Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చదవలేని తల్లి

[డా. సి. భవానీదేవి రచించిన ‘చదవలేని తల్లి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అక్షరాలు తెలీకపోయినా
మనసులో నిండుగా మానవతాజ్ఞానం
చదవలేని కళ్ళతో
మనసును ముడేసుకుని
ప్రపంచాన్ని చదివేసింది.
పుస్తకం పట్టకపోయినా,
జీవన పాఠాలు రాయగల గురువైంది.
గణితం తెలియకపోయినా
ఒక ముద్ద అన్నంలో
వెయ్యి ప్రేమలు కలిపింది.
ఆంగ్లం రాకపోయినా
ప్రేమలో ప్రపంచాన్నే ఒదిగించింది.
తన చేతివ్రేళ్ళ శ్రమతో
స్వేదాక్షరాలతో
కుటుంబ సంతోషాలను
రచించింది
సంకేతాల రహస్యాలు తెలియకపోయినా
హృదయ నాదంలో శబ్దస్వరాలను దాచింది
తన బిడ్డల కోసం
ఎన్నికష్టాలను మోసిందో గణన తెలియదు.
మౌనాన్ని వెన్నెలలో ముంచి రాసినట్టుగా
ఒక కవిత్వంలా జీవించింది

అమ్మా,
నీకు చదువురాకపోవడం
మనిద్దరికీ వరమే అయింది.
ఎందుకంటే నువ్వు రాసిన మమకార కావ్యాలను
ఆమూలాగ్రం చదవగలిగింది నేను మాత్రమే
నీ బేసరి తళతళల వెలుగులు
నాకు విశ్వవిద్యాలయ పాఠాలు.
నీ అక్షరరహిత ప్రేమ
విశ్వకేతనంలా రెపరెపలాడుతోంది
నువ్వు చదువుకోలేక మానేసిన మందుబిళ్ళల సాక్షిగా
నువ్వు దాచుకున్న
మీ అమ్మ చేతిరాతున్న పుస్తకం
చదువులతల్లి పాదాలను
అర్చించే అఖండదీపం!

Exit mobile version