమయ్యే ఒక భాష గురించి ఆమె ఇచ్చిన బుక్లెట్ గుర్తొచ్చింది.
బ్యాగ్‌లో చెయ్యి పెట్టి చూశాడు. చిన్న బుక్ ఒకటి బయటకి తీశాడు.
దాని మీద ఉన్న సింబల్స్‌ని చూసి అది ఒక ఎలివేటర్ ఎంట్రీ పోర్ట్ అని నిర్ధారణకు వచ్చాడు.
కానీ దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి పాస్ కోడ్ తెలియదు.
కొంచెం పక్కగా ఏదో అలికిడి వినిపించింది.
రెండు ఆకారాలు అతని వైపే వస్తున్నాయి. దాంట్లో ఖచ్చితంగా ఒకటి మనిషిదే.
వెంటనే పక్కకు కనిపించకుండా దాక్కున్నాడు. మంచులో అతను వేసుకున్న తెల్లటి మిలిటరీ ఫీల్డ్ అవుట్‌ఫిట్ పూర్తిగా కలిసిపోయింది.
ఆ రెండు ఆకారాలు ఏవో మాట్లాడుకుని అక్కడ కోడ్ ఎంటర్ చేశాయి.
ఆ సీక్వెన్స్ తర్వాత తనకు ఉపయోగపడుతుంది అనుకుని తదేకంగా చూస్తూనే ఉన్నాడు.
అలా ఆ పోర్టల్ ఓపెన్ అయి క్షణంలో మాయమైపోయింది.
ఒక అరగంట తర్వాత మెల్లగా అటువైపుకి వెళ్లి అదే సీక్వెన్స్‌ని ఎంటర్ చేశాడు.
తలుపు తెరుచుకుంది.
లోపలికి వెళ్లాడు.
అనుమానంగా అటు ఇటు చూస్తూ.. ఎందుకంటే అది నార్మల్ ఎలివేటర్లా కనిపించలేదు. అనేక సింబల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ఫ్లోర్‌ని రిప్రెజెంట్ చేస్తుందేమో అనుకున్నాడు.
ఒక పర్టిక్యులర్ సింబల్ మీద నొక్కాడు.
ఎందుకంటే ఆమె ఇచ్చిన బుక్‌లో అదే సింబల్ రిపీట్ అయ్యి ఉంది.
ఆ ఫ్లోర్ దగ్గర ఆగింది.
తలుపు చిన్న శబ్దంతో ఓపెన్ అయింది.
చుట్టూ పల్చని పొగమంచులా కప్పబడి ఉంది. అనేక చిన్న చిన్న గదులు. గాజు గోడలతో.
అక్కడ రకరకాల ఆకారాల్లో జీవులు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అస్పష్టంగా.
ఆ పల్చని పొగమంచులో, పైన ఇచ్చిన గుర్తులను బట్టి, అతను ఒక రూమ్ దగ్గర ఆగాడు.
ఆ రూమ్‌కి బయోమెట్రిక్ లాక్ ఉంది.
గాజు గోడలపై తల దగ్గరగా పెట్టి చూశాడు.
లోపల అనేక బ్లూ కలర్ వైల్స్ ఉన్నాయి.
ఇందాక వస్తూ చూసిన కొన్ని గదుల్లో సలైన్ బాటిల్స్‌లో కూడా అదే రంగు లిక్విడ్ ఉంది.
***
అది ఒక చిన్న ఫెసిలిటీ.
కానీ అక్కడ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ జరుగుతోంది.
అనేక జెనెటిక్ డిసార్డర్స్ కోసం, క్యాన్సర్స్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఆ రెండు మూడు గ్రహాల నుంచి వచ్చిన గ్రహాంతరవాసులు కూడా మన గెలాక్సీకి చెందిన వాళ్లు కాదు. ఆమె చెప్పిన మాటల ప్రకారం వాళ్లు చాలా దూరమైన గెలాక్సీల నుంచి, కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహ కూటముల నుంచి వచ్చారు.
మనము చాలా కాలంగా పంపిస్తున్న ఖగోళ సంకేతాలు వారికి చేరుకున్నట్టు ఉన్నాయి. అందుకే వాళ్లు మనతో తిరిగి కాంటాక్ట్ అయ్యారు.
వాళ్ల గ్రహాల్లో కూడా అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. వాటికి విరుగుడుగా మన దగ్గర జరిగిన పరిశోధనలను వారు కోరారు.
దానికి ప్రతిఫలంగా.. వారి దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీని, జెనెటిక్ డిసార్డర్స్‌ని, క్యాన్సర్‌ని క్యూర్ చేయడానికి వాడే పద్ధతులను మనతో పంచుకోవడానికి సిద్ధమయ్యారు.
అలా ఫామ్ అయింది ఈ ఇంటర్ గెలాక్టిక్ రీసెర్చ్ స్టేషన్.
ఇలాంటి స్టేషన్లు ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నాయి. టాంజానియా, కంబోడియా, ఆస్ట్రేలియా, హిమాలయాస్..
ఒక్కో సెంటర్ ఒక్కో రకమైన ప్రయోగాలకు ప్రసిద్ధి.
కొన్ని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కోసం. మరికొన్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కోసం. ఇంకొన్ని జెనెటిక్ డిసార్డర్స్ కోసం.
ఇది స్పెసిఫికల్లీ క్యాన్సర్ కోసం.
అంటూ కొత్తగా వచ్చిన టీమ్‌కి వివరిస్తున్నాడు రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్.
ఇదంతా శ్రద్ధగా విన్నాడు అతను.
పక్కనే “డ్రెస్ చేంజింగ్ రూమ్” అని కనిపించగానే లోపలికి వెళ్లి ఒక హజ్మత్ సూట్ వేసుకుని వచ్చాడు.
కొత్తగా వచ్చిన మెంబర్స్‌కి కూడా అలాంటి సూట్స్ ఇచ్చారు. ఎందుకంటే బయో హజార్డ్ అయ్యే అనేక రకాల సూక్ష్మ జీవులు, సముద్ర జీవులు, గ్రహాంతర జీవులు అక్కడ ఉన్నాయి.
గుంపులో దాదాపు డజన్ మంది ఉన్నారు. వాళ్లతో పాటు కలిసిపోయాడు.
వాళ్లని ఒక్కో రూమ్ దగ్గర నుంచి ఇంకో రూమ్‌కి తీసుకెళ్తూ దాని గురించి వివరిస్తున్నారు.
చివరగా ఈ బ్లూ వైల్స్ ఉన్న ల్యాబ్‌లోకి వచ్చారు.
కొత్తగా వచ్చిన వాళ్లు అనేక ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆ వచ్చిన వాళ్లలో భూమికి చెందిన వాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లకి ఇంకా పూర్తిగా ఆ కోడ్ లాంగ్వేజ్ తెలిసినట్టు లేదు. అందుకే పక్కనున్న ఇంకో భూగ్రహవాసి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాడు.
“ఇది చాలా సెక్యూర్ రీసెర్చ్ స్టేషన్ కదా?” అని అడిగాడు ఒకడు.
“సెక్యూర్ కాదు. కానీ ఇక్కడ ఒక స్టేషన్ ఉన్నట్టు హై క్లియరెన్స్ ఉన్న ప్రభుత్వ అధికారులకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు. పబ్లిక్ డొమైన్లో కూడా దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.”
“అయితే సెక్యూరిటీ వైస్ ఇది సేఫ్ కాదా?”
“ఇక్కడ సెక్యూరిటీ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు.” అన్నాడు ఆ గ్రహాంతరవాసి.
‘యా.. అది కరెక్టే. ఇక్కడివరకు ఎవరు వస్తారు?’ అని లోలోపల అనుకున్నాడు అతను.
ఇంకొక కొత్త మెంబర్ అడిగాడు: “ఇక్కడ ఎటువంటి కెమెరాలు కూడా లేవే?”
“అవును. ఇక్కడ కెమెరాలు అవసరం కూడా లేదు. ఫ్రీజింగ్ టెంపరేచర్స్ వల్ల ఫీడ్ పని చేయట్లేదు. సర్వర్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. అలానే చాలా సంవత్సరాలుగా ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ జరగకపోవడంతో వాటిని తీసేశాం.”
***
అందరూ ఆ రూమ్ విడిచిపెట్టి వెళ్తున్నారు.
సైలెంట్‌గా ఒక వైల్ని సూట్ జేబులో వేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చాడు.
ఎటువంటి అలారం మోగలేదు.
ఎటువంటి ప్రమాదం రాలేదు.
ఎవ్వరూ చూడలేదు.
కానీ అతని గుండె మాత్రం నిమిషానికి వందసార్లకంటే ఎక్కువ కొట్టుకుంటోంది.
హజ్మత్ సూట్ లోపల చెమటలు.
మెల్లిగా ఎవరికీ కనిపించకుండా మళ్లీ అదే పోర్టల్ దగ్గరికి చేరుకున్నాడు.
మళ్లీ అవే సింబల్స్ నొక్కాడు.
తలుపు తెరుచుకుంది.
అతను కిందకి వెళ్లిపోయాడు.
బేస్ క్యాంప్‌కి చేరుకోక ముందే సాటిలైట్ లింక్ ద్వారా సంప్రదించాడు. హెలికాప్టర్ పంపమని.
అతను అక్కడికి చేరుకునే సరికి హెలికాప్టర్ సిద్ధంగా ఉంది.
అతని ఆనందానికి అవధులు లేవు.
హెలికాప్టర్ మెల్లిగా గాలిలోకి లేచింది.
కొంచెం దూరం వెళ్లిందో లేదో..
పెద్ద శబ్దం.
ఇంజన్లో మంటలు.
పారాచూట్ అతని సీట్ కింద ఉంది. అది తీసుకుని వేసుకుందాం అనుకునే లోపే ఇంకో పెద్ద శబ్దం.
***
కళ్ళు తెరిచి చూసేసరికి.. ఒక తెల్లటి గదిలో ఉన్నాడు.
అతని చుట్టూ పాలిథీన్ వాల్స్.
ట్రాన్స్పరెంట్గా ఉన్న ఆ గోడల అవతల నిలబడి ఉన్న ముఖాలు స్పష్టంగా కనిపించట్లేదు. కానీ వాళ్లంతా హజ్మత్ సూట్స్‌లో ఉన్నారు.
రకరకాల సైజుల్లో.
దూరంగా అతని బ్యాగ్ కనిపిస్తోంది.
ఆ జిప్ ఓపెన్ చేసి ఉన్నట్టుంది.
కళ్ళు మళ్లీ మూతలు పడ్డాయి. ఏదో చెప్పాలని అనుకున్నలోపే.
***
అక్కడ.. నగరంలో.. 42వ అంతస్తులో..
నిద్ర పట్టక అలా బెడ్ మీద కూర్చొని వుంది.. పక్కనే చల్లగా తగులుతున్న కాళ్ళు.. మెల్లగా జారుతున్న డ్రిప్.
ఇంతలో ఫోన్ స్క్రీన్ మీద మెసేజ్.
ఏదో అన్నోన్ నంబర్ నుంచి.
“హ్యూమన్ యూజ్ కోసం సిద్ధంగా ఉంది. గెట్ యువర్ డాటర్. లొకేషన్ నీకు తెలుసు కదా.
విత్ లవ్,
డైరెక్టర్
రీసెర్చ్ ఫెసిలిటీ”
