Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చక్ర భ్రమణం

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘చక్ర భ్రమణం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

తిరిగిరాని లోకాలకు పోయి
తిరుగు వారం అయింది
తీర్ధయాత్రలకు పోయినట్లు కాదు
ఇది పాత్రోచిత ప్రయాణం

స్ఫురద్రూపం నిరాకారమైపోయి
కుర్చీ ఖాళీగా కనిపిస్తుంది
వాహ్యాళికి పోయినట్లు కానే కాదు
ఇది వ్యాకులత సంయోగం

బంధుజనం అంతా వెళ్ళిపోయి
పరిసరాల్లో శూన్యత నెలకొంది
బాధలు తీరిపోయినట్లు కాదు
ఇది బరువుకు సంకేతం

కైమోడ్పుల పర్వం అయిపోయి
సందడంతా సద్దుమణిగింది
దుఃఖాన్ని తీర్చిపోయినట్లు కాదు
ఇది ఓదార్పులకు నిదర్శనం

పరిపరి విధాల పరామర్శలైపోయి
పరివ్రాజకుల దారి మళ్ళింది
వ్యధ తొలగి పోయినట్లు కాదు
ఇదొక నిరంతర చక్ర భ్రమణం

Exit mobile version