[ఇటీవల కెనడా సందర్శించి, అక్కడి రైళ్ళలో ప్రయాణించి, ఆ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటున్నారు డా. నర్మదారెడ్డి.]
ఎప్పటినుంచో కెనడాకు వెళ్ళాలనుకుంటున్నా, గత మే నెలలో కుదిరింది.
ఆ దేశంలోని దర్శనీయ స్థలాలను రైల్లో వెళ్ళి చూశాము. విఆర్ (వర్చువల్ రియాలిటీ) రైలును చూడాలనే ఆశతో మొదటగా కెనడాలోని వాంకోవార్‌లో దిగాం. వాంకోవార్ నుంచి బ్రిటిష్ కొలంబియాకు వెళ్ళాం.
కెనడాలోని విక్టోరియాలో ఉన్న బుచర్ట్ గార్డెన్స్‌నూ సందర్శించాం. ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనం.
ఒక పనికిరాని సున్నపురాయి క్వారీని ఒక అద్భుతమైన, అందమైన తోటగా మార్చడం వెనక ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ బుచర్ట్ గార్డెన్ అనేది ఎలా ఏర్పడిందంటే.. రాబర్ట్ ఫిమ్ బుచర్ట్ అనే పారిశ్రామికవేత్త సిమెంటు తయారీకి అవసరమైన సున్నపురాయి కోసం 1904లో కెనడాలో ఒంటారియో నుండి బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవార్ ద్వీపానికి వచ్చారు. వారి సిమెంటు ఫ్యాక్టరీకి అవసరమైన భూమిలోని సున్నపురాయి 1909 నాటికి పూర్తిగా అడుగంటి పోయింది. దాంతో ఆ భయంకరమైన గుంటను చూసి బాధపడే బదులు ఆ స్థలాన్ని ఒక అందమైన తోటగా మార్చాలని రాబర్ట్ బుచర్ట్ భార్య జెన్నీ బుచర్ట్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆమె గుర్రపుబండ్ల ద్వారా చుట్టుపక్కల ఉన్న పొలాల నుండి సారవంతమైన మట్టిని తెప్పించి ఆ గుంటల లోపల పూల మొక్కలు నాటడం ప్రారంభించారు. అలా ఆమె చేసిన ప్రయత్నాల ఫలితంగా 1921లో సంకెన్ గార్డెన్ రూపుదిద్దుకుంది.
ఈ గార్డెన్ బయటనుంచి చూస్తే గ్రీన్ కార్పెట్లా కనిపిస్తుంది. అంతా పచ్చని మొక్కలతో కూడిన ఈ గార్డెన్ బయట బుచర్ట్ గార్డెన్ అనే బోర్డు మన మనసుకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఆ ఉ ద్యానవనంలోకి ప్రవేశించగానే ఒక మనిషి ఇంత గొప్ప సృష్టి ఎలా చేశాడు అనిపిస్తుంది. అందమైన మనిషి ఆకృతులు, చూడచక్కటి ఎత్తుపల్లాలు, రహదారులు, పూల మొక్కలతో బుచర్డ్ గార్డెన్ అలరిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక రోజంతా మేము అక్కడే గడిపాం అంటే ఈ ఉద్యానవనం ఎంత ఆహ్లాదంగా, కమనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో జపనీస్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, రోజ్ గార్డెన్ ఇలా ఒక్కొక్క కోవకు చెందిన వివిధ రకాల పూల మొక్కలు మనల్ని ఎంతగానో అలరిస్తాయి. 1939లో ఈ ఆస్తి, మనవడైన యాంకీ జెన్నీ మహ్మద్ గారికి వచ్చింది. 2004లో శత జయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని కెనడా నేషనల్ హిస్టారిక్ సైట్‌గా గుర్తించారు. 55 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ తోట నిత్యం లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఈ తోటను బుచర్డ్ కుటుంబమే నిర్వహించడం విశేషం.
బ్రిటిష్ కొలంబియాలో వివిధ రకాల రోడ్లపైన నడిచి, అక్కడ ఉన్న చారిత్రాత్మక భవనాలన్నీ కూడా తిలకించాము. తరువాత రోజు ఉదయమే విఆర్ (వర్చువల్ రియాలిటీ) ట్రెయిన్ ఎక్కాం. ఈ రైలులో కొలంబియా నుండి వాంకోవార్‌కు వచ్చాం. ఇక్కడ కెనవిలియం వియా వెయిల్ తీసుకున్నాం. ఇది ప్రపంచంలోనే అతి ప్రసిద్ధమైన అందమైన రైలు మార్గాలలో ఒకటి. ఇది బ్రిటిష్ కొలంబియాను కెనడాలోని ఇతర ప్రధానమైన రాష్ట్రాలను కలుపుతుంది.
బ్రిటిష్ కొలంబియా నుంచి మేము పసిఫిక్ స్టేషన్లలో ఈ విఆర్ ట్రెయిన్ ఎక్కడానికి మేము మూడు గంటలకే వెళ్ళాం. వాస్తవానికి రైలు 4 గంటలకు. కానీ, అమిత ఉత్సాహం, ఆతృతతో మేము మూడు గంటలకే అక్కడకు చేరుకున్నాం. మేము వెళ్ళేసరికే అక్కడ 60 ఏళ్ళ మహిళ ఒక్కతే కూర్చుని ఉంది. ఆ సమయంలో ఒంటరిగా మహిళ అక్కడ కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యంతో ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించాను. ఆమె కెనడాలో ఒక టీచర్. “నేను ఇక్కడికి ఒంటి గంటకే ఇక్కడకు వచ్చి కూర్చున్నాను. ఈ ట్రెయిన్ ఎక్కాలన్న కుతూహలమే ఇంత ముందుగా నన్ను ఇక్కడకు రప్పించింది” అని ఆమె చెప్పారు. “ఈ ట్రెయిన్ ఎక్కాలన్నది నా జీవిత కల. ఈ ట్రెయిన్ ఎక్కేందుకు టీచర్ ఉద్యోగంలో నేను జీవితాంతం సంపాదించినదంతా కూడబెట్టాను. ఈ విఆర్ రైలు ఎక్కి కెనడా అంతా చూడాలన్నది నా కోరిక” అని ఆమె చెప్పారు. సంభ్రమాశ్చర్యాలతో ఆమెను ఒక్క నిమిషం తేరిపార చూసిన నేను ఆమె చేతులు పట్టుకుని కంగ్రాట్యులేషన్స్ చెప్పాను. మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమెతో చాలాసేపు మాట్లాడాను. ఆ తర్వాత రైలు రావడంతో ఎంతో ఉత్సాహంగా పరిగెట్టుకుని వెళ్ళి రైలు ఎక్కాం. ఈ ప్రయాణంలో మొదట మాకు కామెరూన్ స్టేషన్, వరుసగా.. వాంకోవార్, కామ్‌లూప్స్, బాంగ్, జాస్పర్, హైట్స్ ఆన్ బోర్డ్, టొరొంటో స్టేషన్లు కనిపించాయి. వాంకోవర్ నుంచి టొరొంటో రైలు ప్రయాణం నాలుగు వేల కిలోమీటర్లు. ఈ రైలు ఐదు పట్టణాలలో ఆగుతుంది. వాంకోవర్ నుంచి టొరొంటోకు రైలు ప్రయాణం మొత్తం 96 గంటలు.. ఐదు రోజుల ప్రయాణం.
మేము తొలుత కామ్లూప్స్‌కి వెళ్ళాం. అక్కడ ఒక హెూటల్లో పరిచయమైన ఒకామె చెప్పారు.. రాకీ మౌంటెన్స్, బాన్ఫ్, జాస్పర్.. ఈ ప్రదేశాలన్నీ తప్పనిసరిగా చూడండి అని. ఈ మూడు స్థలాలు మనం జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు అనిపించింది. బాన్ఫ్, జాస్పర్‍లు ఎంత అందంగా ఉన్నాయో!
బస్సు ప్యాకేజీ తీసుకుని బాన్ఫ్ చూడడానికి వెళ్ళాం. మేము వెళ్ళింది మే ఆఖరి రోజులలో. కానీ, అక్కడ ఎంత ఛలో. బస్సు అంతా కిక్కిరిసి ఉంది. బాన్ఫ్ అనేది నేషనల్ పార్క్. ఇక్కడ అతి అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. మొరెయిన్ లేక్ ఎంత అందంగా ఉందంటే మనం గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోతాం. నీళ్ళతో మంచుకొండలు మిలమిల మెరుస్తూ కనువిందు చేస్తాయి. మనకు అస్సలు అక్కడ నుంచి కదలబుద్ది కాదు. అక్కడ కెనడియన్ షాపులో కాఫీ తాగేసి నడుస్తూ ఉంటే మావారు మంచు మీద కాలు జారి చాలా దూరం వరకూ దొర్లుకుపోయారు. ఏం జరిగిందో కూడా అక్కడ ఎవరికీ ఒక్క క్షణం అర్థం కాలేదు. అక్కడ ఉన్న టూరిస్టులు అందరూ కలిసి మావారిని లేవదీసి నిలబెట్టారు. లక్కీగా ఏమీ కాలేదు. తిరిగి హాయిగా బస్సులో అనుకున్న ప్రదేశానికి వచ్చాం.
బాన్ఫ్ నుంచి జాస్పర్‌కి వచ్చాం. ఇక్కడ రాకీ పర్వతాలలో అతి పెద్దదైన.. 11228 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జాస్పర్ నేషనల్ పార్క్‌ను సందర్శించాం. అథాబాస్కా నదీ లోయలో ఈ జాస్పర్ పట్టణం ఉంది. మొదట లేక్ లూయిస్ దగ్గర ఆగాం. ఇది కూడా మంచు కొండల మధ్య ఉన్న అత్యద్భుతమైన లేక్. ఈ మంచు కొండల్లోకి వెళ్ళి వణుకుతూ తిరిగి రెస్టారెంట్‌కి వచ్చేసరికి లోపల అంతా వెచ్చగా ఉంది. రెస్టారెంట్ నుంచి బయటకు చూడడానికి అద్దాల్లోంచి వ్యూ కూడా చాలా చాలా బాగుంది. లేక్ లూయిస్ దగ్గర కొన్ని ఫొటోలు తీసుకుని బిరబిరా రెస్టారెంట్లోకి వెళ్ళి అరగంట పాటు చూస్తూ కూర్చున్నాం. మళ్ళీ బస్సు లేక్ లూయిస్ నుంచి జాస్పర్‌కి తీసుకెళ్ళింది. కేబుల్ కార్లో మనం మౌంటెన్స్, చక్కటి ప్రదేశాలు, వాటి అందాలు వీక్షించవచ్చు. ఇది కూడా అందమైన వీక్షణ.
ఈ బస్సు తర్వాత కొలంబియా ఐన్ఫీల్డ్ అడ్వెంచర్ అనే ప్లేస్‌కి తీసుకెళ్ళింది. అక్కడ నుంచి ఐస్ ఎక్స్‌ప్లోరర్ అనే బస్సులో గ్లేసియర్ పార్క్ వరకూ వెళ్ళాం. అంటే… గ్లేసియర్ పార్క్ బస్సు మొత్తం మంచులోనే నడుస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం ఐస్‌ఫీల్డ్ అడ్వెంచర్ బస్సులు అన్నీ ఇక్కడే ఉన్నాయంట. ఒక్క బస్సు మాత్రం అంటార్కిటికా దగ్గరలో ఉందంట. మిగతా బస్సులన్నీ కెనడాలోనే వినియోగిస్తున్నారు. నాలుగు నాలుగు టెయిర్లు ఒక క్లచెస్ లాగా మనల్ని మంచుపైకి బస్సు తీసుకెళుతుంది. ఇక్కడ.. బస్సులో ప్రయాణించడం గొప్ప మధురానుభూతి. ప్రపంచంలోనే ఇంకెక్కడా దొరకని అనుభూతి ఇక్కడ మనకు దొరకుతుంది. స్విట్జర్లాండ్‌లో కూడా క్లచెస్‌తో నడిచే రైలులో మనం పైకి వెళతాం. కానీ ఇక్కడ బస్సు ప్రయాణం మనకు భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.
అథాబాస్కా గ్లేసియర్లో కొంతమంది స్కీయింగ్ చేశారు. ఇక్కడ అందరూ సీసాల్లో మౌంటెయిన్, గ్లేసియర్ వాటర్ తీసుకొని ఆస్వాదించారు. కొంతమంది పెద్దపెద్ద డబ్బాల్లో కూడా నింపుకున్నారు.
అక్కడ నుండి మేము కొలంబియా ఐస్‌ఫీల్డ్ హిస్టరీ చూడడానికి వెళ్ళాం. ఇది అతి ఎత్తయిన 280 అడుగుల ఎత్తులో ఒక లోయ పైన గ్లాస్గో, పూర్తిగా అద్దాల పలకలతో దీనిని నిర్మించారు. దీని లోపలకు వెళ్ళడానికి టిక్కెట్టు ఉంది. ఈ టిక్కెట్‌తో మనం కొలంబియా ఐస్‌ఫీల్డ్ స్కై వాక్ చేయవచ్చు. పైనుంచి చూస్తే కళ్ళు తిరుగుతాయి. అంత లోతుగా ఉంది ఆ లోయ. మొత్తం కింద అంతా గ్లాస్. చూస్తే.. నాకు అక్కడ చాలా చాలా భయం వేసింది. రివ్వున వీచే గాలి, చలికి వణుకుతూ, దానిపైన లైట్‌గా.. గ్లాస్ చాలా స్మూత్‍గా ఉంది, పైగా వాటర్, ఎక్కడ జారిపడతామో అనే భయం ఉన్నా రెయిలింగ్‌ని పట్టుకుని మెల్లగా చాలా జాగ్రత్తగా నడుస్తూ అక్కడ అందాలన్నీ వీక్షించాం.
జాస్పర్‌ను ఆల్ ఫైన్ జెమ్.. అని చెప్పాలి. ఇది గొప్ప సుందరమైన దృశ్యకావ్యంలా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఇంత అందమైన ప్రదేశాన్ని చూడగలగడం ఎంత గొప్ప అదృష్టమో అనుకున్నాను. జాస్పర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి హెూటల్లో బస చేసాం.
తరువాత రోజు ఉదయం మరల విఆర్ రైలు ఎక్కాం. ఈ రైలులో మేము క్యుబెక్ వెళ్ళాం. ఇక్కడ రెండు రాత్రులు ఉన్నాం. ఇది కూడా అత్యుద్భుతమైన ప్రాంతం. చిన్న స్టీమర్లలో ఉదయం నుండి సాయంత్రం వరకూ తిరిగి రావచ్చు. ఇక్కడ ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. పైన్ ట్రీస్ ముచ్చటగొలిపాయి. క్యుబెక్ పట్టణంలో ఒక విశ్వవిద్యాలయం దగ్గర గార్డెన్‌లో పిక్నిక్‌లా అందరూ ఎంతో సంతోషంగా గడపడం చూశాం. మేము వాళ్ళతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాం. కెనడియన్ ఒరిజినల్ అడవిజాతి బట్టలుతో సహా వారి సంప్రదాయ దుస్తులు, ఆచారవ్యవహారాలు మాకు కనువిందు చేశాయి.
క్యుబెక్ నుంచి మేము కాల్గిరి వెళ్ళాం. ఇక్కడ రెండు రోజులు ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్ భవన సముదాయాలు చూశాం. కాల్గిరి కెనడియన్ ప్యాలెస్ కెనడాలోని అల్బెర్టాలో అతి పెద్ద నగరం. కెనడాలో కాల్గిరి నార్త్‌వెస్ట్‌లో ఒక చమురు రాజధానిగా ఎదిగింది. కెనడియన్ పసిఫిక్ రైలు ఆగమనం, చమురు నిల్వలు వెలికి తీయడం, కాల్గిరి క్యాంపెయిన్ ఈ నగర చరిత్రను సూచిస్తుంది. తర్వాత కాల్గిరి స్టాంపెడ్ మ్యూజియంకి వెళ్ళి ఆ చరిత్ర అంతా తెలుసుకుంటూ ఒక రోజంతా గడిపాం.
కాల్గిరి నుంచి ఎగ్మెంటన్, ఎగ్మెంటన్ నుంచి టొరొంటో వెళ్ళాం. టొరొంటోలో విశాల్ (మా అల్లుడు) మేనత్త జయ ఉన్నారు. అక్కడ మాకు మంచి ఆహ్వానం దొరికింది. టొరొంటోలో ఐదు రోజులు ఉన్నాం. వారి ఇంట్లో చక్కటి సంగీత వాయిద్య పరికరములతో వీనుల విందుగా, ఆవిడ చేసిన వేడి వేడి భోజనాలు ఆస్వాదించాం. అక్కడ చాలా సేదదీరాం. ఆ జంట మమ్మల్ని చాలా చక్కగా చూసుకున్నారు. ఒక రోజు షాపింగ్ కి వెళ్ళాం. మరొక రోజు నయగరా వాటర్ ఫాల్స్ చూశాం.
కెనడా వైపున నయగర అందాలు చాలా అత్యద్భుతం. ఇక్కడ చిన్న గుహలో నుంచి పడుతున్నట్లుగా కనిపించే వాటర్ ఫాల్స్‌ని మనం ఒక పక్కగా నిలబడి చూడవచ్చు. వీటిని చూడడానికి చాలా ప్యాకేజీలు ఉన్నాయి. నడిచి వెళ్ళి అక్కడ మనం ప్రతి ప్లేస్ చూడవచ్చు. రాత్రి పూట ఇంకా ఇంకా అద్భుతమైన వ్యూస్ కనిపిస్తాయి. నయగరా ఫాల్స్‌కి వెళ్ళినప్పుడు మా స్నేహితులు ప్రసాద్, రమ కూడా వచ్చారు. వారితో కలిసి హాయిగా మూడు రోజులు వండుకుని తినుకుంటూ నయగరా ఫాల్స్ అందాలను ఆస్వాదించాం.
ఇంకో రోజు జయగారు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న మంచి కాలనీకి తీసుకెళ్ళారు. నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్న మేము ఐదో రోజున టొరొంటో నుంచి ఇండియాకి వచ్చాం.
ఇలా మా కెనడా పర్యటన తీపి జ్ఞాపకాలతో ముగిసింది.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన డా. నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.

