Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బొమ్మల రారాజు ‘కొండపల్లి’

[గత జనవరి 27వ తేదీ, ప్రముఖ చిత్రకారులు కొండపల్లి శేషగిరి రావు గారి శతజయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు డా. కొండపల్లి నీహారిణి.]

జాతీయ చిత్రకారులు కొండపల్లి శేషగిరి రావు గారి జీవితం ప్రకృతితో రంగులతో, సమాజంతో ముడిపడింది. భారతీయ చిత్రకళా విమర్శకునిగా, చిత్రకళాధ్యాపకునిగా విశేషమైన కృషి చేసి తమదైన ముద్రను వేసారు.

మీకందరికీ సుపరిచితులైన వందేళ్ల ఈ బొమ్మల రారాజును స్మరించుకుందాం. 1924 జనవరి 27న కొండపల్లి శేషగిరిరావు గారు జన్మించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ దగ్గర పెనుగొండలో వీరి బాల్యం ఓ పదేళ్ళు పిల్లవాడి వరకు సంపన్న కుటుంబంలోనే గడిచింది. కానీ, కాలం తెచ్చే ఊహించని పరిణామాలు వీరి కుటుంబాన్ని పేదవారిని చేసింది. పదవ తరగతి వరకు వారాలబ్బాయిగా పెరిగిన వీరు చిత్రకారునిగా ఎదగాలన్న తమ ఆశయ సాధన కోసం గొప్ప కలలను కన్నారు. అదే దిశగా అడుగులు వేసారు.

ఒక సంచీలో ఓ జత బట్టలు, ప్రాణప్రదమైన డ్రాయింగ్ పుస్తకాలు, పెన్ను పెన్సిల్, సగం అరిగిన రంగుల డబ్బాలు తీసుకొని రైలెక్కి వరంగల్ నుండి హైదరాబాద్‌కు పయనమైన యువకుడు భావి భారత చిత్రకారుడు అవుతాడని ఆ రోజు ఎవరూ ఊహించలేదు.

శేషగిరి రావు ఊహల ఆకాశాలలో రంగుల హరివిల్లులు నిర్మించుకోలేదు. తన ముందున్న ప్రతి క్షణాన్ని పిడికిటబట్టి కుంచెకు నవనవోన్మేష చిత్రమయ వర్ణ రచనా కౌశలాన్ని నేర్పించుకున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నేర్పును ఓర్పుతో ప్రదర్శించారు. ఈ యువ కేతనమే కొండపల్లి శేషగిరి రావు. కొండపల్లి అంటేనే చిత్రకళ కావ్యం. చిత్రకళ కావ్యం అంటేనే కొండపల్లి అనే అంతగా ఎదిగి మరో ప్రపంచపు రంగుల బాటలు వేశారు.

అది 1940వ దశకం. అవి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సామాజిక రంగాలన్నీ అలలు అలలుగా తడలు తడలుగా కష్టాల తీరంలో సంచరించిన రోజులు.

అయినా తట్టుకోవాలి, బ్రతకాలి, గెలవాలి, ఎవరినీ నిందించవద్దు అని అనుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి, చిత్రకళాభ్యాసమొక్కటే ధ్యేయంగా తీసుకున్న నిర్ణయం సఫలం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు శేషగిరిరావు గారు. కాలం అనుకూలించి పెద్దలు సహకరించడం వల్ల, కృషి ఫలించడం వల్ల హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ఐదేళ్ల ఆర్ట్ ట్రైనింగ్‌లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ వచ్చారు. ఇక్కడి ఈ ప్రథమ శ్రేణి విద్యార్థి, మెహదీ నవాజ్ జంగ్ సహాయ సహకారాలతో అక్కడ కలకత్తాలో రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన విశ్వభారతి ‘శాంతి నికేతన్’ ఒడిలో విద్యార్థిగా చేరారు.సుప్రసిద్ధ చిత్రకారులైన నందలాల్ బోస్, అవనీంధ్ర నాథ్ చటోపాధ్యాయల ప్రియ శిష్యుడు అయ్యారు. ఇక ఈ కళా పిపాసి చిత్రకళా పండితునిగా ఎదగరా?

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ కట్టడాలు కోటలు, బురుజులు, భవనాలు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శించి ప్రాచీన శిల్పకళా సంపదను చిత్రించారు. నీటి రంగులూ, తైలవర్ణాలూ వాహికలుగా బెంగాల్ శైలిలో వీరి చిత్రాలలో బొమ్మలుగా కొలువుదీరాయి. హైదరాబాద్‌లో తాము చదువుకున్న కళాశాలలోనే చిత్ర కళోపాధ్యాయునిగా ఉద్యోగం సాధించారు. ఇటు బోధన అటు సాధన లతో తమ లోని కళా నైపుణ్యానికి ఇంకా ఇంకా మెరుగులు దిద్దుకున్నారు. చరిత్రను చదివి, సంస్కృతిని తెలుసుకొని, పాశ్చాత్య చిత్రకళా రీతులను ఒడిసిపట్టిన వీరి కుంచె విన్యాసాలలో అంతులేని ఆనందాన్నిచ్చే అందాలు వెల్లివిరిసాయి. పాశ్చాత్య చిత్రకళారీతులను ప్రదర్శించారు, భారతీయతను ప్రస్ఫుటించారు.

నన్నయ, అన్నమయ్య, రామదాసు లనే కాదు, దాదాపు 16 సార్లకు పైగా శ్రీమద్భాగవతాన్ని చదివిన విశేషానుభవంతో ‘పోతన’కూ రూపాన్నిచ్చారు. సరస్వతి సాక్షాత్కారం, సీతారాముల సమేతంగా పోతన వంటివి చిత్రించారు. రామాయణ, భారత, భాగవత కథాంశాలకు అనుగుణంగా చిత్రాలను వేశారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలకు ‘తెలుగు తల్లి’ని వర్ణ చిత్రంగా అర్థవంతంగా చిత్రించి విగ్రహరూప కల్పన నిర్మాణానికి చిత్రాన్ని సాక్షాత్కరింప చేశారు. ఆయిల్ పెయింటింగ్స్ వేసినా, వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసినా వీరి బొమ్మలు చూపరులను కట్టిపడేస్తాయి.

పక్షులు రెక్కలార్చి ఆకాశయానం చేసినట్టున్నా, పచ్చని చెట్ల సముదాయాల్లో నింపాదిగా పింఛాన్ని జారవిడిచిన మయూరాలైనా, నీటిలో వయ్యారాలు పోయే కొంగలైనా, నీలిరంగునంతా నింపుకున్న నీటి సంద్రాలైనా,గుట్టల వరుసలైనా మట్టి దిబ్బలైనా, ఒక్కటేమిటి సమస్త ప్రకృతి సంపద అంతా వర్ణ రంజితమై ఉండి పోవాల్సిందే! గడ్డి పొరకనుండి మహా వృక్షాల వరకు, రాళ్ల రప్పల నుండి కొండ కోనల వరకు వీరి కుంచెకు అన్నీ సమానమే! ప్రకృతి సౌందర్యాన్ని, లయగతులనూ, సౌకుమార్య లాలిత్యాన్ని చిత్రించినవన్నీ రసస్ఫూర్తితో వర్ణ రంజితమై వెలుగులీనుతున్నవి.

‘చచ్చిన ఆవు’, ‘డెత్ అండ్ డిజైర్’, ‘కాకులు-సంతాపం’, ‘స్టేట్ హుడ్,’ ‘దొంగ కుక్క’వంటి చిత్రాలు నవీన మానవతావాదం, Neo humanism ను ప్రతిబింబించే చిత్రాలు వీరి కుంచెం నుంచి వెలువడినవి.

పృష్ఠభూమికపై కారడవి, మధ్యలో దీనస్థితిలో దమయంతి కూర్చున్న చిత్రమైనా, అశోక వనంలో సీత చిత్రమైనా, శకుంతల చిత్రాలైనా కళ్ళు తిప్పనీయవు..! దాదాపు 20, 25 నీటిరంగు చిత్రాల్లో కాళిదాసు అభిజ్ఞాన శకుంతల కథాంశాన్ని ప్రస్ఫుటిస్తూ చిత్రించిన చిత్రాలు ఉన్నాయి.

నీటిలో కరిగే బైండర్ మీడియా కలిసిన వర్ణ ద్రవ్యం పర్మినెంట్, ఫాస్ట్ డ్రైయింగ్ మాధ్యమంతో బొమ్మలు వేసేవారు. ఈ టెంపెరా పెయింటింగ్ ‘పుంజు, పెట్ట’- ‘The Cock and Hen’ చిత్రం చైనా జపాన్ సాంకేతిక శైలీ రమ్యత సాధించిన చిత్రం. కాకులు, పులులు, జింకలు, ఏనుగులు, పందులు, ఎద్దులు, చెట్లు, మోళ్ళు ఇటువంటి సహజ ప్రకృతి చిత్రాలు ఎన్నో వేశారు.

1982లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ శేషగిరిరావు గారిపై మోనోగ్రామ్‌ను ప్రచురించింది. యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ ప్రపంచ పోయెట్రిక్ సొసైటీ అవార్డు గ్రహీత, మై స్టిక్ గ్రూపులో ప్రసంగకర్త, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, న్యూసైన్స్ కళాశాల తెలుగు లెక్చరర్‌గా పనిచేసిన డాక్టర్ అరిపిరాల విశ్వం గారు రాసారు ఈ మోనో గ్రామ్‌ను. “కొండపల్లి శేషగిరిరావు నిజాం పాలనపై వేసిన తైలవర్ణ చిత్రం, ఆనాటి క్రౌర్యాన్ని, చారిత్రక సత్యాలను మేళవించి, సునిశితమైన వ్యంగ్యంతో సామాజిక దృక్పథంతో సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ హరిజన మహాసభ సందర్భంగా సామాజిక చైతన్యంతో ‘హరిజనోద్యమం’ చిత్రం ఆయన సృజనాత్మక నైపుణ్యానికి మరో కలిగితురాయి. తన చిన్నతనంలో తను అనుభవించిన కష్టసుఖాలు ఇప్పుడు సృష్టించిన ఈ చిత్రంలో చిత్రకళా రూపంలోకి చచ్చుకొని పోయి – పేదలంటే సానుభూతిని, వెనుకబడిన వారంటే ఆర్ద్రతను వ్యక్తం చేస్తాయి. ఒక సాంఘిక అన్యాయాన్ని తూర్పార పట్టడం, అమానుషాలను ఆవిష్కరించడం జరుగుతుంది” అని రాశారు. ఎందరో కవి పండితులు కొండపల్లి శేషగిరిరావు గారికి సన్నిహితంగా ఉండేవారు. దాశరథి కాళోజీ, గుంటూరు శేషేంద్ర శర్మ, అడవి బాపిరాజు, వానమామలై వరదాచార్యులు, బిరుదు రాజు రామరాజు, ఎమ్.ఎస్.రెడ్డి, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి కవులెందరో వీరికి మిత్రులు. ‘సామాన్య వర్ణ విన్యాసంతో గంభీర భావాలు ప్రదర్శించగల ప్రతిభాశాలి’ అనే శీర్షికతో దాశరథి గారు ఒక వ్యాసాన్ని వ్రాస్తూ, “పరుగెత్తే నది నైనా బంధించును చిత్రం అంతటి ఆకాశమైనా ఇంతవును విచిత్రం” అంటూ శేషగిరిరావు గారి చిత్రాలలోని అంతరార్థాన్ని పసిగట్టి అద్భుతమైన కవిత్వాన్ని ఇలా ఆవిష్కరించారు. ఇలా కవుల మన్ననలు, తోటి చిత్రకారుల, తన శిష్యుల మన్ననలను అందుకున్నారు.

సహజ సిద్ధంగా కవి, రచయిత అయిన శేషగిరి రావు గారు సమకాలీన చిత్రకారులపైనా, ప్రముఖ వ్యక్తులపైనా, భారతీయ కళా సంపద పైన ఎన్నో వ్యాసాలు రచించారు. ఆ వ్యాసాలు ‘చిత్ర శిల్పకళా రామణీయకము’ అనే పేరుతో వెలువడింది. చిత్రకళ విమర్శకులు చదవవలసిన గ్రంథం ఇది. లేపాక్షి, తాడిపత్రి, హంపి శిల్పాలకు ప్రతికృతులుగా చిత్రించిన ‘సురేఖ’ అనే సంచయ సంకలనం ఇప్పటి చిత్రకళ విద్యార్థులూ చూడవలసిందే!

అభివృద్ధి భాగంలో విస్తృతంగా పెరిగిపోయిన పట్టణంలో జీవిస్తున్నాం ఇప్పుడు! ఒకప్పటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే గుట్టలు కొండలు ఎలా ఉండేవో చూడాలంటే శేషగిరిరావు గారి చిత్రించిన చిత్రాలలో చూడాల్సిందే! ఎర్రటి ఎండను లెక్కచేయక చేతికో సంచి వేసుకొని రోజుల కొద్ది తిరిగి తిరిగీ గీసిన ‘కొండలు’  ప్రకృతి సహజ సంపదకు నిలువెత్తు నిదర్శనాలు. ‘సేవ్ రాక్స్’ కాన్సెప్ట్‌తో వీరు వేసిన వందల చిత్రాల్లో రాళ్లు చిత్రరాజాలుగా ఉన్నాయి మనకు!

‘శబ్దం రసాత్మకం కావ్యం’, ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అలాగే ‘రేఖా కళాత్మకం చిత్రం’, ‘వర్ణం కళాత్మకం చిత్రం’ అని పెద్దలు అన్నారు. ప్రకృతి అందాన్ని దృశ్య రూపంలో నైపుణ్యంతో రంగుల బొమ్మలుగా ప్రదర్శించిన రావు గారు అభిజ్ఞాన శాకుంతలం దృశ్య కావ్యాన్ని సృజించినా, గుహడు సీతారాములను సరయు నదిని దాటించడాన్ని సృజించినా, ‘కలువకొలను లచ్చి’ వంటి జానపద స్త్రీ మూర్తులను సృజించినా దేనికదే సాటి! అరకు లోయలో ‘సంతాల్ డాన్స్’ నృత్య విన్యాసాలకు వర్ణ రంజిత రూపం ఇచ్చినా, కోతుల్ని ఆడించే ‘మదారిని’ మనకు బొమ్మల్లో చూపించిన మేకలను తోలుకు వచ్చే గ్రామీణులకు చిత్రించినా ‘శేషగిరిరీయ విధానం’ సుస్పష్టం. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మీరాబాయి చిత్రాలైనా, మహిషాసుర మర్దిని, విష్ణు, దుర్గ వంటి చిత్రాలైనా స్త్రీ జాతి ఔన్నత్యానికి చిరునామాలు.

పోర్ట్రైట్స్ వేయడంలో సిద్ధహస్తులు శేషగిరి రావు గారు. గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, దేవులపల్లి రామానుజ రావు వంటి ఎందరో ప్రముఖుల పోర్టైట్స్‌ని వేశారు. శేషగిరిరావు గారు కాళోజి గారిది నిలువెత్తు చిత్రం వేసారు. ఇదే చిట్టచివరి పోర్ట్రైట్.

ఇలా ఓ చిత్రకారుని శతవత్సరాల జీవన ప్రస్థానాన్ని కొన్ని వాక్యాలలో కుదించడం ఏ మేరకు సాధ్యం? మహా సముద్రం నీటిని కన్నుల్లో నింపుకోలేనట్టు, జీవనది నీటిని దోసిళ్ళతో తాగేసేయలేనట్టు ఈ చిత్ర కళా తపస్వి కృషి ని సంక్షిప్తంగా నైనా తెలుసుకోగలగాలి.

ఒక సందర్భంలో శేషగిరి రావు గారు మాట్లాడుతూ “‘జీవితం’అంటే కష్ట సుఖాల్ని సమంగా ఆస్వాదిస్తూ ముందుకు సాగడం. ‘కళ’ అనేది ఒక యోగం. ఏకాగ్రతతో సాధన చేస్తే కళాకారులకు ఆత్మశాంతి చేకూరుతుంది. ఇటువంటి శాంతిని నేను బాగా అనుభవించాను. చిత్రకారులనేవాళ్ళు విష్ణుమూర్తిని బొమ్మను, గడ్డి పరికను రెంటిని ఒకే రకమైన ఆరాధనా భావంతో చూడగలగాలి” అన్నారు. శేషగిరి రావు గారి వందేళ్ల జీవితాన్ని తెలుసుకుంటే భారతీయ గత వర్తమానాలు, చరిత్ర సంస్కృతి తెలియడమే కాకుండా చిత్రకళ మెళకువలు, లోతులూ కూడా తెలుస్తాయి.

“He is friend who readily stands in support of poets and writers while bringing their great works out. And he is guide to fellow writers and intellectuals” అని అన్నారు మహాకవి దాశరథి. కవులకు, మేధావులకు వీరి సృజనాత్మకమైన చిత్రాలతో వారి వారి రచనలకు, ఆలోచనలకు తగిన స్నేహాన్ని అందించే కళాకారులు అని శేషగిరిరావు గారి గురించి దాశరథిగారు అభిప్రాయపడ్డారు అంటేనే తెలుస్తుంది – చిత్రకళతోపాటు సాహిత్యం తోను వారికి ఉన్న అనుబంధం. ఎంతోమందికి గ్రంథాలకు ముఖచిత్రాలను వేసి ఇచ్చిన వీరికి కవిత్వం అంటే కవులు అంటే ఇష్టం గౌరవం. కేంద్ర ప్రభుత్వం నుండి ‘ప్రొఫెసర్ ఎమెరిటస్’, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం ‘హంసా అవార్డ్’ శేషగిరి రావు గారిని వరించాయి. వంశీ ఇంటర్నేషనల్ సంస్థ, కిన్నెర ఆర్ట్స్ సంస్థ వంటి ఎన్నో సంస్థల నుంచి సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు.

అద్భుతమైన చిత్రాలను అందించి, అనేక మంది విద్యార్థులకు చిత్రకళను బోధించి, సృజనాత్మకమైన రచనలను చేసి, ఆలోచనాత్మకమైన వ్యాసాలను రచించి చిత్రకళ జగత్తుకు అందించి నిండైన తమ కౌటుంబిక జీవితాన్ని సంతృప్తి  అనుభవించి, ఆదర్శాన్ని సమాజానికి అందించి, 2012 జులై 26న వారి తొంభయ్యవ ఏట పరలోక గతులయ్యారు శేషగిరి రావు గారు.

వారు లేరు అనలేని జీవితం వారిది. వారి రచనలు, వారి చిత్రాలు వారికి మరణం లేదని నిరూపిస్తున్నాయి. కొండపల్లి శేషగిరి రావు గారి శత జయంతి 2024, జనవరి 27 సందర్భంగా ఈ అక్షర నీరాజనాలను సమర్పిస్తున్నాను.

Exit mobile version