Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రముఖ పుణ్య క్షేత్రం బ్రహ్మంగారి మఠం సందర్శన

[ఇటీవల బ్రహ్మంగారి మఠం దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

హా యోగివర్యుడు, కాలజ్ఞానప్రవక్త శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారు, జ్యోతిస్వరూపులై, జీవసమాధిలో వెలసి ఉన్న దివ్య యోగభూమి, బ్రహ్మంగారి మఠం. ఇది కడప జిల్లాలో ఉంది. మఠం ఉన్న ఊరును కందిమల్లయపల్లె అంటారు. ఎ.పి.ఎస్ ఆర్.టి.సి. వారు ఈ ఊరిని ‘బి.మఠం’ అని బోర్డు మీద రాస్తారు. కర్నూలు – కడప రహదారిలో ‘మైదుకూరు’ అన్న ఊరు వస్తుంది. అక్కడి నుంచి ‘పోరుమామిళ్ల’ వెళ్ళే దారిలో వస్తుంది బ్రహ్మంగారి మఠం. మెయిన్ రోడ్డు నుంచి లోపలికి 5 కిలోమీటర్లు ఉంటుంది. నేరుగా వెళితే బద్వేలు, ఆత్మకూరు, నెల్లూరు! ఎడమ వైపుకు వెళ్ళే రోడ్డు విజయవాడ-చెన్నై జాతీయ రహదారిని కలుస్తుంది. మైదుకూరు నుండి కుడివైపు 16 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు పట్టణం, నేరుగా వెళితే, కడప నగరం (32 కి.మీ) ఉంటాయి. ఈ లెక్కన మైదుకూరు ఒక ముఖ్య కూడలి. మైదుకూరు నుంచి బి. మఠానికి ప్రతి అరగంటకు పల్లెవెలుగు బస్సులు ఉంటాయి.

తిరువణ్ణామలై వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లి, రమణమహర్షులవారి ఆశ్రమాన్ని దర్శించలేని వారికి బ్రహ్మంగారి మఠం చక్కని చోటు. దేవస్థానాన్ని బాగా డెవలప్ చేశారు. టి.టి.డి వారి వసతిగృహం, దేవస్థానం వారి రెండు వసతిగృహాలున్నాయి. అన్నదాన ప్రసాదం రోజూ భక్తులకు దొరుకుతుంది. కల్యాణకట్ట, కల్యాణమంటపం ఉన్నాయి.

బి.మఠం ప్రధాన మందిరం, ముఖ మంటపం

దేవాలయం చుట్టూ రాతి ప్రహరీ నిర్మించారు. ప్రధాన ఆలయం ముందు కళాత్మకమైన రాతిస్తంభాలతో గూడిన ముఖమంటపం, దాని పక్కన అందమైన లఘు మంటపం ఉన్నాయి.

లఘు మంటపం

చాలా విశాలమైన ఆవరణ. చదునైన బండలు పరచారు. భక్తులు ఆ ఆవరణలోని రాత్రి నిద్రించవచ్చు. దానిని ‘స్వామి వద్ద నిద్ర చేయడం’ అంటారు. దేవాలయం బయట బాత్‌రూములు, టాయిలెట్లు ఉన్నాయి.

బి. మఠం గాలి గోపురం, ప్రధాన ద్వారం

ప్రధాన మందిరం ఎదురుగా ఒక ధ్వజస్తంభం, అంబరాన్నంటుతూ, ఇత్తడి తొడుగుతో మెరిసిపోతూ ఉంటుంది.

ధ్వజ స్తంభం

దాని పక్కనే క్యూ లైను. ఆవరణ మీద కొంతభాగం రేకులతో ఆర్చ్ వలె పైకప్పు వేశారు. మందిరానికి ఎడమ పక్కన మఠాధిపతి నివసించే భవనం ఉంది. దాని ప్రధాన ద్వారం టేకుతో కళాత్మకంగా చెక్కారు. లోపల చెక్కస్తంభాలు అందంగా పై కప్పుకు దన్నుగా, సుందరంగా ఉన్నాయి. దాని పక్కనే చిన్న శివాలయం. దాని ఎదుట పసుపుపచ్చని నందీశ్వరుడు.

నంది చెంత

మందిరం ముందే కొంతదూరంలో వినాయక మంటపం దర్శనమిస్తాయి.

వినాయక మండపములో..

లోపల గర్భగుడిలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి సమాధి ఉంది. ఆయన క్రీ.శ. 1608లో జన్మించారు. 85 సంవత్సరాలు జీవించి, క్రీ.శ. 1693లో గర్భాలయంలో జీవ సమాధి పొందారు. శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మ. 12 గం॥ ఆయన సజీవసమాధిలోకి ప్రవేశించారు. సమాధి వెనుకు ఆయన వెలిగించిన అఖండ జ్యోతి అప్పటి నుండి వెలుగుతూనే ఉంది. అంటే దాదాపు 3 శతాబ్దాల పైనే.

సమాధిపై వీర బ్రహ్మేంద్రుల వారి, ఆయిన ధర్మపత్ని గోవిందమ్మగారి ముఖాలు రెండడుగుల ఎత్తున దర్శన మిస్తాయి. బంగారు తొడుగుతో చేయబడిన ఆ ముఖాలు సజీవమైనవా అన్న భ్రాంతిని కలుగ జేస్తాయి. శిరముపై జటలు, వాటిని చుట్టిన రుద్రాక్షమాల, అర్ధనిమీలనేత్రుడై, చిరునవ్వుతో ఆ మహాయోగి మన హృదయాలను తాకుతాడు. ధ్యానము, యోగముతో అనుభవమున్నవారికి అక్కడ ఆధ్యాత్మిక ప్రకంపనలు కలుగుతాయి (spiritual vibrations).

అక్కడి దర్శనం రెండు విధాలని చెబుతారు. ఒకటి జ్ఞాన దర్శనం, రెండు భక్తి దర్శనం. మామూలు భక్తులు సైతం స్వామి వారిని చూసి పరవశిస్తారు. ఎందరో భక్తులు, ఎదుట ముఖమంటపం పద్మాసనాసీనులై ధ్యాన నిమగ్నులై ఉంటారు. రాత్రి 8.గంటలకు స్వామివారికి ‘మహాహారతి’ ఇవ్వబడుతుంది. ఉదయం అభిషేకం జరుగుతుంది.

గుడి బయట, ప్రధాన ద్వారం ఎదుట కోదండ రామాలయం ఉంది. అది ఉన్నత గోపురంతో, కళాత్మకమైన రాతి స్తంభాలతో అలరారుతుంటుంది. కొంచెం దూరంతో ఈశ్వరీ దేవి మఠం, మరికొద్ది దూరంలో సిద్ధయ్య (బ్రహ్మంగారి శిష్యులు) ఆశ్రమం ఉంటాయి.

బి. మఠం లోని రామాలయం

ఆ ఊరి గ్రామదేవత పోలేరమ్మ తల్లి దేవాలయాన్ని మనోహరంగా తీర్చిదిద్దారు. దేవాలయానికి ప్రతి నెల హుండీ ఆదాయం దాదాపు 25 లక్షలు వస్తుందట.

గర్భాలయంలో సమాధి పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వ్రాసిన కాలజ్ఞానం అత్యంత పురాతన తాళపత్ర గ్రంథాలలో ఒక మందసములో భద్రపరచబడి ఉంది. వాటిని భక్తులకు చూపుతారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అతి సులభ భాషలో, శైలిలో, పామరులకు సైతం అర్థమయ్యేలా అందచేసిన భారతీయ యోగులలో స్వామివారు అగ్రగణ్యులు. అస్పృశ్యతను, భోజనాలలో కుల, పంక్తి భేదాలను, జంతుబలులను, స్త్రీలకు వేదాధికారం లేదనే వాదాన్ని నిరసించి, ఉద్యమించిన గొప్ప సంఘసంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్రులవారు. జ్ఞానానికి, కులానికీ, మతానికి సంబంధం లేదని, ఆత్మస్వరూపం జ్ఞానమే అని చాటిన మహానీయుడు. అప్పటి కర్నూలు, బనగానిపల్లె, సిద్ధవటం మొ॥ సంస్థానాధీశులైన ముస్లిం నవాబులు సైతం ఆయనను గురువుగా స్వీకరించారు. ముస్లింలలో ఒక తెగ, దూదేకుల కులానికి చెందిన సిద్ధయ్యను ఆయన తన ప్రధాన శిష్యునిగా స్వీకరించారు. పోలేరమ్మ తల్లి ఆయన పిలిస్తే పలికేది. ఆయనను ‘తండ్రీ!’ అని సంబోధించేదని ఐతిహ్యం.

అక్కడికి దగ్గరలోనే బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ ఉంది. అది పర్యాటక ఆకర్షణ. ఇది ‘తెలుగుగంగ’ ప్రాజెక్టు లోని ఒక కీలక భాగం. దీనివల్ల తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందుతాయి. కృష్ణానది నుండి శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా నీరు దీనికి అందుతుంది. ఇది ఒక మట్టి డ్యాం. 27 మీటర్ల ఎత్తు, దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2000 సం॥లో ఇది పూర్తయింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 2.5 TMC (Thousand Million Cubic feet). ఇది కూడ కడప జిల్లా పరిధిలో, ముద్దనూరు గ్రామం దగ్గర ఉంటుంది.

జలాశయంలోని నీరు లేత నీలం రంగులో, స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు. దట్టమైన చెట్లు. పర్యాటకుల స్వర్గం, బ్రహ్మంసాగర్. ఇక్కడ వనభోజనాలకు, చేపలు పట్టే వారికి ప్రకృతిలో నడకకు చాలా అనువు. దీనికి పునాదిరాయి వేసినవారు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు. బ్రహ్మంగారి మఠం బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

ఈశ్వరీ దేవి మఠం ప్రధాన ఆలయానికి కొంచెం దూరం. ఈశ్వరీ దేవిని భక్తులు ‘ఈశ్వరమ్మ’ అంటారు. ఆమె బ్రహ్మం గారి మనుమరాలు. “ఈశ్వరమ్మా! నిన్నె నమ్మితీ! ఈశ్వరమ్మవు నీవె కాగా మోక్షమీయ ఎవరితరమూ” అన్న తత్త్యం ప్రసిద్ధి చెందింది. సాధుసన్యాసులు దీనిని పాడుతూ ఉంటారు.

సిద్ధయ్య గారి మఠం:

ఆయన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తాలూకా కలుగొట్ల గ్రామంలో జన్మించారు. బ్రహ్మంగారికి ముఖ్య శిష్యుడు. ఆయన సమాధి ఇక్కడ ఉంది. బాగా ప్రసిద్ధి చెందిన వాక్యం:

“బ్రహ్మంగారి లాంటి గురువు లేడు, సిద్ధయ్య లాంటి శిష్యుడూ లేడు”

ఆయన అసలు పేరు షీక్ సయ్యద్.

సజీవ సమాధిలోనున్న వీరబ్రహ్మేంద్రస్వామి వారు జ్యోతి రూపంలో ప్రకాశిస్తుంటారని భక్తుల విశ్వాసం. ఆత్మ జ్యోతి స్వరూపమే కదా!

‘శీర్యతే ఇతి శరీరం, దోషధాతు మలామూలం’ అని ఆయన ప్రవచించారు. గృహస్థ ధర్మాన్ని స్వీకరించి కూడా వైరాగ్యసంపదను పొందారు. గర్భాలయం బయట ఆయన కుమారులు కుమార్తెల సమాధులు, వాటిపై వారి ముఖమూర్తులను ప్రతిష్ఠించారు. పక్కన స్వామివారి పాదుకలుంటాయి. వారు సమాధిలోకి ప్రవేశించిన, మూసి వేసిన ద్వారం ఉంటుంది.

అత్యంత ప్రభావవంతమైన ‘ఓం నమోపరబ్రహ్మణే శ్రీ వీరనారాయణాయ నమః’ అన్న మూలమంత్రాన్ని స్వామి ఆనందభైరవయోగికి ఉపదేశించారు. నేలమఠం నందు అన్నాజయ్య అనే బ్రాహ్మణునికి కాలజ్ఞానం బోధించారు స్వామి.

అటువంటి మహాయోగి సన్నిధిలో ఆరురోజుల పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆహ్వానం మేరకు, ఈ వ్యాసకర్తకు, ధార్మిక ప్రవచనములు, భగవన్నామ సంకీర్తనము చేసే భాగ్యం కలిగింది. అది శ్రీ వీరబ్రహ్మేంద్రయోగి దయ!

‘విశ్వమానవ సౌభ్రాత్ర బోధకం భవబాధకం

గృహస్థాశ్రమ తత్త్వజ్ఞం, శిల్పకర్మ సునిష్ఠితమ్

శ్రీ విరాట్ పోతులూర్వీర బ్రహ్మయోగి జగద్గురుమ్’

Exit mobile version