[బానోత్ అనిల్ కుమార్ గారు రచించిన ‘బోయి భీమన్న కవితా లక్ష్యం – పీడిత ప్రజల అభ్యుదయం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ బిరుదులు పొందిన శ్రీ బోయి భీమన్న ప్రధానంగా సాహితివేత్తగా పేరు గడించినప్పటికి రాజకిrయవేత్తగా, సంఘ సంస్కర్తగా, సాంసృతికోద్దిపకులుగా కూడా ప్రశస్తమైన పాత్ర నిర్వహించారు.
భీమన్న సాహిత్యాన్ని పరిశీలించి చూస్తే వారి వారి సిద్ధాంతాలకు అనుగుణంగా భీమన్న దృక్పథాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. నాస్తికుడిగా, హేతువాదిగా, మానవ వాదిగా, దళితవాదిగా, గాంధేయవాదిగా, అంబేద్కర్ వాదిగా భీమన్న దర్శనమిస్తారు భీమన్న సాహిత్యంలో పద్యం గద్యం గేయం శతకం నవల నాటకం వచనం వంటి ప్రక్రియలు ఉన్నాయి ఆయన సాహిత్యాన్ని భిన్న దృక్పథాల కూడలి అని సూత్రీకరించుకోవడం సముచితంగా ఉంటుంది భీమన్న భిన్న దృక్పథాల్లో బలీయంగా కనిపించేది దళిత దృక్పథమే. ఆ విషయంగా అనేక పరిశోధనలు జరిగాయి. బోయి భీమన్న కవితా లక్ష్యం పీడిత ప్రజల అభ్యుదయం.
బోయి భీమన్న బాల్య యవ్వన కాలాల నాటికి సమాజంలో ఎక్కడ చూసినా గుడిసెలు పాకలు, పూరి కొంపలు కనిపించేవి వాటి చుట్టూ మురికి మూర్ఖత్వం నిరుద్యోగం నిరాశ కనిపించేవి నేటికీ కనిపిస్తాయి భీమన్న వీటిని రూపుమాపేందుకు ఏ మతం ఏ దేవుడు ఏ ప్రణాళికలు వేశారు ఆ ప్రణాళికలు ఎందుకు సర్వజన శ్రేయస్కరాలు కాకపోయాయి దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.
కాబట్టి –
“ప్రజలు తమ చెడ్డలను నక్కలకు
పులులకు వదిలేసి కూర్చున్నంతకాలం
ఏ సోషలిస్టు పథకం గతైనా ఇంతే!
ఆకలి లేకుండా వేటాడదు మృగమైన
ఏ ఫలసిద్ధి అయినా ఆత్మ ప్రేరణ తోడిదే
ఇరవై సూత్రాలే కానీ
అరవై నేత్రాలే కానీ
తెరచి చూసినప్పుడే వెలుగు
అమలు జరిపినప్పుడే అభ్యుదయం
అప్పుడే ఈ గుడిసెలు గృహాలు కావడం
ఈ శవాలే శివువై లేవడం” అన్నారు.
అందుకే జీవితానికి లక్ష్యం ఏమిటని కవి తనను తానే ప్రశ్నించుకుని జీవించడమే జీవిత లక్ష్యం, ఎలా జీవించినా సరే అన్నారు. కానీ ఇంతలోనే బ్రహ్మకే లేని లక్ష్యం నీకూ నాకూ ఎందుకు అంటాడు. ఈ ప్రశ్నకి సమాధానం బ్రహ్మ చేతిలోనే లేదన్నాడు. ఆ బ్రహ్మకే ఏం చేయాలో తెలియదు. తెలియకుండానే తోచినట్లల్లా చేసేస్తున్నాడు. అందుకేనేమో “బియ్యపు గింజల కోసం బారులు తీరిన చీమలు/ బస్సు టికెట్టు కోసం కుప్ప పడ్డ కప్పలు/అన్న సత్రం వరుసలో మూగిన ఈగలు/ ధర్మదర్శనం క్యూలో ముస్తాబైన కోతులు/గులాబీ తీగల నీడల్లో ఆకు తేళ్లు/గంధపు చెట్ల కొమ్మల్లో నాగుబాములు/ పదవుల చుట్టూ ఆబోతులు/ ఆబోతుల చుట్టూ ఆ బాల గోపాలం” ఇదీ కవి నిత్యం దర్శించే లోకం. కవే కాదు మనం కూడా చూస్తున్నది, ఈ లోకాన్నే, ఈ మనుషుల్నే కాబట్టే కొంతమంది ఆశతో ముందుకు అడుగేస్తే, మరికొంతమంది గతించిన స్మృతులతో గతంలోనే గడిపేస్తారు. గతాన్నీ, భవిష్యత్తునీ నమ్మని వారికి వర్తమానమే మిగులుతుంది. కవి సంపూర్ణ సమ సమాజం కోసం చేసే ప్రయత్నంలో తన చుట్టూ వున్న సమాజాన్ని దర్శించి విశ్లేషించి సమన్వయపరిచి విశ్వ శ్రేయస్సు, విశ్వశాంతి, పీడిత ప్రజల అభ్యుదయం తన కవితా లక్ష్యం అన్నారు.
ప్రజల జీవన సరళిలో ప్రముఖ స్థానాన్ని పొందింది మతం. ఒకప్పుడు మతం జాతిని శాసించింది. జాతి గమనాన్ని నిర్దేశించింది. ఈ శాసనాల నిరంకుశత్వం వల్లనే మూఢాచారాలు, అజ్ఞానం సంఘంలో చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కప్పుడు ఈ మతమౌఢ్యం జాతిని నిర్వీర్యం చేస్తోంది. ఈ మతం ముసుగులో స్వార్థపరులు ఎన్నో గారడీలు చేస్తున్నారు కాబట్టే శ్రీ భీమన్న “పరమాత్మ వేరు మతం వేరు, మతం లౌకికమైనది ప్రజల్ని సదా మూర్ఖత్వంలో అట్టే పెట్టి ఉంచడానికి కొంతమంది మేధావులు సృష్టించిన పాత్ర” అన్నారు.
అందుకనే మానవుడు మానవత్వానికి స్వస్తి చెప్పడమే మతం మానవునికిచ్చిన శాపం. బలహీనుణ్ణి గొర్రెలా, బలవంతుణ్ణి క్రూర మృగంలా తయారు చేసింది. కాబట్టి మతాన్ని నమ్మినవారికి స్మశానమే గతి అన్నారు. అంతేకాదు ఈ శాపానికి విరుగుడు లేదా? అని ప్రశ్నించారు. సాంస్కృతిక విప్లవమే ఈ శాపానికి విరుగుడు అని పరిష్కారం చేశారు. ఈ మతపు మాయ పొరలను తెంచుకొని మనిషి “మనీషి” కాగలడని ఆశించినాడు.
మతానికి బదులుగా ప్రయత్నాన్ని ఆశ్రయిస్తే మానవుడు ముందడుగు వేసి అభ్యుదయ మార్గంలో పయనించగలడని కవి ప్రగాఢ నమ్మకం. అందుకనే కష్టించి పనిచేసే కష్టార్జితం తినడానికి సరిపోక పస్తులు ఉండే కార్మికుని కంటే దైవమెవరని ప్రశ్నించారు.
“క్షమయను గూనతో బ్రతుకు సారము బోదెలకెత్తి, కాయక
ష్టమునెటో సాగు చేసి ఫలసాయము తీసి తదన్నమెల్ల దే
శమునకుబెట్టి, తాను భృతి చాలక వస్తుపరుండు కార్మికో
త్తమునికి మించి వేరె యొక దైవము కల్గునే మానమవనిన్”
దైవాన్ని గూర్చిన ఆలోచన కంటే ఆకలితో బాధపడే వారికి తిండి, నివసించడానికి ఆశ్రయాన్ని కల్పించాలని, పాపపుణ్యాల సంఖ్యను పుస్తకాలలో రాయడం వల్ల ఏం లాభం ఉండదన్నారు.
తన సంపద పోతుందేమో నన్ను భయంతో పేదవాడు, దారిద్రంతో బీదవాడు నశిస్తారు. కనుక నాశనం లేని నూతన సృష్టి కావాలంటే అందరిలో సమతా భావనలు నెలకొనాలనేదే కవి కోరిక. ఈ విధమైన సమసమాజ స్థాపన చేయలేకపోతే అవ్యవస్థ ఏర్పడి నడమాంసము నంజిన నాటి వారి సంతానముగా నిరూపణమొనర్చుచు నుందుము” అని నిర్ణయించారు.
కవి ఉద్దేశంలో
“వానపాముల్లా లుకలుక లాడుతూ
క్రిక్కిరిసిన ఆకలి జీవులు
భయంకర నరనారీ పిశాచాలు” లేని లోకం
“సామాజిక విధినిషేదాలు,
సుఖదుఃఖాలు, హాని వృద్ధులు
జరా మరణ వేదనలు లేకుండా” ఉండే లోకం కావాలని కోరారు. కానీ ఇంకోపక్క సుఖం లేదని, సుఖమయ జీవితాన్ని కలుగనివ్వని వారూ ఉన్నారని విలపించారు.
సుఖమంటే
“ఆశల్ని, బాధల్ని, బెంగల్ని, దుఃఖాన్ని
ఆశల ముసుగులో జోకొట్టి నిద్రపుచ్చే
నివురు కప్పిన నిప్పులు ఈ బ్రతుకులు
కగ్గి మగ్గి పోవడమేనేమో”
అంటూ భగవంతుడికేనా ఉందా ఈ సుఖం! నిజానికి ఎన్ని రకాల మతాలు, ప్రార్థనలు, ఫిర్యాదులు, ఎన్ని పోటా పోటీలు, కుట్రలు, హత్యలు, ఎంత నెత్తురు, కన్నీరు, బాధ అని భగవంతునిపైనే జాలిపడ్డారు.
మానవుడు యంత్రాన్ని నడపడం మానివేసాడని, యంత్రాలు మానవుడిని నడుపుతున్న రోజులువి కాబట్టి తాము తినరు ఇతరులను తిననివ్వరు, తాము తినలేరు, ఇతరులు తింటే ఏడుస్తారు అని విచారించారు. ఇంక ప్రపంచంలో భౌతికావసరాలు తప్ప ‘ప్రేమలు, రసాలు’ ఉండవని జీవితం సమరసిమ అవుతుందని, సంసారం నిస్సారం అవుతుందని నిస్పృహ చెందారు.
మతం మీద ఆధారపడ్డ ఈ సమాజము అనే భవనాన్ని ఆధునీకరించవచ్చునా? లేదా భవనాన్ని, పునాదిని కూడా బాగు చేయాలా? అని భీమన్న ప్రశ్నించుకోన్నారు. భగవంతుడి పేరు చెప్పుకొని బ్రతికే మతాచార్యులను వారిని బ్రతికించడానికి ఉపయోగించే మూఢాచారాలను వదిలి తన విధ్యుక్త ధర్మంగా విశ్వసించి ఎవడే పని చేసినా మంచిది. అదే భగవంతుడని విశ్వసించారు.
‘పనే ధర్మం, పనే వ్యక్తిత్వం, పనే సర్వస్వం
పనికన్నా అధికం మరేం లేదు
మానవుడికి పనే భగవంతుడు, భగవంతుడే పని
పని చేసుక బ్రతకడమే కర్మాదైత్వం’
అని ప్రపంచానికి ప్రవచించారు.
మతం పునాదులను గట్టిగా నిలిపేది కులం. ఈ కులాన్నే ప్రాచీనులు ‘వర్ణం’ అన్నారు. ఈ వర్ణాలు నాలుగే అయినా కులాలు అనేకం ఏర్పడ్డాయి. ఈ కులాలు గుణాన్ని ఆధారం చేసుకుని ఏర్పడ్డాయో, వృత్తిని గాని పుట్టుకొను గాని ఆధారం చేసుకున్నాయో స్పష్టంగా చెప్పడం కష్టమే. ఏ మహానుభావుని గాఢమైన ఆలోచనా శ్రమలోంచి ఏర్పడ్డాయో గాని సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అందుచేతనే –
“నరుడు కట్టిన కుటిల వర్ణ ప్రభౌద
ఘోర కారాగృహమ్మును కూల్చబోయి
దాని యిరుకున బడి తామే దగ్ధమైన
ముగ్ధ హృదయాల వాంచా ప్రబుద్ధి నేను”
అని కవి వ్యంగ్యంగా పలుకుతారు. అంతేకాదు ఏ కులమంచు నన్ను వివరింపుల గూడిన కుటిల ప్రశ్నలన్ వ్యాకుల పెట్టబోకుడని వ్యర్ధమని హెచ్చరించారు.
ఋగ్వేదం మనుషులందరినీ సమానంగా బతకమంటోంది. కానీ ఎన్ని నీతులు? ఎన్ని నియమాలు? ఎన్ని విధులు? ఎన్ని నిషేధాలు? ఎన్ని నిర్దేశక సూత్రాలు? వీటన్నింటి వల్ల జరిగింది ఏమిటి? జాతి జవసత్వాలు కోల్పోయి గతం కాళ్ళ కింద ఊపిరాడని మూలుగుతో గిజ గిజ తన్నుకుంటోంది. ఈ నియమాల శృంఖలాలతో బంధింపబడి చదువుకి దూరమైన నిమ్న కులస్తుని గూర్చి –
“ఊరి చివరనున్న పూరిండ్లలో నొక్క
నూనె లేని ప్రమిదె నుండి వెలుగు
కొఱకు వెదుకుచున్న చిఱువృత్తియాతడు
చేరి తూముపై కూరుచుండే
పొట్ట కోసము పగలెల్ల మట్టి మోసి
రాత్రి పూటలనాత్మకోరకము నింత
వికసితము జేసికోనగోరి విప్పునతడు
ప్రాతఃకాలుపుదొక పెద్ద బాలశిక్ష” అని తెలియజేశారు.
ఇందులో జ్ఞానానికి సన్నిహితమై, అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలనే తపన స్పష్టమవుతుంది. అంతేకాదు విజ్ఞానాన్ని ఊరి చివరనున్న పూరిండ్ల లోనికి కూడా తీసుకొని వెళ్ళగలిగిన నాడే అక్కడ నివసించే వారు ఆశతో ముందుకు సాగగలుగుతారు. అప్పుడే ఈ కుల వ్యవస్థను పెళ్లగించి సమ సమాజాన్ని స్థాపించడానికి అవకాశం కలుగుతుందని కవి ఆశించారు. ఆ క్రమంలోనే అంబేద్కర్ లాంటి మేధావులు చేసిన కృషి అనన్య సామాన్యమైనది. పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న రాసిన “జయ జయ అంబేద్కరా” గీతం తెలుగునేలలో దళితుల జాతీయగీతంగా పేరొందింది.
భీమన్న రాసిన నాటకాలు ముద్రితాలు ఇరవై ఒకటి. అముద్రితాలు, అసంపూర్ణాలు మరో ఇరవై వరకు ఉన్నాయి. వాటిలో పాలేరు, కూలి రాజు, అసూయ, రాగవాసిష్టం సుప్రసిద్ధమైనవి.
భారతీయ సమాజంలోని హిందూ వ్యవస్థలో కర్మసిద్ధాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అనాదిగా హిందూ వ్యవస్థలో వర్ణ వ్యవస్థ మనుగడకు ఈ కర్మ సిద్ధాంతం అధికార ముద్రగా పనిచేస్తూ వస్తున్నది. “జన్మాంతర వైరమ్” కావ్యం లోని తేట తెలుగు పద్యాలలో భీమన్న దళితులకోక గొప్ప కార్యాచరణను అందించారు. అది “సంఘ చైతన్య ధృతి నెల్ల సంఘటిత పరచడం సమర్థ సాధింపు ఎంతటి సమరమైన” అనేవి. అంబేద్కర్ ప్రతిపాదించిన “చదివించు సమీకరించు పోరాడు” అనే సాధన త్రయాన్ని భీమన్న అందించారు.
బోయ భీమన్న ఈ సమాజాన్ని పులి, నక్క, గొర్రెలు అనే మూడు తరహాలుగా విభజించారు. గొర్రెలంటే కేవలం రైతులు, కూలీలు, పేద ప్రజలు మాత్రమే కాదు. బుద్ధి జీవులు, కళాకారులు మొదలైన పీడితులందరూ గొర్రెలేనని వీరి అభిప్రాయం. వీరందరూ కలిస్తే సమాజాన్ని పులి, నక్కల భారీ నుంచి తప్పించవచ్చునన్నారు.
దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం ఏవీ మానవుణ్ణి అతని లక్ష్యం నుంచి మరల్చలేవని భావించారు. అప్పుడే మానవుడి అవసరాలు తీర్చి, ఆనందంగా బతకటానికి కావలసిన మార్గాన్ని అభ్యుదయం-సోషలిజం ఏర్పరచగలగటమే తన కవితా లక్ష్యమని శ్రీ బోయి భీమన్న గారు స్పష్టంగా చెప్పారు.
‘గోరా’ (గోపరాజు రామచంద్రరావు), బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు మొదలైన మేధావులతో మైత్రి కలిగిన భీమన్నపై పోతన, వేమనలు అమితమైన ప్రభావం చూపారు. అందువల్లనే ఆయన హేతువాది, మానవతావాది అయ్యారు. బోయి భీమన్నకు మానవునిలోని అభ్యుదయంపై పూర్తి విశ్వాసముంది. “దేవున్ని నమ్మను, పరమాత్మను నమ్ముతాను. దేవుడు వ్యక్తిగతమైనది. పరమాత్మ ప్రపంచకమైనది. ప్రపంచకమైనదే సత్యం. సత్యమే భగవత్సరూపం” అని తన తాత్విక దృక్పథాన్ని ప్రకటించిన శ్రీ బోయి భీమన్న ‘తెలుగు సాహిత్య వినీలాకాశంలో మానవతా పతాక’.
ఉపయుక్త గ్రంథ సూచి:
- బోయి భీమన్న సాహితీ షష్టిపూర్తి సంచిక: జ్ఞానేశ్వర్ గనుమల (సంపా), హైదరాబాదు: సుఖేలానికేతన్, ఇర్రం మంజిల్ కాలనీ – 1983
- హైమవతి. పాలేరు నుండి ప్రద్మశ్రీ వరకు బోయి భీమన్న – హైదరాబాదు: సుఖేలానికేతన్, ఇర్రం మంజిల్ కాలనీ – 1982
- బోయి భీమన్న రచనలు
