Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చదువంటే నిజమైన మార్పు!

[బాలబాలికల కోసం ‘చదువంటే నిజమైన మార్పు!’ అనే కథని అందిస్తున్నారు డా. కొప్పరపు నారాయణ మూర్తి.]

తాతయ్య ముక్కుపొడి దట్టంగా పీల్చి, రెండు తుమ్ములు తుమ్మి, పడక కుర్చీలో వెనక్కి వాలాడు. రెండు కాళ్లు ముందుకు జాపి కాళ్ళు పెట్టుకొనే వాటిపై పెట్టుకొని దర్జా ఒలకపోస్తూ గంభీరంగా అటూ ఇటూ చూస్తూ రాజసం వెదజల్లుతున్నాడు. తాతయ్య బ్రిటిష్ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం జేశాడు. ఆ రోజుల్లో ఆయన చదివింది అయిదవ తరగతి. గ్రామపెద్ద ఉద్యోగం ఇచ్చారు బ్రిటీషువారు ఆ కాలంలో. అందుకుగాను ఆయనకు పదో, పరకో పెన్షన్ ఇప్పటికీ వస్తుంది. నాయనమ్మ తాతయ్యను ఎంతో గొప్పగా చూసుకొంటుంది. ఆమె దృష్టిలో తాతయ్య చాలా గొప్ప వ్యక్తి.

ఒకసారి తాతయ్య “అరే పిల్లలు, నేనొక ప్రశ్న వేస్తాను. మీరు నాకన్నా బాగా చదువుకొంటున్నారు కదా! జవాబు చెబుతారా?” అన్నాడు. అంత కష్టమైన ప్రశ్న తాతేమి వేస్తాడని అనుకోని నేను “ఓ, చెబుతాను తాతయ్య” అని జవాబు ఇచ్చాను.

“నా పేరు రఘు. తాతయ్య పేరు దశరథ రామయ్య. మా నాన్న పేరు శివయ్య. మా పొలం వ్యవసాయం చూస్తుంటాడు. మా బామ్మ పేరు కౌసల్య. మా అమ్మ పేరు బాల. నాకు ఒక తమ్ముడు, చెల్లెలు. అందరం మా పెద్దాపురంలో జిల్లా పరిషద్ ఉన్నతపాఠశాలలో చదువుతున్నాం.”

“ఒరే, రఘు! చదువంటే ఏమిటో అర్థం చెప్పగలవా?” అడిగాడు తాతయ్య ఠపీమని.

ఒక్కసారిగా బుర్ర తిరిగినంత పనైంది. ‘ఏవో చరిత్ర, సైన్స్, గణితం ప్రశ్నలు వేస్తాడేమో! నేను పది చదువుతున్నాకదా! ఆ మాత్రం చెప్పలేకపోతానా’ అని అనుకొన్నాను కానీ ఇలాంటి ప్రశ్న వేస్తాడని అస్సలూహించలేదు.

“చదువంటే ఈ ప్రపంచంలోని అనేక విషయాలను వివరంగా తెలుసుకోవటం తాతయ్య! ఇంతకుముందు మాకు భూమికి ఆకర్షణ శక్తి ఉండేదని తెలియదు. ఇప్పుడు తెలుసు. అలా ఇంతకుముందు అంటే చిన్నప్పుడు తెలియని విషయాలు, ఇప్పుడు తెలుసుకోవటం చదువంటే”, చెప్పాను నేను.

“చూశావా మరి! తాతయ్య అయిదవ తరగతే, నేను పదవతరగతి. తాతయ్య కంటే రెండు రెట్లు ఎక్కువ చదివానని మీ బామ్మ దగ్గర డబ్బాకొట్టుకొంటావుట గదా! నీకు చదువంటే అర్థమైంది ఇదా! చదువంటే విషయ పరిజ్ఞానమా? ప్రపంచం గురించిన అనేక విషయాలు తెలుసుకొంటే చదువు వచ్చేసినట్టేనా?” అని అడిగాడు తాతయ్య మళ్ళి.

“మరి అదే కదా తాతయ్య చదువంటే! గతంలో ఏ విషయాల్లో అజ్ఞానంలో ఉండేవారేమో, అవి ఇప్పుడు సరిగ్గా తెలుసుకొంటున్నాము, అది గాదా చదువు?”

“అది చదువు వలన కలిగే ‘జ్ఞానం’లో ఒక భాగమే రా చిట్టి కన్నా!” అన్నాడు తాతయ్య.

“మరి చదువంటే నువ్విచ్చే అర్థం ఏమిటి తాతయ్య?”

“చదువంటే నీకర్థమైందేమంటే కేవలం పుస్తక పరిజ్ఞానం. కానీ, ‘చదువు’ అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ‘చదువు’ అంటే వివేకం, చదువంటే సమయస్ఫూర్తి, చదువంటే నైతికంగా బ్రతకటం, బ్రతుక్కు బలం చేకూర్చటం, మోసాలను కనిపెట్టి, సామాన్యులను మోసాలనుంచి రక్షించటం, సమాజం పట్ల బాధ్యతతో ఉండటం, హింసను ప్రోత్సహించక, సహనంతో సమాజంలో శాంతి, సహజీవనాలకు తోడ్పడటం, ఇలా ఎన్నో ఉన్నాయి”.

“ఇవేమీ మా పుస్తకాల్లో లేవు తాతయ్య! మా చదువులంతా ఆంగ్లం, సైన్స్, గణితం చుట్టూ తిరుగుతాయి. వాటిల్లో నూటికి నూరు మార్కులు ఎలా తెచ్చుకోవాలో చెప్పటం, ఆ పద్ధతిలో చదివించటం మీద ఉంటాయి. తెలుగు వాచకంలో వచ్చే పాఠాలలో కొన్ని నువ్వు చెప్పిన విషయాలు ఉంటాయి. మా పంతుళ్లు వాటిలో కూడ ఎలా రాస్తే ఎక్కువమార్కులు పరీక్షల్లో కొట్టొచ్చో చెబుతారు. అందువలన నువ్వు చెప్పిన విషయాలు మాకేమీ వివరంగా తెలియవు తాతయ్య.”

“విను. మా రోజుల్లో మా పంతుళ్లు తరగతి గదిలో పాఠం కొంత సమయం చెప్పి, మిగతా సమయం సమాజంలోని విషయాలను వివరించేందుకు వినియోగించేవారు. ‘విద్య యోసగు వినయం’ అని, ‘చదువది ఎంత కలిగినను’ వంటి పద్యాలతో చదువంటే ఏమిటో చెప్పేవారు. వాటిల్లో గాంధీ స్వాతంత్రోద్యమం ఎలా నడుపుతున్నాడు. గాంధీ ఆచరించిన నియామాలేంటి? వాటివలన దేశానికి ఏ ప్రయోజనం చేకూరిందో చెప్పేవారు. చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప రెడ్డి, కొండా లక్ష్మణ్‌ గురించి తెలిపేవారు. ఒక్కోసారి, కొంతమంది శాస్త్రవేత్తల జీవిత విశేషాల గురించి – యెల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, సి వి రామన్‌ల గురించి చెప్పేవారు. మన సంగీతం గొప్పతనం, సంగీత విద్వాన్సులు, నాటక నటీమణులు, నటులు గురించి చెప్పేవారు. చాణుక్యుడి రాజనీతి మగధ రాజులను ఎలా ఓడించింది చెప్పేవారు. ఇలాంటివన్నీ పాఠ్యాంశాలు కావు. అయినా చెప్పేవారు” అన్నాడు తాతయ్య.

“ఇన్నివిషయాలు చేప్పేవారా? ఇవ్వాళ మా పంతుళ్ళకు ఊపిరాడనంత పని ఉంటుంది తాతయ్యా! ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు, అదనపు తరగతికి వచ్చినప్పుడు ఇలాంటివేవన్నా చెబుతారేమో కానీ, ఇంత చెప్పటం ఇవ్వాళ మా పాఠశాలల్లో లేదు తాతయ్య.”

ఇంతలో బామ్మ వచ్చింది. “నువ్వు నన్ను ‘తాతయ్య అంటే నీకెందుకంత అభిమానం’ అని తరుచూ అడుగుతుంటావు కదా! నీకు తెలుసా, అయిదవ తరగతిలో మీ తాతయ్య ఏమి చేశారో?” అడిగింది బామ్మ.

ఒక్కసారిగా బామ్మ ప్రవేశంతో మా తాతయ్యతో చర్చ వేడెక్కింది. “ఏం చేశారు బామ్మా?” అని అందరం ముక్తకంఠంతో అడిగాం.

“మద్యం మానేసి, వ్యసనాలను దూరం పెట్టి స్వాతంత్రోద్యమంలోకి రావాలని గాంధీ గారు ఈ ఊరివారికి పిలుపునిచ్చారు. అయినా, ఎవ్వరూ వినిపించుకోవటంలేదు. అప్పుడు మీ తాతయ్య వయస్సు ఏడేళ్లు. అప్పట్లో ఐదేళ్లు నిండితే కాని, పాఠశాలలో చేర్చుకోరు. వాళ్ళ పంతుళ్లు బడిలో చెప్పినవి విని, మీ తాతయ్య, వాళ్ళ స్నేహితులతో కలిసి, చెరువుకట్టమీద నిరాహార దీక్షకు దిగాడు. తెలుసా?” అన్నది బామ్మ.

“ఆ!” అంతా నోరు తెరిచారొక్కసారిగా!

“అప్పుడేమయింది” అడిగారు పిల్లలు ఆతృతగా.

“ఊళ్ళో వాళ్లంతా లబలబలాడారు. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని ఇళ్లకు రమ్మని ఎంత బ్రతిమాలినా ‘ససేమిరా’ అన్నారు. ‘ఊర్లో మద్య, మాంసాలు, అమ్మకం, పొగత్రాగటం మానేస్తేనే ఇంటికి వస్తాం, లేకపోతే ఇలాగే చేసి చచ్చిపోతాం’ అని బీష్మించుకొన్నారు. బ్రిటిష్ పోలీసులు వచ్చికూడా బ్రతిమాలాడారు. పిల్లల్ని కొట్టకూడదన్నది బ్రిటిష్ ప్రభుత్వ నియమం. అందువల్ల పిల్లలలు నీరసించి పోతుంటే చూడలేక, ఊళ్ళో అంతా కలిసి తీర్మానం చేసి మద్యం, మాంసం, పొగత్రాగటం మానేశారు. అప్పటికి మీ తాతయ్య, ఆయన స్నేహితులు ఎండిపోయిన తోటకూర కాడలైనారు. వాళ్ళను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలిసి గాంధీ స్వయంగా వచ్చి పిల్లలను ఆసుపత్రిలో పలకరించి, అభినందించి వెళ్లారు” అంది కౌసల్య బామ్మ తాతయ్యను మెచ్చుకోలుగా చూస్తూ.

ఈ విషయం విని మూర్ఛపోయినంత పనైంది రఘుకి, తమ్ముడు, చెల్లెలుకి. “ఇప్పుడర్థమైందా రఘు. మనమెంత చదివామన్నది ముఖ్యం కాదు. చదివిందానిలో ఎంత మనం సమాజ శ్రేయస్సుకు వినియోగించామన్నది ముఖ్యం. చదువంటే నీలోనూ, సమాజంలోనూ రావలసిన నిజమైన మార్పు” చెప్పాడు తాతయ్య.

అంతా విని, రఘు, పిల్లలు ఎంతో సంతోషించారు.

Exit mobile version