Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చచ్చినా వేయి

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘చచ్చినా వేయి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

నలభై ఏళ్ళు ప్రభుత్వోద్యోగం చేసిన రామదాసుగారి రిటైర్మెంట్ ఆ రోజే, అందరి కోరిక మీదటా అతని అర్థాంగి కామేశ్వరి కూడా ఫంక్షన్‌కి వచ్చింది.

రామదాసుగారి గురించి అతనిపై ఆఫీసర్లు మెచ్చుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చేరు. అతను లేని వెలితి ఆఫీసుకి తీరదు అని చెప్తూ, అయినా అతను రిటైర్మెంట్ లైఫ్ హాయిగా గడపాలని అభినందనలు చెప్పేరు.

సాధారణ గుమస్తాగా ఉద్యోగంలోకి ప్రవేశించి, గ్రేడ్ వన్ ఆఫీసర్‌గా రిటైర్ అవుతున్న రామదాసుగారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కొత్తగా వచ్చిన యువత చప్పట్లతో మారుమోగించేరు.

రామదాసుగారికి మెళ్ళో పూలదండలు వేసి, కొత్త శాలువా కప్పి, వేలికి ఉంగరం తొడిగి సన్మానం చేసేరు.

కమ్మటి స్వీట్స్, వేడి వేడి సమోసాలూ, గోల్డ్ స్పాట్ డ్రింక్సూతో సభ ముగిసింది. రామదాసుగారినీ, కామేశ్వరినీ కారులో ఎక్కించేరు.

అందరికీ ధన్యవాదాలు రామదాసుగారు చెప్పేరు. కారు కదిలింది.

రామదాసు, కామేశ్వరి ఇంటికి చేరేసరికి కొడుకు కోడలూ ఎదురొచ్చేరు. చిన్నకొడుకు ఆలస్యంగా కాలేజ్ నించీ ఇంటికి వచ్చేడు. కొడుకు పుట్టిన పదిహేనేళ్ళకి చిన్నాడు మహేష్ పుట్టడం ఇంకా వాడి చదువు అవలేదు.

“నాన్నా ఇవాళ డిన్నర్‌కి బయటికి వెళదామా..” కొడుకు ఉత్సాహంగా అడిగేడు.

“ఒద్దురా.. ఏవిటో నీరసంగా ఉంది” అంటూ రామదాసుగారు మంచంమీద వాలిపోయేరు.

“రిటైర్మెంట్ భయాలు కాబోలు” కామేశ్వరి సణిగింది. ఎనిమిదికి రామదాసుగారు లేచి భార్యని పిలిచి “కామేశ్వరీ ఏవిటో గుండెల్లో పట్టేసినట్టుంది” అన్నారు దీనంగా.

కామేశ్వరి కొడుకుని కేకేసింది. కొడుకు ప్రకాష్ వచ్చి

“అమ్మా ఎందుకయినా మంచిది, హాస్పిటల్‌కి వెళదాం. కేబ్ బుక్ చేస్తాను” అని ఫోన్ తీసేడు.

పావుగంటలో కేబ్ వచ్చేసరికే రామదాసుగారు చెమట్లు పట్టి తలవాల్చేసారు. కామేశ్వరి ఘొల్లుమన్నాది. ప్రకాష్ ఆశ చావక తండ్రిని‌ మోసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్ళేడు. చూస్తూనే చెప్పేరు డాక్టర్లు, అంతా అయిపోయిందని.

ఏడుపుల మధ్య రామదాసుగారి బాడీ ఇంటికి వచ్చింది.

కబురు తెలిసి అతని ఆఫీసు వాళ్ళందరూ వచ్చేరు. ఇలా అవడం చాలా రేర్ అని కొందరు ఆశ్చర్యంగా మాడాడేరు.

అసలు కథ తరవాత మొదలయింది:

రామదాసు గారబ్బాయి మహేష్‌కి ఫేమిలీ గ్రౌండ్స్ మీద ఉద్యోగంకి అప్లికేషన్ పెట్టొచ్చని కొందరు సలహా‌ ఇచ్చేరు.

ఆ అబ్బాయికి వెనక అండగా యూనియన్ బేరర్ ఉండి అప్లికేషన్ పెట్టించేడు. ఆఫీసు మొత్తం ఇదే చర్చ.

పెర్సనల్ ఆఫీసర్ అప్లికేషన్ రిజెక్ట్ చేసేడు. రామదాసుగారు రిటైర్ అయిపోయేరు కాబట్టి అతని కొడుకు అప్లికేషన్ కన్సిడర్ చేయం అని జవాబు వచ్చింది

నిజాయితీగా ఉద్యోగం చేయడం, తన తల్లితండ్రుల బాధ్యతలు తనూ పంచుకొని, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి అప్పులు చేసి తీర్చడం, తన కొడుకు చదువూ, రామదాసుగారు రిటైర్మెంట్ సమయానికి ఏవీ మిగుల్చుకోలేక పోయేరు.

ఉంటున్న ఎపార్టమెంట్ కూడా కొడుకు లోన్ పెట్టి కొన్నదే.. మహేష్ చదువులో సాదాగా ఉన్నాడు కాబట్టి అతనికి మామగారి ఆఫీసులో మహేష్‌కి ఉద్యోగం వస్తే మంచిదని కోడలు అభిప్రాయపడింది.

యూనియన్ బేరర్ రాఘవరెడ్డి మండిపడ్డాడు. మహేష్ చేత కేట్‌లో కేస్ వేయించేడు (ఉద్యోగుల సమస్యలు కేట్ లో పరిష్కారం అవుతాయి).

తల్లి బాధ్యత తను పడాలని, తనకి తండ్రి చేసిన ఆఫీసులో ఉద్యోగం ఇప్పించమని మహేష్ అప్లికేషన్‌లో విన్నవించుకున్నాడు.

కామేశ్వరి భయపడ్డా, కోడలు సువర్ణ పంతం పట్టింది.

కోర్టులో వాదనలు అవుతున్నాయి. మహేష్ తరపు లాయర్ పెట్టిన మెలిక ప్రశ్నలకి కేట్ జడ్జ్‌కి కళ్ళు జిగ్గుమన్నాయి.

చనిపోయిన‌ మనిషి ఎవరు?

ఫలానా ప్రభుత్వోద్యోగే కదా?

అతన్ని ఆఫీసు రోల్స్ లోంచి ఎప్పటినించి స్ట్రక్ ఆఫ్ స్ట్రెంత్ చేసేరు? 12  పిఎమ్ 31 ఆగస్ట్ నించీ కదా, అంటే ఆ రోజు రాత్రి పన్నెండుదాకా రామదాసుగారు రోల్స్‌లో ఉన్నారు. ఎనిమిదికి మరణించేరు. అదీ సహజ మరణం. అలాంటప్పుడు అతని కొడుకు మహేష్‌కి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు?

“ఆఫీస్  సమయం అయిపోవటంతోటే అతని ఉద్యోగం అయిపోయింది. డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోయిన తరువాత, అన్నీ రావాల్సిన డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసిన  తరువాత, సర్వీసు సర్టిఫికేట్ ఇచ్చి ఇంటికి పంపిన తరువాత ఇంకా కారుణ్య నియామకం ఏమిటి?” వ్యంగ్యంగా ప్రశ్నించాడు ఆఫీసు లాయరు.

“ఆఫీసు అయిపోయే సమయంతో సంబంధం లేకుండా, ఆ రోజు  తేదీ మారే వరకూ ఉద్యోగి రోల్స్ లో వున్నట్టే.”  అన్నాడు మహేశ్ తరఫు లాయరు.

“అదెలా సాధ్యం?” అనబోతున్న ప్రత్యర్థి మాటలకు అడ్డువచ్చాడు మహేశ్ లాయరు.

“ఇటీవలె ఒక ఆఫీసరు రిటయిరయ్యాడు. ఆఫీసు సమయం అయ్యేసరికి పార్టీ చేసి సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత అర్ధరాత్రి వరకూ ఆయన పనిచేశాడు. బిల్లులు పాస్ చేశాడు.” తనన్న దాన్ని నిరూపించే పత్రాలను కోర్టుకు అందచేశాడు.

అందరూ వాటిని పరిశీలించేవరకు మౌనంగా వుండి తరువాత చెప్పాడు.

“ఆఫీసు పనివేళలు అయిన తరువాత, రిటయిర్మెంట్ ఫంక్షన్ అయిన తరువాత, సర్టిఫికేట్లిచ్చి, సెటిల్మెంట్ చేసినతరువాత ఆయన పాస్ చేసిన బిల్స్ చెల్లేయంటే అర్ధం అర్ధరాత్రి వరకూ ఆయనను ఉద్యోగిగా లెక్కించినట్టే కదా? ఆయనకు వర్తించిన సూత్రం నా క్లయెంట్ తండ్రికి ఎందుకు వర్తించదు? వర్తిస్తే, మరణం సమయానికి ఆయన ఉద్యోగి కదా? అలాంటప్పుడు నా క్లయింటుకు కారుణ్య నియామకం ఇవ్వటంలో అభ్యంతరమేమిటి?” ప్రశ్నించాడు మహేశ్ తరఫు లాయరు.

వాద ప్రతివాదాల తరవాత మహేష్ ఉద్యోగానికి అర్హుడే అన్న జడ్జిమెంట్ వచ్చింది. ప్రతీ ఒక్కరూ మహేష్‌కి అభినందనలు చెప్పేరు.

రామదాసుగారి దగ్గర జూనియర్‌గా పనిచేసిన నీలకంఠం ఇంటికి వచ్చి ఎపాయింట్‌మెంట్ ఆర్డర్ అందిస్తూ “మీ నాన్న ‘కరి బతికినా వేయి, చచ్చినా వేయి’ అన్న సామెత నిజమని మీకు ఋజువు చేసేరయ్యా” అన్నాడు.

మహేష్ కళ్ళలోంచి జలజలా కన్నీరు. ఎపాయింట్మెంట్ ఆర్డర్ కళ్ళకి అద్దుకుంటూ “నాన్నా.. ఇది నీ దీవెనే” అన్నాడు.

కామేశ్వరి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి.

(ఇలాటి కేస్ నిజంగా జరిగింది. కోర్టు ఇదే తీర్పు ఇచ్చింది)

Exit mobile version