[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో బురుండీకి చెందిన Ketty Nivyabandi రచించిన ‘Remembering Burundi’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి.] {Remembering Burundi – A poem by Ketty Nivyabandi.. African-Burundian Poetess. Telugu translation -Githanjali -India}
~
బురుండీ.. నువ్వు నాకు గుర్తున్నావు!
నీలాకాశాన్ని చీలుస్తున్న ఒక మెరుపులాగా.
మేఘాలని సమ్మోహించాలని చూసే విత్తనాల్లాగా.
అంధకారంలో నక్షత్రాల కాంతిని నమ్మే పురుషుల్లాగా.
స్వప్నాల వెనక వెచ్చగా దాక్కున్న హాయైన పాటలాగా
బురుండీ నువ్వు నాకు జ్ఞాపకం ఉన్నావు.
పాలిచ్చే స్త్రీల ఉప్పొంగిన రొమ్ములు
వెన్న సువాసన వేస్తున్నప్పుటి పాలపుంతలాగా..
చీలిపోయిన పాదాల దాహార్తిని తీర్చే మంచు లాగా..
బురుండీ నువ్వు నాకు జ్ఞాపకం ఉన్నావు!
నాకు బాగా గుర్తుంది!
నాపరాయి.. ఉక్కుతో కలిపి చేసిన దృఢమైన స్వప్నం లాగా…
గర్వంతో ఉప్పొంగిన ఛాతీతో.. నువ్వు నాటిన పదునైన ఈటెలు.,
చెమ్మ బారిన నేలపైన.. లోతైన తవ్వకాలలో ఇంకా అలానే పడిఉన్నాయి.
సూర్యుడి వైపు నగ్నంగా నువ్వు నడుస్తూ వెళ్లడం నాకు ఇంకా గుర్తు ఉంది!
సీతాకోకచిలకల్లాంటి అమ్మాయిలు.. చిందర వందరగా ఎగురుతూ..
స్వర్గాలను రంగులతో ముంచేస్తూ ఉన్నప్పుడు..
వాళ్లంతా.. ఊపిరాడని.. గజిబిజితో.. స్వేచ్ఛ నిండిన నవ్వులతో..
వేల.. వేల చిరునవ్వులతో.. ఉన్నప్పటి
బురుండీ.. నువ్వు జ్ఞాపకం వస్తున్నావు.
అవును నువ్వు నాకు జ్ఞాపకం వస్తున్నావు..
ఓర్పుతో ఉండే నిజమైన మనుషులతో, దృఢమైన మనుషులతో..
ఛిద్రమై ముక్కలు ముక్కలైనా కానీ సంపూర్ణమైన వాళ్ళతో..
పచ్చలూ.. మణి మాణిక్యాల్లా మెరిసిపోయేవారితో..
ఎక్కడికో ఎగిరిపోయే అందమైన వారితో..
ఈర్ష్య పడేంత మోహక సౌందర్యం నిండిన అడవి మనుషులతో నిండి ఉన్న
బురుండీ నువ్వు నాకు జ్ఞాపకం వస్తున్నావు.
ఆ అందమైన మనుషులను చూసిన ప్రవక్త కన్నులు కాలిపోలేదూ??
నిజంగా భూమినించి విడి వడి మహా సామ్రాజ్యాన్ని
ఢీ కొనే సాహసం చేసిన అద్భుతమైన తునకలా.,
నువ్వు నాకు జ్ఞాపకం వస్తున్నావు.
నీ రెక్కల శబ్దం కంటే ముందే..
కాయితాల్లో మాత్రమే కొడుకులవడానికంటే
ముందే..
చీలిపోయిన నీ భూమి ముందు తిరగాడే నీ అనాథ పిల్లలతో..
నీ గౌరవం ముక్కలవడానికి ముందే..
నీ అమ్మకానికి.. ఆకలిగొన్న పొడవైన చెట్లున్న రాచ వీధిలో..
నా బురుండీ
నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
నా బాల్యపు లంగోటీలో రోషంతో రేగి పోయే వెంట్రుకలలో..
సిరాలో మునిగి.. దొంగచాటుగా కాగితాలమీద
జారుతూ వణికి పోయే చేతి వేళ్ల కదలికలతో..
నా విలువైన కలల్లో దుమ్ము.. ధూళితో నిండిన నా చమటలో..
నేను పెట్టె నిస్సహాయపు ఆక్రందనల్లో..
నా జ్వరాల్లో.. నా కళ్లల్లో విశాలంగా తెరుచుకుని
వేలాడుతున్న వర్తమానపు నెలవంకలో.. నా బురుండీ..
నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాను
నిన్నలో.. రేపులో..
ఈ ఉదయంలో.. మరిక ఏమో చెప్పలేను!!
~
మూలం: కెట్టి నివ్యబంది
అనువాదం: గీతాంజలి
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964