Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చాదస్తపు చంద్రం – పెడసరపు ప్రమీల

[మైత్రేయగీతిక గారు రచించిన ‘చాదస్తపు చంద్రం – పెడసరపు ప్రమీల’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ఉదయం పది గంటల సమయం. ఆవరణలో బట్టలు ఆరేయడానికై బయట అడుగు పెట్టాలని స్కిన్‌కి సన్‌స్క్రీన్ లేయర్ వేసుకుంటూ ప్రమీల బయటకు వచ్చింది.

“ఏమయ్యా చంద్రం.. ఈ రోజు మళ్ళీ గ్యాస్ బిల్ నువ్వే చెల్లించుకు రావాలి! ఎందుకంటే, నిన్న నేను బజార్‌కి వెళ్లడం వల్ల సమయం దొరక్క, చెల్లించలేకపోయా!” అని కిచెన్ నుంచి అరుస్తూ వచ్చింది.

హాల్ లోపల సోఫాపై అడ్డంగా పడుకొని పేపర్ చదువుతున్న చంద్రం లుంగీ సరిచేసుకుని, మొహంలో ‘విజ్ఞానవంతుడు’లా బిల్డప్ ఇస్తూ.. అంతలోనే ఏదో స్పురించిన వాడిలా చాదస్తపు భావం ముఖంలో గోచరించేలా ఫీలింగ్స్ మార్చుతూ, “ఓహ్! నీకు సమాజం మీద బాధ్యత ఏమన్నా ఉందా? అలా ఉంటే గనుక ఒక్క గ్యాస్ బిల్ అయినా నీ చేతులతో కట్టరాదా? నేను ఒక్కడినే ఈ దేశాన్ని ఉద్ధరించాలా?” అని కోపంగా అన్నాడు.

“దేశం కాదు చంద్రం, ఈ ఇంటిని మాత్రమే నడిపించు చాలు!” అని ప్రమీల బాణంలా మాట విసిరింది.

ఇద్దరూ ఇలా ప్రతీ రోజు వాదులాడుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంటారు.

పక్కింటి సావిత్రమ్మ మాత్రం ఈ జంటని సరదాగా బోరింగ్ జంటని “లైవ్ కామెడీ షో” అని అంటూ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న తక్కినవారు ఈ జంట వినకుండా, ‘చాదస్తపు చంద్రం – పెడసరపు ప్రమీల’ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

చంద్రం గురించి చెప్పుకోవాలంటే.. అతను పేరుకి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో క్లర్క్. కానీ తనకు మాత్రం ‘నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనలిస్ట్’ అని చెప్పుకోవడం ఇష్టం. అంటే గుమస్తా పనినే, కానీ పేరు మాత్రం రాకెట్ లెవెల్లో జనాల్లోకి దూసుకుపోయేలా ఉండాలని అతని ఉద్దేశం!

తనకు చదువుకి మించి చాదస్తం అలవాడిపోయింది. ఏదైనా విషయం చెబితే, దానికి చరిత్ర, గణాంకాలు, ఆర్థిక దృక్పథం, దేశభక్తి దాకా లాగేస్తాడు. మూడు నిమిషాల టాపిక్‌ని – పది నిమిషాల లెక్చర్ ఇచ్చే లెవెల్‌కి తీసుకెళ్తాడు..!

అందుకే ప్రమీల ఎప్పుడూ, “నువ్వు టీవీ రిమోట్ లాంటి వాడివి చంద్రం.. ఒకసారి ఆన్ చేస్తే మళ్లీ ఆఫ్ చేయలేము..!” అని అంటూ ఉంటుంది.

ప్రమీల గురించి చెప్పుకోవాలంటే.. ప్రమీల ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. కానీ తనకు ఒకే ఒక ధోరణి.. అదేంటంటే తాను తప్పు చేసినా, చివరికి దానిని సర్దే ప్రయత్నం చేస్తూ, “ఇంటెలిజెంట్ లేడీస్ కూడా హ్యూమన్ బీయింగ్సే కదా” అని మాట తిప్పేస్తుంటుంది.

పెళ్లయి ఐదేళ్లు అయినా కానీ వాళ్ల మధ్య మాటల పోటీ ఇంకా ‘నూతనంగా’నే కొనసాగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ వాదించుకుంటూ ఉండటమే కాక, ఇద్దరి మనస్తత్వంలో తేడాల వల్ల ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. కానీ చివరికి నవ్వుల్లో మునిగితేలే అల్లరి దంపతులుగా ముద్రపడిపోయారు.

ఒక ఆదివారం నాడు ఉదయం అంటే ఇతరుల ఇళ్లలో విశ్రాంతి తీసుకునే సమయం వీళ్ళింట్లో మాత్రం వాదనల విందుగా మారిపోతుంది.

ప్రమీల కాఫీని సరిగ్గా చేయలేదని చంద్రం మొహం చిట్లిస్తూ, “ఇది కాఫీనా? లేక గేదెలకు పెట్టే కుడితా?” అని కోపంగా రుసరుసలాడాడు.

“ఏంటండి, మీరు!? అసలు మీ పద్ధతేం బాలేదు. అక్కడికి తమరేదో పుట్టి పెరిగిన కాడనుంచి ‘బ్రూ’ కాఫీలు తాగేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. మీ అమ్మ కాసే కాఫీ ఎట్టా ఉంటుందో నాకు తెలియదా!?.. అయినా గాని నేను ఇంట్లో ఖాళీగా కూర్చునే చౌకబారు మనిషిని కాదు, ఉద్యోగం చేసే టీచర్‌ని, మీకు ఊడిగం చేసే బానిసని కాదు!” అని కోపంగా తిట్టేసింది.

ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ, “టీచర్ అంటే పిల్లలకు పాఠాలు బోధించేది, భర్తను బాధించేది కాదు!” అని వెటకారంగా బదులిచ్చాడు చంద్రం.

“భర్త అనేవాడు కేవలం బాధలు మాత్రమే ఇస్తాడు, మేము వాటిని బోధనగా మార్చుకుంటాంగా!” టపీమని విసురుగా జవాబు ఇచ్చింది.

“నోబెల్ ప్రైజ్ రానీయకుండా, ప్రతి రోజు హోం కంటెస్టు చేసేస్తావు.” అని అన్నాడు చంద్రం.

“నీకు నోబెల్ ఎందుకు వస్తుందయ్యా చంద్రం? నువ్వు ఇచ్చే స్పీచ్‌లు గనుక నోబెల్ వాళ్లు వింటే ఇట్టే సైలెంట్ అయిపోతారు – ఎందుకంటే నీ స్పీచ్ వినసొంపుగా లేనందుకే అలా అయిపోతారన్నమాట.!” అని అక్కసుగా అంది.

ఇదే వారి ఇద్దరి మధ్య ప్రతి ఉదయం జరిగే సంభాషణ. పక్కింటి వాళ్లకు అయితే వినోదం, కానీ వీళ్లకు గొడవతో నీరసం ఆవహిస్తుంది.

ఒకరోజు సాయంత్రం ప్రమీల మామా-అత్తగార్లు వస్తున్నామని ఫోన్ చేశారు. ప్రమీల చీర కట్టుకొని, ముఖం మీద బ్యూటీ క్రీమ్ రాసుకుంటూ, “ఈసారి మనం కూల్‌గా ఉండాలి చంద్రం!” అంది. చంద్రం, ‘ఇక వాదనలు వద్దులే!’ అన్నట్టుగా తల ఊపాడు.

కానీ అలా అనుకున్న కాసేపటికి వంటగదిలో మొదలైన ఫ్రైడ్ రైస్ ఫైట్ అదో మేజర్ ఘట్టంగా మారిపోయింది.

చంద్రం యూట్యూబ్ చూస్తూ, ‘హోటల్ స్టైల్ ఫ్రైడ్ రైస్’ వీడియో ప్రమీలని చూడమన్నాడు.

అతడి మాటలకి ప్రమీల కోపంగా అరుస్తూ, “నువ్వే చెయ్యి! నీకు బియ్యం కడిగి ఫ్రైడ్ రైస్ వండడం కూడా సైన్స్ ప్రాజెక్ట్‌లా చెయ్యడం తెలుసు కదా!” అని అంది.

చంద్రం నవ్వుతూ, “సైన్స్ కాదు, ఆర్ట్ ప్రాసెస్! మనసు పెట్టాలి.” అన్నాడు గానీ గ్యాస్ స్టౌ ఆన్ చేసి, కూరగాయలు వేసేటప్పటికి బంగాళాదుంపలు బొగ్గులా నల్లబడ్డాయి.

ప్రమీల కిచెన్ లోపలికి వచ్చి, అతడు వండిన ‘ఫ్రైడ్ రైస్’ని చూస్తూ, “ఇది ఫ్రైడ్ రైస్ కాదు చంద్రం, ఫైర్ రైస్! దీనిని తింటే అనారోగ్యంతో మంచం పడతామేమో? లేకపోతే బాహ్యలోకంలోనే లేకుండా ఉండేలా శ్రద్ధాంజలి పెడతారేమో అనిపిస్తోంది!?” అని అంది.

ఇద్దరి గొడవ వారి ఆవరణ దాటేసింది. కాసేపటికి మామగారు వచ్చేసరికి, ప్రమీల, “ఇవ్వాళ కూడా గ్యాస్ బిల్ మర్చిపోయావు” అని చంద్రంపై కోపంగా విరుచుకుపడుతూ వాగుతోంది. ఆమె మాటలు విన్న మామగారు, శాంతంగా కొడుకుతో, “ఒరేయ్ నాన్నా, నీ భార్య సైన్స్‌లో మేడం అయితే, నువ్వు కామెడీలో ప్రొఫెసర్!” అని అంటూ నవ్వేశారు.

పక్కింటి ప్రభాకర్ వీళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్, కానీ వీళ్ళిద్దరి గొడవలలో మద్యవర్తి కూడా అతడే. అతను ఎప్పుడూ, “చంద్రం, నీకు స్పీకర్ అవ్వాలనే తపన ఉంది, కానీ సభలో ఒక్కరే ఉన్నారు.. ఆ ఒక్కరే ప్రమీల! మీ ఇద్దరూ కలిసి ఏ పార్టీ స్థాపించినా ‘వాదన మాత్రం జాతీయ కాంగ్రెస్’ అవుతుంది!” అని అన్నాడు.

ఒకరోజు ప్రభాకర్ వీళ్లింటికి చాయ్ తాగడానికి వచ్చాడు. ప్రమీల కొన్న కొత్త ‘కప్’లను చూపిస్తూ, “వీటిని చూడండి ప్రభాకర్ – ఇవి బోరోసిల్ కప్పులు!” అని అంది.

వెంటనే చంద్రం, “అవి ఫ్రెంచ్ మేక్ కాదు, ఇండియన్ ప్రొడక్షన్. నాకు వస్తువుల గురించి నాలెడ్జ్ ఎక్కువ.” అని అన్నాడు.

“అవును లేండి! వస్తువుల మీద ఎక్కువ, మనుషుల మీద తక్కువ!” అని చురక వేస్తున్నట్లుగా అంది ప్రమీల.

వారి మాటలకు ప్రభాకర్ నవ్వుతూ, “నువ్వు లెక్చర్ కొంచెం తగ్గించరా చంద్రం, లేకపోతే కప్పులు కాదు, మన హౌస్ కప్‌కి అవుతుంది డామేజ్!” అని అన్నాడు.

ప్రమీలకు షాపింగ్ అంటే మనసును హాయిగా ఉంచే సాధన. చంద్రం మాత్రం, షాపింగ్ అనగానే ‘డెబిట్ కార్డ్ డెప్రెషన్’లోకి వెళ్తాడు.

ఒక రోజు ప్రమీల అడ్డగిస్తూ, “ఇవ్వాళ మీరు షాపింగ్‌కి రావాలి చంద్రం గారు, ఒక శారీ కావాలి నాకు.” అని అంది.

“ఇన్నిన్ని శారీలు కొంటే నాకీ లైఫ్ సాడ్ అయిపోతుంది!” అని అన్నాడు.

“ఏం చేస్తావు? నీ ఫ్యాషన్ సెన్స్ ఒక పాతకాలపు చార్కోల్ పెన్సిల్ లాటిది.”

“నీ ఫ్యాషన్ సెన్స్ వల్లనే బిల్లు పెరగడం, అదే జాతీయ సమస్యగా కూడా మారుతుంది.”

అలా షాపింగ్ మాల్లో ఇద్దరూ శారీ గురించి వాదిస్తూ ఉండగా, వాళ్ల వెనుకనున్న ఒక చిన్నపిల్ల వాళ్ళ అమ్మతో, “అమ్మా, వాళ్లు ఫైటింగ్‌లో కూడా సరదాగా ఎంతో బావున్నారు!” అని చెప్పింది.

ఇలా రోజూ తగువులు, మాటల మల్లయుద్ధం, కానీ వారి మనసు లోపల మాత్రం ఒకరంటే ఒకరికి ప్రేమ. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. పోట్లాడుకున్నా విడిపోలేని భార్యాభర్తల బంధం వారిది. చంద్రం ఎప్పుడూ ప్రమీల నిద్రలోకి జారిన తర్వాత సైలెంట్‌గా ల్యాప్‌టాప్ తీసుకొని ఆమెకి సర్ప్రైజ్ వీడియోలు, ఫన్నీ రీల్స్ తయారు చేస్తాడు. ప్రమీల మాత్రం ఉదయం చంద్రంకు ఇచ్చే లంచ్ బాక్స్‌లో చిన్న నోట్ పెడుతూ, “వాదనలు వేరు, మనసు వేరు” అని దానిలో రాస్తుంది.

పక్కింటివాళ్లకి మాత్రం వీరి దాంపత్య జీవితం ఎప్పుడూ ‘ఫైటింగ్’గానే కనిపిస్తుంది. కానీ వాదనలలోనే ప్రేమ ఉంది; చాదస్తంలోనే హాస్యం ఉంది అని వాళ్లకు తెలుసు.

***

ఒకరోజు ఉదయం ఎనిమిది గంటల సమయం. ప్రమీల లంచ్‌బాక్స్ ప్యాక్ చేస్తూ,”చంద్రం, ఇవాళ నీకు కూరలో కారం ఎక్కువ వేసి వండాను. నీలాగా మసాలా మాటలు మాట్లాడేవాళ్లకే సూటవుతుంది ఆ కూర!” అని అంది.

చంద్రం షర్టు బటన్ పెట్టుకుంటూ, “నువ్వు కారం ఎక్కువ వేసేది కూరలో మాత్రమే కాదు, జీవితంలోనూ వేస్తావుగా కారాలు, మిరియాలు!” అని వెటకారంగా అన్నాడు.

అలా అనేసి బయటకు వెళ్లిపోయాడు గానీ, కోపంతో ప్రమీల మొహం ముడుచుకొని, “అయ్యో! చంద్రం నోరు ఒక్కసారి ఆఫ్ చేయగలిగితే, నేను అతడి మీద గెలిచినట్టే, ఏదో విధంగా అతడి నోరు మూయించాలి!” అని బబుల్‌గమ్ నములుతూ మనసులో అనుకుంది.

 ఆ రోజు మధ్యాహ్నం స్కూల్ బ్రేక్‌లో ఫోన్ తీసుకుని ఫేస్‌బుక్ ఓపెన్ చేసింది ప్రమీల. చంద్రం, “పరిపక్వ దంపతులు ఎప్పుడూ వాదనలతో కాదు, అవగాహనతో జీవిస్తారు” అని ఒక పోస్టు పెట్టి ఉన్నాడు అప్పటికే. దానికి ఎవరో, ‘వావ్ సర్ ! యూ ఆర్ సో మాచర్ (mature)!’ అని కామెంట్ చేశారు.

అది చూసిన ప్రమీల చీదరించుకుంటూ, “అవగాహన అంటే? ఎవరో ఇటువంటి చెత్త పోస్ట్ పెడితే మీరు అభిప్రాయం చెప్పడం?” అని భర్త పోస్ట్‌కు కామెంట్ పెట్టిన వారి కామెంట్ కింద తాను కామెంట్ చేసింది.

ఆ ఒక్క కామెంట్ తోనే ఫ్రెండ్స్‌లో అల్లరి మొదలైంది. వాళ్ల స్నేహితులు ఫుల్ ఎంజాయ్‌మెంట్ లోకి దిగిపోయారు. “ఎంత క్లారిటీ ఉన్న దంపతులు రా వీళ్ళు! ఫేస్‌బుక్ పేరుతో లైవ్లోనే మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మొదలైపోయింది!” అని ప్రభాకర్ కామెంట్ చేశాడు.

ఆఫీస్‌లో ఉండగా ఆ పోస్టుకి కామెంట్ చూసి కోపం తెచ్చుకున్నాడు చంద్రం.

‘ఇదేం ఆడది రా! పబ్లిక్‌లో ఇలా రాయాలా?’ అని తనలో తానే బుర్రబాదుకున్నాడు. ఇంటికి వచ్చాక, ప్రమీల వంక కోపంగా చూస్తూ, “నువ్వు ఫేస్‌బుక్‌లో వాదన పెడితే, నాకే షేమ్ అవుతుంది!” అని ముఖం గంటు పెట్టుకుని అన్నాడు.

“మీకే ఎందుకు షేమ్? పోస్ట్ మీరే పెట్టారు కదా! ‘అవగాహనతో జీవిస్తాం’ అంటారు.. అంతలోనే వాదనకు వస్తూ, మాటల తూటాలు వదలాలా ఇలా!” అని అంది ప్రమీల.

“ఇది సామాజిక మాధ్యమం, వ్యక్తిగత రగడ కాదు.” అని అన్నాడు చంద్రం.

“నీకు సామాజికం ఏదైనా, నాకు వ్యక్తిగతమే చంద్రం. మనం వాదనలతో జీవిస్తున్నాం గానీ, ప్రేమతోనే బ్రతుకుతున్నాం అని రాయాలిగా!” అని అంది ప్రమీల.

“అదీ అలా రాస్తే అందరూ మన మీద ఎమోజీలు పెడతారు!” అన్నాడు చంద్రం.

“పెడితే పెడతారు, ప్రేమ ఎమోజీ అయితే ఏం నష్టం?” అని అంది ప్రమీల.

ఇలా సోషల్ మీడియా మీద ప్రారంభమైన వారిద్దరి ఫైట్ చివరికి రాత్రి ఫ్రెండ్స్ గ్రూప్‌లో కామెడీగా మారిపోయింది. చంద్రం, ప్రమీల ఇద్దరూ చివరికి వీడియో కాల్లో నవ్వుతూ, “నీ లాంటి ఫైటర్‌ని నేను ఎందుకు ప్రేమించానో దేవుడికే తెలుసు,” అన్నాడు చంద్రం.

“ఎందుకంటే నువ్వు కూడా చాదస్తపు మొగుడివి కదా, అందుకే!” అని నవ్వుతూ అంది ప్రమీల.

వారి జీవితం ఇలా వాదనలతో మరియు ప్రేమతో సరదా సరదాగా సాగిపోతోంది.

Exit mobile version