[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
మేము ఎగరలేం. కాని నేల మీద నడుస్తాం. నీటిలో మునుగుతాం – కేరింతలు కొడతాం – ఈదుతాం. రెక్కలని టపటపా కొట్టుకుంటూ వేగంగా ఈదులాడుతూ వెళ్ళి – ‘క్రిల్’ చేపలని వెతుక్కుని, వేటాడి తింటాం. చలికాలంలో మేముండే చోట చలి భరించలేనంతగా వుంటుంది. అందుకే మా అమ్మ, నాన్నలు మమ్మల్ని చలి నుండి రక్షించడానికి ‘రూకరీ’లు అనే వసతి గృహాల్లోకి తీసుకువెళతారు. మేము ఆటలాడుకుంటుంటే అమ్మ, నాన్న ఆహారం తెచ్చిపెడతారు.
మేం ఎలా పుట్టి పెరుగుతామో చెప్తాం చూడండి – మా అమ్మ, నాన్నలు జత కట్టి గడుపుతారు. మా అమ్మలు గుడ్లు పెట్టడానికి కొన్ని రోజుల ముందు నుండి ఉపవాసాలు చేస్తారు. గుడ్డు అరకిలో బరువుంటుంది. నాన్నలు సముద్రంలో వేటాడి వస్తారు. అంటే మాలో ఆడ, మగ అందరూ కష్టపడతారన్నమాట. మేము గుడ్డులో నుండి బయటకు వచ్చే వరకు నాన్నలే గుడ్లని పొదుగుతారు. ఈ లోగా మా అమ్మలు ఆహారాన్ని తెచ్చి నాన్నలకు అందిస్తారు. బయటకు వచ్చాక మేము ఒంటరిగా వుండలేము కదా! అందుచేత మా పిల్లలందర్నీ ‘రూకరీ’లు అనే వసతి గృహాలకి చేర్చుతారు. అంటే మీ బేబీకేర్ సెంటర్ వంటివన్నమాట. మమ్మల్ని అక్కడే వుంచి పెద్దవాళ్ళు సముద్రం మీదకి వేటకు వెళ్ళి మాకు యిష్టమయిన ‘క్రిల్’ చేపలని తెచ్చిపెడతారు. మా అమ్మనాన్నలు మీ అందరి అమ్మ, నాన్నల లాగానే అంతమందిలోనూ మమ్మల్ని గుర్తుంచుకుని ఎవరి పిల్లలకి వారు ఆహారం అందిస్తారు. మేమందరమూ సరదాగా ఆడుకుంటూ పనులు నేర్చుకుంటూ పెరిగి పెద్దవుతాము.
మా అమ్మనాన్నలు మమ్మల్ని ఎంత బాధ్యతగా పెంచారో మేము మా పిల్లల్ని ఆడ-మగ కలిసి బాధ్యతగా పోషించుతాము. మరి మీ అమ్మలతో పాటు నాన్నలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకుంటారా? (మీ మనుషులలో కొంతమంది తండ్రులకి బాధ్యతలు పట్టించుకోవడం తెలియదని మాకు తెలుసర్రా! అందుకే అడుగుతున్నాం) లేకపోతే మా అమ్మనాన్నలని చూసి నేర్చుకుని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండేం!
ఇంతకీ మేమెవరిమో మీకు తెలుసా? మేము నేలమీద నడిచి వస్తుంటే బుష్ కోట్లు తొడుక్కుని వచ్చే పెద్దమనుషుల్లా కన్పిస్తాం. మేము ‘అంటార్కిటికా’ ఖండంలో వుంటాం. మేము పెంగ్విన్లం.
