Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చందమామ మాయమైంది!

[బాలబాలికల కోసం ‘చందమామ మాయమైంది!’ అనే కథని అందిస్తున్నారు శ్రీ రమణ బంధకవి. సంచిక నిర్వహించిన బాలల కథల పోటీ 2026లో బహుమతి పొందిన కథ.]

“తాతయ్యా.. తాతయ్యా..!”

ఉదయాన్నే పెరట్లోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఆరేళ్ళ తేజు. ఆకాశమంతా నీలంగా మెరిసిపోతోంది. తూర్పున సూర్యుడు బంగారు కిరణాలు చల్లుతున్నాడు. చెట్ల కొమ్మల మీద పిచ్చుకలు కిలకిలమంటున్నాయి. గడ్డిమీద మంచుబిందువులు చిన్న చిన్న ముత్యాల్లా మెరుస్తున్నాయి. కానీ తేజు కళ్లలో మాత్రం ఆనందం లేదు.

“ఏమైంది రా?” అని నవ్వుతూ అడిగాడు తాతయ్య.

తేజు ఆకాశం వైపు వేలెత్తి చూపించాడు.

“చందమామ లేదు! నిన్న రాత్రి ఇక్కడే ఉంది కదా! ప్రతిరోజూ ఉదయం లేవగానే కనిపించదు. ఎవరో.. దాన్ని దొంగిలిస్తున్నారు!”

తాతయ్య ఒక్కసారి ఆకాశం వైపు చూశాడు. తరువాత తేజు ముఖం వైపు చూశాడు.

అతని కళ్లలో భయం లేదు. పిల్లలకు ఉండే అమాయకమైన ఆందోళన మాత్రమే ఉంది.

తాతయ్య నవ్వలేదు. మీసం సవరించుకున్నాడు.

“అయితే..ఆ దొంగను పట్టుకోవాలా?”

తేజు కళ్లల్లో మెరుపు. “పట్టుకోవాలి! చందమామను కూడా తీసుకురావాలి.”

తాతయ్య చిరునవ్వు నవ్వాడు.

“కొన్ని రహస్యాలు.. వెంబడిస్తే దొరకవు. అవి మనమే కనుక్కోవాలి. నిద్రపో. ఈ రాత్రి నీకు ఒక అద్భుతం ఎదురవుతుందేమో..”

ఆ మాటలు తేజు మనసులోనే తిరుగుతుండగా రాత్రి వచ్చింది. భోజనం చేశాడు.

అమ్మ చెప్పిన కథ విన్నాడు. కిటికీలోంచి ఒకసారి చందమామను చూసాడు.

“ఎక్కడికీ వెళ్లిపోవద్దు..” అని మెల్లగా చెప్పి మంచం మీద పడుకున్నాడు.

కొద్దిసేపటికే.. వెన్నెల ఒక తెల్లని వెండి జరీలా కిటికీలోంచి గదిలోకి జారింది.

***

తేజు కళ్లు మూసుకున్నాయి. బయట ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. దూరంగా ఎక్కడో ఒక గుడ్లగూబ “హూ.. హూ..” అని పిలిచింది. మల్లెపూల పరిమళం కిటికీ గుండా గదిలోకి వచ్చింది.

అప్పుడే.. కిటికీలోంచి జారుకున్న వెన్నెల ఒక్కసారిగా వెడల్పైంది.

అది ఇక వెలుగు కాదు.. ఒక తెల్లని దారి! వెండి పట్టీలతో నేసినట్టు మెరుస్తోంది.

తేజు ఆశ్చర్యంగా లేచాడు. తన పాదాలు నేలను తాకలేదు. వెన్నెల దారిమీదే నిలబడి ఉన్నాయి. అతడు ఒక్క అడుగు వేశాడు. వెన్నెల నవ్వినట్టు మెరిసింది.

మరో అడుగు..

ఇంకో అడుగు..

ఇంటి పైకప్పు దాటాడు. మామిడి చెట్టు కొమ్మలు దాటాడు. గ్రామం నిద్రపోతూ కనిపించింది.

ఎక్కడో ఒక ఇంట్లో దీపం ఇంకా వెలుగుతోంది. దూరంగా కుక్కలు మొరిగాయి. వెన్నెల దారి మాత్రం ముందుకు సాగుతూనే ఉంది.

అంతలో.. ఆకాశంలో చందమామ అతనివైపు చూసి చిరునవ్వు నవ్వినట్టనిపించింది.

“ఆగు!” అని తేజు గట్టిగా అరిచాడు. “నిన్ను ఎవరైనా తీసుకెళ్లేలోపు నేను వస్తున్నా!”

చందమామ ఏమీ మాట్లాడలేదు. కానీ అది మెల్లగా ముందుకు జారింది. తేజు కూడా పరుగెత్తాడు.

కొద్దిసేపటికి వారు ఒక అడవి అంచుకు చేరుకున్నారు. అది తేజు ఎప్పుడూ చూడని అడవి.

ఎత్తైన మర్రిచెట్లు. వాటి కొమ్మల మీద వెన్నెల వెండి చీర కప్పినట్టు పరచుకుంది.

గాలికి ఆకులు కదిలినప్పుడల్లా.. వేలాది వెండి నాణేలు ఒకదానికొకటి తాకినట్టుగా మృదువైన శబ్దం.

అంతలో.. “చిర్.. చిర్..” అనే చిన్న ఏడుపు వినిపించింది.

తేజు ఆగిపోయాడు. “ఎవరు?” అని నెమ్మదిగా అడిగాడు.

మళ్లీ అదే శబ్దం. ఆకుల మధ్య నుంచి తొంగిచూశాడు.

ఒక చిన్న గుడ్లగూబ పిల్ల.. ముళ్ల తీగల్లో చిక్కుకుని ఉంది. అది ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతోంది.

తేజు దగ్గరకు వెళ్లాడు. “భయపడకు..” అని మెల్లగా అన్నాడు. ముళ్లను ఒక్కొక్కటిగా పక్కకు జరిపాడు. చిన్న రెక్కను జాగ్రత్తగా విడిపించాడు.

కొద్దిసేపటికి.. గుడ్లగూబ పిల్ల గబగబా రెక్కలు కొట్టి దగ్గరలోని కొమ్మపైకి ఎగిరింది.

అప్పుడే.. పై కొమ్మపై కూర్చున్న తల్లి గుడ్లగూబ మృదువుగా కూత పెట్టింది. అది ధన్యవాదం చెప్పినట్టే అనిపించింది.

తేజు నవ్వాడు. మళ్లీ చందమామ వైపు చూసాడు. ఇప్పటికే అది అడవికి అవతల కనిపిస్తోంది.

“అయ్యో! మళ్లీ దూరమైపోయింది!” అని పరుగెత్తసాగాడు.

వెన్నెల దారి ఇంకా ముందుకు.. ఇంకా ముందుకు.. అతడిని తీసుకెళ్తూనే ఉంది.

***

అడవి క్రమంగా పలచబడింది. ఎత్తైన మర్రిచెట్ల స్థానంలో పూల పొదలు కనిపించాయి.

గాలిలో తామర, కలువల సువాసనలు తేలుతున్నాయి. వెన్నెల దారి మెల్లగా ఒక విశాలమైన చెరువు ఒడ్డున ఆగింది. తేజు ఆశ్చర్యంగా నిలబడ్డాడు. ఇంత అందమైన చెరువును అతడు ఎప్పుడూ చూడలేదు.

నీళ్లు అద్దంలా నిశ్చలంగా ఉన్నాయి. ఆకాశమంతా చెరువులోకి దిగిపోయినట్టుంది. చందమామ కూడా అక్కడే కనిపించింది.

“అరే.. దొరికేశావు!” అని ఆనందంగా చెరువు వైపు పరుగెత్తాడు.

కానీ.. అతడు నీటి దగ్గరకు చేరగానే.. చిన్న గాలి వీచింది. నీటిమీద అలలు అలముకున్నాయి. చంద్రబింబం వెయ్యి వెండి ముక్కల్లా చెల్లాచెదురైంది. కొద్దిసేపటికే మళ్లీ ఒక్కటై ప్రశాంతంగా మెరిసింది.

తేజు ఆశ్చర్యంగా చూస్తూ నిలిచిపోయాడు.

“ఇది నిజమైన చందమామ కాదు.. నీళ్లలో కనిపించే బొమ్మ మాత్రమే!” అని తనలో తానే అనుకున్నాడు.

అప్పుడే.. చెరువు మధ్యలో ఒక తెల్లని కలువ మెల్లగా తన రేకులను విప్పసాగింది.

తేజు కళ్లు పెద్దవయ్యాయి. “ఇప్పుడే వికసిస్తున్నావా?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

వెన్నెల తాకిన ప్రతి రేకు వెండిలా మెరిసింది. గాలి మెల్లగా వీచింది. కలువ సున్నితంగా ఊగింది. తేజుకు ఎవరో మృదువుగా చెబుతున్నట్టనిపించింది..

“కొన్ని పూలు సూర్యుణ్ణి చూసి వికసిస్తాయి.. కొన్ని పూలు చందమామను చూసి నవ్వుతాయి..”

తేజు చిరునవ్వు నవ్వాడు. “అందుకే నువ్వు ప్రతి రాత్రీ చందమామ కోసం ఎదురుచూస్తావా?”

కలువ మళ్లీ గాలికి తలూపినట్టుగా ఊగింది. తేజు సంతోషంగా చేయి ఊపాడు.

“సరే.. నేను చందమామను వెతుక్కుంటూ వెళ్తాను.”

అతడు పైకి చూసేసరికి.. చందమామ అప్పటికే కొండల వైపు నెమ్మదిగా సాగుతోంది.

“ఆగు.. నేనూ వస్తున్నా!” అని వెన్నెల దారిలో పరుగెత్తసాగాడు.

కొద్దిదూరం వెళ్లాక.. వెన్నెల దారి ఒక చిన్న వాగు దగ్గరకు తీసుకెళ్లింది. వాగు పెద్దది కాదు.

కానీ నీరు చురుకుగా పారుతోంది. ఆవల ఒడ్డున ఒక చిన్న జింకపిల్ల నిలబడి ఉంది.

ఇవతల దాని తల్లి ఆందోళనగా చూస్తోంది. ఇద్దరి మధ్యలో వాగు. జింకపిల్ల భయంతో వణుకుతోంది. నీళ్లలోకి దిగడానికి ధైర్యం చేయలేకపోతోంది.

తేజు చుట్టూ చూశాడు. కొన్ని చదునైన రాళ్లు కనిపించాయి. ఒక్కొక్క రాయిని జాగ్రత్తగా తీసుకొచ్చి వాగులో అమర్చసాగాడు.

ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. అంతే! చిన్న దారి ఏర్పడింది.

జింకపిల్ల ముందుగా సంకోచించింది. తర్వాత ఒక చిన్న గెంతు వేసింది. మరొక గెంతు..

ఇంకో గెంతు.. చివరకు తల్లి దగ్గరకు చేరుకుంది.

తల్లి జింక తన పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఆ రెండు జింకలు క్షణం పాటు తేజువైపు తిరిగి చూశాయి. ఆ కళ్లలో కృతజ్ఞత మెరిసినట్టనిపించింది. తేజు హృదయం ఆనందంతో నిండిపోయింది.

అప్పుడే.. వెన్నెల దారి మళ్లీ వెలిగింది. అది చెప్పకనే చెప్పినట్టుంది.. “ప్రయాణం ఇంకా ముగియలేదు..” తేజు మళ్లీ ముందుకు నడిచాడు.

దూరంగా.. కొండలు వెండివెలుగులో మెరిసిపోతున్నాయి. వాటి పైన.. చందమామ ఇంకా అతని కోసం ఎదురు చూస్తున్నట్టే కనిపించింది. తేజు తన అడుగుల వేగం పెంచాడు.

వెన్నెల దారి.. అతడిని మరో అద్భుతం వైపు తీసుకెళ్తోంది.

వెన్నెల దారి ఇప్పుడు కొండపైకి ఎక్కుతోంది. ముందు ఎత్తైన శిఖరం. వెండి వెలుగుతో స్నానం చేసినట్టుగా మెరిసిపోతోంది. తేజు వేగంగా అడుగులు వేశాడు.

“ఇంకొంచమే.. ఈసారి తప్పకుండా చందమామను చేరుకుంటాను.”

అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. చల్లని గాలి ముఖాన్ని తాకుతోంది.

కొండపై అడవి పూలు వెన్నెలలో ముత్యాల్లా మెరుస్తున్నాయి. దూరంగా జలపాతం మృదువుగా గలగలమంటోంది.

తేజు తలెత్తి చూశాడు. చందమామ ఇప్పుడు చాలా దగ్గరగా కనిపిస్తోంది. అది కొండ శిఖరం మీద తన కోసం ఎదురుచూస్తున్నట్టే ఉంది.

“ఆగు.. నేను వచ్చేస్తున్నా!” అని ఆనందంగా పరుగెత్తాడు.

ఎట్టకేలకు.. అతడు కొండ శిఖరాన్ని చేరుకున్నాడు. ఊపిరి బిగపట్టి రెండు చేతులు చాపాడు.

“చందమామా!” అని పిలిచాడు.

అదే క్షణంలో.. తూర్పు ఆకాశం అంచున గులాబీ రంగు పలుచని గీత కనిపించింది. తేజు ఆశ్చర్యంగా చూసాడు.

కొద్దికొద్దిగా.. ఆ గులాబీ రంగు బంగారు రంగులోకి మారసాగింది. పక్షుల కిలకిలారావాలు వినిపించాయి. చెట్ల ఆకులపై మంచుబిందువులు మెరిసిపోయాయి. చందమామ వెలుగు నెమ్మదిగా పలుచబడుతోంది.

“అయ్యో!” అని తేజు కంగారుపడ్డాడు.

“మళ్లీ.. ఎవరో చందమామను తీసుకెళ్తున్నారు!” అని ముందుకు పరుగెత్తాడు.

కానీ.. ఎంత పరుగెత్తినా.. చందమామ మరింత పల్చగా కనిపించింది.

కొద్దికొద్దిగా.. నీలి ఆకాశంలో కలిసిపోసాగింది. తేజు కళ్లు చెమ్మగిల్లాయి.

“ఆగు.. నేను ఇంకా చేరలేదు..” అని బాధగా అన్నాడు.

అప్పుడే.. ఒక వెచ్చని బంగారు కిరణం అతని చెంపను తాకింది. అతడు మెల్లగా తూర్పు వైపు తిరిగి చూశాడు.

సూర్యుడు.. కొండల వెనుక నుంచి చిరునవ్వుతో తొంగిచూస్తున్నాడు.

అదే సమయంలో.. చందమామ మెల్లగా ఉదయపు వెలుగులో కలిసిపోయింది.

తేజు నిశ్శబ్దంగా నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉండిపోయాడు.

అప్పుడే.. తాతయ్య స్వరం గాలిలో తేలినట్టనిపించింది.

“అందమైనవి మాయమవ్వవు బాబూ.. వాటి సమయం పూర్తయ్యాక.. మరో అందానికి దారి ఇస్తాయి.

రాత్రి చందమామది.. పగలు సూర్యుడిది.. ఇద్దరూ ఒకరికొకరు ఆకాశాన్ని అప్పగించుకుంటారు.”

తేజు ముఖంపై చిరునవ్వు మెరిసింది. అతనికి అర్థమైంది.

చందమామను ఎవరూ దొంగిలించలేదు.

అది తన పని పూర్తిచేసి.. సూర్యుడికి ఆకాశాన్ని అప్పగించింది.

వెన్నెల దారి.. నెమ్మదిగా కరిగిపోయింది..

***

“తేజూ.. లేవరా బాబూ!” అమ్మ పిలుపు వినిపించింది. తేజు మెల్లగా కళ్లు తెరిచాడు.

కిటికీలోంచి ఉదయపు బంగారు వెలుగు గదిలోకి జారుతోంది. బయట పిచ్చుకలు కిలకిలమంటున్నాయి. కొద్దిసేపు మంచం మీదే కూర్చుని ఆలోచించాడు.

అడవి..

వెన్నెల దారి..

చెరువు..

కలువ..

జింకపిల్ల..

కొండ..

చందమామ..

అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. “అది.. కలా?” అని తనలో తానే నవ్వుకున్నాడు.

అతడు పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. తాతయ్య తులసి మొక్కకు నీళ్లు పోస్తున్నారు.

తేజును చూడగానే చిరునవ్వు నవ్వారు.

“ఏమిట్రా తేజూ.. చందమామ దొరికిందా?”

ఈసారి తేజు వెంటనే జవాబు చెప్పలేదు. తాతయ్య దగ్గరకు వెళ్లి ఆయన చేతిని పట్టుకున్నాడు.

చిరునవ్వుతో అన్నాడు. “దొరికింది తాతయ్య.”

తాతయ్య ఆశ్చర్యపడినట్టుగా నటించారు. “అయితే.. ఎవరు దొంగిలిస్తున్నారు?”

తేజు గట్టిగా నవ్వేశాడు.

“ఎవరూ కాదు! అది తన పని పూర్తయ్యాక.. సూర్యుడికి ఆకాశాన్ని అప్పగిస్తుంది. రాత్రి అది వస్తుంది.. పగలు సూర్యుడు వస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు దారి ఇస్తారు.”

తాతయ్య కళ్లలో ఆనందం మెరిసింది. ఏమీ చెప్పకుండా తేజు తల నిమిరారు.

ఆ రోజు సాయంత్రం.. సూర్యుడు అస్తమించాక.. తేజు మళ్లీ ఆకాశం వైపు చూశాడు.

పడమర దిక్కున సన్నని వెండి నవ్వులా చందమామ కనిపించింది. తేజు చేతిని ఊపాడు.

“హాయ్ చందమామా! రేపు మళ్లీ కలుద్దాం.” కొద్దిసేపు ఆగి నవ్వుకున్నాడు.

“లేదు.. ఉదయానికి నువ్వు కనిపించవు. కానీ.. నిన్ను ఎవరో దొంగిలించారని మాత్రం ఇక ఎప్పుడూ అనుకోను.”

తాతయ్య అతని పక్కనే నిలబడ్డారు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు.

చల్లని గాలి వీచింది. కొద్దిసేపటి తర్వాత తాతయ్య మెల్లగా అన్నారు.

“ప్రకృతి ప్రతిరోజూ మనతో మాట్లాడుతుంది బాబూ.. వినడానికి సిద్దపడే మనసుంటే చాలు.”

తేజు వెంటనే అడిగాడు. “రేపు ఇంకో రహస్యం చెబుతుందా తాతయ్య?”

తాతయ్య నవ్వారు.

“ఎందుకు చెప్పదు? ప్రతి ఉదయం.. ప్రతి సాయంత్రం.. ప్రకృతి ఒక కొత్త కథ చెబుతూనే ఉంటుంది.”

తేజు మళ్లీ చందమామ వైపు చూశాడు. ఆకాశంలో అది ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతోంది.

ఈసారి.. దాన్ని పట్టుకోవాలని అతనికి అనిపించలేదు.

చూడాలని.. ఆస్వాదించాలని.. ప్రతి రాత్రీ తిరిగి వస్తుందని తెలుసుకొని ఎదురుచూడాలని మాత్రమే అనిపించింది.

ఆ రాత్రి.. తేజు నిద్రపోయే ముందు కిటికీలోంచి మరోసారి ఆకాశం వైపు చూశాడు.

చందమామ అక్కడే ఉంది. అది ఎక్కడికీ పోదని.. ప్రతిరోజూ తన సమయానికి తిరిగి వస్తుందని.. ఇప్పుడు అతనికి తెలుసు.

Exit mobile version