[‘బోడేపూడి వేంకటరావు కృతులు’ అనే పుస్తకానికి శ్రీ సూర్యదేవర రవికుమార్ వ్రాసిన ముందుమాటని పుస్తక పరిచయంగా అందిస్తున్నాము.]
కవిత్వ ప్రయోజనాలు బహుముఖమైనవి. కవి సంఘజీవి కనుక సమకాలిక సాంఘిక జీవనంలోని ఒకటి, రెండు లేదా అనేక సంఘటనలు అతనిని ప్రభావితం చేస్తాయి. స్వీయ జీవితంలోని ఆటుపోటులు, కుటుంబ బాంధవ్యాల చీకటి వెలుగులు, మిత్ర ప్రబోధాలు, కుల, మత, రాజకీయ, వృత్తి సంబంధాలు, కీర్తికండూతి – ఏవైనా కవితాసృష్టికి ప్రేరకాలే. ఈ విధంగా ఒక దృక్పథంతో సృష్టించబడిన కవిత్వం అదే దృక్పథం గల పాఠకులు లభించినపుడు అది వారి నుత్తేజపరుస్తూ క్రొత్త ఊపిరులతో కాలగతిలో కొంత ముందుకు సాగుతుంది. లేకుంటే గతించిపోతుంది.
ఒక కవి సృష్టించే కవిత్వం సాధించే ప్రయోజనం స్వల్పకాలికమైనదైనా, దీర్ఘకాలికమైనదైనా, ఆ కవి స్మరణీయుడే అవుతాడు. ఇలా స్మరణీయులైన కవులలో గణనీయులు శ్రీ బోడేపూడి వేంకటరావుగారు. వేంకటరావుగారు శార్వరి నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి (18-8-1900) నాడు గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా జిల్లేపల్లి అనే గ్రామంలో జన్మించారు. కర్షక కుటుంబంలో పుట్టినా ‘హలమున్ పట్టుట మాత్ర మేనెఱుగ’ నని నిజాయితీగా చెప్పుకొన్నారు. తల్లి వీరమాంబ, తండ్రి చినకోటయ్య. చిన్నతనంలో వీధిబడిలో చదివినా అదే గ్రామానికి చెందిన దేవభక్తుని భద్రయ్యగారి వద్ద సంస్కృతాంధ్రాలను అభ్యసించారు. తమ కవితా సంపదకు మేనమామ పాటిబండ్ల వీరయ్యగారు కూడా కారకులని ఇలా చెప్పుకున్నారు.
కవితాప్రౌఢిమ సాహితీగరిమ లోకజ్ఞాన సంపత్తి ధ
ర్మవిశేషజ్ఞత శాస్త్రవైదుషి నపారప్రాభవం బొప్పు ధీ
రవరేణ్యుం డల వీరయార్యునకు గారామైన మేనల్లుడన్
గవితాసంపద తత్ కృపాఫలమ కృష్ణా! మన్మనోవల్లభా! (శ్రీకృష్ణశతకము)
తమ జీవితాన్ని గురించి వేంకటరావుగారు ఇలా వివరించారు.
పదునారేడుల యపై రోగములకున్ బాలైతి, లోనైతి ని
ర్వది యేండ్లప్పుడు ఘోర రుగ్మతల కాపై నెట్టులో తేఱి యి
ర్వది యారేడులు నిండ బెండ్లియయి నీ ప్రాపందు నామీదటన్
బదికాలాలు సుఖంబుగా జరిగె గృష్ణా! మన్మనోవల్లభా! (శ్రీకృష్ణశతకము)
వేంకటరావుగారు చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలో చేరి ఉభయభాషా ప్రవీణులైనారు. తెనుగు పండితులుగా గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె హైస్కూళ్లలో పని చేశారు. గుంటూరులోని శారదానికేతనములో కూడా పనిచేశారు. 13-5-1969 నాడు స్వర్గస్థులైనారు. వాసిరెడ్డి వెంకటసుబ్బయ్యగారితో కలిసి జంట కవిత్వం చెప్పి ‘అక్రూరుడు’ వంటి రచనలు చేశారు.
బోడేపూడి వెంకటరావుగారు సాహితీ వ్యవసాయాన్ని దర్పంగా నిర్వహించారు. వారు అనేక రచనలు చేసినా వారి పేరు వినగానే స్ఫురించేవి ‘ఆంధ్రతేజము’, ‘కళాక్షేత్రము’ రచనలు, ‘ఆంధ్రతేజము’ వీరి తొలి రచన. విజయనగరాన్ని పాలించిన అళియరామరాయలకు బహమనీ సుల్తానులకు జరిగిన తల్లికోట యుద్ధం నేపథ్యంగా ఒక ఆంధ్రవీరుని పౌరుషగాధను తెలిపే చారిత్రక లఘు కథాకావ్యమిది. సాధారణ ఛందస్సులలో కేవలం 118 పద్యాలలో నాలుగు ప్రకరణాలుగా రచించబడిన ఈ రచన 1939లో ప్రప్రథమంగా ప్రకటించబడింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే బి.ఏ. డిగ్రీ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా నిర్ణయించబడింది. తళ్లికోట యుద్ధంలో విజయనగర సైన్యం ‘జయముపై ఆస వీడి’న సమయాన కడసారి భార్యను చూడవచ్చిన ఒక ఆంధ్ర వీరరాకుమారునికి అతడి భార్య ‘యుద్ధాన్ని విడిచి భార్యపై మోజుతో, బ్రతుకుమీది ఆశతో తిరిగివచ్చిన వాడివి మన కులంలో నీవు ఒక్కడివే’ అని దెప్పిపొడుస్తుంది. ఆ వీరుడు తిరిగి యుద్ధానికి వెళతాడు. రామరాయలను ఆశ్రయించి బ్రతుకుతున్న ఆదిల్షా అనే మహమ్మదీయుడు రామరాయలను నమ్మకద్రోహంతో తల త్రెంచుతాడు. అది చూచి విజయనగర సైన్యం కకావికలై పారిపోతుంది. ఆ సమయాన వారికి ధైర్యాన్ని చెప్పి, సమరోత్సాహాన్ని కల్పించి, శత్రుసేనను చీల్చిచెండాడుతాడు ఈ ఆంధ్రవీరుడు. ఇంతలో పక్కవాటున ఒకడు శూలంతో పొడవగా భూమిమీద పడి తన కత్తిని ఒక సైనికుని ద్వారా తన భార్యకు కానుకగా పంపి మరణిస్తాడు. ఆ కత్తిని చూచి అతడి భార్య భర్త వీరమరణానికి ఆనందించి అగ్నిప్రవేశం చేసి దేహత్యాగం చేస్తుంది.
ఈ చారిత్రక కథాభాగంలో 14 ఏళ్ల వీరపత్ని అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేయటం ఆనాటి గౌరవ సంప్రదాయమే కావచ్చు గాని, ఈనాటి పాఠకలోకం దానిని హర్షించదు.
మాతృదేశ భక్తియుక్తమై శృంగార వీర కరుణ బీభత్స అద్భుత రసాలు తగు రీతిగా ప్రదర్శించబడిన ఈ రచనను వేంకటరావుగారు చక్కని శబ్దశిల్పంతో రచించారు.
భర్త మౌనాన్ని, వంచిన తలను గమనించిన భార్య, అతడు యుద్ధాన్ని వీడి వచ్చాడని భావించి పలికిన పలుకులు వీరపత్ని సహజాలై హృదయాన్ని కదిలిస్తాయి.
‘మానధనునకు సంగర మరణమన్న
పూర్వజన్మార్జితంబగు పుణ్యఫలము’.
‘యవన మూకలు వెంటాడ నాంధ్రవీరు
లాలమును వీడిపోయినా రనుట జూడ
పాడు చీకటి కోడి భాస్వన్మయూఖ
జాలమది వెన్ను జూపిన సరణి గాదె’
కపటబుద్ధితో రామరాయలును ఆశ్రయించిన ఆదిల్ శాహా
‘జనకా! యని రాజును బి
ల్చిన నోటనె నాదు చేత జిక్కితి లేరా
యని లోలోపల గొణగు’ నట.’
తళ్లికోట సమీపాన మహమ్మదీయుల సేన యుద్ధానికి మోహరించినదన్న వార్తను విన్న రామరాయల క్రోధాన్ని కవి ఊహించిన తీరు అద్భుతము.
ఆ రామప్రభు నేత్రగోళములలో నానాటి యారుణ్యమే
పారావారములందు బాడబముగా భాసిల్లె విద్యుల్లతా
కారంబై జలదంబులందు వెలిగెన్ గల్పాంత కాలానల
ప్రారంభమున కెల్ల బీజమని సంభావింపగా జెల్లెడిన్.
‘నవ్య గాంగేయు’డైన రామరాయల మూర్తిని వేంకటరావుగారు భావించిన తీరు అల్లసాని వారి ప్రవరుని వరూధిని భావించిన తీరును తలపింప జేస్తుంది.
గ్రీష్మకాల సహస్ర కిరణ దీధితులలో
దీప్తి జాలంబెల్ల దిగిచి తెచ్చి
బడబానలోజ్జ్వల జ్వాలికా మాలలో
దీక్షతా గుణమెల్ల దీసి తెచ్చి
అతి తీవ్రతరమైన యశనిపాతంబులో
వడితనంబెల్లను వడిచి తెచ్చి
ఫాలలోచను నేత్రభవకీలికీలలో
గుర్కశత్వంబెల్ల గమిచి తెచ్చి
తతభయద దుస్సహాటోప ధైర్య శౌర్య
సారమేదుర రామరాజప్రచండ
మూర్తి నిర్మాణ మొనరించె బో విధాతృ
డని వితర్కించి రనిలోన యవన నృపులు.
సమర వీరంబునకు నెల్ల జన్మభూమి
పోతవోసిన తెనుగుల పుణ్యగరిమ
కడది పగతుర పాలిటి కాళరాత్రి
సమర రసికుడు రామరాజ ప్రభుండు.
“మానని దేశభక్తి యవమానము సైపని వంశ దీప్తి వే
రూను మతానురక్తి మహితోజ్జ్వల యౌవన సౌరశక్తి”
గల యువకునిచే చెప్పించిన దేశభక్తి ప్రబోధ పద్యాలు, దేహత్యాగానికి ముందు అతని ధర్మపత్నిచే పలికించిన ఆంధ్రమాతృ ప్రశస్తి కవి కాలంనాటి స్వాతంత్ర్యోద్యమము, ఆంధ్ర రాష్టోద్యమముల ప్రభావ ప్రేరితాలుగా చెప్పవచ్చు. ఈ లఘుకావ్యానికి తలమానికలుగా నిలిచే ఈ పద్యాలలో మచ్చున కొకటి ఉదహరిస్తాను.
ఆంధ్రతేజస్సముద్యద్దివ్య కాంతిలో
వెలుగొందుగాత మీ విశ్వమెల్ల
ఆంధ్రరాజన్య భుజాగ్ర పీఠములందు
రాణించుగాత ధరాపురంధ్రి
ఆంధ్ర సాహిత్య దీవ్యత్సుధా వీచిలో
మోదించు గావుత ముజ్జగంబు
ఆంధ్ర శిల్పకళామతత్వ మెల్లెడలను
సాధించుగాత మాచార్యకంబు
ఆంధ్ర విజ్ఞానలతికా సహస్ర మతివి
నూత్న శోభాపరంపరా నూన మృదుల
కిసలయలతాంత సుషమా వికీర్ణమగుచు
గలయబర్వెడుగాత లోకముల యందు
1967లో వేంకటరావుగారు ‘తృష్ణావర్తము’ అన్న లఘుకావ్యాన్ని ప్రకటించారు. “How much land does a man need” అనే టాల్‌స్టాయ్ కథను ఆధారముగా గ్రహించి రచించబడిన స్వతంత్ర రచన ఇది. “మానవజాతి తృప్తిపథమున బయనించి ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’ అను మంత్రమును జపింపగలిగిననాడే మహాత్ము లాశించిన విశ్వశాంతి, విశ్వకళ్యాణము చేకూరగలదను దివ్యసందేశమున కీ కావ్యము ప్రతీకాప్రాయము” అని రచయితే దీని విశిష్టతను చెప్పారు.
ఇది గుణ మిద్ది దోష మిది హృద్యము నీరస మిద్ది భావనా
స్పదమిది భావనా రహిత శబ్దమయంబిది యంచు గావ్య సం
పద గణియించు నేర్పుగల ప్రాజ్ఞులకుం గృతి యిచ్చి కాంచు స
మ్మదమున కన్న సత్కవికి మాన్యతమం బొక వాంఛ యున్నదే.
అని భావించి ఈ లఘుకావ్యాన్ని అడుగకుండానే గుంటూరులోని ఆదర్శ వైద్యదంపతులు డా॥ కాసరనేని సదాశివరావు, జయప్రదాంబలకు అంకితమిచ్చారు.
126 పద్యాలు, 124 మంజరీద్విపద పాదాలు గల ఈ కృతి ఆకృతిలో చిన్నదైనా ఆశయములో పెద్దదే. దీనిని గ్రహించే ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు 1967-69 సం॥లకు బి.ఏ. స్పెషల్ తెలుగు పాఠ్యగ్రంథంగాను, మైసూరు, బెంగుళూరు విశ్వవిద్యాలయాలవారు 1968-69 సం॥నకు బి.ఏ. పాఠ్యగ్రంథంగాను దీనిని ఎంపిక చేయటం జరిగింది.
గుంటూరుసీమలోని ఒక గ్రామంలో 20 ఎకరాల మాగాణి భూమి కలిగిన 40 ఏళ్ల రైతు ఉన్నాడు. అతనికి జీవనానికి లోటు లేదు. అయినా మనసుకు తృప్తి లేదు. ఇంకా భూమిని ఎక్కువగా సంపాదించి ఇతోధికంగా పంటలు పండించాలని అతని కోరిక. ఒకనాడు తన ఇంటికి వచ్చిన వృద్ధ అతిథి ద్వారా జయపుర సంస్థానంలో పెద్ద అడవి ఉన్నదని, అక్కడి కోయలను కూడగట్టుకొంటే కావలసినంత భూమి లభిస్తుందని విని ఒక్కడే ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి కోయదొరను కలిసి తన కోరిక చెప్పాడు. ఒక దినంలో ఎంత భూమిని చుట్టి వస్తే అంత భూమిని అతనికి ఇవ్వగలనని కోయదొర చెప్పాడు. ఆ మరునాడు ఆ రైతు భూమి చుట్టిరావడానికి బయలుదేరినప్పుడు అతని మనసులో భావాలిలా సాగాయి. ‘రాజులే దాసులైన ఆశకు నావంటివాడు లోనుగావటం విశేషమా? ధనము మానవలోక జీవనము సొబగు గదా! నేనింతవరకు క్రొత్తగా సెంటు భూమి కూడా సమకూర్చుకోలేదు. ఇంట్లో సోమరిగా ఉంటే సంపద ఎలా వస్తుంది? ఈ అవకాశాన్ని విడిచిపెట్టగూడదు.’ ఈవిధంగా ఆలోచించి సూర్యోదయం కాగానే బయలుదేరి ఆ అరణ్యపు మాహాత్మ్యానికి ఆశ్చర్యపడ్డాడు. దాని మహిమను ఎంతగానో ప్రస్తుతించాడు. “చండభానుని ప్రతాపానికి సంతాపం చెంది.. ఫలములందిని జలము లాప్యాయంబున గ్రోలి యొక్కింత విశ్రాంతి గొనుట” మేలని తలచి కూడా కాలం తిరిగిరాదని గ్రహించి “ఒక్కనాటికి క్షుత్తృష్ణలోర్వదగదే” అని అనుకొని పొలము విశిష్టతను భావించుకొంటూ పాడిపంటలే కాక తేనె, కలప కూడా. ఈ అడవి వలన లభిస్తుందని, దానివలన అనంతమైన ధనం సంపాదించవచ్చుననీ, ఇక్కడ విశాలమైన మంచి ఇల్లు కట్టుకోవచ్చనీ ఇంకా గొడ్ల చావిళ్లు, పొలం పనిముట్లు ఏర్పాటు. చేసుకోవచ్చనీ భావించి..
“ఎంతదూరము నడిచితినెంత మేర
నాచికొంటినో తెలియంగ ననువు పడగ
గొండలును గుట్టలును వాగులుండు చోటు
లెల్లలుగ గుఱుతుంచితి నెల్లయెడల”
అని వాటిని చూడటానికి ఒక చిన్న పర్వతం ఎక్కలేక ఎక్కి దేహం శిథిలం కాగా ప్రొద్దుకుంకగా పోలేక ఆ రాత్రి అక్కడే పడుకొని తిండి నీళ్లు లేకపోవటం వలన అలుపు వలన అక్కడే మరణించాడు. ఇంత కథను మనోహరంగా చెప్పి..
ఉన్నదానితో సంతృప్తి నొందలేక
వచ్చినా డిచ్చటికి జుట్టి వచ్చినాడు.
యెంత భూమిని తుద కాక్రమింపగలిగె ..అంటూ
తృప్తికన్నను సౌఖ్య మింకేమి గలదు.
ఆపదల మూల మింకెద్ది యాసకన్న
మృత్యువన నేది యతి సంశయే కన్న
రాననుచు భిల్లులు తమలోన నాడుకొనిరి.
అని ముగిస్తారు కవి. తృష్ణావర్తంలో చిక్కిన మానవుని ఆలోచనలను సహజ సుందరంగా కవిత్వీకరించిన రచన యిది. దీని ఫలశ్రుతి ఇలా చెప్పారు వేంకటరావుగారు.
ఆశ లేక లోకయాత్ర సున్నకు సున్న
ఆశ లేక కలుగ దభ్యుదయము
అవధి మీఱు నాస ఆపన్నిదానంబు
అవధి మీఱ బోని యాస సుఖము.
1948 ప్రాంతంలో వీరు మిత్రులతో కలిసి నాగార్జున క్షేత్రాన్ని చూడటానికి వెళ్లి, ఆ క్షేత్ర సందర్శనానుభూతులను మనోహరంగా చిత్రిస్తూ ‘కళాక్షేత్రము’ అన్న కావ్యఖండికను రచించారు. ఇది 1968 మార్చిలో ముద్రించబడింది. ప్రశంసాఖండము, అవతారఖండము, చరిత్రఖండము అని మూడు విభాగాలుగా 343 పద్యాలలో, రచించబడిన ఈ నిర్వచన కృతిని ‘బ్రహ్మవిదగ్రేసరులు, సాహిత్యనిధి’ అయిన దేవభక్తుని భద్రయ్యగారికి అంకితమిచ్చారు.
ఆ గురువును గూర్చి ఇలా చెప్పారు.
ఆచార్యుడై నిర్మలానురాగంబున
భవ్య సాహిత్య వైభవము గూర్చి
దేశికుడై బుధాదిష్ట మార్గంబుల
సౌశీల్య మహిమంబు సవదరించి
హృదయజ్ఞుడై సమీహితములొ కావ్యని
ర్మాణ వైఖరుల మర్మముల దెలిపి
ఆప్తుడై జీవన వ్యాపృతులందు హి
తాహిత మార్గము లరసి చూపి
నన్ను నున్నతు జేయంగ నాడు
గరిమ గాంచి సంబరపడ సదా కాంక్ష సేయు
శిష్యవత్సలునకు కళాక్షేత్ర కావ్య
మంకిత మొనర్తు దాత్పర్య మచ్చుపడగ.
ప్రశంసాఖండము రెండు భాగములుగా రచించబడింది. 18 పద్యాలు గల ప్రథమ భాగమున నాగార్జునక్షేత్ర వర్ణన, ప్రశంసలతో పాటు ఆంధ్ర శిల్పుల నైపుణ్యము కీర్తించబడింది. 16 పద్యాలు గల రెండవ భాగమున ఆ క్షేత్రములో గల వివిధ శిల్పాలను వర్ణిస్తూ ఆయా శిల్పులకు జేజేలు పలుకబడినది.
మూడుగా విభాగించబడిన అవతారఖండమున మొదటి భాగమున సిద్ధార్థుని జనన మాదిగా అతడు బుద్ధుడై తన ధర్మాన్ని లోకానికి చాటిన గాథ 161 పద్యాలలో మనోహరముగా వర్ణించబడినది. రెండవ భాగమున మగధరాజైన బింబిసారుని జంతుబలిపూర్వక యాగ విధానాన్ని మాన్పి అతనిని బుద్ధధర్మానుయాయిగా మార్చిన బుద్ధుని చరిత్ర 29 పద్యాలలో హృదయంగమంగా వివరించబడింది. మూడవ భాగమున బుద్ధుడు కపిలవస్తుపురానికి వచ్చినపుడు పురజనుల కోలాహలము, భార్య యశోధర మానసిక సంఘర్షణ, బుద్ధుడు భార్యను, కుమారుని అనుగ్రహించిన తీరు 53 పద్యాలలో సుందరంగా చిత్రించబడింది.
బుద్ధుని నిర్యాణానంతరం అశోకుడు, కనిష్కుడు చేసిన బౌద్ధధర్మ ప్రచారం, ఆచార్య నాగార్జునుడు శ్రీపర్వతంపై నివసించి బౌద్ధధర్మాన్ని ప్రచారం చేసిన తీరు, అక్కడ శిల్పులు చెక్కిన శిల్పాల విలాసం చరిత్రఖండంలో 54 పద్యాలలో స్థూలంగా స్పృశించబడింది. “కవితా కౌశలము, భావప్రౌఢిమ, ఉపదేశ సామర్థ్యము, శైలీ ప్రసన్నత”తో నిండిన కళాక్షేత్ర కావ్యము వేంకటరావుగారి కవితాశక్తికి నిలువెత్తు దర్పణం. ఇందులోని శబ్ద ప్రయోగాలు వీరి సంస్కృత భాషాపాండిత్యాన్ని, తెనుగు నుడికారాన్ని పట్టి చూపిస్తాయి. ఉదాత్తమైన కథా వస్తువున కనురూపమై వీరి వర్ణనలు మహోదాత్తంగా సాగాయి. మాయాదేవి కడుపున పుట్టిన బుద్ధుని ఎలా భావించారో చూద్దాం.
జగములన్నింట నజ్ఞాన తమోరాశి
నాశంబొనర్చు విజ్ఞాన కళిక
జన్మజరామృత్యు సంతాపములు నెల్ల
<strong>హరియించు మహిత దివ్యౌషధంబు
అనిదం పురాలబ్ధ మమృత నిధానంబు
నందించు మేలి సిద్ధాంజనంబు
కరచరణాది సత్కరణో పలక్షిత
మానవ పుణ్య సంతానరేఖ
అంతమెరుగని భూతదయాపయోధి
పరమపావన వైరాగ్యభావ మహిమ
పుడమి గలదాక వెలుగొందు భూరితేజ
మా సతీమణి గర్భమం దవతరించె.
బౌద్ధారామాలలోని వృక్షవాటిక లిలా కన్పించాయి కవిగారికి.
చదువగ బాఠశాలలయి సాధన సేయగ దీక్షశాలలై
బ్రదుకగ సత్రశాలలయి బాధల మాన్పగ వైద్యశాలలై
ముదమిడ బోధశాలలయి ముక్తినిగూర్పగ ధ్యానశాలలై
సదమల జీవనంబుల బ్రశాంతములై తగు వృక్షవాటికల్.
బౌద్ధధర్మం ప్రపంచవ్యాప్తమౌతున్న సమయంలో లోకస్థితిని చక్కగా చిత్రించారు కవి. దీప్రకవోష్ణ రక్తప్రవాహము లింకె
ననురాగ వాహిను అలముకొనియె
పశు విశసన యజ్ఞవాటికల్ ససి చె
బూత బౌద్ధారామములు సెలంగె
బలిపీఠములు పాడు వాటి శూన్యములయ్యె
భూత హితైకానుభూతి మెఱసె
వివిధ దేవార్చన విధులు కాంతి దొఱంగె
నష్టాంగమార్గ మధ్యస్తమయ్యె స్వార్థ
సంపాదనైక భావంబు లెడలి
పరహితార్ధోపబృంహిత చరిత లెనసె
బౌద్ధభిక్షు లశోకుని ప్రాపునంది
సకల దిక్కుల ధర్మంబు జాటుచుండ.
సిద్ధుడు ఆలుబిడ్డలను, రాజ్యాన్ని విడిచి వెళ్లే రాత్రి వర్ణన యిది. తలచి తనపయి నాసలు నిలుపుకొన్న గౌతమ కుటుంబమున కది కాళరాత్రి ఆశలన్నియు జెడి యార్తి నడలుచున్న ధాత్రి కెల్లను నది శివరాత్రి యగును.
ఈ పద్యంలోని కాళరాత్రి, శివరాత్రి పదాలు చక్కని భావస్ఫోరకాలై పద్యానికి ఎంతో గంభీరతను, నిండుదనాన్ని తెచ్చాయి. ప్రాచీనాంధ్ర మహాకవుల రచనలను తలపించే పద ప్రయోగాలు అనేకం ఈ చిన్న కావ్యంలో కన్పిస్తాయి.
వేంకటరావుగారి ధర్మపత్ని ఆకస్మికంగా మరణించినది. ఆమె స్మృత్యర్థం “కృష్ణా మన్మనో వల్లభా” అన్న మకుటంతో మత్తేభ శార్దూల వృత్తాలలో 106 పద్యాల “శ్రీకృష్ణ శతకము” ను వీరు రచించి 1969 నవంబరులో ప్రకటించారు. వీరి వ్యక్తిగత భావాలు కొన్ని ఈ శతకం ద్వారా వ్యక్తమౌతున్నాయి. మరుగునపడిన ప్రాచీన కవుల జీవితచరిత్రలు, వాఙ్మయ చరిత్రలు త్రవ్వితీసిన ఇరవయ్యో శతాబ్దంలో వీరు జీవించినా కవులకు తమ కవిత్వమే ముఖ్యం గాని, వ్యక్తిగత విశేషాలు ముఖ్యంకాదని వీరు భావించారు. ప్రాచీనాంధ్ర కవులలో అత్యధికులలో కన్పించే ఈ చారిత్రక దృష్టిహీనత వీరిలో కూడ కన్పిస్తుంది. ఈ పద్యం చూడండి.
ఏ కాలంబున యాత డీ కవివరుండే ప్రాంతమందుండె నే
యే కావ్యంబుల నెప్టు వ్రాసె నను చెన్నో యూహలం గూర్చి య
స్తోక ప్రౌఢిమ వాదముల్ సలిపి యేదో పెద్ద సాధింపగా
నాకాంక్షించుట నిష్ప్రయోజనము కృష్ణా! మన్మనోవల్లభా!
కావ్యాన్ని గురించిన వీరి భావనలు ప్రాచీన అలంకారికులవే.
తెలుగున్ జిల్గుదనంబు సంస్కృత వచస్తేజంబు సామాజికో
జ్వల బంధంబు నలంతి పల్కులును గావ్యశ్రీ వపుర్లక్ష్ముల
వ్వల నేదో నొకడై యితీతమని చెప్పన్ రాక యానందమాం
సలమైనట్టిది యాత్మ కావ్యమున.
‘తన కావ్యంబు రసానుబంధ రచనోదాత్తంబు భావోన్నతంబని భావించుట నైజ మెల్లరకు’ అంటూ నిత్యసత్యాన్ని చెప్పారు. ఇంకా విమర్శకుని లక్షణాలు, మానవజన్మ భాగ్యాలు, ప్రజా సేవకులు వీరి కవితకు ప్రేరకాలు.
“కవితావాటిక” అన్నది వీరి ఖండకావ్యసంపుటి. ఇది కవిగారి మరణానంతరము వారి కుమారుడు చిరంజీవిరావుగారిచే 1989 ఏప్రిల్లో ప్రకటించబడింది. ఇందులో తెనుగుతల్లి, నన్నయ, తిక్కన, కొండవీడు, విద్యానగరము, ఆవేగము, ఆంధ్రకవిత్వము, తుక్కాంబ, సంక్రాంతి, ‘మహతి’ పత్రికా స్తుతి, దేశీయుల ప్రబోధము, మునిస్వామినాయుడు, బాపూజీ, పొట్టిశ్రీరాములు, కమల, పటేలుల గురించిన కవితలు – 154 పద్యాలలో ఉన్నాయి.
“కొండతాలంబడి కుములు వాఙ్మయలక్ష్మి, కంతఃపురావాస మలవరించి” నాడట నన్నయ. “తను రచించిన దెల్ల నాదర్శకముగ, దను వచించిన దెల్ల వేదంబు గాగ, దనదు లేఖిని రసపాక తత్త్వమెఱుగ, బొదలు పుంభావశారద” తిక్కన యట.
ఆరుగాలం కష్టపడే కర్షకుని గూర్చి కవితల నల్లమని కవులను ఇలా ప్రార్థిస్తున్నారు.
చలియన కెండనాక దివసంబున నెన్మిది జాలు నొంటిమై
పొలమున నిల్లు కట్టుకొని ప్రోవొనరించిన కష్టమెల్ల గ
రులకును సిస్తుకై విలిచి సోలెడు కర్షకు దైన్యమెల్ల న
గ్గలమగు నశ్రుపూరముల గాన మొనర్పరె సత్కవీశ్వరుల్.
ఇదికాక కర్షక ప్రబోధంగా 14 పద్యాలు వ్రాశారు.
సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ. ముఖ్యంగా స్త్రీలకు, పిల్లలకు అది బహు సంబరాల పండుగ. కుర్రకారుకు కోడిపందేలపైనే మోజు. దానిని వేంకటరావుగారు వర్ణించిన తీరు ఎంత స్వాభావికంగా ఉన్నదో చూడండి.
కొని యెన్నడో దాచికొని యుంచుకొన్నట్టి
రంగుదుస్తులు దాల్చి చెంగలించి
ఏగాని దుగ్గానిగా గడించిన డబ్బు
మొల సంచిలో భద్రముగ నమర్చి
తన చేతి మీదుగా దరిపీదు నిచ్చిన
కోడిపుంజును జంక గూర్చి పట్టి
ఈడుజోడౌ తన తోడి బాలురతోడ
గోడిపుంజుల తీరు లాడుకొనుచు
బరమ సంతోషమూర్తియౌ బాలుడొకడు
కోడిపందెములకు నేగు జాడ జూడ
సంకురాతిరి పండుగ సంబరంబు
దానొక గుత్తగొన్నట్లు గానిపించు.
వేంకటరావుగారి అనువాద రచనలు మూడు. అందులో పండితరాయల గంగాలహరి, క్షేమేంద్రుని చారుచర్యలకు చేసిన అనువాదములు వారి శత జయంతి సందర్భంగా 2000 సంవత్సరం సెప్టెంబరులో వారి కుమారుడు చిరంజీవిరావు గారిచే తొలిసారిగా ప్రకటించ బడినవి. రామచరితము (బాలకాండ) ఇంకను అముద్రితముగానే ఉండిపోయినది.
వేంకటరావుగారు జగన్నాథ పండితరాయల ‘గంగాలహరి’ అన్న సంస్కృత రచనను అనువదించారు. ఇందులో 52 పద్యాలు కలవు. వీటిలో ప్రధానంగా గంగాజల మహిమ అభివర్ణించబడింది. పండితరాయలు ఢిల్లీ సుల్తానును ఆశ్రయించి యున్నవాడు. ఆ సుల్తాను కుమార్తెను వివాహమాడాడు. మతాంతర వివాహ దోషమును పోగొట్టుకొనుటకు గంగా స్నానం చేయదలచి గంగాతీరం చేరాడు. గంగానది 52 మెట్ల క్రింద ఉన్నది. ఆ గంగను పైకి రప్పించుటకు 52 శ్లోకాలలో ‘గంగాలహరి’ ని రచించాడు. ప్రధానంగా శిఖిరిణీ వృత్తాలలో వ్రాయబడిన జగన్నాథుని ‘గంగాలహరి’ని వేంకటరావుగారు మూలంలోని భావాలను పూర్తిగా గ్రహిస్తూ మత్తేభ శార్దూలాలలో కొంత సులభశైలిలో తెనిగించారు.
మచ్చున కొక శ్లోకము – దాని అనువాదము
స్వభావస్వచ్ఛానాం సహజశిశిరాణా మయమపా
మపారస్తే మాతర్జయతి మహిమా కోపి జగతి
ముదాయం గాయం తి ద్యుతల మనవద్య ధృతి భృతః
సమాసాద్యాద్యాపి స్ఫుటపులకసాంద్రాః సగరజాః।
వరవిద్యాకృతులన్ ధరించి సుమనోవాసంబునన్ జేరి సా
గరులేనాడును రోమహర్షణములన్ వారముల్ సేయఁగా
పరమంబుల్ శిశిరంబులై ప్రకృతిమై స్వచ్ఛంబులౌ తావక
స్ఫురదంభో మహిమం బనంతమయి పొల్చున్ సర్వలోకోన్నతిన్.
వేంకటరావుగారు క్రీ.శ. 11వ శతాబ్దికి చెందిన సంస్కృత కవి క్షేమేంద్రుడు రచించిన ‘చారుచర్య’ అన్న 100 శ్లోకాల రచనలో కేవలము 17 శ్లోక భావాలను మాత్రమే తేటగీతులలో తెనిగించారు. (క్షేమేంద్రుని సమకాలికుడైన భోజరాజు కూడా ‘చారుచర్య’ పేరున చిన్న సంస్కృత రచన చేశాడు). వీరి అనువాదం మూలరచన వలెనే సులభసుందరంగా సాగింది.
నోత్తరస్యాం ప్రతీచ్యాం వా కుర్వీత శయనే శిరః
శయ్యా విపర్యయాద్ గర్భో దితేః శక్రేణ పాతితః
అన్న శ్లోకం ఈవిధంగా తెనిగించబడింది.
ఉత్తరం బొండె ప్రాగ్దిశ యొండె శిరము
గాగ బన్నుండ వలె శుభకామి యెపుడు
శయనమున మార్పుచే గాదె శక్రుడు దితి
గర్భవిచ్ఛేదమొనరింపగలిగె మున్ను.
వేంకటరావుగారు ‘వరదరాజేశ్వరి’ అన్న నవలికను, కొన్ని వీరగాథలను వచనంలో రచించారు. ఇవి అముద్రితాలు. వేంకటరావుగారు ప్రధానంగా పండిత కవి.
చదువుదురు గాక చదువకే శారదా ప్ర
సాద సంలబ్ద సారస్వతాధికులయి
నెగడుదురుగాక ఐన నిర్దిద్రవిభవ
పాండితియ కాదె గౌరవ భాజనంబు
అని త్రికరణశుద్ధిగా నమ్మిన విద్వత్కవి. ప్రౌఢ పద ప్రయోగాలు, దుష్కర ప్రాసలు, దీర్ఘ సమాసాలు వీరి కవితలలో విరివిగా కన్పించి భాషపై వీరికి గల అధికారాన్ని నిరూపిస్తాయి. వీరి సాహితీసేవ నిజాయితీ గలది, నిరంతరమైనది, నిస్వార్ధమైనది. కండపుష్టి గల కవిత్వాన్ని కోరుకొనే పాఠకులున్నంతవరకు వీరి కవిత హృదయాహ్లాదిగా నిలిచే ఉంటుంది.
సూర్యదేవర రవికుమార్

