[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘బూడిదగా మారే రోజు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
దుర్మతులై దురహంకారులై
దుర్నీతిన ముందుకు సాగుతూ
దుర్బలులను అర్బకులను వేధిస్తూ సాధిస్తూ
దౌర్జన్యం కావిస్తూ దోపిడీలను చేయిస్తూ
బరితెగిస్తూ ఉరి బిగిస్తూ
రక్కసులై కర్కసులై
సామాన్యుడి రక్తాన్నే తాగేస్తూ
నిస్సిగ్గుగా నిర్లజ్జగా దమనకాండ
పట్టపగ్గాలు లేని మారణకాండ
వేయి గొడ్లు తిన్న గద్ద
ఒక దెబ్బకు కూలిన చందాన
రాక్షస తలలు
తెగి కాష్టంలో పడి
భగ్గుమంటూ బూడిదగా మారే రోజు
వస్తుందని దగా పడ్డ దీన జనం ఎదురుచూస్తోంది
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
