[శ్రీ కళాధర్ రచించిన ‘చావు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
వెళ్ళిపోయింది. మా అమ్మ కూడా ఈ రోజుతో నను వదలి వెళ్ళిపోయింది..
నా చివరి ఆనందం కూడా నన్నూ ఒంటరిని చేసి వెళ్ళిపోయింది..
నా బాల్యం ఆరు గదులతో కూడిన పెంకుటింట్లో నాయనమ్మ, తాత, అమ్మా నాన్నా, నా తోడబుట్టిన ఇద్దరు అన్నలు, పక్కవీధిలోనే ఉండే మా మేనత్త, మామ, వదిన వరస అయిన వాళ్ళ ఇద్దరు కూతుళ్లు, పక్క ఊరిలోనే ఉండే మా అమ్మమ్మ తాతయ్య, వారికి ఉన్న ఒక్కగానొక్కా కూతురు మా అమ్మ. మేము ముగ్గురం మగ సంతానమే అయినందున మా వదినలను ‘అక్కా’ అని పిలిచే వాళ్ళం.
మా ఇల్లు ఎప్పుడు చాలా సందడిగా ఉండేది. రోజు ఓ పదిమంది భోజనాలు చేస్తూఉండేవారు మాతోపాటు. మా అక్కలో లేకుంటే మా అత్త మామో వస్తూ వుండేవారు. ఇక మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారంటే పది రోజుల వరకు వెళ్లేవాళ్ళు కాదు. మా ఇద్దరి తాతలకు మంచి స్నేహం ఉండేది.
నేను ఒక్క నిమిషం కూడా ఒక దగ్గర ఉండేవాణ్ణి కాదు. మా అక్కలతోటి, తాతల తోటి తిరిగేవాడిని. మా పొలం వద్ద ఉన్న బావి పక్కన ఎత్తయిన మట్టి దుప్ప ఉండేది. దాని పైన రెండు జామ చెట్లు ఉండేవి. మా తాతతో పొలం దగ్గెరకి వెళితే ఆ జామ చెట్ల పైనే అడేవాడిని. సాయంత్రం పూట సూర్యుడు జారీ పోతూవుంటా వర్రెల పొంట నుంచి మా గొడ్లని కొట్టుకోస్తు తాతతో వస్తూ ఉంటే లేచే దుమ్ముకు కండ్లు ముక్కు మంటగా ఉండేది. అది చూసి మా తాత తన భుజాలపై ఎత్తుకొని వచ్చేవాడు.
మా నాయనమ్మతో రోజు ఏదో ఒక గొడవ పడేవాణ్ణి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మేముగ్గురం అన్న తమ్ముళం కొట్లాటే నాయనమ్మ దగ్గర పడుకోవటానికి..
అమ్మ వాళ్ళింటికి సెలవులకు వెళితే వాళ్ళ అర్భాటమే బాగుండేది. నోరు మేకల్లా ఎప్పుడు ఎదో ఒకటి తింటూనే ఉండేవాళ్ళం. తాతా అమ్మమ్మ ఇంకా తక్కువ తింటున్నారని మొకం చిట్లించేవారు..
మా మేనత్త ఏది వండినా మాకు కొంచమైనా పంపిస్తూ ఉండేది మామ ఎప్పుడు ఆటపట్టిస్తూ ఉండేవాడు..
ఒకరోజు నేను స్కూల్లోనుంచి వచ్చే సరికి ఇంటినిండా జనం, ఏడుపులు. కొంచం లోపలికెళ్లి చూసేసరికి ఇంటి వాకిట్లో గడ్డి పై సాప వేసి తాతని పడుకోపెట్టారు. ఆయన చనిపోయారంట.
కొద్ది రోజుల దాకా ఇంట్లో ఏడుపులు. ఎన్నడూ చూడని మా నాన్న కళ్ళల్లోను కన్నీళ్లు. కొద్ది రోజుల వరకు నాకు ఏం అర్థం కాలేదు. కొద్ది రోజులు గడిచాక తాత బాగా గుర్తొచ్చేవాడు. నాయనమ్మ తాత గుర్తొచ్చినప్పుడల్లా మమ్ములను దగ్గరకు తీసుకొని ఏడ్చేది..
కొద్ది రోజులు గడిచాక మా అత్త ఆరోగ్యం బాలేదని అక్కలకు ఒకరి తరువాత ఒకరికి పెళ్లిళ్లు చేసారు. ఆ పెళ్లిళ్ళో చేసి అల్లరి, పొందిన ఆనందం జీవితాంతం మరువలేనివి. అక్కలు పెళ్లిళ్లు చేసుకోని వెళ్లిన రోజుల్లో బాధపడ్డ క్షణలు మరువలేనివి.
కొద్ది రోజులకే మా మేనత్త కాలం చేసింది. అది తట్టుకోలేక తల్లి ముందే బిడ్డ వెళ్లిపోవడంతో రోజు తల్లాడిళ్ళుతు మా నానమ్మ కొద్ది రోజులకే కాలం చేసింది..
రోజులు గడిచి పోతున్నాయి మేము పై తరగతులకు వెళ్తున్నాం.. మా పక్కవీధిలో ఉన్న మా మేనత్త ఇల్లు పడవబడిపోయింది. మా మామ కూడా తన రెండో కూతురు దగ్గరే ఉంటున్నాడు. ఊళ్లోకి వస్తూ వెళుతు ఉండేవాడు. ఇప్పుడు రావడము తగ్గించాడు. ఏదైనా బంధువుల కార్యాల్లోనో మా అక్కలు కనబడేవాళ్ళు. కొన్నిసార్లు మా మామ కనబడేవాడు, దగ్గరకి తీసుకునే వాడు కానీ అప్పటిలా ఆటపట్టించే వాడుకాదు.
కొన్ని సంవస్సరాల్లోనే అమ్మమ్మా తాతయ్య కూడా ఈ లోకం వదలి వెళ్లిపోయారు..
ఒక రకమైన భయం నా హృదయంలోకి చొరబడింది. కొద్దిగా వయసొచ్చిన వాళ్ళను చూస్తే – వీళ్ళు మనల్ని వదిలేసి వెళతారు, వీరితో కలసి వుండకూడదు అనిపిస్తుంది. ఎంతో సందడిగా ఉండే మా ఇల్లు దిగులు పడి ఉన్నట్లుగా అనిపించేది. కొన్ని వస్తువులను చూస్తే తాతలు, నాన్నమ్మ, అమ్మమ్మ, అత్త గుర్తొస్తు వుండేవాళ్ళు. మా మేనత్త ఇంటిముందు నిలబడి స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే చాలా దుఃఖంగా ఉండేది. వాళ్ళు నన్నూ పిలిచినట్లుగా అనిపించేది.
మా ఇద్దరి అన్నలకు కూడా పెళ్లిళ్లు అయ్యిపోయాయి వాళ్ళు ఉద్యోగాల నిమిత్తం వేరే ఊళ్ళలో ఉండేవారు. పెళ్ళైన కొత్తల్లో బాగానే వచ్చేవారు ఇంటికి తరువాత పండుగలకి రావడం వెళ్లడం..
ఒకరోజు పొలం దగ్గర పనిచేస్తుఉంటే పాము కాటు వేయడంతో నాన్నని పెద్దసుపత్రిలో చేరిపించాం. అక్కడ కాదంటే సిటీకి తీసుకొచ్చాం..
ఆ కార్పొరేట్ హాస్పిటల్లో నాన్నని అయిదు నిమిషాలు చూడలేకపోయా. నోటిలో పైపు వంటినిండా వైర్లు సృహలో లేని మనిషి అవన్నీ తెంచేసి ఇంటికి తీసుకుపోవాలనిపించింది. ఆయన మాట్లాడుకున్న సరే ఆయన అలా ఉంటే చాలు అనిపించింది. పగవాడు పగబడితే తప్పించుకోవచ్చు కానీ ఆ దేవుడు పగబడితే ఎవ్వరు తప్పించుకోలేరు. మా నాన్నని కూడా తీసుకు వెళ్ళాడు పైవాడు.
గడిచిన పదిహేను సంవత్సరాల్లో మా ఇల్లు చావుల కొలువైంది. ఆ మనో వేదనతో ఈ రోజు మా అమ్మ కూడా నన్నూ వదలి వెళ్ళిపోయింది..
చచ్చాక మనిషి చేసిన పాపలకి వైతరణి నది వడ్డున శిక్షలు వేస్తారంట.. బ్రతికుండగానే మనిషిపడే వేదన కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది?
కార్యక్రమాలు అన్ని ముగిసాక మా పెద్దన్న వదిన తమతోపాటు నన్నూ తీసుకువెళ్లారు..
శరీరం మనిషి కన్నా రెట్టింపు బరువును మోస్తుంది కానీ కుమిలిపోతూ వున్న గుండె బరువును మోయలేదేం???
